• facebook
  • whatsapp
  • telegram

మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రత్యుత్పత్తి ప్రతి జీవి జీవిత చక్రంలో చాలా ప్రధానమైన దశ. మానవుల్లో ప్రత్యుత్పత్తి లైంగిక విధానంలో జరుగుతుంది. లైంగిక సంపర్కం ఫలితంగా గర్భధారణ జరుగుతుంది.

మానవ ప్రత్యుత్పత్తిలో ప్రధానంగా ఉండే సోపానాలు వరుసగా: బీజకణాలు ఏర్పడటం, ఫలదీకరణం, పిండ ప్రతిస్థాపన, గర్భావధి, ప్రసవం.

మానవ ప్రత్యుత్పత్తిలో ఉండే దశల్లో బీజకణాలు ఏర్పడటం అంటే పురుషుల్లో శుక్రకణాలు, స్త్రీలలో అండాలు ఏర్పడటం. అవి సంయోగం చెందడం ఫలదీకరణం. ఫలదీకరణం ఫలితంగా సంయుక్తబీజం ఏర్పడుతుంది. ఈ జైగోట్‌ లేదా సంయుక్తబీజం గర్భాశయ గోడలకు అంటిపెట్టుకోవడాన్ని పిండ ప్రతిస్థాపన అంటారు. ఈ విధంగా పిండప్రతిస్థాపన జరిగిన తర్వాత గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందుతుంది. దీన్ని గర్భావధి లేదా గెస్టేషన్‌ అంటారు. చివరగా ప్రసవం జరుగుతుంది. అంటే గర్భాశయం నుంచి శిశువు బయటికి వస్తుంది.

* మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే అవయవాలు, గ్రంథులను పురుష జననేంద్రియ వ్యవస్థగా పేర్కొంటారు.

* పురుష జననేంద్రియ వ్యవస్థలో ఒక జత ముష్కాలు, అనుబంధ గ్రంథులు, అనుబంధ నాళాలు, బాహ్య జననాంగాలు మొదలైనవి ఉంటాయి.

* పురుషుల్లో ఒక జత ముష్కాలు ఉదరకుహరం నుంచి బయటకు ముష్కగోణిలో వేలాడుతూ ఉంటాయి. ఇవి పురుషుల్లో ప్రాథమిక లైంగిక అవయవాలు.

* ముష్కగోణి మేహనం వెనుకగా వేలాడుతూ ఉండే ఒక కోశం లాంటి నిర్మాణం. ఈ కోశం ఒక పొరతో రెండు అర్ధ భాగాలుగా విభజితమై ఉంటుంది. ఒక్కో అర్ధ భాగంలో ఒక్కో ముష్కం ఉంటుంది. ఇది ముష్కాలకు రక్షణ కల్పించడమే కాకుండా శుక్రకణోత్పత్తికి కావాల్సిన ఉష్ణోగ్రత ఉండేలా సహాయపడుతుంది. శుక్రకణోత్పత్తికి మానవ శరీర ఉష్ణోగ్రత కంటే సుమారు 2o C నుంచి 2.5o C ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం అనివార్యం.

* ప్రతి ముష్కంలో సుమారు 250 ముష్క లంబికలు ఉంటాయి. ప్రతి లంబికలో 1 నుంచి 3 మెలికలు తిరిగి ఉండే శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. ప్రతి శుక్రోత్పాదక నాళికను ఆవరించి జనన ఉపకళ ఉంటుంది. దీనిలో విభేదనం చెందని శుక్రమాతృకణాలు ఉంటాయి. ఇవే పురుషబీజ మాతృక కణాలుగా కూడా వ్యవహరిస్తాయి. ఇవి విభజన చెంది ప్రాథమిక స్పెర్మటోసైట్‌ (ప్రైమరీ స్పెర్మటోసైట్‌) లను ఏర్పరుస్తాయి. ఇవి క్షయకరణ విభజన చెంది శుక్రకణాలను లేదా పురుషబీజ కణాలను ఏర్పరుస్తాయి.

* శుక్రోత్పాదక నాళికల బయట ఉన్న ప్రాంతాల్లో లీడిగ్‌ కణాలు ఉంటాయి. ఇవి ఆండ్రోజెన్స్‌ లేదా పురుషబీజకోశ హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఆండ్రోజెన్స్‌లో ముఖ్యమైంది టెస్టోస్టిరాన్‌.

*  ముష్కం నుంచి శుక్రనాళికలు బయటికి వచ్చి సన్నటి ముష్క పరాంతతలం వెంబడి చుట్టలు చుట్టుకుని ఉన్న నాళంలోకి తెరచుకుంటాయి. ఈ నాళాన్నే ఎపిడిడిమిస్‌ అంటారు.

*  ఎపిడిడిమిస్‌ శుక్రకణాలను తాత్కాలికంగా నిల్వచేయడానికి తోడ్పడుతుంది. శుక్రకణాలు పరిపక్వతకు రావడానికి కావాల్సిన సమయాన్ని అందిస్తుంది.

*  రెండు శుక్రవాహికలు ఎడమ, కుడివైపు ఒక్కొక్కటిగా ఉంటూ, ఆ వైపున ఉన్న ఎపిడిడిమిస్, స్కలన నాళాలను కలుపుకుంటూ శుక్రకణ రవాణాలో సాయపడతాయి.

*  రెండువైపుల నుంచి వచ్చే స్కలన నాళాలు శుక్రకణాలను, శుక్రాశయాలు స్రవించిన ద్రవాన్ని రవాణా చేస్తూ పౌరుషగ్రంథి మధ్య భాగంలో కలిసి ప్రసేకం అనే భాగంలోకి తెరచుకుంటాయి. ప్రసేకం శుక్రకణాలను బయటికి రవాణా చేస్తుంది.

* పురుషుల్లో ప్రసేకం మూత్ర, జననేంద్రియ వాహికలు ఏర్పడిన అంత్యనాళం. ప్రసేకం మూత్రాశయం నుంచి ప్రారంభమై మేహనం ద్వారా వ్యాపించి, యురెత్రల్‌మీటస్‌ అనే రంధ్ర భాగం ద్వారా బయటికి తెరచుకుంటుంది. మూత్రం, స్కలించబడిన శుక్రం రెండూ ప్రసేకం ద్వారానే బయటికి వస్తాయి.

* మేహనం, ముష్కగోణి పురుషుల్లోని బాహ్య జననాంగాలు. మేహనం మూత్రనాళంగానే కాకుండా స్త్రీ జీవి జననేంద్రియంలోకి శుక్రద్రవాన్ని విడుదల చేసే ప్రవేశాంగంగా కూడా పని చేస్తుంది.

*  పురుష ప్రత్యుత్పత్తి సంబంధ అనుబంధ గ్రంథులుగా ఒక జత శుక్రాశయాలు, ఒక పౌరుషగ్రంథి, బల్బోయురెత్రల్‌ గ్రంథులు ఉంటాయి.

* శుక్రాశయాలు లేదా సెమినల్‌ వెసికల్స్‌ శ్రోణి ప్రాంతంలో మూత్రాశయం పరాంతం కిందుగా ఉండే ఒక జత సాధారణ నాళాకార గ్రంథులు. ప్రతి శుక్రాశయం పౌరుష గ్రంథిలోకి ప్రవేశించే ముందు తెరచుకుంటుంది.

* శుక్రకోశాలు స్రవించే స్రావకమే శుక్రద్రవం లేదా సెమినల్‌ ఫ్లూయిడ్‌. శుక్రాశయాల ద్రవం క్షార గుణాన్ని కలిగి ఉండటం వల్ల స్త్రీ జననేంద్రియంలో సహజంగా ఉండే ఆమ్లత్వాన్ని తటస్థపరుస్తుంది. శుక్రద్రవంలో సెమినల్‌ ఫ్లూయిడ్‌ 60% ఉంటుంది.

* మూత్రాశయం కింద పౌరుషగ్రంథి ఉంటుంది. మానవుడిలో ఈ గ్రంథి స్రావకం శుక్రద్రవంలో 15-30% వరకూ ఉంటుంది. పౌరుషగ్రంథి స్రావకం తేటగా, స్వల్ప ఆమ్లత్వంతో ఉండి శుక్రకణాలను ఉత్తేజపరచడంలో, పోషణ అందించడంలో సహాయపడుతుంది.

* పౌరుషగ్రంథి కింద, ప్రసేకానికి ఇరువైపులా బఠాణి గింజ పరిమాణం, ఆకారంలో మేహనం మొదలయ్యేచోట ఒక జత బల్బోయురెత్రల్‌ గ్రంథులు లేదా కౌపర్‌ గ్రంథులు ఉంటాయి. వీటి స్రావం తేటగా, జారే గుణంతో, క్షారత్వాన్ని ప్రదర్శిస్తుంది. పురుషుల్లో లైంగిక ప్రేరణ ప్రారంభమైనప్పుడు ఈ గ్రంథుల స్రావం ప్రసేకంలో మూత్రం వల్ల కలిగే ఆమ్లత్వాన్ని తటస్థీకరిస్తుంది. ఇది సంపర్క సమయంలో ఘర్షణ లేకుండా చేయడంలో కూడా పాత్ర వహిస్తుంది.

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

*  స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీబీజకోశాలు, ఒక జత స్త్రీబీజవాహికలు, గర్భాశయం, యోని, బాహ్యజననాంగాలు శ్రోణి ప్రాంతంలో ఉంటాయి.

*  స్త్రీ బీజ అవయవ వ్యవస్థలు ఒక జత క్షీర గ్రంథులతో నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా, సమాకలనం చెంది అండోత్సర్గం, ఫలదీకరణం, గర్భధారణ, శిశుజననం, సంతాన పాలన లాంటి ప్రత్యుత్పత్తి సంబంధ విధులను నిర్వర్తిస్తాయి.

* స్త్రీ బీజకోశాలు స్త్రీబీజకణాలను లేదా అండాలను, వివిధ స్టిరాయిడ్‌ హార్మోన్‌లను ఉత్పత్తి చేసే ప్రాథమిక స్త్రీ లైంగిక అవయవాలు. ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదరానికి కింది భాగంలోని శ్రోణికుహరంలో గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్కటి ఉంటాయి.

* ఫాలోపియన్‌ నాళాలు ఒక జత ఉంటాయి. ప్రతీ ఫాలోపియన్‌ నాళం కండరనిర్మితమై బీజకోశం నుంచి గర్భాశయం వరకు వ్యాపించి ఉంటుంది.

* గర్భాశయం అనేది శ్రోణి ప్రాంతంలో మూత్రాశయానికి, పురీషనాళానికి మధ్య విశాలంగా, దృఢంగా, కండరమయమై అధిక రక్త ప్రసరణ గల నిర్మాణం. ఇది గర్భాశయ ముఖద్వారం ద్వారా యోని ప్రాంతంలోకి తెరచుకుంటుంది.

* గర్భాశయ ముఖద్వారంలోని సన్నటి కుల్యను గర్భాశయ ముఖద్వార కుల్య అంటారు. ఇది యోనితో కలిసి శిశుజనన మార్గాన్ని ఏర్పరుస్తుంది.

*  స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధ అనుబంధ గ్రంథులు వరుసగా బార్తోలిన్‌ గ్రంథులు, స్కీన్‌ గ్రంథులు, క్షీర గ్రంథులు. 

* అళింద కుడ్యంలోని యోని రంధ్రానికి కొద్దిగా కిందివైపు ఇరువైపులా ఒక జత బార్తోలిన్‌ గ్రంథులు ఉంటాయి. వీటి శ్లేష్మస్రావకాలు యోని మార్గాన్ని జారుడు స్వభావం కలిగి ఉండేలా చేస్తాయి. ఈ గ్రంథులను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బల్బోయురెత్రల్‌ గ్రంథులకు సమజాతమైనవిగా పేర్కొనవచ్చు.

* స్కీన్‌ గ్రంథులను నిమ్న అళింద గ్రంథులు అంటారు. ఇవి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని పౌరుషగ్రంథులకు సమానం. ఇవి ప్రేరేపితమైనప్పుడు క్షార, జిగట ద్రవాన్ని స్రవిస్తాయి.

* స్త్రీ క్షీరద జీవుల్లో క్రియాత్మక క్షీర గ్రంథులు ఉంటాయి. పురుషుల్లో ఇవి అవశేష గ్రంథులు. ఇవి గ్రంథియుత కణజాలం, కొవ్వు కణజాలంతో ఉంటాయి. క్షీర గ్రంథులు శిశు జననానంతరం మాత్రమే పని చేయడం ప్రారంభిస్తాయి.

* యౌవనదశ ఆరంభంలో హైపోథలామస్‌ అత్యధికంగా గొనాడోట్రోపిన్‌ అనే హార్మోన్‌ను  స్రవించడం వల్ల శుక్రకణోత్పత్తి ప్రారంభమవుతుంది.

* శుక్రకణం సూక్ష్మ నిర్మాణంలో తల, మెడ, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. శుక్రకణ దేహం మొత్తాన్ని ప్లాస్మా త్వచం ఆవరించి ఉంటుంది. తల భాగం పొడవుగా ఉండే ఏకస్థితిక కేంద్రాన్ని కలిగి ఉండి, ఏక్రోసోమ్‌ అనే టోపీలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

* పరిణతి చెందిన స్త్రీ బీజకణాలు ఏర్పడే విధానాన్ని అండోత్పత్తి లేదా అండజననం అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే ప్రతీ భ్రూణ స్త్రీబీజకోశంలో అండకణోత్పత్తి ఆరంభమై రెండు మిలియన్ల అండమాతృకణాలు ఏర్పడి, తర్వాత విభజనలు జరగకుండా నిలిచిపోతాయి. శిశుజననం తర్వాత అండ మాతృకణాలు ఏర్పడటం జరగదు. ఈ కణాలు విభజనను ప్రారంభించి క్షయకరణ విభజన -Iలోని ప్రథమ దశ -Iలోనే ఆగిపోతాయి. ఈ దశలోని కణాలను ప్రాథమిక అండమాతృకణాలు అంటారు.

*  స్త్రీబీజకోశంలోని గ్రాఫియన్‌ పుటిక పగిలి, ద్వితీయ అండమాతృకణం విడుదల అవడాన్ని ‘అండోత్సర్గం’ అంటారు. 

* అండోత్సర్గం తర్వాత గ్రాఫియన్‌ పుటికలోని గ్రాన్యులోసా కణాలు విభజన చెంది కార్పస్‌ లూటియం అనే పసుపు రంగులో ఉండే తాత్కాలిక అంతఃస్రావ గ్రంథి కణజాలంగా ఏర్పడుతుంది.

* స్త్రీబీజకోశ పుటిక ఏర్పడటం నుంచి కార్పస్‌ లూటియం క్షీణించే వరకు జరిగే సంఘటనల క్రమాన్ని ‘స్త్రీబీజాశయ చక్రం’ అంటారు.

* క్షీరదాల్లో (ముఖ్యంగా ప్రైమేట్స్‌) జరిగే ప్రత్యుత్పత్తి వలయాన్ని రుతుచక్రం (మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌) అంటారు. ఇది ప్రతి నెల గర్భాశయ అంతర ఉపకళలో జరిగే మార్పుల చక్రం. స్త్రీలలో రుతుచక్రం సగటున సుమారు 28 రోజుల వ్యవధిలో పునరావృతం అవుతుంది. రుతుచక్రం రుతుస్రావ దశతో ఆరంభమై 3 నుంచి 5 రోజులు రుతుస్రావం జరిగి, ఆగిపోతుంది.

* చలన సహిత శుక్రకణాలు వేగంగా ఈదుతూ, గర్భాశయ ద్వారం గుండా గర్భాశయంలోకి ప్రవేశించి, చివరికి ఫాలోపియన్‌ నాళగ్రీవం ద్వారా కలశికలోకి చేరుతాయి. ఫలదీకరణం ఫాలోపియన్‌ నాళకలశికలో జరుగుతుంది.

* సంయోగబీజాల కలయికను సింగమి లేదా ఆంఫీమిక్సిస్‌ అంటారు. సంయోగ బీజాల సంయుక్త కేంద్రకాన్ని సింకారియాన్‌ అంటారు. ఫలదీకరణం చెందిన అండం జైగోట్‌గా, తర్వాత పిండాభివృద్ధి దశల్లోకి ప్రవేశిస్తుంది.

Posted Date : 11-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌