జాతీయాలు
జాతీయాలను పదబంధాలు, పలుకుబళ్లు, నుడికారాలు అనే పేర్లతోనూ పిలుస్తారు.

ఒక భాషకు ఉండే ప్రత్యేకత, విశిష్టమైన పలుకుబడి అనే అర్థంలో జాతీయాన్ని వాడుతున్నారు. ‘పలుకుబడి’ అంటే పలికే తీరు అని అర్థం. కొన్ని పదాల కలయిక అనే అర్థంలో పదబంధం ఏర్పడింది.

వేర్వేరు మాటలకు ఉండే ఆయా అర్థాలను గుదిగుచ్చి చెప్పినప్పటికీ, వాటికి భిన్నంగా అర్థస్ఫూర్తి కలిగించే సంబంధాలను జాతీయాలుగా పేర్కొంటారు.
జాతీయాన్ని వేరొక భాషలోకి అనువదిస్తే, అది వేరేవారికి అర్థం కాదు. మొత్తం పలుకుబడిని ఒకటిగా తీసుకుని అనువాదం చేస్తేనే అర్థమవుతుంది. అంటే ఇది తెలుగుభాషకు మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన పలుకుబడి. ఈ విధంగా ఒక భాషకు పరిమితమైన పలుకుబడులనే ‘జాతీయాలుగా’ పేర్కొంటారు.