• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - బ్రిటిష్‌ ఆక్రమణ

కర్ణాటక యుద్ధాలు

ఫ్రెంచ్‌ వారికి, ఆంగ్లేయులకు మధ్య మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి.

మొదటి కర్ణాటక యుద్ధం (క్రీ.శ. 1746-48)

* ఈ యుద్ధంలో జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డూప్లెక్స్‌ (ఫ్రెంచ్‌ గవర్నర్‌ జనరల్‌), మేజర్‌ స్ట్రింగర్‌ లారెన్స్‌ (బ్రిటిష్‌), అన్వరుద్దీన్‌ ఖాన్‌ (కర్ణాటక నవాబు) పాల్గొన్నారు.

* క్రీ.శ. 174048లో ఐరోపాలో చెలరేగిన ఆస్ట్రియన్‌ వారసత్వ యుద్ధం దీనికి ప్రధాన కారణం. అయితే భారత్‌లో వ్యాపార సంస్థలపై ఆధిపత్యం కోసం ఆంగ్లో-ఫ్రెంచ్‌ సేనలు ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి.

* అప్పటి పాండిచ్చేరి ఫ్రెంచ్‌ గవర్నర్‌ డూప్లెక్స్‌ భారతదేశంలో ఫ్రెంచ్‌ అధికారుల ఆధ్వర్యంలో భారతీయ సిపాయిల సైన్యాన్ని తయారు చేశాడు.

* క్రీ.శ. 1745లో బ్రిటిష్‌ వారు ఫ్రెంచ్‌ నౌకాదళంపై దాడి చేశారు. డూప్లెక్స్‌ దీనికి వ్యతిరేకంగా పోరాడి బ్రిటిష్‌ వారిని ఓడించి, వారి ఆధీనంలో ఉన్న మద్రాస్‌ను స్వాధీనం చేసుకున్నాడు.

* అన్వరుద్దీన్‌ నవాబు బ్రిటిష్‌ వారికి అనుకూలం. అతడు 1746, నవంబరు 4న ఫ్రెంచ్‌ వారితో  (The battle of St.
Thome) యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అన్వరుద్దీన్‌ ఓడిపోయాడు.

* మొదటి కర్ణాటక యుద్ధం క్రీ.శ.1748 వరకు కొనసాగింది. అదే ఏడాది బ్రిటిష్, ఫ్రెంచ్‌ అధికారుల మద్య ఐక్స్‌-లా-చాపెల్లే (Aix-la-Chapelle) ఒప్పందం కుదిరింది. దీన్నే ఆచెన్‌ ఒప్పందం అని కూడా అంటారు. దీంతో ఈ యుద్ధం ముగిసింది. 

* దీని ప్రకారం ఉత్తర అమెరికాలోని లూయిస్‌బర్గ్‌ను ఫ్రాన్స్‌కు అప్పగించగా, మద్రాస్‌ను తిరిగి ఆంగ్లేయుల హస్తగతం చేశారు.

* మొదటి కర్ణాటక యుద్ధంలో బాగా శిక్షణ పొందిన యూరోపియన్‌ సైన్యం ముందు భారత సైన్యం తన శక్తిని ప్రదర్శించలేక పోయింది.

రెండో కర్ణాటక యుద్ధం (క్రీ.శ.1749-54) 

* హైదరాబాద్‌ నిజాం, కర్ణాటక నవాబు పదవులకు వేర్వేరు హక్కుదారులు ఉండేవారు. ఈ ఇద్దరు రాజులు ఫ్రెంచ్‌ లేదా బ్రిటిష్‌ వారి మద్దతు తీసుకునేవారు.

* భారతదేశం పూర్తిగా ఫ్రెంచ్‌ వారి ఆధీనంలోకి రావాలని గవర్నర్‌ జనరల్‌ డూప్లెక్స్‌ భావించాడు. దీనికోసం ఇక్కడి పాలకుల అంతర్గత అధికార పోరాటాల్లో జోక్యం చేసుకున్నాడు.

* క్రీ.శ. 1748లో హైదరాబాద్‌ నిజాం అసఫ్‌ జా-I మరణంతో దక్షిణ భారతదేశ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడింది. అతడి కొడుకు నాసిర్‌ జంగ్, మనవడు ముజఫర్‌ జంగ్‌ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

* నాసిర్‌ జంగ్‌ హైదరాబాద్‌ నిజాం అవ్వాలని కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ ఆకాక్షించాడు. 

* దీంతో అన్వరుద్దీన్‌కు వ్యతిరేకంగా ముజఫర్‌ జంగ్‌ యుద్ధం చేశాడు. దీనికి ఫ్రెంచ్‌ వారి సహకారం తీసుకున్నాడు. దీన్నే అంబూర్‌ యుద్ధం అంటారు.

* ఈ యుద్ధంలో (1749) అన్వరుద్దీన్‌ మరణించాడు.

* అన్వరుద్దీన్‌ మరణంతో కర్ణాటక నవాబు సింహాసనం కోసం అతడి కొడుకైన మహమ్మద్‌ అలీ, కర్ణాటక మాజీ నవాబు దోస్త్‌ అలీ ఖాన్‌ అల్లుడైన చందా సాహెబ్‌ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులోనూ ఫ్రెంచ్, ఆంగ్లేయులు పాల్గొన్నారు. ఇది వివిధ శక్తుల మధ్య త్రైపాక్షిక అవగాహనకు దారితీసింది. 

* ఫ్రెంచ్‌వారు ముజఫర్‌ జంగ్, చందా సాహెబ్‌కు; ఆంగ్లేయులు మహమ్మద్‌ అలీ, నాసిర్‌ జంగ్‌కు మద్దతిచ్చారు.

* చందా సాహెబ్‌ కర్ణాటక నవాబు అవ్వగా, ముజఫర్‌ జంగ్‌ హైదరాబాద్‌ నిజాం అయ్యాడు.

* ముజఫర్‌ జంగ్‌ మరణించాక ఫ్రెంచ్‌ వారు అసఫ్‌ జా-I మరో కుమారుడైన సలాబత్‌ జంగ్‌ను నిజాంగా నియమించారు. దీనికి ప్రతిగా వారు కోరమండల్‌ తీరంలో (ఉత్తర సర్కార్స్‌) నాలుగు ధనిక జిల్లాలను నిజాం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

* బ్రిటిష్‌ అధికారి అయిన రాబర్ట్‌ క్లైవ్‌ కర్ణాటక రాజధాని ఆర్కాట్‌పై దాడి చేశాడు. దీన్ని ఆర్కాట్‌ సీజ్‌ అని పిలుస్తారు. దీనిలో బ్రిటిష్‌ వారు గెలిచారు. 

* దీని తర్వాత జరిగిన యుద్ధాల్లో చందా సాహెబ్‌ చనిపోయాడు. అతడి వారసుడిగా మహమ్మద్‌ అలీ కర్ణాటక నవాబు అయ్యాడు.

* 1754లో పాండిచ్చేరి ఒప్పందంతో రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది.

యుద్ధం ఫలితాలు:

* యుద్ధాల వల్ల ఫ్రెంచ్‌ కంపెనీ పూర్తిగా నష్టపోయింది.

* ఫ్రెంచ్‌ ప్రభుత్వం డూప్లెక్స్‌ను గవర్నర్‌ జనరల్‌ పదవి నుంచి తొలగించింది. అతడి స్థానంలో చార్లెస్‌ రాబర్ట్‌ గొడెహ్యూ గవర్నర్‌ జనరల్‌ అయ్యాడు. అతడే పాండిచ్చేరి ఒప్పందంపై సంతకం చేశాడు.

* ఒప్పందం ప్రకారం ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ వారు భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాల్లో మాత్రమే పాల్గొనాలి. రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు.

మూడో కర్ణాటక యుద్ధం (1757-63)

* ఇందులో ఫ్రెంచ్‌ జనరల్‌ కమ్టే డి లల్లీ (Comte de lalli), బ్రిటిష్‌ లెఫ్ట్టినెంట్‌ జనరల్‌ సర్‌ ఐర్‌ కూట్‌ పాల్గొన్నారు.

* ఇందులో బ్రిటిష్‌ వారు గెలిచారు.

* 1756-63  మధ్య ఐరోపాలో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ల మధ్య ఏడేళ్ల పాటు యుద్ధం జరిగింది. ఇదే మూడో కర్ణాటక యుద్ధానికి కారణం.

* కమ్టే డి లల్లీ నేతృత్వంలోని ఫ్రెంచ్‌ సేనలు సెయింట్‌ జార్జ్‌ కోటను ఆక్రమించాయి.

* 1760లో జరిగిన వాండివాష్‌ యుద్ధంలో సర్‌ ఐర్‌ కూట్‌ ఆధ్వర్యంలోని బ్రిటిష్‌ సేనలు ఫ్రెంచ్‌ వారిని ఓడించాయి. 

* ఫ్రెంచ్‌ వారి ఆధీనంలోని పాండిచ్చేరి, మాహే, జింజీ, కరైకల్‌ సహా ఇతర ఆస్తులన్నీ బ్రిటిష్‌ వారికి లభించాయి.

* 1763లో జరిగిన పారిస్‌ ఒప్పందంతో ఈ యుద్ధం ముగిసింది.

* ఈ ఒడంబడిక ప్రకారం పాండిచ్చేరి, చందన్‌ నగర్‌లను తిరిగి ఫ్రెంచ్‌కు ఇచ్చారు. అక్కడ కేవలం వాణిజ్య కార్యకలాపాలు మాత్రమే నిర్వహించాలని బ్రిటిష్‌వారు షరతు విధించారు.

యుద్ధ ఫలితాలు: 

* భారత్‌పై తమ ఆధిపత్యాన్ని ఫ్రెంచ్‌ వారు పూర్తిగా కోల్పోయారు.

* దేశంలో బ్రిటన్‌ యూరోపియన్‌ శక్తిగా స్థిరపడింది. బ్రిటిష్‌ వలస పాలన స్థాపనకు మార్గం సుగమం అయ్యింది.

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌