• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ వ్యవసాయ రంగం - లక్షణాలు

మనదేశంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారమైంది.

సాగు నేలలో సుమారు 55% భూమికి మాత్రమే నీటిపారుదల వసతి ఉంది. మిగిలిన 45% వ్యవసాయ భూమికి నీటిపారుదల వసతులు కల్పించడం వీలుకాదు. కాబట్టి ఇది పూర్తి వర్షాధార వ్యవసాయ భూమి.

వ్యవసాయ భూమి తక్కువ, దానిపై ఆధారపడిన జనాభా ఎక్కువగా ఉండటం వల్ల మనదేశంలో కమతాలు చిన్నవిగా ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై తీసుకునే రుణాలు ఎక్కువయ్యాయి.

మనదేశంలో ప్రాంతాలు, నేలను బట్టి  వివిధ పంటలు సాగు చేస్తారు.

సమస్యలు 

భారతదేశంలో వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ.

ముఖ్యమైన సమస్యలు:

1. అనిశ్చిత వర్షపాతం 

2. చిన్న భూకమతాలు

3. విస్తాపన వ్యవసాయం 

4. మృత్తికా క్రమక్షయం

5. నిరక్షరాస్యులైన రైతులు 

6. నీటిపారుదల వసతుల కొరత

7. యాంత్రికీకరణ పూర్తిగా జరగకపోవడం, కాలం చెల్లిన వ్యవసాయ పరికరాలు వాడటం

8. పెట్టుబడుల కొరత, సరిపడినంత రుణ సదుపాయం లేకపోవడం

9. సరైన మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడం

వ్యవసాయ శ్రామికులు

సంవత్సరంలోని మొత్తం పనిదినాల్లో సగానికిపైగా వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తులను వ్యవసాయ శ్రామికులు అంటారు.

భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది శ్రామికులు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

భారతదేశ వ్యవసాయ రంగంలో పురుషుల కంటే స్త్రీలకే ఉపాధి ఎక్కువగా లభిస్తోంది. దాదాపు 83.7% (నేషనల్‌ శాంపిల్‌ సర్వీస్‌  నివేదిక 2014 ప్రకారం) మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. 

1951లో మనదేశంలో 97 మిలియన్‌ జనాభా వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతుండగా, వీరి సంఖ్య 2001 నాటికి 234 మిలియన్లకు, 2011 నాటికి 263 మిలియన్లకు చేరింది.

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన అడవుల పెంపకం, పాడి-పశుపోషణ, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, గనులు, క్వారీలు మొదలైనవన్నీ వ్యవసాయరంగం కిందకు వస్తాయి.

వర్గీకరణ 

జాతీయ వ్యవసాయ శ్రామికుల పరిశీలనా సంఘం వ్యవసాయ శ్రామికులను రెండు రకాలుగా వర్గీకరించింది. 

1. సాధారణ శ్రామికులు: వీరిలో మూడు రకాలు ఉన్నారు.

కొద్దిగా సొంత వ్యవసాయ భూమి కలిగి, ఇతర రైతుల పొలాల్లో పనిచేసే శ్రామికులు.

​​​​​​​ భూమిని కౌలుకు తీసుకుని స్వయంగా సాగుచేస్తూ ఇతర భూముల్లోనూ శ్రామికులుగా పనిచేసే వారు.

​​​​​​​ ఉమ్మడిగా సాగు చేస్తున్న భూక్షేత్రంలో పండిన పంటలో తమ వాటా పొందుతూ, శ్రామికులుగా కూడా పనిచేసేవారు. వీరినే ‘షేర్‌ క్రాపర్స్‌’ అంటారు.

2. రైతుల వద్ద పనిచేసే శ్రామికులు: వీరు సంవత్సరాల పాటు రైతుల వద్ద పనిచేస్తారు. వీరినే ‘పాలేర్లు’ అంటారు.

వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులు పెంపొందించే చర్యలు 

దేశంలోని వ్యవసాయ శ్రామికుల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవి:

కనీస వేతనాలు: వ్యవసాయ శ్రామికుల జీవన స్థితిగతులను పెంపొందించడానికి భారత ప్రభుత్వం 1948లో ‘కనీస వేతన చట్టాన్ని’ రూపొందించింది. దీని ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలు, వ్యయాలను దృష్టిలో ఉంచుకుని మూడేళ్లలోపు (1951లోపు) కనీస వేతన చట్టాలను రూపొందించి, అమలు చేయాలి. అప్పటి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం, నాగాలాండ్‌ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ కనీస వేతన చట్టాలను రూపొందించాయి.

భూమిలేని శ్రామికులకు భూపంపిణీ: భూమిలేని శ్రామికులకు భూపంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 1972లో ‘భూపరిమితి చట్టం’ చేసింది.

భూపరిమితి చట్టం: భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనసమండలి 1972 సెప్టెంబరులో ఆమోదించాయి.

ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టం అయిదుగురు సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్‌గా ప్రకటించింది.

ఒక యూనిట్‌కు గరిష్ఠంగా 10 నుంచి 27 ఎకరాలు నీటి వసతి ఉన్న భూమి, 3554 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు.

దానికి అదనంగా ఉన్న భూమిని ప్రభుత్వం మిగులు భూమిగా ప్రకటించి, స్వాధీనం చేసుకుని, భూమిలేని వ్యవసాయ శ్రామికులకు పంపిణీ చేస్తుంది.

భూపరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం పశ్చిమ్‌ బంగా. 

నివాస గృహాలు, ఇంటి స్థలాలను కల్పించడం: వ్యవసాయ శ్రామికుల్లో చాలా మందికి సరైన సొంత నివాస గృహాలు లేవు. ఇందుకు పరిష్కారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇందిరా ఆవాస్‌ యోజన’, ‘కనీస అవసరాల కార్యక్రమం’ లాంటి పథకాలను రూపొందించాయి. దీని ద్వారా పేదలకు ఉచితంగా నివాస స్థలాలు కేటాయించి, రాయితీ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు.

వెట్టిచాకిరీ నిర్మూలన: శ్రమదోపిడీ, బానిసత్వం మొదలైనవి వెట్టిచాకిరీ కిందకు వస్తాయి.

ఎలాంటి కూలీ లేకుండా లేదా పనికి తగ్గ వేతనాన్ని పొందకపోవడాన్ని వెట్టిచాకిరీ లేదా బేగార్‌ అంటారు.

1976లో భారత ప్రభుత్వం వెట్టిచాకిరీ నిర్మూలన చట్టాన్ని రూపొందించింది.

రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో శ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.

రైతులు - రకాలు

 పెద్ద రైతులు - 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు.

మధ్యతరహా రైతులు - 10.1 నుంచి 25 ఎకరాల వరకు భూమి ఉన్న వారు.

 సన్నకారు రైతులు - 5.1 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న వారు.

చిన్నకారు రైతులు - 2.6 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన వారు.

ఉపాంత రైతులు - 2.5 ఎకరాల వరకు భూమి ఉన్న వారు.

మనదేశంలో ప్రధానమైన జీవ కాలువలు/ నదీ కాలువలు

 ఎగువ గంగా, దిగువ గంగా, ఆగ్రా కాలువ, శారదా కాలువ, తూర్పు యమునా కాలువ, బెట్వా కాలువ, కెన్‌ కాలువ, గోవింద సాగర్‌ కాలువ. ఇవన్నీ ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉన్నాయి.

 హరియాణలోని పశ్చిమ యమునా కాలువ, భాఖ్రా కాలువ.

 పంజాబ్‌లోని బిస్ట్‌ డోబ్‌ కాలువ, సిర్‌హింద్‌ కాలువ, నంగల్‌ కాలువ.

ఇందిరాగాంధీ కాలువ: 

​​​​​​​ దీన్ని రాజస్థాన్‌ కాలువ అని కూడా అంటారు. దీని పొడవు 650 కి.మీ. దేశంలోనే అత్యంత పొడవైంది.

​​​​​​​ ఈ కాలువను సట్లెజ్, బియాస్‌ నదుల సంగమ స్థానం వద్ద నిర్మించిన హరికేన్‌ బ్యారేజ్‌ నుంచి రాజస్థాన్‌ వరకు తవ్వారు.

​​​​​​​ ఇది ఎడారి ప్రాంతమైన వాయవ్య రాజస్థాన్‌కు నీటిపారుదల సౌకర్యాలను కల్పిస్తోంది.

నీటిపారుదల సౌకర్యాలు - రకాలు

 వ్యవసాయాభివృద్ధికి నీటిపారుదల అత్యంత ఆవశ్యకమైన ఉత్పాదక వనరు.

 దేశంలో వర్షపాత నమోదులో ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం వల్ల వ్యవసాయానికి నీటిపారుదల వసతి అవసరం.

 వర్షపాతంతో సంబంధం లేకుండా పంటలకు అవసరమైన నీటిని వివిధ మార్గాల ద్వారా కల్పించడాన్ని నీటిపారుదల వసతులు అంటారు.

 భారతదేశంలో ముఖ్యంగా మూడు రకాలైన నీటిపారుదల వసతులు ఉన్నాయి. అవి:

 1. బావులు 2. చెరువులు  3. కాలువలు

బావులు

భారతదేశంలో వ్యవసాయానికి బావుల ద్వారా నీటిపారుదల చాలా ఎక్కువగా జరుగుతోంది.

 డెల్టాయేతర ప్రాంతాల్లో, కాలువలు లేని చోట్ల తక్కువ లోతులో బావులు తవ్వి వాటి ద్వారా భూగర్భజలాలను వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.

 ప్రస్తుతం మనదేశంలో సుమారు 61.4% వ్యవసాయ భూమి బావుల ద్వారా సాగవుతోంది.

 బావుల ద్వారా నీటి వసతి అధికంగా పొందుతున్న రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌.

రకాలు: బావులు రెండు రకాలు అవి: 

ఉపరితల బావులు: తక్కువ లోతులో ఉన్న నీటిని తోడుకోవడానికి ఉపరితల బావులను తవ్వుతారు. ఇవి సాధారణంగా డెల్టా ప్రాంతాలు, నదీలోయల్లో, అవక్షేప శిలలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి.

గొట్టపు బావులు: వీటి ద్వారా నీటి వసతిని కల్పించడం ఆధునిక పద్ధతి. ఇందులో యంత్రాలను ఉపయోగించి ఎక్కువ లోతులో ఉన్న నీటిని గొట్టాల ద్వారా పైకి తెస్తారు. దీని ద్వారా విశాలమైన వ్యవసాయ భూమికి నీటిని అందించవచ్చు.

చెరువులు

దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా చెరువుల ద్వారానే సాగుతోంది.

 ఈ ప్రాంతంలోని ఎగుడు-దిగుడు స్థలాకృతి, మృత్తికల అడుగు పొరలు కఠినంగా ఉండటం, ప్రవేశ యోగ్యం లేకపోవడం లాంటి లక్షణాల వల్ల చెరువుల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

 ఇక్కడ జీవనదులు లేకపోవడం; కాలువలు, బావులకు ప్రాధాన్యం తక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల రైతులు చెరువులపై ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తున్నారు.

 చెరువుల ద్వారా నీటి వసతి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలు వరుసగా 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

 తెలంగాణలోని వ్యవసాయ భూమిలో 0.9 శాతం చెరువుల ద్వారా సాగవుతోంది.

 ప్రస్తుతం దేశంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 3.1 శాతం.

కాలువలు

 భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలోని నీరే కాలువలకు ఆధారం.

 ఉత్తర మైదానాల్లో జీవనదులు ఉండటం వల్ల అక్కడ కాలువల ద్వారా నీటి సౌకర్యం ఎక్కువగా ఉంది.

 మనదేశంలోని ద్వీపకల్ప భాగంలో అనేక నదులు వర్షాధారమైనవి. కొన్ని అనువైన ప్రదేశాల్లో వీటిపై ఆనకట్టలు నిర్మించి, నీటిని నిల్వచేస్తారు. వేసవి కాలంలో లేదా కరవు పరిస్థితులు తలెత్తినప్పుడు ఆ నీటిని కాలువల ద్వారా పొలాలకు సరఫరా చేస్తారు.

 కాలువల ద్వారా నీటిపారుదల ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది.

 మనదేశంలో 34.1 శాతం సాగుభూమికి కాలువల ద్వారా నీటి వసతి కల్పించారు.

 మనదేశంలో రెండు రకాల కాలువలు ఉన్నాయి. అవి: 

1. నదీ కాలువలు లేదా శాశ్వత కాలువలు

2. వెల్లువ నీటి కాలువలు (లేదా) వరద కాలువలు

శాశ్వత కాలువలు: 

నదులపై అడ్డంగా ఆనకట్టలు నిర్మించి, ఆ జలాశయాలకు కాలువలను అనుసంధానం చేస్తారు. ఇవి సంవత్సరం పొడవునా వ్యవసాయానికి నీటిని అందిస్తాయి. ఈ కాలువలు ఎక్కువ విస్తీర్ణంలోని భూమికి నీటిని అందిస్తాయి.

వెల్లువ నీటి కాలువలు: 

వరదలు వచ్చినప్పుడు పంటలు ముంపునకు గురికాకుండా ఈ కాలువలను ఏర్పాటు చేస్తారు. వీటినే వరద కాలువలు అని కూడా అంటారు. ఇవి వేసవి కాలంలో పూర్తిగా ఎండిపోతాయి.

నీ మనదేశంలో పంజాబ్‌లోని సట్లెజ్‌ నదికి అనేక వరద కాలువలు ఉన్నాయి.

రచయిత

పి.కె.వీరాంజనేయులు

Posted Date : 04-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌