• facebook
  • whatsapp
  • telegram

భారతీయ రక్షణ రంగం


భారత సైన్యం (ఇండియన్‌ ఆర్మీ) ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన సైన్యంగా  గుర్తింపు పొందింది. 1949 జనవరి 15న ఆర్మీ భారతదేశానికి చెందిన ఫీల్డ్‌ మార్షల్‌ ఎం.కరియప్ప (అంతకుముందు ఇంగ్లిష్‌వారు మాత్రమే ఈ బాధ్యతలు నిర్వర్తించారు) మొట్టమొదటిసారిగా ఇండియన్‌ ఆర్మీ   కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.  దీంతో ఏటా జనవరి 15వ తేదీని ‘ఆర్మీ డే’గా నిర్వహిస్తున్నారు. జై హింద్‌ అనే నినాదాన్ని కూడా ఈయనే మొదటగా ఉపయోగించారు. భారత సైన్యం అందించే నిస్వార్థ్ధమైన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.  


భారత వాయు దళం 

దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో  భారత వాయుసేన ఎప్పుడూ ముందుంటుంది. 1932 అక్టోబరు 8న భారత వాయుదళాన్ని (IAF) ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ ఏడాది ఆ తేదీని భారత వాయుదళ దినోత్సవంగా జరుపుతారు. భారత వాయుదళం, ఇండియన్‌ ఆర్మీకి అందించిన సహకారం, వాయుసేన వివిధ యుద్ధాల్లో చూపిన పోరాట పటిమ గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు. 

అప్పటి బ్రిటిష్‌ రాజ్యంలో భాగంగా రాయల్‌ బ్రిటిష్‌ వాయుదళానికి (RAIF) అనుబంధంగా భారత వాయుదళాన్ని ఏర్పాటు చేశారు. భారత వాయుదళ చట్టం-1932 ఈ అనుబంధ హోదాను రద్దు చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారత వాయుదళ పోరాట పటిమను చూసి బ్రిటిష్‌ ప్రభుత్వం రాయల్‌  బిరుదుతో సత్కరించి రాయల్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌గా పేరు మార్చింది. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు రాయల్‌ అనే పదాన్ని తొలగించారు. 


పోర్చుగీసు వారి చెర నుంచి గోవాను విడిపించి భారతదేశంలో కలపడంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల పరిరక్షణలో, శాంతిని పరిరక్షించే దళంగానూ భారత వాయుదళం వివిధ ఆపరేషన్లలో (ఆపరేషన్‌ మేఘదూత్, ఆపరేషన్‌ విజయ్‌ మొదలైనవి) పాల్గొంది. దీంతో ప్రపంచంలోనే మేటి దేశాల వాయుదళాల సరసన భారత వాయుదళం నిలిచింది. భారత వాయుదళంలో మొట్టమొదటి స్క్వాడ్రన్‌ 1933 ఏప్రిల్‌లో చేరింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మాలో చూపిన పోరాట పటిమకుగానూ బలమైన సాయుధదళంగా వాయుసేన పేరొందింది. 1971లో పాక్‌ - భారత్‌ యుద్ధంలో భారత వాయుసేన చూపించిన ప్రతిభకు పరమవీరచక్ర (ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ నిర్మల్‌ జిత్‌ సింగ్‌ షేఖాన్‌కు) వరించింది. ప్రస్తుతం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి భారత వాయు దళానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.  

భారత వాయుదళం - శిక్షణ

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రదేశాల్లో  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తన సిబ్బందికి కావాల్సిన శిక్షణను అందిస్తోంది. అవి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, వాయుదళ శిక్షణా సంస్థ దుండి…గల్, పైలట్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అలహాబాద్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌ బెంగళూరు, ఎయిర్‌ఫోర్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజ్‌ కోయంబత్తూరు మొదలైనవి. భారత వాయుదళంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిగ్‌ విమానాలు, సుఖోయ్‌ 30 విమానాలు, హెచ్‌ఏఎల్‌ తేజస్, ధ్రువ, అత్యంత అధునాతనమైన డ్రోన్లు, వివిధ యుద్ధాల్లో ఉపయోగించే వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి.

తేజస్‌ యుద్ధ విమానాలు

2021లో జాతీయస్థాయి భద్రతా కమిటీ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా భారత వాయుదళంలో చేర్చుకోవడానికి లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అయిన 83 తేజస్‌ యుద్ధ విమానాలను రూ.48వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తుంది. ఈ యుద్ధ విమానాలను ముఖ్యంగా అల్యూమినియం, మిశ్రమ లోహాలు, కార్బన్‌ నానో ట్యూబ్‌లతో తయారు చేస్తారు. అందువల్ల ఇవి తేలికగా ఉండటంతో పాటు వీటి ప్రయోగం కూడా అత్యంత సులభంగా ఉంటుంది. ఈ స్వభావం వల్ల వీటి టేకాఫ్‌కు తక్కువ వ్యవధి, తక్కువ ల్యాండింగ్‌ సదుపాయాలు సరిపోతాయి.  


యుద్ధ విమానాలు

భారత ప్రభుత్వం 1984లో ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఇది అత్యంత తేలికైన యుద్ధ విమానాల రూపకల్పన ప్రాజెక్టు. 


* దీని ఆధ్వర్యంలో LCA (లైట్‌ కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌) రూపొందింది. భారత వాయుదళంలో అంతకుముందున్న  MiG 21 యుద్ధ విమానాల స్థానంలో సేవలందించేందుకు దీన్ని రూపొందించారు. 

* ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా వీటిని రూపొందించాయి. . 

* ఈ తేలికపాటి యుద్ధ విమానాలను హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తుంది. ఇవి చాలా చిన్నవిగా, అత్యంత తేలికగా ఉండే, తోక లేని సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌ వాహకనౌకలు. 

*  ఇవి వివిధ లక్ష్యాలను ఒకేసారి చేధించగలవు. వీటికి ఏదశలోనైనా (air to air, air to surface, precision  guided) ఆయుధాలను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. దీంతోపాటు ఇవి గాలిలోనే ఇంధనం నింపుకోగలవు.

* వీటి పేలోడ్‌ కెపాసిటీ నాలుగు వేల కేజీలు. ఈ యుద్ధ విమానాలు 1.8 machs వేగాన్ని కలిగి ఉంటాయి. వీటి పరిధి మూడువేల కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంటుంది. అవి: LCA Tejas Mk-1, LCA Tejas Mk-1A, LCA-Navy, LCA-Navy Mk-2.


ఇండియన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్స్‌


భారత విమాన వాహక నౌకలు (ఇండియన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్స్‌) సముద్రంలో అత్యంత పెద్ద  బేస్‌లు కలిగి ఉండి యుద్ధ సమయాల్లో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో మొదటిది INS విక్రాంత్‌. ఇది  బ్రిటన్‌లో తయారై 1961 నుంచి 1997 వరకు భారత నావికాదళానికి సేవలు అందించింది. INS విరాట్‌  కూడా బ్రిటన్‌లో రూపొందిన వాహక నౌక. ఇది 1987 నుంచి 2016 వరకు భారత నావికాదళంలో సేవలు చేసింది. ప్రస్తుతం భారత నావికాదళంలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక వాహకనౌక INS విక్రమాదిత్య. దీన్ని భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసింది. 2013 నుంచి ఇప్పటి వరకూ ఈ వాహకనౌక సేవలు అందిస్తూనే ఉంది.   


విక్రాంత్‌ INS 


భారత రక్షణరంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్రోగ్రాం ద్వారా ఇండిజీనియస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ INS విక్రాంత్‌ (IAC-1)ను స్వదేశంలో రూపొందించారు. దీన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో తయారు చేశారు. భారత నావికాదళం 2022 ఆగస్టు 15 నుంచి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ (వాహకనౌక) సేవలను వినియోగించుకోనుంది. ఈ వాహకనౌకకు భారత నావికాదళ మొదటి వాహకనౌక అయిన INS విక్రాంత్‌ పేరు పెట్టారు. ఈ వాహకనౌక MiG 29k విమానాలను, kamov-31, MH-60R, అధునాతన ఫైటర్‌ హెలికాఫ్టర్లను ప్రయోగించడానికి అనువుగా, తేలియాడే కేంద్రంగా ఉంటుంది. 


భారతదేశంలో రెండో స్వదేశీ నిర్మాణమైన  ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ (IAC-2) INS విశాల్‌. ఇది ఇంకా నిర్మాణదశలో ఉంది. 65వేల టన్నుల సామర్థ్యం కలిగిన ఇది భవిష్యత్తులో భారత నావికాదళానికి సేవలు అందించనుంది. ఈ వాహకనౌకను భారతదేశ అణుఇంధన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ వాహకనౌకగా పిలుస్తారు. దీనిలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ తరంగాలతో వాహకనౌకలను లాంచ్‌ చేసే సదుపాయం ఉంటుంది.


డ్రోన్లు

డ్రోన్‌ను మానవ రహిత వాహకనౌక (Unmanned Aerial Vehicles - UAN) గా పిలుస్తారు. అత్యంత చిన్నదైన, స్వయం నియంత్రిత లేదా సుదూర ప్రాంతాల నుంచి సెన్సార్‌ల ద్వారా నియంత్రించే రోబోట్‌ వ్యవస్థగా దీని గురించి చెప్పవచ్చు. ఈ డ్రోన్ల కదలికలను లైడర్‌ డిటెక్టర్‌ల ద్వారా గమనించవచ్చు. ఈ వ్యవస్థను మొట్టమొదటిసారిగా రక్షణరంగంలో ఉపయోగించటానికి రూపొందించారు. యుద్ధ సమయాల్లో ఈ డ్రోన్లను నిఘా కోసం, నిర్దేశిత లక్ష్యాలను ఛేదించటానికి ఉపయోగిస్తారు. తేలికైన నిర్మాణం, చొచ్చుకుపోగల సామర్థ్యం కారణంగా వీటిని వివిధ సందర్భాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రక్షణరంగంలో డ్రోన్ల పాత్ర కీలకమైంది. శత్రుదేశ కార్యకలాపాలను వీటి సహాయంతో ముందుగానే పసిగట్టవచ్చు.  శత్రుదాడి, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు  డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 


డ్రోన్లు-ఉపయోగాలు 

డ్రోన్లు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లో డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ, ఆహార పంపిణీ కూడా చేశారు. తెలంగాణలో డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.   

* వ్యవసాయరంగంలో సూక్ష్మపోషకాల (micro nutrients) పంపిణీ మొదలుకొని వివిధ  సందర్భాల్లో డ్రోన్లను ఉపయోగిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 

* భారత ప్రభుత్వం ప్రారంభించిన SWAMITVA కార్యక్రమంలో డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగించి  ఏడాదిలోపే గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డుల పంపిణీ, వివరాలు నమోదు చేశారు.   

*  మానవ దుర్భేధ్యమైన ప్రాంతాల్లో రియల్‌ టైమ్‌ సర్వైలెన్స్, వివిధ భవన నిర్మాణాలు, వాటి నిర్వహణ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.   

* విపత్తు నిర్వహణలో డ్రోన్ల సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా భారీ అగ్ని ప్రమాదాలు  జరిగినప్పుడు, వివిధ ప్రమాదకర పరిస్థితుల్లో ఇవి ఎనలేని సేవలు అందిస్తున్నాయి.  

* అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, కాలుష్య నియంత్రణలోనూ ఇవి ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.  

డ్రోన్లు దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నా, శత్రు దేశాలు కూడా డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడుతుండటంతో దేశం భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అసాంఘిక వ్యక్తులు, ఉగ్రవాదులు సైతం డ్రోన్లతో దాడులు  చేస్తుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దేశ సరిహద్దుల్లోని   బీఎస్‌ఎఫ్‌ దళాలు శత్రుదేశాల డ్రోన్ల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం డ్రోన్లను ఉపయోగించటానికి 2021లో డ్రోన్‌ నియమాలు - 2021 రూపొందించింది. డ్రోన్లు దేశభద్రతతో పాటు మానవాళికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తున్నాయి.

************

* మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, అప్పటి ప్రభుత్వం రక్షణ రంగం ఆవశ్యకతను గుర్తించి దీనిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించాలని ఆకాంక్షించింది. అందుకు అనుగుణంగా డిఫెన్స్‌ సైన్స్‌ ఆర్గనైజేషన్‌ (DSO), డిఫెన్స్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (DTDE), డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (DTDP) లను ఏర్పాటు చేసింది.


డీఆర్‌డీఓ ఏర్పాటు

1958లో ప్రభుత్వం డీఎస్‌ఓ, డీటీడీఈ, డీటీడీపీ సంస్థలను విలీనం చేసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)ను ఏర్పాటు చేసింది. దీన్ని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. డీఆర్‌డీఓ ప్రస్తుత ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి.

* భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు కల్పించటం, తద్వారా రక్షణ రంగంలోనూ మెరుగైన ఆయుధాలను, సంబంధిత సామాగ్రిని, విధివిధానాలను ప్రపంచ స్థాయి మార్కెట్లో పోటీ పడేలా వృద్ధి చేయటం డీఆర్‌డీఓ ముఖ్య ఉద్దేశం.

* 10 ప్రయోగశాలలతో ఏర్పడిన డీఆర్‌డీఓకు  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52 ల్యాబొరేటరీలు ఉన్నాయి. వీటిలో వివిధ రకాలైన ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. 

* ప్రస్తుతం ఈ సంస్థలో అయిదు వేల మంది శాస్త్రజ్ఞులు, ఇరవై అయిదు వేల మంది వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

* ఇది ముఖ్యంగా ఏరోనాటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంబాట్‌ వెహికల్స్, ఇంజినీరింగ్‌ సిస్టం, ఇన్‌స్ట్రుమెంటేషన్, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్, స్పెషల్‌ మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్, వ్యవసాయం మొదలైన రంగాల్లో పరిశోధనలు చేస్తోంది. 

* దీని ఆధ్వర్యంలో మిస్సైల్స్, తేలికపాటి యుద్ధ విమానాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాల తయారీతో పాటు సాంకేతికత అభివృద్ధిని కూడా నిర్వహిస్తోంది. 


భారతదేశ క్షిపణి వ్యవస్థ   

అగ్ని 1: ఇందులో ఒకే ఒక స్టేజ్‌ (దశ) ఉంటుంది. ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇది మధ్యస్థ దూరానికి ప్రయోగించే మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ (MRBM). ఇది 700-800 కి.మీ. వరకు ప్రయాణించగలదు.

అగ్ని 2: దీన్ని ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ అంటారు. దీని రేంజ్‌ 2000 కి.మీ. 

అగ్ని 3: ఇది రెండు స్టేజ్‌లు కలిగిన ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ (IRBM). ఈ వ్యవస్థ విస్తృత పరిధి ఉన్న, వివిధ కాన్ఫిగరేషన్లు కలిగిన వార్‌హెడ్‌లను తీసుకుపోగలదు. దీని రేంజ్‌ 2500 కి.మీ. 

అగ్ని 4: రెండు దశలు కలిగిన ఘన ఇంధన క్షిపణి వ్యవస్థ. ఇది అనుకున్న లక్ష్యాన్ని అత్యంత సమర్ధవంతంగా ఛేదిస్తుంది. రహదారి మార్గాల మీదుగా కూడా దీన్ని ప్రయోగించవచ్చు. దీని రేంజ్‌ 3,500 కి.మీ. ఈ క్షిపణిలో స్వదేశీ నిర్మితమైన రింగ్‌ లేజర్‌ గైరో, కాంపోజిట్‌ రాకెట్‌ మోటార్లు ఉన్నాయి. 

అగ్ని 5: ఇది మూడు దశలు కలిగిన ఇంధన క్షిపణి వ్యవస్థ. దీన్ని స్వదేశంలో తయారైన ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ (ICBM)గా పిలుస్తారు. 

* దీనికి 1.5 టన్నుల న్యూక్లియర్‌ వార్‌ హెడ్‌లను తీసుకొనిపోయే సామర్థ్యం ఉంది. 

* ఇందులో అత్యంత అధునాతన సాంకేతికత కలిగిన నావిగేషన్‌ వ్యవస్థ ఉంది. ఇది వార్‌హెడ్‌లకు కావాల్సిన దిశానిర్దేశాన్ని అత్యంత కచ్చితత్వంతో అందిస్తుంది. 

* ఈ క్షిపణిని డీఆర్‌డీఓ రూపొందిస్తే, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసింది. 

* దీన్ని భారత మిలటరీ వ్యవస్థలోకి  చేర్చడం ద్వారా భారత్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ వ్యవస్థ కలిగిన అయిదు దేశాల సరసన నిలిచింది. ఆ దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌. 

* దీని రేంజ్‌ 5,000 కి.మీ. ఈ క్షిపణికి మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికిల్‌ (MIRV) పేలోడ్లను మోసుకుపోయే సామర్థ్యం ఉంది. ఈ పేలోడ్లు కలిగిన క్షిపణి ఒకే కాలంలో వేర్వేరు లక్ష్యాలపై వార్‌హెడ్‌లను ప్రయోగించగలదు. 

* అగ్ని-5 క్షిపణి అధునాతన వెర్షన్‌ను 2021, అక్టోబరు 27న ఒడిశాలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ నుంచి మరొకసారి విజయవంతంగా పరీక్షించారు. 


త్రిశూల్‌: ఇది అత్యంత తక్కువ దూరంలో, ఎక్కువ వేగంగా, తక్కువ ఎత్తులో ప్రయోగించగల షార్ట్‌ రేంజ్‌ క్విక్‌ రియాక్షన్‌ మిస్సైల్‌.

* ఈ క్షిపణిలో ఎయిర్‌క్రాఫ్ట్‌ జామర్‌లను ప్రతిఘటించే ఎల్రక్టానిక్‌ కౌంటర్‌ వ్యవస్థ ఉంది.

* దీన్ని తక్కువ ఎత్తులో సముద్రంలో ప్రయాణించే స్కిమ్మింగ్‌ లక్ష్యాలను అంటే నేవల్‌ వెసల్స్, క్షిపణులు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను చేధించడానికి ఉపయోగిస్తారు. 

* దీన్నిAnti sea skimmer అని కూడా అంటారు.

నాగ్‌: ఇది మూడో తరానికి చెందిన ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ క్షిపణి వ్యవస్థ. దీన్ని యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌గా పిలుస్తారు. దీని రేంజ్‌ 4 - 8 కి.మీ. 

* దీన్ని భూమిపై నుంచి లేదా హెలికాప్టర్‌ నుంచి ఉపయోగించొచ్చు. భూమిపై నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థను Prospina అని, హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించే దాన్ని Helina లేదా ధృవాస్త్రగా పిలుస్తారు. 

* ఇటీవలి కాలంలో నాగ్‌ రెండు అధునాతన వెర్షన్లను ప్రయోగించారు, అవి: 

1. లేజర్‌ గైడెడ్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ 

2. స్టాండ్‌ ఆఫ్‌ యాంటీ ట్యాంక్‌ మిస్సైల్‌ (SANT)

* SANTని 2021, డిసెంబరు 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో విజయవంతంగా ప్రయోగించారు. దీన్ని డీఆర్‌డీఓ, ఇమారత్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌)లు సంయుక్తంగా రూపొందించాయి. సామర్థ్యం 10 కి.మీ. 


BrahMos: దీన్ని సూపర్‌ సోనిక్‌ మిస్సైల్‌గా పిలుస్తారు. ఈ క్షిపణిని భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. 

* ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌గా ఇది పేరొందింది. దీని వేగం పరిధి 2.5  2.8 machs.

* ఈ క్షిపణిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ ఆయుధంగా ఉపయోగిస్తారు. దీన్ని ఒకసారి నిర్దేశించాక తర్వాత మార్గదర్శకత్వం లేదా దిశానిర్దేశం  చేయాల్సిన అవసరం ఉండదు. కచ్చితంగా ఒకసారి నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిస్తుంది. 

* ఇండియన్‌ నేవీ 2022, ఏప్రిల్‌ 27న బ్రహ్మోస్‌ క్షిపణిని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో విజయవంతంగా పరీక్షించింది. 

* 2022, మే 12న బ్రహ్మోస్‌ క్షిపణి వేగాన్ని 350 కి.మీ.లకు పెంచి, SU-30MKI ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యానికి ప్రయోగించగా, అది విజయవంతంగా  ఛేదించింది.


నిర్భయ్‌: దీన్ని బ్రహ్మోస్‌ అనుబంధ క్షిపణిగా  పేర్కొంటారు. దీన్ని భూ, సముద్ర ఉపరితలాలు; గాలిలో నుంచి ప్రయోగించవచ్చు. ఇది 1000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిస్తుంది. ఇది 24 రకాలైన వార్‌హెడ్‌లను ప్రయోగించగలదు. 

ఆకాశ్‌: ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే (ssurface-to-air) క్షిపణి వ్యవస్థ. ఇది మధ్యస్థ దూరానికి ప్రయోగించే మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. ఇది ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌కు సేవలను అందిస్తోంది. 

* ఈ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తూ, రామ్‌జెట్‌ రాకెట్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది. 

* దీనికి రాజేంద్ర అనే ఫైర్‌ కంట్రోల్‌ రాడార్‌ దిశా నిర్దేశం చేస్తుంది.

* 2021, డిసెంబరులో యాక్టివ్‌ రేడియో ఫ్రీక్వెన్సీ కలిగిన నూతన తరానికి చెందిన ఆకాశ్‌-P క్షిపణిని డీఆర్‌డీఓ ప్రయోగించింది. 


పృథ్వి: దీన్ని IGMDP రూపొందించింది. ఇది మనదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన మొదటి బాలిస్టిక్‌ క్షిపణి. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్యాటిల్‌ ఫీల్డ్‌ మిస్సైల్‌. దీని రేంజ్‌ 150 - 300 కి.మీ. ఈ వ్యవస్థలో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి: 


పృథ్వి 1: ఇది ఇండియన్‌ ఆర్మీకి సేవలందిస్తుంది. దీని రేంజ్‌ 150 కి.మీ. ఈ క్షిపణిని ప్రహార్‌ అనే అధునాతన క్షిపణితో స్థానభ్రంశం చేసినట్లు అప్పటి డీఆర్‌డీఓ శాస్త్రవేత్త అవినాష్‌ చందర్‌ తెలిపారు. 


పృథ్వి 2: ఇది ఒకే ఒక దశ కలిగిన ద్రవ ఇంధనంతో పనిచేసే క్షిపణి వ్యవస్థ. ఇది ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు సేవలను అందిస్తోంది. 


పృథ్వి 3: ఇది భారతీయ నావికా దళానికి సేవలను అందిస్తోంది. దీన్ని ధనుష్‌ అని కూడా పిలుస్తారు. 


డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (DDRD)

* రక్షణ రంగంలో పరిశోధనల కోసం ప్రభుత్వం 1980లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (DDRD)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డీఆర్‌డీఓ - దాని అనుబంధ ప్రయోగశాలలను పర్యవేక్షిస్తుంది.

* DDRD రక్షణ రంగంలో పరిశోధనలకు కావాల్సిన ప్రణాళికలు, వాటి రూపకల్పన మొదలైనవాటిని అభివృద్ధి చేస్తుంది.  రక్షణ రంగ పరికరాలు, ఆయుధాలను పరీక్షించడం, వాటి నాణ్యతను అంచనా వేయటం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. త్రివిధ దళాలకు కావాల్సిన నూతన ఆయుధాలు, పరికరాలను ఈ సంస్థే సమకూరుస్తుంది. 

* DDRD జాతీయ స్థాయిలో నోడల్‌ సంస్థగా పనిచేస్తుంది.

* ప్రస్తుతం డాక్టర్‌ జి. సతీష్‌ రెడ్డి దీనికి సెక్రటరీగా ఉన్నారు.


భారతదేశ క్షిపణి ప్రోగ్రాం 

* భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో 1983 జులై  26న ఇంటిగ్రేటెడ్‌ గైడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (IGMDP)ను ప్రభుత్వం ప్రారంభించింది. స్వదేశీ గైడెడ్‌ క్షిపణులను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 

* IGMDP ద్వారా దేశ అవసరాలకు అనుగుణంగా అయిదు రకాల క్షిపణి వ్యవస్థలను రూపొందించాలని ప్రభుత్వం భావించింది. దీని కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంకేతిక నిపుణులను, విద్యాసంస్థలను, పరిశోధన-అభివృద్ధి సంస్థలను, త్రివిధ దళాలను ఏకతాటిపైకి తెచ్చి క్షిపణి వ్యవస్థను రూపొందించారు.

IGDMP ద్వారా రూపొందించిన అయిదు క్షిపణి వ్యవస్థలు: 

పృథ్వి: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే తక్కువ రేంజ్‌ కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి.

అగ్ని: ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మధ్యస్థ దూరం (intermediate range) కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి 

త్రిశూల్‌: షార్ట్‌ రేంజ్‌లో ప్రయాణించగల సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌.

ఆకాష్‌: మధ్యస్థ దూరం కలిగిన ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ.

నాగ్‌: మూడో తరానికి చెందిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌.

* ప్రారంభంలో అగ్ని మిస్సైల్‌ వ్యవస్థను IGDMP కిందకి తెచ్చినా, తర్వాతి కాలంలో వేరు చేశారు. 

* క్షిపణి వ్యవస్థలో భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా రూపొందించడంలో డీఆర్‌డీఓ సఫలీకృతం అయ్యింది. 

* 2008, జనవరి 8న IGDMP విజయవంతంగా పూర్తయినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.

Posted Date : 23-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌