• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థిక వ్యవస్థ - లక్షణాలు  

నిలకడగా వృద్ధి చెందే స్థూల ఆర్థిక వ్యవస్థ


 భారత ప్రభుత్వం నిలకడ గల స్థూల ఆర్థిక విధానాలను అమలు చేస్తోంది.

స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల

జాతీయాదాయ పెరుగుదల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సూచిస్తుంది. 1950 నుంచి ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. గత 65 సంవత్సరాల్లో జాతీయాదాయం వృద్ధి రేటు తక్కువగానే ఉంది.

​​​​​​​భారత ఆర్థిక సర్వే నివేదిక 202021 ప్రకారం, జీవీఏలో వ్యవసాయ రంగం వాటా 20%, పారిశ్రామిక రంగం వాటా 26%, సేవా రంగం వాటా 54 శాతంగా ఉన్నాయి.

​​​​​​​గత 6 దశాబ్దాల్లో వ్యవసాయ రంగం సమకూరుస్తున్న ఆదాయం కొంత మేర పెరగ్గా, సేవల రంగం నుంచి లభించే ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతోంది.

ద్రవ్యోల్బణ నియంత్రణ

​​​​​​​సాధారణ ధరల స్థాయిలో నిరంతర వస్తు, సేవల ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. జాతీయాదాయం, తలసరి ఆదాయం వృద్ధి చెందినా ధరలు నిలకడగా లేకపోవడంతో దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థ అనేక ఒడుదొడుకులకు గురైంది.

​​​​​​​195661లో మొదటిసారి ప్రారంభమైన ద్రవ్యోల్బణ ఒత్తిడి 199091 నాటికి త్రీవరూపం దాల్చింది.

ఆదాయ అసమానతలు తగ్గించడం 

​​​​​​​గత 60 ఏళ్లుగా మనదేశంలో ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. ప్రైవేట్‌ ఆస్తుల ఆర్జన కారణంగా సంపదలోనూ హెచ్చుతగ్గులు ఉన్నాయి. 

​​​​​​​స్వాతంత్య్రానంతరం దారిద్య్రరేఖకు దిగువనున్న వారి శాతం ఎక్కువగా ఉండేది. పేదరిక  నిర్మూలనకు ప్రభుత్వం SFDA, JRY, MGNREGA లాంటి  పథకాలు అమలు చేయడంతో పేదరికం కొంతమేర తగ్గింది.

​​​​​​​ ప్రాంతీయ అసమానతలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సాయంతో వాటిని తగ్గించే  ప్రయత్నాలు చేశాయి. 

​​​​​​​12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) నుంచి చేపట్టిన ‘శీఘ్ర, సుస్థిర, అధిక సమ్మిళిత వృద్ధి’ చర్యల వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు కొంత వరకు తగ్గాయి.

ఉపాధి కల్పన అవకాశాల విస్తరణ 

 ​​​​​​​ప్రభుత్వం భారీ పరిశ్రమలనే కాకుండా, సూక్ష్మ-చిన్న తరహా, గ్రామీణ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తోంది. స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించింది.

ఉదా: MGNREGA

అవస్థాపన సౌకర్యాల విస్తృతి

​​​​​​​ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆయా రంగాల అభివృద్ధికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాల కల్పనకు కృషి చేసింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి, అదనపు భూమి సాగులోకి తెచ్చారు.

​​​​​​​ పారిశ్రామిక రంగ పురోగతికి రవాణా, విద్యుత్‌ సౌకర్యాలను మెరుగుపరిచారు. సేవల రంగ విసృతికి సమాచార, బ్యాంకింగ్, బీమా, విత్త సేవల సౌకర్యాలను కల్పించారు.

​​​​​​​ రైల్వే మార్గాల పొడవులో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

​​​​​​​ రోడ్డు రవాణా సౌకర్యం, విస్తరణ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన (PMGSY), కనీస అవసరాల పథకం, కమాండ్‌ ఏరియా అభివృద్ధి పథకాల ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో  95% రోడ్లు వేశారు.

​​​​​​​ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ద్వారా దేశంలో అనేక విమానాశ్రయాలను అభివృద్ధి చేశారు.

​​​​​​​ మనదేశ రవాణా రంగంలో జలరవాణా వాటా 29 శాతంగా ఉంది.

​​​​​​​ 1997లో టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాను స్థాపించి, దేశంలో ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలను విస్తృతం చేశారు.

పెరుగుతున్న పట్టణీకరణ 

​​​​​​​ పట్టణీకరణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఉపాధి అవకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తారు. పట్టణ జనాభా శాతం 1901లో 11.4% ఉండగా, 2011 నాటికి 31.1 శాతానికి చేరింది.

​​​​​​​ యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ప్రచురించిన స్టేట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పాపులేషన్‌ 2021 నివేదిక ప్రకారం 2021 నాటికి మనదేశంలో పట్టణ జనాభా 46.99 కోట్లుగా ఉన్నట్లు అంచనా.

 సాంఘిక సేవల విస్తరణ - మానవ వనరుల అభివృద్ధి 

​​​​​​​ ప్రభుత్వం కల్పించే సాంఘిక సేవల్లో విద్య, వైద్యం, తాగునీరు, గృహ వసతి, పారిశుద్ధ్యం లాంటివి ముఖ్యమైనవి. ఈ సౌకర్యాల కల్పనకు అవసరమైన పెట్టుబడినే మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడిగా పేర్కొంటారు.

​​​​​​​ ప్రపంచ దేశాలతో పోలిస్తే ప్రాథమిక విద్యా వ్యవస్థలో మనదేశం రెండో స్థానంలో ఉంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక 2021 ప్రకారం 2017 నాటికి మనదేశంలో మొత్తం అక్షరాస్యత రేటు 77.7% (పురుషులు 84.7%, స్త్రీలు 70.3%)గా ఉంది.

​​​​​​​ ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయమైన పురోగతి సాధించాయి. జననాల రేటు నియంత్రణకు, మరణాల రేటు తగ్గింపునకు, ప్రజల జీవితకాలం పెరిగేందుకు ఇవి తోడ్పడ్డాయి.

​​​​​​​ 2019లో కేంద్రం జల్‌ జీవన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2024 నాటికి దేశంలోని ప్రజలందరికీ తాగునీటి సదుపాయం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం.

​​​​​​​ దేశంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం 2014, అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ పథకాన్ని ప్రారంభించింది దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

​​​​​​​ ప్రభుత్వం 2021, నవంబరు 20న స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ నగరాల ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో ఇండోర్‌ ప్రథమ స్థానంలో నిలవగా, సూరత్, విజయవాడ తర్వాతి ర్యాంకులు సాధించాయి.విశాఖపట్నానికి 9వ ర్యాంకు, గ్రేటర్‌ హైదరాబాద్‌కు 13వ స్థానం దక్కాయి.

​​​​​​​ దేశంలోని ప్రజలందరికీ గృహవసతి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2015, జూన్‌ 25న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకాన్ని ప్రారంభించింది. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1.12 కోట్ల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

​​​​​​​ అధిక జనాభా నియంత్రణ, అవస్థాపన సౌకర్యాల విస్తరణ, సాంఘిక - సేవల సౌకర్యాలు పెంచడం మొదలైనవన్నీ మానవ వనరుల అభివృద్ధిపై అనుకూల ప్రభావాలు చూపుతున్నాయి.

భారతదేశ ఆర్థికాభివృద్ధి - ప్రపంచ విత్త సంస్థల పాత్ర

​​​​​​​ రెండో ప్రపంచ యుద్ధం (1939-45) కాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. దీంతో యుద్ధం ముగిశాక 1944, జులై 1 నుంచి 22 వరకు 44 దేశాల ప్రతినిధులు అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌లో ఉన్న బ్రెట్టన్‌వుడ్స్‌లో సమావేశమయ్యారు. దీన్నే బ్రెట్టన్‌వుడ్స్‌ సమావేశం లేదా యునైటెడ్‌ నేషన్స్‌ మానెటరీ అండ్‌ ఫైనాన్షియల్‌ కాన్ఫరెన్స్‌ అంటారు. ఇందులో యుద్ధం వల్ల నష్టపోయిన ఆర్థికవ్యవస్థల పునర్నిర్మాణానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాలని తీర్మానించారు.

​​​​​​​ ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అనే రెండు సంస్థలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వీటినే ‘బ్రెట్టన్‌వుడ్స్‌ కవలలు’ అంటారు.  ప్రస్తుతం ఐబీఆర్‌డీని ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు అందించిన రుణాలతో రెండో ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన దేశాలను పునర్నిర్మించారు. కాలక్రమేణా ప్రపంచ దేశాలన్నీ ఆనకట్టల నిర్మాణం, ఎలక్ట్రిక్‌ గ్రిడ్లు, నీటిపారుదల వ్యవస్థ, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో పునర్నిర్మాణం నుంచి అభివృద్ధి వైపు ప్రపంచ బ్యాంకు దృష్టి సారించింది. 

ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ 

పేదరికాన్ని తగ్గించి, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంక్‌కు అయిదు రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి. అవి:

1. ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD) లేదా ప్రపంచ బ్యాంక్‌

2. ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA)

3. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (IFC)

4. మల్టీలేటరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్యారెంటీ ఏజెన్సీ (MIGA)

5. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిస్ప్యూట్స్‌ (ICSID)

ప్రపంచ బ్యాంకు లేదా ఐబీఆర్‌డీ:

స్థాపన: 1944 జులై 

సభ్య దేశాలు: 189

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి. (అమెరికా):

మాతృ సంస్థ: యూఎన్‌ఓ ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌

అధ్యక్షుడు: డేవిడ్‌ మాల్పస్‌

ఉద్దేశం: అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు రుణాలు, విరాళాలు ఇచ్చి మూలధనాన్ని ప్రోత్సహించడం. పేదరికాన్ని తగ్గించేందుకు ఆయా దేశాలకు రుణాలు ఇవ్వడం.

ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌:

స్థాపన: 1960, సెప్టెంబరు 24

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి.

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ):  క్రిస్టలీనా జార్జియేవా

లక్ష్యం: అత్యంత పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు అభివృద్ధి సహాయం, రాయితీ, రుణాలు, గ్రాంట్లు అందించడం. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికి వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు, సాంకేతిక సహకారం, విధాన సలహాలు ఇవ్వడం.

ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

స్థాపన: 1956, జులై 20

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి. 

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్, సీఈఓ:  Jin-Yong Cai

లక్ష్యం: తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేట్‌ రంగం అభివృద్ధి చెందేలా పెట్టుబడులు అందించడం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపార సంస్థలకు ఈక్విటీ¨ ఫైనాన్సింగ్‌ కల్పించడం.

మల్టీలేటరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్యారెంటీ ఏజెన్సీ:

స్థాపన: 1988

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి. 

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌: హీరోషి మాతానో

విధులు: పెట్టుబడిదారులు, రుణ దాతలకు రాజకీయ పరమైన నష్టాలకు (తీవ్రవాదం, యుద్ధాలు, పౌర అశాంతి మొదలైనవి) హామీ ఇవ్వడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరిహద్దు పెట్టుబడులను ప్రోత్సహించడం.

​​​​​​​ కొన్ని వాణిజ్యేతర కారణాల వల్ల ఏర్పడే నష్టానికి వ్యతిరేకంగా విదేశీ పెట్టుబడిదారులకు రుణ హామీలు, బీమా అందించడం.

​​​​​​​ పెట్టుబడిదారులు, ప్రభుత్వాల మధ్య వివాదాల పరిష్కారానికి సహాయపడటం.

​​​​​​​ పర్యావరణ, సామాజిక నిర్వహణలో విస్తృతమైన జ్ఞానాన్ని అందించడం.

ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెటిల్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డిస్ప్యూట్స్‌:

స్థాపన: 1966, అక్టోబరు 14

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి.

సెక్రటరీ జనరల్‌: మెగ్‌ కిన్నర్‌ 

ఉద్దేశం: విదేశీ పెట్టుబడిదారులు, వారికి ఆతిథ్యం ఇచ్చే దేశాల మధ్య పెట్టుబడికి సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు, సయోధ్య లేదా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించడం.
 

Posted Date : 31-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌