• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక విధానాలు

భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి ఉండటం వల్ల మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పేర్కొంటారు. ఈ రెండు రంగాల పరిధిని తెలిపేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానాలను ప్రకటిస్తుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 1948, ఏప్రిల్‌ 6న అప్పటి పరిశ్రమల శాఖామంత్రి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ మొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఈ విధానం పారిశ్రామిక రంగాన్ని 4 గ్రూప్‌లుగా విభజించింది. అవి

గ్రూప్‌ 1: అణుశక్తి, రైల్వే, ఆయుధాలు - ఆయుధ సామగ్రి అనే 3 మౌలిక, వ్యూహాత్మక  పరిశ్రమలను ప్రభుత్వ ఏకస్వామ్యంలో ఉంచారు. 

గ్రూప్‌ 2: బొగ్గు, ఇనుము - ఉక్కు, నౌకా నిర్మాణం, మినరల్‌ ఆయిల్స్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఖనిజ నూనెలు అనే ఆరు కీలక పరిశ్రమలను భవిష్యత్‌లో అభివృద్ధి చేసే బాధ్యతతో ప్రభుత్వం ఆధీనంలో ఉంచారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ పరిశ్రమలను పది సంవత్సరాల వరకు వారే నిర్వహిస్తారు. ఆ తర్వాత జాతీయం చేసే విషయాన్ని ప్రభుత్వం సమీక్షిస్తుంది.

గ్రూప్‌ 3: సిమెంట్, కాగితం, ట్రాక్టర్లు, విద్యుత్, రబ్బరు, టెక్స్‌టైల్స్, పంచదార, ఎరువులు, యంత్ర పరికరాలు, ఆటోమొబైల్స్, భారీ రసాయనాలు మొదలైన 18 రకాల పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రైవేట్‌ రంగానికి అనుమతిచ్చారు. అయితే, ఇవి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో కొనసాగుతాయి.

గ్రూప్‌ 4: పై మూడు వర్గీకరణల్లో లేని పరిశ్రమలు ఈ జాబితాలో చేరతాయి. ఇవి పూర్తిగా ప్రైవేటు రంగంలో ఉంటాయి. ఏ పరిశ్రమ అయినా సంతృప్తికరంగా పనిచేయకుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.


 మొదటి పారిశ్రామిక విధానం

ఎ) కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యతా హోదా ఇచ్చింది.

బి) శ్రామికులకు న్యాయ సమ్మతమైన వేతనాలు, సాంఘిక భద్రత కల్పన, యాజమాన్యంలో భాగస్వామం లాంటి వాటని ప్రస్తావించడం ద్వారా పారిశ్రామిక బంధాలను బలోపేతం చేసింది.

సి) పారిశ్రామికీకరణకు విదేశీ మూలధనం ఆవశ్యకతను గుర్తించినా నియంత్రణ మాత్రం భారతీయుల చేతుల్లోనే ఉండాలని పేర్కొంది. 

10 సంవత్సరాల తర్వాత జాతీయం చేయవచ్చనే నిబంధనవల్ల ప్రైవేటు సంస్థలు ఆయా పరిశ్రమలపై శ్రద్ధ చూపలేదు.

1948 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అమలు చేసి, పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చేపట్టేందుకు భారత ప్రభుత్వం 1951లో పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టాన్ని(IRDA) తీసుకొచ్చింది. ఈ చట్టం 1952 నుంచి అమల్లోకి వచ్చింది.

పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం లక్ష్యాలు

*  ఆర్థికశక్తి కేంద్రీకరణను నిరోధించడం.

* పారిశ్రామిక వస్తుధరల నియంత్రణ.

*  కోరుకున్న దిశలో పెట్టుబడులు వెళ్లేలా చూడటం.

ముఖ్యాంశాలు

*  కేంద్ర ప్రభుత్వం కాకుండా వేరే ఎవరైనా (రాష్ట్ర ప్రభుత్వం గానీ, ప్రైవేటు వ్యక్తులు గానీ) పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా, అప్పటికే లైసెన్స్‌ పొందిన సంస్థ నూతన వస్తువును తయారు చేయాలన్నా, సంస్థ స్థల మార్పిడి చేయాలన్నా, సంస్థను విస్తరించాలన్నా లైసెన్స్‌ పొందడం తప్పనిసరి. లైసెన్స్‌ పొందిన సంస్థకు కోటా పేరుతో గరిష్ఠ పరిమితిని విధిస్తారు. సంస్థ ఆ పరిమితికి మించి ఉత్పత్తి చేయకూడదు. ఏదైనా ఒక సంస్థ తన ఉత్పత్తులను రవాణా చేయాలంటే పర్మిట్‌ అవసరం. దీన్నే లైసెన్స్‌ - కోటా - పర్మిట్‌ (లైసెన్స్‌ రాజ్‌) వ్యవస్థగా పిలుస్తారు.

*  అన్ని పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఏ పరిశ్రమ రిజిస్ట్రేషన్‌ అయినా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. 

*  వంద కంటే తక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలు లైసెన్స్‌ పొందాల్సిన అవసరం లేదు.

*  విద్యుత్‌ను ఉపయోగించి 50 లేదా అంతకంటే ఎక్కువ మంది, విద్యుత్‌ను ఉపయోగించకుండా 100 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థను ఈ చట్టం ప్రకారం ఫ్యాక్టరీ అంటారు.


1956 పారిశ్రామిక విధానం 

1948 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని పది సంవత్సరాల తర్వాత సమీక్షించాలని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం భారీ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ రెండో ప్రణాళికకు సిద్ధమవడం, పార్లమెంట్‌ సామ్యవాద రీతి సమాజాన్ని అంగీకరించడం, రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఆదేశిక సూత్రాల్లో ఆర్థిక శక్తి వికేంద్రీకరణకు పెద్దపీట వేయడం లాంటి కారణాల వల్ల రెండేళ్ల ముందుగానే 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించారు. ఇందులోని ముఖ్యాంశాలు:


 పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు.

జాబితా ఎ: ఈ జాబితాలో 17 పరిశ్రమలు ఉంటాయి. అవి అణుశక్తి, రైల్వే, ఆయుధాలు - ఆయుధ సామాగ్రి, బొగ్గు, ఇనుము- ఉక్కు, నౌకా నిర్మాణం, మినరల్‌ ఆయిల్స్, టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఖనిజ నూనెలు మొదలైనవి. వీటిలో కేంద్రానికి పూర్తి ఏకస్వామ్యం కల్పించారు. 

జాబితా బి: ఈ జాబితాలో 12 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అవి ఎరువులు, రబ్బరు, రోడ్డు రవాణా, సముద్ర రవాణా, అల్యూమినియం మొదలైనవి. ప్రభుత్వం, ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసేలా వీటిని మిశ్రమ రంగంలో ఉంచారు.

జాబితా సి: జాబితా ఎ, బి లో లేని పరిశ్రమలు ఇందులో ఉంటాయి. వీటిని పూర్తిగా ప్రైవేటు రంగానికి విడిచిపెట్టారు.


మినహాయింపులు 

*  జాబితా ఎ లోని పరిశ్రమలను ప్రైవేట్‌ రంగం ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొచ్చు.

*  కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్య హోదా కల్పించారు

*  శ్రామికులకు న్యాయ సమ్మతమైన వేతనాలు, సాంఘిక భద్రత కల్పన, యాజమాన్యంలో భాగస్వామ్యం లాంటివి ప్రస్తావించడం ద్వారా పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేసింది.

*  పారిశ్రామికీకరణకు విదేశీ మూలధన ఆవశ్యకతను గుర్తించినా భారతీయుల చేతుల్లోనే నియంత్రణ ఉండాలని పేర్కొంది.

*  ప్రభుత్వ రంగ యూనిట్లు, ప్రైవేట్‌ రంగ యూనిట్లకు మధ్య ఎలాంటి విచక్షణ చూపరాదు. విద్యుత్, రవాణా, విత్త సౌకర్య కల్పనలో అసమానతలు చూపించకూడదు.

* వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి తగిన ప్రోత్సాహకాలు అందించాలి. యూనివర్సిటీల్లో పారిశ్రామిక శ్రామికులకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు ఏర్పాటు చేయాలి.

*  ప్రభుత్వ, ప్రైవేట్‌ యూనిట్ల మేనేజర్లకు సాంకేతిక, యాజమాన్య శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం యూనివర్సిటీల్లో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలి. 

ఈ విధానం 1991 వరకు ఆర్థిక వ్యవస్థ స్వభావం, పరిధిని పేర్కొనడమే కాకుండా పారిశ్రామిక విస్తరణకు దోహదపడింది. అందుకే దీన్ని ‘ఆర్థిక రాజ్యాంగం’గా పరిగణిస్తారు. 


1973 పారిశ్రామిక విధానం

ఈ విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నూతన ఆలోచనలు ప్రవేశించాయి. ఇనుము - ఉక్కు, విద్యుత్‌ శక్తి, బొగ్గు, సిమెంట్, ముడి చమురు, చమురు శుద్ధి అనే ఆరు పరిశ్రమలను కోర్‌ పరిశ్రమలుగా గుర్తించారు. దత్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1) కొన్ని వస్తువులను చిన్న పరిశ్రమలకు రిజర్వు చేశారు. 2) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం ఉమ్మడిగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ‘జాయింట్‌ సెక్టార్‌’ అనే  భావనను అభివృద్ధి చేశారు. టెక్నాలజీ బదిలీ మార్గం ద్వారా పరిమితంగా విదేశీ పెట్టుబడులను అనుమతించారు.


1977 పారిశ్రామిక విధాన తీర్మానం

మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం (మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం) ఈ విధానాన్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ విధానాలు నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచాయని, జనాభా అధికంగా ఉన్న మన దేశంలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని వీరు భావించారు. ఈ విధానాన్ని అప్పటి పరిశ్రమల మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ప్రకటించారు. 

ముఖ్యాంశాలు

*   చిన్న పరిశ్రమలను ఈ విధానం 3 రకాలుగా వర్గీకరించింది. అవి: 

ఎ. స్వయం ఉపాధిని కల్పించే కుటీర పరిశ్రమలు

బి. TINY పరిశ్రమలు. (యంత్రాలపై రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టే పరిశ్రమలను గిఖివ్త్రి పరిశ్రమలు అంటారు.)

సి. రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టే పరిశ్రమలను చిన్నతరహా పరిశ్రమలు అని, రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే పరిశ్రమలను అనుబంధ పరిశ్రమలు అని అంటారు.

*  చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ‘జిల్లా పారిశ్రామిక కేంద్రాన్ని’ ఏర్పాటు చేయాలి.

*  మూలధన వస్తువుల తయారీ, మౌలిక వసతుల అభివృద్ధి, అధిక సాంకేతిక పరిశ్రమలు మొదలైన వాటిని పెద్ద పరిశ్రమలకు కేటాయించారు. అవి తమకు అవసరమైన విత్త వనరులను సొంతంగా సమకూర్చుకోవాలి.

*  చిన్న పరిశ్రమలకు రిజర్వు చేసిన వస్తువుల సంఖ్యను 180 నుంచి 870కు పెంచారు.

*  సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధన కోసం ఒక మిలియన్‌ కంటే అధిక జనాభా ఉన్న మెట్రో పాలిటన్‌ నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి లైసెన్స్‌లు కేటాయించరాదని పేర్కొన్నారు. 

*  దేశాభివృద్ధికి దోహదపడని రంగాల్లో విదేశీ పెట్టుబడులను నిషేధించారు. దీంతో ఖితీలీ, దివీదితిదివీలితి లాంటి కంపెనీలు దేశం విడిచి వెళ్లాయి.

1980 పారిశ్రామిక విధానం

MRTP గరిష్ఠ పరిమితిని రూ.25 కోట్ల నుంచి  రూ.50 కోట్లకు పెంచారు.  ఒక కంపెనీ లైసెన్స్‌డ్‌ సామర్థ్యం కంటే అదనంగా చేసిన ఉత్పత్తిని ఈ విధానం రెగ్యులర్‌ చేసింది. అన్ని పరిశ్రమలను ఆటోమెటిక్‌గా విస్తరించుకునే అవకాశం కల్పించింది.

*   చిన్నపరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులను పెంచింది.గిఖివ్త్రి పరిశ్రమల పెట్టుబడిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, చిన్నపరిశ్రమల పెట్టుబడిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.

1985 పారిశ్రామిక విధానం

బహుళ జాతి కంపెనీలు భారతీయ కంపెనీల్లో 49 శాతం వాటా కలిగి ఉండేలా ఈ విధానం ద్వారా అనుమతించారు.MRTP పరిధిని రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచారు.

*  కొన్ని పరిశ్రమల్లో బ్రాడ్‌బాండింగ్‌ భావనను తొలిసారిగా పరిచయం చేశారు. లైసెన్స్‌డ్‌ సామర్థ్యం మేరకు మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల మిశ్రమాన్ని మార్చుకునేలా ఈ భావన వీలు కల్పిస్తుంది 

*   తప్పకుండా లైసెన్స్‌ పొందాల్సిన పరిశ్రమల సంఖ్యను 26కు తగ్గించారు.

లైసెన్సింగ్‌ విధానంపై సమీక్ష

1951లో తీసుకొచ్చిన పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1964లో స్వామినాథన్, మహలనోబిస్‌ కమిటీలను నియమించింది. అనంతరం 1967లో ఆర్‌.కె.హజారీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లైసెన్సింగ్‌ విధానంలోని ఉపయోగకర అంశాలను ప్రశంసించడమే కాక, అందులోని లోపాలను ఎత్తిచూపింది.  

*  పెద్ద పారిశ్రామిక కుటుంబాలు ఒక వస్తువు ఉత్పత్తికి అనేక దరఖాస్తులు పంపి గుత్తాధిపత్యం పొందాయి. కానీ లైసెన్సులు పొందాక అధిక ఉత్పత్తులు సాధించలేకపోయాయి. ఉదాహరణకు బిర్లా కుటుంబం తాము పొందిన లైసెన్సుల్లో 50% మాత్రమే ఉత్పత్తి చేపట్టింది.

*  లైసెన్స్‌ జారీ చేసేటప్పుడు ‘మొదట వచ్చినవారికి మొదట అనుమతి’ పద్ధతిని అనుసరించడం, అనుమతుల మంజూరులో అధికారులు విచక్షణ చూపడం, ఆలస్యం చేయడం (రెడ్‌ టేపిజం) లాంటి వాటిని కమిటీ విమర్శించింది.

*  వివిధ రకాల వ్యాపార పద్ధతుల ద్వారా పెద్ద సంస్థలు చిన్న సంస్థలకు ఆటంకాలు కలిగించడంతో అవి అమ్మకాలకు సిద్ధపడ్డాయి. వాటిని పెద్ద సంస్థలు తమలో విలీనం చేసుకోగలిగాయి. ఆర్‌.కె.హజారీ కమిటీ సిఫార్సులపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. అనంతరం ప్రభుత్వం లైసెన్సింగ్‌ విధానాన్ని సమీక్షించేందుకు సబిమాల్‌ దత్‌ అధ్యక్షతన ఆర్‌.కె.పరాంజపే, మోహన్‌ కుమార మంగళం సభ్యులుగా 1967లో Industrial licencing Enquiry కమిటీ వేసింది. ఈ కమిటీ తన నివేదికను 1969లో సమర్పించింది. దీని ప్రకారం 1956 పారిశ్రామిక విధానం 17 పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్‌ చేసినా, ఆచరణలో ప్రైవేట్‌ రంగానికి అధికంగా లైసెన్సులు ఇచ్చారు. ఉదాహరణకు మెషిన్‌ టూల్స్‌ రంగంలో ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎంటీకి కేవలం 9 లైసెన్సులు దక్కగా ప్రైవేట్‌ సంస్థలకు 226 లైసెన్సులు లభించాయి. మొత్తం లైసెన్సుల్లో 62% మహారాష్ట్ర, పశ్చిమ్‌ బెంగాల్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు దక్కాయి. వెనకబడిన రాష్ట్రాలకు ఈ లైసెన్సింగ్‌ వ్యవస్థ లబ్ధి చేకూర్చలేదు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 1969లో  Monopolies Restrictive Trade Practices Act ( MRTPA) ను తీసుకొచ్చారు. వ్యాపార పద్ధతుల నియంత్రణ ద్వారా ఆర్థిక శక్తి కేంద్రీకరణను నిరోధించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యం.

*  ఈ చట్టం ప్రకారం 25 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉన్న కంపెనీలు విస్తరణ చేపట్టాలన్నా, ఇతర సంస్థలను విలీనం చేసుకోవాలన్నా, గ్రీన్‌ ఫీల్డ్‌ వెంచర్‌ వేయాలన్నా భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. లీళిగిశి చట్టం పరిధిలోకి వచ్చే కంపెనీలను లీళిగిశి కంపెనీలు అంటారు.

* నిషేధించిన వ్యాపార పద్ధతుల పరిహారానికి 1970లో కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

1991 నూతన పారిశ్రామిక విధానం

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు 1991లో విధించిన షరతుల మేరకు పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.

లక్ష్యాలు:

* భారత పారిశ్రామిక వ్యవస్థపై అనవసర అధికార నియంత్రణ లేకుండా చేయడం.

* భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమ్మిళితం చేసేందుకు సరళీకరణ చర్యలు చేపట్టడం.

* పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ పెట్టుబడులపై ఉన్న ఆంక్షలు తొలగించడం. 
* దేశీయ పారిశ్రామికవేత్తలకు లీళిగిశి చట్ట నిబంధనల నుంచి స్వేచ్ఛ కల్పించడం.
* నష్టాల్లో లేదా తక్కువ లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలపై భారాన్ని తొలగించడం.

ఈ విధమైన లక్ష్యాలతో 1991 జులైలో భారీ పరిశ్రమలకు, ఆగస్టులో చిన్న పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక ప్రకటనలు చేశారు

ముఖ్యాంశాలు :

ఎ) పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానం: 1956 పారిశ్రామిక విధానం ప్రకారం షెడ్యూల్‌ బి, సిలోని పరిశ్రమలు తప్పనిసరిగా లైసెన్స్‌ పొందాలి. కానీ ఈ విధానంలో తప్పక లైసెన్స్‌ పొందాల్సిన పరిశ్రమల సంఖ్యను 18కి తగ్గించారు. 1991 అనంతరం ఈ పరిశ్రమలను 18 నుంచి 5కు తగ్గించారు. దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాల ఆధారంగా ఈ 5 పరిశ్రమలను తప్పనిసరి లైసెన్సింగ్‌ విధానంలో కొనసాగిస్తున్నారు. అవి:  

i) ఏరోస్పేస్, రక్షణ సంబంధిత ఎలక్ట్రానిక్స్‌ (టీవీ, రేడియో, వీసీఆర్‌ లాంటి వినోద సంబంధిత ఎలక్ట్రానిక్స్‌ ఈ జాబితాలో లేవు.)

ii) పారిశ్రామిక పేలుడు పదార్థాలు (గన్‌ పౌడర్, సేఫ్టీ ఫ్యూజ్, డేటోనాటింగ్‌ ఫ్యూజ్, నైట్రో సెల్యులోజ్‌ మొదలైనవి.)

iii)  ప్రమాదకర రసాయనాలు (హైడ్రోసైనిక్‌ యాసిడ్, ఐసోసైనేట్లు మొదలైనవి)

iv) సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులు (1999 నుంచి నూతనంగా లైసెన్సులు జారీ చేయడం లేదు.)

v) ఆల్కహాలిక్‌ పానీయాలు (1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వీటి లైసెన్సింగ్‌ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది.

ఈ అయిదు రంగాల్లో ఉత్పత్తిని చేపట్టే చిన్న పరిశ్రమలు లైసెన్స్‌ పొందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న పరిశ్రమలకు రిజర్వ్‌ చేసిన వస్తువును పెద్ద పరిశ్రమ ఉత్పత్తి చేయాలంటే లైసెన్స్‌ పొందాలి. పారిశ్రామిక లైసెన్స్‌ అవసరం లేని పరిశ్రమలు మాత్రం ‘ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ మెమొరాండం’ను సమర్పించాలి. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ అండ్‌ పాలసీ (DIPP) కింద ఉన్న సెక్రటేరియట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అసిస్టెన్స్‌(SIA) లైసెన్సులను జారీ చేస్తుంది.

బి) ప్రభుత్వ రంగానికి రిజర్వ్‌ చేసే పరిశ్రమల సంఖ్య తగ్గించడం: 1956 విధానంలో 17 పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్వ్‌ చేశారు. ఈ విధానంలో వాటిని ఎనిమిదికి తగ్గించారు.

అవి:

i) ఆయుధాలు - ఆయుధ సామగ్రి 

ii) అణు శక్తి 

iii) బొగ్గు 

iv)మినరల్‌ ఆయిల్‌

v) వెండి, బంగారం, వజ్రాలు, ఇనుము, మాంగనీస్‌ మొదలైన వాటి మైనింగ్‌ 

vi) జింక్, రాగి, సీసంల  మైనింగ్‌  

vii) రైల్వేలు   

viii) అణు శక్తి ఖనిజాలు

* సంస్కరణల అనంతరం 1993లో రెండు, 1998-99లో మరో రెండు అంశాలను 

* రిజర్వ్‌ చేయగా, 2001లో ఆయుధాల ఉత్పత్తిని డీరిజర్వ్‌ చేశారు. 

* ప్రస్తుతం కేవలం రెండు పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వానికి రిజర్వ్‌ అయి ఉన్నాయి. 1) అణు శక్తి   2) రైల్వే కార్యకలాపాలు (హై స్పీడ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, డెడికేటెడ్‌ ఫ్రీట్‌ లైన్స్‌ మొదలన వాటి నిర్మాణం, నిర్వహణలో 2014 నుంచి ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తున్నారు.   

సి) MRTPపరిమితి రద్దు చేయడం:

MRTP గరిష్ఠ పరిమితి పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా ఉండటంతో ఈ విధానం దీన్ని రద్దు చేసింది.

డి) విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం:

మన దేశంలో మెజారిటీ వాటాను విదేశీ కంపెనీలు కలిగి ఉండటానికి అనుమతించిన మొదటి పారిశ్రామిక విధానం ఇది. అధిక ప్రాధాన్యం ఉన్న 34 పరిశ్రమల్లో 51% ఈక్విటీ వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించింది. ఈ 34 పరిశ్రమల్లోకి విదేశీ సాంకేతికత బదిలీ చేసేందుకు ఒప్పందాలు చేసుకోవచ్చు

*  కొన్ని ప్రాజెక్ట్‌లకు విదేశీ మూలధన వస్తువులు అవసరం. అలాంటి ప్రాజెక్టులు విదేశీ ఈక్విటీ ద్వారా విదేశీ మారక ద్రవ్యం  సమకూర్చుకోగలిగితే ఆయా మూలధన వస్తువులు  ఆటోమాటిక్‌గా దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు (లేదా) దిగుమతి చేసుకునే మూలధన వస్తువుల విలువ మొత్తం ప్లాంట్‌ విలువలో 25% కంటే తక్కువగా ఉన్నా ఈ అనుమతులు లభిస్తాయి. మిగిలిన సందర్భాల్లో మూలధన వస్తువుల దిగుమతికి సెక్రటేరియట్‌ ఫర్‌  ఇండస్ట్రియల్‌ అసిస్టెన్స్‌(SIA) అనుమతి తీసుకోవాలి.     ఇ) స్థల నిర్ణయం: 1 మిలియన్‌ కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో 25 కి.మీ. పరిధిలో కాలుష్య పరిశ్రమలు ఏర్పాటుచేయకూడదు. కాలుష్యేతర పరిశ్రమలైన ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, ప్రింటింగ్‌ లాంటి పరిశ్రమలను 25 కి.మీ. పరిధిలో ఏర్పాటుచేయవచ్చు.

ఎఫ్‌) ప్రభుత్వ రంగ సంస్థల్లో తీసుకువచ్చిన మార్పులు: కింద పేర్కొన్న ప్రాధాన్యతాంశాలపై ప్రభుత్వ రంగం అధికంగా దృష్టి  సారించాలని  ఈ విధానం పేర్కొంది.

a) అవస్థాపనా సదుపాయాల కల్పన 

b) చమురు, ఖనిజ వనరుల అన్వేషణ, వెలికితీత  

c) దేశ రక్షణ   

d) ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక అభివృద్ధికి  దోహదపడేవి, ప్రైవేట్‌ రంగం దృష్టిసారించని అంశాలు.

*  అధిక ప్రాధాన్యత రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్న పీఎస్‌యూలకు ఎంఓయూల ద్వారా స్వయంప్రతిపత్తిని కల్పించారు. 

*  కొన్ని ఎంపిక చేసిన పీఎస్‌యూల్లో ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకుని విత్త సంస్థలకు, కార్మికులకు, ప్రజలకు విక్రయిస్తుంది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి అవసరమయ్యే వనరుల సమీకరణతో పాటు  ప్రజా భాగస్వామ్యం సాధ్యమవుతుంది. 

*  ఖాయిలాపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలను BIFR(Board for Industrial Financial Reconstruction) కు నివేదించాలి. ఇది ఆ సంస్థలకు సరిపోయే పునరుద్ధరణ/పునరావాస పథకాలను తయారుచేస్తుంది. పునరావాస పథకాలకు నోచుకున్న పీఎస్‌యూల్లో పనిచేసే కార్మికులకు నష్టం వాటిల్లకుండా  సాంఘిక భద్రతా యంత్రాంగాన్ని రూపొందించాలి. ప్రారంభంలో అంటే 1999లో ఎగ్జిట్‌ పాలసీ విధానాన్ని (పునరుజ్జీవనం కాని పరిశ్రమలను మూసివేయడం) అవలంబించగా కార్మిక సంఘాల వ్యతిరేకత వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ  ్బజుళిళ్శీ పథకాన్ని అమలుచేసింది. దీన్నే గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌గా అభివర్ణించారు. 1990-91 లో 22 లక్షల మంది కార్మికులు ఉండగా ఈ చర్యతో 2006-07 నాటికి వారి సంఖ్య 16 లక్షలకు తగ్గింది. ఈ కార్మికుల కోసం 1992 లో ఏర్పాటు చేసిన జాతీయ పునరావాస నిధిని( National Renewal Fund) 2000 లో రద్దు చేశారు. ప్రస్తుతం VRS కార్మికులకు మళ్లీ శిక్షణ ఇచ్చి తీసుకుంటున్నారు. 

* పీఎస్‌యూల బోర్డులను ప్రొఫెషనల్‌గా తయారుచేసి వాటికి మరిన్ని అధికారాలు అందజేయాలి.

* ఈ విధానంలో TINY  పరిశ్రమల  పెట్టుబడిని రూ.5 లక్షలకు, చిన్నపరిశ్రమల పెట్టుబడిని రూ.60 లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడిని రూ.75 లక్షలకు పెంచారు. 

* పరిశ్రమల నిర్వచనాన్ని తయారీ రంగానికే కాక వ్యాపార రంగానికి విస్తరించారు 

* జాతీయీకరణ అనంతరం బ్యాంకులు దేశ  అభివృద్ధి కోసం వనరుల సమీకరణ చేపట్టాల్సి వచ్చింది. అంతకుముందు రుణాలు తీసుకున్న ప్రైవేట్‌ కంపెనీలను తిరిగి చెల్లించమని కోరగా అవి విఫలమయ్యాయి.  తిరిగి చెల్లించలేని ప్రైవేట్‌ కంపెనీల రుణాలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటు వల్ల చాలా  ప్రైవేట్‌ కంపెనీలు ప్రభుత్వపరం అయ్యాయి. ఇది పారిశ్రామికాభివృద్ధిని దెబ్బ తీయడంతో రుణాలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునే నిబంధనను ప్రభుత్వం రద్దు చేసింది.

1991 అనంతర పరిణామాలు

MRTP చట్టం స్థానంలో పోటీ చట్టం తీసుకురావడం: ఆర్థిక వ్యవస్థలో ఏకస్వామ్య పద్ధతులు లేదా నిషేధిత వ్యాపార పద్ధతులు అమల్లో ఉన్నప్పుడు వినియోగదారుల /ఉత్పత్తిదారుల ఫిర్యాదు మేరకు లేదా  సుమోటో కింద MRTP కమిషన్‌  స్పందించాలి. కానీ ఆచరణలో కమిషన్‌ విఫలమైంది. గుత్తాధిపత్యం కంటే పోటీపై దృష్టి సారించాలని SVS రాఘవన్‌ కమిటీ సిఫార్సు చేయడంతో ఆ మేరకు ప్రభుత్వం MRTP చట్టాన్ని  రద్దు చేసి 2002 లో పోటీ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యంశాలు:

* పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిషేధించడం 

* సంస్థలు తమ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడంపై నిషేధం విధించడం.

* దేశంలో పోటీపై ప్రతికూల ప్రభావం చూపించే  కలయికలను(combinations) నియంత్రించడం. Combinations అంటే...

1) ఒక కంపెనీ మరో కంపెనీ షేర్లు, ఓటింగ్‌ హక్కులు లేదా ఆస్తులు సొంతం చేసుకోవడం. 2) ఒక సంస్థ మరో సంస్థలో విలీనం కావడం. 3)  రెండు లేదా అంత కంటే ఎక్కువ సంస్థలు కలసి  పని చేయడం. 4) ఒక సంస్థ మరొక  సంస్థ కార్యకలాపాలను, యాజమాన్యాన్ని నియంత్రించడం. 

* పోటీ చట్టం ఉద్ధేశాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం భారతీయ పోటీ కమిషన్‌  తీసుకువచ్చింది. ఇది 2003 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక ఛైర్‌పర్సన్, ఆరుగురు సభ్యుల బృందం ఈ కమిషన్‌లో ఉంటారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూ దేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని ప్రోత్సహించడం ఈ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం.

జాతీయ తయారీ విధానం

చైనా జీడీపీలో తయారీ రంగం వాటా 40%  పైనే ఉంది. ఆసియాలో మనతో పోల్చదగిన దేశాలన్నిటిలో అది 25-34% గా ఉంది. కానీ 1980 నుంచి మన  దేశ జీడీపీలో తయారీ రంగం వాటా కేవలం 15-16% మాత్రమే. తగినంత భౌతిక మౌలిక వసతులు లేకపోవడం, నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి లోపించడం, నియంత్రిత వాతావరణం సంక్లిష్టంగా ఉండటం లాంటి అంశాలు ఈ వెనకబాటుతనానికి దారితీస్తున్నాయి. ఉద్యోగ కల్పనలో తయారీ రంగం గుణక ప్రభావం  కలిగి ఉంటుందని (తయారీ రంగంలో ఒక ఉద్యోగం ద్వారా 2 లేదా 3  ఉద్యోగాలను అనుబంధ

రంగాల్లో కల్పించవచ్చు) ప్రభుత్వం గుర్తించి 2011 నవంబరు 4 న జాతీయ తయారీ  విధానం తీసుకువచ్చింది.

విధాన లక్ష్యాలు:

* తయారీ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థ  వృద్ధికి ఇంజిన్‌గా తయారు చేసేందుకు ఆ రంగంలో 12-14% వృద్ధిని సాధించడం.

* 2022 నాటికీ  తయారీ రంగం దేశ జీడీపీకి 25% వాటా అందించేలా చూడటం.

* 2022 నాటికి తయారీ రంగం 100 మిలియన్ల మందికి అదనంగా ఉపాధిని  కల్పించాలి.

* వృద్ధి సమ్మిళితం చేసేందుకు పట్టణ పేదలకు, గ్రామీణ వలసలకు ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించాలి.

* భారత తయారీ రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచాలి

* అభిలషణీయ వనరుల వినియోగం, శక్తి వినియోగ సమర్థత ద్వారా సుస్థిర వృద్ధిని సాధించాలి

* రాష్ట్రాల భాగస్వామ్యంతో పారిశ్రామిక వృద్ధిని సాధించడం ఈ విధాన మౌలిక సూత్రం. కేంద్రం విధానపరమైన ఫ్రేంవర్క్‌ తయారుచేయడంతో పాటు పీపీపీ ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంలో పేర్కొన్న instrumentalities అమల్లోకి తేవాలి. ఈ instrumentalities లో ముఖ్యమైంది NIMZ( National Investment Manufacturing Zone)

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌