• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో అంతరిక్ష కేంద్రాలు -విభాగాలు

ఇస్రో ఇనర్షియల్‌ సిస్టమ్స్‌ యూనిట్‌ 

* దీని ముఖ్య కేంద్రం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ సామ్‌ దయాళ దేవ్‌.

* ఈ కేంద్రంలో ఉపగ్రహాల వాహకనౌకలకు కావాల్సిన జడత్వ వ్యవస్థ రూపకల్పన, వాటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

* అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన మెకానికల్‌ గైరోస్, ఆప్టికల్‌ గైరోస్, ఆటిట్యూడ్‌ రిఫరెన్స్‌ సిస్టం, రేట్‌ గైరో ప్యాకేజీస్, యాక్సలెరో మీటర్‌ ప్యాకేజీస్, ద్రవ్యవేగాన్ని నియంత్రించే చక్రాలు మొదలైనవాటిని స్వదేశీ పరిజ్ఞానంతో ఇక్కడ తయారు చేస్తారు. 

* అంతరిక్ష వాహకనౌకలకు, వాటి అనువర్తనాలకు అవసరమైన యంత్రాంగాన్ని ఐఐఎస్‌యూ సమకూరుస్తుంది.

ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ 

* దీని ప్రధాన కేంద్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌  అనిల్‌ భరద్వాజ్‌. ఈ కేంద్రం ద్వారా అంతరిక్ష విజ్ఞానశాస్త్రం, అనుబంధ శాస్త్రీయ విజ్ఞానాల అధ్యయనం-పరిశోధనలను నిర్వహిస్తారు. 

* ఇది స్వయం నియంత్రిత సంస్థ. దీనికి కావాల్సిన సహాయ సహకారాలను జాతీయ అంతరిక్ష విభాగం (డీఓఎస్‌) అందిస్తోంది. 

* ఉదయ్‌పూర్‌ సోలార్‌ అబ్జర్వేటరీ, మౌంట్‌ అబూలోని ఇన్‌ఫ్రారెడ్‌ అబ్జర్వేటరీలను ఈ కేంద్రం నిర్వహిస్తోంది. 

* ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో సోలార్‌ ప్లానెటరీ ఫిజిక్స్, ఇన్ఫ్రారెడ్‌ ఆస్ట్రానమీ, జియో కాస్మో ఫిజిక్స్, వాతావరణ శాస్త్రం, ప్లాస్మా ఫిజిక్స్, ల్యాబొరేటరీ ఆస్ట్రో ఫిజిక్స్, ఆర్కియాలజీ, హైడ్రాలజీ మొదలైన వాటితపై పరిశోధనలు చేస్తారు. 

* అహ్మదాబాద్‌ గ్రామీణ ప్రాంతంలో ఉన్న థాల్టేజ్‌ ప్రాంతంలో   Planetary Science and Exploration (PLANEX) ప్రాజెక్టును నిర్వహిస్తోంది. 

సెమీ కండక్టర్‌ ల్యాబొరేటరీ

* దీని ముఖ్య కేంద్రం చండీగఢ్‌లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ సురీందర్‌ సింగ్‌. 

* ఇది భారత అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో పనిచేసే స్వయం నియంత్రిత సంస్థ. 

* భారతదేశ అంతరిక్ష రంగానికి కావాల్సిన మైక్రో ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి VSLI (Very Large Scale Integration) వ్యవస్థను మరింత మెరుగుపర్చడం దీని ముఖ్య ఉద్దేశం. 

* ఇది అప్లికేషన్‌ స్పెసిఫిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్స్‌ (ASIC) రూపకల్పన, వాటి అభివృద్ధి, ఫ్యాబ్రికేషన్‌ ప్యాకేజింగ్‌ టెస్టింగ్, రిలయబిలిటీ ఎష్యూరెన్స్‌ సేవలను అందిస్తోంది. 

* ఈ కేంద్రం అంతరిక్ష విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు, ప్రయోగాలకు కావాల్సిన సెమీ కండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ సేవలను - సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.  

డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌ యూనిట్‌  

* దీని ముఖ్య కేంద్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. డైరెక్టర్‌ రాకేష్‌ ఖండేల్వాల్‌.

* ఉపగ్రహాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ కేంద్రంలో విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా దేశాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రచించడం, వాటి అమలు, నిర్వహణ మొదలైనవన్నీ ఇక్కడే ప్రారంభమవుతాయి.

* అంతరిక్ష రంగ అనువర్తనాలను టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్‌ ద్వారా ప్రజలకు చేరువ చేసి, ఇది మానవాభివృద్ధికి తోడ్పడుతుంది.  

ల్యాబొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టం

* దీని ముఖ్య కేంద్రం బెంగళూరులోని పీన్యాలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వి.శ్రీరామ్‌. 

* ఇందులో ఎల్రక్టో ఆప్టికల్‌ సెన్సార్ల రూపకల్పన, ఉత్పత్తి, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉపగ్రహాలు, వాహకనౌకలకు కావాల్సిన ఆప్టికల్‌ కెమెరాలను ఇక్కడ రూపొందిస్తారు. 

* మనదేశ మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను 1975లో ఈ కేంద్రంలోనే తయారు చేశారు. 

* ఉపగ్రహాలకు నవీన సాంకేతికతను రూపొందించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తోంది.  

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ 

* ముఖ్య కేంద్రం ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఉంది. డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రకాశ్‌ చౌహాన్‌.

* రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థ ఆధారంగా పనిచేసే ఉపగ్రహాల అధ్యయనం, వాటి రూపకల్పనలో ఈ కేంద్రం ముఖ్య పాత్ర పోషిస్తోంది.

* రిమోట్‌ సెన్సింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, వాటి అనువర్తనాలపై అధ్యయనం - శిక్షణ లాంటి కార్యక్రమాలను రూపొందిస్తుంది. 

* ఈ కేంద్రం ద్వారా రిమోట్‌ సెన్సింగ్‌ రంగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నారు. 

* ఐఐఆర్‌ఎస్‌ ఐక్యరాజ్యసమితికి చెందిన సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఆసియా అండ్‌ ది పసిఫిక్‌ (CSSTEAP) సంస్థకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.  

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీ 

* దీన్ని 2007లో కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. అంతరిక్ష విజ్ఞానశాస్త్ర అధ్యయనం, పరిశోధనల కోసం ఆసియాలోనే మొదటిసారిగా ఈ అంతరిక్ష విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 

* ఈ యూనివర్సిటీ ద్వారా అంతరిక్ష రంగంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను, అంతరిక్ష సాంకేతికతలో అత్యున్నత పరిశోధనలను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా భారత అంతరిక్ష కార్యక్రమాలకు కావాల్సిన మానవ వనరులను సమకూరుస్తున్నారు. 

* ఈ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్, డాక్టోరల్, పోస్ట్‌ డాక్టోరల్‌ కార్యక్రమాలను అందిస్తోంది. 

* యూఎస్‌ఏ, యూకే, సింగపూర్‌ మొదలైన దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన కేంద్రాలతో ఐఐఎస్‌టీకి ఒప్పందాలు ఉన్నాయి. దీని ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష రంగంలోనూ ఇది పరిశోధనలను నిర్వహిస్తోంది. 

న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 

* దీని ముఖ్య కేంద్రం బెంగళూరులో ఉంది. దీన్ని భారత అంతరిక్ష విభాగం ద్వారా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీని ప్రస్తుత సీఎండీ రాధాకృష్ణ దొరైరాజ్‌.

* దీన్ని 2019, మార్చి 6న ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని భారత అంతరిక్ష రంగ వాణిజ్య విభాగంగా పేర్కొంటారు. 

* ఈ సంస్థ భారత పరిశ్రమలకు కావాల్సిన ఉన్నత సాంకేతికతతో కూడిన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందిస్తుంది. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో వివిధ రకాలైన సేవలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. 

ముఖ్య వాణిజ్య కార్యకలాపాలు:

1. పారిశ్రామిక సాంకేతికతను ఉపయోగించి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (పీఎస్‌ఎల్వీ), స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్వీ)లను ఉత్పత్తి చేయడం. 

2. వినియోగదారుల అవసరాల మేరకు ఉపగ్రహాలను నిర్మించడం. 

3. అంతరిక్ష రంగ ఆధారిత సేవలను ఉత్పత్తి చేసి, విక్రయించడం. 

4. ఇస్రోకి చెందిన మార్కెటింగ్‌ స్పిన్‌ ఆఫ్‌ సేవలను అందించడం. 

ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 

* ఇది 1992, సెప్టెంబరులో ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా ప్రారంభమై, తర్వాత ఇస్రో వాణిజ్య విభాగంగా మారింది.

* దీని ముఖ్య కేంద్రం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. దీని సీఎండీ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌. దీన్ని అంతరిక్ష విభాగం ద్వారా భారత ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోంది. 

* ఇస్రో వాణిజ్య కార్యక్రమాలు వాటికి అవసరమైన కన్సల్టెన్సీ సేవలు, అత్యాధునిక సాంకేతికత - వాటి వాణిజ్య సేవలు మొదలైనవన్నీ ఈ కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది. 

* భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానశాస్త్ర సామర్థ్యాన్ని పెంచడం, వాణిజ్యపరంగా వివిధ దేశాలకు మార్కెటింగ్‌ చేయటం ఈ కార్పొరేషన్‌ ముఖ్య ఉద్దేశం. 

* అంతరిక్ష రంగ పరిశోధనలు, పరికరాలు, సేవలను అంతర్జాతీయ వినియోగదారులకు అందించటం, భారత అంతరిక్ష రంగం అభివృద్ధి చేసిన స్వదేశీ అంతరిక్ష పరికరాలు - వాటి సేవలను వివిధ దేశాలకు లేదా అంతర్జాతీయ మార్కెట్‌ విపణిలో ప్రదర్శించడం, భారత స్వదేశీ అంతరిక్ష పరిజ్ఞానాన్ని వివిధ దేశాలకు విక్రయించి, తద్వారా మనదేశ విదేశీ మారక నిల్వలు పెంచి, దేశాభివృద్ధికి తోడ్పడటం లాంటి కార్యక్రమాలు చేస్తోంది. 

* సమాచార భూ పరిశీలన ఉపగ్రహాలు (Communication and Earth Observatory Satellites), వాటికి సంబంధించిన పరికరాలను అంతర్జాతీయ మార్కెట్‌ లో అందుబాటులో ఉంచుతుంది. 

* ఇది రిమోట్‌ సెన్సింగ్‌ సర్వీస్, ట్రాన్స్‌పాండర్‌ లీజ్‌ సర్వీస్, వాహక నౌకల సాంకేతికత, జీఎస్‌ఎల్వీ సపోర్ట్‌ సేవలు, అత్యున్నత కన్సల్టెన్సీ - శిక్షణ సేవలను కూడా అందిస్తుంది.

నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ

* దీన్నే నేషనల్‌ మీసోస్ఫియర్‌-స్టాట్రోస్ఫియర్‌ -ట్రోపోస్ఫియర్‌ రాడార్‌ ఫెసిలిటీ (NMRF) కేంద్రం అంటారు. 

* ఇది తిరుపతికి దగ్గరలో ఉన్న గాదంకి ప్రాంతంలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ అమిత్‌  కుమార్‌ పాత్రా. ఇది భారతీయ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో పని చేస్తున్న స్వయం నియంత్రిత సంస్థ. వాతావరణ సంబంధిత పరిశోధనలకు అవసరమైన సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. 

* అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పరిశోధనలు చేస్తారు.

* ఎన్‌ఏఆర్‌ఎల్‌ ఆధ్వర్యంలో పరిశోధనా కార్యక్రమాలను ఏడు గ్రూప్‌లుగా నిర్వహిస్తారు.

1. రాడార్‌ అప్లికేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ 

2. ఐనోస్ఫియరిక్‌ అండ్‌ స్పేస్‌ రిసెర్చ్‌ గ్రూప్‌ 

3. అట్మాస్ఫియరిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డైనమిక్స్‌ గ్రూప్‌

4. క్లౌడ్‌ అండ్‌ కన్వెక్టివ్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌

5. ఏరోసోల్స్‌ రేడియేషన్‌ అండ్‌ ట్రేస్‌ గ్యాస్‌ గ్రూప్‌   

6. వెదర్‌ అండ్‌ క్లైమెట్‌ రిసెర్చ్‌ గ్రూప్‌ 

7. కంప్యూటర్స్‌ అండ్‌ డేటా మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ 

అత్యంత అధునాతనమైన లైడార్‌ (LIDAR- Light Detection and Ranging) ప్రాజెక్ట్‌ను ఈ కేంద్రం నిర్వహిస్తోంది. 

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ 

* దీని ముఖ్య కేంద్రం హైదరాబాద్‌ దగ్గర్లోని షాద్‌నగర్‌లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌. ఇది ముఖ్యంగా రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలకు సంబంధించిన డేటా సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

* ఇది ఏరియల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకుని ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహజవనరుల లభ్యత, విపత్తు నిర్వహణకు కావాల్సిన సమాచార పంపిణీ, విపత్తు ముందస్తు హెచ్చరికలు చేయడం లాంటి పనులు చేస్తోంది.

* నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌ నుంచి వచ్చే సమాచారం ముందుగా ఎన్‌ఆర్‌ఎస్‌సీకి వస్తుంది. ఇక్కడి నుంచి ఈ డేటా రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్లకు చేరుతుంది. దీని ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన సేవలను మరింత మెరుగ్గా నిర్వహిస్తున్నారు. 

* జియో స్పేషియల్‌ టెక్నాలజీ,  జాగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంను ఉపయోగించుకుని ప్రాంతీయ కేంద్రాల ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తున్నారు. 

ఉదా: భువన్‌ మొబైల్‌ అప్లికేషన్‌: ఇది వివిధ ప్రాంతాల్లోని జియోట్యాగింగ్‌ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. దీని ద్వారా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే వివిధ కార్యక్రమాలను దిల్లీ నుంచి సమీక్షించవచ్చు.

నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌

* ఇది మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఉంది. ప్రస్తుత డైరెక్టర్‌ ఎస్‌.పి.అగర్వాల్‌.

* ఈ కేంద్రాన్ని భారత అంతరిక్ష విభాగం, ఈశాన్య మండలి (నార్త్‌ ఈస్టర్న్‌ కౌన్సిల్‌) సంయుక్తంగా నిర్వహిస్తాయి. అంతరిక్ష విజ్ఞానశాస్త్ర సాంకేతికతను ఉపయోగించి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలను ఈ కేంద్రం అందిస్తోంది. 

* ఈ కేంద్రం ఈశాన్య ప్రాంతానికి నోడల్‌ కేంద్రంగా పనిచేస్తుంది. ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన జాతీయ ప్రాంతీయ కార్యక్రమాలను వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తూ, వాటి పనితీరును సమీక్షిస్తుంది. 

* సహజ వనరుల నిర్వహణ, మౌలిక వసతుల అమలు, వాటి రూపకల్పన, ఆరోగ్య వసతులు, విద్య, విపత్తు కాలంలో ముందస్తు హెచ్చరికలు, వాతావరణ హెచ్చరికలు మొదలైనవి ఈ కేంద్రం నుంచే జరుగుతాయి.

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌