• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణానికి సంబంధించిన చట్టాలు

స్వాతంత్య్రానికి పూర్వమే మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు అనేక చట్టాలు రూపొందించారు. మన రాజ్యాంగ రూపకల్పనలోనూ సహజవనరుల రక్షణకు పెద్దపీట వేశారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడుకోవడం, సహజ పర్యావరణాన్ని రక్షించడం లాంటివి పౌరుల ప్రాథమిక విధిగా రాజ్యాంగంలో నిర్దేశించారు. పర్యావరణ చట్టాలు, వాటి అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొదలైనవాటిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం.


* పర్యావరణ పరిరక్షణ కోసం 1972లో మొదటిసారి ఐక్యరాజ్య సమితి స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో పర్యావరణ సదస్సును నిర్వహించింది. అందులో పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని, దానికోసం నిర్వహించాల్సిన చర్యల గురించి ప్రపంచ దేశాలకు వివిధ ప్రతిపాదనలు చేసింది.

* భారతదేశంలో పర్యావరణ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 1972లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ను ఏర్పాటు చేసింది. 1985లో ఈ కౌన్సిల్‌ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (MoEF)గా పరిణామం చెందింది. ఇది మనదేశంలో పర్యావరణం, అటవీ విధానాలు, వాటి సంరక్షణకు రూపొందించిన కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది. 

ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ 

* ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నియమాలు (2008): ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వ, దిగుమతి నిర్వహణ కోసం; ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

* బయోమెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ నియమాలు (1998): అంటువ్యాధులకు కారణమైన బయోమెడికల్‌ వ్యర్థాలను సరైన రీతిలో పారేయడం; వేరు చేయడం; రవాణా చేయడం.

* మున్సిపల్‌ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు (2000): పురపాలక సంఘాల్లోని ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో పారేసేందుకు వీలు కల్పించడం. 


పర్యావరణానికి సంబంధించిన ఇతర చట్టాలు 


వన్యప్రాణుల (రక్షణ) చట్టం (1972)

* దేశంలోని వన్యప్రాణులను సమర్థవంతంగా రక్షించడం; వన్యప్రాణులను వేటాడటం, స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాన్ని నియంత్రించడం దీని ప్రధాన లక్ష్యాలు.

* ఈ చట్టాన్ని 2003, జనవరిలో సవరించారు. దీని ప్రకారం నేరాలకు పాల్పడిన వారికి శిక్ష, జరిమానాలను మరింత కఠినతరం చేశారు.  

అటవీ సంరక్షణ చట్టం (1980) 

* అటవీ సంరక్షణ చట్టాన్ని (ఫారెస్ట్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌) దేశంలోని అడవులను సంరక్షించడానికి, వాటి పెరుగుదలకు సహాయం చేయడానికి రూపొందించారు. 

* దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా అడవులను లేదా అటవీ భూమిని అటవీయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు.

షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం (2006):

అడవుల్లో నివసించే షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ వాసులు నివసించే అటవీ ప్రాంతాలపై హక్కులను గుర్తిస్తుంది.

భారతీయ అటవీ చట్టం (1927)

* అడవులు, కలప, ఇతర అటవీ ఉత్పత్తులపై ఎంత సుంకాన్ని విధించాలనే అంశానికి సంబంధించిన చట్టాల్ని ఏకీకృతం చేస్తుంది. 

పబ్లిక్‌ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ యాక్ట్‌ (1991)

* ఏదైనా ప్రమాదకర పదార్థాన్ని నిర్వహించడం వల్ల దుర్ఘటనలు సంభవించినప్పుడు బాధితులకు నష్టపరిహారం అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు.   

జీవవైవిధ్య చట్టం (2002)


* 1992లో ఐక్యరాజ్యసమితి ‘కన్వెన్షన్‌ ఆన్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ’ పేరుతో జీవవైవిధ్య పరిరక్షణకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. వీటి సాధనకు భారత్‌ బయోలాజికల్‌ డైవర్సిటీ యాక్ట్‌ (జీవవైవిధ్య చట్టం)ను చేసింది.

చట్టంలోని ముఖ్యాంశాలు:

* రాష్ట్రాలు తమ సొంత జీవ వనరులను ఉపయోగించుకునే సార్వభౌమ హక్కులను గుర్తిస్తుంది.

* జీవ వనరులను పరిరక్షించడం, వాటిని స్థిరమైన పద్ధతిలో ఉపయోగించడం దీని ముఖ్య ఉద్దేశం.

* చట్టంలోని అంశాల అమలు కోసం ప్రభుత్వం నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీని  చెన్నైలో ఏర్పాటు చేసింది. 


కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నోటిఫికేషన్‌ 

* దీన్ని 2011, జనవరి 6న చేశారు. తీరప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార సంఘాలు, ఇతర స్థానిక వర్గాలకు జీవనోపాధితో కూడిన భద్రతను కల్పించడం; తీరప్రాంతాలను పరిరక్షించడం, స్థిరమైన పద్ధతిలో వాటి అభివృద్ధిని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు.  


పర్యావరణ రక్షణ - రాజ్యాంగ నిర్దేశం

* మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌  51A ప్రాథమిక విధులను నిర్వచిస్తుంది. అందులోని పార్ట్‌ IVA ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, అభివృద్ధి చేయడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి.

* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48A రాష్ట్ర విధానాల నిర్దేశక సూత్రాలను తెలుపుతుంది. అందులోని పార్ట్‌ IV పర్యావరణాన్ని రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, దేశంలోని అడవులు - వన్యప్రాణులను కాపాడటానికి రాష్ట్రాలు కృషి చేయాలని నిర్దేశిస్తుంది.


భారతదేశంలోని ముఖ్యమైన పర్యావరణ చట్టాలు

* మనదేశంలో 1970 నుంచి అనేక పర్యావరణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి.. 

* నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చట్టం (2010)  

* వాయు కాలుష్య నివారణ - నియంత్రణ చట్టం (1981) 

* నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం (1974) 

* పర్యావరణ పరిరక్షణ చట్టం (1986)  

* ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనలు


నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చట్టం 

* పర్యావరణ పరిరక్షణ, దానికి సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పరిష్కరించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. 

* పర్యావరణానికి సంబంధించిన ఏదైనా చట్టపరమైన హక్కును కాపాడటంలో ఇది సహకరిస్తుంది. 

* ఈ చట్టం 2010, జూన్‌ 2న భారత రాష్ట్రపతి ఆమోదం పొంది; 2010, అక్టోబరు 18 నుంచి అమల్లోకి వచ్చింది. 

* నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ చట్టం అమలు ఫలితంగా నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ట్రైబ్యునల్‌ చట్టం, 1995, నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అప్పిలేట్‌ అథారిటీ చట్టం, 1997లు రద్దయ్యాయి.


వాయు కాలుష్య నివారణ - నియంత్రణ చట్టం

* వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర - రాష్ట్ర స్థాయుల్లో వివిధ బోర్డులను ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 

* వాయు కాలుష్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (CPCB), స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (SPCB)లను ఏర్పాటు చేశారు. 

నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం

* దేశంలో నీటి సంపూర్ణతను కాపాడటం లేదా పునరుద్ధరించడం దీని ముఖ్య ఉద్దేశం. 

* నీటి కాలుష్య నివారణ, నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో వివిధ బోర్డులను ఏర్పాటు చేశారు. 

* ఈ చట్టం ప్రకారం నిర్ణీత ప్రమాణానికి మించి నీటి వనరుల్లోకి కాలుష్య కారకాలను విడుదల చేయకూడదు. దీన్ని పాటించని పక్షంలో ఆయా సంస్థలకు జరిమానాలు విధిస్తారు. 

* 1977లో నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) సెస్‌ చట్టం అమల్లోకి వచ్చింది. కొన్ని రకాల పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగించే నీటిపై సెస్‌ను విధించి, వాటిని వసూలు చేయడం కోసం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. 

* నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం, 1974 ప్రకారం ఏర్పడిన ఆయా బోర్డుల వనరులను పెంపొందించడానికి ప్రభుత్వం ఈ సెస్‌లను వసూలు చేస్తోంది. ఈ చట్టాన్ని చివరగా 2003లో సవరించారు. 


పర్యావరణ పరిరక్షణ చట్టం

* పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి కోసం దీన్ని నిర్దేశించారు. 

* ఇది పర్యావరణ భద్రత దీర్ఘకాలిక అవసరాలను అధ్యయనం చేసి, ప్రణాళికలు రచించి, అమలు చేస్తుంది; పర్యావరణానికి హాని కలిగించే పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రచిస్తుంది. 

* పర్యావరణ చట్టం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే పరిశ్రమలు, మనుషులు వాతావరణంలోకి కాలుష్య ఉద్గారాలను విడుదల చేయాలి. అంతకంటే ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తే సంబంధిత సంస్థ, వ్యక్తులపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. 

* పర్యావరణ నాణ్యతను పరిరక్షించడానికి, మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. 

* పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ; ప్రజారోగ్యం, వారి సంక్షేమానికి రక్షణ పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రధాన లక్ష్యాలు. 

* పర్యావరణ సున్నిత ప్రాంతాల రక్షణ కోసం కేంద్రం పర్యావరణ చట్టం ద్వారా నోటిఫికేషన్‌లను లేదా పర్యావరణ చట్టంలోని అంశాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 


ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు

ప్రమాదకర వ్యర్థాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి..

* ఫ్యాక్టరీల చట్టం, 1948  

* పబ్లిక్‌ లయబిలిటీ ఇన్సూరెన్స్‌ చట్టం, 1991  

* నేషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ట్రైబ్యునల్‌ చట్టం, 1995 

Posted Date : 08-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌