• facebook
  • whatsapp
  • telegram

విభక్తులు

* వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేవి విభక్తులు.

ఉదా: సీత తమ్ముడు కొట్టింది. (ఇది అర్థవంతం కానిది)

  సీత తమ్ముడిని కొట్టింది. (విభక్తి చేర్చినప్పుడు అర్థవంతమైంది)

* విభక్తి అంటే విభాగము అని అర్థం.

*  ఈ విభక్తులకే కారకాలు అని పేరు.

తెలుగులో విభక్తులు మొత్తం-8

1. ప్రథమా విభక్తి: డు, ము, వు, లు

*  ప్రాతిపదిక, ఉక్తార్థ, సంబోధనాంతంబు ప్రథమయగు

*  ప్రాతిపదిక అంటే నియత ఉపస్థితికం. ఒక పదాన్ని విన్న వెంటనే దాని అర్థం, పుట్టుక గుర్తుకురావడం.

ఉదా: ‘రామ’ అంటే దశరథుడి అగ్రతనయుడు అని, ‘రావణ’ అనగానే లంకాధిపతి అని గుర్తుకురావడం. ‘రామ’ అనే శబ్దం పుంలింగం కాబట్టి ‘డు’ అనే ప్రత్యయం చేరి రాముడు అనే పదం ఏర్పడింది.

‘వృక్ష’ కు ము చేరి - వృక్షము అవుతుంది. ఉకారాంత గో శబ్దానికి ‘వు’ చేరుతుంది.

ధేను - ధేనువు

ఉక్తార్థం అంటే వాక్యంలో క్రియ ఎవరిని సూచిస్తుందో వారిని ఉక్తార్థం అంటారు.

ఉదా: రాముడు రావణుడిని చంపెను.

ఉక్తార్థం            క్రియ

రాముని చేత చంపబడెను

ఉక్తార్థం            క్రియ

*  సంబోధనార్థం అంటే దూరంగా ఉండే వాళ్లని దగ్గరకు రమ్మని పిలవడం దీన్నే ‘ఆమంత్రణం’ అని పిలుస్తారు.

*  ఓ ఆమంత్రణంబునందగు

*  సంబోధన యందు విభక్తి దీర్ఘత్వమును పొందును.

ఉదా: ఓ రాముడు - ఓ రాముడా!


2. ద్వితీయా విభక్తి: నిన్, నున్, లన్, కూర్చి, గురించి కర్త్రర్థం నందు కర్మకు ద్వితీయమగు

ఉదా: దేవదత్తుడు వంటకమును వండును.


3. తృతీయా విభక్తి: చేతన్, చేన్, తోడన్, తోన్‌

*  కర్మార్థము నందు కర్తకు చేతయగు

ఉదా: వంటకము దేవత్తుని చే(త) వండబడింది.  కరణార్థ, సహార్థ, తుల్యార్థములకు తోడ యగు

*  కరణార్థం అంటే క్రియా సిద్ధికి ప్రకృష్ణ  ఉపకారకం. పని జరగడానికి మిక్కిలి  సహకరించే సాధనం.

ఉదా: ఆమె నోటితో మాట్లాడుతూ, నొసలుతో వెక్కిరిస్తుంది.

*  రాజు కుంచెతో బొమ్మకు రంగు వేస్తున్నాడు

*  సహార్థం అంటే కలిసి

ఉదా: రాజు సేనలతోడ వచ్చె

*  తుల్యార్థం అంటే సమానం.

ఉదా: ఏకలవ్యుండు అర్జునుడి తోడ ధానుష్కుండు. ఆధునిక కాలంలో మహిళలు పురుషుడి తోడ సమాన హక్కులు  అనుభవిస్తున్నారు.

*  ఉపయోగం నందు అఖ్యాతకు తోడయగు

*  ఉపయోగం అంటే నియమపూర్వక విద్యా స్వీకారం.

ఉదా: రామ కృష్ణులు సాందీపుడి తోడ విద్యనభ్యసించిరి.


4. చతుర్థీ విభక్తి: కొఱకున్‌ (కొరకు), కై

*  సంప్రదాన, ఉద్దేశాల యందు కొరకు యగు.

* సంప్రదానం అంటే త్యాగోద్దేశం.

*  ఎవరి కొరకు త్యాగం చేస్తారో వారినే సంప్రదానం అని పిలుస్తారు.

ఉదా: జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను.

*  ఉద్దేశం అంటే త్యాగ ప్రశస్తి లేనిది.

ఉదా: విద్యార్థి విద్య కొరకు అర్థించెను.


5. పంచమీ విభక్తి: వలనన్, కంటెన్, పట్టి

*  అపాదాన కారకములకు వలన యగు.

*  అపాదాన కారకములు అంటే - అపాయ, భయ, భవ అంతర్థి, త్రాణ, డస్సిపోవడం 

ఉదా: రాక్షసుల వలన మానవ జాతి ప్రమాదం పొందింది.

అగ్ని వలన భయం.

మనువు వలన మనిషి పుట్టే.

తల్లి వలన శిశువు రక్షణ పొందె.

పాడి వలన పరాకు పొందె.

* నిర్ధారణ పంచమికి కంటె యగు.

*  నిర్ధారణ అంటే వేరుచేయడం.

ఉదా: బాటసారులందరి కంటె పారువాడు బహు శీఘ్రంబు.

గోవులన్నింటి కంటె కపిలగోవు బహు క్షీరంబు.

*  హేత్యర్థ గుణ క్రియల యందు పట్టి యగు అంటే కారణాన్ని తెలిపే క్రియ గుణములకు పట్టి చేరుతుంది.

ఉదా: వచ్చుటంబట్టి ధన్యుడవగుదువు.

జ్ఞానాన్ని బట్టి సంపాదన ఉండును.


6. షష్ఠీ విభక్తి: కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్‌

*  శేష షష్ఠికి యొక్క యగు

*  శేషం అంటే సంబంధాలను తెలిపేది.

1. జన్యుజనక సంబంధం

ఉదా: వాయుపుత్రుడు - వాయువు యొక్క పుత్రుడు

2. కర్తృత్య సంబంధం

ఉదా: కాళిదాసు నాటకం - కాళిదాసు యొక్క నాటకం 

3. అంగాంగ సంబంధం

ఉదా: సీతముఖం - సీత యొక్క ముఖం

4. బంధు సంబంధం

ఉదా: సీత మరిది - సీత యొక్క మరిది


5. స్వస్వామి సంబంధం

ఉదా: ప్రభుత్వ భవనం - ప్రభుత్వం యొక్క భవనం

* నిర్ధారణ షష్ఠికి లోన్‌ లోపల యగు.

ఉదా: ఉపాధ్యాయులలో భాషోపాధ్యాయుడు పాఠశాలకు గుండెకాయ.

అందరిలో ఈమె గౌరవస్తురాలు,

తెలుగులో అత్యధికంగా వాడుకలో ఉండే విభక్తి - షష్ఠీ విభక్తి


7. సప్తమీ విభక్తి: 

* అధికరణం ‘యందు’ సప్తమి యగు.

* అధికరణం అంటే అర్థం ఆధారం.

అధికరణాలు 3. అవి: 1) ఔపశ్లేషికం    2) వైషయికం 3) అభివ్యాపకం

1. ఔపశ్లేషిక అధికరణం: ఒకరిపై ఒకరు ఆధారపడటం. ఉదా: ఘటమందు జలం ఉంది

2. వైషయిక అధికరణం: విషయ సంబంధమైన ఆధారం. ఉదా: మోక్షమందు ఇచ్ఛ కలదు.

3. అభివ్యాపకం: మొత్తం అని అర్థం.  ఉదా: అన్నిటి యందు ఈశ్వరుడు గలడు.


8. సంబోధన ప్రథమా విభక్తి: ఓ, ఓయీ, ఓరీ, ఓసీ అనేవి సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయములు

* ఓ అనే సంబోధన స్త్రీ, పురుషులిద్దరికీ ఉపయోగిస్తారు.

ఉదా: ఓ కృష్ణా!

        ఓ లక్ష్మీ!

* ఓయీ అనే సంబోధన పురుషులకు మాత్రమే ఉపయోగిస్తారు.

ఉదా: ఓయీ రావణా!

        ఓసీ నీచ స్త్రీలకు వాడతారు.

ఉదా: ఓసీ దుష్టురాలా!

        ఓరీ నీచ పురుషుడికి వాడతారు.

ఉదా: ఓరీ మూర్ఖుడా!

        ఓరీ, ఓసీ అనే పదాలను మిత్రత్వాన్ని తెలపడానికి కూడా ఉపయోగిస్తారు.

ఉదా: ఓసీ ముద్దుబాలా!

        ఓరీ చిన్ని కృష్ణ

అభ్యాస ప్రశ్నలు


1. ఆమె నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తుంది - ఈ వాక్యంలో ‘తో’ ఏ అర్థంలో ఉపయోగించారు. 

1) కరణార్థం     2) సహార్థం    3) తుల్యార్థం     4) కర్త్రర్థం

జ: కరణార్థం


2. ఆమంత్రణం అంటే 

1) ఉపస్థితికం     2) నియతం     3) సంబోధన     4)  ఔపశ్లేషికం

జ: సంబోధన


3. అన్నిటియందీశ్వరుండు గలడు - అనే వాక్యంలోని ఆధారం.

1) ఔపశ్లేషికం     2) వైషయికం    3) అభివ్యాపకం     4) ఉపయోగం

జ: అభివ్యాపకం


4. సంబంధాలను తెలిపే విభక్తి 

1) షష్ఠీ విభక్తి     2) ప్రథమా విభక్తి    3) సప్తమీ విభక్తి     4) చతుర్థీ విభక్తి

జ: షష్ఠీ విభక్తి 


5. సుబ్బారావుకు నలుగురు కూతుళ్లు - ఈ వాక్యంలో ‘కు’ అనే ప్రత్యయం బోధించే అర్థం

1) స్వామ్యార్థం     2) తుల్యార్థం    3) సహార్థం     4) సంబంధార్థం

జ: సంబంధార్థం


6. భక్తులు భగవంతుని పూజిస్తారు - ఈ వాక్యంలో ‘భగవంతుని’ అనేది ఏ కారకం?

1) కర్తృ కారకం   2) కర్మ కారకం   3) అపాదాన కారకం  4) కరణ కారకం

జ: కర్మ కారకం​​​​​​​


7. వలన, కంటె, పట్టి అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు?

1) ద్వితీయా విభక్తి  2) తృతీయా విభక్తి    3) పంచమీ విభక్తి   4) షష్ఠీ విభక్తి 

జ: పంచమీ విభక్తి​​​​​​​


8. కారకాలు ఎన్ని? 

1) రెండు      2) నాలుగు        3) ఆరు         4) ఎనిమిది

జ: ఆరు​​​​​​​


9. ప్రథమా విభక్తి ప్రత్యయంలో బహువచనాన్ని బోధించే ప్రత్యయం 

1) డు        2) ము       3) వు         4) లు

జ: లు
​​​​​​​

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌