• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ విభజన - సమస్యలు, సవాళ్లు

* 2014, జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చెంది, రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 

* ఆంధ్రప్రదేశ్‌ను ఇలా పునర్‌వ్యవస్థీకరించడానికి అనేక కారణాలున్నాయి.

* ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయి, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఉద్యమించారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. 

* కేంద్రం 1953, డిసెంబరు 29న సయ్యద్‌ ఫజల్‌ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్‌ (ఎస్‌ఆర్‌సీ)ను ఏర్పాటు చేసింది. అందులో కె.ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా ఉన్నారు.  

* ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారతదేశంలో ఎ, బి, సి, డి రాష్ట్రాలు రద్దయ్యి భాషా ప్రయుక్త రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 

* పెద్దమనుషుల ఒప్పందం ఫలితంగా 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. దీనికి హైదరాబాద్‌ను రాజధానిగా చేశారు. ఇది దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించింది. 

* దిల్లీలోని హైదరాబాద్‌ భవన్‌ (ప్రస్తుత ఆంధ్రాభవన్‌)లో కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్రా నాయకులు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, సర్దార్‌ గౌతులచ్చన్నలు సంతకాలు చేయగా; తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, జె.వి.నరసింగరావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి సంతకాలు చేశారు. 

* ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణవారికి 14 హామీలు కల్పించారు. అయితే అవి అమలు కాలేదు. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలూ చేపట్టలేదు. 

* వీటి కారణంగా 1968, 1969 సంవత్సరాల్లో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరుతూ ఉద్యమం మొదలైంది. 

* 1975 నుంచి తెలంగాణ ప్రజల్లో విభజన ఆకాంక్ష ఉంది.

* 2009లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.

శ్రీకృష్ణ కమిటీ

* ఈ కమిటీ 2010, ఫిబ్రవరి 3న ఏర్పాటైంది.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థితిగతులను పరిశీలిస్తూ, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్షను సమీక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించాలా? లేదా? అని నిర్ణయించడం శ్రీకృష్ణ కమిటీ ముఖ్య ఉద్దేశం.

కమిటీ ఛైర్మన్, సభ్యులు:

* ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌. శ్రీకృష్ణ ఛైర్మన్‌గా ఉన్నారు.

* మాజీ ఐఏఎస్‌ అధికారి వినోద్‌కుమార్‌ దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు.

సభ్యులు: ప్రొఫెసర్‌ రణ్‌బీర్‌సింగ్‌ (జాతీయ న్యాయ కళాశాల - దిల్లీ, వైస్‌ ఛాన్సలర్‌); డాక్టర్‌ అబుసలేషరీఫ్‌ (సీనియర్‌ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధన సంస్థ - దిల్లీ); ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ - సాంఘికశాస్త్ర విభాగం - ఐఐటీ దిల్లీ.

* 2010, డిసెంబరు 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కమిటీ నివేదికలోని ముఖ్యమైన సూచనలు:

* కేంద్రం జోక్యం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్యలను సవాలుగా తీసుకుని వివిధ వర్గాలకు ప్రభుత్వంలో చోటు కల్పిస్తూ, ఉద్యమ తీవ్రతను తగ్గిస్తూ విభజన జరగకుండా యథాతథ స్థితిని కొనసాగించడం.

* రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విడదీసి; హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. విడిపోయిన రెండు  రాష్ట్రాలకు సొంత రాజధానులను ఏర్పాటు చేయడం.

* రాష్ట్రాన్ని రాయల - తెలంగాణ, కోస్తాంధ్రగా విడదీయడం. హైదరాబాద్‌ను రాయల-తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగంగా ఉంచడం.

* రాష్ట్రాన్ని తెలంగాణ, సీమాంధ్రగా విడదీయడం. హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా చేసి,  సీమాంధ్రకు మరో కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. 

* రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, అదే సమయంలో తెలంగాణ ప్రాంత సామాజిక ఆర్థికాభివృద్ధికి, మరింత ఉన్నతికి కొన్ని రాజ్యాంగపరమైన/ చట్టబద్ధమైన చర్యలు చేపట్టడం. చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రక్రియ - ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటన: 

హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలతో తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లు 2013, జులై 30న సీడబ్ల్యూసీ ప్రకటించింది.

ఆంటోని కమిటీ: 

* అప్పటి కేంద్ర రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని అధ్యక్షుడిగా విభజన కమిటీ ఏర్పడింది. దిగ్విజయ్‌సింగ్, వీరప్పమొయిలీ, అహ్మద్‌పటేల్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. 

* ఇది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది.

కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం): 

* 2013, అక్టోబరు 8న అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర రక్షణశాఖ మంత్రి  ఎ.కె.ఆంటోని ఛైర్మన్‌గా,  కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్‌ షిండే (హోంశాఖ), చిదంబరం (ఆర్థికశాఖ), వీరప్పమొయిలీ (పెట్రోలియంశాఖ), జైరాంరమేష్‌ (గ్రామీణాభివృద్ధిశాఖ) గులాంనబీ ఆజాద్‌ (ఆరోగ్యశాఖ); ప్రత్యేక ఆహ్వానితుడిగా వి.నారాయణస్వామి సభ్యులుగా జీవోఎం ఏర్పడింది. 

* ఈ కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పార్టీలను కోరింది.

* భాజపా, కాంగ్రెస్, తెరాస, సీపీఐ, ఎంఐఎంలు తమ సూచనలతో కూడిన నివేదికను మంత్రుల బృందానికి  అందించాయి. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎంలు నివేదిక ఇవ్వలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో పునర్విభజన బిల్లు:

* 2013, డిసెంబరు 16న రాష్ట్ర శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు2013’పై చర్చ జరిగింది. 

* ఈ బిల్లును తిరస్కరించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసు ఆధారంగా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

* 2014, జనవరి 30న మూజువాణి ఓటుతో సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. 

* రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పంపిన బిల్లుపై శాసనసభ అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి. తిరస్కరించి వెనక్కి పంపే అధికారం, హక్కు దానికి లేదు. ఓటింగ్‌కు కూడా అవకాశం లేదు. 

* విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి ఇచ్చిన గడువు 2014, జనవరి 30న ముగిసింది.

* 2013, డిసెంబరు 16న పునర్విభజన బిల్లును శాసనసభలో చర్చకు పెట్టినట్లు, బిల్లులోని క్లాజులపై 9072 సవరణలు ప్రతిపాదించినట్లు, ఒక అధికారిక రికార్డును సభ అభిప్రాయంగా రాష్ట్రపతికి పంపారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బిల్లు: 

* పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

పార్లమెంట్‌లో పునర్విభజన బిల్లు

* 2014, ఫిబ్రవరి 14న హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 

* దీనిపై 2014, ఫిబ్రవరి 18న చర్చ జరిగింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు. 

* 2014, ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ‘బిల్‌ ఈజ్‌ పాస్‌డ్‌’ అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌ విభజన అంకం ముగిసింది. 

* 2014, మార్చి 1న ఈ విభజన బిల్లుపై భారత రాష్ట్రపతి సంతకం చేశారు. 

* 2014, జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌