• facebook
  • whatsapp
  • telegram

సంధులు

నిర్వచనం: చిన్నయసూరి తన బాల వ్యాకరణంలోని సంధి పరిచ్ఛేదనంలో సంధిని ఈ విధంగా నిర్వచించారు.
* పూర్వ, పర స్వరాలకు పర స్వరం ఏకాదేశమవడమే సంధి. 
సంధిలో రెండు పదాలు ఉంటాయి. 
1) పూర్వపదం 
2) పరపదం (ఉత్తర పదం)
* పూర్వపదం చివర ఉండే అచ్చును పూర్వస్వరం అని, పరపదం మొదట ఉండే అచ్చును పరస్వరం అని పిలుస్తారు.
* ఏకాదేశం అంటే రెండు అక్షరాలను తొలగించి ఒకే అక్షరం వచ్చి చేరడం (శత్రువు మాదిరి).
ఉదా: రాముడు + అతడు = రాముడతడు
* చిన్నయసూరి ప్రకారం సంధి అంటే అచ్చుకు, అచ్చుకు మధ్య మాత్రమే జరగుతుంది. కానీ సంధి మొత్తం నాలుగు రకాలుగా జరుగుతుందని వ్యాకరణ వేత్తలు పేర్కొన్నారు.
1) అచ్చు + అచ్చు 
2) అచ్చు + హల్లు 
3) హల్లు + హల్లు
4) హల్లు + అచ్చు
* తెలుగు భాష అజంత భాష. ఈ భాషలో రెండు పదాలను వెంటవెంటనే పలకడం కష్టం. ఆ కష్టాన్ని నివారించి భాషను సులభతరం చేయడానికి వచ్చిందే సంధి. రెండు అర్థవంతమైన పదాల మధ్య సంధి కూర్చడానికి పట్టే సమయం సంహిత కాలం. అంటే 1/2 మాత్రా సమయం కంటే తక్కువ కాలం.
 

సంధులు - రకాలు

తెలుగులో సంధులు ప్రధానంగా రెండు రకాలు
1) సంస్కృత సంధులు 
2) తెలుగు సంధులు 
సంస్కృత సంధులు: ఇవి రెండు రకాలు. 
ఎ) అచ్సంధులు
బి) హల్సంధులు
అచ్సంధులు: ఇవి నాలుగు రకాలు 
1) సవర్ణదీర్ఘ సంధి 
2) గుణసంధి 
3) వృద్ధిసంధి 
4) యణాదేశ సంధి
సవర్ణదీర్ఘ సంధి: అ, ఇ, ఉ, ఋలకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. 
వివరణ: సవర్ణం అంటే హ్రస్వం లేదా దీర్ఘం పరం కావడం.
ఉదా: అ - అ, ఆ; ఇ - ఇ, ఈ
ఏకాదేశం: రెండు అక్షరాలను తొలగించి దీర్ఘం రావడం.
ఉదా: విద్యాలయం = విద్యా + ఆలయం
విద్యార్థి = విద్యా + అర్థి
లతాంతము = లతా + అంతము
* సంస్కృతంలో స్త్రీ లింగ పదాలను విడగొట్టేటప్పుడు దీర్ఘంగా విడగొట్టాలి.
మహానందం = మహా + ఆనందం
మహీశ్వర = మహీ + ఈశ్వర
అనేకానేక = అనేక + అనేక
అజరామరం = అజర + అమరం
పుణ్యాంగన = పుణ్య + అంగన
క్షీరారామం = క్షీర + ఆరామం
దశావతారం = దశ + అవతారం
స్నిగ్ధాంబుద = స్నిగ్ధ + అంబుద
మునీశ్వర = ముని + ఈశ్వర
కపీంద్ర = కపి + ఇంద్ర
భానూదయం = భాను + ఉదయం
మధూదయం = మధు + ఉదయం
వధూపేతుడు = వధు + ఉపేతుడు
పితౄణం = పితృ + ఋణం
మాతౄణం = మాతృ + ఋణం
గుణసంధి: అకారానికి ఇ, ఉ, ఋలు పరమైనప్పుడు ఏ, ఓ, ఆర్‌లు ఏకాదేశమవుతాయి. 
వివరణ: అకారం అంటే పూర్వపదం చివర ‘అ’ లేదా ‘ఆ’ రావడం. ఇ, ఉ, ఋలు పరమవడం అంటే హ్రస్వం లేదా దీర్ఘం పరమవవచ్చు అని అర్థం.
ఇ, ఈ = ఏ
అ, ఆ + ఉ, ఊ = ఓ
ఋ, ౠ = ఆర్‌
* ఏ, ఓ, ఆర్‌లకే గుణాలు అని పేరు
ఉదా: ఇతరేతర = ఇతర + ఇతర
రాజేంద్ర = రాజ + ఇంద్ర
మహేంద్ర = మహా + ఇంద్ర
తిరుమలేశ = తిరుమల + ఈశ
వెంకటేశ = వెంకట + ఈశ
సర్వేశ్వర = సర్వ + ఈశ్వర
కౌరవేంద్ర = కౌరవ + ఇంద్ర
మహేశ్వర = మహా + ఈశ్వర
సూర్యోదయం = సూర్య + ఉదయం
వసంతోత్సవం = వసంత + ఉత్సవం
పుత్రోత్సాహం = పుత్ర + ఉత్సాహం
మహోన్మాదం = మహా + ఉన్మాదం
సర్వోన్నతి = సర్వ + ఉన్నతి
పరోపకారం = పర + ఉపకారం
మహోగ్ర = మహా + ఉగ్ర
మహోదధి = మహా + ఉదధి
రాజర్షి = రాజ + ఋషి
వర్షర్తువు = వర్ష + ఋతువు
గ్రీష్మర్తువు = గ్రీష్మ + ఋతువు
వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైనప్పుడు ఐ-కారం; ఓ, ఔలు పరమైనప్పుడు ఔ-కారం; ఋ, ౠలు పరమైనప్పుడు ఆర్‌ లు ఏకాదేశమవుతాయి.
ఏ, ఐ = ఐ
అ, ఆ + ఓ, ఔ = ఔ
ఋ, ౠ = ఆర్‌
* ఐ, ఔ, ఆర్‌ లకే వృద్ధులు అని పేరు.
ఉదా: ఏకైక = ఏక + ఏక
అష్టైశ్యర్యం = అష్ట + ఐశ్వర్యం
సురైక = సుర + ఏక
సమైక్య = సమ + ఐక్య
అఖండైశ్వరం = అఖండ + ఐశ్వర్యం
వనౌషధి = వన + ఓషధి
పాపౌఘము = పాప + ఓఘము
దివ్యౌషధము = దివ్య + ఔషధము
మహౌన్నత్యం = మహా + ఔన్నత్యం
ఋణార్ణం = ఋణ + ఋణం
దశార్ణం = దశ + ఋణం
* అకారానికి ఊహ, ఊహిని, ఈర, ఈరిణి అనే శబ్దాలు పరమైనప్పుడు ఊ స్థానంలో ‘ఔ’, ఈ స్థానంలో ‘ఐ’ ఆదేశమవుతాయి. 
ఆదేశం: శత్రువులా ఒక అక్షరాన్ని తొలగించి మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా: ప్రౌహ = ప్ర + ఊహ
ప్రౌఢ = ప్ర + ఊఢ
అక్షౌహిణి = అక్ష + ఊహిణి
స్వైర = స్వ + ఈర
స్వైరిణి = స్వ + ఈరిణి
యణాదేశ సంధి: ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా య, వ, ర లు ఆదేశమవుతాయి. ఇది ఆదేశ సంధి.
* అసవర్ణం అంటే ‘ఇ’ కి ఇ, ఈ లు కాకుండా వేరే అచ్చులు పరమవడం. ‘ఉ’ కి ఉ, ఊ లు కాకుండా వేరే అచ్చులు పరమవడం. ‘ఋ’ కి ఋ, ౠ లు కాకుండా వేరే అచ్చులు పరమవడం.
ఉదా: అత్యంత = అతి + అంత
అత్యానందం = అతి + ఆనందం
ప్రత్యక్షం = ప్రతి + అక్షం
ప్రత్యుత్తరం = ప్రతి + ఉత్తరం
అభ్యుదయం = అభి + ఉదయం
జయంత్యుత్సవం = జయంతి + ఉత్సవం
దద్యోధనం = దది + ఓధనం
వ్యాకరణం = వి + ఆకరణం
వ్యధికరణం = వి + అధికరణం
ప్రత్యేకం = ప్రతి + ఏకం
అత్యుగ్ర = అతి + ఉగ్ర
స్వాగతం = సు + ఆగతం
మధ్వరి = మధు + అరి
గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ
అన్వేషణ = అను + ఏషణ
అణ్వాయుధం = అణు + ఆయుధం
అణ్వస్త్రం = అణు + అస్త్రం
అణ్వింధనం = అణు + ఇంధనం

హల్సంధులు

అనునాసిక సంధి: క, చ, ట, త, ప లకు న, మ లు పరమైనప్పుడు తమ వర్గ అనునాసికాక్షరములు వికల్పంగా వస్తాయి. 
ఉదా: వాక్‌ + మయము = వాఙ్మయము 
అచ్‌ + మధ్యము = అఞ్మధ్యము
రాట్‌ + మూర్తి = రాణ్మూర్తి
జగత్‌ + నాటకము = జగన్నాటకము
అప్‌ + మయము = అమ్మయము
జశ్త్వసంధి: వర్గ ప్రథమాక్షరాలకు అచ్చులు లేదా హల్లులు లేదా వర్గ ద్వితీయ, తృతీయ, చతుర్థ్ధాక్షరములు లేదా హ, య, వ, ర లు పరమైనప్పుడు గ, జ, డ, ద, బ లు ఆదేశమవుతాయి. 
ఉదా: వాక్‌ + ఈశుడు = వాగీశుడు
అచ్‌ + అంతము = అజంతము
షట్‌ + అంగము = షడంగము
మృత్‌ + అంగము = మృదంగము
కకుప్‌ + అంతము = కకుబంతము
శ్చుత్వ సంధి: సకార తవర్గములకు శకార, చవర్గములు పరమైనప్పుడు శకార, చవర్గములు వస్తాయి. 
ఉదా: నిస్‌ + చింత = నిశ్చింత
సత్‌ + ఛాత్రుడు = సచ్ఛాత్రుడు
శరత్‌ + చంద్రికలు = శరచ్చంద్రికలు
జగత్‌ + జనని = జగజ్జనని

తెలుగు సంధులు

అత్వసంధి: అత్తునకు సంధియగు
ఉదా: చింత + ఆకు = చింతాకు
ఒక + ఒక = ఒకానొక 
మేన + అత్త = మేనత్త, మేనయత్త
నాయన + అమ్మ = నాయనమ్మ
ఇత్వసంధి: ఏమ్యాదులందలి యిత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఉదా: ఏమి + అంటివి = ఏమంటివి, ఏమియంటివి
ఇది + అంత = ఇదంత
అది + ఏది = అదేది
మరి + ఏమి = మరేమి
ఉత్వసంధి: ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధియగు.
ఉదా: ఎవరు + అయినా = ఎవరయినా
బాలుడు + అతడు = బాలుడతడు
కోడలు + అయితి = కోదలయితి
యడాగమ సంధి: సంధి లేని చోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా: మా + అమ్మ = మాయమ్మ
మా + ఇల్లు = మాయిల్లు
టుగాగమ సంధి: కర్మధారయములందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబగు.
ఉదా: నిలువు + అద్దము = నిలువుటద్దము
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు
రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమంబగు.
ఉదా: పేద + ఆలు = పేదరాలు
బీద + ఆలు = బీదరాలు
ముద్ద + ఆలు = ముద్దరాలు
మనుమ + ఆలు = మనుమరాలు
బాలెంత + ఆలు = బాలెంతరాలు
* కర్మధారయము నందు తత్సములకు ఆలు శబ్దము పరమైనప్పుడు అత్వమునకు ఉత్వము రుగాగమంబగు.
ఉదా: ధీర + ఆలు = ధీరురాలు
గుణవంత + ఆలు = గుణవంతురాలు
విద్యావంత + ఆలు = విద్యావంతురాలు
ధనవంత + ఆలు = ధనవంతురాలు
దుగాగమ సంధి: నీ, నా, తన శబ్దాలకు ఉత్తర పదంబు పరమైనప్పుడు దుగాగమము విభాషనగు.
ఉదా: నీ + మాట = నీదుమాట
నా + మనసు = నాదు మనసు
తన + విభుడు = తనదు విభుడు
గసడదవాదేశ సంధి: ప్రథమ మీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.
ఉదా: వాడు + టక్కరి = వాడు డక్కరి
కొలువు + చేసి = కొలువుసేసి
నిజము + తెలిసి = నిజము దెలిసి
ఏమి + చేయుదు = ఏమి సేయుదు
* ద్వంద్వంబునం బదంబు మీది పరుషులకు గసడదవలగు.
ఉదా: అన్న + తమ్ముడు = అన్నదమ్ములు
కూర + కాయ = కూరగాయలు
తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
ఊరు + పల్లె = ఊరువల్లెలు
పుంప్వాదేశ సంధి: కర్మధారయము నందు మువర్ణమునకు పుంపులగు.
ఉదా: సరసము + మాట = సరసపు మాట
నీలము + కండ్లు = నీలపు గండ్లు
ముత్తెము + సరులు = ముత్తెపు సరులు
లులనల సంధి: లులనలు పరమైనప్పుడు ఒకానొకచో మువర్ణంబునకు లోపంబును, దాని పూర్వ స్వరమునకు దీర్ఘమును విభాషనగు.
ఉదా: ముత్యము + లు = ముత్యాలు
బలపము + లు = బలపాలు
పుస్తకము + లు = పుస్తకాలు
త్రిక సంధి: బీ ఆ, ఈ, ఏలు అనే సర్వనామాలకు త్రికమని పేరు.
* తిక్రం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
* ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్గానికి హ్రస్వం వస్తుంది.
ఉదా: ఆ + చోటు = అచ్చోటు
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు = ఎవ్వాడు
ప్రాతాది సంధి: సమాసంబు లంబ్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
ఉదా: పూవు + రెమ్మ = పూరెమ్మ
కెంపు + తామర = కెందామర
మీదు + కడ = మీఁగడ
నుగాగమ సంధి: ఉదంత తద్ధర్మార్థక విశేషణాలకు అచ్చు పరమైనప్పుడు నుగాగమంబగు.
ఉదా: చేయు + అతడు = చేయునతడు
వచ్చు + అపుడు = వచ్చునపుడు
పడ్వాది సంధి: పడ్వాదులు పరమైనప్పుడు ‘ము’ వర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషనగు.
ఉదా: భయము + పడు = భయపడు
ఆశ్చర్యము + పడు = ఆశ్చర్యపడు
ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితము పరమైనప్పుడు తఱచుగ నగు.
ఉదా: ఆహా + ఆహా = ఆహాహా
ఓహో + ఓహో = ఓహోహో
ఔర + ఔర = ఔరౌర

************

* సంధి అంటే కలయిక. పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమవడాన్ని సంధి అంటారు.

* సంధిలో రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వ పదం అని, రెండో దాన్ని పర పదం అని అంటారు.

* భాష ఆధారంగా సంధులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. సంస్కృత సంధులు 

2. తెలుగు సంధులు

సంస్కృత సంధులు - ఉదాహరణ

సవర్ణ దీర్ఘ సంధి: ‘అ-ఇ-ఉ-ఋ’లకు సవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఉదా: విద్యార్థి

గుణ సంధి: అకారానికి ‘ఇ-ఉ-ఋ’లు పరమైనప్పుడు క్రమంగా ఏ-ఓ-అర్‌లు ఏకాదేశం అవుతాయి. ఉదా: అరుణోదయం

యణాదేశ సంధి: ‘ఇ-ఉ-ఋ’లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు క్రమంగా యవరలు ఆదేశం అవుతాయి. ఉదా: అత్యాశ

వృద్ధి సంధి: అకారానికి ‘ఏ-ఐ’లు పరమైతే ‘ఐ’కారం, ‘ఓ-ఔ’లు పరమైతే ఔ కారం ఏకాదేశమవుతాయి. ఉదా: ఏకైక

సంస్కృత హల్సంధులు - ఉదాహరణ

అనునాసిక సంధి: ‘క-చ-ట-త-ప’లకు ‘న-మ’ అనునాసికాక్షరాలు పరమైతే ఆ వర్గానికి చెందిన అనునాసికాక్షరాలే వికల్పంగా వస్తాయి. ఉదా: వాజ్మయం

శ్చుత్వ సంధి: సకార తవర్గాలకు - శ వర్ణ చవర్గాలు పరమైతే శ వర్ణ చవర్గాలు వస్తాయి. ఉదా: సజ్జనులు

జశ్త్వ సంధి: పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, ‘శ, ష, స’లు తప్ప మిగిలిన హల్లులు లేదా అచ్చులు పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి. ఉదా: వాగీశుడు

తెలుగు సంధులు - ఉదాహరణ

అత్త్వ సంధి: అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. ఉదా: పెద్దన్న

ఇత్త్వ సంధి: ఏమ్యాదులందలి యిత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది. ఉదా: ఏమంటివి

ఉత్త్వ సంధి: ఉత్తునకు అచ్చు పరమైతే సంధి అవుతుంది. ఉదా: రాజెక్కడ

ఆమ్రేడిత సంధి: అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఉదా: ఆహాహా

గసడదవాదేశ సంధి: ప్రథమ మీది పరుషలకు గసడదవలు బహుళంగా వస్తాయి. ఉదా: ఏమిసేయుదు

ద్విరుక్త టకార సంధి: కురు-చిరు-నడు-నిడు శబ్దాల్లో ర-డలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్తటకారం అవుతుంది. 

ఉదా: చిట్టెలుక

పుంప్వాదేశ సంధి: కర్మధారయంలో మువర్ణకానికి పు-ంపులు వస్తాయి. ఉదా: సరసపు వచనం

రుగాగగమ సంధి: పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమయ్యేటప్పుడు రుగాగమం అవుతుంది.

ఉదా: బాలింతరాలు

టుగాగమ సంధి: కర్మధారయంలో ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమం వస్తుంది. 

ఉదా: నిగ్గుటద్దం

ప్రాతాది సంధి: సమానంబుల ప్రాతాదుల మొదటి అచ్చు మీది వర్ణంబులకెల్లా లోపం బహుళంగా వస్తుంది.

ఉదా: పూరెమ్మ

లులనల సంధి: లులనలు పరమైనప్పుడు ఒక్కొక్కసారి ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి. 

ఉదా: పుస్తకాలు


సంస్కృత సంధులు

* రెండు సంస్కృత పదాల మధ్య జరిగే సంధులను సంస్కృత సంధులు అంటారు. ఇవి రెండు రకాలు. అచ్సంధులు, హల్సంధులు.

సంస్కృత అచ్సంధులు: సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి.

సంస్కృత హల్సంధులు: అనునాసిక సంధి, జశ్త్వ సంధి, శ్చుత్వ సంధి, ఛత్వ సంధి, ష్టుత్వ సంధి, విసర్గ సంధులు.

* సంస్కృత అచ్సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి అనే నాలుగు ఏకాదేశ సంధులు అయితే; యణాదేశ సంధి ఆదేశ సంధి అవుతుంది.


తెలుగు సంధులు

* ఇవి రెండు రకాలు అవి: అచ్సంధులు, హల్సంధులు 

* తెలుగులో అచ్సంధులు: అత్త్వ సంధి, ఉత్త్వ సంధి, ఇత్త్వ సంధి, ఆమ్రేడిత సంధి.

* తెలుగులో హల్సంధులు: ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఇతర సంధులు.

* యడాగమ, రుగాగమ, టుగాగమ, దుగాగమ, నుగాగమ మొదలైనవి ఆగమ సంధులు.

* గసడదవాదేశ సంధి, పుంప్వాదేశ సంధి , సరళాదేశ సంధి మొదలైనవి ఆదేశ సంధులు.

* లులనల సంధి, త్రిక సంధి, ప్రాతాది సంధి, ద్విరుక్త - టకారాది సంధులను ఇతర సంధులుగా పేర్కొంటారు.

రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 09-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌