• facebook
  • whatsapp
  • telegram

సంఘ సంస్కరణ - సాంస్కృతిక వికాసం

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877 - 1923):

* ఈయన 1877, మే 18న కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జన్మించారు. తల్లిదండ్రులు గంగమ్మ, వెంకట సుబ్బయ్య.

* భువనగిరిలో ప్రాథమిక విద్యను, నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర)లో ఉన్నత విద్యను అభ్యసించారు.

* తెలుగు, మరాఠీ, ఆంగ్లం, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యాన్ని సాధించారు.

* మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానంలో ఉద్యోగం చేస్తూ సాహితీ వ్యాసాôగాన్ని కొనసాగించారు.

* రామాయణంలోని పర్ణశాల మహారాష్ట్రలోని నాసికాత్రయంబకం వద్ద ఉందని బాలగంగాధర్‌ తిలక్‌ చెప్పగా, దాంతో లక్ష్మణరావు విభేదించారు. ఆ పర్ణశాల గోదావరి సమీప ప్రాంతంలో ఉందని నిరూపించారు. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.

* తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని రచించారు. ఉత్తమ విజ్ఞానవేత్తగా, రచయితగా, చరిత్రకారుడిగా, సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా, బహుభాషా కోవిదుడిగా పేరొందారు.

1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయం, 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.

* మహారాష్ట్రలో సమాచార్, విజ్ఞాన విస్తార్‌ అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. మహారాష్ట్ర కవి మెరోపంత్‌ రాసిన భారతాన్ని సరిదిద్దారు. కర్ణ పర్వానికి శుద్ధిప్రతిని తయారుచేసి సంపాదకత్వం వహించారు.

తన సోదరి బండారు అచ్చమాంబతో కలిసి స్త్రీ విద్యావ్యాప్తి, సంఘ సంస్కరణ, సాహిత్యాభివృద్ధిపై తెలుగు జనానా పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. ఈ పత్రికను రాయసం వెంకటశివుడు నడిపారు.

* లక్ష్మణరావు రాసిన తొలి తెలుగు గ్రంథం శివాజీ చరిత్రం.

* హిందూ మహాయుగం - క్రీ.శ.1000, ముస్లిం మహాయుగం - క్రీ.శ.1100 - క్రీ.శ.1560 లాంటి వ్యాసాలు రాశారు. ఇవి లక్ష్మణరాయ వ్యాసావళి పేరుతో ప్రచురితమయ్యాయి.

విజ్ఞాన చంద్రికా మండలి 

తెలుగులో అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని, చరిత్ర పరిశోధన, ప్రకృతిశాస్త్ర, చారిత్రక, రాజకీయ ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం దీని లక్ష్యం.

* దీన్ని 1906లో హైదరాబాద్‌లో స్థాపించారు.

స్థాపకులు కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు మొదలైనవారు.

* విజ్ఞానచంద్రికా మండలి ప్రచురించిన మొదటి పుస్తకం ‘అబ్రహం లింకన్‌ చరిత్ర’.

* దీన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు రచించగా, తొలిపలుకు లక్ష్మణరావు రాశారు.

* లక్ష్మణరావు రచనలైన మహా పురుషుల జీవిత చరిత్రలు, రావిచెట్టు రంగారావు జీవిత చరిత్రను ఈ మండలే ప్రచురించింది.

* 1906 - 10 మధ్య కాలంలో ఈ మండలి 30కి పైగా గ్రంథాలను ప్రచురించింది. ఇందులో లక్ష్మణరావు కీలకపాత్ర పోషించారు.

* 1908లో ఈ సంస్థను హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌కు మార్చారు. 1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్‌ను స్థాపించారు.

* గ్రంథ పఠనాన్ని పెంపొందించడం, సాహిత్యం, చరిత్ర, ప్రకృతి శాస్త్రం లాంటి రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా ఈ పరిషత్‌ పనిచేసింది. 

* 1916లో కొవ్వూరులో ‘ఆంధ్రసారస్వత పరిషత్తు’ను ఏర్పాటు చేశారు. దీని స్థాపకుల్లో లక్ష్మణరావు ఒకరు. ఈయన ఇందులో సభ్యుడిగా, కార్యదర్శిగా సేవలు అందించారు.

ఆంధ్రా విజ్ఞాన సర్వస్వం:

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ఆద్యుడు. ఈయన 1912 - 13లో ఈ గ్రంథ రచనకు పూనుకొని రచయితగా, ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. అనేక ప్రతులను, పుస్తకాలను చదివి ‘అ’కారంతో మూడు సంపుటాలను ప్రచురించారు. ఇందులో 100 వ్యాసాలు ఉన్నాయి. వీటిలో 40 వ్యాసాలను లక్ష్మణరావు రచించారు. ఈయన 1923, జులై 12న కందుకూరి వీరేశలింగం చనిపోయిన ఇంట్లోనే మరణించారు. 

* లక్ష్మణరావు తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు, డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి విషయానుక్రమంగా సంపుటాలు ప్రచురించారు. ‘‘తెలుగు భాషా సమితి’’ ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. మొత్తం 14 సంపుటాలు ప్రచురితం అయ్యాయి. 

* 1938 - 41 మధ్యకాలంలో ‘ఆంధ్రా విజ్ఞానం’ పేరుతో 5 సంపుటాలను ప్రచురించారు. ఇది 1986లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం అయ్యింది.

సంఘసంస్కరణ - స్వాతంత్య్రోద్యమం:

లక్ష్మణరావు భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతు తెలిపి, 1906లో కలకత్తా కాంగ్రెస్‌ సభలో పాల్గొన్నారు. 1907లో కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ మహాసభ ఆహ్వాన కార్యదర్శిగా పనిచేశారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంటరానితనం, అసమానతల నివారణకు కృషి చేశారు. సముద్రయానం లాంటి వాటిని ప్రోత్సహించారు.

* హరిజనులకు వయోజన విద్యను బోధించారు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం తన సోదరి అచ్చమాంబతో కలసి అనేక వ్యాసాలు రాశారు, ప్రసంగాలు చేశారు.

* బాలబాలికలకు ప్రాథమిక విద్యను మాతృ భాషలోనే బోధించాలని తెలిపారు. ‘దేశ భాషల్లో శాస్త్రపఠనం’ అనే వ్యాసాన్ని ప్రచురించి వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ ఈయన రచనల్లో గ్రాంథిక భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

* లక్ష్మణరావు కృషి వల్లే తెలంగాణ ప్రాంతంలో తెలుగుభాషా వికాసానికి పునాదులు పడ్డాయి. ఈయన ఎన్నో కొత్త పరిభాషా పదాలను తెలుగులో వాడారు.

* విజ్ఞాన సర్వస్వం మొదట తెలుగులోనే ప్రారంభం కాగా, తర్వాత ఇతర భాషలకు విస్తరించింది.

* ప్రభుత్వం 2014లో కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్‌ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు భాషకు విశేష సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.

కొండా వెంకటప్పయ్య (1866-1949):

* వెంకటప్పయ్య 1886, ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రత్యేక ఆంధ్రోద్యమానికి ఆద్యుడు. గుంటూరు, మద్రాస్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

* 1902లో వాసు నారాయణరావుతో కలసి ‘కృష్ణాపత్రిక’ ప్రచురణను ప్రారంభించి, 1905 వరకు నడిపారు. తర్వాత ఈ పత్రిక సంపాదకత్వాన్ని ‘ముట్నూరు కృష్ణారావు’కు అప్పగించారు.

* 1910లో బందరులో జాతీయ కళాశాలను ప్రారంభించారు.

* ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటును మొదటగా ప్రతిపాదించారు.

* ఆంధ్రాలో గాంధీజీ పర్యటన కొండా వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది.

* పెదనందిపాడులో సహాయ నిరాకరణ, పన్నుల ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.

* 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభల్లో వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. వీరు స్వల్పకాలం మాత్రమే ఈ పదవుల్లో ఉన్నారు. 

* 1933లో గాంధీజీ ఆంధ్రాలో హరిజన యాత్ర సాగించారు. కొండా వెంకటప్పయ్య అనేక వేల రూపాయిలు విరాళాలుగా సేకరించి వాటిని హరిజన నిధికి ఇచ్చారు. 

* వెంకటప్పయ్య ఆంధ్రాలో మొదటి నియంతగా పేరు పొందారు.

* 1929 సైమన్‌ కమిషన్‌ రాక, 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలుకెళ్లారు. ‘దేశభక్త’ అనే బిరుదు పొందారు.

* గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. కులవివక్షను ఖండించారు.

* ‘డచ్‌ రిపబ్లిక్‌’ అనే గ్రంథాన్ని రాశారు. ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే మరో గ్రంథాన్ని రచించారు. ‘శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి’ అనే భక్తి శతకాన్ని రచించారు. స్వీయ చరిత్రను రాసుకున్నారు. 

* 1949, ఆగస్టు 15న మరణించారు.

త్రిపురనేని రామస్వామి చౌదరి (1887-1943):

త్రిపురనేని రామస్వామి చౌదరి న్యాయవాది, హేతువాది, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, కవి, సాహితీవేత్త, మానవతావాదిగా గుర్తింపు పొందారు.

* 1887, జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జన్మించారు.

* కారెంపూడి కథనం, కురుక్షేత్ర సంగ్రామం అనే నాటికలను రచించారు.

* తెనాలిలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. సామాజిక అన్యాయాలను, అరాచకాలను ప్రశ్నించి, సాంఘిక విప్లవాలకు నాంది పలికారు. 

* రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రనడే, దయానంద సరస్వతి భావాలను, వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌కి వెళ్లి న్యాయ శాస్త్రం, ఆంగ్లంపై పట్టు సాధించారు. 

* స్మృతులు, పురాణాలు, మతం, కుల వ్యవస్థ, సామాజిక అన్యాయాలపై ఉద్యమించారు. యజ్ఞ యాగాదులు, కర్మకాండలను ఖండించారు.

* 1925లో జస్టిస్‌ పార్టీ నుంచి పోటీ చేసి తెనాలి పురపాలక సంఘం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

తన నివాసాన్ని (సూతాశ్రమం) రాజకీయ, సాహిత్య చర్చలకు వేదికగా మార్చారు. దీన్ని 1945లో ఎం.ఎన్‌.రాయ్‌ సందర్శించారు.

* అనేక వివాహాలకు స్వయంగా పౌరోహిత్యం వహించారు. సంస్కృతంలోని పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించారు. అచ్చులో సరళమైన ‘వివాహవిధి’ అనే పద్ధతిని రూపొందించారు.

* 1930లో కుప్పుస్వామి శతకాన్ని రచించారు. అదే ఏడాది శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ‘వీరగంధం తెచ్చినారము వీరులెవ్వరో తెలుపుడీ’ అనే ప్రముఖ గీతాన్ని రాశారు.

* సాహిత్యానికి ఈయన చేసిన కృషికి ఆంధ్ర మహాసభ ‘కవిరాజు’ బిరుదుతో సత్కరించింది.

* పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఈయన పేరిట ‘కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి’ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. 

* 1987లో భారత ప్రభుత్వం ఈయన స్మారక చిహ్నంగా ‘తపాలా బిళ్ల’ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

* ఈయన సూత పురాణం, శంభుకవధ, సూతాశ్రమ గీతాలు, భగవద్గీత, రాణాప్రతాప్, ఖూనీ, గోపాలరాయ శతకం, కొండవీటి పతనం, పల్నాటి పౌరుషం, వివాహవిధి మొదలైన రచనలు చేశారు.

* 1943, జనవరి 16న మరణించారు.

* ఈయన పెద్ద కుమారుడు త్రిపురనేని గోపిచంద్‌ ‘అసమర్థుడి జీవయాత్ర’ అనే నవలను రాశారు. ఇది తెలుగులో మొదటి మనస్తత్వ నవల. ఇది తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసింది.

శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయం:

తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు 1901, సెప్టెంబరు 1న దీన్ని స్థాపించారు. దీన్ని కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి కలసి హైదరాబాద్‌లో అప్పటి రెసిడెన్సీ బజార్‌లోని రావిచెట్టు రంగారావు నివాసంలో ఏర్పాటు చేశారు. 

* తెలుగు భాషాభివృద్ధికి అధునాతన పద్ధతుల్లో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం ఇదే. 

* దీనికి ఆదిరాజు వీరభద్రరావు లాంటివారు కార్యదర్శులుగా పనిచేశారు.

ఆంధ్ర పరిశోధక మండలి:

దీన్ని 1922, డిసెంబరు 27న హైదరాబాద్‌లో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను, అముద్రిత గ్రంథాలను ప్రచురించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఈ సంస్థ పేరును ‘లక్ష్మణరాయ పరిశోధక మండలి’గా మార్చారు. 

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌