• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014: ముఖ్యాంశాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించి తర్వాతి పరిణామాలైన పరిపాలన, ఆర్థిక, న్యాయపరమైన అంశాలు మొదలైన వాటి గురించి రూపొందించిందే ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014. ఇందులో మొత్తం 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్లు ఉన్నాయి.

I వ భాగం

ఇందులో రెండు సెక్షన్లు ఉన్నాయి.

సెక్షన్‌ 1: ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 అని పేర్కొంటారు.

సెక్షన్‌ 2: ఎ) అపాయింటెడ్‌ డే బి) అర్టికల్స్‌ సి) అసెంబ్లీ డి) ఎన్నికల కమిషన్‌ ఇ) ప్రస్తుత రాష్ట్రం ఎఫ్‌) లా (చట్టం) జి) నోటిఫై చేసిన ఉత్తర్వు హెచ్‌) జనాభా నిష్పత్తి ఐ) సిట్టింగ్‌ మెంబర్‌ జె) సక్సెసర్‌ రాష్ట్రం, ఏర్పడిన రాష్ట్రం కె) బదిలీ అయిన ప్రదేశాలు ఎల్‌) ట్రెజరీ ఎం) ఏపీలోని జిల్లా, మండలం, తహసీల్, తాలుకా లేదా ఇతర ప్రాదేశిక భాగం పదాలకు సహేతుకమైన, సమగ్రమైన నిర్వచనాలను ఇచ్చారు.

IIవ భాగం - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర, పునర్‌వ్యవస్థీకరణ  

ఇందులో 3 నుంచి 11 వరకు మొత్తం 9 సెక్షన్లను పొందుపరిచారు.

సెక్షన్‌ 3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం (5 మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలంలోని కొన్ని ప్రాంతాలు, బూర్గంపాడులోని ప్రాంతాలను తెలంగాణా నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు), హైదరాబాద్‌ జిల్లాలతో కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది.

సెక్షన్‌ 4: సెక్షన్‌ 3లోని జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్‌ ఉంటుంది.

సెక్షన్‌ 5: అవతరణ రోజు నుంచి పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. గడువు ముగిశాక హైదరాబాద్‌ తెలంగాణకు; ఆంధ్రాకు మరో కొత్త రాజధాని ఉంటుంది.

సెక్షన్‌ 6: నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటు కోసం వినూత్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి నిపుణుల సంఘాన్ని నియమించాలి. ఈ సంఘం చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా రాజధాని ప్రత్యామ్నాయాలపై తగిన సూచనలు చేయాలి.

సెక్షన్‌ 7: రాష్ట్రపతి నిర్దేశించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉన్న వ్యక్తే కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉంటారు. అవతరణ రోజు నుంచి ఇది మొదలవుతుంది.

సెక్షన్‌ 8: అవతరణ రోజు నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంత పరిపాలనా అవసరాల కోసం ఆ ప్రదేశంలో ఉండే ప్రజల ప్రాణాలు, స్వాతంత్య్రం, ఆస్తుల రక్షణ కోసం గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. అవి ముఖ్యంగా శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలక సంస్థల భద్రత, ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపు - నిర్వహణ అంశాలకు వర్తిస్తాయి. వీటి నిర్వహణలో గవర్నర్‌ విచక్షణే తుది నిర్ణయం అవుతుంది. ఈ బాధ్యతల నిర్వహణ కోసం కేంద్రం గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది.

సెక్షన్‌ 9: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అదనపు పోలీసు బలగాలను సేకరించడానికి కేంద్రం సహకరించాలి. అపాయింటెడ్‌ డే నుంచి కేంద్రం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రాన్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి శిక్షణా కేంద్రంగా నిర్వహిస్తూ మూడేళ్లు కొనసాగిస్తుంది. తర్వాత దీన్ని తెలంగాణ శిక్షణా కేంద్రంగా పరిగణిస్తారు. ఇలాంటి అత్యాధునిక కేంద్రాన్నే నూతన ఆంధ్రప్రదేశ్‌లో ఆ రాష్ట్రం నిర్ణయించిన చోట ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరిస్తుంది.

సెక్షన్‌ 10: భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ఉండే రాష్ట్రాల శీర్షికను సవరించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 3లో పేర్కొన్న ప్రదేశాలను చేర్చాలి.

సెక్షన్‌ 11: అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తమతమ రాష్ట్రాల్లోని జిల్లా, ప్రదేశం సరిహద్దులను మార్చుకునే అధికారం ఉంటుంది.

IIIవ భాగం

ఇందులో 12 నుంచి 29 వరకు మొత్తం 18 సెక్షన్లు ఉన్నాయి.

సెక్షన్‌ 12: భారత రాజ్యాంగంలోని నాలుగో షెడ్యూల్‌ రాజ్యసభలోని సీట్ల కేటాయింపును తెలుపుతుంది. అపాయింటెడ్‌ డే తర్వాత ఈ షెడ్యూల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 18 సీట్లకు బదులు 11 అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్‌ తర్వాత తెలంగాణను చేర్చి దానికి 7 సీట్లను కేటాయించాలి.

సెక్షన్‌ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది సభ్యులను అవతరణ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించిన స్థానాలకు ప్రతినిధులుగా పరిగణిస్తారు. అయితే సభ్యుల సభ్యత్వ కాలంలో మార్పు ఉండదు.

సెక్షన్‌ 14: అవతరణ రోజు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్‌సభ స్థానాల నుంచి తెలంగాణకు 17 స్థానాలు కేటాయించాలి.

సెక్షన్‌ 15: అవతరణ రోజు నుంచి ఈ విభజన చట్టంలో పేర్కొన్న, సవరించిన డీ లిమిటేషన్‌ ఆర్డర్‌-2008 ప్రకారం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహించవచ్చు.

సెక్షన్‌ 16: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులను అవతరణ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయించిన స్థానాలకు ప్రతినిధులుగా పరిగణిస్తారు. ఈ సభ్యుల సభ్యత్వ కాలం మారదు.

సెక్షన్‌ 17: అవతరణ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 175 శాసనసభ స్థానాలు, తెలంగాణకు 119 శాసనసభ స్థానాలు ఉంటాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలో 25వ క్రమసంఖ్యలో తెలంగాణను చేర్చాలి.

సెక్షన్‌ 18: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 333 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలకు ఒక్కొక్కరి చొప్పున ఆంగ్లో-ఇండియన్‌లను ప్రతినిధిగా నియమించవచ్చు.

సెక్షన్‌ 19: సెక్షన్‌ 17 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని ప్రతి సభ్యుడిని అవతరణ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యుడిగా కాకుండా, తెలంగాణకు కేటాయించిన స్థానాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యుడిగా పరిగణిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర శాసనసభ్యులంతా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యులుగా కొనసాగుతారు. అపాయింటెడ్‌ డే నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభలు చట్టబద్ధంగా ఏర్పడినట్లు పరిగణిస్తారు.

సెక్షన్‌ 20: భారత రాజ్యాంగం ప్రకరణ 172(1)లో పేర్కొన్న అయిదేళ్ల పదవీకాలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ వాస్తవంగా ఎన్నికై ఏర్పడిన నాటి నుంచే ఏర్పడినట్లుగా పరిగణిస్తారు.

సెక్షన్‌ 21: అవతరణ రోజు ముందు రోజు ఏ వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌గా ఉన్నారో వారే తర్వాత కూడా ఏపీ స్పీకర్‌గా కొనసాగుతారు. శాసనసభలోని సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి తెలంగాణ శాసనసభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ఆ రాష్ట్ర స్పీకర్‌గా బాధ్యతలను నిర్వహిస్తారు.

సెక్షన్‌ 22: భారత రాజ్యాంగ ప్రకరణ 169 ప్రకారం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు 50 మంది సభ్యులకు మించకుండా, తెలంగాణకు 40 మంది సభ్యులు మించకుండా రెండు రాష్ట్రాలకు విధాన మండళ్లను ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధాన మండలిలోని సభ్యులను రెండు రాష్ట్రాల మండళ్లకు కేటాయిస్తారు. 

సెక్షన్‌ 23: కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లో విధాన మండళ్ల ఏర్పాటు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని, రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను సవరించాలి. నాలుగో షెడ్యూల్‌లో తమిళనాడు శీర్షిక కింద 25వ స్థానంలో తెలంగాణను చేర్చాలి. అక్షర క్రమం ప్రకారం చేర్చడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ స్థానం మారదు. 

సెక్షన్‌ 24: మండలి నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను సంప్రదించాక అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్‌ను ప్రచురించి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని మూడో షెడ్యూల్‌ను సవరించాలి.

సెక్షన్‌ 25: అవతరణ రోజు ముందు రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విధాన మండలి ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తే ఆ తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌ విధాన మండలికి ఛైర్మన్‌గా కొనసాగుతారు. మండలిలోని సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఈయనే తెలంగాణ విధాన మండలికి కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకునే వరకూ దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

సెక్షన్‌ 26: రాజ్యాంగంలోని 170వ ప్రకరణలోని నియమాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 15 నియమాలకు భంగం కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ విధాన సభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలి. 

సెక్షన్‌ 27: డీలిమిటేషన్‌ ఆర్డర్‌ను ఆధునికీకరించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారాలు ఉంటాయి.

సెక్షన్‌ 28: షెడ్యూల్డ్‌ కులాల ఆర్డర్‌-1950ను విభజన చట్టంలోని అయిదో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం సవరించారు.

సెక్షన్‌ 29: షెడ్యూల్డ్‌ తెగల ఆర్డర్‌-1950ను విభజన చట్టంలోని ఆరో షెడ్యూల్‌లో నిర్దేశించిన ప్రకారం సవరించారు.

మాదిరి ప్రశ్నలు


1. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో వరుసగా ఎన్ని భాగాలు, సెక్షన్లు, షెడ్యూళ్లు ఉన్నాయి?

జ‌: 12, 108, 13


2. ‘అవతరణ రోజు నుంచి పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. గడువు ముగిశాక హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్రానికే రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా ప్రాంతం కొత్త రాజధానిగా ఉంటుంది’ అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ సెక్షన్‌ తెలుపుతుంది?

జ‌: సెక్షన్‌ 5     


3. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో భాగం X ఏ ముఖ్యాంశానికి సంబంధించింది?

జ‌: మౌలిక వనరులు, ప్రత్యేక ఆర్థిక చర్యలు 


4. రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గవర్నర్‌గా ఉంటారని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ సెక్షన్‌ తెలుపుతుంది?

జ‌: సెక్షన్‌ 7      


5. కింది వాటిలో సరికానిది ఏది?

1) సెక్షన్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014 అని పిలుస్తారు.

2) సెక్షన్‌ 5: రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌.

3) సెక్షన్‌ 9: ఉమ్మడి రాజధానిలోని ప్రజల ప్రాణాలు, స్వాతంత్య్రం, ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.

4) సెక్షన్‌ 18: ఆంగ్లో ఇండియన్లకు ప్రాధాన్యం.

జ‌: సెక్షన్‌ 9: ఉమ్మడి రాజధానిలోని ప్రజల ప్రాణాలు, స్వాతంత్య్రం, ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్‌దే.

Posted Date : 29-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌