• facebook
  • whatsapp
  • telegram

సెరామిక్స్

సాధారణ కుండపాత్రలు

* వీటిని సాధారణ బంకమన్ను నుంచి తయారు చేస్తారు. సచ్చిద్రపాత్రలైన కుండలు, కూజాలు, సాధారణ ఇటుకలు, ఇంటి పైకప్పుకు      వాడే పెంకులు మొదలైనవి ఈ కోవకు వస్తాయి. 

* వీటి తయారీలో ముడి పదార్థాలను 1100C ఉష్ణోగ్రత వరకు వేడిచేస్తారు. ఇవి గట్టిగా ఉండవు.

మృత్తికా పాత్రలు 

* వీటిని ఎర్ర బంకమట్టి, బూడిద రంగు బంకమన్ను నుంచి తయారు చేస్తారు. 

* గోడపెంకులు, మెరుపు ఉన్న గోడపెంకులు, స్పార్క్‌ ప్లగ్‌లు, విద్యుత్‌ ప్లగ్‌లు మొదలైనవి మృత్తికా పాత్రలకు ఉదాహరణలు.

* వీటి తయారీ ఉష్ణోగ్రత 1100C నుంచి 1400C వరకు ఉంటుంది. కాబట్టి మృత్తికా పాత్రలు చాలా గట్టిగా ఉంటాయి. 

* మృత్తికా పాత్రల మెరుపు కోసం క్వార్ట్జ్, ఫెల్‌స్పార్, బోరాక్స్, తక్కువ పరిమాణంలో లెడ్‌ ఆక్సైడ్‌ మిశ్రమాన్ని పొడిచేసి, జల్లించి సన్నటి పొడిగా మారుస్తారు. 

* ఈ పొడికి తగినంత నీరు కలిపి పలచటి లేపనంగా తయారుచేస్తారు. ఎండిన మట్టి పాత్రలను ఈ లేపనంలో ముంచి, బయటకు తీసి అధిక ఉష్ణోగత్రలో వేడిచేస్తారు. 

* ఈ విధంగా తయారైన మృత్తికా పాత్రలకు మెరుపు ఉంటుంది.

పింగాణీ పాత్రలు 

* వీటి తయారీలో అత్యంత నాణ్యత కలిగిన బంకమన్నును ఉపయోగిస్తారు. వీటి తయారీలో ఉష్ణోగ్రత 1450C నుంచి 1800C వరకు ఉంటుంది. 

* వీటి తయారీ విధానం మృత్తికా పాత్రల తయారీ విధానం ఒకేలా ఉంటుంది.

ఉదా: విద్యుత్‌ బంధనాలైన పింగాణీ వస్తువులు, టీ కప్పులు, ప్లేట్‌లు, అలంకరణ పాత్రలు మొదలైనవి.

క్రోమోఫోర్‌ - ఆక్సోక్రోమ్‌

* రంజనాల అణు నిర్మాణంలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి:

i) క్రోమోఫోర్‌              ii) ఆక్సోక్రోమ్‌

* రంజనానికి రంగును కలిగించే ప్రమేయ సమూహాన్ని క్రోమోఫోర్‌ ( CHROMOPHORE) అంటారు.

ఉదా:  -NO2 (నైట్రో సమూహం)

         -N = N- (అజో సమూహం)

         >C = O (కార్బోనైల్‌ సమూహం)    మొదలైనవి.

* బెంజీన్‌ అణువు ఏ రంగునూ ప్రదర్శించదు. కానీ దాన్ని నైట్రో సమూహానికి కలిపితే లేత పసుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ లేత పసుపు రంగుకు కారణం నైట్రో సమూహం అనే క్రోమోఫోర్‌.

* రంజనాల అణు నిర్మాణంలో రంగు తీవ్రతను పెంచే ప్రమేయ సమూహాన్ని ఆక్సోక్రోమ్‌ (Auxochorome) అంటారు.

ఉదా: -OH, -OR, -NH2, -NR2, -SH  సమూహాలు.

* లేత పసుపు రంగులో ఉన్న నైట్రో బెంజీన్‌ అణువుకు హైడ్రాక్సిల్‌ సమూహం ( -OH) తోడైతే, దానికి ముదురు పసుపు రంగు వస్తుంది. ఇక్కడ రంగు తీవ్రతను పెంచిన  -OH సమూహాన్ని ఆక్సోక్రోమ్‌ అంటారు.

* అజో రంజనాలు అతి ముఖ్యమైన  రంజనాలు. వీటిలో అజో సమూహం (-N=N-) క్రోమోఫోర్‌గా పనిచేస్తుంది. 

* -OH, -NH2, -NR2 లాంటి సమూహాలు ఆక్సోక్రోమ్‌లుగా పనిచేస్తాయి.

* అజో రంజనాలను ముఖ్యంగా ఆహార, వస్త్ర పరిశ్రమల్లో విరివిగా ఉపయోగిస్తారు. కాగితం, తోలు పరిశ్రమలో కూడా అజో రంజనాలను వాడతారు.

జిగుర్లు (GUMS)

* ఉపరితలాలను అతికించడం ద్వారా రెండు వస్తువులను కలిపి ఉంచే సామర్థ్యం కలిగిన పదార్థాలను ‘జిగుర్లు’ అంటారు.

* ఇవి రెండు రకాలు, అవి:

i) సహజ జిగుర్లు        ii) కృత్రిమ జిగుర్లు

సహజ జిగుర్లు: 

* కేసిన్‌ అనే పాల ప్రోటీన్‌ నుంచి ఏర్పడే జిగుర్లు; రక్తంలోని ఆల్బుమిన్‌ అనే ప్రోటీన్‌ నుంచి ఏర్పడే జిగుర్లు; తుమ్మ, లక్క, చేపల ఎముకల నుంచి తయారయ్యే జిగుర్లు; పిండి పదార్థం, డెక్స్‌ట్రిన్‌ మొదలైనవి సహజ జిగుర్లకు ఉదాహరణలు.

కృత్రిమ జిగుర్లు: 

* సిలికోన్‌లు, ఇపాక్సీ రెజిన్‌లు, ఫినాల్‌-ఫార్మాల్డిహైడ్‌ రెసిన్లు, పాలీస్టైరీన్‌ రెసిన్లు, పాలీవినైల్‌ రెసిన్లు మొదలైనవి కృత్రిమ జిగుర్లకు ఉదాహరణలు.

రంజనాలు (DYES)


 దారం, వస్త్రాలపై తేమ రంగును ఆపాదించగల రంగు పదార్థాలను రంజనాలు అంటారు. అద్దకపు రంగులను రంజనాలు అంటారు.

రకాలు

సహజ రంజనాలు: 

* ఇండిగో మొక్కల నుంచి నీలి అద్దకం రంగు లభిస్తుంది. 

* మేడర్‌ మొక్క వేళ్ల నుంచి టర్కీ ఎరుపు అద్దకం రంగు లభిస్తుంది. 

* నత్తల ఉంచి ఊదారంగు అద్దకపు రంగు లభిస్తుంది.

కృత్రిమ రంజనాలు: 

* విలియం హెన్రీ పెర్కిన్‌ అనే శాస్త్రవేత్త మొదటిసారి ‘మావ్‌’ అని పిలిచే కృత్రిమ రంజనాన్ని తయారు చేశారు.

ఉదా: మిథైల్‌ ఆరెంజ్, ఎనిలిన్‌ పసుపు. 

ఆమ్ల రంజనాలు: 

ఆమ్ల మాధ్యమంలో దారానికి అద్దకం వేసే రంజనాలను ‘ఆమ్ల రంజనాలు’ అంటారు.

ఆమ్ల రంజనాలు  -COOH, -SO3H లాంటి ప్రమేయ సమూహాలను కలిగి ఉంటాయి.

*ఆమ్ల రంజనాలు రుణావేశాన్ని కలిగి ఉంటాయి. ఇవి నీటిలో కరుగుతాయి.

ఉదా: ఆమ్ల ఎరుపు - 88, ట్రైఫినైల్‌ మీథేన్‌ రంజనాలు, అజో రంజనాలు మొదలైనవి.

ప్రత్యక్ష రంజనాలు:

* తటస్థ మాధ్యమంలో అద్దకం చేయగల రంజనాలను ‘ప్రత్యక్ష రంజనాలు’ (Direct dyes) అంటారు. 

* ప్రత్యక్ష రంజనాలకు ఏ ఇతర పదార్థాల సహాయం అవసరం లేదు.

ఉదా: మార్షియస్‌ పసుపు, నాఫ్తాల్‌ పసుపు, కాంగో ఎరుపు మొదలైనవి.

క్షార రంజనాలు (basic dyes):

* క్షార మాధ్యమంలో దారానికి అద్దకం చేసే వాటిని క్షార రంజనాలు అంటారు. ఇవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి.

* ఇవి నీటిలో చాలా తక్కువగా, ఆల్కహాల్‌లో సులభంగా కరుగుతాయి. ఆక్రిలిక్‌ పోగులను అద్దకం వేయడానికి క్షార రంజనాలను ఉపయోగిస్తారు.

ఉదా: అలిజారిన్, మిథిలీన్‌ నీలం మొదలైనవి.

* క్షార రంజనాలు  -NH2 సమూహాలను కలిగి ఉంటాయి.

వర్ణ స్థిరీకరణ రంజనాలు: 

* కొన్ని రంజనాలు ద్రావణంలో కరిగి, కొన్ని లోహ లవణాలతో చర్య పొందుతాయి. అవి వెంటనే ఆ ద్రావణ రంజనాల అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. వీటిని వర్ణ స్థిరీకరణ రంజనాలు అంటారు.

వ్యాట్‌ రంజనాలు (Vat dyes):

* పెద్ద తొట్టెల్లో వ్యాట్‌ రంజనాలను అద్దకంలో ఉపయోగిస్తారు. 

*వ్యాట్‌ ద్రావణ రంజనాలను దారానికి పట్టించి, గాలిలో ఎండబెడతారు. రంజనం గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి ఆ ద్రావణీయ రంజనం దారంపై పూతను ఏర్పరుస్తుంది.

ఉదా: ఇండిగో నీలం.

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో కార్బాక్సిల్‌ ప్రమేయ సమూహం ఏది?

1)  -COOH      2) -NO2      3) -NH2      4) -COOR

2. కిందివాటిలో నైట్రో ప్రమేయ సమూహం ఏది?

1) -COOH      2) -OH       3) -NO        4)  -N = N-

3. కిందివాటిలో అజో ప్రమేయ సమూహాన్ని గుర్తించండి.

1)  -OH          2) -NO2        3) -N = N-      4)    -COOH 

4. మొట్టమొదటి కృత్రిమ రంజనం ఏది?

1) ఇండిగో       2) మావ్‌       3) మిథైల్‌ ఆరెంజ్‌      4)  మిథైల్‌ రెడ్‌

5. ఆమ్ల రంజనాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

i) ఇవి నీటిలో కరుగుతాయి.                      ii) ఉన్ని, సిల్క్‌ (పట్టు) దారాల అద్దకంలో ఆమ్ల రంజనాలను ఉపయోగిస్తారు.

iii) ఇవి రుణావేశాన్ని కలిగి ఉంటాయి.            iv) ఇవి ధనావేశాన్ని కలిగి ఉంటాయి.

1) ii, iv      2) i, ii     3) ii, iii, iv          4) i, ii, iii

6. ఆక్రిలిక్‌ పోగులకు రంగులను ఆపాదించడానికి ఉపయోగించే రంజనాల రకం ఏది?

1) ఆమ్ల రంజనాలు      2) క్షార రంజనాలు       3)వ్యాట్‌ రంజనాలు       4) ఏదీకాదు

సమాధానాలు

1-1    2-3    3-3    4-2    5-4    6-2
 

Posted Date : 19-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌