• facebook
  • whatsapp
  • telegram

విపత్తు నిర్వహణ వ్యవస్థ

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక 

జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (National Disaster Management Plan) రూపకల్పనకు ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. అవి:

1. జాతీయ ప్రతిస్పందన ప్రణాళిక (National Response Plan)

2. జాతీయ ఉపశమన ప్రణాళిక  (National Mitigation Plan)

3. జాతీయ సామర్థ్య నిర్మాణ ప్రణాళిక (National Capacity Building Plan)

* భారతదేశంలో మొదటి జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను 2016, జూన్‌ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీలో విడుదల చేశారు.

* విపత్తు ముప్పు తగ్గించేలా ఐక్యరాజ్యసమితి ‘సెండ్రాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ 201530’ పేరుతో ప్రచంచ దేశాలకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. వీటికి అనుగుణంగానే భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది.

* భారతదేశంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని, ప్రాణ నష్టాన్ని తగ్గించడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.

లక్ష్యాలు:

* విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని దశలు అంటే - నివారణ, తగ్గించడం, ప్రతిస్పందన, రికవరీ లాంటివి ఈ ప్రణాళిక పరిధిలోకి తేవడం.

* ప్రభుత్వ ఏజెన్సీలు, విభాగాలన్నింటి మధ్య మంచి సమన్వయాన్ని నెలకొల్పడం.

* ప్రభుత్వంలోని అన్ని స్థాయులు - పంచాయతీలు మొదలుకొని పట్టణ స్థానిక సంస్థల వరకు అవి నిర్వహించాల్సిన పనులు బాధ్యతాయుతంగా చేసేలా ప్రోత్సహించడం.

* విపత్తు, వైపరీత్యాలు, దుర్భలత్వాలపై ప్రజల్లో అవగాహనను; వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం.

* విపత్తు నిర్వహణకు ఉపయోగించే సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం.

రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణ

రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ: 

* విపత్తు నిర్వహణ చట్టం 2005 అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA), జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA)లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

* కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌ డయ్యూ, గుజరాత్, మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ విపత్తు నిర్వహణ చట్టం 2005 ఆదేశాల ప్రకారం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేశాయి.

రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ: 

* విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 20 ప్రకారం ప్రతి రాష్ట్రం రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయాలి.

* దీనికి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అధ్యక్షులుగా ఉంటారు. వీరితోపాటు మరో నలుగురు ఇతర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

* ఈ కమిటీ జాతీయ విధానం, జాతీయ ప్రణాళిక అమలును సమన్వయం చేయడం, పర్యవేక్షించడం లాంటి బాధ్యతలు నిర్వహిస్తుంది.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి: 

* విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 48 (1) ద్వారా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిని ఏర్పాటు చేస్తారు.

* దీని నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తుంది.

* కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దీనికి నిధులు కేటాయిస్తారు.

* రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి కేంద్రం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% వాటా భరించాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అంతేకాకుండా విపత్తు నిర్వహణ కోసం రాష్ట్రాలకు రూ.55,097 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇవ్వాలని సూచించింది.

జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ

* రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 25 పేర్కొంది.

* జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ ప్రణాళిక, సమన్వయం, అమలుకు DDMA బాధ్యత వహిస్తుంది.

* భద్రతా ప్రమాణాలను పటిష్ఠంగా అమలు చేయడానికి వీలుగా ఆయా జిల్లాల్లోని ఏ ప్రాంతంలోనైనా నిర్మాణాలను పరిశీలించే అధికారం దీనికి ఉంటుంది.

* దీనికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా ఉంటారు.

* 25 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద నగరాల్లో సంక్షోభ నిర్వహణకు మేయర్‌ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. వారికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్, పోలీస్‌ కమిషనర్‌ సహకరిస్తారు.

* వివిధ విపత్తు నిర్వహణ కార్యక్రమాల్లో పంచాయతీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

* గ్రామ స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపకల్పనకు సర్పంచ్‌ నేతృత్వంలోని గ్రామ నిర్వహణ కమిటీ బాధ్యత వహిస్తుంది.

భారత సైనిక దళాలు

* విపత్తు ప్రతిస్పందనలో సైనిక దళాలు కీలక పాత్ర పోషిస్తాయి.

* పౌరసరఫరాల వ్యవస్థ విపత్తును ఎదుర్కోలేని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సైనిక దళాలు జోక్యం చేసుకుంటాయి.

నెహ్రూ యువ కేంద్రాలు (NYKS)

* భారతదేశ స్వాతంత్య్ర రజతోత్సవాలను పురస్కరించుకొని 1972లో నెహ్రూ యువ కేంద్రాలను ఆవిష్కరించారు.

* విద్యార్థులు లేదా గ్రామీణ యువతను జాతి నిర్మాణ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడం, వారి సొంత వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. నేషనల్‌ ఎడ్వైజరీ బోర్డు (ఎన్‌ఏబీ) సిఫార్సు మేరకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

* సంక్షోభ సమయంలో ఈ కేంద్ర సభ్యులు వాలంటీర్లుగా పనిచేసి, సమాజానికి తోడ్పాటు అందిస్తారు.

* నెహ్రూ యువ కేంద్రాలు ప్రస్తుతం కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేస్తున్నాయి.

పౌరరక్షణ దళం 

* శత్రు దేశాలు దాడి చేసినప్పుడు ప్రజల ప్రాణాలను రక్షించడం, ఆస్తులకు కలిగే నష్టాన్ని తగ్గించడం, పారిశ్రామిక ఉత్పత్తి కొనసాగేలా చూడటం లక్ష్యంగా పౌర రక్షణ దళం పనిచేస్తుంది.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,00,000 మంది పౌర రక్షణ వాలంటీర్లు ఉన్నారు.

విపత్తు నిర్వహణ విద్య

* విపత్తు నిర్వహణ గురించి పాఠశాల స్థాయి నుంచే ప్రజల్లో అవగాహన కలిగేలా సాంకేతిక విద్య, ఉన్నత విద్యల్లో కొన్ని  కోర్సులను ప్రవేశపెట్టారు. 

విపత్తు నిర్వహణకు సమర్థవంతమైన దళాన్ని అందుబాటులో ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం.

* అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇంజినీరింగ్‌ విద్యలో విపత్తు నిర్వహణ కోర్సును ప్రవేశపెట్టింది.

* 2011-12 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం కోర్సుల్లో విపత్తు నిర్వహణను పాఠ్య ప్రణాళికగా చేర్చింది.

CBSE 2003-04 విద్యా సంవత్సరం నుంచి  8, 9, 10 తరగతులలో విపత్తు నిర్వహణ విద్యను పాఠ్యాంశంగా చేర్చింది.

* CBSE 2005-06 విద్యా సంవత్సరం నుంచి 11వ తరగతి సోషియాలజీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో విపత్తు నిర్వహణ విద్యను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది.

హోంగార్డ్‌ 

* ప్రజా ఆందోళనలు, మత కల్లోలాలను నియంత్రించడంలో పోలీసులకు సహకరించేందుకు హోంగార్డు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వచ్ఛంద దళంగా 1946, డిసెంబరులో ఏర్పాటైంది.

* 1962లో చైనా - భారత్‌ యుద్ధ సమయంలో హోంగార్డ్‌ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఏర్పాటైంది.

ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ బృందం - భారత విభాగం

* అన్ని రకాల అంతర్జాతీయ విపత్తు ప్రతిస్పందనకు ఐక్యరాజ్య సమితికి చెందిన United Nations Office for the Coordination of Humanitarian Affairs బాధ్యత వహిస్తుంది.

* FAO, UNDP, WHO, WFC లలో ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ బృందానికి (UN Disaster Management Team - UNDMT)  ప్రాతినిధ్యం ఉంటుంది. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఇవన్నీ కలసి పని చేస్తాయి.

* ఏదైనా దేశంలో వైపరీత్యం సంభవించినప్పుడు అక్కడ సత్వర, ప్రభావశీల, ఏకీభావంతో కూడిన విపత్తు నిర్వహణను అందించడం, అవసరమైనప్పుడు స్పందించడం UNDMT ముఖ్య ఉద్దేశం.

జాతీయ విపత్తు ఉపశమన నిధి 

* విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 47 ప్రకారం ప్రభుత్వం జాతీయ విపత్తు ఉపశమన నిధి  (National Disaster Mitigation Fund n -NDMF) ని ఏర్పాటు చేస్తుంది.

* దీని ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు నీతి ఆయోగ్, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA)లతో చర్చిస్తుంది. 

* NDMFను NDMA ఏర్పాటు చేస్తుంది.

* 6వ ఆర్థిక సంఘం మొదటిసారి సహజ విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రాబడుల నుంచి ఖర్చు చేసేందుకు అనుమతిచ్చింది.

* 9వ ఆర్థిక సంఘం ప్రతి రాష్ట్రం విపత్తు సహాయ నిధి (Calamity Relief Fund - CRF) ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చింది.

* అత్యంత తీవ్రమైన ఉపద్రవాలు సంభవించినప్పుడు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసేందుకు జాతీయ ఉపద్రవ సహాయ నిధి National Fund for Calamity Relief - NFCR) ను ఏర్పాటు చేయాలని 10వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని నిర్వహణకు కేంద్ర వ్యవసాయ మంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు సహాయ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది.

* జాతీయ విపత్తు అత్యవసర నిధిని రూ.500 కోట్ల కార్పస్‌ నిధితో ఏర్పాటు చేయాలని 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.

* జాతీయ విపత్తు అత్యవసర నిధిని యథాతథంగా కొనసాగించాలని 12వ ఆర్థిక సంఘం సూచించింది.

* జాతీయ విపత్తు అత్యవసర నిధి స్థానంలో జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) ని ఏర్పాటు చేయాలని 13వ ఆర్థిక సంఘం సూచించింది. ఇది 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది. దీని ప్రకారం ప్రభుత్వం NDRFను ఏర్పాటు చేసింది.

* రాష్ట్ర స్థాయిలో CRF స్థానంలో స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (SDRF) ను ఏర్పాటు చేయాలని 13వ ఆర్థిక సంఘం కోరింది.

National Cadet Corps (NCC)

* NCCని 1948లో ఏర్పాటు చేశారు.

లక్ష్యాలు: 

* యువకులను ప్రయోజకులైన పౌరులుగా తీర్చిదిద్ది, వారిలో ధైర్యం, సహోదరభావం, క్రమశిక్షణ, నాయకత్వం, లౌకిక దృక్పథం, సాహస స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి, నిస్వార్థ సేవా సిద్ధాంతాలను పెంపొందించడం.

* సంఘటితమైన, సుశిక్షితులైన, క్రియాశీలకంగా ఉండే మానవ వనరులను సృష్టించడం.

* సైనిక దళాలతోపాటు జీవితంలోని అన్ని రంగాల్లో నాయకత్వాన్ని పెంపొందించడం, వారిని జాతి సేవకు అందుబాటులో ఉంచడం.

National Service Scheme (NSS)

* ఇది 1969, సెప్టెంబరు 24న ఏర్పాటైంది.

* విద్యార్థులను దేశ సేవలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశం.

* NSS నినాదం ‘నేను కాదు, మీరు కూడా’ (NOT ME, BUT YOU). వ్యక్తి సంక్షేమం చివరకు సమాజ సంక్షేమంపై ఆధారపడి ఉంటుందని ఈ నినాదం తెలుపుతుంది.

* NSS చిహ్నం ‘రథచక్రం’. ఒడిశాలోని కోణార్క్‌ సూర్యదేవాలయంలోని రథచక్రం  ఆధారంగా దీన్ని రూపొందించారు.

* NSS వాలంటీరుగా నమోదైన విద్యార్థి వరుసగా రెండేళ్ల కాలంలో కనీసం 240 గంటలు, అంటే సంవత్సరానికి 120 గంటలు ప్రయోజనకరమైన సామాజిక శ్రమ చేయాలి.

ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విపత్తుల విధానం

* 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో 200కు పైగా పెను విపత్తులు సంభవించాయి. సుమారు 14 లక్షల మంది మరణించారు.

* విపత్తుల వల్ల సంభవించిన నష్టం పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అభివృద్ది చెందుతున్న దేశాల్లో 20 రెట్లు అధికంగా ఉంది.

* ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచంలో ఆసియా దేశాల్లోనే ప్రాణ నష్టం ఎక్కువ.

* సహజ విపత్తుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 60,000 మంది మరణిస్తున్నట్టు అంచనా.

* మనదేశంలో వైపరీత్యాలు సంభవించినప్పుడు అధిక జనాభా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. భౌగోళిక విస్తీర్ణం, నదులు, స్థలాకృతి వల్ల బంగ్లాదేశ్‌ తీర ప్రాంతాలు వరదలు, తుపాన్లకు ఎక్కువగా గురవుతున్నాయి.

* ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నేచురల్‌ హజార్డ్, అన్‌నేచురల్‌ డిజాస్టర్స్‌ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదలు, తుపాన్లు ఎక్కువ శాతం విస్తరించి ఉండగా, ఆఫ్రికాలో కరవు తరచుగా సంభవిస్తోంది.

* నిత్యం కరవులు, వరదలు సంభవించే దేశాలను అత్యంత ఆకలి దేశాలుగా పిలుస్తారు.

ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సులు 

యొకొహామ వ్యూహం   

* విపత్తు నిర్వహణపై 1994లో జపాన్‌లోని యొకొహామ నగరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నేచురల్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌’ సదస్సును నిర్వహించారు. ఇందులో విపత్తు నిర్వహణకు, ఉపశమనానికి తగిన వ్యూహన్ని కలిగి ఉండాలనే అంశంపై చర్చించారు.

* అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఎక్కువగా విపత్తులకు గురవుతున్నట్లు ఈ సమావేశంలో గుర్తించారు.

* వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని ప్రతిసభ్య దేశం నియంత్రించుకునేలా విపత్తు నిర్వహణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో ఐక్యరాజ్య సమితి సూచించింది.

* యొకొహామ సదస్సుకు అనుగుణంగా భారత ప్రభుత్వం 10వ పంచవర్ష  ప్రణాళిక ్బ200207్శలో విపత్తుల గురించి సమగ్రమైన విధానాన్ని రూపొందించింది.

* ఐక్యరాజ్య సమితి 1990లో 19902000 దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించింది.

హ్యోగో (Hyogo)సదస్సు

* 2005లో జపాన్‌లోని హ్యోగోలో విపత్తుల తగ్గింపు సదస్సు జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

* వీరంతా యొకొహామ వ్యూహన్ని కొనసాగించాలని తీర్మానించారు.

* విపత్తుల ప్రభావాన్ని తట్టుకుని, జరిగిన నష్టాన్ని భరించే సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో పెంపొందించేందుకు ఆచరించాల్సిన వ్యూహాలను, మార్గదర్శకాలను ఈ సదస్సులో రూపొందించారు.

* యూఎన్‌డీపీ (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) సహకారంతో భారత హోంమంత్రిత్వ శాఖ దేశంలోని 17 రాష్ట్రాల్లోని 169 జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీనికి యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్, యూరోపియన్‌ యూనియన్‌లు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నాయి.

* విపత్తులు సంభవించినప్పుడు గ్రామ పంచాయితీల భాగస్వామ్యంతో త్వరగా స్పందించి, ప్రథమ చికిత్స అందించడం, ఉపశమనం కలిగించడం, ఆశ్రయం కల్పించడంలో ప్రావీణ్యం ఉన్న ప్రత్యేక బృందాలను తయారుచేయడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం.

భారత్‌లో విపత్తు నిర్వహణ వ్యవస్థ - నిర్మాణం


* విపత్తు నిర్వహణ విభాగానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. జాయింట్‌ సెక్రటరీకి సహాయంగా ముగ్గురు డైరెక్టర్లు, అండర్‌ సెక్రటరీలు, సెక్షన్‌ ఆఫీసర్లు, టెక్నికల్‌ ఆఫీసర్, సీనియర్‌ ఎకనమిక్‌ ఇన్వెస్టిగేటర్, ఇతర సిబ్బంది ఉంటారు.

విపత్తు నిర్వహణ చట్టం 2005:

* ఈ చట్టాన్ని 2005, నవంబరు 28న రాజ్యసభ; 2005, డిసెంబరు 12న లోక్‌సభ ఆమోదించాయి.

* దేశవ్యాప్తంగా ఈ చట్టం 2005, డిసెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది.

* ఇందులో మొత్తం 11 అధ్యాయాలు, 79 సెక్షన్లు ఉన్నాయి.

ఈ చట్టం ప్రకారం ఏర్పడిన సంస్థలు


* విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో వివిధ సంస్థలు ఏర్పడ్డాయి. అవి:

* నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

* స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌

* నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌

* నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ 


నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ:

* విదీలీతిను 2005లో ఏర్పాటు చేశారు. 2006, సెప్టెంబరు 27 నుంచి విధి నిర్వహణను ప్రారంభించింది.

* దీనికి ప్రధాని అధ్యక్షత వహిస్తారు, సభ్యుల సంఖ్య 14. ఇందులోని సభ్యుల సంఖ్యను 2014, డిసెంబరు 29న గరిష్ఠంగా 29కి పెంచారు.

* ఎన్‌డీఎంఏకు నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఎన్‌ఈసీ) నిధులు సమకూరుస్తుంది. 

* ఎన్‌ఈసీ ఛైర్‌పర్సన్‌గా కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉంటారు.

స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ:

* విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ళీదీలీతిను ఏర్పాటు చేశారు.

* దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* విపత్తు నిర్వహణ చట్టం 2005తో సంబంధం లేకుండా గుజరాత్, డామన్‌ డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతం) ఎస్‌డీఎంఏను ఏర్పాటు చేసుకున్నాయి.

* గుజరాత్‌ 2001లో గుజరాత్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయగా, డామన్‌ డయ్యూ  విపత్తు నిర్వహణ చట్టం 2005 అమల్లోకి రాకముందే స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసుకుంది.

* ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్రం భౌతిక, ఆర్థికపరమైన వనరులకు మాత్రమే కొద్ది మొత్తంలో సహాయం చేస్తుంది.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌: 

* ఇది 1995లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఐఐపీఏ) పేరుతో ఏర్పడింది. 2003లో దీని పేరును విఖిదీలీగా మార్చారు.

* విపత్తు నిర్వహణ చట్టం 2005 ఎన్‌ఐడీఎంను చట్టబద్ధమైన సంస్థగా గుర్తించింది.

* దీని ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది.

* కేంద్ర హోంశాఖ మంత్రి దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* ఎన్‌ఐడీఎం ‘డిజాస్టర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ అనే ద్వైవార్షిక పత్రికను ప్రచురిస్తుంది.

నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌

* విదీళినీను 2006లో నెలకొల్పారు. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌ 44 ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు.

*  ప్రస్తుతం ఇందులో 12 బెటాలియన్లు ఉన్నాయి.

* ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌ లాంటి ప్రత్యేక దళాలు ఉంటాయి. ఇవి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయసహకారాలు అందిస్తాయి.

* మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ వద్ద జాతీయ విపత్తు నిర్వహణ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రతిపాదించింది.

నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌:

* భారతదేశంలో 1957లో మొట్టమొదటి విపత్తు సంస్థను నాగ్‌పుర్‌ వద్ద కేంద్ర అత్యవసర పునరావాస శిక్షణ సంస్థ ్బదినిళిగిఖ్శి పేరుతో ఏర్పాటు చేశారు.

* 1969, ఏప్రిల్‌ 1న దినిళిగిఖి పేరును నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌ ్బవిదిదీద్శిగా మార్చారు.

* ఏదైనా సహజ లేదా మానవకారక వైపరీత్యం సంభవించినప్పుడు విపత్తు పునరావాస కార్యక్రమాలు నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులకు ఈ సంస్థ అధునాతన, ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 


 

రచయిత

పి.కె.వీరాంజనేయులు

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌