• facebook
  • whatsapp
  • telegram

శిలీంధ్రాలు

 ఈస్ట్‌ కణాలు మినహా దాదాపు అన్ని శిలీంధ్రాల్లో ఏక తంతు నిర్మాణం ఉంటుంది. అవి ఏక కణ లేదా బహు కణ జీవులు కావొచ్చు.


 శిలీంధ్రాల్లో హైఫే అని పిలిచే పొడవైన తంతువు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ హైఫేలు కలిసి మైసిలియం అనే మెష్‌ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి.


 శిలీంధ్రాలు కణ గోడను కలిగి ఉంటాయి. ఇది ఖైటిన్, ఇతర పాలీశాకరైడ్‌లతో రూపొంది ఉంటుంది. 


 కణకవచం ఒక ప్రోటోప్లాస్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది కణత్వచం, సైటోప్లాజం, కేంద్రకాలు లాంటి ఇతర కణ భాగాలుగా విభజితమవుతుంది.


 కేంద్రకం దట్టంగా, స్పష్టంగా, క్రోమాటిన్‌ దారాలతో ఉంటుంది. న్యూక్లియస్‌ చుట్టూ న్యూక్లియర్‌ మెంబ్రేన్‌ ఉంటుంది.


లక్షణాలు


 శిలీంధ్రాలు యూకారియోటిక్, నాన్‌-వాస్కులర్, నాన్‌-మోటైల్, హెటిరోట్రోఫిక్‌ జీవులు. అవి ఏకకణ లేదా ఫిలమెంటస్‌ కావొచ్చు.


 అవి బీజాంశాల ద్వారా పునరుత్పత్తి జరుపుకుంటాయి.


 శిలీంధ్రాలు ఏకాంతర జీవిత దశల దృగ్విషయాన్ని ప్రదర్శిస్తాయి.


 వీటిలో క్లోరోఫిల్‌ ఉండదు. కాబట్టి కిరణజన్యసంయోగక్రియ జరుపుకోలేవు.


 శిలీంధ్రాలు తమ ఆహారాన్ని స్టార్చ్‌ రూపంలో నిల్వ చేసుకుంటాయి.


 శిలీంధ్రాల్లో ఖైటిన్‌ బయోసింథసిస్‌ సంభవిస్తుంది.


 వీటి కేంద్రకాలు చాలా చిన్నవి.


 శిలీంధ్రాలకు పిండదశ ఉండదు. అవి సిద్ధబీజాల నుంచి అభివృద్ధి చెందుతాయి.


 పునరుత్పత్తి లేదా ప్రత్యుత్పత్తి విధానం లైంగిక లేదా అలైంగిక పద్ధతిలో జరుగుతుంది.


 కొన్ని శిలీంధ్రాలు పరాన్నజీవి, హోస్ట్‌కు సోకవచ్చు.


 శిలీంధ్రాలు ఫెరోమోన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది వాటిలో లైంగిక పునరుత్పత్తికి దోహదం చేస్తుంది. ఉదా: పుట్టగొడుగులు, మౌల్డ్‌లు, ఈస్ట్‌ మొదలైనవి.

సిద్ధబీజాశయాల  నిర్మాణం ఆధారంగా


బీజాంశం ఏర్పడటం ఆధారంగా శిలీంధ్రాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:


1. జైగోమైసెట్స్‌      2. అస్కోమైసెట్స్‌    3. బెసిడియోమైసెట్స్‌  4. డ్యూటిరోమైసెట్స్‌


జైగోమైసెట్స్‌: ఇవి రెండు వేర్వేరు కణాల కలయికతో ఏర్పడతాయి. లైంగిక బీజాంశాలను జైగోస్పోర్స్‌ అని, అలైంగిక బీజాంశాలను స్పోరాంజియోస్పోర్స్‌ అని అంటారు. హైఫేల్లో సెప్టా ఉండదు. ఉదా: మ్యుకార్‌.


అస్కోమైసెట్స్‌: వీటినే శాక్‌ శిలీంధ్రాలు అని కూడా అంటారు. అవి కోప్రోఫిలస్, డికంపోజర్స్, పరాన్న జీవి లేదా సాప్రోఫైటిక్‌ అవ్వొచ్చు. లైంగిక బీజాంశాలను అస్కోస్పోర్స్‌ అంటారు. కోనిడియోస్పోర్స్‌ ద్వారా అలైంగిక పునరుత్పత్తి జరుగుతుంది. ఉదా: సాకరోమైసెస్‌.


బెసిడియోమైసెట్స్‌: ఇవి సాధారణంగా కనిపించే పుట్టగొడుగులు. ఇవి ఎక్కువగా పరాన్నజీవులుగా జీవిస్తాయి. బెసిడియోస్పోర్స్‌ ద్వారా లైంగిక పునరుత్పత్తి జరుగుతుంది. అలైంగిక పునరుత్పత్తి కోనిడియా, చిగురించడం లేదా ఫ్రాగ్మెంటేషన్‌ ద్వారా జరుగుతుంది. ఉదా: అగారికస్‌.


డ్యూటిరోమైసెట్స్‌: ఇవి ఇతర శిలీంధ్రాలలా సాధారణ పునరుత్పత్తి చక్రాన్ని అనుసరించవు. వీటిని అసంపూర్ణ శిలీంధ్రాలు అంటారు. అవి లైంగికంగా పునరుత్పత్తి చేయలేవు. కోనిడియా ద్వారా అలైంగిక పునరుత్పత్తి జరుగుతుంది. 


ఉదా: ట్రైకోడెర్మా.

వర్గీకరణ


శిలీంధ్రాలను రెండు అంశాల ఆధారంగా వర్గీకరించారు. అవి: 


1. పోషణ విధానం ఆధారంగా


2. సిద్ధబీజాశయాల నిర్మాణం ఆధారంగా


పోషణ విధానం ఆధారంగా


పోషకాహారం ఆధారంగా శిలీంధ్రాలను మూడు సమూహాలుగా వర్గీకరించారు. అవి:


ఎ) పూతికాహార శిలీంధ్రాలు  


బి) పరాన్నజీవి శిలీంధ్రాలు   

సి) సహజీవనం


పూతికాహార శిలీంధ్రాలు (సప్రోఫైౖటిక్‌ ఫంజి): శిలీంధ్రాలు మరణించిన సేంద్రీయ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. 


ఉదా: రైజోపస్, పెన్సిలియం, ఆస్పర్‌జిల్లస్‌.


పరాన్నజీవి శిలీంధ్రాలు: ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై (మొక్కలు లేదా జంతువులు) ఆధారపడతాయి. హోస్ట్‌ లేదా అతిథేయి నుంచి పోషకాలను గ్రహిస్తాయి. 


ఉదా: తఫ్రినా, పుక్కినియా.


సహజీవనం: ఇతర జాతులతో పరస్పర ఆధారిత సంబంధాన్ని కలిగి జీవిస్తాయి. ఇందులో రెండూ ప్రయోజనం పొందుతాయి. ఉదా: లైకెన్లు, మైకోరైజా.


లైకెన్లు: ఆల్గే, శిలీంధ్రాల మధ్య సహజీవన సంబంధాన్ని లైకెన్లు అంటారు. ఇక్కడ ఈ రెండూ పరస్పరం ప్రయోజనం పొందుతాయి. శిలీంధ్రాలు ఆల్గేలకు ఆశ్రయం కల్పిస్తే, ప్రతిఫలంగా ఆల్గే కార్బోహైడ్రేట్‌ సంశ్లేషణ ద్వారా శిలీంధ్రాలకు సహాయం చేస్తాయి.


మైకోరైజా: శిలీంధ్రాలు, మొక్కల మధ్య ఉండే సహజీవన సంబంధాన్ని మైకోరైజా అంటారు. శిలీంధ్రాల సాయంతో మొక్కలు పోషకాలను గ్రహిస్తే, మొక్కలు ఫంగస్‌కు చక్కెర లాంటి సేంద్రీయ అణువులను అందిస్తాయి.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో శిలీంధ్రాల లక్షణం కానిది ఏది?


ఎ) కిరణజన్య సంయోగక్రియ జరపడం


బి) ఖైటిన్‌తో చేసిన కణ గోడలు


సి) సిద్ధబీజాశయాల ద్వారా పునరుత్పత్తి


డి) హెటిరోట్రోఫిక్‌ పోషణ


2. పర్యావరణ వ్యవస్థల్లో శిలీంధ్రాల ప్రధాన పాత్ర ఏమిటి?


ఎ) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం


బి) ప్రాథమిక వినియోగదారులుగా పనిచేయడం


సి) సేంద్రీయ పదార్థం కుళ్లిపోయేలా చేయడం


డి) నైట్రోజన్‌ను స్థిరీకరించడం


3. పుట్టగొడుగులు ఫంగస్‌లోని ఏ భాగానికి ఉదాహరణ?


ఎ) మైసిలియం       బి) హైఫే


సి) బెసిడియోకార్ప్‌    డి) ఆస్కస్‌


4. ఏ శిలీంధ్ర వ్యాధి మానవుల చర్మం, జుట్టు, గోళ్లను ప్రభావితం చేస్తుంది?


ఎ) మలేరియా      బి) అథ్లెట్స్‌ ఫుట్‌


సి) క్షయ       


డి) డెంగ్యూ జ్వరం


5. శిలీంధ్రాలు, మొక్కల మూలాల మధ్య ఉండే సహజీవన అనుబంధాన్ని ఏమంటారు?


ఎ) మైకోరైజా           బి) లైకెన్‌


సి) ఆల్గర్‌బ్లూమ్‌        డి) పరస్పరవాదం


6. ఫంగల్‌ సిద్ధబీజాశయం ప్రధాన విధి ఏమిటి?


ఎ) అలైంగిక పునరుత్పత్తి   


బి) పోషకాల శోషణ


సి) కిరణజన్యసంయోగక్రియ  


డి) వాయు మార్పిడి


7. శిలీంధ్రాలు ఏ ఇతర జీవుల సమూహంతో మరింత దగ్గరి సంబంధాన్ని కలిగి, లైకెన్‌లను ఏర్పాటు చేస్తాయి?


ఎ) మొక్కలు          బి) బ్యాక్టీరియా


సి) శైవలాలు          డి) ప్రొటిస్టులు


8. 19వ శతాబ్దం మధ్యలో ఐర్లాండ్‌లో బంగాళాదుంప పంటలను ఏ ఫంగల్‌ వ్యాధి నాశనం చేసింది?


ఎ) బ్లాక్‌ స్పాట్‌         బి) లేట్‌ బ్లైట్‌


సి) కుంకుమ తెగులు       డి) బూజు తెగులు


సమాధానాలు


1-ఎ  2-సి  3-ఎ  4-బి  5-ఎ  6-ఎ  7-సి  8-బి


రచయిత

కొర్లాం సాయివెంకటేష్, 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 18-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌