• facebook
  • whatsapp
  • telegram

భారత రక్షణ రంగం - నావికాదళం


జలాంతర్గాములు

రక్షణపరంగా భారత నావికాదళంలో సబ్‌మెరైన్‌లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇవి ప్రతిధ్వని ఆధారంగా పనిచేస్తాయి. సాధారణంగా ఒక వస్తువు నుంచి శబ్ద తరంగాలు బయలుదేరి, వేరొక వస్తువును లేదా ప్రదేశాన్ని చేరినప్పుడు తిరిగి ప్రతిధ్వని రూపంలో బయటకు వస్తాయి. రెండు  ప్రతిధ్వనుల మధ్య  దూరం 17 మీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ శబ్దాలు మరింత తీవ్రంగా వినిపిస్తాయి.

మూసివున్న భవంతులు, సినిమా హాళ్లలో ఈ ప్రభావాన్ని నివారించడానికి రెండు ధ్వనుల మధ్య కనీస దూరం ఉండేలా చూస్తారు. ఈ అతిధ్వనులను నివారించడానికి కార్పెట్లు, చెక్క, డోర్‌ కర్టెన్‌ (ధ్వని గ్రహీతలు)లను వాడతారు.

నీటిలో ఉన్న వస్తువులు, శత్రు నౌకలు, సముద్ర లోతును, సంబంధిత ఎత్తును గుర్తించటానికి వీలుగా సబ్‌మెరైన్‌లు సోనార్‌ (సౌండ్‌ నావిగేషన్‌ అండ్‌ రేంజింగ్‌) అనే వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. ఈ సోనార్‌ సబ్‌మెరైన్ల సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనిలో ఉండే ఫాథోమీటర్‌ (సముద్ర లోతును కొలిచే సాధనం) అడ్డుగా ఉన్న వస్తువులను గుర్తిస్తుంది. సముద్ర లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఫాథోమ్‌ (fathom).  సాధారణంగా 1.8 మీటర్ల సముద్రపు లోతును ఒక ఫాథోమ్‌గా పరిగణిస్తారు.

 కేరళలోని కొచ్చిలో ఉన్న నావల్‌ ఫిజికల్‌ అండ్‌ ఓషియనోగ్రఫిక్‌ ల్యాబొరేటరీ సోనార్‌ వ్యవస్థలను తయారు చేస్తోంది. 


సోనార్‌ వ్యవస్థలు

దేశ నావికా దళంలో ప్రస్తుతం పలు రకాల సోనార్‌ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అవి :

1. అభయ్‌ సోనార్‌: దీన్ని తక్కువ లోతున్న తీరప్రాంతంలో తిరిగే గస్తీ నౌకల్లో ఉపయోగిస్తున్నారు. ఉపరితలం, ఉపరితలానికి కొంచెం కింద ఉన్న వస్తువులను ఇది గుర్తించగలదు. దీన్ని అభయ్‌ నౌకల్లో  వినియోగిస్తున్నారు.

2. హంస యూజీ ఇండక్టెడ్‌ సోనార్‌ సిస్టమ్‌: భారత నావికాదళం సముద్రంలో అత్యంత దూరం  ప్రయాణిస్తున్నప్పుడు శత్రునౌకల నుంచి కాపాడేందుకు ఈ అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. దీన్ని మూడు రకాల నౌకల్లో ప్రవేశపెట్టారు.

3. ఏఐడీఎస్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ ఇండిజెనస్‌ డిస్ట్రెస్‌ సోనార్‌ సిస్టమ్‌): ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగించే సోనార్‌ వ్యవస్థ. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

ఈ వ్యవస్థ ద్వారా సౌండ్‌ సిగ్నల్స్‌ను పంపిస్తారు. సబ్‌మెరైన్‌ల్లో ఆపదలో  ఉన్న సిబ్బందిని రక్షించడానికి, కావాల్సిన రక్షణ చర్యలు చేపట్టడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

4. ఎన్‌ఏసీఎస్‌ (నియర్‌ ఫీల్డ్‌  అకౌస్టిక్స్‌  కేరక్టరైజేషన్‌ సిస్టమ్‌): దీన్ని ధ్వని తరంగాల సిగ్నల్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ త్రీడీ ట్రాన్స్‌మిషన్, రిసెప్షన్‌ పరికరాలతో అనుసంధానించి ఉంటుంది. ఇది హంస సోనార్‌లతో అనుసంధానమైనప్పుడు శత్రు నౌకలను మొదటి దశలోనే గుర్తించి నిలువరించగలదు. ఈ వ్యవస్థలతో భారత నావికాదళ గస్తీ వ్యవస్థ మరింత మెరుగై, స్వయం ఆధారితంగా మారింది.

5. ఏటీఏఎస్‌: అత్యంత అధునాతన సోనార్‌ వ్యవస్థ. దీని ద్వారా శత్రు దేశ సబ్‌మెరైన్‌లను, ఎక్కువ బరువు కలిగిన టార్పిడోలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయవచ్చు. భారత నావికాదళం రూపొందించబోయే సబ్‌మెరైన్‌ల్లో దీన్ని ప్రయోగించనుంది.


రాడార్‌ (రేడియో డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌)

 ఈ వ్యవస్థ భూవాతావరణంలో ఉన్న శత్రు దేశ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, క్షిపణులను గుర్తిస్తుంది.

* భారత నావికాదళ జలాంతర్గామి వ్యవస్థను రక్షణ రంగ నిశ్శబ్ద విభాగం (Silent Arm of Indian Defence System)గా పిలుస్తారు.

* నీటిలో సబ్‌మెరైన్‌ల నుంచి పంపించే క్షిపణులను టార్పిడోలు అంటారు.

* జలాంతర్గాములపై దాడిచేసే యుద్ధ నౌకలను corvettes గా పిలుస్తారు.

* భారతదేశ తూర్పు తీరంలోని విశాఖపట్నం - నౌకా నిర్మాణ కేంద్రం, పశ్చిమ తీరంలోని ముంబయి - మజ్‌గావ్‌డాక్‌లో మాత్రమే సబ్‌మెరైన్‌ల తయారీ, వివిధ భాగాల అనుసంధానం పనులు జరుగుతాయి. 

* భారత పశ్చిమ తీరంలో ముంబయికి 650 కిలోమీటర్ల దూరంలోని  కార్వార్‌ ప్రాంతాన్ని సబ్‌మెరైన్‌ల ప్రయోగానికి అనువుగా తీర్చిదిద్దనున్నారు.

* నావికా దళంలో వివిధ రకాల సబ్‌మెరైన్‌ వ్యవస్థలున్నాయి. భారత్‌లో 15 డీజిల్‌ ఎలక్ట్రికల్‌ (SSKs Submarines) జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో భారత్‌ జర్మనీ భాగస్వామ్యంతో తయారు చేసిన  ఎస్‌ఎస్‌కే - శిష్మార్‌ (SSK-shishmar), భారత్‌ - ఫ్రాన్స్‌ తయారు చేసిన ఎస్‌ఎస్‌కే - సింధుఘోష్‌ సబ్‌మెరైన్‌లు, ఇటీవల మజ్‌గావ్‌డాక్‌లో తయారుచేసిన P-75 Kalveri జలాంతర్గాములు ఈ విభాగానికి చెందినవి. ఈ వ్యవస్థలో భాగంగా ఈ తరగతికి చెందిన 3 స్కార్పీన్‌ (Scorpene) సబ్‌మెరైన్‌లను రూపొందించారు.

* 2012-15 మధ్యకాలంలో 15 సబ్‌మెరైన్‌లు రూపొందించాలనేది లక్ష్యం. 2030 నాటికి వీటి సంఖ్యను 24కి పెంచాలని నావికాదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రూపొందుతున్న P-75I ఇంకా వేగవంతం కావాల్సి ఉంది.

ఎస్‌ఎస్‌ఎన్‌ సబ్‌మెరైన్‌: అణుశక్తి ఆయుధాల రూపకల్పనలో భాగంగా భారత అణుశక్తి ఆయుధాల రూపకల్పనలో భాగాంగా సబ్‌-మెర్సబిల్‌ షిప్‌ న్యూక్లియర్‌ జలాంతర్గాములను ప్రభుత్వం రూపొందించింది. వీటి ద్వారా క్రూయిజ్‌ మిస్సైల్స్‌ను అత్యంత వేగాంగా ప్రయోగించొచ్చు. ఈ వ్యవస్థలో రూపొందించిన జలాంతర్గాములు నీటి అంతర్భాగంలో క్రియాశీలకంగా దీర్ఘకాలం ఉంటాయి. ఈ వ్యవస్థ రూపకల్పనతో భారత ప్రభుత్వం అణు సామర్థ్యం కలిగిన ఆరు దేశాల సరసన చేరింది (అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా). ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి  ఇండియా రష్యా నుంచి  ఐఎన్‌ఎస్‌ చక్ర అనే జలాంతర్గామిని కొనుగోలు చేసింది.


ఎస్‌ఎస్‌బీఎన్‌ (షిప్‌ సబ్‌మెర్సిబుల్‌ బాలిస్టిక్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌)


ఇది నెమ్మదిగా కదిలే బాంబర్, అణ్వాయుధాలు కలిగిన క్షిపణి జలాంతర్గామి వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా స్ట్రాటజిక్‌  ఫోర్సెస్‌ కమాండ్‌లో భాగంగా ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌తో కలిపి మూడు క్షిపణులను రూపొందించారు.

అరిహంత్‌ను భారత నావికాదళం, బాబా అటామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (బార్క్‌), డిఫెన్స్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) సంయుక్తంగా రూపొందించాయి. దీన్ని ఆధునికీకరించి కొత్త వర్షన్‌ను విశాఖపట్నం షిప్‌ బిల్డింగ్‌ కేంద్రంలో రూపొందించారు. ఐఎన్‌ఎస్‌ అరిదమాన్‌ (INS aridhman) ఎక్కువ బరువున్న క్షిపణులను తీసుకెళ్లగలదు.


భారత నావికాదళ విన్యాసాలు

గణతంత్ర దినోత్సవ పెరేడ్‌ తర్వాత ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూస్‌ (PFR's) పేరిట నిర్వహించే నావికాదళ విన్యాసాలకు చాలా ప్రాధాన్యం ఉంది. స్వాతంత్య్రానంతరం వీటిని 12 సార్లు నిర్వహించారు. ఇందులో రెండు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్ రివ్యూస్‌ కాగా, మిగిలినవన్నీ ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌ రివ్యూస్‌. దేశంలో మొట్టమొదటిసారి 1953లో బాబూ రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూను 2011, 2016లో చేపట్టారు. 

* 2022లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ఈ సమయంలో ఫిబ్రవరి 21న మిలాన్‌ - 2022 నావికాదళ విన్యాసాలను విశాఖపట్నంలో  చేపట్టారు. దీని కోసం భారత ప్రభుత్వం 46 దేశాల నావికా దళాలను ఆహ్వానించింది.

* 2022 మే 24, 25వ తేదీల్లో భారత్‌ బంగ్లాదేశ్‌ మధ్య పోర్టు మంగళాలో ‘బోనోసాగర్‌’ పేరిట నావికాదళ విన్యాసాలను నిర్వహించారు.

* 2022 మార్చి 7 - 10 మధ్య భారత్, శ్రీలంక నావికాదళాలు విశాఖపట్నంలో స్లినెక్స్‌ (SLINEX) నావికాదళ విన్యాసం నిర్వహించాయి.

* 2022 జనవరి 5 - 20 మధ్య  భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా,  దక్షిణ కొరియా నావికాదళాల SEA Dragon విన్యాసాలను నిర్వహించారు.  అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని గువామ్‌ అండర్సన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ వీటికి వేదికగా నిలిచింది. 

* బిమ్‌స్టెక్‌ (BIMSTEC) దేశాల మధ్య నిర్వహించే నావికాదళ విన్యాసాలు PANEX-21 పేరిట మహారాష్ట్రలోని పుణెలో జరిగాయి.

* భారత్, శ్రీలంక, మాల్దీవుల కోస్ట్‌గార్డ్‌ల  మధ్య నిర్వహించే దోస్తీ-2021 విన్యాసాన్ని  2021 నవంబరు, 20-24 మధ్య మాల్దీవుల్లో నిర్వహించారు.

* 2021 నవంబరులో భారత నేవీ, రాయల్‌ థాయ్‌ మధ్య అండమాన్‌ సముద్రంలో ఇండో - థాయి కార్పెట్‌ విన్యాసాన్ని చేపట్టారు. దీనికి కొనసాగింపుగా SITMEX-21 విన్యాసాన్ని ఇండియన్‌ నేవీ, రిపబ్లికన్‌ ఆఫ్‌ సింగపూర్, థాయ్‌ నేవీ మధ్య నిర్వహించారు.

* భారత్, సౌదీ అరేబియా మధ్య 2021 ఆగస్టులో సౌదీ అరేబియాలో అల్‌ - మొహద్‌ అల్‌ - హిందీ విన్యాసాన్ని నిర్వహించారు. ఇదే నెలలో ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ఏ, జర్మనీ, ఫ్రాన్స్‌ సహా 15 ఇతర దేశాలతో కలిపి గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో SEACAT-21 నావికాదళ విన్యాసాలు జరిపారు.

* భారత్, రష్యా నావికా దళాలు బాల్టిక్‌ సముద్రంలో 2021 జులైలో ఇంద్ర నేవీ విన్యాసాన్ని నిర్వహించాయి.

* 2021 ఏప్రిల్‌ 25 - 27 మధ్య భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య వరుణ నావికా దళ విన్యాసాన్ని అరేబియన్‌ మహాసముద్రంలో  నిర్వహించారు.


ఏఐపీ (ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌) 

ఈ వ్యవస్థ ద్వారా సబ్‌మెరైన్‌లు అత్యంత దీర్ఘకాలం సముద్రపు కింది భాగాల్లో  ఉంటాయి. ఇలా ఉన్న సబ్‌మెరైన్‌లను గుర్తించటం కష్టం. భారత నావికాదళం అధునాతన ప్రాజెక్టు అయిన P-75Iలో దీన్ని ఆవిష్కరించనున్నారు.

Posted Date : 25-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌