• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - నీటి పారుదల

నీటిపారుదల వ్యవస్థ, వసతుల కల్పన కింది అంశాలపై ఆధారపడి ఉంటాయి. 

1) దేశంలో నదీ వ్యవస్థ

2) నదీ పరీవాహక ప్రాంతం

3) భూభాగ స్వరూపం

4) వర్షం సంభవించే తీరు

* వర్షాధారం, నదీ వ్యవస్థల ఆధారంగా మనదేశంలో నీటిపారుదల వసతులను మూడు రకాలుగా విభజించారు. అవి:

1. కాలువలు  2. బావులు  3. చెరువులు


కాలువలు 

* నీటిపారుదల వసతుల్లో కాలువలు చాలా ముఖ్యమైనవి.

* భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉండటం వల్ల కాలువల ద్వారా నీటి సౌకర్యం సాధ్యమైంది.

* ఉత్తర మైదానాల్లో సంవత్సరమంతా ప్రవహించే నదులు ఉన్నాయి. దీంతో అక్కడ కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉంది.

* 1950-51లో కాలువల ద్వారా సాగైన నికర భూమి 8.3 మిలియన్‌ హెక్టార్లు కాగా, ఇది 2020-21 నాటికి సుమారు 15.8 మిలియన్‌ హెక్టార్లుగా ఉంది. అంటే దేశంలో సుమారు 24.1% సాగుభూమి కాలువల ద్వారా సాగవుతోంది.

* భారతదేశంలో కాలువల ద్వారా ఎక్కువ భూమిని సాగు చేస్తున్న రాష్ట్రాలు - ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌.

రకాలు: మనదేశంలో రెండు రకాల కాలువలు ఉన్నాయి. అవి: 1) వరద కాలువలు    2) నదీ/ జీవ కాలువలు.


వరద కాలువలు: 

* ఇవి పూర్తిగా వర్షాకాలంలోని వరద నీటిపై ఆధారపడి ఉంటాయి.

* భారతదేశంలో పంజాబ్‌లోని సట్లెజ్‌ నదికి ఎక్కువ వరద కాలువలు ఉన్నాయి.


జీవ కాలువలు:

* నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి నీటిని కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్లిస్తారు. వీటినే జీవ కాలువలు అంటారు.

* భారతదేశంలోని ఉత*ర మైదానాల్లో జీవ కాలువలు ఎక్కువగా ఉన్నాయి.


బావులు


* 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం మనదేశంలో 62% భూమి బావుల ద్వారా సాగవుతోంది.

* మనదేశంలో పురాతన కాలం నుంచే బావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. డెల్టాయేతర, కాలువలు లేని ప్రాంతాల్లో తక్కువ లోతులో బావులు తవ్వి, వాటి ద్వారా లభించే భూగర్భ జలాలను వ్యవసాయానికి వినియోగిస*ారు.

* బావుల ద్వారా వ్యవసాయం చిన్న కమతాలకు అనుకూలం.

* 1950-51లో 6 మిలియన్‌ హెక్టార్ల భూమిని బావుల ద్వారా సాగుచేయగా, 2020-21 నాటికి ఈ భూమి 39 మిలియన్‌ హెక్టార్లుగా ఉంది.

* దేశంలో బావుల ద్వారా నీటి వసతి అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌.

రకాలు: బావులు రెండు రకాలు. అవి: 

1) ఉపరితల బావులు  2) గొట్టపు బావులు


ఉపరితల బావి: 

* వీటిని రైతులు తక్కువ లోతులో తవ్వుకుంటారు.

* సాధారణంగా ఈ బావులు డెల్టా ప్రాంతాలు, నదీ లోయలు, అవక్షేప శిలలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి.


గొట్టపు బావి: 

* యంత్రాల సాయంతో పంపుల ద్వారా భూ అంతర్భాగంలోని నీటిని పైకి తోడి వ్యవసాయానికి ఉపయోగిస్తారు.

* భారతదేశంలో హరిత విప్లవం తర్వాత గొట్టపుబావుల వినియోగం పెరిగింది.

* ఉత్తర్‌ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హరియాణలలో వీటి వినియోగం ఎక్కువగా ఉంది.


చెరువులు 

* మన దేశంలో దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎత్తుపల్లాలు  ఉండి, ఉపరితలం కఠినమైన శిలలతో నీరు సులభంగా ఇంకిపోని మట్టి పొరలతో ఏర్పడటమే ఇందుకు కారణం.

* భారతదేశంలో చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక.

* 1950-51లో మొత్తం నీటిపారుదలలో చెరువుల ద్వారా సాగయ్యే భూమి 17.2% ఉండగా ప్రస్తుతం 3.1% ఉంది.


బహుళార్థక సాధక ప్రాజెక్టులు


ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలను ఆశించి నదీ ప్రవాహంపై సరైన స్థలం వద్ద నిర్మించిన ప్రాజెక్టులను బహుళార్థక సాధక ప్రాజెక్టులు అంటారు. వీటిలో ముఖ్యమైనవి..


బాక్రానంగల్‌ ప్రాజెక్టు:

* పంజాబ్‌లోని సట్లెజ్‌ నదిపై నిర్మించారు.

* దేశంలో అతిపెద్ద బహుళార్థక సాధక పథకం.

* 14.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.

* పంజాబ్, హరియాణ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్నాయి.

* దేశంలో అత్యధిక విద్యుత్తును (1204 మెగావాట్లు) ఉత్పత్తి చేసే ప్రాజెక్టు కూడా ఇదే.


కోసి ప్రాజెక్టు: 

* బిహార్‌లోని కోసి నదిపై దీన్ని కట్టారు.

* ఇది భారత్, నేపాల్‌ సరిహద్దులో ఉంది. దీన్ని అంతర్జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తారు.

* కోసి నది వరదల నుంచి బిహార్‌ను రక్షించడం ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రధాన ఉద్దేశం.


దామోదర్‌ వ్యాలీ ప్రాజెక్టు: 

* ఇది స్వాతంత్య్రం వచ్చాక ప్రారంభించిన మొట్టమొదటి ప్రాజెక్టు.

* దీని నిర్మాణాన్ని 1948లో ప్రారంభించి 1957 నాటికి పూర్తి చేశారు.

* దీన్ని అమెరికాలోని టెన్నిస్‌ వ్యాలీ అథారిటీ ప్రాజెక్టు ఆధారంగా నిర్మించారు.

* దామోదర్‌ నది వరదల నుంచి బెంగాల్‌ ప్రాంతాన్ని కాపాడటం ఈ ప్రాజెక్టును నిర్మించడంలోని ముఖ్య ఉద్దేశం.

* ఇది ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాల ఉమ్మడి పథకం.

* ఈ ప్రాజెక్టు కింద ఆలయ్య, మైధాన్, పంచట్, కోనార్‌ అనే నాలుగు ఆనకట్టలను నిర్మించారు.


నర్మద లోయ ప్రాజెక్టు: 

* దీని నిర్మాణం 1987లో ప్రారంభమైంది.

* ఈ ప్రాజెక్టులో 30 భారీ, 135 మధ్యతరహా, 3000 చిన్నతరహా డ్యామ్‌లు ఉన్నాయి.


సర్దార్‌ సరోవర్‌ డ్యాం: 

* ఇది నర్మద లోయ ప్రాజెక్టులో అతిపెద్ద డ్యాం.

* గుజరాత్‌లోని నవగాం ప్రాంతంలో నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2017, సెప్టెంబరు 17న ప్రారంభించారు.


ఇందిరా సాగర్‌ డ్యాం: 

* మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిపై ఉంది.

* ఇందిరా సాగర్‌కు దిగువన ఓంకారేశ్వర్, మహేశ్వర డ్యాంలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ‘ఇందిరా సాగర్‌ కాంప్లెక్స్‌’ అంటారు.


హీరాకుడ్‌ ప్రాజెక్టు: 

* దీన్ని ఒడిశాలోని మహానదిపై నిర్మించారు.

* 1937లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాజెక్టు నమూనాను రూపొందించారు.

* ఈ ప్రాజెక్టు నిర్మాణం 1948లో ప్రారంభమై, 1957 నాటికి పూర్తయ్యింది.

* ఇది ప్రపంచంలో పొడవైన ప్రాజెక్టు, దీని పొడవు 4.801 కి.మీ.


తుంగభద్ర ప్రాజెక్టు: 

* దీన్ని కర్ణాటకలోని తుంగభద్రా నదిపై కట్టారు.

* దీని ఆయకట్టు విస్తీర్ణం 4.40 లక్షల హెక్టార్లు.


నీటిపారుదల ప్రాజెక్టులు - రకాలు

నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా మూడు రకాలు. అవి: 

1. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు (Major Projects)

2. మధ్యతరహా ప్రాజెక్టులు  (Medium Projects)

3. చిన్నతరహా ప్రాజెక్టులు (Minor Projects)


భారీ నీటిపారుదల ప్రాజెక్టులు: 10,000 హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతం ఉన్న ప్రాజెక్టులను భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అంటారు. 

ఉదా: భాక్రానంగల్‌ ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌


మధ్యతరహా ప్రాజెక్టులు: 2000 నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు ప్రాంతం ఉన్న ప్రాజెక్టులను మధ్యతరహా ప్రాజెక్టులు అంటారు. 

ఉదా: స్వర్ణ ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు


చిన్నతరహా ప్రాజెక్టులు: 2000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ప్రాంతం కలిగిన ప్రాజెక్టులను చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు.


నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు:


* దీన్ని కృష్ణా నదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నందికొండ వద్ద నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 1955లో ప్రారంభించి, 1967 నాటికి పూర్తి చేశారు.

* ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు.

* ఇది ప్రపంచంలో పెద్ద, అతి ఎత్తయిన  రాతికట్టడం.

* దీని కుడి ప్రధాన కాలువను జవహర్‌లాల్‌ కాలువ అని, ఎడమ ప్రధాన కాలువను లాల్‌బహదూర్‌ శాస్త్రి కాలువ అని అంటారు.


పోలవరం ప్రాజెక్టు: 

* దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. 

* 1941లో అప్పటి నీటిపారుదల మఖ్య ఇంజినీర్‌ ఎల్‌. వెంకటకృష్ణ అయ్యర్‌ పోలవరం సమీపంలో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, దీని పేరును ‘రామపాద సాగర్‌’గా సూచించారు.

* 1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

* పోలవరం ప్రాజెక్టు కుడికాలువ పొడవు 174 కి.మీ. ఈ కాలువ ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు.

* పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పొడవు 181.50 కి.మీ. దీని ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.


కాళేశ్వరం ప్రాజెక్టు:

* తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించారు.

* 2016, మే 21న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్‌ మండలంలోని కన్నెపల్లి వద్ద భూమి పూజ చేశారు.

* ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ నీటిపారుదల ఎత్తిపోతల పథకం.

* దీని వల్ల తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.


శ్రీశైలం ప్రాజెక్టు: 

* కర్నూలు జిల్లాలో కృష్ణానదిపై నిర్మించారు.

* దీన్నే నీలం సంజీవరెడ్డి సాగర్‌ ప్రాజెక్టు అని కూడా అంటారు.

* ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం జలవిద్యుత్‌ ఉత్పాదన.

* ఇందులో రెండు జల విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి.

* సాగునీటి అవసరాల కోసం 1981లో శ్రీశైలం కుడిగట్టు కాలువ, 1983లో తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమ కాలువలను నిర్మించారు.


***************************

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామాల్లో సుమారు 60% మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. స్థూల జాతీయాదాయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 1960-61లో 53.5 శాతం ఉండగా, 2013-14 నాటికి 14 శాతానికి పడిపోయింది. మన వ్యవసాయం ప్రధానంగా నీటి పారుదల మీద ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
* వ్యవసాయం ఫలప్రదం కావాలంటే, అన్ని ప్రాంతాల్లో సేద్యపు నీటి వసతి అవసరం. నీటి పారుదల వసతులు ఉన్నట్లయితే సంవత్సరం పొడవునా భూమిని లాభదాయకంగా ఉపయోగించుకోవచ్చు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచి అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. మన దేశంలో సగటు వర్షపాతం సుమారు 116 సెంటీమీటర్లుగా నమోదవుతుంది. ఇంత ఎక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ మనకు నీటి వనరుల కొరత ఏర్పడుతూనే ఉంది.
* భారతదేశంలో వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడటమే ఇందుకు కారణం. ఈ రుతుపవనాలు సంవత్సరంలో కేవలం 3-4 నెలల వరకే వర్షపాతాన్ని కల్పిస్తున్నాయి. పైగా అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సమాన వర్షపాతం ఉండటం లేదు. తూర్పున మాసిన్‌రామ్, చిరపుంజి (మేఘాలయ)లో అత్యధికంగా 1200 సెం.మీ. వరకు వర్షపాతం ఉంటే, పశ్చిమాన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 25 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇలాంటి వ్యత్యాసాల కారణంగా మనకు నీటి పారుదల వనరులు అవసరమవుతున్నాయి.
* రుతుపవనాలు సకాలంలో రావడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల గతి తప్పుతోంది. పైగా, ఎల్‌నినో లాంటి సముద్ర నీటి ప్రవాహాల ప్రభావం వల్ల వీటి దిశ మారుతోంది.
* వ్యవసాయ దిగుబడులు పెంచడం ద్వారా ఆహార భద్రతను కల్పించడానికి నీటిపారుదల చాలా అవసరం.
* భారతదేశ నీటి పారుదల గణాంకాలను పరిశీలిస్తే మొత్తం నికర సాగు భూమి 144 మిలియన్ల హెక్టార్లు కాగా, నికర నీటి పారుదల ఉన్న భూమి కేవలం 56 మిలియన్ హెక్టార్లు మాత్రమే.


నీటి పారుదల పద్ధతులు

మనదేశంలో మూడు రకాల సంప్రదాయ నీటి పారుదల పద్ధతులు ఉన్నాయి. అవి...
1) బావులు - గొట్టపు బావులు,       2) కాలువలు,        3) చెరువులు.
* బావులు, గొట్టపు బావులు: బావులు ప్రాచీన కాలం నుంచి ప్రధాన నీటి పారుదల వనరులుగా ఉన్నాయి. అందుకే వీటిని నీటి పారుదలకు పర్యాయపదంగా వ్యవహరిస్తారు.
* దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అధికంగా ఈ రకమైన నీటి పారుదల వసతి ఉంది. ఆయా ప్రాంతాల్లో మెత్తటి నేలలు, భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటమే దీనికి కారణం.
* 1966 లో సంభవించిన ఉత్తర భారతదేశ కరవు తర్వాత గొట్టపు బావుల తవ్వకం అధికమైంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ ప్రోత్సాహకాల వల్ల బావుల వాడకం కంటే గొట్టపు బావుల వాడకం ఎక్కువైంది. గుజరాత్‌లో అత్యధిక శాతం సాగుభూమి ఈ రకమైన నీటిపారుదల కింద ఉంది. మొత్తం భారతదేశంలో 56 శాతం సాగుభూమి ఈ రకమైన నీటిపారుదల కింద సాగవుతోంది.
* ఉపయోగాలు: బావులు లేదా గొట్టపు బావులను నీటిపారుదల వనరులుగా వినియోగించడం వల్ల వ్యక్తిగత యాజమాన్యం పెరగడం, సాగునీటి వినియోగం నియంత్రణలో ఉండటం, సకాలంలో నీటి సరఫరాను అందించడం మొదలైన ఉపయోగాలు ఉన్నాయి.
* ఈ రకమైన నీటి పారుదల వల్ల నీటి ఉపయోగిత 85 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. కానీ ఈ విధానంలో భూగర్భ జలాలను విపరీతంగా వాడటం, భూగర్భ జలాలను తిరిగి నింపకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు, భూసార పర్యవసనాలు లాంటి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.


కాలువలు

భారతదేశంలో ఈ విధమైన నీటి పారుదల సౌకర్యం బ్రిటిష్ పాలకుల వల్ల వాడుకలోకి వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ లాంటి మహనీయులు లండన్‌లోని థేమ్స్ నదీ ప్రవాహ వ్యవస్థ మాదిరిగా భారతదేశంలో కూడా కాలువలు నిర్మించాలని భావించారు.
* భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉండటం వల్ల కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యం కల్పించడానికి వీలవుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతం దీనికి అనువైన ప్రాంతం. ద్వీపకల్ప భాగంలోని నదులు వర్షాధారమైనవి కావడం వల్ల, కేవలం అనువైన ప్రదేశాల్లో మాత్రమే నదులకు ఆనకట్టలు నిర్మించారు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని కావలసినప్పుడు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాలకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నారు. దేశం మొత్తంమీద నీటిపారుదల కింద ఉన్న భూమిలో కేవలం 34 శాతం మాత్రమే కాలువల కింద సాగవుతోంది.
ముఖ్య పథకాలు: కాలువల విస్తీర్ణం పెంచడానికి కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. అవి..
* దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC)
* కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (CADP)
* ఎసిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (Accelerated Irrigation Benefits Programme - AIBP)
* ఒండ్రు నేలలో కాలువల విస్తీర్ణం ఎక్కువ. పంజాబ్, హరియాణాలో ఈ తరహా నీటి పారుదల సౌకర్యాలు అధికంగా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ పద్ధతిలో సాగయ్యే భూమి అధికం. భారతదేశంలోని అతి పొడవైన కాలువ - ఇందిరా గాంధీ కాలువ. ఇది సట్లెజ్ (Sutlej) నది నుంచి రాజస్థాన్‌లోని ఎడారి భూమికి నీటి సరఫరాను అందిస్తోంది.
నష్టాలు: కాలువల నిర్మాణంలో కొన్ని నష్టాలు ఉన్నాయి. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
* అధిక నిర్మాణ వ్యయం
* అత్యల్ప నీటి ఉపయోగిత. ఈ తరహా నీటిపారుదలలో కేవలం 30% - 40% నీరు మాత్రమే ఉపయోగపడుతుంది. అధిక శాతం నీరు ఇంకిపోవడం లేదా ఆవిరై పోవడమే ఇందుకు కారణం.
* ఇది కాలువకు దగ్గరగా ఉన్న రైతులకు, చివర ఉన్న రైతులకు మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీస్తుంది.


చెరువులు

సాధారణంగా ఎక్కడైతే స్థలాకృతి ఎగుడుదిగుడుగా, సహజ పల్లపు ప్రాంతాలుగా, నేలల అడుగున కఠినంగా, ప్రవేశయోగ్యం లేనివిధంగా ఉంటుందో అలాంటి ప్రాంతాలు చెరువుల నిర్మాణానికి అనువైనవి. ఈ పరిస్థితులున్న ప్రాంతాలు దక్కన్ పీఠభూమిలో కోకొల్లలు. కాబట్టి చెరువుల ద్వారా నీటి పారుదల వ్యవస్థ దక్కన్‌లో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రకమైన వ్యవసాయాన్ని చూడొచ్చు.
* దేశం మొత్తంలో ఈ రకమైన నీటి పారుదల సౌకర్యం కింద ఉన్న భూమి కేవలం 6 శాతం మాత్రమే. బావులు, కాలువల వల్ల పోటీని తట్టుకోలేక అధికశాతం చెరువులు క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా హఠాత్తుగా వచ్చే వరదల వల్ల చెరువుల గట్లు కొట్టుకు పోవడం, కొన్ని చెరువులను వ్యవసాయ భూములుగా మార్చడం, మరికొన్నింటిని ఆక్రమించుకోవడం లాంటివి చెరువుల విస్తీర్ణం తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి.


నీటి లభ్యత గణాంకాలు
దేశం మొత్తంలో నీటి వనరులు 1800 BCM (బిలియన్ క్యూబిక్ మీటర్లు). మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం 1100 BCM నీటిని మాత్రమే అందుబాటులోకి తీసుకురాగలిగారు. ఇందులో 433 BCM భూగర్భ జలాలు కాగా, 690 BCM ఉపరితల ప్రవాహాలు. ప్రస్తుతం నీటి వాడుకను ఇలానే కొనసాగిస్తే నీటి వనరులు 2030 వరకు మాత్రమే మన అవసరాలు తీర్చగలవు. ఆ తర్వాత తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది.
ఇతర నీటి పారుదల సౌకర్యాలు

    సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల కొన్ని రకాల నీటిపారుదల సౌకర్యాలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అవి..
1) తుంపర సేద్యం (Sprinklers irrigation),
2) బిందు సేద్యం (Drip irrigation).
ఈ తరహా నీటి పారుదల పద్ధతులను మధ్యదరా సముద్ర వ్యవసాయ పద్ధతి నుంచి భారతదేశంలోకి ప్రవేశపెట్టారు. తుంపర సేద్యం ద్వారా నీటి ఉపయోగిత 95 శాతం వరకు ఉంటుంది. బిందు సేద్యంలో నీటిని నేరుగా మొక్క వేరుకు చేరేవిధంగా చర్యలు తీసుకుంటారు. అందువల్ల ఈ రకమైన సేద్యంలో వంద శాతం నీరు వినియోగితమవుతుంది. భారత ప్రభుత్వం ఈ తరహా నీటి పారుదలకు 90 శాతం సబ్సిడీతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
 

1. కిందివాటిలో ఏ రాష్ట్ర వ్యవసాయం అధిక శాతం బావులపైనే ఆధారపడి ఉంది?
ఎ) మధ్యప్రదేశ్      బి) బిహార్       సి) గుజరాత్       డి) పశ్చిమ్ బంగ
జ: సి (గుజరాత్)


2. భారతదేశంలో అతి పొడవైన కాలువ ఏది?
జ: ఇందిరా గాంధీ కాలువ


3. నీటి ఉపయోగిత వంద శాతం ఉన్న నీటిపారుదల పద్ధతి ఏది?
జ: బిందు సేద్యం


4. చెరువుల ద్వారా నీటి పారుదలను అత్యధికంగా ఏ రాష్ట్రంలో చూడొచ్చు?
జ: తమిళనాడు


5. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు (DVC) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ: 1948

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌