• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో విజయాలు

* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన INSAT-2A ఉపగ్రహాన్ని 1992, జులై 10న ప్రయోగించారు. దీని తర్వాత 1993, జులై 23న INSAT-2B, 1995, డిసెంబరు 28న ఐఆర్‌ఎస్‌-1C ఉపగ్రహ ప్రయోగాయి జరిగాయి. 

* మొబైల్‌ శాటిలైట్‌ సర్వీసులు, బిజినెస్‌ కమ్యూనికేషన్‌ సేవలు, టెలివిజన్‌ ప్రసార సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు 1995, డిసెంబరు 7న INSAT-2C ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 

* ఈ ఉపగ్రహాలను మరింత మెరుగుపరుస్తూ 1997, జూన్‌ 4న  INSAT-2Dని కక్ష్యలోకి పంపారు. 

* ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహ వ్యవస్థలో మొదటిస్వదేశీ వాహకనౌక పీఎస్‌ఎల్వీ-C1. దీని ద్వారా ఐఆర్‌ఎస్‌1 ఉపగ్రహాన్ని 1997, సెప్టెంబరు 29న అంతరిక్షంలోకి పంపారు. 

* 1999, ఏప్రిల్‌ 3న INSAT వ్యవస్థలో రెండో తరంలో చివరిదైన INSAT-2E ఉపగ్రహాన్ని ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. 

* 1999, మే 26న ఐఆర్‌ఎస్‌-P4 ( OCEANSAT1) ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-C2 వాహక నౌక ద్వారా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో OCM (ఓషియన్‌ కలర్‌ మానిటర్‌), MSMR (మల్టీ ఫ్రీక్వెన్సీ స్కానింగ్‌ మైక్రోవేవ్‌ రేడియో మీటర్‌) వ్యవస్థలు ఉన్నాయి. దీని ద్వారా సముద్ర గర్భాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వీలు కలిగింది. 

* 2000, మే 22న ఇన్సాట్‌ వ్యవస్థలో  మూడో తరం (INSAT-3) మల్టీ పర్పస్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌లను కౌరు కేంద్రం నుంచి ప్రయోగించారు. 

* 2001, అక్టోబరు 22న ఇస్రో పీఎస్‌ఎల్వీ-C3 వాహక నౌక ద్వారా 3 టెక్నాలజీ ఎక్స్‌పరిమెంట్‌ శాటిలైట్‌లను ప్రయోగించింది. అవి: భారత్‌కి చెందిన TES (Technology Experiment Satellite), జర్మనీకి చెందిన BIRD
(Bispectral and Infrared Remote Detection), బెల్జియంకు చెందిన PROBA (Project for On-Board Autonomy). తర్వాతి కాలంలో భారత్‌ ప్రయోగించిన గూఢచారి ఉపగ్రహాలకు (Spy satellites) మార్గదర్శిగా TES ఉపగ్రహాన్ని పేర్కొంటారు. 

* సమాచార ప్రసార వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి 2002, జనవరి 24న ఇన్సాట్‌-2C ఉపగ్రహాన్ని కౌరు కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 

* జీఎస్‌ఎల్వీ వ్యవస్థలో అధునాతనమైన జీఎస్‌ఎల్వీ-D2 వాహక నౌక ద్వారా 2003, మే 8న మొదటిసారి GSAT2 ఉపగ్రహాన్ని పరీక్షించారు.

* 2002, సెప్టెంబరు 12న భారతదేశ మొదటి వాతావరణ పరిశోధన ఉపగ్రహం కల్పన 1 (METSAT)ను పీఎస్‌ఎల్వీ-C4 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపారు. దీన్ని శ్రీహరికోట కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

* 2003, అక్టోబరు 17న పీఎస్‌ఎల్వీ వాహకనౌక ద్వారా రిసోర్స్‌శాట్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఐఆర్‌ఎస్‌-1C, ఐఆర్‌ఎస్‌-1Dల స్థానంలో ఇది పనిచేస్తుంది.

* 2004, సెప్టెంబరు 20న ఇస్రో GSLVFO1ను కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగాన్ని శ్రీహరి కోట నుంచి నిర్వహించారు. ఇది మనదేశంలో విద్య కోసం ప్రమోగించిన మొదటి ఉపగ్రహం. దీన్ని EDUSAT అని పిలుస్తారు. ఈ ఉపగ్రహానికి two way కమ్యూనికేషన్‌ సౌకర్యాలు కల్పించి, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యా పంపిణీ చేశారు.

* 2005, మే 5న పీఎస్‌ఎల్‌వీ-C6 వాహకనౌక ద్వారా భూ పరిశీలన ఉపగ్రహమైన cartosat-1ను శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇందులో  cartosat తో పాటు HAMSATను కక్ష్యలోకి పంపారు. ఇది ఇండియన్, డచ్‌ శాస్త్రవేత్తల సహకారంతో నిర్మితమైన మైక్రోశాటిలైట్‌. ఈ ప్రయోగం ద్వారా శాటిలైట్‌ ఆధారిత ameture రేడియో సేవలను జాతీయ, అంతర్జాతీయ సమూహాలకు అందించాలని భావించారు.

* 2007, జనవరి 10న పీఎస్‌ఎల్వీ-C7 వాహక నౌక ద్వారా అధునాతన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం Cartosat-2ను ప్రయోగించారు. దీంతోపాటు ఇండోనేసియాకు చెందిన LAPAN-TUBSAT, అర్జెంటీనాకు చెందిన PEHUENSAT ఉపగ్రహాలను SRE1 (Space Capsule Recovery Experiment)తో కలిపి ప్రయోగించారు.

* 2007, మార్చి 12న ఒకేలా ఉండే (identical) ఉపగ్రహాలైన INSAT-4A INSAT-4Bను కౌరు నుంచి ప్రయోగించారు. 

* 2007, ఏప్రిల్‌ 23న పీఎస్‌ఎల్వీ-C8 వాహక నౌక ద్వారా ఇటాలియన్‌ ఆస్ట్రోనామికల్‌ ఉపగ్రహం AGILEను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. 

* 2008, జనవరి 21న పీఎస్‌ఎల్వీ-C10 వాహక నౌక ద్వారా TecSAR (Technological synthetic aperture satellite) ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆన్‌క్రిట్స్‌ వాణిజ్య సేవల్లో భాగంగా ఈ  ప్రయోగం జరిగింది.

* 2008, ఏప్రిల్‌ 28న Cartosat-2 సేవలు కొనసాగించడానికి Cartosat-2Aను ప్రయోగించారు. దీంతో పాటు అత్యంత చౌకగా తయారుచేసిన సూక్ష్మ ఉపగ్రహం IMS-1, విదేశాలకు చెందిన 8 నానో ఉపగ్రహాలను శ్రీహరి కోట కేంద్రం నుంచి ప్రయోగించారు.

* 2009, ఏప్రిల్‌ 20న రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ RISAT-2, ANUSATలను శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగించారు. ANUSAT (Anna University Satellitez) భారతదేశంలోనే మొదటిసారిగా విశ్వవిద్యాలయంలో రూపొందించిన 40 కేజీల మైక్రో ఎడ్యుకేషనల్‌ శాటిలైట్‌.  

* 2009, సెప్టెంబరు 23న పీఎస్‌ఎల్వీ -C14 వాహక నౌక ద్వారా ఏడు ఉపగ్రహాలను (ఓషన్‌శాట్‌ 2, నాలుగు క్యూబ్‌ శాట్‌ శాటిలైట్లు, రెండు రూబిన్‌-9) శ్రీహరికోట కేంద్రం నుంచి ప్రయోగించారు. ఓషన్‌శాట్‌-1 స్థానంలో ఓషన్‌శాట్‌-2ను పంపారు. 

* 2010, జులై 12న పీఎస్‌ఎల్వీ-C15 అయిదు ఉపగ్రహాలను (Cartosat-2A, రెండు నానో శాటిలైట్లు, STUDSAT అనే పీకో శాటిలైట్‌) విజయవంతంగా కక్ష్యలోకి తీసుకెళ్లింది. మనదేశంలో మొదట ప్రయోగించిన పీకో ఉపగ్రహం STUDSAT. దీని బరువు కేజీ కంటే తక్కువ. ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన ఏడు ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు రూపొందించారు.

* 2011, ఏప్రిల్‌ 20న పీఎస్‌ఎల్వీ-C16 వాహక నౌక ద్వారా రిసోర్స్‌శాట్, యూత్‌శాట్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. యూత్‌శాట్‌ను భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి. దీన్ని యూనివర్సిటీ స్థాయి గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, రిసెర్చ్‌ స్కాలర్లు రూపొందించారు. ఇది మినీ శాటిలైట్‌లా ఉండి, నక్షత్ర - వాతావరణ సంబంధిత పరిశోధనలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉపగ్రహంలో మూడు పేలోడ్‌లు ఉన్నాయి. వాటిలో భారత్‌కు చెందినవి 2, రష్యాకు సంబంధించింది 1. ఈ ఉపగ్రహం సౌర వైవిధ్యం గురించి; థర్మోస్పియర్, ఆయనోస్పియర్‌లలో మార్పులపై అధ్యయనం చేస్తుంది.

* 2011, మే 21న ఏరియేన్‌ వాహక నౌక ద్వారా GSAT8 లేదా ఇన్సాట్‌-4G సమాచార ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఇన్సాట్‌ వ్యవస్థ అందించే వివిధ కమ్యూనికేషన్‌ సేవలు ఈ ఉపగ్రహం ద్వారా మరింత మెరుగయ్యాయి.

* 2011, అక్టోబరు 12న ఇస్రో, ఫ్రెంచ్‌కి చెందిన CNES (Centre national d’études spatiales) సంయుక్తంగా పీఎస్‌ఎల్వీ-C8 వాహక నౌక ద్వారా మెగా ట్రాఫిక్స్, జుగును, SRMSAT తదితర ఉపగ్రహాలను  కక్ష్యలోకి పంపారు. మెగా ట్రాఫిక్స్‌ ఉపగ్రహం వాతావరణ పరిశోధనలో మెరుగైన సేవలను అందిస్తోంది. జుగును మూడు కేజీల బరువుతో నానోశాటిలైట్‌లా ఉంటుంది. ఇస్రో మార్గదర్శకాలతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కాన్పూర్‌కి చెందిన విద్యార్థులు రూపొందించారు. SRMSAT ఉపగ్రహం 10.9 కేజీల బరువు ఉంటుంది. చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు దీన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహాన్ని అప్పటి కాలంలో (2011) పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ అధ్యయనం కోసం రూపొందించారు. 

* భారతదేశ మొదటి రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఐఆర్‌ఎస్‌ 1Aను 1988, మార్చి 17న రష్యాలోని బైకనూరు కేంద్రం నుంచి ప్రయోగించారు. ఇదే కేంద్రం నుంచి 1991, ఆగస్టు 29న ఐఆర్‌ఎస్‌ 1Bని కక్ష్యలోకి పంపారు. ఇది భారత్‌కు చెందిన రెండో ఆపరేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌. రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు ముఖ్యంగా సహజ వనరుల లభ్యత, అటవీ సంపద అన్వేషణ, విపత్తు ముందస్తు హెచ్చరికలు పంపడం, ఖనిజ సంపద అన్వేషణ, వాతావరణ అధ్యయనం మొదలైన అనువర్తనాలను అందిస్తాయి.

* 1998లో సౌదీ అరేబియాకు చెందిన ARABSAT ఉపగ్రహ వ్యవస్థ ద్వారా ఇండియన్‌ నేషనల్‌ శాటిలైట్‌ సిస్టం (INSAT) సామర్థ్యాన్ని మరింత ఆధునికీకరించారు. ఇంతకుముందు అంతరిక్షంలోకి పంపిన INSAT-1D, 2B ఉపగ్రహాల సేవలను INSAT 2DTకి బదిలీ చేసి, అధిక ట్రాన్స్‌పాండర్లతో దీని కమ్యూనికేషన్‌ పరిధిని మరింత విస్తృతం చేశారు.

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌