• facebook
  • whatsapp
  • telegram

మొక్క పెరుగుదల, అభివృద్ధి

* ఒక జీవిలో మౌలికంగా, సుస్పష్టంగా కనిపించే ముఖ్య లక్షణాల్లో ప్రధానమైనవి పెరుగుదల, అభివృద్ధి.

* ఒక జీవి లేదా దాని భాగాలు లేదా ఒక ఒంటరి కణం పరిమాణంలో జరిగే శాశ్వత పురోగతిని పెరుగుదల లేదా వృద్ధిగా నిర్వచిస్తారు. ఇందులో తిరోగమనం ఉండదు.

* మొక్కలు జీవించినంత కాలం వాటి పెరుగుదలను అనిశ్చితంగా కొనసాగించగలిగే శక్తిని కలిగి ఉంటాయి. వీటికి ఈ సామర్థ్యం ఉండటానికి ప్రధాన కారణం మొక్కల దేహంలోని కొన్ని ప్రదేశాల్లో ఉండే విభాజ్య కణజాలాలు.

* మొక్కల పెరుగుదలకు, అక్షం మీదుగా పెరిగే దైర్ఘ్య పెరుగుదలకు ముఖ్య కారణం విభాజ్య కణజాలాలు ఉండటమే.

* ద్విదళబీజ మొక్కల్లో, వివృత బీజాల్లో పార్శ్వ విభాజ్య కణజాలాలు, నాళికావిభాజ్య కణావళులు, బెండు విభాజ్య కణావళులు మొక్క తర్వాతి దశల్లో  ఏర్పడతాయి. ఈ విభాజ్య కణజాలాలు ఉండే అంగాల్లో క్రియాత్మకంగా ఉండే వాటి చుట్టుకొలత పెంచడానికి తోడ్పడతాయి. దీన్ని మొక్క ద్వితీయవృద్ధిగా పేర్కొంటారు.

* కణంలో ప్రధానంగా జీవపదార్థం పరిమాణం పెరగడం వల్లే పెరుగుదల సంభవిస్తుంది.


మొక్కల్లో పెరుగుదల కాలం


మొక్కల్లో పెరుగుదల కాలాన్ని మూడు దశలుగా విభజించారు. అవి: 

1. విభజన    2. దైర్ఘ్య వృద్ధి    3. పరిపక్వత

* ఒక ప్రమాణకాలంలో జరిగే పెరుగుదలను పెరుగుదల రేటుగా పేర్కొంటారు.

* జీవవ్యవస్థల పెరుగుదల మధ్య పరిమాణాత్మక పోలికలను రెండు రకాలుగా చెప్పొచ్చు.

1. ఒక ప్రమాణకాలంలోని మొత్తం పెరుగుదలకు సంబంధించిన కొలతలు, పోలికలను పరమ లేదా సంపూర్ణ పెరుగుదల రేటు అంటారు. 

2. ప్రారంభ పరిమాణం శాతంగా ఒక ప్రమాణ కాలంలో ఇచ్చిన వ్యవస్థ పెరుగుదలను సాపేక్ష పెరుగుదల రేటు అంటారు.


పెరుగుదలకు ముఖ్యమైనవి:

* పెరుగుదలకు నీరు, ఆక్సిజన్, పోషకాల లభ్యత ప్రధానమైనవి.

* కణం విస్తరించడం వల్ల మొక్క కణాల పరిమాణం పెరుగుతుంది. దీనికి నీరు అవసరం. 

* కణాల స్ఫీతం వల్ల పెరుగుదల కొనసాగుతుంది. ఈవిధంగా జరిగే మొక్క పెరుగుదల, ఆ తర్వాత జరిగే అభివృద్ధి, మొక్క నీటి పరిమాణం స్థాయిలో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

* పెరుగుదలకు అవసరమైన ఎన్‌జైమ్‌ల క్రియాశీలతకు నీరు యానకంలా పనిచేస్తుంది. పెరుగుదల క్రియాశీలతకు కావాల్సిన జీవక్రియా శక్తిని విడుదల చేయడంలో ఆక్సిజన్‌ తోడ్పడుతుంది.

* మొక్కకు అవసరమయ్యే పోషకాలు జీవపదార్థ సంశ్లేషణకు తోడ్పడతాయి. ఇవి శక్తికి మూలాధారంగా పనిచేస్తాయి. 

* ప్రతి మొక్కలోనూ వాటి పెరుగుదలకు సరిపోయేలా యుక్తతమ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతల్లో కొంచెం మార్పు వచ్చినా అది ఎన్‌జైమ్‌ల మనుగడకే హానికరం. కాంతి, గురుత్వం లాంటి ఆవరణ సంకేతాలు కూడా పెరుగుదల దశలను ప్రభావితం చేస్తాయి.


విభేదనం


* వేరు, ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలాలు, విభాజ్య కణావళుల నుంచి ఏర్పడిన కణాలు విశిష్టమైన విధులను నిర్వర్తించడానికి వీలుగా విభేదనం చెంది పరిపక్వమవుతాయి. ఈ ప్రక్రియను విభేదనం అంటారు.

* విభేదనం చెందేటప్పుడు కణాల్లో కొంచెం లేదా ఎక్కువగా నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయి. ఇవి వాటి కణకవచాల్లో లేదా జీవపదార్థంలో జరుగుతాయి. 

ఉదా: కణాల నుంచి దారు మూలకం ఏర్పడే సమయంలో కణాలు జీవపదార్థాన్ని కోల్పోతాయి. అంతేకాకుండా చాలా బలమైన, స్థితిస్థాపక గుణం ఉన్న లిగ్నిన్, సెల్యులోజ్‌తో నిర్మితమైన కణకవచాలు ఏర్పడతాయి. దీంతో అధిక తన్యతలో కూడా ఈ కణాలు దూరస్థానాలకు నీటిని చేరవేస్తాయి.

* మొక్కల్లో మరో ఆసక్తికర దృగ్విషయం ఉంటుంది. విభజన శక్తి కోల్పోయి, విభేదనం చెందిన సజీవ కణాలు కొన్ని పరిస్థితుల్లో తిరిగి విభజన శక్తిని సంపాదించుకుంటాయి. ఈ దృగ్విషయాన్ని ‘నిర్విభేదనం’ అంటారు.

ఉదా: విభేదనం చెందిన మృదుకణజాల కణాల నుంచి పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి అనే విభాజ్య కణజాలాలు ఏర్పడటం.

* విభజన చెందే కొత్త కణాలను ఉత్పత్తి చేసే విభాజ్య కణజాలాలు లేదా కణజాలాలు తిరిగి విభజన శక్తిని కోల్పోయి విశిష్ట విధులను నిర్వర్తించడానికి వీలుగా పరిపక్వమవుతాయి. అంటే ఇవి పునర్విభేదనం చెందుతాయి.

* విత్తనం అంకురించడం నుంచి వార్థక్యం లేదా జీర్ణత వేరుకు ఒక జీవి జీవితచక్రంలో జరిగే మార్పులన్నింటినీ అభివృద్ధి అనే పదంలో చెప్పొచ్చు.


పుష్పించడం


* మొక్కల పెరుగుదలలో పుష్పించడం ఒక ప్రధాన ప్రక్రియ. ఎందుకంటే ఫలదీకరణం చెందిన పుష్ప అండం విత్తనంగా మారితే, అండాశయం అనే భాగం ఫలంగా మారుతుంది. విత్తన అంకురణ వల్ల కొత్త మొక్కలు ఏర్పడతాయి.

* పురుషోత్పత్తిని ప్రేరేపించడానికి కొన్ని మొక్కలు కాంతికి బహిర్గతపరుస్తాయి. అంతేకాకుండా అలాంటి మొక్కలు కాంతి కాలవ్యవధిని కూడా గుర్తిస్తాయి.

* కొన్ని మొక్కల కాంతికాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాలవ్యవధి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. ఇలాంటి మొక్కలను దీర్ఘదీప్తికాల మొక్కలు అంటారు. 

* మరికొన్ని మొక్కలు కాంతికాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాంతి కాలవ్యవధి కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పిస్తాయి. ఈ మొక్కలను హ్రస్వదీప్తికాల మొక్కలు అంటారు.

* పుష్పించడానికి అవసరమైన కాలవ్యవధి (సందిగ్ధకాల వ్యవధి) ఒక్కో మొక్కకు ఒక్కోలా ఉంటుంది.

* కొన్ని మొక్కలు కాంతికాల ప్రమాణానికి పరస్పర సంబంధం లేకుండా పుష్పిస్తాయి. అలాంటి మొక్కలను దీప్తికాల తటస్థ మొక్కలు అంటారు.

* కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి కాంతి, నిష్కాంతులకు బహిర్గతం అయ్యే ప్రమాణాలపై మాత్రమే కాకుండా, వాటి సాపేక్ష వ్యవధుల మీద కూడా ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

* పగలు లేదా రాత్రి కాలాలకు మొక్కలు చూపించే ఈ అనుక్రియలను ‘కాంతి కాలావధి’ అంటారు.

* కాంతి లేదా నిష్కాంతి కాలప్రేరణ భాగాలను పత్రాలుగానే పరిగణిస్తారు.

* మొక్కల్లో కాంతి సంబంధ పుష్పప్రేరణ ఫైటోక్రోమ్‌ల ఆధీనంలో ఉంటుంది.

* కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి పరిమాణాత్మకంగా లేదా గుణాత్మకంగా స్వల్పఉష్ణోగ్రతలకు బహిర్గతం కావడంపై ఆధారపడి ఉంటుంది.

* అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పూర్వ అభిచర్య ద్వారా అతిత్వరగా మొక్కల్లో పుష్పోత్పత్తిని ప్రేరేపించవచ్చు. ఈ పద్ధతిని వెర్నలైజేషన్‌ అంటారు.

* గోధుమ, బార్లీ లాంటి ఆహార సంబంధ మొక్కల్లో రెండు రకాలు ఉంటాయి. అవి: శీతలకాల, వసంతకాల పంట రకాలు.

* వసంతకాల మొక్కను సాధారణంగా వసంత రుతువులో నాటుతారు. దీనిలో పుష్పాలు ఏర్పడటం, గింజల ఉత్పత్తి, పెరుగుదల మొదలైనవి రుతువు చివర్లో జరుగుతాయి. 

* అలాకాకుండా శీతాకాల రకాలను వసంతకాలంలో నాటితే పుష్పాలను, ఫలాలను పుష్పోత్పత్తి కాలం లోపల ఉత్పత్తి చేయలేవు.  రెండో సంవత్సరం వరకూ గింజల దిగుబడి లభించదు. అందువల్ల వీటిని శరత్‌ రుతువులో నాటుతారు. ఇవి శీతాకాల ప్రారంభంలో వెర్నలైజేషన్‌కులోనై, పుష్పోత్పత్తిని ప్రేరేపించగల వాటి కొనభాగాలు పుష్పాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. పుష్పవిన్యాసం అభివృద్ధి ఆ తర్వాత వచ్చే వసంత రుతువులో పూర్తవుతుంది. ఆ తర్వాత ఎండాకాలంలో లేదా శరత్‌ రుతువు ప్రారంభంలో పంట కోస్తారు.

* పెరుగుతున్న ఒక ద్విదళ బీజ మొక్కను శీతల అభిచర్యకు లోనుచేస్తే అదే రుతువులో సరైన కాంతి కాలాన్ని పొంది దానికి అనుక్రియగా పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి.

* మొక్కల్లో పెరుగుదల ప్రమాణానికి, కాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే రేఖాచిత్రాన్ని గీసినప్పుడు అది 'S' ఆకారంలో కనిపిస్తుంది. ఈ రేఖాచిత్రాన్ని సిగ్మాయిడ్‌ లేదా 'S' వక్రరేఖ అంటారు.

మాదిరి ప్రశ్నలు 

1. మొక్కలకు శీతల అభిచర్య జరిపి, త్వరగా పుష్పించే గుణాన్ని ప్రేరేపించడాన్ని ఏమంటారు?

1) టెంపలైజేషన్‌    2) వెర్నలైజేషన్‌     3) కొర్నలైజేషన్‌    4) టెంపరింగ్‌

జ: 2


2. మొక్కల్లో పెరుగుదల ప్రమాణానికి, కాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించే రేఖాచిత్రం ఏ ఆకారంలో ఉంటుంది?

1) L      2) M      3) C      4) S

జ: 4


3. ఫలాలు పక్వానికి వచ్చేటప్పుడు శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. దీన్ని ఏమంటారు?

1) క్లైమాటిక్‌ శ్వాసక్రియ   2) క్లైఆక్సలిక్‌ శ్వాసక్రియ  3) క్లైయన్‌ శ్వాసక్రియ  4) రెస్పిరేటరీ మాక్సిమా

జ: 1


4. మొక్కలు వాతావరణానికి అనుక్రియగా భిన్న రకాల నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ సామర్థ్యాన్ని ఏమంటారు?

1) ప్లాస్టిసిటీ    2) పరిక్లిప్‌     3) ప్లక్సిమా    4) టెన్సైల్‌స్ట్రెంత్‌

జ: 1


5. కాంతి కాలావధి మొక్కల్లో దేన్ని నిర్ణయిస్తుంది?

1)  మొక్కల అంతర్నిర్మాణం     2) మొక్కల వేరు పెరుగుదల

3) మొక్కల పత్రాల సంఖ్య     4) మొక్కలు పుష్పించడం

జ: 4


6. శాశ్వత పెరుగుదలను చూపించే జీవులు....

1) జిరాఫీ    2) తిమింగలం    3) పరిణితి చెందిన మొక్కలు      4) నత్తలు

జ: 3


విత్తనాల అంకురణ

* విత్తనం నుంచి నారు మొక్క బయటకు వెలువడే ప్రక్రియగా విత్తనాల అంకురణను నిర్వచిస్తారు. విత్తనం అంకురణ శక్తిని కలిగి ఉండొచ్చు అయితే, అనేక కారణాల వల్ల అంకురించలేకపోవొచ్చు లేదా పెరగలేకపోవచ్చు.

* అంకురించడానికి వీలుగా స్వరూపాత్మకంగా పరిపక్వం చెందని పిండాన్ని ఒక అంతరకారకంగా చెప్పొచ్చు. సరైన ఉష్ణోగ్రత, తేమ మొదలైనవి లభించకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తలేవు.

* పెరుగుదలకు కావాల్సిన అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించకపోవడాన్ని ‘క్విసెన్స్‌’ అంటారు.

* బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తన అంతర్గత పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురించలేకపోవడాన్ని ‘సుప్తావస్థ’ అంటారు.

* ఆక్సిజన్‌ లేదా నీటిని పీల్చుకోలేని గట్టి బీజకవచాలు కలిగి ఉండటం వల్ల విత్తనాల్లో సుప్తావస్థ కలగొచ్చు. ముఖ్యంగా ఫాబేసీ మొక్కల విత్తనాల్లో ఈ రకమైన సుప్తావస్థ ఉంటుంది.

* గట్టి బీజ కవచాల వల్ల కలిగే ఇలాంటి సుప్తావస్థను స్కారిఫికేషన్‌ అనే పద్ధతి ద్వారా పోగొట్టొచ్చు. ఇందులో గట్టి బీజకవచాల్లో పగుళ్లను కరిగించడం లేదా రసాయన పదార్థాలను ఉపయోగించి బీజ కవచాలను కరిగించడం లాంటివి చేస్తారు.

* రోజువారీ ఉష్ణోగ్రతలు అధికంగా, అల్పంగా ఒకదాని వెంట మరొకటి ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు అంకురించడానికి అనుక్రియ చూపిస్తాయి. చాలా విత్తనాల్లో సుప్తావస్థను నిరోధించడానికి ‘స్ట్రాటిఫికేషన్‌’ అనే పద్ధతిని అవలంబిస్తారు.

* శీతాకాలంలో విత్తనాలను తడి ఇసుక, పీట్‌లలో పొరలుగా పెట్టి ఉంచుతారు. దీన్నే స్ట్రాటిఫికేషన్‌ అంటారు. దీన్నే పూర్వశీతల అభిచర్య లేదా ప్రీచిల్లింగ్‌ అని కూడా అంటారు. 

Posted Date : 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌