• facebook
  • whatsapp
  • telegram

మొక్క భాగాలు - రూపాంతరాలు

స్థిరంగా ఉంచుతూ.. మొత్తంగా మోస్తూ!


  మొక్కల్లోని వివిధ భాగాలకు నిర్దిష్ట విధులుంటాయి. వేరు భాగం మొక్కను స్థిరంగా ఉంచి, భూమి నుంచి నీరు, పోషకాలను అందిస్తుంది. పూర్తి మొక్కను కాండం మోస్తుంది. పత్రాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండిపదార్థాన్ని తయారుచేస్తాయి. ఇంకొన్ని కీలక భాగాలు పరిసరాలకు అనుగుణంగా ఇతర విధులు నిర్వర్తిస్తుంటాయి. ఇందుకోసం రూపాంతరం చెందుతాయి. జీవావరణంలో స్వయం పోషకాలు, ప్రథమ పోషకజీవులైన మొక్కల్లోని ఈ సహజ మార్పులు, అందులోని రకాలు, వాటి ప్రయోజనాలు ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉంటాయి.


  మొక్కల భాగాలు వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంటాయి. కొన్ని మొక్కల వేర్లల్లో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. మరికొన్ని మొక్కల కాండాలు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహిస్తాయి. ఇంకొన్ని మొక్కల పత్రాలు బోనులుగా మారి ఉంటాయి. 


రూపాంతరత: పరిసరాలకు అనుగుణంగా కొత్త లేదా ప్రత్యేక విధులు నిర్వర్తించడానికి మొక్కల భాగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను రూపాంతరత అంటారు. మొక్కల్లో వేరు, కాండం, పత్రాలు రూపాంతరతను ప్రదర్శిస్తాయి.


వేరు రూపాంతరాలు


యాంత్రిక వేర్లు: గాలి తాకిడి నుంచి నిలదొక్కుకోవడానికి యాంత్రికంగా బలాన్నిచ్చే వేర్లను యాంత్రిక వేర్లు అంటారు. వీటిలో ముఖ్యమైనవి ఊడ వేర్లు, ఊత వేర్లు.


ఊడ వేర్లు:  ఈ మొక్కలో వేర్లు, కాండం శాఖల నుంచి ఉద్భవించి భూమిలోకి చొచ్చుకెళ్లి స్తంభాల మాదిరిగా ఆధారాన్ని ఇస్తాయి. 

ఉదా:  మర్రి


ఊత వేర్లు: వీటిలో వేర్లు ప్రధాన కాండం నుంచి ఉద్భవించి భూమిలోకి వెళ్లి ఊతాన్నిస్తాయి.

ఉదా: మొక్కజొన్న, రైజోఫోరా, మొగలి చెట్టు 


ఎగబాకే వేర్లు:  ఇలాంటి మొక్కల్లో కాండం బలహీనంగా ఉండటం వల్ల ఆధారంతో ఎగబాకడానికి వేర్లను ఉపయోగించుకుంటాయి. 

ఉదా:  మిరియాలు, తమలపాకు, వెనిల్లా మొక్కలు


వృక్షోపజీవ వేర్లు:  ఇతర మొక్కలపై నివాసం ఏర్పరచుకునే మొక్కలను వృక్షోపజీవ మొక్కలు అంటారు. వీటిలో వెలామిన్‌ కణజాలం ఉన్న వెలామిన్‌ వేర్లు ఉంటాయి. ఇవి గాలిలోని తేమను శోషిస్తాయి.

ఉదా:  వాండా.


కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు:  ఈ మొక్కల్లో కాండం, పత్రాలు ఉండవు. అందువల్ల వేర్లు ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి.

ఉదా:  టీనియోఫిల్లం


పరాన్నజీవ లేదా హస్టోరియల్‌ వేర్లు:  ఇవి వేరే మొక్కలపై జీవిస్తాయి. ఆతిథేయి మొక్క కాండంలోకి వెళ్లి నీరు, లవణాలు, పోషక పదార్థాలను గ్రహిస్తాయి.

ఉదా:  లొరాంథస్, కస్క్యూటా


శ్వాసవేర్లు: ఇలాంటి వేర్లు మాంగ్రూవ్‌ మొక్కల్లో ఉంటాయి. ఇవి భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా వాయుగతంగా పెరుగుతాయి. ఈ వేర్లలోని శ్వాసరంధ్రాలు/ వాయురంధ్రాలు శ్వాసించడానికి ఉపయోగపడతాయి.

ఉదా: రైజోఫొరా, అవిసీనియా


బుడిపెలున్న వేర్లు: ఈ మొక్కల వేర్లలో వేరుబుడిపెలుంటాయి. ఆ వేరు బుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియా సహజీవనం చేస్తూ గాలిలోని నత్రజనిని స్థాపించి మొక్కకు అందజేస్తుంది.

ఉదా:  చిక్కుడు జాతి మొక్కలు, లెగ్యుమినేసి మొక్కలైన వేరుశనగ, చిక్కుడు, కంది, పెసర, మినుము


తేలియాడే వేర్లు:  ఈ మొక్కల వేర్లు గాలిని నిల్వ చేసుకుని నీటిపై మొక్క తేలడానికి ఉపయోగపడతాయి.

ఉదా: జస్సియా


సంతులనం జరిపే వేర్లు: ఈ వేర్లు మొక్క నీటిపై సంతులనం జరపడానికి ఉపయోగపడతాయి.

ఉదా: పిస్టియా, ఐకార్నియా


పత్రపు వేర్లు:  ఈ మొక్కల్లో పత్రాలే వేర్లుగా మారతాయి.  

ఉదా: సాల్వేనియా


పత్రాలపై ఏర్పడే వేర్లు: ఈ మొక్కల్లో పత్రాల అంచుల నుంచి వేర్లు ఏర్పడతాయి.

ఉదా: బిగోనియా, బ్రయోఫిల్లం


దుంప వేర్లు లేదా నిల్వ చేసే వేర్లు: కొన్ని మొక్కల వేర్లలో ఆహారం నిల్వ ఉండి ఉబ్బి దుంపల్లా ఉంటాయి. క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్‌ లాంటి మొక్కల్లో తల్లి వేరులో ఆహారం నిల్వ ఉంటుంది. చిలగడదుంప, డాహ్లియా లాంటి మొక్కల్లో ఆహారం అబ్బురపు వేర్లలో నిల్వ ఉంటుంది. క్యారెట్, ముల్లంగి మొక్కల్లో ఆహారం పిండిపదార్థ రూపంలో, బీట్‌ దుంపలో చక్కెర రూపంలో, డాహ్లియాలో ఇన్యులిన్‌ రూపంలో నిల్వ ఉంటుంది.


కాండ రూపాంతరాలు: కాండం దాదాపుగా వాయుగతంగా, శాఖలతో ఉంటుంది. కొన్నిసార్లు ఇది రూపాంతరం చెంది వివిధ పనులు నిర్వర్తిస్తుంది. కాండ రూపాంతరాలను మూడు రకాలుగా విభజించవచ్చు.


1) వాయుగత కాండ రూపాంతరాలు: వీటిలో మళ్లీ రకరకాలున్నాయి. 


అ) నులి తీగలు: ఈ మొక్కల్లో కాండం నుంచి స్ప్రింగు మాదిరి ఉండే నిర్మాణాలు మొక్క ఎగబాకడానికి తోడ్పడతాయి.

ఉదా: నల్లేరు, పాసిఫ్లోరా


ఆ) ముళ్లు లేదా కంటకాలు:  వీటిలో ముళ్లు రక్షణకు, ఎగబాకడానికి తోడ్పడతాయి. 

ఉదా: కాగితంపూలు (బోగన్‌విల్లియా), వాక (కారిస్సా).


ఇ) కొక్కేలు: ఈ మొక్కల్లో కొక్కేలు ఎగబాకడానికి ఉపయోగపడతాయి. ఉదా: సంపెంగ


ఈ) పత్రాభకాండాలు:  ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియను జరిపే కాండాలను పత్రాభకాండాలు అంటారు. ఎడారి ప్రాంతాల్లో లేదా నీరు లేని ప్రదేశాల్లో పత్రాలు పొలుసాకులు లేదా కంటకాలుగా మారి ఉంటాయి. పత్రాలకు బదులుగా కాండం కిరణజన్య సంయోగక్రియలను చూపుతుంది. మొక్కలు బాష్పోత్సేకాన్ని నివారించడానికి ఈ విధమైన నిర్మాణాలను చూపుతాయి.

ఉదా: ఒపన్షియా (నాగజెముడు), కాజురైనా (సరుగుడు)


ఉ) దుంప లాంటి కాండాలు:  ఈ మొక్కల్లో వాయుగత కాండం ఆహార పదార్థాలను నిల్వ చేసి దుంపలా మారుతుంది.

ఉదా: నూల్‌కోల్, బల్బోఫిల్లమ్‌


ఊ) లఘులశునాలు:  ఈ మొక్కల్లో శాకీయోత్పత్తిని జరపడానికి ఈ నిర్మాణాలు ఉపయోగపడతాయి. 

ఉదా: కిత్తనార (అగేవ్‌ అమెరికానా), డయోస్కోరియా


2) భూగర్భకాండ రూపాంతరాలు: ఎక్కువ మొక్కల్లో కాండాలు వాయుగతంగా పెరుగుతాయి. కానీ కొన్ని మొక్కల్లో కాండాలు భూమిలో ఉండి ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటిలో ఉండే రకాలు.


అ) కొమ్ము: భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండాన్ని కొమ్ము అంటారు. 

ఉదా: అల్లం, పసుపు, అరటి, మెట్టతామర


ఆ) కందం: నిలువుగా, ఉబ్బెత్తుగా, భూమి లోపల నిట్టనిలువుగా పెరిగే భూగర్భ కాండాన్ని కందం అంటారు.

ఉదా: కంద, చామ


ఇ) భూగర్భ దుంప కాండం: భూగర్భ కాండ శాఖల చివరి భాగాలు కొన్ని ఉబ్బి ఆహార పదార్థాలను నిల్వ చేసి దుంపలుగా మారతాయి.

ఉదా: బంగాళాదుంప


ఈ) లశునం: ఇవి భూమిలో నిట్టనిలువుగా పెరుగుతాయి. వీటిలో కాండం క్షీణించి గుండ్రటి ఫలకంలా ఉంటుంది. ఇవి రెండు రకాలు. 


1) కంచుకిత లశునం - ఉల్లి  


2) కంచుకరహిత లశునం - వెల్లుల్లి


3) ఉప వాయుగత కాండాలు: కాండం కొంత వాయుగతం, మరికొంత భూగర్భంగా ఉంటే వాటిని ఉపవాయుగత కాండాలు అంటారు. వీటిలో కాండం బలహీనంగా ఉంటుంది. శాఖీయ ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. ఇవి నాలుగు రకాలుగా ఉన్నాయి.


అ) రన్నర్‌లు: ఇవి బలహీన కాండంతో నేలపై సాగిలపడి పెరుగుతాయి. కాండం కణుపు నుంచి వేర్లు ఏర్పడి కాండాన్ని భూమిలోకి స్థాపన చేస్తాయి. ఇవి ప్రధాన కాండం నుంచి విడిపోయినప్పుడు స్వతంత్ర మొక్కలుగా రూపాంతరం చెందుతాయి. 

ఉదా: హైడ్రో కొటైల్, ఆక్సాలిస్‌


ఆ) స్టోలన్లు: వీటిలో మృత్తికకు దగ్గరగా ఉండే కాండ భాగం బలహీనంగా ఉండి నేలను తాకి, తిరిగి వాయుగతమవుతుంది. నేలను తాకినచోట వేర్లు ఏర్పడతాయి. 

ఉదా: మల్లె, గులాబీ, గన్నేరు


ఇ) పిలక మొక్కలు: ఈ మొక్కల్లో కాండం కొంతభాగం మృత్తికలో ఉంటుంది. ఈ భాగం కణుపుల వద్ద నుంచి శాఖలు ఏర్పడి కొంత భూమిలో పెరిగి చివరికి వాయుగతమవుతాయి. శాఖల నుంచి వేర్లు ఏర్పడతాయి. ఇవి విడిపోయి స్వతంత్ర మొక్కగా ఉండగలవు. 

ఉదా: చామంతి, పుదీనా


ఈ) ఆఫ్‌సెట్‌లు: ఇవి నీటిపై స్వేచ్ఛగా తేలియాడే మొక్కల్లో ఉంటాయి. వీటిలో పత్రగ్రీవపు మొగ్గల నుంచి ఒకే కణుపు నడిమి ఉన్న శాఖలు ఉద్భవించి శాఖల చివర పైవైపున పత్రాలు, కింది వైపు వేర్లు ఏర్పడతాయి. కణుపు మధ్యమాలు తెగిపోయి ఇవి స్వతంత్రంగా బతకగలవు. 

ఉదా: పిస్టియా, ఐకార్నియా (గుర్రపుడెక్క)


మాదిరి ప్రశ్నలు


1. మొక్కల్లో కింది ఏ భాగాలు ప్రత్యేక విధులు లేదా అదనపు విధులు నిర్వర్తించడానికి రూపాంతరం చెందాయి?

1) కాండం   2) వేరు   3) పత్రాలు   4) పైవన్నీ

2. గాలి తాకిడి నుంచి నిలదొక్కుకునేందుకు ప్రధాన కాండం నుంచి ఉద్భవించే ఊత వేర్లు కింది ఏ మొక్కల్లో ఉంటాయి?

1) మొక్కజొన్న, రైజోఫొరా   2) మర్రి, రావి   3) చింత, మామిడి   4) అశోక, సరుగుడు


3. గాలిలోని తేమను గ్రహించగల వెలామిన్‌ కణజాలం కింది ఏ వేర్లలో కనిపిస్తుంది?

1) ఎగబాకే వేర్లు   2) వృక్షోపజీవ వేర్లు   3) పరాన్నజీవ వేర్లు   4) ఊడ వేర్లు


4. పరాన్నజీవ లేదా హస్టోరియల్‌ వేర్లు కింది ఏ మొక్కల్లో కనిపిస్తాయి?

1) తమలపాకు, వెనిల్లా   2) వాండా, టీనియోఫిల్లం 

3) లొరాంథస్, కస్క్యూటా   4) రైజోఫొరా, అవిసీనియా


5. శ్వాస వేర్లు కింది ఏ రకమైన మొక్కల్లో కనిపిస్తాయి?

1) మాంగ్రూవ్‌ మొక్కలు   2) నీటి మొక్కలు   3) బురద మొక్కలు   4) ఎడారి మొక్కలు


6. చిక్కుడు జాతికి చెందిన మొక్కల వేరు బుడిపెల్లో ఉన్న బ్యాక్టీరియా?

1) సూడోమోనాస్‌   2) క్లామిడోమోనాస్‌   3) క్లాస్ట్రీడియం   4) రైజోబియం 


7. పిస్టియా, ఐకార్నియా మొక్కల్లో కింది ఏ రకమైన వేర్లు ఉంటాయి?

1) తేలియాడే వేర్లు   2) సంతులనం జరిపే వేర్లు   3) పత్రపు వేర్లు   4) నీటి వేర్లు


8. కిందివాటిలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుని దుంపవేర్లుగా మారిన వాటికి ఉదాహరణ-

1) అల్లం, పసుపు, కంద   2) అరటి, బంగాళదుంప, పసుపు

3) క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప   4) వేరుశనగ, చేమ, కంద

9. ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియను జరిపే పత్రాభకాండాలు ఏ మొక్కల్లో ఉంటాయి?

1) ఒపన్షియా, కాజురైనా      2) నూల్‌కోల్, బల్బోఫిల్లమ్‌

3) బోగన్‌విల్లియా, కారిస్సా     4) నల్లేరు, పాసిఫ్లోరా 


సమాధానాలు: 1-4, 2-1, 3-2, 4-3, 5-1, 6-4, 7-2, 8-3, 9-1


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌
 

Posted Date : 13-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌