• facebook
  • whatsapp
  • telegram

ప్రతిదీ ప్రశ్నగా రాదు!

* వర్తమాన అంశాలను చదివే మెలకువలు

పోటీపరీక్షలనగానే అప్పుడే రాయటం ప్రారంభించిన అభ్యర్థి కూడా మొట్టమొదట వర్తమాన అంశాలతో (కరెంట్‌ అఫైర్స్‌) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఎందుకంటే.. దీనిలో పాలిటీ, ఎకానమీ, జనరల్‌ నాలెడ్జ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ప్రభుత్వ కార్యక్రమాలు మొదలైన వాటన్నిటి తాజా అంశాలు చదివే అవకాశం ఉంటుంది కనుక. అయితే వార్తల్లో వచ్చే ప్రతి అంశమూ, ప్రతి గణాంకమూ పోటీ పరీక్షలకు ముఖ్యం కాదు. వాటిని కష్టపడి  గుర్తుంచుకోవాల్సిన అవసరమూ లేదు. వీటిని ఎలా చదవాలి? ఎంతవరకూ చదవాలి అనే అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవటం చాలా అవసరం!  
 

ఆబ్జెక్టివ్‌ పోటీ పరీక్షల్లో 150కిగానూ 20 ప్రశ్నల వరకూ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వస్తూ ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నల్లో ఒక వ్యాసం రాసే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ పరీక్షల్లో అనేక ప్రశ్నలతో కరెంట్‌అఫైర్స్‌ అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా వర్తమాన అంశాలు అభ్యర్థుల్లో ఒక ప్రధానమైన భాగంగా మారాయి. వీటిపై పట్టు సాధించేందుకు చాలా అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కొందరైతే తెలిసో తెలియకో రోజంతా, పోటీ పరీక్షల మ్యాగజీన్లని ముందేసుకుని కుస్తీ పడుతుంటారు. ఇటీవలి కాలంలో యూట్యూబ్‌ ఛానళ్లు ఎక్కువై పోవడంతో కొందరు రోజంతా కరెంట్‌ అఫైర్స్‌ వింటూ..చూస్తూ ఆ క్రమంలో మిగతా సబ్జెక్టులకు ఇవ్వవలసిన ప్రాధాన్యం సరిగా గుర్తించటం లేదు. కరెంట్‌ అఫైర్స్‌ని ఏ సందర్భంలో ఎలా చదవాలనే అవగాహన లేక చాలా సందర్భాల్లో విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడే పోటీ పరీక్షల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అభ్యర్థులు అనుభవం లేక తప్పుదోవలో నడిచే అవకాశం ఎక్కువగా ఉంటోంది.
 

పరిణామం పూర్తయ్యేవరకు...
గ్రూప్‌ 1, సివిల్స్‌ లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులు ఫ్యాక్ట్స్‌ను జ్ఞాపకం పెట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేయకుండా జరుగుతున్న పరిణామాల్ని భావనాత్మకœంగా గ్రహించి, గుర్తుంచుకుంటే ప్రయోజనం. ఉదాహరణకు భారత్‌- చైనా సంబంధాలు తీసుకుందాం. డోక్లాం సంఘటన తరువాత మొన్నీమధ్య గాల్వాన్‌లో జరిగిన సంఘటనలను గుర్తు పెట్టుకుంటే చాలు. ఈరోజు జరిగినవి ఇప్పటికి చాలా ముఖ్యమైనవని అనిపిస్తాయి కానీ ఒక రెండు మూడు రోజుల తర్వాత అంత ముఖ్యమనిపించవు. అందువల్ల ఒక పరిణామం పూర్తయ్యేవరకు పరిజ్ఞానం పెంచుకోవాలి కానీ జ్ఞాపకం ఉంచుకోవడానికి విపరీతమైన కృషి చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్‌ వ్యాక్సిన్, మందుల విషయంలో రోజువారీ పరిణామాలు కొన్ని వందలు పేపర్లో కనబడుతుంటాయి. వాటన్నిటినీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష జరిగే సమయానికి ఉండే అప్‌డేటెడ్‌ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. 

 

ఇలా కరెంట్‌ అఫైర్స్‌లో ఏది దీర్ఘకాలిక అవసరం, ఏది స్వల్పకాలిక అవసరం- అనే స్పృహ ఉంచుకుని సన్నద్ధమైతే కరెంట్‌ అఫైర్స్‌ వల్ల గరిష్ఠ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది.
 

కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలు స్థూలంగా....
ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు
ఒక మాదిరి విశ్లేషణ కలిగిన ప్రశ్నలు
భావనల ఆధారంగా అడిగే ప్రశ్నలు
లోతైన సమాచారం అడిగే ప్రశ్నలు
1, 2 సంవత్సరాల నాటి ప్రశ్నలు
 

అసలు ఇలాంటి వర్గీకరణ అవసరం ఏముంది? ఒక పరీక్ష ద్వారా పొందే ఉద్యోగాలు, పరిపాలనలో వాటి హోదాలను బట్టి ఈ ప్రశ్న రకాల్లో కొన్నిటిని గుర్తించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌ పరీక్షలో ప్రాథమిక పరిజ్ఞానంపై ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్‌ 2లాంటి పరీక్షల్లో ప్రశ్నలు కొన్ని సాధారణ పరిజ్ఞానంతో, మరికొన్ని విశ్లేషణతో, మరికొన్ని భావనల ఆధారంగా అడగవచ్చు. ఇలాంటి క్రమంలో పరీక్షను బట్టి ప్రిపరేషన్‌ ఉండాలి కానీ ‘అన్నిటికీ ఒకే మంత్రం’ అనే మాదిరిగా ఉండాల్సిన అవసరం లేదు.
 

కానిస్టేబుల్‌ లాంటి చిన్న స్థాయి పరీక్షలకు అయితే ప్రతిరోజూ కరెంట్‌ అఫైర్స్‌ చదవాల్సిన అవసరం ఏమీ లేదు. పరీక్షతేదీ ననుసరించి అప్పటికి మార్కెట్లో లభ్యమయ్యే వర్తమాన అంశాల పత్రికలను రెండు మూడు నెలలు ముందుగా చదవడం ప్రారంభిస్తే చాలు. అలా కాకుండా ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్‌ అఫైర్స్‌ సన్నద్ధతకు సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు.
 

గ్రూప్‌ 2 లాంటి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష తేదీకి ఐదారు నెలలనుంచి రోజూ ఒక గంట సమయం కేటాయిస్తే చాలు.
 

గ్రూపు 1 గానీ, సివిల్స్‌ గానీ రాసేవారు ప్రతి రోజూ 1, 2 గంటల సమయం కేటాయిస్తే ఇతర సబ్జెక్టుల సమాచారం కూడా అనుసంధానం అవుతుంది. కాబట్టి వారు ఈ పోటీ పరీక్షల రంగంలో ఉన్నంత కాలం వర్తమాన అంశాలు చదువుతూ ఉండటం అవసరమే.

చదివే సమాచారంలో ఏది దీర్ఘకాలిక స్థిరత్వం ఉంటుంది? ఏది స్వల్పకాలికమైనది? అనే విచక్షణతో చదివితే ప్రయోజనం ఎక్కువ.
 

వివాదాస్పద అంశాల్లో విశ్వసనీయత కలిగిన వ్యవస్థల, సంస్థల, వ్యక్తుల అభిప్రాయాలపై ఆధారపడాలి. భిన్న కోణాలను ఆవిష్కరించగలిగిన సమాచారాన్ని గ్రహించాలి. 
 

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరెంట్‌ అఫైర్స్‌ను అధ్యయనం చేయాల్సిన ఓర్పు, నేర్పు అభ్యర్థికి ఉండాలి.
 

కొవిడ్‌..క్రికెట్‌.. వేటిలో ఏవి ముఖ్యం?
కొవిడ్‌-19 ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న ఒక అంశం. రోజువారీగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితులయ్యేవారి సంఖ్య, మరణించే వారి సంఖ్య, వయసుల వారీగా ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య..ఈ  సమాచారం పుష్కలంగా లభిస్తోంది. కరెంట్‌ అఫైర్స్‌ కింద ఇవాళ ప్రభావితులైనవారు ఎంతమంది? మరణించినవారు ఎంతమంది? ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు అని నిత్యం చదివితే వచ్చేది గందరగోళం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. పరీక్షకు ముందుండే పరిస్థితుల సమాచారం గుర్తు పెట్టుకుంటే చాలు. ఇలాంటి టెక్నిక్‌ని పాటిస్తే అభ్యర్థి సమయంతో పాటు శ్రమ కూడా ఆదా అవుతుంది.

 

క్రికెట్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ముందుగా సెంచరీ కొట్టింది ఎవరు? అత్యధిక స్కోరు చేసింది ఎవరు? ఈ రోజు పోటీ పడుతున్న జట్లు ఏమిటి?- ఇలాంటి రోజువారీ సమాచారం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంతిమంగా ఐపీఎల్‌ మ్యాచ్‌ ముగిసిన తరువాత ముఖ్యమైన కొన్ని అంశాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కదా! 
 

ఇటీవల యూట్యూబ్‌ ఛానళ్లు పెరిగిపోయిన తర్వాత డైలీ న్యూస్‌ విశ్లేషణ పేరుతో కొందరు కొవిడ్, ఐపీఎల్‌ లాంటి మ్యాచులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ బిట్లుగా మార్చి అభ్యర్థులపై రుద్దుతున్నారు. అమాయకులైన అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ సమాజం నుంచి వచ్చినవారు ‘ఇలాగే చదవాలేమో’ అనుకుని  కరెంట్‌ అఫైర్స్‌ కోసం సమయం, శ్రమ, మొబైల్‌ డేటాని కూడా వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి పన్నాగాల్లో అభ్యర్థులు పడకూడదు.  
 

గుర్తుంచుకోవాలంటే...
కరెంట్‌ అఫైర్స్‌ని స్పష్టంగా గుర్తుంచుకోవాలంటే.. ప్రశ్నలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు 
1. దీర్ఘకాలికంగా మార్పునకు అవకాశం లేని ప్రశ్నలు
2. సమీపకాలంలో మారేందుకు అవకాశమున్న ప్రశ్నలు

 

ఆర్‌బీఐ వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి కొన్ని ఆర్థిక నివేదికలు ప్రచురిస్తూ ఉంటారు. ఇలాంటివి ప్రతి మూడు నెలలకు ఒకసారి బట్టీ పట్టో, మరొక పద్ధతిలోనో గుర్తుంచుకుంటే అభ్యర్థికి నష్టం జరుగుతుంది. ఎన్నిసార్లని ఆ గణాంకాలను గుర్తుంచుకుంటూపోతారు- పరీక్ష తేదీ తెలియకుండా? ఇలాంటి సమాచారాల విషయంలో పరీక్ష తేదీకి సమీపంలో ఉండే నివేదికలపై ఆధారపడితే సరిపోతుంది. అందువల్ల చదివే సమాచారంలో ఏది దీర్ఘకాలిక స్థిరత్వం ఉంటుంది? ఏది స్వల్పకాలికమైనది? అనే విచక్షణతో కరెంట్‌ అఫైర్స్‌ చదివితే ప్రయోజనం ఎక్కువ.

రాజ్యాంగ సవరణలు లాంటివి మొదట కరెంట్‌ అఫైర్స్‌గా ఉంటాయి. తర్వాత అవి స్టాక్‌ జీకేకి చెందుతాయి. ఇలాంటి సమాచారాన్ని గుర్తించి దీర్ఘకాలిక ప్రయోజనాలతో సంబంధం ఉంటుంది కనుక వాటిని ఎప్పటికప్పుడు చదివితే అభ్యర్థికి చాలా ప్రయోజనకరం. ఇదే కోణం శాస్త్ర సాంకేతికతకు కూడా అన్వయించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు పీఎస్‌ఎల్‌వీ సీ 37 ప్రయోగం జరిగిందని అనుకుందాం. పరీక్ష సమీపంలో ఉంటే దానికి సంబంధించిన సమస్త సమాచారాన్నీ చదువుకోండి. పరీక్ష దీర్ఘ కాలంలో ఉంటే దానికి సంబంధించిన లక్ష్యం సఫలత- విఫలత లాంటివి చదువుకుంటే చాలు. ఇప్పటి నుంచే దాని పొడవు ఎంత? బరువు ఎంత? ఉపగ్రహాల పరిమాణం ఎంత? లాంటివి చదవటం అవివేకమని గుర్తించాలి.

 

ప్రామాణిక వనరులే మేలు 
‘వర్తమాన అంశాలకు వనరులు ఏవి?’ అనేది కూడా చాలా ముఖ్యం. సోషల్‌ మీడియాలో పంపిణీ అవుతున్న పీడీ…ఎఫ్‌ ఫైళ్ల్లు, యూట్యూబ్‌ చానళ్లు, ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన వెబ్‌సైట్లు తమ వ్యాపారాన్ని పెంచుకునే క్రమంలో ప్రతి చిన్న విషయాన్నీ  సంచలనాత్మకంగా మార్చడం... వాటిని పరీక్ష కోణంలో ప్రొజెక్ట్‌ చేయడం జరుగుతోంది. అందువల్ల అభ్యర్థులు ప్రభుత్వ సైట్లు, దీర్ఘకాలికంగా విశ్వసనీయతను కల్పించుకున్న దినపత్రికలపై మాత్రమే ఆధారపడితే వివిధ అంశాలకు సంబంధించిన భావన వికాసం సరిగా జరుగుతుంది. 

 

కొన్ని వర్గాల వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉండే వెబ్‌సైట్లలో  వాస్తవిక సమాచారం ఇవ్వరు. వారి అనుకూల సమాచారం ఇస్తూ ఉంటారు. వాటిని చదివిన అభ్యర్థి అదే కోణంలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటే పరీక్షలో సరైన సమాధానాన్ని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి వివాదాస్పద అంశాల్లో విశ్వసనీయత కలిగిన వ్యవస్థల, సంస్థల, వ్యక్తుల అభిప్రాయాలపై ఆధారపడితే మేలు. 
 

చర్చనీయాంశంగా ఉన్న వ్యవసాయ బిల్లులు సరళీకరణ కోణంలో ఆహ్వానించదగినవే. అయితే వ్యవసాయం లాభదాయకంగా మార్చే క్రమంలో కనీస భద్రతాంశాలు కూడా ఆ చట్టంలో కనిపించకపోవడం పెద్ద లోపం. కార్పొరేట్‌ వ్యవస్థ చేతుల్లో రైతు బలహీనుడయ్యే ప్రమాదం స్పష్టంగా ఉంది. ఇలా రెండు కోణాల్ని ఆవిష్కరించగలిగిన సమాచారాన్ని అభ్యర్థి గ్రహించిగలిగినప్పుడే పరీక్షల్లో సముచితంగా రాసే వీలుంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కరెంట్‌ అఫైర్స్‌ను అధ్యయనం చేయాల్సిన ఓర్పు, నేర్పు అభ్యర్థికి ఉండాలి.
 

వర్తమాన అంశాల అధ్యయనం రెండంచుల కత్తి లాంటిది. సరిగా వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. గాడి తప్పితే లక్ష్యం సాధించలేకపోవచ్చు!
 

  • Tags :

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.