• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం 

 సృష్టిలో ప్రతి జీవికి జన్మతః ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులు, సహజాతాలు ఉంటాయి. ఈ లక్షణాలే జీవికి జీవితాంతం సరిపోవు. కాబట్టి జీవి పరిసరాలతో ప్రతిచర్యలు జరిపి ఇతర లక్షణాలను ఆర్జించుకోవడమే అభ్యసనం.
జీవిలో మార్పు రెండు రకాలుగా జరుగుతుంది.
         1) పెరుగుదల/ పరిపక్వత
         2) అనుభవం
పెరుగుదల వల్ల కలిగే మార్పు అభ్యసనం కాదు. కానీ అనుభవం వల్ల కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. పెరుగుదల వల్ల మన శరీర సౌష్ఠవంలో కలిగే మార్పులు అభ్యసన ఫలితాలు కావు. ఈత, టైప్ రైటింగ్ లాంటివి అభ్యసన అనుభవాలు.

 

నిర్వచనాలు
1. హిల్‌గార్డ్: ''వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులకు, సహజమైన పరిణితికి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తనా మార్పు''.
2. హెర్జన్‌హాన్: ''అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. కొన్ని జబ్బులు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు''.
3. డెస్సికో, క్రాఫర్డ్: ''అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనారీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు''.

మర్ఫీ: ''పరిసర అవసరాలను ఎదుర్కొవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తనా మార్పు''.
బోజ్: ''ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం''.
కింబ్లే: ''అభ్యసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది''.
ఎస్ఏకి మాత్రమే 

గేట్స్: ''అనుభవం, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనయే అభ్యసనం''.
కింబల్: ''పునర్బలనం, ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు''.

 

అభ్యసనం - లక్షణాలు: 
* అభ్యసనం నిరంతర ప్రక్రియ, సార్వత్రికమైంది.
* గతిశీలమైంది.
* సంచిత స్వభావం గలది.
* గమ్య నిర్దేశకమైంది.
* వైయక్తికమైంది.
* బదలాయింపు జరిగే ప్రక్రియ. ఇది ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉండవచ్చు.

* జీవిలో పరిపక్వతను అభ్యసనం అనుసరిస్తుంది.
* అభ్యసనం చర్యాత్మక మానసిక ప్రక్రియ.
* అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు.
* జీవిలోని అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు.

 

అభ్యసనం కాని అంశాలు:
* జీవికి పుట్టుకతో వచ్చే ఆకలి, దప్పిక లాంటి సహజాతాలు.
* జీవి ప్రమేయం లేకుండా వాటంతటవే జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలు.
* జీవికి వయసుతో పాటు జరిగే పరిపక్వతా మార్పులు.
* ఎలాంటి ఆలోచన లేకుండా జరిగే గుడ్డి అనుకరణ (ఇంప్రింటింగ్).
* అనారోగ్యం, మత్తు పదార్థాల వాడకం, జబ్బు వల్ల కలిగే మార్పులు.

 

అభ్యసనం - సోపానాలు
1. జీవికి అవసరం ఏర్పడటం.
2. అవసరం ప్రేరణను కలిగించడం.
3. ప్రేరణతో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం.
4. చివరకు గమ్యం/ విజయం చేరడం.

అవసరాలు

వ్యక్తి మనుగడ, వికాసానికి సంబంధించిన కృత్య ప్రక్రియలను అవసరాలు అంటారు. పిల్లల్లో అవసరాలు రెండు రకాలు.
1. శారీరక అవసరాలు: ఇవి తీరకపోతే మానవ మనుగడ కష్టమవుతుంది.
ఉదా: గాలి, నీరు, నిద్ర, ఆహారం, ఆట, విశ్రాంతి, గృహం, దుస్తులు, లైంగిక ఉత్సుకత, మాతృక ఉత్సుకత.
2. మానసిక అవసరాలు: వ్యక్తి అభివృద్ధికి దోహదపడే అంశాలు.
ఉదా: భద్రత, ప్రేమ, స్వేచ్ఛ, సాధన, ఆత్మగౌరవం మొదలైనవి.
మానవతావాదానికి చెందిన అబ్రహాం మాస్లో మానవ జీవన విధానాన్ని పరిశీలించి అవసర అనుక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇందులో వ్యక్తుల అవసరాలను వాటి తీవ్రతను బట్టి 5 రకాలుగా వర్గీకరించాడు.


           

అభ్యసన కారకాలు
అనుభవం లేదా శిక్షణ అనేవి అభ్యాసకుడిలో ప్రవర్తనా మార్పునకు కారణం. దీనిలో ముఖ్యమైనవి 3 అంశాలు
1. వ్యక్తిగత కారకాలు: అభ్యాసకుడి వ్యక్తిగత అంశాలు 2 రకాలు.
ఎ) శారీరక అంశాలు: వయసు, పరిపక్వత, లింగ భేదం, ఆరోగ్యం మొదలైనవి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి.
బి) మానసిక అంశాలు: అభ్యాసకుడి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందులో సంసిద్ధత, ప్రేరణ, ప్రజ్ఞ, స్మృతి, అభిరుచి, వైఖరి మొదలైనవి ప్రధానమైనవి.
2. ఉపాధ్యాయ సంబంధిత కారకాలు: బోధించే ఉపాధ్యాయుడి ప్రవర్తన, మూర్తిమత్వం, ఆయన మూర్తిమత్వం ప్రధాన అంశాలు.
3. పరిసర కారక అంశాలు: ఇందులో కుటుంబం, పాఠశాల, సమాజం ప్రధానంగా ప్రభావితం చూపుతాయి.

 

అభ్యసనా సిద్ధాంతాలు 

అభ్యసన ప్రక్రియను వివరించడానికి కింది సిద్ధాంతాలు ఉన్నాయి.
I. ప్రవర్తనావాద/ సంసర్గవాద సిద్ధాంతాలు: (Behaviourism Theories)
1. యత్నదోష అభ్యసన సిద్ధాంతం - థార్న్‌డైక్
2. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం - పావ్‌లోవ్
3. కార్యసాధక నిబంధనా సిద్ధాంతం - బి.ఎఫ్.స్కిన్నర్

II. నిర్మాణాత్మక సిద్ధాంతాలు: (Constructivism Theories)
1. సాంఘిక, సాంస్కృతిక అభ్యసనం - వైగాట్‌స్కీ
2. సంజ్ఞానాత్మక సిద్ధాంతం - పియాజే

 

III. గెస్టాల్ట్ సిద్ధాంతాలు (Gestalt Theories)
1. అంతర్‌దృష్టి అభ్యసనం - కోహెలర్
2. కోఫ్‌కా అభ్యసన సిద్ధాంతం

 

IV. పరిశీలనాభ్యసనం - ఆల్‌బర్ట్ బండూరా
సాంప్రదాయక నిబంధనం 

 ఉద్దీపనలకు జీవిలోని జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందిస్తాయి అనే ప్రధాన ఉద్దేశంతో రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్‌లోల్ అనే జంతు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నిబంధిత ప్రతిక్రియా చర్యను సిద్ధాంతీకరించి శరీర ధర్మశాస్త్రం నుంచి మనోవిజ్ఞాన శాస్త్రానికి మళ్లించారు. ఈయన రాసిన గ్రంథాలు
       1. The Work of Digestive Glands
       2. Motivation and Personality

ప్రయోగం: ఆకలిగా ఉన్న కుక్కను పావ్‌లోవ్ ప్రయోగశాలలో కదలకుండా బంధించాడు. దాని నోటిలోని లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి రెండో చివరను కొలజాడీలో ఉంచాడు. ఈ విధంగా కుక్క నోటి నుంచి ఎంత లాలాజలం ఊరుతోందో తెలుసుకున్నాడు. ఈ ప్రయోగాన్ని పావ్‌లోవ్ మూడు దశల్లో నిర్వహించాడు.
* మొదటి దశలో కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు (సహజ ఉద్దీపన) దాని నోటి నుంచి వచ్చిన లాలాజలం మాపనం చేశాడు.
* రెండో దశలో పావ్‌లోవ్ అసహజ ఉద్దీపనగా గంటను మోగించి వెంటనే ఆహారాన్ని అందించి లాలాజలాన్ని మాపనం చేశాడు. ఇలా అనేక పర్యాయాలు చేశాడు.
* మూడో దశలో గంటను మోగించగానే కుక్క లాలాజలం స్రవించింది. అంటే కుక్కకు ఆహారం ఇవ్వకుండానే గంట శబ్దానికి లాలాజలం స్రవించడాన్ని పావ్‌లోవ్ గమనించాడు.

నిబంధనా ప్రక్రియ:
I. ఆహారం                                     లాలాజలం
    (సహజ ఉద్దీపన/ UCS)                              సహజ ప్రతిస్పందన/ UCR
II. గంట              +   ఆహారం         లాలాజలం
    అసహజ ఉద్దీపన  +  సహజ ఉద్దీపన             (సహజ ప్రతిస్పందన/ UCR)
            CS                      UCS
III. గంట                                   లాలాజలం
        అసహజ ఉద్దీపన/ CS                           అసహజ ప్రతిస్పందన CR
       డ్రెవర్ ప్రకారం ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి స్వభావసిద్ధం కాని ప్రతిస్పందనను వెలికితీయడాన్ని నిబంధనం అన్నారు.

నిబంధన నియమాలు/ సూత్రాలు:
1. పునర్బలన నియమం (Law of Reinforcement)

ఏదైనా ప్రవర్తన బలపడేందుకు లేదా అదే ప్రవర్తన మళ్లీ మళ్లీ ఏర్పడేలా చేసేదే పునర్బలనం. అంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను మళ్లీ మళ్లీ జోడించడం వల్ల నిబంధిత ప్రతిస్పందనను బలపడేలా చేయడం.
ఉదా: గంట మోగించి ఆహారం ఇవ్వడం అనే ప్రక్రియలో ఆహారం అధికసార్లు ఇవ్వడం వల్ల గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందన ఏర్పడింది.
పిల్లల్లో మంచి అలవాట్లను పెంపొందించడానికి ఈ నియమం ఉపయోగపడుతుంది.

2. విరమణ/ విలుప్తీకరణం (Law of Extinction)
      నిబంధన ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన లేకుండానే అసహజ ఉద్దీపనను ప్రయోగిస్తే కొన్నిసార్ల తర్వాత నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది. దీన్నే విరమణ అంటారు. ఈ ప్రయోగంలో గంట మోగించి ఆహారం ఇవ్వడం మానేస్తే మొదట కుక్క లాలాజలం స్రవించినప్పటికీ కొంత కాలానికి స్రవించకపోవడం.
ఉదా: * పిల్లల్లో అలవాట్లయిన వేళ్లు చీకడం (Thumb sucking) పక్క తడపడం (Bed wetting) లను క్రమంగా తగ్గించడానికి ఉపయోగించవచ్చు.
* పరీక్షల అనంతరం బహుమతులు ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత కొంతకాలానికి బహుమతులివ్వడం మానేస్తే పరీక్షలకు విద్యార్థులు సక్రమంగా రాకపోవడం.

 

3. అయత్నసిద్ధ స్వాస్థ్యం: (Law of Spontaneous Recovery)
నిబంధనం ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా విరమింపజేయడం జరిగితే కొన్ని రోజులకు మళ్లీ నిబంధిత ఉద్దీపనకు, నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్నే అయత్నసిద్ధ స్వాస్థ్యం అంటారు. పావ్‌లోవ్ ప్రయోగంలో విరమణ అనంతరం యాదృచ్ఛికంగా గంట శబ్దం విన్న కుక్క అప్రయత్నంగా లాలాజలం స్రవించడం.
ఉదా: * 2016 నూతన సంవత్సరంలో 5/1/2016 వేయాల్సి వస్తే దాన్ని అప్రయత్నంగా 5/1/2015 అని వేయడం.
* తరగతిలో ఉపాధ్యాయురాలు హాజరు తీసుకునే క్రమంలో పిల్లలు గుడ్ మార్నింగ్ మేడమ్‌గా నిబంధన పడి... ఒకరోజు ఆ తరగతికి వేరొక ఉపాధ్యాయుడు వచ్చి హాజరు పలకమంటే గుడ్ మార్నింగ్ సార్ అని కాకుండా గుడ్ మార్నింగ్ మేడమ్ అని పలకడం.

4. సాధారణీకరణ నియమం (Law of Generalization):
ఒక అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన వచ్చేలా నిబంధన జరిగిన తర్వాత అదే అసహజ ఉద్దీపనను పోలిన ఉద్దీపనలకు కూడా అసహజ ప్రతిస్పందన రావడం సామాన్యీకరణం అంటారు. జె.బి.వాట్సన్... ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుకు ఒక తెల్ల ఎలుకను (ఇది అసహజ ఉద్దీపన. ఎందుకంటే ఎలుకకు అందరూ భయపడరు కాబట్టి) చూపి బాలుడు ఆ ఎలుకను తాకే సందర్భంలో పెద్ద గంట శబ్దం (సహజ ఉద్దీపన) చేయడం ద్వారా ఎలుకలంటే భయం కల్పించాడు. తర్వాత ఆల్బర్ట్ తెల్లని వస్తువులు చూస్తే భయపడ్డాడు. అంటే శిశువు సామాన్యీకరణం చేసుకున్నాడు.
ఉదా: * గంట శబ్దానికి లాలాజలం ఇచ్చే కుక్క గంటను పోలిన ఎలక్ట్రిక్ బెల్, బజర్ శబ్దాలకు కూడా లాలాజలం స్రవించడం.
* పోలీసును చూసి భయపడిన దొంగ బస్సులోని కండక్టర్ ఖాకీ దుస్తులను చూసి కూడా భయపడటం.

 

5. విచక్షణ నియమం (Law of Discrimination):
అసహజ ఉద్దీపనకు, ఇతర ఉద్దీపనలకు తేడాను గ్రహించి అసహజ ఉద్దీపనకు మాత్రమే జీవి ప్రతిస్పందించడాన్ని విచక్షణ అంటారు. ఈ నియమాన్ని సక్రమంగా గుర్తించినట్లయితే ఉన్నత క్రమ నిబంధనం ఏర్పడుతుంది.
ఉదా: * కుక్కకు మొదట వలయాకారంలో ఉన్న రింగును చూపి ఆహారం పెట్టడం తర్వాత అండాకారంలో ఉన్న రింగ్‌ను చూపి ఏమీ పెట్టడం లేదు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత కుక్క వలయాకారంలోని రింగును చూసి లాలాజలం స్రవించింది. కానీ అండాకార రింగుకు స్రవించలేదు. అంటే కుక్క రెండు రింగుల మధ్య తేడాను గుర్తించగలిగింది.

* 4వ తరగతిలో గణిత ఉపాధ్యాయుడికి భయపడిన మోహిత్ అనే బాలుడు 5, 6వ తరగతుల్లోని గణిత ఉపాధ్యాయులను చూసి భయాన్ని వ్యక్తం చేయకపోవడం.
 

ఉన్నత క్రమ నిబంధనం (Higher Order Conditioning):
         ప్రయోగంలో మొదటిసారి ఉపయోగించిన అసహజ ఉద్దీపనను, మిగిలిన నిబంధన ప్రయోగాల్లో నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించవచ్చని పావ్‌లోవ్ గుర్తించి రెండో ప్రయోగంలో గంట మోగడాన్నే సహజ ఉద్దీపనగా ఉపయోగించవచ్చని కింది విధంగా నిరూపించాడు.

* మొదటి క్రమ నిబంధనం చాలా బలంగా ఉంటేనే ఉన్నత క్రమ నిబంధనం ఏర్పడుతుంది.

ఉదా: * పోలీసును చూసి భయపడే దొంగ పోలీసు జీపును చూసి భయపడటం.
* వైద్యుడిని చూసి భయపడిన బాలుడు ఆస్పత్రిని కూడా చూసి భయపడటం.

 

విద్య - అనుప్రయుక్తాలు
   1. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులందరూ లేచి నిలబడటం.
   2. పాఠశాల వార్షికోత్సవ సమయంలో సంగీతానికి అనుగుణంగా బాలుడు నాట్యం చేయడం.
   3. సర్కస్‌లో సూచనలకు అనుకూలంగా జంతువులు విన్యాసం చేయడం.
   4. మనుషులకు, వస్తువులకు పేర్లను ఆపాదించడం.
   5. మన పండగలు, సంప్రదాయాలు.

 

కార్యసాధక నిబంధనా సిద్ధాంతం (Operant Conditioning Theory)
   బుర్‌హుస్ ఫ్రెడరిక్ స్కిన్నర్ ఉద్దీపనలు లేకపోయినా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుందనీ... ప్రతిస్పందనలకు తగిన పునర్బలనం లభించినప్పుడు ఆ ప్రతిచర్యలను మళ్లీ మళ్లీ చేయడంతో నూతన అభ్యసనం జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. స్కిన్నర్ ఆధునిక పరికరాలతో స్కిన్నర్ పేటిక (Skinner Box)ను తయారుచేసి ప్రయోగం ప్రారంభించాడు. అందుకే దీన్ని పరికరాత్మక అభ్యసనం అని కూడా అంటారు. ఈయన రాసిన గ్రంథాలు
   1. The Concept of the Reflex in the Description of Behaviour
   2. Technology of Teaching
   3. The Behaviour of Organism

ప్రయోగం:
   ఆకలిగా ఉన్న ఎలుకను/ పావురాన్ని తానే తయారుచేసిన స్కిన్నర్ పేటికలో ఉంచి, దానికి కనబడకుండా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. జీవి ఆహారం ఎలాగైనా పొందాలని పేటిక నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో తన శరీరంలోని ఒక భాగం పేటికలోని మీట (స్విచ్)కు తగలడంతో ఆహారం పేటికలోకి వస్తుంది. ఇలా ప్రతిసారి మీట కదిలినప్పుడు ఆహారం లభిస్తుందన్న విషయం గ్రహించి మీటను కదిలించి ఆహారం పొందడం నేర్చుకుంది. ఇందులో మీటను నొక్కడం (ప్రతిస్పందన), ఆహారం పొందడం (ఉద్దీపన) మధ్య సంసర్గం ఏర్పడింది. అందుకే ఈ సంసర్గం R - S నిబంధనంగా, ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యం ఉండటం వల్ల R - Type నిబంధనం అని కూడా అంటారు.
     మీట         మీటను నొక్కడం          ఆహారం        ఆహారం తినడం 
     CS        CR                       UCS         UCR

         (సంసర్గం = CR కు UCSకు మధ్య)
బి.ఎఫ్.స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనావాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
1. తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన పునర్బలన నియమాలు
2. కార్యక్రమయుత అభ్యసనం

1. పునర్బలన నియమాలు (Schedules of Reinforcement):
A. నిరంతర పునర్బలనం (Continuous Reinforcement Schedule):

జీవి కృత్యాన్ని నిర్వహించే సందర్భంలో జీవి చూపే సరైన ప్రతిస్పందనకు సరైన బహుమానాన్ని లేదా పునర్బలనాన్ని ఇవ్వడం.
ఉదా: తరగతి గదిలో పాఠం బోధించే సందర్భంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు విద్యార్థి సరైన సమాధానమిస్తే వెంటనే పొగడటం/ పునర్బలనం ఇవ్వడం.

 

B. స్థిర కాలవ్యవధి పునర్బలనం (Fixed Interval Reinforcement Schedule): జీవికి కృత్యాన్ని కల్పించి నియమిత కాల వ్యవధిలో పునర్బలనం ఇస్తారు.
ఉదా: పునీత్ అనే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ పనిని ఇచ్చి... అతడికి క్రమం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పునర్బలనం /పొగడ్తను అందించడం.

 

C. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం (Fixed Ratio Reinforcement Schedule): జీవికి కృత్యాన్ని కల్పించిన తర్వాత జీవి కృత్యంలో 'నిర్ణీత సంఖ్యలో' ప్రతిస్పందనలు పూర్తిచేసిన తర్వాత పునర్బలనం ఇవ్వడం.
ఉదా: మోహిత్ అనే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ పనిని కల్పించి ఆ పనిలో విద్యార్థి ప్రతి 4 అంశాలు లేదా ప్రతిస్పందనలు ఇచ్చిన ప్రతిసారి పొగడ్త లేదా పునర్బలనం ఇవ్వడం.

D. చరశీల పునర్బలన నియమం (Variable Reinforcement Schedule):
జీవికి కృత్యానంతరం అస్థిర కాల వ్యవధుల్లో లేదా అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనాలను కల్పిస్తారు.
ఉదా: * హాసినికి వార్తాపత్రికల్లోని పద వినోద పజిల్స్‌ను పూరించమని ఉపాధ్యాయుడికి వీలైనప్పుడు లేదా బాలిక ప్రతిస్పందనల ఆధారంగా పునర్బలనం ఇవ్వడం.
* ప్రణవ్ 'బ్లాక్ డిజైన్ పరీక్ష' నిర్వహిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయుడు వేర్వేరు కాలాల్లో పునర్బలనం ఇవ్వడం.
* అభ్యసనా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పై అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా పొగడ్త లాంటి ధనాత్మక పునర్బలనాలను ఎక్కువగా ఉపయోగించాలని... దండన లాంటి రుణాత్మక పునర్బలనాలను ఉపయోగించకూడదని స్కిన్నర్ పేర్కొన్నారు.

 

2. కార్యక్రమయుత అభ్యసనం (Programmed Learning):
సాధారణ విద్యా విధానంలో పరిపుష్టి (Feed back), పునర్బలనాలను (Reinforcement) పిల్లలు ప్రతిస్పందనలు ఇచ్చిన వెంటనే అందించాలి. దీని కోసం బోధనా యంత్రాలకు రూపకల్పన చేసి దీని ద్వారా కార్యక్రమయుత అభ్యసనాన్ని రూపొందించారు.

* ఇందులో క్లిష్ట అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించారు.
వీటినే బోధనా చట్రాలు (Frames) అంటారు.
* ఇందులో జీవి క్రియాత్మకంగా ఉంటూ కింది అంశాలను చూపుతుంది.
     1. స్వీయ బోధన            2. స్వీయ అభ్యసనం
     3. స్వీయ వేగం              4. స్వీయ మూల్యాంకనం       5. స్వీయ పునర్బలనం
* ఈ అభ్యసనంలో Learning by Doing అనే ప్రక్రియ ఉంది. అభ్యాసకుడు తన వేగాన్ని గుర్తించి ముందుకు సాగుతాడు.
ఉదా: కంప్యూటర్, వీడియో గేమ్స్.

విద్య - అనుప్రయుక్తాలు:
1. పాఠశాలకు శుభ్రంగా తయారై వచ్చిన విద్యార్థిని ఉపాధ్యాయుడు పొగడగా ఆ విద్యార్థి పొగడ్తకు సంతోషించి ప్రతిరోజూ శుభ్రంగా పాఠశాలకు రావడమనేది ఈ అభ్యసన సిద్ధాంత ఆధారమే.

                       శాస్త్రీయ నిబంధనం                         కార్యసాధక నిబంధనం
1. ఉద్దీపన ఆధారంగా జరిగే నిబంధనం. 1. ప్రతిస్పందన ఆధారంగా జరిగే నిబంధనం.
2. S - Type అభ్యసనం. 2. R - Type అభ్యసనం.
3. అభ్యసించే వారి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది.     3. అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది.
4. ఉద్దీపనకు, ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడుతుంది. 4. ప్రతిస్పందనకు, ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడుతుంది.
5. ఫలితం వచ్చినా, రాకపోయినా పునర్బలనం ఇస్తారు. 5. ఫలితం వస్తేనే పునర్బలనం ఇస్తారు.
6. జీవికి ఉద్దీపన కల్పించి ప్రతిస్పందన రాబడతారు. ఇలా ఉద్దేశంతో రాబట్టిన (బహిర్గత) ప్రతిస్పందనలను నిర్గమాలు (Elicited) అంటారు.     6. జీవికి ఉద్దీపన కల్పించపోయినప్పటికీ బయటకు వదలబడిన ప్రతిస్పందనలు (నిరుద్దీపనా ప్రతిచర్యలు) ఉంటాయి. వీటిని ఉద్గమాలు (Emitted) అం
7. గంటకు, ఆహారానికి మధ్య సంసర్గం జరుగుతుంది. 7. మీటను నొక్కడం, ఆహారం పొందడం మధ్య సంసర్గం జరుగుతుంది.
8. ఇది నియత విద్యకు చెందిన అభ్యసనం. 8. ఇది అనియత విద్యకు చెందిన అభ్యసనం.
9. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానంతో పోల్చవచ్చు. 9. శిశు కేంద్రీకృత విద్యా విధానంతో పోల్చవచ్చు.
10. థారన్‌డైక్ సామీప్యతా నియమానికి సంబంధించింది. 10. థారన్‌డైక్ ఫలిత నియమానికి సంబంధించింది.

3. యత్నదోష అభ్యసన పద్ధతి (Trial and Error Learning Method)
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎడ్వర్డ్‌ లి థారన్‌డైక్, విలియం జేమ్స్ పర్యవేక్షణలో కోడిపిల్లలు, పిల్లులపై అనేక పరిశోధనలు చేసి "Animal Intelligence: Experimental Studies" అనే గ్రంథంలో యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించారు.
ప్రయోగం: థారన్‌డైక్ ఆకలిగా ఉన్న పిల్లిని ప్రత్యేకంగా రూపొందించిన పజిల్ బాక్స్ (Puzzle Box)లో ఉంచి దానికి కనబడే విధంగా ఆహారాన్ని ఉంచాడు. ఆహారం పొందడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసి యాదృచ్ఛికంగా తన శరీరం మీటను తాకినప్పుడు తలుపు తెరచుకుని ఆహారాన్ని అందుకుంది. ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉంచినప్పుడు అది తలుపును తెరిచే విషయాన్ని నేర్చుకుంది. అంటే పిల్లి నిరంతర ప్రయత్నాలను చేయడం ద్వారా దోషాల సంఖ్యను తగ్గించుకుని సమయాన్ని కూడా తగ్గించుకుంది. మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందడాన్ని పిల్లి అభ్యసించిందనే అంశం రుజువైంది.
* ఈ సిద్ధాంతాన్ని సంసర్గాల/ బంధనాల/ S - R Type/విజయపథ వరణరీతి సిద్ధాంతం అని కూడా అంటారు.
* చలన కౌశల అభ్యసనానికి ఇది అనువైంది.
ఉదా: ఈత, సైకిల్, క్రీడలు, నాట్యం, టైపు చేయడం లాంటివి.

థార్న్‌డైక్ ప్రతిపాదించిన ప్రధాన నియమాలు:
1. సంసిద్ధతా నియమం (Law of Readiness): జీవి (విద్యార్థి) కృత్య నిర్వహణకు సంసిద్ధతతో ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనంలోని ఉద్దీపనలకు, ప్రతిస్పందనలకు మధ్య బంధం ఏర్పడుతుంది. అలా లేకపోతే సరైన అభ్యసనం జరగదు.
ఉదా: బాలుడికి పలకపై అక్షరాలు రాయించడానికి కావాల్సిన కండర సంసిద్ధత ఉంటేనే అది సాధ్యమవుతుంది. గుర్రాన్ని నీటివద్దకు తీసుకుని వెళ్లగలం కానీ నీటిని తాగించలేం కదా!
* విద్యార్థుల వైయక్తిక భేదాలను గుర్తించి మొదట వారిలో ప్రేరణ కలిగించి పూర్వ అనుభవాలను జోడించి పాఠ్యాంశాలు బోధించాలి.
*  హెర్బర్ట్ బోధనా సోపానాల్లో మొదటిది విద్యార్థిని సంసిద్ధం చేయడమే.
2. అభ్యాస నియమం (Law of Exercise):
ఒక కృత్యాన్ని మళ్లీ మళ్లీ చేయడమే అభ్యసనం. 'అభ్యాసం కూసు విద్య', 'తినగ తినగ వేము తియ్యనుండు', 'సాధనమున పనులు సమకూరు ధర లోన' అనేవి దీనికి సంబంధించినవే. ఇందులో 2 ఉపయోగ నియమాలు ఉన్నాయి.
A. ఉపయోగ నియమం (Law of use):
ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పడితే దాన్ని పునశ్చరణ చేయాలి.
ఉదా: * ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు నేర్పించడం.

* ఉపాధ్యాయుడు క్రమం తప్పకుండా ఇంటి పనిని కల్పించడం.
* చలన కౌశలాలైన ఈత, సైకిల్, టైపు నేర్చుకోవడం దీనికి చెందినవే.
* పునఃస్మరణ (Recall), పునశ్చరణ (Revision), పునరభ్యసనం (Re-learning), అతి అభ్యసనాన్ని ఈ నియమం ప్రోత్సహిస్తుంది.
B. నిరుపయోగితా నియమం (Law of Disuse)
ఉద్దీపన - ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడిన తర్వాత పునఃశ్చరణ చేయకపోతే సంధానం బలహీనపడి క్షీణిస్తుంది.
ఉదా: సమ్మేటివ్ - I పరీక్షకు చదివి - సమ్మేటివ్ - II పరీక్షకు చదవకపోతే మార్కులు తగ్గిపోవడం.
గమనిక: చలన కౌశలాలు ఈ నియమానికి వర్తించవు.
ఉదా: ఈత, డ్రైవింగ్
3. ఫలిత నియమం (Law of Effect):
ఏదైనా కృత్య నిర్వహణ లేదా ఒక అంశం నేర్చుకున్నపుడు అది వ్యక్తికి ఏదో ఒక లాభాన్ని చేకూరిస్తే వ్యక్తిలో ప్రేరణ కలిగించి అభ్యసనం మెరుగుపడటానికి దోహదపడుతుంది. దీన్ని ఫలిత నియమంగా పేర్కొంటారు.
ఉదా: * Success nothing like succeed.
* పరీక్షల్లో వరుసగా గణిత ప్రక్రియలు తెలిసినవి వస్తే తర్వాత వచ్చే తెలియని లెక్కను కూడా బాగా ప్రయత్నించడం.

థారన్‌డైక్ ఉప నియమాలు:
1. ప్రేరణ కారక నియమం (Law of Motivational Factor)

జీవిలో అభ్యసనం సక్రమంగా జరగాలంటే బహుమతి లేదా కొద్దిపాటి దండన దోహదపడుతుంది.
ఉదా: ఉపాధ్యాయుడు ఇంటిపనిని ఇచ్చి, విద్యార్థి పూర్తి చేస్తే పొగడటం లేదా పూర్తి చేయకపోతే కొద్దిగా దండించడం లాంటి కృత్యాలు.
2. కాలక్రమేణ నియమం (Law of Time Factor)
ఒక అంశాన్ని విజయవంతంగా అభ్యసించిన వెంటనే దానికి ఫలితంగా బహుమతి ప్రకటించాలి. లేకపోతే అభ్యాసనం జరగదు.

ఉదా: పరీక్ష పూర్తయిన వెంటనే బహుమతిని ప్రకటించడం.
3. సారూప్య/ సాదృశ్య నియమం (Law of Identity (or) Similarity)
అభ్యసించే అంశాల మధ్య పోలిక ఉంటే అభ్యసనం సులభమవుతుంది.
ఉదా: తెలుగు బాగా చదివే విద్యార్థి కన్నడ చదవడం.

4. సామీప్యతా నియమం (Law of Continuity):
ఒక అంశాన్ని నేర్చుకున్న వెంటనే దానికి అనుబంధ అంశం వెంటనే గుర్తుకు రావడం.
ఉదా: అక్టోబరు 2 - గాంధీ జయంతి
ఉపాధ్యాయ ఉద్యోగం - డీఎస్‌సీ.
5. సంబంధిత నియమం (Law of Belongingness):

విద్యార్థికి ఒక అంశం నేర్పేటప్పుడు దానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా నేర్పితే అభ్యాసనం సులభమవుతుంది.
ఉదా: భారతదేశ జనాభా గురించి వివరించే సందర్భంలో అధిక జనాభా వల్ల కలిగే పేదరికం, నిరుద్యోగం లాంటి సంబంధిత అంశాలను కూడా కలిసి బోధించడం.
6. పాక్షిక చర్యా నియమం (Law of Partial Activity):
విద్యార్థికి కల్పించిన అనేక అంశాల్లో కొన్నింటికి మాత్రమే ప్రతిస్పందిస్తాడు. కాబట్టి దీని నివారణకు అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి బోధించడమే పాక్షిక చర్యా నియమం.
ఉదా: భారతదేశ చరిత్రను బోధించేటప్పుడు ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భావనలుగా వేరుచేసి బోధించడం.
7. బహుళ ప్రతిస్పందనా నియమం (Law of Multiple Response)
అభ్యాసకుడు ఒక ఉద్దీపనను చేరడంలో ఎదురయ్యే అనేక ప్రతిస్పందనల్లో సరైన ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడం.

ఉదా: పలకపై అక్షరాలు దిద్దే బాలుడు కొంత సమయానికి పలకను కొరకడం, పలక పైభాగంలోని పూసలతో ఆడుకోవడం, అక్షరాన్ని తుడిచివేయడం లాంటి పనులు చేసినప్పటికీ అక్షరాల దిద్దడంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం.

గెస్టాల్ట్ సిద్ధాంతం

జర్మనీ దేశానికి చెందిన మాక్స్ వర్థిమర్, కర్ట్ కోఫ్కా, కోహ్లెర్, కర్ట్ లెవిన్ 'గెస్టాల్ట్' వాదాన్ని ప్రతిపాదించారు. గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదమని కూడా అంటారు. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషాపదం. సమగ్ర ఆకృతి లేదా వ్యవస్థీకృత మొత్తం అని దీనర్థం. ఈ సిద్ధాంతం అంశంలోని విడిభాగాల కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం అందుతుందని తెలుపుతుంది.
గ్రంథాలు: వర్థిమర్ - Productive Thinking
కోఫ్కా - The Growth of Mind Principles of Gestalt Psychology
కోహ్లెర్ - The Mentality of Apes

కోఫ్కా అభ్యసన సిద్ధాంతం

కోఫ్కా జీవిలోని ఆలోచన, అవధానంతో కూడిన 'ప్రత్యక్షం'పై పరిశోధన చేశారు. ఈ అంశాలను వివిధ అంశాలకు అన్వయించారు. ఈయన ప్రకారం శిశువులు వివిధ వాస్తవాలను, అనుభవాలను విడివిడిగా కాకుండా మొత్తంగా గ్రహిస్తారు. తర్వాత వారు పరిణితి చెందుతున్న కొద్దీ మొత్తంగా గ్రహించిన అనుభవంలోని వివిధ అంశాల మధ్య భేదాన్ని తెలుసుకుంటారు. అందుకే పాఠశాల పిల్లలకు ఏదైనా అంశాన్ని బోధించే సందర్భంలో విడివిడిగా చెప్పకుండా మొత్తంగా బోధించాలి.

శిశువు మొదటిసారి ఏదైనా విషయాన్ని ప్రత్యక్షం చేయగానే అది మెదడులో ఒక కొత్త అనుభవంగా ఏర్పడి, తర్వాత భవిష్యత్‌లో ఏర్పడే నూతన పరిస్థితిలో ప్రతిచర్య జరుపుతుంది.
ఉదా: బాలుడు మొదట జింకను చూసి ఆ అనుభవాన్ని మనసులో భద్రపరుచుకున్నాక... కొంత కాలానికి వేరొక జంతువును చూసినప్పుడు ఆ అనుభవాలు మొదట ఏర్పడిన స్మృతి పథంతో పొందిక పొంది ఒక స్మృతి పథ వ్యవస్థగా రూపొందుతాయి.
కోఫ్కా ప్రకారం అభ్యసనం జరిగే పద్ధతులు:
1. జ్ఞానేంద్రియ చలన అభ్యసనం: పరిసరాలతో ప్రతిచర్యను పొందడం వల్ల ప్రత్యక్ష అనుభవాల ద్వారా జరిగే అభ్యసనం.
2. అనుకరణ అభ్యసనం: ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను పరిశీలించి వాటిని అనుకరిస్తూ అభ్యసనం పొందడం.
3. అంతర్‌దృష్టి అభ్యసనం: ఒక సమస్యకు ఆలోచనతోపాటు ప్రజ్ఞను కూడా జోడించి పరిష్కారం కనుక్కోవడం.

అంతర్‌దృష్టి అభ్యసనా సిద్ధాంతం (Insightful Learning Theory) 

జర్మనీ దేశానికి చెందిన కోహ్లెర్ 1914లో ఆఫ్రికా ఖండంలోని టెనరిఫ్ దీవుల్లో చింపాంజీలపై చేసిన పరిశోధనా ఫలితాలే అంతర్ దృష్టి అభ్యసనానికి మూలం. ఈ పరిశోధనా అంశాలతో రూపొందించిన గ్రంథమే "The Mentality of Apes".

ప్రయోగం: మనిషి తర్వాత తెలివైన జంతువుగా పరిగణిస్తున్న చింపాంజీలను కోహ్లెర్ తన పరిశీలనకు ఎంచుకున్నాడు. వాటిలో 'సుల్తాన్' అనే చింపాంజీని ప్రయోగానికి ఎన్నుకున్నాడు. సుల్తాన్‌ను బోనులో ఉంచి దానికి అందని ఎత్తులో అరటి పండ్లను వేలాడదీశాడు. చింపాంజీ పండ్లను అందుకోలేక అనేక ప్రయత్నాలను యత్నదోష పద్ధతిలో ప్రయోగించి, చివరకు నిలకడగా పరిస్థితి మొత్తాన్ని గమనించి తటాలున ఒక మెరుపు లాంటి ఆలోచనతో ప్రత్యక్షాత్మక జ్ఞానంతో బోనులోని కర్రను తీసి దాని సాయంతో పళ్లను అందుకుంది.
ప్రయోగంలో చింపాంజీ అక్కడ పరిస్థితిలోని వివిధ అంశాలను వ్యవస్థీకృతం చేసుకుని పరిష్కారాన్ని కనుక్కోవడమే అంతర్ దృష్టి. ఇందులో మొదట యత్నదోష పద్ధతిని చింపాంజీ అనుసరించినప్పటికీ, మెరుపు లాంటి ఆలోచనతో అంతర్ దృష్టిని పొందింది.
ఉదా: * విద్యార్థి వార్తాపత్రికల్లోని సుడోకు, పదవినోదిని లాంటి వాటిని పూరించడం.
* ప్రధానోపాధ్యాయుడు పాఠశాల మొత్తం నిర్వహణకు కాలక్రమ పట్టికలు (Time Table) తయారుచేయడం.
* ఆర్కిమెడిస్ తన ప్రయోగంలో పరిష్కారం కనుక్కుని యురేకా... యురేకా అని అరవడం.
* సమస్యా పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణా పద్ధతి, ప్రయోగ పద్ధతుల వల్ల అంతర్‌దృష్టి పెరుగుతుంది.

సాంఘిక అభ్యసనం

వ్యక్తులు తమకిష్టమైన వారిని నమూనాగా ఏర్పరచుకుని తమ శీల నిర్మాణానికి, తమ మూర్తిమత్వ వికాసానికి సంబంధించిన సాంఘిక అంశాలను అనుకరణ ద్వారా అభ్యసించడమే సాంఘిక అనుకరణ అభ్యసనం. ఇందులో నిశితమైన పరిశీలన ఉంటుంది. కాబట్టి దీన్ని పరిశీలనాభ్యసనం అనీ, ఇతరుల ప్రవర్తనను నిశితంగా పరిశీలించి వారిలా ప్రవర్తిస్తారు కాబట్టి దీన్ని నమూనా అభ్యసనం అని అంటారు.
* పరిశీలనా అభ్యసన విధానాన్ని తెలియపరచిన ఆద్యులు మిల్లర్, డిలార్డ్. వీరు రచించిన గ్రంథం: సామాజిక అభ్యసనం - అనుకరణ.
* కెనడా దేశానికి చెందిన ఆల్బర్ట్ బండూరా అనే మనో విజ్ఞానశాస్త్రవేత్త అనుకరణపై అనేక పరిశోధనలు చేసి Social Learning and Personality Development, Psychological Modelling అనే రచన ద్వారా అతడి అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు. వీరు 'బోబో - డాల్స్'పై అనేక పరిశోధనలు చేసి పిల్లలు పరిశీలించిన అంశాలను వెంటనే అనుకరించే యత్నంలో నూతన అభ్యసనం చేస్తారని, అది వారి ప్రవర్తనలో మార్పునకు కారణం అవుతుందని తన పరిశోధనల ద్వారా నిరూపించారు.
బండూరా సాంఘిక అభ్యసనం - ముఖ్యాంశాలు
ఏ వ్యక్తి ప్రవర్తనను పరిశీలించి అనుకరిస్తున్నామో వారిని మోడల్ అనీ, అలాంటి పరిశీలనాభ్యసనాన్ని మోడలింగ్ అని అంటారు.

వైకారియస్ మోడలింగ్ (Vicarious Modelling): అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా లేదా టీవీ, సినిమాల్లో చూసి అతడిలోని వివిధ అంశాలను (కౌశలాలు, వస్త్రధారణ, మాటలు) అనుకరించి అభ్యసించడమే వైకారియస్ మోడలింగ్.
మానసిక ప్రక్రియలు:
అనుకరణ, అభ్యసనం రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా పేర్కొన్నారు. అవి:
1. తాదాత్మీకరణం (Identification): ఈ ప్రక్రియలో వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై అతడి ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరిస్తాడు.
2. అంతర్లీనం (Internalisation): ఈ ప్రక్రియలో నమూనా వ్యక్తి ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకుంటాడు.
సాంఘిక అభ్యసనం - సోపానాలు: ఈ అభ్యసనంలో నాలుగు సోపానాలున్నాయి.
1. అవధానం (Attention):
ఏ వ్యక్తి ప్రవర్తనాంశాలను పరిశీలించాలో ఆ వ్యక్తిని ఏకాగ్రతతో పరిశీలించడం.
2. ధారణ (Retention):
నమూనా వ్యక్తిలో పరిశీలించిన ప్రవర్తనాంశాలను జ్ఞప్తిలో ఉంచుకోవడమే ధారణ.
3. నిష్పాదన/ పునరుత్పాదన (Performance):
పరిశీలన ద్వారా నేర్చుకున్న ప్రవర్తనాంశాలను స్మృతి పథం నుంచి జ్ఞప్తికి తెచ్చుకుని నమూనా ప్రదర్శనలా ప్రదర్శించడమే నిష్పాదన.

4. పునర్బలనం (Reinforcement): బి.ఎఫ్.స్కిన్నర్‌లా బండూరా కూడా పునర్బలన విలువను గుర్తించి మూడు రకాలుగా వర్గీకరించారు.
ఎ. ప్రత్యక్ష పునర్బలనం: పరిశీలించిన ప్రవర్తనను అనుకరణతో పునరుత్పాదన చేసి తద్వారా బహుమానం లేదా దండన పొందడం.
ఉదా: మదర్ థెరెసాలా సాంఘిక సేవాకార్యక్రమాలు చేసి మన్ననలు పొందడం.
బి. పరోక్ష పునర్బలనం: దీన్ని ప్రత్యామ్నాయ పునర్బలనం అని కూడా అంటారు. ఎవరి ప్రవర్తనను పరిశీలిస్తారో ఆ వ్యక్తి పొందిన పునర్బలనాన్నే పొందాలనుకోవడం.
ఉదా: మదర్ థెరెసా నోబెల్ బహుమతి పొందిన సందర్భంలో ఎంతటి ధనాత్మక పునర్బలనం పొందారో దాన్నే పొందడం.
సి. స్వీయ పునర్బలనం: పరిశీలించిన ప్రవర్తన బహుమతి కోసం కాకుండా స్వీయ సంతృప్తి కోసం అనుకరించడం స్వీయ పునర్బలనం అవుతుంది.

సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం (నిర్మాణాత్మక సిద్ధాంతం) 

 నిర్మాణాత్మక వాదానికి చెందిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని లెవ్ సెమోనోవిచ్ వైగోట్‌స్కీ (రష్యా దేశస్థుడు) రూపొందించారు. ప్రవర్తనావాదులు పేర్కొన్న ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య బంధం ద్వారా అభ్యసనం జరుగుతుందనే భావనను వైగోట్‌స్కీ వ్యతిరేకించారు. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణమనీ, ఇది అనుభవాల ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు.

* ప్రతి జీవిలోనూ అభ్యసన ప్రక్రియలో అభ్యసనం వల్ల కలిగే ఫలితం కంటే అభ్యసనం జరిగే విధానం ప్రధానమని పేర్కొన్నారు.
జ్ఞాన నిర్మాణం:
     పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడమే జ్ఞాన నిర్మాణం.
* జ్ఞాన నిర్మాణంలో ఆలోచనలు, పూర్వ అనుభవాలు, స్మృతి అత్యంత కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే ఉపాధ్యాయులు పిల్లలకు సహజ వాతావరణాన్ని కల్పించి, వారిని అభ్యసనా కృత్యాల్లో పాల్గొనేలా చేసి వారితో కలిసి క్రియాత్మక భాగస్వాములుగా ఉండాలి.
* వైగోట్‌స్కీ ప్రకారం జ్ఞానం ఒకరు అందించేది కాదు. పిల్లల మనసులో మానసిక ప్రక్రియల ద్వారా జ్ఞానం అనేది సృష్టించబడుతుంది.
* వైగోట్‌స్కీ ప్రకారం సామాజిక సాంస్కృతిక కృత్యాల వల్ల వ్యక్తి మేధస్సు వికసిస్తుంది.
వైగోట్‌స్కీ ప్రాధాన్యతా బోధనలు:
1. పరస్పర బోధన (Reciprocal Teaching)
ఈ పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు లేదా నలుగురు విద్యార్థులు కలిసి సహయోగ సమూహం (Collaborative Group) గా ఏర్పడి నాలుగు వ్యూహాలను ఉపయోగిస్తారు.

1) ప్రశ్నించడం
     2) సంక్షిప్తీకరించడం
     3) స్పష్టీకరించడం
     4) ప్రాగుక్తీకరించడం
ఈ బోధనల వల్ల సామీప్య వికాస మండలం (Zone of Proximal Development (ZRD) సృష్టించబడుతుంది.
1. భాగస్వామ్య అభ్యసనం (Collaborative Learing):
సాధారణంగా వ్యక్తులు తమ తోటి వయసువారితో ఎక్కువ సమయం గడుపుతారు. వైగోట్‌స్కీ ప్రకారం నిపుణులైన సమ వయస్కులు ఇతర పిల్లల వికాసానికి తోడ్పడగలరు.
ఈ అభ్యసనంలో పిల్లలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చర్చించి తెలిసిన, తెలియని విషయాలను పంచుకుంటారు.
* ఈ అభ్యసనంలో శిశువు ఒక సంపూర్ణ విషయాన్ని, తనకు తానుగా కొంత విషయాన్ని తెలుసుకుంటాడు. అలాగే తన కంటే అధిక ప్రజ్ఞావంతులైన 'అధిక జ్ఞానం కలిగిన వేరొక వ్యక్తి' (More Knowledgeble Other - MKO) నుంచి పూర్తిగా నేర్చుకోగలరు. ఈవిధంగా శిశువులు జ్ఞానాన్ని తనకు తానుగా... అలా కుదురకపోతే ఇతరుల ((MKO) నుంచి నేర్చుకుంటారు.
సామీప్య వికాస మండలం (Zone of Proximal Development):
శిశువు ఒక అంశాన్ని తనకు తానుగా స్వయంగా నేర్చుకోవడానికి ఇతరుల సహకారం/ మార్గదర్శకత్వంతో నేర్చుకోవడానికి ఉండే తేడాను ZPD అంటారు.

MKO: విషయం అభ్యసించే శిశువు కంటే ఎక్కువ జ్ఞానం గలవారు. వీరిలో స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మొదలైన వారుంటారు.
ఉదా: మోహిత్ అనే విద్యార్థికి కంప్యూటర్ గేమ్స్ అంటే ఇష్టం. తనకు తానుగా ప్రయత్నించి 40% ఆటను నేర్చుకున్నాడు. మిగిలిన 60% గేమ్‌ను తన సోదరుడు పునీత్ నుంచి నేర్చుకుని పరిపూర్ణత సాధించాడు.
ఇందులో MKO - పునీత్
ZPD = మొత్తం (100%) - తను నేర్చుకున్నది (40%) = 60%
స్కఫోల్డింగ్ (Scaffolding):
       శిశువు లేదా అభ్యాసకుడికి అతడి కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇతరులు (MKO) అందించే సలహా/ మార్గదర్శకత్వం.
       వైగోట్‌స్కీ ప్రకారం విద్యార్థి జ్ఞాన నిర్మాణం గల ZPD లను సామాజిక సాధనాలైన గ్రంథాలయం, ప్రయోగశాల, కంప్యూటర్, ఇంటర్‌నెట్, ఎన్‌సైక్లోపీడియా, డిక్షనరీ, వీడియో క్లిప్పింగులు పూరిస్తాయి... దీన్నే సామాజిక స్కఫోల్డింగ్ అంటారని వైగాట్‌స్కీ చెప్పారు. దీన్ని బ్రూనర్ ఇన్‌స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అన్నాడు.
ఈ అంశాలపై ఈయన రాసిన గ్రంథాలు
       1) Psychology of Art
       2) Thought and Language

వైగోట్‌స్కీ మానవుడిలో జరిగే మానసిక ప్రక్రియలను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు (Lower Mental Functions):
వ్యక్తికి జన్మతః పుట్టుకతో వచ్చే సహజసిద్ధ మానసిక అంశాలు. వీటిని అంతర్గత అంశాలు అని కూడా అంటారు.
ఉదా: పరిశీలించడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, పోల్చడం, తెలుసుకోవడం.
2. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు (Higher Mental Functions):
వ్యక్తి పరిసరాలతో అనుగుణ్యతను చెంది కలిసిపోవడం, దిగువస్థాయి మానసిక ప్రక్రియల్లో అనుసంధానం ఏర్పడటం వల్ల వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తనలు అభివృద్ధి చెందడం.
ఉదా: సాంఘికాంశాలను వివేచనంతో విశ్లేషించడం, సృజనాత్మకంగా సమస్యకు పరిష్కారం చూపడం.
ఈ ప్రక్రియలు వ్యక్తిని దూకుడుగా ప్రవర్తించడాన్ని నియంత్రించి స్వయం క్రమీకరణకు తోడ్పడతాయి.
జ్ఞాన నిర్మాణం - భాష పాత్ర:
పిల్లల జ్ఞానాత్మక వికాసానికి భాష ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగోట్‌స్కీ భావించారు.
* చిన్న పిల్లలను మనం గమనిస్తే వారు ఆడుకునే సమయంలో తమలో తామే మాట్లాడుకుని స్వీయమార్గదర్శకత్వం కల్పించుకుంటారు. దీన్ని వైగోట్‌స్కీ వ్యక్తిగత భాష లేదా స్వయం నిర్దేశిత భాష (Private speech) అన్నారు.
* పిల్లలు పెద్దవారయ్యాక వారి మానసిక సామర్థ్యాలు పెరగడంతో తమలోని స్వీయ నిర్దేశిత భాష అంతర్లీనమై, నిశ్శబ్దకరమైన అంతర్భాషణంగా మారుతుంది.

* పిల్లలు ఆలోచించడానికి, ప్రవర్తనకు చర్యలను ఎన్నుకోవడానికి భాష తోడ్పడుతుంది కాబట్టి భాష అన్ని ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం అని వైగోట్‌స్కీ పేర్కొన్నారు.

అభ్యసన బదలాయింపు (Transfer of Learning)
     గతంలో ఒక రంగంలో నేర్చుకున్న శిక్షణ జ్ఞానం, నైపుణ్యాలు నూతనంగా నేర్చుకోబోతున్న ప్రక్రియపై ప్రభావితం చూపడాన్నే అభ్యసన బదలాయింపు అంటారు.
నిర్వచనాలు:
గారెట్:
ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా లేదా పాక్షికంగా ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసనా బదలాయింపు.
ఎలీస్: ఒక ప్రక్రియలో గడించిన అనుభవాలు లేదా సాధన తరువాత కాలంలో వేరొక ప్రక్రియ సాధనపై తమ ప్రభావాన్ని చూపించడమే అభ్యసనా బదలాయింపు.
క్రో అండ్ క్రో: ''ఒక అభ్యసనా రంగంలో ఏర్పడిన ఆలోచనా విధానం, అనుభూతులు, జ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లను వేరొక రంగం అభ్యసనానికి తీసుకెళ్లడమే అభ్యసన బదలాయింపు''.
సొరెన్‌సన్: ''ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానం, శిక్షణ అలవాట్లను మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసనా బదలాయింపు''.

అభ్యసన బదలాయింపు - రకాలు

1. అనుకూల బదలాయింపు (Positive Transfer):
ఒక కృత్యం లేదా విషయాన్ని నేర్చుకున్నప్పుడు పొందిన జ్ఞానం మరో కొత్త కృత్యం లేదా విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడటం ద్వారా అభ్యసనం సులభమవుతుంది. సారూప్యత గల విషయాల మధ్య ఈ బదలాయింపు ఎక్కువగా ఉంటుంది.

ఉదా: 1) టైపురైటర్ కీ బోర్డు నేర్చుకున్నవారికి కంప్యూటర్ కీ బోర్డు సులభమవడం.
2) సంస్కృత భాష నేర్చుకుంటే హిందీ, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకోవడం సులభమవుతుంది.
3) గణితంలో నేర్చుకున్న అంశాలు భౌతికశాస్త్రంలో ఉపయోగపడటం.
2. ప్రతికూల/ వ్యతిరేక/ అననుకూల బదలాయింపు:
ఒక అంశం ద్వారా నేర్చుకున్న జ్ఞానం వేరొక అంశాన్ని అభ్యసించడానికి ఆటంకంగా మారితే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు.
ఉదా: 1) తెలుగు బాగా రాసే వ్యక్తి ఉర్దూ రాయడం.
         2) హిందూ అరబిక్ సంఖ్యామానం - ఆంగ్ల సంఖ్యామానం
         3) Pen కు బహువచనం Pens అని నేర్చుకుని Foot కు బహువచనం Foots అని చెప్పడం.
         4) కుడి చేతి వైపు కారు డ్రైవింగ్ - ఎడమ చేతివైపు కారు డ్రైవింగ్.
3. శూన్య బదలాయింపు (Zero Transfer)
ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యాలు తర్వాత నేర్చుకునే కృత్యంపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం.
ఉదా: 1) బాగా చదవడం - ఈత నేర్చుకోవడం
         2) కంప్యూటర్ అభ్యసనం - కారు నడపడం

4. ద్విపార్శ్వ బదలాయింపు (Bilateral Transfer):
శరీరంలోని ఒక పార్శ్వంతో నేర్చుకున్న వ్యక్తి అభ్యసించకుండానే రెండో పార్శ్వంతో చేయగలగడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు.
ఉదా: 1) కుడిచేతితో బాణాలు వేయగల అర్జునుడు, ఎడమ చేతితో కూడా బాణాలు వేయడం.
         2) కుడిచేతితో రాయగల వ్యక్తి కొంత సాధనతో ఎడమ చేతితో కూడా రాయగలడం.
అభ్యసనం - వివిధ రంగాలు 

అభ్యసనం దాని ఫలితాలను 3 రంగాలకు అన్వయించవచ్చు.
1. జ్ఞానాత్మక రంగం:
జ్ఞానాత్మక రంగం జీవి ఆలోచన, వివేచన, స్మృతి, సృజనాత్మకత, సమస్యా పరిష్కారం లాంటి అంశాలకు చెందింది. ఈ రంగంలో అతి ముఖ్యంగా జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం, వాటిని భవిష్యత్‌లో వివిధ స్థితులకు అన్వయించుకుంటారు. జ్ఞానం, అవగాహన, వినియోగం అనే లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణలు ఈ రంగం ప్రవర్తనాంశాలుగా చెప్పవచ్చు.
ఉదా: విద్యార్థి నేర్చుకున్న సమాచారంతో వివిధ అంశాల మధ్య తేడాలను చెప్పడం.

2. భావావేశ రంగం:
భావావేశ రంగం వైఖరులు, అనుభూతులు, ఉద్వేగాలు మొదలైన అంశాలతో ముడిపడింది. నేర్చుకున్న సమాచారం నుంచి ఏం గ్రహించారు అనేదాని కంటే సమాచారం తన మనసులో విలీనం చేసుకోవడం ద్వారా ఎలాంటి ఉద్వేగాలకు అవకాశం ఉంది అనే విషయానికి ప్రాధాన్యం ఉంది.
ఉదా: దేశ నాయకులు, శాస్త్రవేత్తల పట్ల విద్యార్థి గౌరవం చూపడం.
3. మానసిక చలనాత్మక రంగం
ఇది చలన కౌశలాలకు సంబంధించింది. చాలక కౌశలాలు, నైపుణ్యాలను సమర్థవంతంగా ప్రదర్శించడం అనేది మధ్య మెదడు నియంత్రణలో ఉంటుంది. పరికరాలు ఉపయోగించడం, పటాలు గీయడం, క్రీడా పరికరాల ఉపయోగం లాంటివి దీనికి సంబంధించినవి.
ఉదా: డ్రైవింగ్, మట్టితో బొమ్మలు చేయడం.

ప్రేరణ - అభ్యసనంలో దాని పాత్ర 

      Motivation అనే పదం 'మెవీర్' అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. Movere అంటే కదలిక అని అర్థం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో ప్రేరణ అతి ముఖ్యమైన కారకం. ఒక వ్యక్తి తన నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవడానికి అతడిని ప్రోత్సహించే అంతర్గత శక్తినే ప్రేరణ అంటారు. అందుకే ఉడ్‌వర్త్ అనే శాస్త్రవేత్త అన్ని రకాలైన ప్రవర్తనకు ప్రేరణే మూలాధారమని పేర్కొనగా, క్రో అండ్ క్రో అనే శాస్త్రవేత్తలు ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నారు.

ప్రేరణ - రకాలు:
1. అంతర్గత ప్రేరణ:
వ్యక్తి ఎలాంటి బాహ్య ఉద్దీపనలు లేకుండా కేవలం సంతృప్తిని అనుసరించి మాత్రం పనిచేయడం అంతర్గత ప్రేరణ అవుతుంది.
ఉదా: * ఎలాంటి బహుమతి/ దండన లేకపోయినా విద్యార్థి తనంతట తాను చదువుకోవడం.
* ఆసక్తి, నిబద్ధత, పట్టుదలను అనుసరించి పనిచేయడం.
* బాలుడు తనంతట తాను ఆడుకోవడం.
* చందమామ పుస్తకంలోని కథలను చదవడం.
2. బాహ్య ప్రేరణ: వ్యక్తి తన ఇష్టంతో సంబంధం లేకుండా బహుమానం పొందడం లేదా శిక్షను తప్పించుకోవడం కోసం పనిచేయడం బాహ్య ప్రేరణ అవుతుంది.
ఉదా: * బాలుడు తండ్రి మందలిస్తాడనే నెపంతో క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం.
3. సాధనా ప్రేరణ (Achievement Motivation):
     మెక్లిలాండ్, ఆట్కిన్‌సన్ మొదటిసారిగా ఈ ప్రేరణను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధనవైపు నిరంతరం కృషి చేస్తూ సాధించాలనే తపన కలిగి ఉండటమే సాధనా ప్రేరణ. దీన్ని అనుసరించి 'మెకైవర్' (Mc Iver) నేను ఈనాడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచన చేసుకుని ఉండటమే అని పేర్కొన్నారు.

ఉదా: * దేశంలోని అనాథలకు సేవ చేయాలని మదర్ థెరిసా భావించి సేవ చేయడం.
* మన జాతిపిత గాంధీజీ నడిపించిన స్వాతంత్య్ర పోరాటం.
ఈ ప్రేరణను 'దత్, రస్తోగి' రూపొందించిన CIE లాంటి పరీక్షల ద్వారా కనుక్కుంటారు.

స్మృతి (Memory) 

    వ్యక్తి తన జీవితంలోని గతానుభవాలను గుర్తుంచుకుని అవసరమైనప్పుడు ఒక వరుస క్రమంలో తిరిగి పునరుత్పత్తి చేయడమే స్మృతి. ప్లేటో మానవుడి మనసులో ఒక లక్కముద్ద లాంటి పదార్థం ఉంటుందని అదే స్మృతి అన్నారు. అరిస్టాటిల్ సృష్టిలో గతం స్మృతి అనీ వర్తమానం అవధానం అనీ, భవిష్యత్ ప్రతీక్షణం అని భావించాడు. కానీ వీరి మాటలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
    స్మృతిపై శాస్త్రీయ పరిశోధన చేసినవారిలో గాల్టన్ ఒకరు. ఈయన ఆత్మ అవలోకన పద్ధతిని అనుసరించాడు. ఇంగ్లండ్‌లో ఈయన స్థాపించిన మానవశాస్త్ర ప్రయోగశాలలో స్మృతిపై పరిశోధించి ఎంక్వైరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్ అనే గ్రంథం రచించారు.
    స్మృతి విస్మృతిపై శాస్త్రీయంగా మొదటిసారిగా అనేక ప్రయోగాలు చేసిన ఎబ్బింగ్‌హాస్ (జర్మనీ) 1885లో
"On Memory" అనే గ్రంథాన్ని రచించారు. ఇది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక మైలురాయిగా నిలిచింది.
స్మృతి ప్రక్రియ - దశలు:
     1) ఒక అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్రితమవడం.
     2) ఆ ఉద్దీపన ప్రభావం వల్ల నాడీ వ్యవస్థలో జరిగే మార్పులు.
     3) ఈ మార్పులు ప్రవర్తనలో తెచ్చే మార్పులు.

(లేదా)
1. ఎన్‌కోడింగ్ (Encoding): జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన అనుభవం మెదడుకు చేరి ఎన్‌గ్రామ్స్
లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతిచిహ్నాల రూపంలోకి మారతాయి.
2. ధారణ (Retention): అనుభవాలు, అభ్యసించిన విషయాలు స్మృతిపథంలో ఎంతకాలం నిలిచి ఉంటాయో దాన్నే ధారణ అంటారు.
3. జ్ఞప్తికి తెచ్చుకోవడం (Retrival): అవసరమైన అంశాలు ఎన్‌గ్రామ్స్ రూపంలో నుంచి డీకోడ్ చేయబడి అసలు రూపంలోకి మారి పునఃస్మరణ చేయబడతాయి.
     ఎన్‌కోడింగ్  ధారణ  డీకోడింగ్  జ్ఞప్తికి తెచ్చుకోవడం
స్మృతి ప్రక్రియలోని ముఖ్యమైన అంశాలు:
    1) అభ్యసనం      2) ధారణ       3) పునఃస్మరణ       4) గుర్తింపు      5) పునరభ్యసనం
I. అభ్యసనం (Learning): స్మృతికి ఇది మొదటి మెట్టు. స్మృతి సక్రమంగా జరగాలంటే ఈ అంశాలు బాగా ఉండాలి.
     1) అధికమైన ప్రేరణను కలిగి ఉండటం
     2) అంశాలను అర్థవంతంగా నేర్చుకోవడం
     3) ఏకాగ్రతతో నేర్చుకోవడం
     4) నిర్విరామంగా లేదా విరామంతో నేర్చుకోవడం
     5) సంపూర్ణ విభాగాలుగా నేర్చుకోవడం
     6) అతి అభ్యసనం

II. ధారణ: నేర్చుకున్న విషయాలను మెదడులో కొంతకాలం నిలిపి ఉంచుకోవడాన్ని ధారణ అంటారు.
III. పునఃస్మరణ (Recall): స్మృతి పథంలోని విషయాలను గుర్తుకు తెచ్చుకోవడమే పునఃస్మరణ. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు, ఖాళీలను పూరించడం మొదలైనవి దీనికి చెందినవే. పునఃస్మరణను తెలుసుకోవడానికి సాధారణంగా రెండు పద్ధతులను ఉపయోగిస్తారు.
     ఎ) అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి
     బి) శాబ్దిక పునఃస్మరణ పద్ధతి
ఎ) అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి: నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం లేని పిల్లలు, జంతువుల్లోని ధారణను తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. దీనికోసం హంటర్ అనే శాస్త్రవేత్త విలంబిత ప్రతిచర్యా పరికరంను ఉపయోగించారు.
బి) శాబ్దిక పునఃస్మరణ పద్ధతి: అక్షర జ్ఞానం గలవారికి ఈ పద్ధతులను ఉపయోగిస్తారు.
స్మృతి - విస్తృతి (Memory Span): ఒకరు చెప్పిన, విన్న విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని స్మృతి విస్తృతి అంటారు. దీనికోసం హామిల్టన్ అనే శాస్త్రవేత్త టాచిస్టోస్కోప్‌ను ఉపయోగించారు.
ద్వంద్వ సంసర్గలు (Dual Associatives): ఒక అర్థవంతమైన పదం మరో అర్థరహితమైన పదాన్ని చూపిస్తారు. తర్వాత అందులో ఒకదాన్ని చెప్పి రెండో పదాన్ని చెప్పమంటారు.

ఉదా: PUNITH - XLZP
         MOHITH - NQBM
         HARIBABU - HCYSP
3) కథనాలు (Narratives):
దీనిలో అనేకమంది వ్యక్తులు పాల్గొంటారు. మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి కథ చెబుతాడు. ఇతడు ఆ కథను గుర్తుంచుకుని మరో వ్యక్తికి... ఇలా చెప్పుకుంటూ చివరి వ్యక్తికి కథ చేరగానే ఈ కథ చిన్నదిగా లేదా పెద్దదిగా లేదా పూర్తిగా మారిపోవచ్చు. ఈ కథనాలపై అనేక పరిశోధనలు చేసి బార్ట్‌లెట్ ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని రూపొందించారు. ఇదే అంశాన్ని ఒకరికొకరికి చిత్రాల ద్వారా చూపించి మొదటి వ్యక్తి చిత్రానికి, చివరి వ్యక్తి చిత్రానికి తేడాలు గమనించవచ్చు. దాన్ని ఆకృతుల పునరుత్పాదనం అంటారు.
4) శబ్ద ప్రమాణం (Testimony)
ఒక సంఘటన జరుగుతున్నప్పుడు చూసిన వ్యక్తిని, కొంతకాలం గడిచిన తర్వాత దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పమని అడగడటమే 'శబ్ద ప్రమాణం'.
ఉదా: * తన స్నేహితుడి ప్రమాదం చూసిన వ్యక్తిని కొంతకాలం తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పమంటే ముందులా చెప్పకపోవడం.
* 4వ తరగతిలోని పునీత్ చూసిన పర్యాటక ప్రదేశాలను ఆ బాలుడు 5వ తరగతికి వచ్చిన తర్వాత అడిగితే ముందు చూసినప్పుడు చెప్పిన విధంగా చెప్పలేకపోవడం.

IV. గుర్తింపు (Recognition):
   గతంలో చూసిన మూర్త అనుభవాలను లేదా విన్న విషయాలను తిరిగి చూసినప్పుడు గుర్తించగలగడమే గుర్తింపు. సాధారణంగా పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక. పరీక్షల్లో ఇచ్చే బహుళైచ్ఛిక ప్రశ్నలన్నీ గుర్తింపునకు సంబంధించినవే.

    ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 80 బహుళైచ్ఛిక ప్రశ్నల్లో 20 ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానం గుర్తించాడు. అతడి గుర్తింపు గణన ఎంత?

V. పునరభ్యసనం (Re - Learning):
     అభ్యసించిన అంశాలను కొంతకాలం తర్వాత తిరిగి అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. ఇందులో కాలం బాగా పొదుపు అవుతుంది. కాబట్టి దీన్ని పొదుపు పద్ధతి అంటారు. పునరభ్యసనంపై పరిశోధన చేసినవారు ఎబ్బింగ్‌హాస్.

ఉదా: ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్తం చేయడానికి 15 సార్లు చదివాడు. ఒక వారం తర్వాత ఆ పద్యాన్ని గుర్తుంచుకోలేక మళ్లీ ఆరు సార్లు చదివాడు. ఇతడి పునరభ్యసన గణన శాతం ఎంత?

అసలు ప్రయత్నాలు = 15, పునరభ్యసన ప్రయత్నాలు 6 సార్లు

డెజావు (Dejavu):
      డెజావు అంటే మిథ్యాపరిచయ భావన. ఇది ఫ్రెంచ్ భాషా పదం. ఇది గుర్తింపులో భాగం. ప్రస్తుతం మనం చూస్తున్న అంశాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. దీన్నే డెజావు అంటారు. చూసిన, చూసే అంశాలకు పోలిక ఉండటం దీనికి కారణం.
జైగార్నిక్ ప్రభావం (Zeigarnik Effect):
      జైగార్నిక్ ఒక రష్యన్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. ఈమె చేసిన ప్రయోగాల ఫలితంగా సగంలో ఆపిన పనులు పూర్తిచేసిన పనుల కంటే గుర్తుంటాయని పేర్కొన్నారు. దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు.
స్మృతి - రకాలు
      స్మృతి స్వభావాన్ని, భేదాలను బట్టి కింది రకాలుగా విభజించవచ్చు.
1. సంవేదన/ తక్షణ స్మృతి (Immediate Memory):
పరిసరం నుంచి ఉద్దీపన భౌతికంగా తొలగిపోయినప్పటికీ వ్యక్తిలో అది సుమారుగా 1 లేదా 2 సెకన్ల వరకు మిగిలి ఉండేదే సంవేదనా స్మృతి.
ఉదా: ఒక సెల్‌ఫోన్ నెంబరు విని లేదా చూసిన వెంటనే మరచిపోవడం.

2. స్వల్పకాలిక స్మృతి (Short term Memory): తక్షణ స్మృతిలా ఇది కూడా తాత్కాలికమైంది. నేర్చుకున్న విషయాలు కేవలం 30 సెకన్ల వరకు స్మృతిలో ఉంటాయి. అవసరం తీరిపోగానే ఆ విషయాలను మరచిపోతాం.
ఉదా: బస్సులో లేదా సినిమాహాలులో సీటులో కూర్చోగానే నెంబరు మరచిపోవడం. రైల్వేస్టేషన్‌లో రైల్ నెంబర్ విని వెంటనే మరచిపోవడం.
3. దీర్ఘకాలిక స్మృతి (Long term Memory):
నేర్చుకున్న అంశాలు ఎక్కువకాలం గుర్తు ఉండటమే దీర్ఘకాలిక స్మృతి. దీని ఫలితంగా ఒక వ్యక్తి ఉన్నత విద్యాంశాలను అవగాహన చేసుకుంటాడు, వాటిని విశ్లేషిస్తాడు.
ఉదా: బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు, ఈత, డ్రైవింగ్ లాంటివి చలన కౌశలాలు.
4. బట్టీ స్మృతి (Rote Memory)
విషయాన్ని అర్థం, భావంతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడమే బట్టీ స్మృతి. ఇలాంటి అభ్యసనం స్మృతిలో ఎక్కువ కాలం ఉండదు.
ఉదా: చిన్నపిల్లలు తమకు అర్థమైనా కాకపోయినా ఎక్కాలు, పద్యాలు కంఠస్తం చేయడం.
5. తార్కిక స్మృతి (Logical Memory):
విషయాన్ని అర్థవంతంగా, అవగాహనతో ఎందుకు, ఏమిటి అనే విచక్షణతో ఆలోచిస్తూ అభ్యసించి గుర్తుంచుకోవడమే తార్కిక స్మృతి. ఇది దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది.
ఉదా: పెద్దవారు చిన్నపిల్లల్లా కాకుండా నేర్చుకునే అంశాన్ని అర్థవంతంగా నేర్చుకోవడం.

6. క్రియాత్మక స్మృతి (Active Memory): అభ్యసన అంశాలను కృత్యాలు, ప్రయోగాల ద్వారా నేర్చుకుని జ్ఞప్తికి ఉంచుకోవడం.
ఉదా: * తరగతి గదిలో పాఠ్యాంశాన్ని నాటకీకరణం ద్వారా నేర్చుకోవడం.
       * ఆక్సిజన్ ప్రయోగాన్ని చేసి నేర్చుకోవడం.
       * త్రిభుజ వైశాల్యాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకోవడం.
7. నిష్క్రియాత్మక స్మృతి (Passive Memory):
అభ్యసనాంశాలను ప్రయోగపూర్వకంగా కాకుండా చదవడం లేదా వినడం ద్వారా నేర్చుకోవడమే నిష్క్రియాత్మక స్మృతి.
ఉదా: ఆక్సిజన్ ప్రయోగాన్ని చేయకుండా చదివి గుర్తుంచుకోవడం.
8. సంసర్గ స్మృతి (Associative Memory): ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ జ్ఞప్తికి ఉంచుకోవడం.
ఉదా: 1947 అనగానే స్వాతంత్య్రం గుర్తుకు రావడం.
9. త్వరిత సమైక్య స్మృతి (Redentigration Memory): కొన్ని వస్తువులు, సంకేతాలు, ఉద్దీపనలను చూసినప్పుడు గతంలో వాటి వెనక మనం పొందిన అనుభూతులు, ఉద్వేగాలు, అనుభవాలు గుర్తుకు రావడం.
ఉదా: చిన్ననాటి పాఠశాలను చూడగానే బాల్య స్నేహితులతో పాటు ఆనందం కూడా గుర్తుకురావడం.

విస్మృతి (Forgetting)
      విస్మృతి అంటే మరచిపోవడం. మనం నేర్చుకున్నదాన్ని పునఃస్మరించ లేకపోవడమే విస్మృతి.
మన్: ''ఇంతకుముందు అభ్యసించిన విషయాలను పూర్తిగా లేదా పాక్షికంగా పునస్మరణ లేదా గుర్తుంచుకునే సామర్థ్యం కోల్పోవడమే విస్మృతి''.
జేమ్స్ హెవర్: ''విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం లేదా అభ్యసించిన పనిని చేయలేకపోవడం''.
డ్రెవర్: ఇంతకుముందు నేర్చుకున్న అనుభవాలను, ఏ సమయంలోనైనా ప్రదర్శించడానికి లేదా చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి.
భాటియా: ''మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావన లేదా భావనల సమూహాన్ని చేతనంలోకి పునరుద్ధరించలేకపోవడమే విస్మృతి''.
విస్మృతికి కారణాలు: విస్మృతికి కారణాల్లో ముఖ్యమైనవి
1. అనుపయోగం వల్ల క్షీణత (Decay through disuse):
అభ్యసించిన విషయాలను మనం ఎక్కువకాలం ఉపయోగించకపోతే వాటిని మరచిపోవడానికి అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. అందుకే పాఠశాలలో డ్రిల్లింగ్, ఇంటిపని, అర్థరహిత పదాలను కంఠస్తం చేయడం లాంటి వాటిని ప్రోత్సహించాలి.
ఉదా: చిన్న తరగతుల్లో చదివిన అంశాలను క్రమంగా మరచిపోవడం.

2. స్మృతి చిహ్నాల విరూపణ వల్ల విస్మృతి:
అభ్యసనాంశాలు జ్ఞానేంద్రియాల ద్వారా మెదడును చేరి, మెదడులో స్మృతి చిహ్నాలను లేదా న్యూరోగ్రామ్స్‌ను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో స్మృతి చిహ్నాలు సరిగ్గా ఏర్పడకపోయినా, ఏర్పడిన చిహ్నాలు చెదిరినా, అంశాలు క్షీణించినా, అభ్యసనాంశాలు స్మృతిపథంలో ఉండవు. దాన్నే స్మృతి చిహ్నాలు విరూపణకు లోనుకావడం అంటారు.
3. అవరోధం (Interference):
వ్యక్తి లేదా విద్యార్థి రెండు అంశాలను నేర్చుకున్నప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని పునఃస్మరణ చేసేటప్పుడు మరొకటి జోక్యం ప్రభావం వల్ల పునఃస్మరణకు రాకపోవడమే 'అవరోధం'. ఇది రెండు రకాలు.
ఎ) పురోగమన అవరోధం (Proactive Inhibition):
గత లేదా పాత అభ్యసనం ప్రస్తుత లేదా కొత్త విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉండటం.
ఉదా: * పునీత్ అనే విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు. ప్రస్తుతం హిందీ పరీక్ష రాస్తుంటే హిందీ కాకుండా సంస్కృతమే గుర్తుకు రావడం.
* ప్రణవ్ నిన్న 5వ ఎక్కం నేర్చుకున్నాడు. నేడు 6వ ఎక్కం నేర్చుకున్నాడు. క్రమంగా 6వ ఎక్కం ఎవరైనా చెప్పమంటే 5వ ఎక్కమే చెప్పడం.
* మోహిత్ మొదట వేమన పద్యాన్ని నేర్చుకుని, కొంతకాలానికి సుమతీ పద్యాన్ని నేర్చుకున్నాడు. మరి కొంతకాలానికి సుమతీ పద్యాన్ని చెప్పమంటే చెప్పలేక మరచిపోయాను అని చెప్పడం.

బి) తిరోగమన అవరోధం (Retroactive Inhibition):
* ప్రస్తుత లేదా కొత్త విషయాలు, గత లేదా పాత అభ్యసన అంశాల పునస్మరణకు అవరోధంగా ఉండటం.
ఉదా: హేమంత్ అనే బాలుడు మొదట సంస్కృతం నేర్చుకుని తర్వాత హిందీ నేర్చుకున్నాడు. ప్రస్తుతం సంస్కృత పరీక్ష రాస్తుంటే ఆ బాలుడికి సంస్కృతం కాకుండా హిందీ గుర్తుకు రావడం.
* యువత్ నిన్న 5వ ఎక్కం నేర్చుకుని నేడు 6వ ఎక్కం కూడా నేర్చుకున్నాడు. ఈ రోజు 5వ ఎక్కాన్ని ఉపాధ్యాయుడు చెప్పమంటే 6వ ఎక్కాన్ని చెప్పడం.
* హాసిని మొదట భాస్కర శతక నీతిపద్యం నేర్చుకుని తర్వాత సుమతీ శతక పద్యాన్ని నేర్చుకుంది. కొంతకాలానికి భాస్కర శతక పద్యాన్ని చెప్పమంటే ''మరచిపోయాను'' అని చెప్పడం.
4. దమనం (Repression): సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన రక్షక తంత్రాల్లో దమనం అతిముఖ్యమైంది. వ్యక్తి నచ్చని విషయాలను, బాధను కలిగించే సంఘటనలను అచేతనంలోకి పంపి ఉద్దేశపూర్వకంగా మరచిపోవడమే దమనం.
5. అపసామాన్య విస్మృతులు:
ఎ) స్మృతినాశం (Amnesia):
మానసిక లేదా శారీరక అఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి. మెదడుకు దెబ్బతగలడం లేదా జబ్బుకు గురికావడం వల్ల పాక్షికంగా స్మృతిని కోల్పోవడం జరుగుతుంది.
బి) ఫ్యూగ్ (Fuge): ఒక వ్యక్తి అఘాతానికి గురైనప్పుడు గత జీవితం మరచిపోయి వేరే ప్రదేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఫ్యూగ్.

ఎబ్బింగ్‌హాస్ ప్రకారం వ్యక్తి నేర్చుకున్న అంశాన్ని కాలం గడిచే కొద్దీ ఎలా మరచిపోతాడో ప్రయోగాత్మకంగా వివరించిన పట్టిక.

స్మృతి - విస్మృతిలోని కొన్ని ముఖ్యాంశాలు 

1. కన్సాలిడేషన్: ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించిన మొదటి నిమిషం చాలా ముఖ్యమైంది. ఈ సమయంలో స్మృతి నిర్మాణం జరుగుతుంది. దీన్నే కన్సాలిడేషన్ అంటారు. దీనిపై పరిశోధన చేసినవారు డంకన్.
2. వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్: స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయం బాగా గుర్తుండే ప్రక్రియ. ఇలా గుర్తుండటానికి అభ్యసనాంశంలో అవరోధాలు లేకపోవడమే.

ఉదా: భీముడు, అర్జునుడు, నకుల, శ్రీకృష్ణ, ధృతరాష్ట్రుడు అనే పేర్లలో ప్రత్యేకంగా ఉంది ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇది బాగా గుర్తుంటుంది.
స్మృతిని పెంచే పద్ధతులు:
     1) అధిక ప్రేరణతో చదవడం
     2) అభిరుచితో అభ్యసించడం
     3) తక్కువ భావోద్రేకతగా ఉండటం
     4) భావాల సంసర్గం
     5) కొండ గుర్తులు (న్యుమోనిక్స్)
     6) అతి అభ్యసనం
     7) కథల రూపంలో చదవడం
     8) ఆత్మవిశ్వాసంతో చదవడం
     9) విరామంతో చదవడం
     10) ఉత్సాహంతో, ఏకాగ్రతతో చదవడం
పై పద్ధతులను ఉపయోగించడం వల్ల స్మృతి సామర్థ్యం పెరుగుతుందని మనో విజ్ఞానవేత్తలు పేర్కొన్నారు.

అభ్యసనం (Learning)

ప్రతి జీవికీ పుట్టుకతోనే కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి. అయితే, ఈ సహజాతాలతోనే తన జీవితాన్ని సంపూర్ణంగా గడపలేదు. కాబట్టి జీవి పరిసరాల నుంచి మరికొన్ని లక్షణాలను ఆర్జించుకుంటుంది. ఈ ప్రక్రియనే 'అభ్యసనం' అంటారు. ఇది జీవి పుట్టుకతో ప్రారంభమై సంచితంగా, అవిచ్ఛిన్నంగా కొనసాగే ప్రక్రియ. అభ్యసనం, అందులోని ఉద్దీపనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అభ్యసనం ఒక సంపూర్ణమైన ప్రక్రియ. ఇందులో వికాసం, ప్రేరణ, సాంఘిక ప్రవర్తన, మూర్తిమత్వ వికాసం మొదలైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. శిశువు తల్లి గర్భం నుంచి బయటపడినప్పటి నుంచి తన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ ఎన్నో విషయాలను అభ్యసిస్తుంది. అందుకే అభ్యసన ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలను మెరుగుపరచుకుంటాడు.
* అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో ఏర్పడే శాశ్వత మార్పు. కొన్ని జీవులకు కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తే (చేప నీటిలో ఈదడం), అవే లక్షణాలు మరికొన్ని జీవులకు (మానవుడికి ఈత) అభ్యసనంతో వస్తుంది.
* వ్యక్తి జీవితంలో మార్పు అనేది రెండు రకాలుగా సంభవిస్తుంది.
    1) పరిపక్వత
    2) శిక్షణ/ అనుభవం

* పరిపక్వత జీవికి జన్యుపరంగా సంక్రమించే జైవిక ప్రక్రియ. ఇది అభ్యసనం కాదు.
ఉదా: బాలుడిలో కౌమార దశలో కలిగే గౌణ లైంగిక లక్షణాలు.
* శిక్షణ/ అనుభవం వల్ల కలిగే మార్పు అభ్యాసం.
ఉదా: శిశువు భాష నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం.
అభ్యసనం  =  జీవిలోని అంత్య ప్రవర్తన  -  ఆది ప్రవర్తన

* అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు:
   కింది అంశాలు అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి.
  1) సంసిద్ధత (Readiness)
  2) పరిపక్వత (Maturation)
  3) ప్రేరణ (Motivation)
* అభ్యసనం కాని అంశాలు:
    » పరిపక్వత
    » నిష్పాదన
    » సహజాతాలు
    » గుడ్డి అనుకరణ (ఇంప్రింటింగ్)
    » అసంకల్పిత ప్రతీకార చర్యలు
    » మత్తుపదార్థాలు, అలసట, జబ్బు వల్ల జీవిలో ఏర్పడే తాత్కాలిక మార్పు.

అభ్యసన సిద్ధాంతాలు (Learning Theories) 

   జీవిలో అభ్యసన ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే అంశాన్ని ఒక్కొక్క ఉపగమం ఒక్కొక్క రూపంలో వివరిస్తుంది. వీటిలో పరీక్షల దృష్ట్యా ముఖ్యమైన సిద్ధాంతాలను పట్టికలో చూడొచ్చు ...

శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం
(Classical Conditioning Theory)

రష్యా దేశానికి చెందిన 'ఇవాన్ పెట్రోవిచ్ పావ్‌లోవ్' అనే జంతు శరీరధర్మ శాస్త్రవేత్త జంతువుల జీర్ణక్రియపై పరిశోధనలు నిర్వహించారు. ఆయన 'The work of the Digestive Glands' అనే గ్రంథాన్ని రూపొందించి, 'నిబంధిత ప్రతిక్రియా చర్య' (Conditional Reflective Action) ను కనుక్కున్నారు.
* ప్రయోగం: పావ్‌లోవ్ కుక్కను కదలకుండా తోలు పటకాలతో బంధించి, దాని లాలాజల గ్రంథుల నుంచి రబ్బరు గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం చివర కొలపాత్రను ఉంచాడు.
* ఆకలిగా ఉన్న కుక్క నోటి వద్ద ఆహారాన్ని ఉంచి అది ఎంత లాలాజలం స్రవించిందో గమనించి, తర్వాత గంటను మోగించి వెంటనే ఆహారం ఇవ్వడం ఒకదాని వెంట మరొకటి చేశాడు.
* గంట మోగించిన వెంటనే ఆహారం ఇవ్వడం అనే ప్రక్రియ మళ్లీ మళ్లీ జరిగిన తర్వాత ఆహారాన్ని సమకూర్చకపోయినా గంట శబ్దానికే కుక్క లాలాజలాన్ని స్రవించింది.
* ఈ విధంగా గంట శబ్దానికి అదే అభ్యసన ప్రతిస్పందనను రప్పించినందుకు దీన్ని 'నిబంధిత అభ్యసనం' అంటారు. ఈ ప్రయోగం మూడు దశల్లో జరిగింది.
* గంటకు, ఆహారానికి మధ్య బాగా సంసర్గం ఏర్పడటం వల్ల గంటకు లాలాజలమనే నిబంధన చర్య ఏర్పడింది.

శాస్త్రీయ నిబంధనా నియమాలు   

1. పునర్బలన నియమం (Reinforcement): గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధనం ఏర్పడింది. ఈ జోడింపు ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధిత ప్రతిస్పందన ఏర్పడటమే 'పునర్బలనం'.
ఉదా: తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులు మంచి ప్రవర్తన అలవరచుకోవడానికి ఈ నియమాన్ని వాడటం.
2. విరమణ (విలుప్తీకరణం) (Extinction): పునర్బలన చర్య తర్వాత గంట మోగించిన వెంటనే ఆహారాన్ని ఇవ్వకుండా ఉండటం ద్వారా నిబంధనం క్షీణించడమే 'విరమణ'.
ఉదా: చిన్నపిల్లల్లో కనిపించే వేళ్లు చీకడం, పక్క తడపటం లాంటి అలవాట్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగించవచ్చు.
3. అయత్నసిద్ధ స్వాస్థ్యం (Spontaneous Recovery): ప్రయోగాత్మకంగా నిబంధనను విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత ఒక్కోసారి నిబంధన చర్య ఉన్నట్టుండి బయటపడుతుంది. ఇదే అయత్నసిద్ధ స్వాస్థ్యం.
ఉదా: 2014 ముగిసి 2015 వచ్చినా అప్పుడప్పుడు జనవరి నెలలో తేదీ రాస్తూ 2014 అని వేయడం.
4. సామాన్యీకరణం(Generalisation): ఒకఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా అదే నిబంధనను చూపడం.
ఉదా: పసుపు రంగులోని తమ స్కూల్ బస్సుకు భయపడిన పునీత్ అనే విద్యార్థి పసుపు రంగులో ఉన్న ఇతర స్కూల్ బస్సులకు, వ్యాన్‌లకు, జీపులకూ భయపడటం.

5. విచక్షణం (Discrimination): ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధనం కలిగిన తర్వాత, ఉద్దీపనల మధ్య తేడాను గుర్తించి ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం.
ఉదా: పునీత్ తన స్కూల్ బస్సుకు మాత్రమే భయాన్ని ప్రకటించి, ఇతర బస్సులంటే భయపడకపోవడం.
6. ఉన్నత క్రమ నిబంధనం (Higher Order Conditioning): మొదటి నిబంధనం చేయడంలో ఉపయోగించిన అసహజ ఉద్దీపనను రెండో నిబంధన ప్రయోగంలో సహజ ఉద్దీపనగా ఉపయోగించి, రెండో నిబంధనాన్ని చేయడమే 'ఉన్నత క్రమ నిబంధనం' అవుతుంది.
ఉదా: * పోలీసును చూసి భయపడే దొంగ, పోలీసు జీపును చూసి కూడా అదే రకమైన భయాన్ని వ్యక్తపరచడం.
* ఒక ఉపాధ్యాయుడిని అభిమానించే విద్యార్థి ఆ ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్ట్‌ను కూడా అభిమానించడం, ఇష్టపడటం.

రచయిత: కోటపాటి హరిబాబు 

Posted Date : 25-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు