• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు 

     వ్యక్తికీ వ్యక్తికీ మధ్య ఉండే అనేక విషయాల్లోని తేడాలను వైయక్తిక భేదాలు అంటారు. ఈ భేదాలు శారీరక లక్షణాలైన శరీర రంగు, బరువు, ఎత్తులోనూ; మానసిక అంశాలైన అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, ఉద్వేగాలు, ప్రజ్ఞ, ఇతరులతో సర్దుబాట్లు లాంటి అంశాల్లో నిరంతరం వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే ప్రతివ్యక్తిలోనూ కింది అంశాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి.
అవి:
   1) ప్రజ్ఞపాటవాల స్థాయి
   2) శారీరక లక్షణాలు
   3) పాఠ్యాంశ విషయాల సాధన
   4) దృక్పథాలు
   5) మూర్తిమత్వ లక్షణాలు
   6) లైంగిక భేదాలు
   7) ఉద్వేగరీతులు
   8) సాంఘిక పరిస్థితులు
   9) ఆర్థిక పరిస్థితులు
   10) వికాస స్థాయులు

     వైయక్తిక భేదాలపై ప్రపంచంలోనే మొదటిసారిగా ఇంగ్లండ్‌లో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 'మానవశాస్త్ర ప్రయోగశాల (Anthropometric laboratory) ను ఏర్పాటు చేశారు. ఇందులో జీవి బలం, పట్టు, అభిరుచులు, వైఖరులు, సహజసామర్థ్యాలు, వ్యక్తి ఉద్వేగపర అంశాలను వివిధ రకాల సాంఖ్యక పద్ధతులను ఉపయోగించి కొలిచి చెప్పేవారు. ఈ పరిశోధనలు క్రమంగా వైయక్తిక పరంగా అభివృద్ధి చెందుతూ 1883లో "Inquiries into Human Faculty and Its Development" అనే గ్రంథంగా రూపొంది, వైయక్తిక భేదాల్లో శాస్త్రీయ రచనగా ఆవిర్భవించింది.
1) 1920లో జాన్ డ్యూయీ అనే అమెరికన్ శాస్త్రజ్ఞుడు 'Democracy and Education' అనే గ్రంథం రాశాడు. ''వ్యక్తిగత విద్యావ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుంది" అని ఆయన ఈ గ్రంథంలో పేర్కొన్నాడు.
2) ప్లేటో: ''ప్రతివ్యక్తికీ ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులుంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి".

 

వైయక్తిక భేదాలు - కారణాలు: విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడటానికి ముఖ్యకారణాలు ఉన్నాయి. అవి:
    1) అనువంశికత     2) పరిసరాలు     3) లైంగిక భేదాలు    4) వయసు     5) జాతి

      పై కారణాలు అన్నీ వ్యక్తిపై సందర్భానుసారంగానే తమ ప్రభావాన్ని చూపుతాయి. కానీ ఒక వ్యక్తిపై అనువంశికత, పరిసరాల ప్రతి చర్యతో కూడుకోవడం వైయక్తిక భేదాలకు కారణమవుతుంది. అంటే రెండింటి ఉమ్మడి ప్రభావం వల్ల వ్యక్తుల మధ్య వైవిధ్యాలు ఏర్పడతాయి.
            ప్రవర్తన = అనువంశికత × పరిసరాలు

 

వైయక్తిక భేదాలు - రకాలు: వైయక్తిక భేదాలను 2 రకాలుగా గమనించవచ్చు.
1. వ్యక్తంతర భేదాలు (Inter Individual Differences): వివిధ వ్యక్తుల ప్రవర్తనా రీతుల్లోని అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాల్లో కనిపించే తేడాలను వ్యక్తంతర భేదాలు అంటారు.
ఉదా: 1) విశ్వనాథన్ ఆనంద్ భారతదేశ చెస్ క్రీడాకారుల్లో కెల్లా అత్యంత ప్రతిభ చూపగలడు.
         2) శ్రీను అనే విద్యార్థి ఆటల్లో చూపగలిగే ప్రతిభను తన తరగతిలోఎవ్వరూ చూపలేరు.
         3) అనిత అనే బాలిక వంటలు అద్భుతంగా చేయగలదు.

 

2. వ్యక్తంతర్గత భేదాలు (Intra Individual Differences): ఒక వ్యక్తిలోని వివిధ అంశాల మధ్య తేడాలను లేదా ఒక వ్యక్తి వివిధ సన్నివేశాల్లో చూపే ప్రవర్తనా వైవిధ్యాన్ని వ్యక్తంతర్గత భేదాలు అంటారు.
ఉదా: 1) ఒక వ్యక్తి క్రీడల్లో చూపే ప్రతిభను చదువులో చూపలేకపోవచ్చు.
         2) శ్రీను అనే విద్యార్థి ఆటల్లో అత్యధిక ఆసక్తిని చూపగలడు కానీ పాటలు పాడటంలో చూపలేడు.
         3) అనిత అనే బాలిక వంటలు బాగా చేయగలదు కానీ సరిగా రాయలేదు.
      పైన తెలిపిన వైయక్తిక తేడాలకు కారణం జన్యుపరమైంది లేదా పరిసర సంబంధమైందిగా ఉండొచ్చు.

వైయక్తిక భేదాలు - కనిపించే రంగాలు
    1) ప్రజ్ఞ 
    2) సహజ సామర్థ్యాలు
    3) అభిరుచులు
    4) వైఖరులు
    5) మూర్తిమత్తం 
    6) నిష్పాదనా స్థాయి
    7) కాంక్షాస్థాయి 
    8) ఆత్మభావన
    9) విలువలు 
    10) సృజనాత్మకత

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌