• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ

ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు ఒకే విధంగా ఉండవు. వ్యక్తికీ వ్యక్తికీ మధ్య భౌతిక (శారీరక ఆకృతి, ఎత్తు, బరువు, రంగు), మానసిక (ప్రజ్ఞ, అభిరుచి, వైఖరి, సహజ సామర్థ్యం, ఉద్వేగాల ప్రకటన, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు కాగల నైపుణ్యం), సాంఘికపరమైన విషయాల్లోని అనేక రకాలైన తేడాలనే వైయక్తిక భేదాలు అంటారు.
ప్రతి వ్యక్తిలోనూ వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. ఉపాధ్యాయుడు వీటిని దృష్టిలో ఉంచుకునే తన బోధనను కొనసాగించాల్సి ఉంటుంది.
* తరగతి గదిలో విద్యార్థుల మధ్య పలు విషయాల్లో వివిధ రకాల వైయక్తిక భేదాలు ఉంటాయి. వీటిని అనుసరించి ఉపాధ్యాయుడు వారికి పాఠ్యాంశాన్ని కల్పించి, తదనుగుణంగా ఇంటిపని (Homework) ఇవ్వాలి.

 

వైయక్తిక భేదాలు - పరిశోధన 

గాల్టన్: ప్రపంచంలోనే మొదటిసారిగా ఇంగ్లండ్‌లో మానవ శాస్త్ర పరిశోధనాశాల (Anthropometric Laboratory) ఏర్పాటుచేసి దృశ్య, శ్రవణ విచక్షణ, ప్రతిచర్యా వేగం, శరీర ఆకార పరిమాణాలు, బలం, పట్టు, చలన భేదాలు, స్పర్శా విచక్షణాంశాలను సాంఖ్యకశాస్త్ర పద్ధతులను అనుసరించి తెలుసుకున్నారు. ఇతన్ని వైయక్తిక భేదాల్లో శాస్త్రీయ పరిశోధన చేసిన వారిలో అగ్రగణ్యుడిగా పేర్కొనవచ్చు. గాల్టన్ తన పరిశీలనాంశాలను "An Inquiry into Human Faculty and its Development" అనే గ్రంథంలో పొందుపరిచారు.

* ప్రతి వ్యక్తికీ ప్రకృతిసిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వాటి ఆధారంగానే బోధన జరగాలి. - ప్లేటో
* 'వ్యక్తుల భౌతిక భేదాలనే కాకుండా, మానసిక భేదాలను కూడా పరిగణనలోకి తీసుకుని బోధన కొనసాగించాలి'. - 'ఎమిలి' అనే గ్రంథంలో రూసో

 

వైయక్తిక భేదాలు - రకాలు 

1. వ్యక్తంతర భేదాలు (Inter Individual Differences): వ్యక్తుల మధ్య వివిధ అంశాల్లో అంటే ప్రజ్ఞ, అభిరుచి, వైఖరి, సృజనాత్మకత, ఇతర అంశాల్లో ఉన్న తేడా:
ఉదా: జయశంకర్ అనే ఉపాధ్యాయుడు తన తోటి ఉపాధ్యాయుల కంటే తెలుగుభాషను చక్కగా బోధించగలడు.
* మౌనిక తన తరగతి గది విద్యార్థుల కంటే గణితం బాగా చేయగలదు.
* 'సచిన్' అందరు క్రికెటర్ల కంటే బ్యాటింగ్ అద్భుతంగా చేయగలడు.

 

2. వ్యక్తంతర్గత భేదాలు (Intra Individual Differences): ఒకే వ్యక్తిలోని వివిధ ప్రవర్తనాంశాల్లో, వికాసంలో ఉండే భేదం.
ఉదా: 'రాహుల్' క్రీడల్లో బాగా రాణిస్తున్నాడు కానీ సంగీతంలో ఆసక్తి చూపడు.
* శ్రీనివాస్ సాంఘికశాస్త్రం బాగా బోధించగలడు కానీ భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి ఆసక్తి చూపడు.
* ప్రశాంత్ బాగా చదవగలడు కానీ రాయడానికి ఆసక్తి చూపడు.

వైయక్తిక భేదాలు - ప్రభావితం చేసే రంగాలు: 
* ప్రజ్ఞ (Intelligence)

* అభిరుచి 

* వైఖరి

* విలువలు
* కాంక్షాస్థాయి

* ఆత్మభావన

* సాధన
 

ప్రజ్ఞ (Intelligence): 'వ్యక్తిలోని సాధారణ మానసిక సామర్థ్యం లేదా అన్ని దైనందిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ'. ఇది వ్యక్తిలోని నిర్దిష్టమైన సామర్థ్యం.
ప్రజ్ఞకాని అంశాలు: 1) జ్ఞానం (Knowledge) 2) నైపుణ్యం (Skill) 3) ప్రావీణ్యత (Talent) 4) స్మృతి (Memory) 5) సహజసామర్థ్యం (Aptitude) 6) వైఖరి (Attitude) 7) ఆలోచన (Thinking) 8) అవధానం (Attention) 9) మూర్తిమత్వం (Personality) 10) వ్యక్తి ప్రవర్తన (Behaviour) 11) ప్రత్యక్షం (Perception) 12) సృజనాత్మకత (Creativitiy).

 

ప్రజ్ఞ - లక్షణాలు:
* ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలోని అంతర్గత శక్తి. ఇది అందరిలోనూ ఒకేరకంగా ఉండదు. వైయక్తిక భేదాలను చూపుతుంది.
* వ్యక్తికి అనువంశికత ద్వారా, పుట్టుకతో ఏర్పడుతుంది. కానీ పరిపక్వత పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతుంది.
* ప్రజ్ఞను నిర్దిష్టంగా కొలవచ్చు.
* సాధారణంగా ప్రజ్ఞావికాసం కౌమారదశ వరకు కొనసాగి ఆగిపోతుంది.
* ప్రజ్ఞకు వైయక్తిక భేదాలు ఉంటాయి. కానీ లైంగిక భేదాలు ఉండవు.
* ప్రజ్ఞలో సమైక్య ఆలోచన ఉంటుంది కానీ విభిన్న ఆలోచన ఉండదు.
ఉదా: ఒక సమస్యకు ఒకే పరిష్కారం చూపడం సమైక్య ఆలోచన. అంటే ఆ సమస్యకు వివిధ పరిష్కారాలు చూపడం విభిన్న ఆలోచన.

ప్రజ్ఞ - రకాలు 

ఇ.ఎల్. థారన్‌డైక్ ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించారు.
1) మూర్త/ యాంత్రిక ప్రజ్ఞ (Concrete/ Mechanical Intelligence)
* వ్యక్తి కంటికి కనిపించే వస్తువులు లేదా యంత్రాలను సక్రమంగా ఉపయోగించగలిగే సామర్థ్యం.
* ఈ ప్రజ్ఞ రోజువారి కూలీలు, చేతివృత్తులు చేసేవారిలో అధికంగా ఉంటుంది. ఈ సామర్థ్యాన్ని నిష్పాదనా పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు.

 

2) అమూర్త ప్రజ్ఞ (Abstract Intelligence): అంకెలు, సంఖ్యలు, పదాలు, మాటలు, భావాలు, చిత్రాలు, చిహ్నాలను సందర్భోచితంగా ఉపయోగించే సామర్థ్యం.
* కవులు, రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తల్లో ఈ రకమైన ప్రజ్ఞను అధికంగా చూడవచ్చు.

 

3) సాంఘిక ప్రజ్ఞ (Social Intelligence): సమాజంలోని మానవ సంబంధాలను అర్థం చేసుకుని వారికి అనుగుణంగా స్పందించి, వారిని మెప్పించగలిగే తెలివే సాంఘిక ప్రజ్ఞ.
* నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా దర్శకులు మొదలైన వారిలో ఉండే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞను కచ్చితంగా కొలిచి చెప్పలేం కానీ అంచనా వేయగలం.

ప్రజ్ఞా సిద్ధాంతాలు - అవగాహన

1. ఏకకారక సిద్ధాంతం  - బినే, స్టెర్న్, టెర్మన్

* ప్రజ్ఞ ఒకే కారకంతో ఏర్పడుతుంది. అంటే ఒక రంగంలో వ్యక్తి మంచి ప్రతిభ చూపితే అన్ని రంగాల్లో అంతే ప్రతిభ చూపగలడు.

ఉదా: క్రీడల్లో బాగా రాణించిన సచిన్, చెస్‌లో బాగా రాణించగలగాలి. కానీ ఇలా జరగలేదు. ఇది వాస్తవానికి దూరంగా ఉండటంతో దీన్ని అంగీకరించలేదు.

2. ద్వి-కారక సిద్ధాంతం - కార్ల్ స్పియర్‌మెన్

* ప్రజ్ఞ పుట్టుకతో సాధారణ(G) కారకం. పరిసరాల్లో సర్దుబాటై నిర్దిష్ట (S) కారకంగా మారుతుంది. ఇందులో స్థిరమైంది G కారకమే.

ఉదా: తెలుగులో అధిక ప్రజ్ఞ కనబరిచే (సాధారణ కారకం) జయశంకర్ అనే ఉపాధ్యాయుడు తెలుగు భాషా అభిరుచితో (నిర్దిష్ట కారకం) మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం.

3. బహుకారక సిద్ధాంతం - థారన్ డైక్

* వ్యక్తిలోని అధిక నిర్దిష్ట సంఖ్యలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికే ప్రజ్ఞ.

* ఇవి స్వతంత్రంగా పనిచేస్తాయి.

ఉదా: చదువులో ఒక విద్యార్థి చూపే ఉన్నత ప్రతిభను ఆధారంగా చేసుకుని ఇతర అంశాల్లో అదే ప్రతిభ ఉంటుందని చెప్పలేం.

4. సామూహిక కారక సిద్ధాంతం - థర్‌స్టన్

* ఏడు మానసిక సామర్థ్యాలు ప్రజ్ఞకు మూలంగా ఉంటాయి.

ఉదా: 'పల్లవి' అనే విద్యార్థి ఏ సబ్జెక్టులో నైపుణ్యాన్ని సాధించడానికైనా 'థర్‌స్టన్' పేర్కొన్న ఏడు అంశాల్లో కొన్ని కలసి ఉంటాయి. ఈ విద్యార్థి 'భాష'లో నైపుణ్యం సాధించాలంటే పద ధారాళత + జ్ఞాపకశక్తి + వివేచనం అనే సామర్థ్యాలు కలసి ఉండాలి.

5. స్వరూప నమూనా సిద్ధాంతం - గిల్‌ఫర్డ్

* వ్యక్తి మనసులోని ప్రచాలకాలు, విషయాలు, ఉత్పన్నాలు, పరస్పర చర్య ద్వారా 150 కారకాలతో ప్రజ్ఞ ఏర్పడుతుంది. (SGT స్థాయి వారికి 120).

6. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం - హోవార్డ్ గార్డెనర్

* ప్రజ్ఞ 8 స్వతంత్ర కారకాలతో ఏర్పడుతుంది.
* వ్యక్తి తనకు ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉండటం.
* ఏదైనా రంగంలో ఉన్నత నిష్పాదన పెంపొందించుకోవాలంటే వివిధ రకాల ప్రజ్ఞల కలయిక అవసరం.

ఉదా: ఒక వ్యక్తి సంగీత దర్శకుడిలా ఎదగాలంటే సంగీత ప్రజ్ఞతోపాటు, భాషాప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞలు కూడా అవసరం.

7. ఉద్వేగాత్మక ప్రజ్ఞ - డానియల్ గోల్‌మన్

* గోల్‌మన్ అభిప్రాయం ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలతో కూడిన 5 విశేషకాలు ఉన్నాయి.

* వ్యక్తి సాధించిన విజయంలో 80% ఉద్వేగాలు ఉపకరిస్తే, అతడి సాధారణ ప్రజ్ఞ కేవలం 20% మాత్రమే ఉంటుంది.

ఉదా: ఉద్వేగాలను అదుపులో ఉంచుకుని డీఎస్సీకి సిద్ధమయ్యే వ్యక్తి విజయం సాధించడం.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు