• facebook
  • whatsapp
  • telegram

పెరుగుదల, వికాసం, పరిపక్వత

పెరుగుదల: జీవి పుట్టినప్పటి నుంచి సంభవించే పరిమాణాత్మక, భౌతికపరమైన మార్పులను పెరుగుదల (Growth) అంటారు.
ఉదా: జీవిలో భౌతికంగా కనిపించే ఎత్తు, బరువులోని మార్పు.
వికాసం: జీవిలో సంభవించే పరిమాణాత్మక మార్పులతోపాటు మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, సంజ్ఞాత్మక లాంటి గుణాత్మక లక్షణాల్లోని మార్పులను వికాసం అంటారు.

పరిణితి లేదా పరిపక్వత (Maturity):
    వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజాతాలు (లేదా) సహజ సామర్థ్యాలు వయసుతోపాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత. ఇది ప్రతి వ్యక్తిలోనూ క్రమానుగతంగా జరుగుతుంది.

 

లక్షణాలు
1. పరిపక్వత జైవికమైంది (Biological).
2. పరిపక్వత స్వతహాగా జరిగే ప్రక్రియే కానీ ఆర్జిత ప్రక్రియ కాదు.
3. అభ్యసనం వల్ల వచ్చే మార్పులన్నీ పరిపక్వం కాదు.
4. పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ.
ఉదా: * శిశువుకు జన్మత దంతాలు రావు. వయసుతో పాటు క్రమంగా మొదట పాల దంతాలు, తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి.
* జన్మించిన శిశువు మొదట వెల్లకిలా పడుకోవడం, 3 నెలల తర్వాత బోర్లా పడటం, 6 నెలలకు పాకడం, తర్వాత కూర్చోవడం, 8-9 నెలల వయసులో ఆధారంతో పట్టుకుని నడవడం, సంవత్సరం దాటిన తర్వాత స్వతహాగా నడవడం పరిపక్వతను తెలియజేస్తుంది.
     పై విషయాలను క్రమంగా పరిశీలిస్తే... వ్యక్తిలో వికాస ప్రక్రియ సక్రమంగా, సంపూర్ణంగా జరగాలంటే నిర్ధారిత వయసు వచ్చిన అనంతరం అభ్యసనం కల్పించాలి. లేకపోతే పరిపక్వత లేని అభ్యసనం వికాసం కాజాలదు.
      పరిపక్వత × అభ్యసనం = వికాసం

వికాస సూత్రాలు, నియమాలు

    జీవుల్లో జరిగే పెరుగుదల, వికాసాలు అనేవి ఒక నిర్దిష్టమైన, సక్రమమైన సూత్రాలను, నియమాలను ఏర్పరచుకుని ఉంటాయి.
1. వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియ:
    తల్లి గర్భంలో అతి సూక్ష్మాతిసూక్ష్మంగా మొదలైన జైగోట్ నిరంతరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి వ్యక్తి మరణించేంత వరకు జరుగుతుంది. జీవితంలో అనేక మార్పులను వికాసం తెలియజేస్తుంది. వికాసంలో ఆగి ఆగి జరగడం లాంటి ప్రక్రియలు చోటుచేసుకోవు.


2. వికాసం క్రమానుగత సూత్రాన్ని అనుసరిస్తుంది:
     వికాస ప్రక్రియ ఒక సక్రమమైన నమూనాను అనుసరిస్తుంది.
ఉదా: * శిశువు జన్మించిన తర్వాత వెల్లికిలా పడుకోవడం, బోర్లా పడటం, కూర్చోవడం, నడవడం.
* ఉపాధ్యాయుడు 'ఎల్ - ఎస్ - ఆర్ - డబ్ల్యూ' క్రమాన్ని అనుసరించి బోధించడం
* అంకెలు, సంఖ్యలు, కూడిక, తీసివేత తర్వాతే గుణకారం, భాగహారం బోధించడం.
* శిశువు సాంఘిక వికాసానికి అవసరమైన క్రీడలను వరసగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడలుగా ఆడటం.

3. వికాసం మానవ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు:
 
   వయసుతో పాటు జరిగే మానవ అన్ని వికాస దశల్లో వికాస ప్రక్రియ సక్రమంగా జరగదు.
ఉదా: * శైశవ దశలో శారీరక పెరుగుదల అధికంగా జరుగుతుంది.
* బాల్యదశలో మానసిక వికాసం అధికంగా జరిగి భౌతిక వికాసం తగ్గుతుంది.
* కౌమారదశలో శారీరక, మానసిక వికాసాలు ఉద్ధృతంగా జరుగుతాయి.

 

4. వికాసంలో వ్యక్తి - వ్యక్తికీ మధ్య వైయక్తిక భేదాలుంటాయి:
     వికాసమనే భావన ప్రతి వ్యక్తిలోనూ ఒకే రకమైన వేగాన్ని లేదా నిదానాన్ని ప్రదర్శించదు. అది ప్రతి వ్యక్తిలోనూ వైయక్తిక భేదాలను చూపుతుంది.
ఉదా: * పాఠశాలలోని పిల్లల్లో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు ఉండటం.
* ఒకే కుటుంబానికి చెందిన పిల్లల్లోని భావాలు, అభిరుచులు, వైఖరుల్లో భేదాలుండటం.

 

5. వికాస ప్రక్రియ రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది:
 

ఎ. శిరోపాదాభిముఖ వికాస నియమం: తల్లి గర్భంలోని శిశువులో వికాస ప్రక్రియ తల నుంచి శరీర భాగాలు, పాదాల వరకు కొనసాగడం.
ఉదా: తల్లి గర్భం నుంచి జన్మించే శిశువులు అధిక భాగం శిరస్సును చూపుతూ జన్మించడం.

బి. సమీప దూరస్థ వికాస నియమం: వికాసం దేహ మధ్యభాగంలో ప్రారంభమై దేహం వెలుపలి భాగం వైపు జరగడం.


                                                       
ఉదా: శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు చేతివేళ్లను ఉపయోగించడం.

 

6. వికాసం ఒక పరస్పర చర్య:
     వ్యక్తిలోని ప్రజ్ఞా పాటవాలు, పరిసరాలతో పరస్పరం చర్యలు జరపడం వల్ల వికాసం అభివృద్ధిని సాధిస్తుంది. శారీరక పెరుగుదల, ప్రజ్ఞ అనువంశికత ద్వారా అభివృద్ధి చెందితే... వివిధ రకాల ఉద్వేగాలు పరిసరాల ద్వారా అభివృద్ధి చెందుతాయి.
       వ్యక్తిలోని అనువంశికత + పరిసర ప్రభావం  వికాసం
ఉదా: సచిన్‌లో క్రికెట్ ఆడే అంతర్గత కౌశలం + బాహ్య ప్రోత్సాహం  మంచి క్రికెట్ ఆటగాడిగా తయారుకావడం

 

7. వివిధ వికాసాలు పరస్పర చర్యగా సంబంధంతో కొనసాగుతాయి (ఏకీకృత మొత్తం):
    ఒక వికాసం మరో వికాసాన్ని ప్రభావితం చేస్తుంది.

    ఒక వికాసం బాగా అభివృద్ధి చెందితే మరో వికాసం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఒక వికాసం తగ్గితే మరో వికాసం కూడా తగ్గుతుంది.


                      
ఉదా: శారీరక వికాసం దెబ్బతిన్న విద్యార్థికి మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలు కూడా తగ్గుతాయి.

8. వికాసం సంచిత క్రమాన్ని అనుసరిస్తుంది:
      జీవిలో జరిగే శారీరక మార్పులైనా, మానసిక మార్పులైనా బహిర్గతంగా ఒక్కసారిగా బయల్పడినప్పటికీ... ఆ మార్పులన్నీ ఒకేసారి జరగకుండా గతంలో జరిగిన మార్పుల ఆధారంగా ప్రస్తుతం జరగడాన్నే సంచితం అంటారు. వికాసం ఈ విషయాన్ని అనుసరిస్తుంది.
ఉదా: * విద్యార్థి అచ్చులు, హల్లులు, గుణింతాలు నేర్చుకుని వాటి సహకారంతోనే పదాలు, వాక్యాలు రాయడం.
* కూడిక, తీసివేత, గుణకారాలను నేర్చుకుని, వీటి పరిజ్ఞానంతోనే భాగహారాలను నేర్చుకోవడం.
* ఎక్కాలను నేర్చుకుని వాటి ఆధారంగానే గుణకారాలను సాధించడం.

 

9. వికాసం సులభ అంశాల నుంచి జఠిల అంశాలకు (లేదా) సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు పాకుతుంది:
     శిశువులో వికాసం సాధారణ స్థాయి నుంచి నిర్దిష్ట స్థాయికి వెళుతుంది. అన్ని వికాస ప్రక్రియల్లోనూ ఇది జరుగుతుంది.
ఉదా: * శిశువులోని సాధారణ ఉద్రిక్తత క్రమంగా కోపం, ఆనందం, భయం లాంటి ఉద్వేగాలుగా అభివృద్ధి చెందడం.
* చిన్నతనంలో పిల్లవాడు ఏడిస్తే శరీరం మొత్తం కదలడం. వయసు పెరిగాక కేవలం తనలోని నోరు, కళ్లకు మాత్రమే పరిమితమవడం.

10. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు:
     చిన్నతనంలో శిశువు చూపే చురుకుదనం లేదా మందకొడితనం ఆధారంగా అతడి భవిష్యత్ వికాసాన్ని ఊహించడమే ప్రాగుక్తీకరించడం.
ఉదా: * చిన్నతనంలో గణిత వికాసాన్ని అధికంగా కలిగిన విద్యార్థి భవిష్యత్తులో మంచి ఇంజినీర్ అవుతాడని ప్రాగుక్తీకరించడం.
* పిల్లవాడి మానసిక వికాసాన్ని ఊహించడం.

 

అనువంశికతా సూత్రాలు

     జన్యుశాస్త్ర పితామహుడైన గ్రెగర్ జోహాన్ మెండల్ మూడు ముఖ్యమైన అనువంశికతా సూత్రాలను పేర్కొన్నాడు.
 

1. సారూప్య సూత్రం (Law of similarity):
    ఈ సూత్రం ప్రకారం తల్లిదండ్రుల అనువంశికతా రూపం ఆధారంగానే సంతానం ఉంటుంది. అంటే ఒక జాతికి అదే రూపురేఖలు కలిగిన సంతానం ఉంటుంది.
ఉదా: * మానవులకు మానవులు, జంతువులకు జంతువులే జన్మించడం.
        * అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలు జన్మించడం.

2. వైవిధ్య సూత్రం (Law of variation):
      ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో అనేక విషయాల పట్ల వ్యత్యాసాలు ఉండటాన్ని వైవిధ్యం అంటారు.
ఉదా: * ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఒకరు బుద్ధిహీనుడిగా ఉంటే మరొకరు ప్రజ్ఞావంతుడిగా ఉండటం.
* ఒకే కుటుంబంలోని పిల్లల్లో ఒకరు తెలుపుగా ఉంటే మరొకరు నలుపుగా జన్మించడం.

 

3. ప్రతిగమన సూత్రం (Law of regression):
     వ్యక్తి పుట్టుక సమయంలో జన్యువుల్లో ఉండాల్సిన లక్షణాలు తరిగిపోవడం వల్ల, జన్యువుల్లోని అసాధారణ కలయిక వల్ల కొన్ని సందర్భాల్లో లక్షణాల తిరోగమనం ఏర్పడుతుంది.
ఉదా: * 'పండితపుత్ర పరమ శుంఠ' అనే సామెత దీనికి సంబంధించినదే.
       * మేనరిక వివాహాల వల్ల బుద్ధిమాంద్యత గల పిల్లలు జన్మించడం.
       * అందమైన తల్లిదండ్రులకు అందవిహీనమైన పిల్లలు జన్మించడం.

 

వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు

    ఒక జీవి పెరుగుదల, పరిపక్వత, వికాసం అనేవి ఆ జీవి అనువంశికత, పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి వికాసంలో పరిసరాల కంటే అనువంశికత అధిక పాత్ర వహిస్తుంది.
1. అనువంశికత: జీవి సహజంగా తన పూర్వీకుల నుంచి వివిధ లక్షణాలను వంశపారంపర్యంగా పొందడమే అనువంశికత. అంటే ఈ లక్షణాలన్నీ జన్మత పొందేవే.

స్త్రీ, పురుష బీజకణాల్లోని జన్యువులు వ్యక్తి లక్షణాలను నిర్ధారిస్తాయి.
* జీవిలోని నిర్మాణాత్మక, క్రియాత్మక పదార్థాన్ని కణం అంటారు. కేంద్రకంలోని దాదాపు పోగుల లాంటి నిర్మాణమే క్రోమోజోమ్. ప్రతి జీవ జాతిలో క్రోమోజోమ్‌ల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. మానవుడిలో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిలో 22 జతలు శారీరక క్రోమోజోమ్‌లు కాగా మిగిలిన జత 'లైంగిక' క్రోమోజోమ్‌లు.
* మగవారిలో X, Y రకానికి చెందిన లైంగిక క్రోమోజోములుంటే ఆడవారిలో X, X రకానికి చెందినవి ఉంటాయి.


                         
* జీవి లింగ నిర్ధారణ మగజీవిపై ఆధారపడి ఉంటుంది.

బిడ్డల సంఖ్య: సాధారణంగా ఒక స్త్రీకి ఒక శిశువు జన్మిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో (అసాధారణంగా) 'కవలలు' జన్మిస్తారు. ఈ కవలలు 2 రకాలు.
1. సమరూప కవలలు:
    సాధారణంగా తల్లి గర్భంలో నెలకు ఒక అండం విడుదలవుతుంది. ఈ అండం తండ్రి వల్ల విడుదలైన ఒక శుక్రకణంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. క్రమంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంయుక్త బీజం రెండుగా విడిపోవడం వల్ల ఏర్పడే శిశువుల జతనే సమరూప కవలలు అంటారు. వీరిలో లైంగిక భేదాలు ఉండవు.

 

2. అసమరూప/ విషమరూప/ విభిన్న కవలలు:
      కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల తల్లి గర్భంలో ఒకే నెలలో ఒకటి కంటే ఎక్కువ అండాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైన ప్రతి అండాన్ని ఒక్కో శుక్రకణం ఢీకొనడంతో అనేక సంయుక్త బీజాలు ఏర్పడి ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తారు. వీరిలో లైంగికపర భేదాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి.

అనువంశికతపై గ్రెగర్ మెండల్ నియమాలు

ఆస్ట్రియన్ మతాధిపతి, జన్యుశాస్త్ర పితామహుడు అయిన గ్రెగర్ మెండల్ బఠానీ మొక్కపై అనేక పరిశోధనలు చేసి అనువంశికత సూత్రాలను పేర్కొన్నాడు.

1. సారూప్య సూత్రం (Law of similarity):
     ఒకే జాతి పోలికలు ఉండే జీవులకు అలాంటి లక్షణాలున్న జీవులే జన్మించడం.
ఉదా: * మానవులకు మానవులు, జంతువులకు జంతువులే జన్మించడం.
       * ప్రజ్ఞావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞావంతులైన పిల్లలు జన్మించడం.
       * పొడవైన, శరీర సౌష్ఠవమున్న తల్లిదండ్రులకు అలాంటి పిల్లలే జన్మించడం.
2. వైవిధ్య సూత్రం (Law of variation):
      జన్యువుల్లో కలిగే వైవిధ్యం లేదా తేడా వల్ల జన్మించే పిల్లల్లోనూ వైవిధ్యం ఉంటుంది.
ఉదా: * ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రజ్ఞా పాటవాల్లో తేడాలు ఉండటం.
       * సగటు ఎత్తున్న వారికి జన్మించిన పిల్లల్లో ఒకరు పొడవుగా, మరొకరు పొట్టిగా ఉండటం.
3. ప్రతిగమన సూత్రం (Law of regression):
    జన్యువుల్లో కలిగే అసాధారణ కలయిక వల్ల లేదా మేనరిక వివాహాలు చేసుకున్నప్పుడు ఈ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది.
ఉదా: * ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు ప్రజ్ఞాహీనులు జన్మించడం.
       * 'పండితపుత్ర పరమ శుంఠ' అనే సామెత దీనికి సంబంధించినదే.
       * దీన్నే తిరోగమన సూత్రం అని కూడా అంటారు.

అనువంశికతపై జరిగిన పరిశోధనలు

1. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్: ఈయన ప్రఖ్యాత అనువంశికతావాది. 997 కుటుంబాలను పరిశోధించి వీరిపై అధిక ప్రభావం అనువంశికతా పరంగా ఏర్పడిందని నిరూపించాడు. ఈ ప్రయోగ ఫలితాలతో హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించాడు.
2. గోడార్డ్ అనే శాస్త్రవేత్త 'కల్లికాక్' అనే సైనిక అధికారిని పరిశీలించాడు.
3. విన్‌షిప్ - ఎడ్వర్డ్ కుటుంబంపై పరిశోధన చేశాడు.
4. డగ్‌డేల్ - అత్యంత అవినీతికి పాల్పడే తెగ అయిన 'జూక్స్' అనే కుటుంబంపై పరిశోధన చేశాడు.
5. పియర్సన్ - డార్విన్ కుటుంబంపై పరిశోధించి ప్రజ్ఞపై అనువంశికతా ప్రభావాన్ని వివరించాడు.
వికాసంపై పరిసరాల పాత్ర:
      'అనువంశికత తప్ప జీవిని ప్రభావితం చేసే అన్ని కారకాలను పరిసరాలు అంటారు.
     వ్యక్తిపై పరిసరాలు అధికంగా ప్రభావం చూపుతాయని జె.బి.వాట్సన్ అనే పరిసరవాది తెలియజేశాడు. ఈయన అనేక పరిశోధనలు చేసి బిహేవియర్: యాన్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన ''నాకు ఒక డజను మంది శిశువులను ఇవ్వండి. వారిని మీరు కోరిన విధంగా డాక్టర్లు, లాయర్లు, టీచర్లు లేదా దొంగలుగా కూడా తయారుచేస్తాను" అని ప్రకటించాడు.    పరిసరాల ప్రభావాన్ని స్కొడక్, గోర్డన్, డబ్ల్యూ.సి.బాగ్లే, న్యూమన్, బోరింగ్, లాంగ్‌ఫీల్డ్, వెల్డ్ అనేక పరిశోధనల ద్వారా వివరించారు.
(డబ్ల్యూ.సి.బాగ్లే రచన - ఎడ్యుకేషనల్ డిటర్మినిజం)

మానవ వికాస దశలు (Stages of Development)

     వ్యక్తిలోని వికాసం అవిచ్ఛిన్నంగా జరిగినప్పటికీ అది ఒకేరకంగా ఉండదు. కానీ ఒక క్రమమైన దశల్లో జరుగుతుంది. ఈ దశలను ప్రపంచవ్యాప్త మనోవైజ్ఞానికులు 4 దశలుగా వివరించారు. 'షేక్‌స్ఫియర్' 7 దశలుగా గుర్తించారు. 'ఎలిజబెత్ హర్లాక్' అనే మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త 'Developmental Psychology' అనే గ్రంథంలో 10 దశలుగా వివరించారు.
కానీ, ప్రాథమికంగా మానవుడి జీవితాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు.
     I) జనన పూర్వ దశ      II) జననానంతర దశ
I. జనన పూర్వ దశ
    ఈ దశ తల్లి గర్భంలో అండం ఫలదీకరణం చెందిన రోజు నుంచి శిశువు జన్మించేంత వరకు ఉంటుంది. ఈ దశను అధ్యయనా సౌలభ్యం కోసం మూడు అంతర్ దశలుగా వర్గీకరించారు.
ఎ) జైగోట్ దశ: ఫలదీకరణం నాటి నుంచి రెండు వారాల వరకు ఉంటుంది. కానీ ఈ దశలో బాహ్యపోషణ ఉండదు. కాబట్టి అతి సూక్ష్మంగా ఉన్న 'జైగోట్' పరిమాణంలో మార్పు ఉండదు. కానీ ఫాలోపియన్ ట్యూబు నుంచి గర్భాశయానికి చేరే సమయంలో అనేక సార్లు విభజన చెంది రెండు ప్రాథమిక పొరలుగా ఏర్పడుతుంది. పై పొర జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్‌గా మారి లోపలి పొరపిండంగా మారుతుంది.
బి) ఎంబ్రియో దశ: రెండో వారం నుంచి రెండో నెల వరకు పిండం దశలో ఉండి, క్రమంగా పిండం చిన్న మనిషి ఆకారంలోకి మారుతుంది. వికాసం శిరోపాదాభిముఖ  సూత్రం ఆధారంగా మొదట తల, ఆ తర్వాత శరీరంలోని అన్ని భాగాలు అభివృద్ధి చెందుతాయి. శిశువు కదలికలు తల్లికి తెలుస్తాయి.

సి) ఫీటస్ దశ: ఈ దశ శిశువు రెండో మాసాంతంలో ప్రారంభమై క్రమంగా జననం వరకు జరుగుతుంది. ఎంబ్రియో దశలో ఏర్పడిన శరీర భాగాలన్నీ ఈ దశలో పూర్తి అభివృద్ధిని సాధిస్తాయి. తల్లి గర్భంలో శిశువు 7వ నెల చివరికి జన్మించినా బతకడానికి కావాల్సిన పరిపక్వత ఉంటుంది. కానీ సాధారణంగా శిశువు 9వ నెలలోనే జన్మిస్తాడు.
జనన పూర్వదశ లక్షణాలు:
* శిశువు అభివృద్ధి, మానసిక వికాసం లాంటివన్నీ తల్లి గర్భంలో శిశువు ఫలదీకరణ చెందిన సమయంలోనే నిర్ణయమవుతాయి. తర్వాత ఎలాంటి ప్రభావితాలు ఉండవు.
* శిశువు లింగ నిర్ధారణ ఫలదీకరణ సమయంలోనే నిర్ణయమవుతుంది.
* గర్భిణికి మానసిక ఆనందాన్ని కలిగిస్తే... శిశువుకు జీవితాంతం అదే ఆనందం కొనసాగుతుంది.
* మానవ జీవితంలోని అన్ని వికాస దశల్లో చూపించని అత్యంత పెరుగుదల 'జననపూర్వ దశ'లోనే జరుగుతుంది.
* జననపూర్వ దశలో శారీరక, మానసిక ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది.
II. జననానంతర దశ:
     శిశువు జననం నుంచి మరణం వరకు వికాసాన్ని ఈ దశలో పరిశీలించవచ్చు. ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను 10 భాగాలుగా విభజించారు.

1. నవజాత శిశువు (0 - 14 రోజులు) (Infancy Stage)
     శిశువులోని 'నాభి నాళం' ఊడిపోయేంతవరకు ఉండే దశ. ఎక్కువ సమయం నిద్రలో గడుపుతాడు. ఈ దశలో ఎక్కువగా 'సర్దుబాటు' చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని కింది అంశాల్లో గమనించవచ్చు.
     1) శ్వాసించడం
     2) శీతోష్ణస్థితి సర్దుబాటు
     3) ఆహారం తీసుకోవడం
     4) మలమూత్ర విసర్జనా సర్దుబాటు
* శిశువులో కనిపించే మొదటి సంకేతం - ఏడుపు
* శిశువులో కనిపించే మొదటి ఉద్వేగం - ఉత్తేజం (Exitement)
2. శైశవ దశ (Babyhood): (2వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు)
* జననానంతర అన్ని దశల్లో అత్యంత భౌతిక వికాసం జరిగే దశ.
* శిశువులో సంవేదన, అవధానం, ప్రత్యక్షం, ఆసక్తులు అభివృద్ధి చెందే దశ.
* రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని క్లిష్ట దశ అంటారు.
* 'మొక్కై వంగనిది మానై వంగునా' అనే సామెత ఈ దశకు చెందినదే.
* జ్ఞానేంద్రియ వికాసం అధికంగా సంభవించే దశ.

ఉదా: * దృష్టి జ్ఞానం - 2వ నెల నుంచి ఏర్పడుతుంది.
* అనుకరణ, ఇతరుల నుంచి గ్రహించడం ద్వారా భాషపై అవగాహన వస్తుంది.
* పాలదంతాలు ఏర్పడతాయి (సుమారు 20).
* శిశువు గుర్తించే మొదటి రంగు - ఎరుపు.
* వినికిడి జ్ఞానాన్ని పొందుతాడు.
* తల్లి గర్భంలోనే ఏర్పడే స్పర్శా జ్ఞానం ఈ దశలో బాగా అభివృద్ధి చెందుతుంది.
* ఈ దశలో శిశువుకు సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది.
* ఈ దశను ముద్దుపలుకుల వయసు అంటారు.
* పాలబుగ్గలను ఈ దశలో గమనించవచ్చు.
* ప్రశ్నించడం నేర్చుకుంటాడు.
* ఈ దశలో శిశువులో అనుకరణ ఎక్కువగా ఉంటుంది.
* సంరక్షణా వయసు కూడా ఇదే.
* శిశువు బరువు 4, 5 నెలల్లో 2 రెట్లు, ఒక సంవత్సరానికి 3 రెట్లు, 2 సంవత్సరాలకు 4 రెట్లు పెరుగుతుంది.
* శైశవ దశలో శిశువులో స్మృతి తక్కువగా ఉంటుంది.

* ప్రజ్ఞలో సరైన పరిపక్వత లేకపోవడం వల్ల అమూర్త ఆలోచన, వివేచనా సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
* ఈ దశలో మొదటగా ఏర్పడే 'ఉత్తేజం' క్రమంగా కింది విధంగా విభజన చెందుతుంది.


* శిశువు సాంఘిక వికాసాన్ని కేవలం తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేసుకుంటాడు. శిశువు తన మొదటి సాంఘిక ప్రతిస్పందనను తల్లి లేదా పెద్దవారు, తర్వాత చిన్నవారితో చూపుతాడు.
* నైతిక వికాసం ఈ దశలో ఉండదు. కాబట్టి వీరికి మంచిచెడులు తెలియవు.
* తనకు ఆనందం కలిగించేది మంచి అనీ, బాధ కలిగించేది చెడు అనీ గుర్తిస్తాడు.
* ఈ దశలో శిశువులో అనుకరణ ద్వారా భాషను ప్రారంభిస్తాడు. ఇందులో భాగంగా ఇతరులను అర్థం చేసుకోవడానికి, తన భావాలను తెలియజేయడానికి ఏడవడం, ముద్దుపలుకులు, సైగల ద్వారా ప్రతిస్పందించడం, ఉద్వేగాల ప్రకటనలను ఉపయోగిస్తాడు.

శిశువులో కనిపించే భాషాభివృద్ధి దశలు:
ప్రాగ్భాషా దశ:
పుట్టిన నాటి నుంచి 4 నెలల వరకు ఉంటుంది. మొదట శిశువుకు భాష అంటే తెలియదు. క్రమంగా అలవడుతుంది.
ముద్దు పలుకుల దశ: 4 నుంచి 12 నెలల వరకు ఉంటుంది. శిశువు తల్లిదండ్రులను గుర్తించి తనకు సులభమైన కొన్ని శబ్దాలు చేస్తాడు. కానీ వాటికి అర్థాలు ఉండవు.
ఉదా: అన్నాన్ని 'బువ్వ/ తువ్వ/ఆమ్'అనీ; నీటిని 'లాల' అనీ ప్రతిస్పందిస్తాడు.
శబ్ద అనుకరుణ దశ: ఈ దశ ఒక సంవత్సరం నుంచి 1 1/2 సంవత్సరం వరకు ఉంటుంది. శిశువు ఈ దశలో పెద్దలను అనుకరించడం ద్వారా 'నిబంధనం'ను ఏర్పరచుకుని భాష నేర్చుకుంటాడు.
శబ్దగ్రాహ్యక దశ: దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ దశ పరిపక్వత చెందుతుంది. శబ్దాలను బాగా విని వాటిని వ్యక్తపరచడంతో పాటు అర్థవంతమైన మాటలను మాట్లాడగలడు.
    ఉచ్ఛారణ, పదాలను చిన్నచిన్నగా నిర్మించుకోవడం, వాటి సహకారంతో వాక్యాలను మాట్లాడటం ద్వారా శిశువు తన భాషా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.
3. పూర్వ బాల్య దశ (Early childhood): (2 - 5, 6 సంత్సరాల వరకు)
* ఈ దశను శిశువు పాఠశాల పూర్వ వయసు, పూర్వ ముఠా వయసు అంటారు.
* భౌతిక వికాసం మందకొడిగా, మానసిక వికాసం అధికంగా జరుగుతుంది.
* శిశువు భవిష్యత్ శరీర ఆకారాన్ని ఈ దశలో ప్రాగుక్తీకరించవచ్చు. (ఊహించవచ్చు)

ఉదా: సన్నగా ఉంటే లంబకాయత్వం, మధ్యస్థంగా ఉంటే మధ్యమకాయత, బొద్దుగా ఉంటే స్థూలకాయతగా అంచనా వేయవచ్చు.
* నూతన విషయాలను తెలుసుకోవాలనే అన్వేషణా దృక్పథం లేదా విజ్ఞాన తృష్ణ అధికంగా ఉంటుంది.
* పాలదంతాలు రాలిపోయి శాశ్వత దంతాలు ఏర్పడతాయి.
* ఈ దశలో క్రమంగా ఆత్మభావన (Self concept) ఏర్పడుతుంది.
* అసూయను అధికంగా ప్రదర్శిస్తారు.
* ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఇది ప్రమాద వయసు.
* ఉద్వేగాలను నియంత్రించుకోలేక 'ధారాపాతంగా' కనిపించే దశ.
* కుటుంబం నుంచి పూర్వ ప్రాథమిక పాఠశాలలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ దశను సాంఘిక వికాసానికి తొలిమెట్టు అని అంటారు.
* ప్రశ్నించే గుణం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.
* సాంఘిక వికాసానికి ఇది ముఖ్యమైన దశ.
* ఈ దశలోని శిశువులో అహం కేంద్రీకృతం ఎక్కువగా ఉంటుంది. తమ గురించి, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా మాట్లాడతారు.

భాషా వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు:
     1) ప్రజ్ఞ
     2) కుటుంబ సామాజిక పరిస్థితి
     3) సాంఘిక, ఆర్థిక పరిస్థితి
     4) గృహంలో మాట్లాడే మాతృభాష, బయట మాట్లాడే ఇతర భాషల ప్రభావం
* శిశువుల్లో 'అంతరాత్మ' ఉండదు. కాబట్టి తప్పు/ ఒప్పు, మంచి/ చెడు లాంటి భావనలను తనకు జరిగిన పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకుంటారు.
* నాయకత్వ లక్షణాలు ప్రారంభమయ్యే దశ.
* ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది వాగుడుకాయ దశగా గుర్తింపు పొందింది.
క్రీడలు
సమాంతర క్రీడ (Parallel play): పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడటం కంటే వారి పక్కనే స్వతంత్రంగా ఆడుతూ ఉంటారు. ఇది పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం.
సంసర్గ క్రీడ (Associate play): ఇతర పిల్లలు ఆడే ఆట ఆడకపోయినా దాన్ని పోలిన ఆట ఆడుతారు.
ఉదా: వీడియో గేమ్స్.

సహకార క్రీడ (Co-Operative play): పిల్లలు సమూహంలో భాగమవుతూ... అందులోని ఇతర సభ్యులతో కలిసిమెలిసి ఆడుకుంటారు.
ఉదా: క్రికెట్, కబడ్డీ, చెస్.
4. ఉత్తర బాల్యదశ (Late Childhood): (5, 6 - 12 సంవత్సరాలు)
* ఈ దశను పాఠశాల వయసు అంటారు. పిల్లలు ముఠాలుగా ఏర్పడతారు కాబట్టి ఇది ముఠా వయసు.
* ఎత్తు కంటే బరువు, కండర పరిపృష్టి అధికంగా ఉంటాయి.
* భౌతిక వికాసానికి సంబంధించి అమ్మాయిలు లేదా అబ్బాయిల్లో లింగ సంబంధ భేదాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధారణంగా మగ పిల్లల కంటే ఆడపిల్లలు ఈ దశ నుంచి యవ్వనారంభ దశలోకి అడుగులు వేస్తారు.
* బరువు, కాలం, డబ్బులకు సంబంధించిన భావనలు అభివృద్ధి చెందుతాయి.
* బడాయిలు చెప్పడం, ఇతరులను వెక్కిరించడం, విమర్శించడం లాంటి లక్షణాలను ప్రదర్శిస్తారు.
* కౌశలాలు అభివృద్ధి చెందుతాయి.
స్వయంపోషక కేశలాలు: ఆహారం తినడం, స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, గుండీలు పెట్టుకోవడం.
సాంఘిక కౌశలాలు: తల్లిదండ్రులకు, సంఘంలోని వారికి, స్నేహితులకు తనకు తోచిన సహకారం అందించడం.
పాఠశాల కౌశలాలు: చదవడం, రాయడం, బొమ్మలు గీయడం, రంగులు వేయడం లాంటి కృత్యాలు చేస్తారు.
భాషా నైపుణ్యాలు: అర్థవంతమైన పదాలు ఉపయోగించి మాట్లాడటం.

* ఈ దశలో ఉద్వేగాలను నియంత్రించుకుంటారు.
ఉద్వేగ కేథార్సిస్: శిశువులు తమలోని ఉద్వేగాలను తమకు తాముగా నియంత్రించుకోవడం కోసం ఏవైనా కృత్యాల వైపు మొగ్గు చూపుతారు. ఇదే ఉద్వేగ కేథార్సిస్. ఇది పూర్వ బాల్యదశలో ఉండదు.
* పిల్లల్లో పదజాలం అభివృద్ధి చెందడం ద్వారా ఊహాత్మక కథలు చెప్పగలరు.
* పిల్లలో నైతికత అభివృద్ధి చెందుతుంది. చేసే పనుల్లో తప్పొప్పులను గుర్తిస్తారు. తప్పు అయితే భయడటం, ఒప్పు అయితే ప్రేరణ పొందడం చేస్తారు. ఈ దశలో కోల్‌బర్గ్ సంప్రదాయ స్థాయికి చెందిన లక్షణాలుంటాయి.
* పిల్లల్లో భాషా వికాసం వయసుతో పాటూ నియంత్రణలో ఉంటుంది. అవసరానికి తగినంత మాత్రమే మాట్లాడగలరు.
5. యవ్వనారంభ దశ: (10 లేదా 12 నుంచి 13, 14)
     ఈ దశను ఆంగ్లంలో 'Puberty' అంటారు. ఇది Pubertas అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. 'ప్యూబర్టీ' అంటే 'మగాడు కావడం' లేదా 'పరిణతి చెందడం' అని అర్థం. ఈ దశలో కేవలం భౌతిక వికాసం మాత్రమే అధిక అభివృద్ధిని చూపుతుంది. కాబట్టి ఇది సంకుచితమైన దశ. ఈ దశలోని అంతర దశలు
యవ్వనారంభ పూర్వదశ: ఇది అలైంగిక, అపరిపక్వ దశ. జీవిలో గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. కానీ పునరుత్పాదన వ్యవస్థ పూర్తిగా పరిపక్వత చెందదు.
మధ్య యవ్వనారంభ దశ: గౌణ లైంగిక లక్షణాలు పరిపక్వత దశలోకి వస్తాయి. అమ్మాయిల్లో అండోత్పత్తికి చిహ్నంగా రుతుస్రావం, మగ పిల్లల్లో శుక్రకణోత్పత్తికి చిహ్నంగా రాత్రివేళలో 'వీర్య స్కలనం' ప్రారంభమవుతాయి.

ఉత్తర యవ్వనారంభ దశ: జీవిలో గౌణ లైంగిక లక్షణాలన్నీ అభివృద్ధి చెందుతాయి. లైంగిక అవయవాలు పరిపక్వత చెంది పునరుత్పాదన సామర్థ్యాలను కలిగి ఉంటారు.
* అమ్మాయిల్లో గొంతు మృదువుగా మారడం, శరీరం లావణ్యంగా తయారుకావడం, నడకలో మార్పులు వస్తాయి.
* అబ్బాయిల్లో గొంతు గంభీరంగా మారడం, మీసాలు గడ్డాలు రావడం, శరీరంలో ఎముకలు గట్టిబడి కండరస్థితిగా మారడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి.
* ఈ దశను వ్యక్తి పూజ (Hero worship) దశగా పరిగణించవచ్చు.
6. కౌమార దశ: (13 - 14 నుంచి 18)
      కౌమారాన్ని ఆంగ్లంలో Adolescence అంటారు. ఇది Adolescere అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. Adolescere అంటే 'to grow into maturity' పరిపక్వత చెందడం అని అర్థం.
* అత్యంత కీలకమైన దశ ఇది. అందుకే దీన్ని Teenage అనీ, dating age అనీ అంటారు.
స్టాన్లీ హాల్: ఒత్తిడి, సంచలనం, కలత, జగడాలతో కూడుకున్నదే 'కౌమారం' అన్నాడు.
కోహ్లాన్: శారీరక, మానసిక, ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు అయ్యే దశ అని అన్నాడు.
* దీన్ని ఉద్వేగ అస్థిరతతో కూడుకుని నిలకడ లేని దశగా చెప్పవచ్చు.
* పగటి కలలు కనడం, భిన్న లైంగిక వ్యక్తుల పట్ల అధిక ఆకర్షితం కావడం ఈ దశలోని ముఖ్యమైన లక్షణాలు.

లక్షణాలు:
* ఈ దశ అన్ని దశల్లో కెల్లా ముఖ్యమైన దశ.
* ఈ దశను బాల్య, వయోజన దశల సంధానకర్తగా చెప్పవచ్చు. కాబట్టి ఇది సంక్రమణ దశ.
* శారీరక మార్పులు, మానసిక మార్పులు ఉద్ధృతంగా కనిపించే, మార్పు చెందే దశ.
* ఈ దశలోనివారు తాము పెద్దవారమనే భావనతో పెద్దల నుంచి సహాయం పొందడానికి ముందడుగు వేయకుండా అనేక సమస్యలతో ఇబ్బందులు పడే దశ.
* నిరంతరం సమాజంలో గుర్తింపు పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు.
* కౌమారులు అపరిపక్వ ఆలోచనల ద్వారా తక్షణ నిర్ణయాలతో, అనాలోచిత చ‌ర్యల వల్ల వీరితో పెద్దలు కూడా భయపడతారు.
* పెద్దలు కొన్ని విషయాల పట్ల వారికి ఆంక్షలు విధించడం వల్ల ఒత్తిడికి గురవుతారు.
* వయోజన దశలోని వ్యక్తి అలవాట్లను కౌమారులు ఇక్కడ అనుకరిస్తారు.
ఉదా: చెడు అలవాట్లయిన సిగరెట్లు కాల్చడం, మద్యపానం మొదలైనవి.
ఈ దశలో కలిగే వివిధ వికాసాలు
* మానసికంగా చాలా ఆలోచనలు చేయగలుగుతారు.
* ప్రజ్ఞా వికాసం పూర్తిగా అభివృద్ధి చెంది ఉండటం.

* వీరిలో కలిగే ఉద్వేగాలు సాధారణంగా అవివేకంగా, అనియంత్రితంగా ఉంటాయి.
* శరీర నిర్మాణంలో చోటు చేసుకున్న మార్పులను తోటి స్నేహితులతో పోల్చుకుని న్యూనతకు గురవుతారు.
* వ్యక్తిలోని సంజ్ఞానాత్మక జ్ఞానం వల్ల కార్యకారణ సంబంధాలను శాస్త్రీయ దృక్పథంతో పూర్తి చేస్తారు.
* ముందు దశల కంటే ఈ దశలో భాషా వికాసం ఎక్కువగా ఉంటుంది. అమూర్తంగా పదాలను ఉపయోగించడంతోపాటు ఈ దశ అంతానికి సుమారు 40,000 పదాలకు పైగా తెలుసుకుంటారు.

శిశు వికాస భావనను అర్థం చేసుకోవడం
సంజ్ఞానాత్మక వికాసం (Cognitive Development)

      స్విట్జర్లాండ్‌కు చెందిన జీన్ పియాజే అనే మనో విజ్ఞానవేత్త సంజ్ఞానాత్మక వికాసంపై అనేక పరిశోధనల్లో భాగంగా తన పిల్లలను అనేక కోణాల నుంచి పరిశీలించి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంను రూపొందించాడు. ఈయన రాసిన గ్రంథం The Growth of Logical Thinking.
సంజ్ఞానాత్మకత: వ్యక్తి మొదట తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పరిశీలనాత్మకంగా తెలుసుకోవడమే 'సంజ్ఞానం'. ఇందులో ఆలోచన, వివేచన, స్మృతి, ప్రత్యక్షం మొదలైన మానసిక చర్యలన్నీ అంతర్భాగంగా కూడుకుని ఉంటాయి. వీటి సహాయంతో వ్యక్తి తనలో కలిగే ప్రత్యక్ష అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని పియాజే వివరించారు.

స్కిమాట (స్థూల ప్రణాళిక): వ్యక్తి తనచుట్టూ ఉన్న పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి తనలో ఏర్పాటు చేసుకునే సంజ్ఞానాత్మక నిర్మాణాలను లేదా స్మృతి చిహ్నాలను స్కిమాట అంటారు. మనిషి పుట్టుకతోనే కొన్ని 'స్కిమాటా'లను కలిగి ఉంటాడు.
ఉదా: * పుట్టిన వెంటనే శిశువు తల్లి వద్ద చనుపాలను తాగడం.
       * శిశువుకు అందిన వస్తువులన్నీ నోట్లో ఉంచుకుని తృప్తి పొందడం.
       * చిన్నతనంలో శిశువులు ఆనందంలో కాళ్లు చేతులు ఆడించడం.
స్కిమాటా లనేవి చిన్న పిల్లల్లోనే కాకుండా పెద్దవారిలో కూడా ఏర్పడుతూ ఉంటాయి.
ఆపరేషన్స్: శిశువు శారీరక వయసుతోపాటు పరిపక్వత చెందే కొద్దీ బాహ్య ప్రవర్తనలుగా కనిపించే సరళమైన కృత్యాలు క్రమంగా మానసిక ప్రవర్తనలుగా మార్పు చెందడాన్నే పియాజే ఆపరేషన్స్ అన్నాడు. ఇవి వయసుతో పాటు స్కిమాటాలో మార్పులు రావడానికి అతడిలోని స్వతహాగా లేదా జన్మతః లభించిన మార్పులు రెండు రకాలు.
     1. వ్యవస్థీకరణం (Organisation)
     2. అనుకూలత (Adaptation)
1. వ్యవస్థీకరణ:
      భౌతిక లేదా మనో వైజ్ఞానిక నిర్మాణాలను ఇంకా ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత. అంటే శిశువుగా ఉన్నప్పుడు ఏ విషయమైనా సాధారణంగా పరిగణించి వయసుతో పాటు క్రమంగా నిర్దిష్టమైన కృత్యంగా పరిగణించగలగడం.

2. అనుకూలత: దీన్ని రెండు ఉపభాగాల ద్వారా విభజించి పరిశీలించవచ్చు.
A. సాంశీకరణం (Assimilation):
    శిశువు కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న లేదా గతంలోని అనుభవంతో పోల్చి ఆ అనుభవాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటాడు. ఈ పరిస్థితుల్లో తనకు అనుకూలంగా మార్చుకున్న అనుభవం సరైందా కాదా అని ఆలోచించే జ్ఞానం ఉండదు, దాన్ని పట్టించుకోడు.
ఉదా: * ఇంట్లోని కోడిని చూసిన బాలుడు కొలనులోని బాతును చూసి దాన్ని కోడితో పోల్చుకుని దాన్ని 'కోడి' అని పలకడం.
* బాలుడు మొదట 'A' అనే అక్షరాన్ని మాత్రమే నేర్చుకుని ప్రస్తుతం నూతనంగా 'V' అనే అక్షరాన్ని చూసి 'V' ని కూడా 'A' అని పలకడం.
B. అనుగుణ్యత (Accommodation):
    పరిసరాలకు అనుకూలంగా తనకు తానుగా సర్దుబాటు చేసుకోవడం.
ఉదా: గతంలో కోడిని చూసిన బాలుడు ప్రస్తుతం కొలనులోని బాతును చూసి పరిశీలించి తేడాలను గుర్తించి ఇది 'బాతు' అని సర్దుబాటు కావడం. ఈ విషయంలో నూతన జ్ఞానాన్ని పొందుతాడు.
    సంజ్ఞానాత్మక వికాసం చిన్న ప్లిలల నుంచి పెద్దవారి వరకు అందరిలోనూ వయసును అనుసరించి జరుగుతుంది. ఈ వికాసం జరిగే క్రమాన్ని బట్టి 'జీన్ పియాజే' 4 వికాస దశలను గుర్తించారు. అవి.

2. అనుకూలత: దీన్ని రెండు ఉపభాగాల ద్వారా విభజించి పరిశీలించవచ్చు.
A. సాంశీకరణం (Assimilation):
    శిశువు కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న లేదా గతంలోని అనుభవంతో పోల్చి ఆ అనుభవాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటాడు. ఈ పరిస్థితుల్లో తనకు అనుకూలంగా మార్చుకున్న అనుభవం సరైందా కాదా అని ఆలోచించే జ్ఞానం ఉండదు, దాన్ని పట్టించుకోడు.
ఉదా: * ఇంట్లోని కోడిని చూసిన బాలుడు కొలనులోని బాతును చూసి దాన్ని కోడితో పోల్చుకుని దాన్ని 'కోడి' అని పలకడం.
* బాలుడు మొదట 'A' అనే అక్షరాన్ని మాత్రమే నేర్చుకుని ప్రస్తుతం నూతనంగా 'V' అనే అక్షరాన్ని చూసి 'V' ని కూడా 'A' అని పలకడం.
B. అనుగుణ్యత (Accommodation):
    పరిసరాలకు అనుకూలంగా తనకు తానుగా సర్దుబాటు చేసుకోవడం.
ఉదా: గతంలో కోడిని చూసిన బాలుడు ప్రస్తుతం కొలనులోని బాతును చూసి పరిశీలించి తేడాలను గుర్తించి ఇది 'బాతు' అని సర్దుబాటు కావడం. ఈ విషయంలో నూతన జ్ఞానాన్ని పొందుతాడు.
    సంజ్ఞానాత్మక వికాసం చిన్న ప్లిలల నుంచి పెద్దవారి వరకు అందరిలోనూ వయసును అనుసరించి జరుగుతుంది. ఈ వికాసం జరిగే క్రమాన్ని బట్టి 'జీన్ పియాజే' 4 వికాస దశలను గుర్తించారు. అవి.

వస్తు స్థిరత్వ భావన: తన ఎదుట లేని, తనకు తెలిసిన వస్తువు ఎక్కడో ఉంటుందనే భావన. స్మృతి ద్వారా దాన్ని వెదుకుతాడు.
ఉదా: * ఈ వయసులో కనిపించని తల్లిని తదేకంగా వెదుకుతాడు.
* ఆడుకున్న తర్వాత బొమ్మలను దాచుకోవడం.
* 12 నుంచి 18 నెలల మధ్య వస్తువుల లక్షణాలను తెలుసుకోవడానికి తన చేతికి అందిన ఆట వస్తువులను కిందకు విసిరి ఆనందాన్ని పొందుతాడు. ఈ పరిస్థితిలో శిశువు యత్న దోష పద్ధతులను ఉపయోగించి శబ్దాన్ని గ్రహిస్తాడు.
* 18 నెలల నుంచి 24 నెలల మధ్య శిశువు కొంతవరకు తనలోని స్మృతిని ఉపయోగించుకుని యత్న దోష పద్ధతులను వదిలి అంతర్ దృష్టిని ఉపయోగిస్తాడు.
ఉదా: * తనకు అందని ఆట వస్తువును కర్ర సహకారంతో అందుకోగలడు.
* ఎత్తయిన ప్రదేశంలోని వస్తువులను అందుకోవడానికి కర్ర సహాయం లేదా వస్తువులను ఉపయోగించగలిగే సామర్థ్యం.
2. పూర్వ ప్రచాలక దశ (2 - 7 సంవత్సరాలు): ఈ దశను పరిశీలిస్తే శిశువు సంజ్ఞానాత్మకంలో కొన్ని ప్రధానమైన లోపాలను కలిగి ఉంటాడు. ఆ లోపాలను 2 అంతర దశలుగా పరిశీలించవచ్చు.
A. పూర్వ భావనాత్మక దశ (2 - 4 సంవత్సరాలు):
    పిల్లల్లో ఈ దశలో మాట్లాడే సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఎదురయ్యే సమస్యలను తనకు తాను పరిష్కరించుకోగలడు. కానీ కొన్ని లోపాలను అధిగమించలేకపోతాడు.

1. సర్వాత్మవాదం: శిశువు కదిలే వస్తువులకు ప్రాణం ఉందనీ, కదలని వస్తువులకు కూడా ప్రాణం ఉందని భావిస్తాడు. దీన్నే సర్వాత్మవాదం (ఎనిమిజం) అంటారు.
ఉదా: బొమ్మలకు స్నానం చేయించడం, పాలు తాగించడం, బట్టలు వేయడం. సైకిల్ కదులుతుంది కాబట్టి దానికి ప్రాణం ఉందని భావించడం.
2. అహంకేంద్రవాదం: శిశువు ప్రతి విషయాన్ని తన దృష్టితోనే చూడటం. అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచం తన చుట్టూ కేంద్రీకరించబడిందని భావించడం.
ఉదా: * ప్రతి రోజూ సూర్యుడు తన కోసమే ఉదయిస్తున్నాడు అని అనుకోవడం.
* ఏ ఊరికి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా చంద్రుడు తన కోసమే వస్తున్నాడు అని విద్యార్థి భావించడం.
3. తోటి విద్యార్థులతో కలిసి ఆటాడుకోవడంలో నమ్మకం లేదా అపనమ్మకాన్ని ప్రదర్శిస్తాడు. దీన్నే మేక్ బిలీవ్ ప్లే అంటారు.
B. అంతర్ బౌద్ధిక దశ: (4 - 7 సంవత్సరాలు)
     ఈమధ్య కాలంలో వస్తువులను వర్గీకరించడం, పోల్చడం లాంటి మెరుగైన మానసిక చర్యలు చేపట్టగలరు. అయితే సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్ని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. దీంతోపాటు కింది లోపాలు ఉంటాయి.

(i) పదిలపరచుకునే భావనా లోపం (Conservation):
   ఒక వస్తువు ఆకారాన్ని లేదా రూపాన్ని మార్చినప్పటికీ దాని గుణం మారదు. దీన్నే కన్సర్వేషన్ అని అంటారు. ఈ భావనను ఈ దశలో అర్థం చేసుకోలేడు.
ఉదా: * రెండు సమాన పరిమాణం ఉన్న బంకమట్టి ముద్దల్లో ఒక దాన్ని సాగదీసి చూపిస్తే... ఏదో ఒకటి మాత్రమే పెద్దదని భావించడం.

* ఒకే సంఖ్యలోని 2 గోళీల గుంపును మార్చి చూపిస్తే తేడా ఉందని చెప్పడం.

(ii) అవిపర్యాత్మక భావనా లోపం (Irreversibility): ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన శిశువులో లోపించి ఉంటుంది.
ఉదా: ఒకే పరిమాణం, ఆకారం ఉన్న రెండు మట్టి గోళీలను తీసుకుని ఒకదాని ఆకారాన్ని మార్చినప్పటికీ మళ్లీ దాన్ని తిరిగి మొదటి ఆకారానికి తీసుకుని రాగలమని గుర్తించలేకపోవడం.

* 'ఏకమితి' అంటే శిశువు కేవలం ఒకే దిశగా ఆలోచించడం.
ఉదా: 5 సంవత్సరాల బాలుడు తనకు ముగ్గురు తమ్ములున్నారని తెలపగలడు.
         కానీ తమ్ముళ్లకు అన్న ఉన్నాడా అని అడిగితే లేదు అని చెప్పడం.
* 2 × 3 = 6 అని చెబుతాడు దీన్నే తిప్పి 3 × 2 = 6 అని గుర్తించలేడు.
3. మూర్త ప్రచాలక దశ (7 - 11 సంవత్సరాలు)
     ఈ దశలోని శిశువుల్లో పదిలపరచుకునే భావన, వర్గీకరణ శక్తి, విశ్లేషణా శక్తి బాగా అభివృద్ధి చెందుతాయి. తర్కంతో కూడిన ఆలోచనలు చేయగలరు. వాస్తవికతలను గురించి మాట్లాడి పూర్వ ప్రచాలక దశలోని లోపాలన్నీ అధిగమిస్తారు. విపర్యాత్మక భావన పెరుగుతుంది. నిగమనాత్మకంగా ఆలోచనలు చేసి సమస్యను పరిష్కరిస్తారు. కాకపోతే ఏ విషయాన్నైనా మూర్తంగా మాత్రమే ఆలోచన చేయగలరు. కానీ అమూర్తంగా ఆలోచన చేయలేరు.
ఉదా: మూడు వేర్వేరు ఎత్తుల్లోని స్తంభాలను చూపి ఏది ఎత్తయింది? ఏది ఎత్తు తక్కువ అంటే చెప్పగలడు. కానీ వీటిని చూపకుండా ఎత్తులను మౌఖికంగా అడిగితే చెప్పలేడు.
ఉదా: బరువు, కాలం, డబ్బు.
* ఈ ద‌శ‌లో వివిధ ర‌కాల భావ‌న‌లు ఏర్పడ‌తాయి.
4. అమూర్త ప్రచాలక దశ: (11, 12 - 16 సంవత్సరాలు) (SA - 11 సంవత్సరాలు, SGT = 12 సంవత్సరాలు)
* కౌమార దశలోని బాలలు అవాస్తవమైన కాల్పనిక భావనలకు, సమస్యలకు సరైన పరిష్కారాలను సూచించగలరు.

పరిష్కారంలో వివిధ రకాల కోణాలను పరీక్షించగలరు.
* మూఢ నమ్మకాలకు అధిక ప్రాధాన్యాన్ని తగ్గించి కార్యకారణ సంబంధాన్ని ఏర్పరచి శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించుకుంటారు.
* ప్రకల్పనా నిగమనాత్మక ఆలోచనలతో సాధారణీకరణాలను చేస్తారు.

నైతిక వికాసం (Moral Development)

      అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ కోల్‌బర్గ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లల నుంచి పెద్దల వరకు గల నైతికతపై అనేక పరిశోధనలు చేసి నైతిక వికాస సిద్ధాంతంను రూపొందించారు. ఈయన ప్రతిపాదించిన నైతికతలోని లక్షణాలు
* నైతిక వికాసం అనేది ఒక రకంగా క్లిష్టమైన భావన. ఇది చిన్న పిల్లల్లో ఉండదు. వయసుతోపాటు అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
* నైతికత అనేది పిల్లల్లో మందకొడిగా ఉంటుంది.
* వ్యక్తిలో ప్రారంభమైన నైతిక వికాసం పురోగమనాన్ని చూపుతుంది. కానీ తిరోగమనాన్ని చూపదు.
* వ్యక్తి ఆలోచన, వివేచన, స్మృతి లాంటి అంశాల ద్వారా నైతిక వికాసం సాధిస్తాడు.

* ఎక్కువ మంది నైతిక వికాస దశలోని సంప్రదాయ స్థాయి వరకు వచ్చి ఆగిపోతారని కోల్‌బర్గ్ వివరించారు.
* నైతిక వికాస దశలో చివరి స్థాయి అయిన ఉత్తర సంప్రదాయ స్థాయిని సిగ్మండ్ ఫ్రాయిడ్ సూపర్ ఇగో దశతో పోల్చవచ్చు. ఇది కేవలం శిక్షణతో మాత్రమే సాధ్యమని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు.
* నైతిక వికాసం సంజ్ఞానాత్మకతపై ఆధారపడి అభివృద్ధి చెందే ప్రక్రియ. ఈ దశలో ఏ వ్యక్తి అయినా ఏ వయసులో ఏ దశకు చేరుకుంటాడో కచ్చితంగా చెప్పలేం.
    పై విషయాల ఆధారంగా కోల్‌బర్గ్ వ్యక్తిలో కలిగే నైతిక వికాసాన్ని 3 స్థాయులు, అందులో 6 దశలుగా గుర్తించాడు.
I. పూర్వ సంప్రదాయ స్థాయి (Pre - Conventional Stage):
     ఈ దశలోని పిల్లలు తమకు కలిగే విషయాల్లోని పరిమాణం లేదా పరిణామాన్ని బట్టి తెలుసుకుంటారు. వీరి దృష్టిలో మంచి అంటే ఆనందాన్నిచ్చేది. చెడు అంటే బాధను కలిగించేది. ఒప్పు అంటే బహుమానం పొందడం. తమకు శిక్ష, బాధ కలిగింగచేవన్నీ అంశాలుగా గుర్తిస్తారు.
ఉదా: Home work ఇచ్చే ఉపాధ్యాయుడిని మంచివాడు కాదని, అసలు Home work ఇవ్వని ఉపాధ్యాయుడిని మంచివాడని అనుకోవడం.
ఎ) మొదటి దశ: విధేయత, శిక్ష:
      తల్లిదండ్రులు లేదా పెద్దలు తమకు కలిగించే శారీక శిక్షణ పరంగా వారికి విధేయతను ప్రదర్శిస్తారు.
ఉదా: (1) ఉపాధ్యాయుడు మందలిస్తారనే నెపంతో Home work చేయడం.

రెండో దశ: సహజ సంతోష అనుసరణ సాధనోపయోగదశ:
     ఈ దశలో పిల్లవాడు తనకు ఆనందం కలిగించే పనులు, సహజ సంతోషాన్ని కలిగించే పనులకు అనుకూలంగా ఉండి అవే మంచిగా గుర్తిస్తాడు. (1) ప్రసాదం కోసమే క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం
ఉదా: ఉపాధ్యాయుడు పొగడ్త లేదా బహుమతినిస్తాడనే నియమంతో విద్యార్థి Home work చేయడం.
II. సంప్రదాయ స్థాయి (Conventinal Stage)
    ఈ దశలోని పిల్లలు నైతికతను కొన్ని నియమాల ద్వారా, ఇతరుల ప్రవర్తన ద్వారా ఇతరులకు చేసే సహాయం ద్వారా పొందుతారు.


మూడో దశ: మంచి బాలుడి నీతి:
    ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను సంతోషపెట్టడం లాంటి అంశాల ద్వారా, ఇతరుల ప్రతిస్పందన ద్వారా నైతికతను పొందుతారు.
ఉదా: తల్లిదండ్రులు సంతోషిస్తారనే భావనతో బాలుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం.
* వరద బాధితులకు తమ వంతు బాధ్యతగా విద్యార్థి సహకారాన్ని అందించడం.
నాలుగో దశ: అధికారం సాంఘిక క్రమాన్ని అనుసరించే నీతి:
    ఎవరి అధికారాన్ని వారు సక్రమంగా నిర్వహించడం, సంఘంలో సాంఘిక క్రమం ప్రకారం పెద్దలను గౌరవించడం, పిల్లలను ఆదరించడం.
కోల్‌బర్గ్ ప్రకారం అధిక శాతం మంది ఈ దశలో ఆగిపోతారు.

ఉదా: * విద్యార్థి బడి నియమాల ఆధారంగా సక్రమంగా రోజూ పాఠశాలకు రావడం తన విధి, బాధ్యత అని తెలుసుకోవడం.
* బస్సులో ప్రయాణించే వ్యక్తి తన బాధ్యతను గుర్తించి టికెట్టు కొనడం.
III. ఉత్తర సంప్రదాయ స్థాయి:
     ఈ దశలో వ్యక్తి చేసే కార్యక్రమాలన్నీ తన వ్యక్తిగత నియమాలు, అంతరాత్మ, తృప్తి, ఇష్టాలపై ఆధారపడి అత్యున్నత ఆలోచనలు, సామాజిక కట్టుబాట్లను ఏర్పరచుకుంటాడు.
అయిదో దశ: ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించిన చట్ట నీతి.
   వ్యక్తి సమాజంలోని గౌరవం ద్వారా పొందే ఒప్పందాలు, ఇతరుల హక్కులకు దోహదపడే నియమాలు, అందరికీ ఉపయోగపడే అంశాల వైపు మొగ్గు చూపుతాడు.
ఉదా: * రాజ్యాంగ సవరణ ద్వారా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం.
         * ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాజ్యాంగ సవరణ చేయడం.
ఆరో దశ: వ్యక్తిగత సూత్రాలు - అంతరాత్మ దశ:
     వ్యక్తి చేసే ప్రతి కార్యక్రమమైనా ఇతరులకు సంబంధం లేకుండా కేవలం వ్యక్తిగతమైన సాంఘిక ప్రమాణాలు, తనలో భాగమైన ఆదర్శాలకు అనుగుణంగా అంతరాత్మ ప్రబోధంతో ప్రవర్తిస్తాడు.
ఉదా: * వ్యక్తి తన అంతరాత్మ సంతృప్తితో ఇతరులకు సహాయం చేయడం.
* చికిత్సకు వీలు కాని జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని బాధ నుంచి విముక్తి చేయడానికి 'మెర్సీ కిల్లింగ్' చేయడం తప్పు కాదు అని భావించే వ్యక్తి ఈ దశకు చెందుతాడు.

సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం (నోమ్ ఛోమ్‌స్కీ)

    అమెరికాలోని 'పెన్సిల్వేనియా' విశ్వవిద్యాలయానికి చెందిన 'నోమ్ ఛోమ్ స్కీ' ఆధునిక భాషా బోధనలపై అనేక పరిశోధనలు చేసి సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంను ప్రతిపాదించాడు. భాషపై ఈయన రాసిన గ్రంథాలు
    1) Syntactic Structures
    2) Language and Thought Language and the Mind
    3) The Logical Structure of Linguistic Theory
    4) Aspects of theory of syntax
* నోమ్ ఛోమ్‌స్కీ శిశువుల భాషా సామర్థ్యాన్ని, వికాస క్రమాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఆయన పరిశోధనలో రెండు సందేహాలను మొదట వెలిబుచ్చారు.
    1) శిశువు భాష నేర్చుకునే సామర్థ్యంతో జన్మిస్తాడా?
    2) శిశువు పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా?
    మరికొన్ని ప్రయోగాలు చేసి 'శిశువు భాష నేర్చుకునే సామర్థ్యంతోనే జన్మిస్తాడు' అని నిరూపించాడు.
* చిన్నపిల్లల 'మెదడు' ను ఈయన భాష నేర్చుకునే యంత్రాలతో పోల్చాడు. దీంతోపాటు భాష నేర్చుకోవడం అనే ప్రక్రియ పుట్టుక నుంచి యవ్వనం వరకు సంక్రమిస్తుందని అభిప్రాయపడ్డాడు.

* భాషా వికాస ప్రక్రియలో మనో వైజ్ఞానిక శాస్త్ర సిద్ధాంతాల ప్రభావం శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం ద్వారా ఏర్పడి, రెండు మూల సూత్రాల ద్వారా భాష జరుగుతుందని అవి
     1) సంసర్గం     2) అనుకరణగా పేర్కొన్నాడు.
    జాన్ లాక్ లాంటి సంప్రదాయ తత్వవేత్తలు పుట్టుకతో మనసు లేదా మెదడు ఏమీ రాయనటువంటి శూన్య పలకగా ఉంటుందని ప్రతిపాదించారు. ఇదే టాబ్యులారసా. జ్ఞానేంద్రియాల దారా గ్రహించిన అంశాల వల్లే మానసిక సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు. పియాజే లాంటి సంజ్ఞానావేత్తలు కూడా శిశువుకు పుట్టుకతోనే సంజ్ఞానాత్మక సామర్థ్యాలు ఉంటాయని వికాసం వల్లే అవి అభివృద్ధి చెందుతాయని ప్రతిపాదించారు. వైగోట్‌స్కీ లాంటి శాస్త్రవేత్తలు వ్యక్తి వికాసంలో సంస్కృతి ప్రధాన పాత్ర వహిస్తుందని వివరించారు.
     సంప్రదాయ భావన ప్రకారం భాషను నేర్చుకుంటాం. అంటే భాషార్జన భాషా ప్రపంచ ప్రభావంతో జరుగుతుంది. ఛోమ్‌స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది. నేర్పడం వల్ల కాకుండా జన్యుపరమైన అంశాలు వ్యక్తిలో పరిణితి చెందడం వల్ల భాషార్జన జరుగుతుంది. అంటే పరిపక్వత లేదా పరిణతి మాత్రమే భాషా వికాసానికి కారణం. వీటిని అన్నింటిపై పరిశీలించి నోమ్ ఛోమ్‌స్కీ వాక్యనిర్మాణ భావన తెలిపాడు. దీన్నే "Government Grading Method" అంటారు.
భాషా ప్రక్రియ: భాష 3 దశల్లో అభివృద్ధిని రూపొందించుకుంటుందని ఛోమ్‌స్కీ వివరించాడు.

మొదటి దశ: ఈ దశ 18 నెలల వయసులో ప్రారంభమవుతుంది. శిశువు మొదట పదాలను అర్థరహితంగా, పొదుపు మాటలతో వ్యక్తపరుస్తాడు. ఇవే ముద్దు పలుకులు. ఇందులో సమాచారమైతే ఉంటుంది కానీ వాక్య నిర్మాణం ఉండదు.
ఉదా: అన్నం తిన్నావా - ఆ!
         ఏమి కావాలి - బువ్వ/ తువ్వ!
         ఏమి కావాలి - అది; దెబ్బలు తింటావా - ఊహు!
రెండో దశ - (22 నెలలు నుంచి 32 నెలలు): చిన్న చిన్న పదాలతో మాటలను నామవాచకాలు, సర్వనామాలతో పలుకుతారు. ఈ పదాలు అర్థవంతంగా కూడా ఉంటాయి. ఇందులో సంయుక్త వాక్యాలు, క్రియాపదాల ఉపయోగం తెలియదు.
ఉదా: అమ్మ ఇచ్చింది. చాక్లెట్ కావాలి.
మూడో దశ: పదాలు క్రమంగా వాక్యాలుగా రూపాంతరం చెందుతాయి. వాక్యాల్లో సగటున 3 నుంచి 5 పదాలను ఉపయోగిస్తారు. ఇందులో క్రియాపదాలతో కూడిన మాటలు ఉంటాయి. కానీ భాష మాత్రం పరిమితంగా ఉంటుంది.

వ్యక్తి వికాస సిద్ధాంతం - కార్ల్ రోజర్స్

      అమెరికాకు చెందిన 'కార్ల్ రోజర్స్' మానవతావాద ప్రవక్తల్లో అతిముఖ్యమైనవాడు. 1940లో ఈయన వ్యక్తి వికాస సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఈయన రాసిన గ్రంథాలు
      1) On Becoming a person
      2) A way of Being

కార్ల్ రోజర్స్ - ఆత్మభావన:
      ఒక వ్యక్తికి తన సొంత స్వభావాన్ని, ఉన్నతమైన లక్షణాన్ని, ప్రత్యేకమైన ప్రవర్తన గురించి ఉండే నమ్మకాల సమూహాన్నే ఆత్మభావన అంటారు. ఇది బాలుడికి పూర్వ బాల్యదశలో ఏర్పడుతుంది. వ్యక్తి ఆత్మభావనను వెలిబుచ్చడంలో తనలోని గొప్ప విషయాలను అదే విధంగా నేను గొప్పవాడిని, తెలివైనవాడిని, గొప్ప మేధావిగా బహిర్గతం కాబడుతూ ఉంటుంది. ఆ ఆత్మభావన ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది.
1. వాస్తవిక ఆత్మభావన (Actual Self):
    ప్రస్తుతం వ్యక్తి వాస్తవంగా ఎలా ఉన్నాడు, ఎలాంటి భావనలు కలిగి ఉన్నాడనే అంశాన్ని తెలియజేస్తుంది.
2. ఆదర్శాత్మక ఆత్మభావన (Ideal Self): వ్యక్తి తనకు తానుగా సమాజపరంగా ఎలా ఉండాలనుకుంటాడో తెలియజేస్తుంది.
మాపనం: ఆదర్శాత్మక ఆత్మభావనను, వాస్తవిక ఆత్మభావనలను కొలవడానికి సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్‌ను ఉపయోగిస్తారు. ఈ మానంలో పైన తెలిపిన రెండు ఆత్మభావనల స్కోరుల మధ్య తేడా తక్కువగా ఉంటే ఆ వ్యక్తిని నిజాయతీపరుడిగానూ, బహిర్వర్తునిడిగా గుర్తిస్తారు. వాటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే మూర్తిమత్వ సమస్యలతో బాధపడేవారిగా లేదా అంతర్వర్తునులుగా గుర్తించాలి.
ఆ ఆత్మభావనను మరో రెండు విధాలుగా పరిశీలిస్తే
1. శారీరాత్మక ఆత్మభావన: వ్యక్తికి ఇది మొదటగా ఏర్పడుతుంది. వ్యక్తి శరీరానికి సంబంధించి లావు, ఎత్తు, బరువు, లింగం లాంటి భావనలు ఏర్పడతాయి.

2. మానసిక ఆత్మభావన: ఇది శారీరక ఆత్మభావన తర్వాత ఏర్పడుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసం, స్వతంత్రం, దౌర్జన్యం, పిరికితనం మొదలైనవి ఇందులోకి వస్తాయి.

వికాస కృత్యాలు (Developmental tasks and Hazards)

    వికాస కృత్యాలు అనే పదాన్ని హవిగ్ హర్ట్స్ ఉపయోగించారు.
    ఒక నిర్ణీత వికాస దశలో బాలుడు సాధించాల్సిన కనీస సామర్థ్యాలను వికాస కృత్యాలు అంటారు. ఇందులో రెండు భావనలు ఉన్నాయి.
1. వికాస అభివృద్ధి: బాలుడు ఒక నిర్ణీత దశలో సాధించాల్సిన సామర్థ్యాలను సక్రమంగా అధిగమించడం.
ఉదా: శైశవదశలో భౌతిక వికాసం జరగాలి. జ్ఞానేంద్రియ వికాసం జరగాలి. పూర్వ బాల్యదశలో మానసిక వికాసం బాగా అభివృద్ధి జరగాలి.
2. వికాస ఆటంకం: బాలుడు ఒక నిర్ణీత దశలో సాధించాల్సిన సామర్థ్యాలను సాధించలేకపోవడమే 'వికాస ఆటంకం' అవుతుంది.
ఉదా: శైశవదశలో భౌతిక వికాసం జరగకపోవడం. పూర్వ బాల్యదశలో అన్వేషణ కలగక, మానసిక వికాసం జరగకపోవడం.

పెరుగుదల - వికాసం

   టీఎస్ టెట్ రాసే అభ్యర్థులందరూ క్లిష్టతరంగా భావించే విభాగం 'శిశు వికాసం'. దీనికి ప్రధాన కారణం మిగతా సబ్జెక్టులన్నీ ఏదో ఒక తరగతిలో చదివుంటారు. శిశు వికాసం అంశాన్ని మాత్రం సాధారణంగా బీఎడ్ లేదా డీఎడ్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టెట్ పరీక్షలో ఈ విభాగానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.
    మారుతున్న విద్యావిధానంలో ఉపాధ్యాయులకు శిశు అభివృద్ధి, వారి వికాసానికి సంబంధించిన అవగాహన చాలా అవసరం. గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఈ విభాగంలోని ప్రశ్నలు జ్ఞానాత్మక రంగాన్ని పరిశీలించే విధంగా ఉండేవి. ప్రస్తుతం అధిక శాతం ప్రశ్నలు అవగాహన, వినియోగ రంగానికి సంబంధించి ఉంటున్నాయి.
      తాజా టెట్ కమ్ టీఆర్‌టీ (డీఎస్సీ)లో ఈ విభాగంలో 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. అధికశాతం అనుప్రయుక్త ప్రశ్నలు పెరుగుదల - వికాసం, వైయక్తిక భేదాలు - ప్రజ్ఞ, అభ్యసనం, మూర్తిమత్వం, అధ్యయన పద్ధతులు అంశాల నుంచి వస్తాయి. అందువల్ల అభ్యర్థులందరూ విశ్లేషణాత్మక ధోరణిలో పరీక్షకు సిద్ధమవ్వాలి. మిగిలిన మార్గదర్శకత్వం - మంత్రణం, నాయకుడు - రకాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల విద్య, విద్యాహక్కు చట్టం - 2009, జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం - 2005 వంటి అంశాలను అర్థం చేసుకుంటూ చదవాలి.

పెరుగుదల: తల్లి గర్భంలో ఏకకణ జీవిగా ప్రారంభమైన మనిషి శరీరంలో జరిగే పరిమాణాత్మకమైన మార్పులను 'పెరుగుదల' అంటారు. ఈ పెరుగుదల బాహ్య పెరుగుదలగా (ఎత్తు, బరువు, లావు), అంతర పెరుగుదలగా (మెదడు, నాడీమండల అభివృద్ధి) జరుగుతుంది.
లక్షణాలు:
* పెరుగుదల అనేది జీవిలో కనిపించే భౌతికమైన మార్పు.
* ఇది దాదాపు కౌమారదశ వరకు జరుగుతుంది.
* పెరుగుదల వల్ల కలిగే మార్పులను కచ్చితంగా కొలవొచ్చు.
* పెరుగుదల వికాసంలో ఒక భాగం. అందుకే దీన్ని సంకుచితమైన భావనగా పేర్కొనవచ్చు.
* పెరుగుదల ఉన్నంతమాత్రాన అన్ని రకాల వికాసాలు జరగకపోవచ్చు.
ఉదా: పెరుగుదల ఉన్న వ్యక్తిలో ప్రజ్ఞా వికాసం స్వల్పంగా ఉంటే 'బుద్ధిమాంద్యం' ఏర్పడుతుంది.
వికాసం: మనిషిలో కలిగే గుణాత్మక మార్పులనే 'వికాసం' అంటారు. ఇందులో భౌతిక వికాసం, మానసిక వికాసం, భాషా వికాసం, చలనాత్మక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం; ఉద్వేగ, నైతిక వికాసాలు కలిసి ఉంటాయి.
లక్షణాలు:
* వికాసం జీవిలో కలిగే గుణాత్మకమైన మార్పు.

* వికాసం జీవి ప్రారంభం నుంచి మరణం వరకు నిరంతరం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది.
* వికాసం వల్ల కలిగే మార్పులను కచ్చితంగా కొలవలేం.
* వికాసంలో పెరుగుదల ఒక భాగం. అందుకే దీన్ని విస్తృతమైన భావనగా పేర్కొనవచ్చు.
* పెరుగుదల సరిగా లేకపోయినా, వికాసం సక్రమంగా జరగొచ్చు.
ఉదా: మరుగుజ్జులు శారీరకంగా పెరగకపోయినా వారి సంజ్ఞానాత్మక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసాలు సక్రమంగా జరగొచ్చు.
పరిపక్వత / పరిణతి (Maturity):
     జీవి పుట్టుకతో సహజసిద్ధంగా వచ్చిన సామర్థ్యాలు, లక్షణాలు వయసుతోపాటు పెరుగుతూ సక్రమంగా వికసించడమే పరిపక్వత. ఇది జన్యు ప్రభావంతో కూడిన జైవిక ప్రక్రియ.
ఉదా: 5 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేం. కానీ వయసు పెరిగేకొద్దీ తనకు తానుగా ఎవరి సహాయం లేకుండా నడవడం అనేది పరిపక్వతను సూచిస్తుంది.
* శిశు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం అనేవి పరస్పర ఆధారితాలు.
     కాబట్టి వికాసం = పరిపక్వత × అభ్యసనం

వికాస సూత్రాలు

      శాస్త్రవేత్తలు వికాసం ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి జంతువులు, మానవులపై వివిధ ప్రయోగాలు నిర్వహించి, వాటి ఆధారంగా కింది వికాస సూత్రాలను రూపొందించారు.
వికాసం క్రమానుగతంగా, కచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది: ఏ జీవిలోనైనా వికాసం ఒక కచ్చితమైన క్రమాన్ని అనుసరిస్తుంది.
ఉదా: శిశువు చలనాత్మక వికాసంలో మొదట పాకటం, కూర్చోవడం, ఆధారంతో నిల్చోవడం, తర్వాత నడవడం, పరుగులు తీయడం అనేది క్రమానుగతం.
వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది: వ్యక్తిలో వికాసం అనేది ఫలదీకరణ దశ నుంచి మరణించేంతవరకు నిరంతరం విరామం లేకుండా కొనసాగుతుంది.
వికాసం సంచితమైన భావన: శిశువు ఎదుగుదలలోని మార్పులు కొన్ని బయటకు హటాత్తుగా కనిపించినప్పటికీ అంతర్గతంగా అనేక అంశాలు మార్పు చెందిన తర్వాతే ఈ మార్పు బహిర్గతం అవుతుంది.
ఉదా: శిశువు లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాలు రావడం మొదలైనవి.
వికాసం ఒక పరస్పర చర్య: వ్యక్తికి జన్మతహా సంక్రమించిన లక్షణాలు, పరిసరాలతో జరిగే పరస్పర చర్య వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరుగుతుంది.
ఉదా: శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి తబలా వాయించే నైపుణ్యకారకం లభించినట్లయితే ఈ గుణానికి మంచి పరిసర శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మంచి వాయిద్యకారుడుగా తయారుకావచ్చు.
పెరుగుదల - వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు: ప్రతి జీవిలోనూ వికాస ప్రక్రియ అన్ని అంశాల్లో, దశల్లో ఒకే విధంగా జరగదు. ఉదాహరణకు..
* శైశవదశలో శారీరక వికాసం ఎక్కువగా ఉండి, బాల్యదశలో సాధారణంగా ఉండటం.
* శైశవదశలో మానసిక వికాసం స్వల్పంగా, బాల్యదశలో వేగంగా జరగడం.

వికాసం వైయక్తిక భేదాలను చూపిస్తుంది: ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ వికాసం ఒకే విధంగా జరగదు. అంటే వ్యక్తులందరిలో వికాసం ఒకే వేగంతో, గుణాత్మకంగా సాగదు.
ఉదా: మగపిల్లల సగటు వికాస వేగం ఆడపిల్లల సగటు వికాస వేగం కంటే కొంచెం తక్కువగా ఉండటం.
వికాసం ఒక కచ్చితమైన దిశగా సాగుతుంది. దీన్ని రెండు ఉపసూత్రాలుగా విభజించవచ్చు...
ఎ) వికాసం 'శిరోపాదాభిముఖంగా' సాగుతుంది. వికాసం అనుదైర్ఘ్యంగా శిశువు శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది.
ఉదా: తల్లి గర్భంలో మొదట శిశువు తల భాగం అభివృద్ధి చెంది, తర్వాత నడుము, చివరకు పాదాలు వికాసం చెందడం.
బి) సమీప దూరస్థ వికాస సూత్రం: వికాసం శరీర కేంద్రం నుంచి భాగాలకు విస్తరిస్తుంది.
ఉదా: శిశువుకు మొదట భుజం, కండరాలు, తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్లపై అదుపు ఏర్పడటం.
వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతాయి: వ్యక్తిలోని వివిధ వికాసాలైన శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వికాసం చెందుతాయి. ఇందులో ఏ ఒక్క వికాసం మందగించినా దాని ప్రభావం మరో వికాసంపై ఉంటుంది.
ఉదా: ఒక విద్యార్థిలో భౌతిక వికాసం (శారీరక వికాసం) కుంటుపడితే దాని ప్రభావం మిగిలిన అన్ని వికాసాలపై ఉండటం (సరిగా చదవకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, సాయం చేయకపోవడం లాంటి గుణాలు).

వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది: ప్రారంభంలో శిశువు అన్ని ఉద్దీపనలకు సాధారణ ప్రతిస్పందన చూపించినా, క్రమంగా ఒక ఉద్దీపనకు మాత్రమే ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రతిస్పందించడం.
ఉదా: ఒక వస్తువును పట్టుకోవడానికి ప్రారంభంలో శిశువు రెండు చేతులను ఉపయోగించడం, తర్వాత ఒక చేతిని, చివరగా ఆ వస్తువును పట్టుకోవడానికి అవసరమైన వేళ్లను మాత్రమే ఉపయోగించడం.
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు: శిశువు ప్రస్తుత వికాసం ఆధారంగా అతని భవిష్యత్తు వికాసాన్ని ఊహించవచ్చు.
ఉదా: ఒక బాలుని బాల్యదశలోని బౌద్ధిక వికాసాన్ని బట్టి కౌమార దశలో బౌద్ధిక వికాసాన్ని ఊహించవచ్చు.

రచయిత: కోటపాటి హరిబాబు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌