• facebook
  • whatsapp
  • telegram

భాష - వివిధ భావనలు

భాష అనే పదం 'భాష్' అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. భాషకు మూలం ధ్వని. ధ్వని రెండు రకాలుగా వెలువడుతుంది. ఒకటి జీవుల నుంచి, రెండోది నిర్జీవ పదార్థాల నుంచి. ధ్వని నుంచి శబ్దం, శబ్దం నుంచి అర్థం స్ఫురిస్తాయి. భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో 2,796 భాషలు ఉన్నాయి.
 

నిర్వచనాలు
* భాషణ అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష - హాకెట్
* బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తియే భాష - ఇజ్లర్
* ఆలోచనలకు ఆకృతి భాష - జాన్సన్
* పరిమిత సాధనాలను అపరిమితంగా వాడుక చేసేది భాష - మాఘుడు
* ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష - వ్యాకర్తలు
* మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా వ్యక్తం చేస్తామో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష - రామచంద్రవర్మ
* భాష ఒకే ఒక అంశం, లక్షణాంశం ఉన్న వస్తువు కాదు. మానవ సమాజంలోని సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయం భాష - ఎస్.కె. వర్మ, ఎన్. కృష్ణస్వామి
* మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి, పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష - సైమన్ పాటర్
* అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవతా సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష - ఎడ్వర్డ్ సఫీర్
*  సైద్ధాంతికతకు సంబంధించిన కళే భాష - హెగెల్


భాష - పుట్టుపూర్వోత్తరాలు
భాష పుట్టుకను, దాని ఉత్పత్తి క్రమాన్ని తెలియజేసే వాదాలనే భాషోత్పత్తి వాదాలు అంటారు. ఇవి 10.
1. భగవద్దత్త వాదం: దీనికే దైవదత్త వాదమనీ, దైవప్రసాద వాదమనీ పేర్లు. నటరాజు ఢమరుకం నుంచి వెలువడిన ధ్వనులే (మహేశ్వర సూత్రాలే) భాషకు మూలం అని తెలియజేస్తుంది.
2. ధ్వన్యనుకరణ వాదం: పశువులు, పక్షులకు అవి చేసే కంఠధ్వనులను బట్టి పేర్లు పెట్టారని చెప్పే వాదం. కాకా అనేది కాకి, మేమే అనేది మేక, బౌ అనేది బౌ(భౌ)కము, కుకూ (Cuckoo) అనేది కోకిల అయిందనేది ఈ వాదన సారాంశం. మాక్స్ ముల్లర్ దీన్ని బౌవౌ వాదంగా పేర్కొన్నాడు.
3. డింగ్ డాంగ్ వాదం: దీనికి ప్రకంపనా వాదం అనే పేరు కూడా ఉంది. ధ్వనికీ, భావానికీ అనురూపమైన సంబంధం ఉంటుందని తెలియజేస్తుంది.
4. పూపూ వాదం: దీనికే టట్ టట్ వాదం, సాంకేతిక వాదం అనే పేర్లు ఉన్నాయి. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను ఒక క్రమంలో కదుపుతూ కొన్ని ధ్వనులను చేస్తారు. అలాంటి ధ్వని సంకేతాల నుంచి భాష పుట్టిందని ఈ వాదం పేర్కొంటుంది.
5. యోహిహో వాదం: బరువైన పనులు చేసేటప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు బరువుగా సాగుతాయి. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను బట్టి కండరాలు బిగిసి, నాదతంత్రుల ప్రకంపనలు తీవ్రమై ఒక విధమైన ధ్వని పుడుతుంది. ఆ ధ్వని నుంచి భాష పుట్టింది అని చెప్పే వాదం ఇది.
6. ధాతు వాదం: దీన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. ఇది క్రియా (ధాతు) పదాల నుంచి భాష పుట్టింది అని చెప్పే వాదన.
7. స్వతస్సిద్ధ వాదం: మనిషి స్వతస్సిద్ధంగా భావాలు కలిగి ఉంటాడు. అనుభవాలు సదరు భావాలను ఉద్దీపింపజేసినప్పుడు ధ్వనులు పుడతాయని చెప్పే వాదం. దీన్ని ప్రతిపాదించినవారు నోమ్ ఛామ్‌స్కీ.

8. సంపాదన వాదం: దీనికి 'అనుభవ వాదం' అనే పేరు ఉంది. శిశువు పెరిగేకొద్దీ పరిసరాల్లో తాను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగుతుంది.
9. వివక్షాప్రేరణ వాదం: ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలమని ఈ వాదం చెబుతుంది.
10. క్రమపరిణామ వికాసవాదం: క్రమపరిణామంలో పశుపక్ష్యాదుల శబ్దాల నుంచి పరిణతి చెంది మానవుడు అర్థవంతమైన శబ్దాలను అలవరచుకున్నాడు. క్రమపరిణామం, వికాసం వల్ల నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధి సాధించాడని చెప్పే వాదం.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌