• facebook
  • whatsapp
  • telegram

కనీస అభ్యసన స్థాయులు 

   'కనీస - అభ్యసన - స్థాయి'లో మూడు పదాలున్నాయి. ప్రతి విద్యార్థి సాధించాల్సిన అభ్యసన సామర్థ్యాలనే 'కనీస అభ్యసన స్థాయులు' అని చెప్పవచ్చు. గుణాత్మకత, జవాబుదారీతనంతో కూడిన విద్యను దేశంలోని పిల్లలందరికీ అందించడానికి ప్రవేశపెట్టిందే 'కనీస అభ్యసన స్థాయి'. 

          భారత రాజ్యాంగంలోని 45వ అధికరణం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అందించాల్సి ఉంది. నేటి విద్య గుణాత్మకంగా లేకపోవడంవల్ల పాఠశాలల్లో చేరిన విద్యార్థులలో కొంత మంది మధ్యలోనే చదువు మానేసి వెళుతున్నారు. చాలామంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. దీన్ని అధిగమించడానికి 1990లో 'గుణాత్మక విద్య'కు స్ఫూర్తినిచ్చే ''కనీస అభ్యసన స్థాయుల''(క.అ.స్థా.)ను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం డా॥ఆర్.హెచ్.దవే అధ్యక్షతన ఒక కమిటీ వేసింది.
 

నిర్వచనాలు 

* ఆశించిన అభ్యసన ఫలితాలైన జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం మొదలైన వాటిని సూచించే అభ్యసన లక్ష్యాల వర్గీకరణే కనీస అభ్యసన స్థాయులు.
* ఒక నిర్దేశిత తరగతి లేదా విద్యాదశను పూర్తిచేసే ప్రతి విద్యార్థి నుంచి ఆశించే ప్రావీణ్యతను సాధించడానికి తోడ్పడే అభ్యసన సామర్థ్యాలే కనీస అభ్యసన స్థాయులు.

 

కనీస అభ్యసన స్థాయులను రూపకల్పన చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన ప్రాతిపదికాంశాలు:
* వివిధ తరగతుల పిల్లల జ్ఞానాత్మక రంగ సామర్థ్యాలు వివిధ అభివృద్ధి దశలతో సమన్వయం జరగాలి.
* పరిసరాల పరిస్థితుల దృష్ట్యా వాస్తవిక అనుభవాలకు అనుగుణంగా ప్రాథమిక విద్యా కార్యక్రమాలు ఉండాలి.
సామర్థ్యం: ఒక తరగతి లేదా ఒక విద్యాదశ పూర్తయ్యేనాటికి అభ్యసనం ద్వారా ప్రతి విద్యార్థి సాధించాల్సిన ప్రావీణ్యతనే సామర్థ్యం అంటారు.
స్థాయి: నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యమే 'స్థాయి'.
కనీస అభ్యసన స్థాయులను అనుసరించి బోధించడానికి ముందు పూర్వపరీక్ష నిర్వహించి విద్యార్థుల సముపార్జనను నమోదు చేసుకోవాలి. బోధనానంతరం తిరిగి పరీక్షను నిర్వహించి, విద్యార్థి సాధించిన అభివృద్ధిని మూల్యాంకనం చేయాలి.
కనీస అభ్యసన స్థాయుల లక్షణాలు 

1. సముపార్జించదగినవి (Achievability)
2. వ్యక్తం చేయడానికి అనువైనవి (Communicability)
3. మూల్యాంకనం చేయదగినవి (Evaluability)
4. జవాబుదారీతనం వహించడం (Accountability)
5. నిరంతర అభ్యసన (Learning Continnum)

 

భాష- కనీస అభ్యసన స్థాయి: భాష ద్వారా నేర్చుకున్న ''ప్రాతిపదిక నైపుణ్యాలు ఇతర రంగాల్లోని భావనలను అభ్యసించడానికి తోడ్పడతాయి. శిశువు మూర్తిమత్వం రూపుదాల్చడానికి, నిత్యజీవన సన్నివేశాల ఫలప్రద నిర్వహణకు శ్రవణాది తొమ్మిది ప్రాతిపదిక భాషా నైపుణ్యాలు (కనీస అభ్యసన సామర్థ్యాలు) తోడ్పడతాయి.
కనీస అభ్యసన సామర్థ్యాలు - 9
     1. శ్రవణం                          2. భాషణం
     3. పఠనం                           4. లేఖనం
     5. భావావగాహనం               6. ప్రాయోగిక వ్యాకరణం
     7. స్వయం అధ్యయనం     8. భాషోపయోగం
     9. శబ్దజాలంపై అధికారం


 

ఉపసామర్థ్యాలు: ప్రతి తరగతిలో విద్యార్థి 19 ఉపసామర్థ్యాలను సాధించాల్సి ఉంటుంది. ప్రాథమిక దశ పూర్తయ్యేసరికి విద్యార్థి సాధించాల్సిన ఉపసామర్థ్యాలు - 95 (19 × 5 = 95).
కనీస అభ్యసన స్థాయి - సూచిక: కనీస అభ్యసన స్థాయి సూచికలో 3 అంకెలుంటాయి. మొదటి అంకె సామర్థ్యాన్ని, రెండో అంకె తరగతిని, మూడో అంకె ఉపసామర్థ్యాన్ని తెలియజేస్తాయి.
సామర్థ్యాలు- అంతస్సంధానం: నాలుగు భాషా నైపుణ్యాలతో నాలుగు సామర్థ్యాలకు (శ్రవణ, భాషణ, పఠన, లేఖనం) సంబంధం ఉంటుంది.
* ఈ సామర్థ్యాలు భాషకు ప్రాతిపదికలు. ఇవి ఫలప్రదమయ్యే భాషాభ్యసనానికి తోడ్పడతాయి.
* ఈ సామర్థ్యాలు స్పష్టీకరణ స్థాయిలో వేరువేరుగా కనిపించినప్పటికీ సహజంగా అంతస్సంధానం కలిగి ఉన్నాయి.
 ఈ నాలుగు ప్రాతిపదిక సామర్థ్యాల మధ్య ఉన్న అంతస్సంధానం శ్రవణం, పఠనాల ద్వారా అయిదో సామర్థ్యమైన భావావగాహనాన్ని ప్రభావితం చేస్తుంది. శ్రవణ, పఠనాల మధ్య అంతస్సంధానం ఉన్నట్టే, పఠన, లేఖనాల మధ్య; శ్రవణ, భాషణాల మధ్య అంతస్సంధానం ఉంటుంది.

 

మూల్యాంకనం 

కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించే మూల్యాంకనాన్ని కింద పేర్కొన్న విధంగా చేపట్టవచ్చు.
1. పూర్వపరీక్ష (Pre-Test): విద్యార్థులను మూల్యాంకనం చేసే ప్రక్రియను పూర్వ పరీక్ష నుంచి ప్రారంభించాలి. దీని ద్వారా...
*  ప్రారంభ సమాచారం సేకరించవచ్చు.
*  విద్యార్థులు చేసే దోషాలు తెలియడం వల్ల దోషనివారణ చేయవచ్చు.
*  సమాచార విశ్లేషణ, పర్యవేక్షణకు తోడ్పడుతుంది.
*  ఉపాధ్యాయుల పునశ్చరణకు కూడా ఇది తోడ్పడుతుంది.
2. నిరంతర, సమగ్ర మూల్యాంకనం: బోధన చేసే సమయంలో, ఒక యూనిట్‌ను పూర్తిచేసిన తర్వాత మూల్యాంకనం చేయాలి.
3. ఉత్తర పరీక్ష: బోధనానంతరం, సమగ్ర మూల్యాంకనం చేయాలి.
4. పూర్వ ఉత్తర పరీక్ష: వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను కనుక్కోవచ్చు.

 

కనీస అభ్యసన స్థాయులను దృష్టిలో ఉంచుకొని బోధిస్తే... 
* విద్యార్థుల భాషాస్థాయి సక్రమంగా వికసిస్తుంది.
* ఉపాధ్యాయులు తమ బాధ్యతలను తెలుసుకుని అంకితభావంతో పనిచేస్తారు.
* అభివృద్ధి సాధించని విద్యార్థులను గుర్తించి, వారి వికాసానికి తగిన శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
* రాష్ట్రంలోని అన్ని పాఠశాలల స్థాయి ఒకే విధంగా ఉంటుంది.
* పేద, ధనిక వర్గాల విద్యార్థులందరిలో ఒకే విధమైన విద్యాస్థాయి నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది.     
  మనదేశంలోని అన్ని పాఠశాలల్లో కనీస అభ్యసన స్థాయులను ప్రవేశపెడితే మన పిల్లల విద్యలో గుణాత్మకత పెంపొందుతుంది.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌