• facebook
  • whatsapp
  • telegram

మాతృభాష

మదర్‌టంగ్ (Mother Tongue) అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా నేడు మాతృభాష అనే పదం వ్యవహారంలో ఉంది. మాతృభాష అనే పదం వాడుకలోకి రాకముందు, అంటే 18వ శతాబ్దం వరకు భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్న భాషలను 'దేశభాష'లు అని వ్యవహరించేవారు.
                      'జనని సంస్కృతంబు సకల భాషలకును
                      'దేశభాష'లందు తెలుగు లెస్స
                      జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
                      మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె  - అని కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి మనదేశంలో అప్పటికున్న భాషలన్నిటిలో తెలుగు భాష శ్రేష్ఠమైందని చెప్పాడు.

సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు, తన ఇష్టదైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి, తెలుగులో ఒక గ్రంథం రాయమన్నట్లు ఆముక్తమాల్యద కావ్యపీఠికలో ఈ విధంగా పేర్కొన్నాడు.
                      'తెలుగుదేల యన్న దేశంబు తెలుగేను
                      తెలుగు వల్లభుండ, తెలుగొకండ
                      యెల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి
                      దేశభాషలందు తెలుగులెస్స'

నిర్వచనాలు 

శిశువుకు మొదటి గురువు తల్లి. తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాషను మాతృభాష అంటారు.

మానవుడు శైశవావస్థ నుంచి, తన హావభావాలను, హాస్యక్రోధానురాగాలను, ఆలోచనలు, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తం చేస్తున్నాడో ఆ భాషే అతడి మాతృభాష. - గొడవర్తి సూర్యనారాయణ

శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష. - గాంధీజీ

శిశువు తన జాగృదావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం. - రైబర్న్, బల్లార్డ్

బోధనావిలువలు

మాతృభాష బోధనావిలువలు రెండు రకాలు.

1. సామాన్య విలువలు

2. ప్రత్యేక విలువలు.

సామాన్య విలువలను కూడా రెండు రకాలుగా విభజించవచ్చు.

1) వైయక్తిక విలువలు

2) సామాజిక విలువలు.


 

బోధనామాధ్యమం

బోధించే భాషలన్నింటిలో మాతృభాషకు ప్రధాన స్థానం ఉండాలనీ, మాతృభాషే బోధనామాధ్యమంగా ఉండాలనేది విద్యావేత్తల అభిప్రాయం.

మాతృభాష తల్లి పాల లాంటిది. పరభాష పోతపాల వంటిది. తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, పోతపాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషలో విషయం నేర్చుకున్నవాడికి, పరభాషలో నేర్చుకున్నవాడికి అంతే తేడా ఉంటుంది. - కొమర్రాజు లక్ష్మణరావు.

పరభాషా మాధ్యమంలో బోధన సోపానాలు లేని సౌధం లాంటిది. - రవీంద్రనాథ్ ఠాగూర్

మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండాలని మాతృభాషా ప్రాధాన్యాన్ని గురించి 9 జులై 1938 నాటి హరిజన పత్రికలో మహాత్మాగాంధీ అభిప్రాయపడ్డారు.

అధికార భాష - తెలుగు

భారత రాజ్యాంగంలోని 345వ అధికరణం, రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అధికారమిచ్చింది.

వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగు అధికార భాషగా ఉండాలని అనధికార బిల్లు, తీర్మానం రూపంలో తొమ్మిదిసార్లు ప్రతిపాదించారు.

చివరికి 1964లో తెలుగును అధికార భాషగా ఆమోదించడానికి ప్రతిపాదించే బిల్లును అచ్చువేయించడానికి ప్రభుత్వం అంగీకరించింది.

దాన్ని ప్రజాభిప్రాయ సేకరణకు పంపించారు. ఒక్క 'ఆంధ్రప్రభ' తప్ప ఇతర పత్రికలు దాని విషయంలో అంతగా శ్రద్ధ చూపలేదు.

సెలక్షన్ కమిటీ స్థాయిలో ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, విద్యాశాఖామంత్రి పి.వి. నరసింహారావు అనధికార బిల్లుకు బదులు, అధికారబిల్లును ప్రతిపాదించాలనుకున్నారు. 1966లో అది శాసనం అయ్యింది.

అధికార భాషాసంఘం

అధికార భాషా శాసనంలో ప్రతిపాదించిన సూచనలు ఎంత వరకూ అమలయ్యాయి, వాటి ప్రగతి ఏ విధంగా ఉంది అన్న అంశాలను పరిశీలించడానికి పి.వి. నరసింహారావు అధ్యక్షతన ఒక పరిశీలనా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

1970లో ఈ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.

పి.వి. నరసింహారావు కమిటీ సిఫారసుల మేరకు 1974 మార్చి 19న అధికార భాషా సంఘం ఏర్పడింది.

అధికార భాషా సంఘానికి వావిలాల గోపాలకృష్ణయ్య మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ప్రస్తుతం అధికార భాషా సంఘానికి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహిస్తున్నారు. అధికార భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నారు.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌