• facebook
  • whatsapp
  • telegram

పద్య, గద్య బోధన

ఛందోబద్ధమైంది పద్యం. చందోరహితమైనది గద్యం. నాటి నుంచి నేటి ఆధునిక కాలం వరకు పద్యాన్ని వివిధ పద్ధతుల్లో బోధిస్తున్నారు. ఈనాడు గద్యం కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. పద్యాన్ని, గద్యాన్ని ఒకేలా బోధించలేం. రెండింటి అవగాహనలో బేధాలున్నాయి.

బోధనా పద్ధతులు
పద్య బోధన: ఛందోబద్ధమైన రచన పద్యం. పద్యం ధ్వని ప్రధానమైంది. భావగర్భితమైంది. లయతో కూడి ఉండేది. మనవాళ్లు పద్య కవిత్వాన్నే కవిత్వంగా భావించారు.
* 'కవయతీతి కవిః తస్య కర్మకావ్యం' అంటే వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అని విద్యాధరుడన్నారు.
* 'రసప్రధానమైన వాక్యాన్ని ఆత్మగా కలది కావ్యం' అని విశ్వనాథుడు పేర్కొన్నారు.

 


 

పద్య బోధన పద్ధతులు
1. పూర్ణ పద్ధతి: 
'Proceed from whole to parts' అనే సూత్రానికి సంబంధించింది పూర్ణపద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించడాన్నే పూర్ణపద్ధతి అంటారు. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశం (Single unit)గా భావించి బోధించే పద్ధతిని 'పూర్ణ పద్ధతి' అంటారు.
2. ఖండ పద్ధతి: ఈ పద్ధతి పూర్ణ పద్ధతికి విరుద్ధమైంది. పద్యంలోని పదాలను విడదీసి, ప్రతి పదానికి అర్థం చెబుతూ, వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్ధతిని ఖండ పద్ధతి అంటారు.
3. ప్రశంసనా పద్ధతి: కవి రచనా చమత్కృతి, ప్రతిభ, రసపోషణ, అలంకార వైశిష్ట్యం, వ్యంగ్యార్థాలు, సమయోచిత పదప్రయోగ ఔచిత్యం మొదలైన నిగూఢమైన అంశాలను విద్యార్థులకు తెలియపరచి వారు ప్రశంసించేట్లు, అందులో లీనమయ్యేట్లు చేయడమే ఈ పద్ధతిలోని విశేషం.
4. పఠన పద్ధతి: Poetry must be read but not taught అనే అభిప్రాయం ప్రాతిపదికగా ఉన్న పద్ధతి. పద్యాన్ని పాడాలి, చదవాలి. బోధించకూడదు అని భావించే పద్ధతి.
5. సారాంశ/ తాత్పర్య పద్ధతి: పద్యాలను చదివి వినిపించి ప్రధాన భావాన్ని/ తాత్పర్యాన్ని చెప్పి, విద్యార్థుల సొంత మాటల్లో చెప్పించే పద్ధతి. కాఠిన్యత తగ్గిన పద్యాలను ఈ పద్ధతిలో బోధించాలి.
6. ప్రతిపదార్థ పద్ధతి: ప్రతిపదార్థాన్ని చదివి దానికి పద విభాగం చెప్పించి, ఆ తర్వాత పద్య తాత్పర్యాన్ని చెప్పడం ఈ పద్ధతిలోని విశేషం.

 

గద్య బోధన
'గద్యం కవీనాం నికషం వదన్తి' అనే ప్రసిద్ధోక్తి ఉంది. అంటే కవి ప్రతిభకు గద్యమే గీటురాయి అని అర్థం. కృష్ణమాచార్యులు రచించిన 'సింహగిరి వచనములు' అనేది మొదటి గద్య రచనగా పేర్కొంటారు.
గద్య బోధన పద్ధతులు
1. ప్రశ్నోత్తర పద్ధతి:
 ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కేంద్రంగా గ్రహించి విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాలను రాబడతాడు. విద్యార్థుల్లో దాగిన శక్తులను బహిర్గతం చేయడానికి ఇది తోడ్పడుతుంది.
2. ప్రవచన పద్ధతి: ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించే పద్ధతి. మనస్తత్వశాస్త్ర సూత్రాలకు విరుద్ధమైన గద్యబోధన పద్ధతి.
3. ఉపన్యాస పద్ధతి: పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయులు ఉపన్యాస ధోరణిలో బోధించే పద్ధతి. ఇది పాఠశాల స్థాయిలో అంత ఉపయుక్తం కాదు.
4. చర్చా పద్ధతి: ఉపాధ్యాయుడు మొదట చర్చను ప్రారంభించి, దాని సారాంశాన్ని చివరగా సాధారణీకరణం చేసే పద్ధతి. ఈ పద్ధతి మాధ్యమిక, ఉన్నత దశలకు ప్రయోజనకారిగా ఉంటుంది.
5. వివరణ పద్ధతి: పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత పరిచయం, పూర్వపర కథలు, విశేషాంశాలను ఈ పద్ధతిలో బోధించాలి.
6. ఉదాహరణ పద్ధతి: నూతన పదాలను, వ్యాకరణాంశాలను ఈ పద్ధతిలో బోధించాలి.
7. సంభాషణ పద్ధతి: సంభాషణ రూపంలో ఉన్న పాఠాలను ఒక్కో పాత్ర ఒక్కో విద్యార్థికి ఇచ్చి ఆయా పాత్రల సంభాషణలు చదివించే పద్ధతి.
8. కథా కథన పద్ధతి: కథలోని విభిన్న పాత్రల్లో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి, పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేసే పద్ధతి.

 

కావ్య నిర్వచనాలు
* లోకోత్తర వర్ణనా నిపుణుడైన కవి కర్మ కావ్యం   - ముమ్మటుడు
                                                             
* సహితములైన శబ్దార్థాలు కావ్యం  - భామహుడు
* గుణాలంకారయుక్తములయిన శబ్దార్థాలు కావ్యం - వామనుడు
                                                                
* అదోషములు, సగుణములు, సాలంకారములు అయిన శబ్దార్థాలు కావ్యం - ముమ్మటుడు
* రసాత్మకమైన వాక్యం కావ్యం   - విశ్వనాథుడు
* నిర్దోషము, గుణాలంకార రసవంతమునగు వాక్యం కావ్యం  - భోజరాజు

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌