• facebook
  • whatsapp
  • telegram

బోధనా ప్రణాళిక (Instructional Planning)  

              ఉపాధ్యాయుడు ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలు, దానికి ఉపకరించే బోధనాంశాలు, బోధన పద్ధతులు, వాటికి పట్టే సమయం, కావాల్సిన బోధనాభ్యసన సామగ్రి, మూల్యాంకనం తదితర అంశాలను రూపకల్పన చేసుకుంటాడు. ఈ వ్యూహాన్నే ప్రణాళికా రచన లేదా పథక రచన అంటారు.
 

పథక రచనలు - రకాలు
1) వార్షిక పథకం (Year Plan)
2) యూనిట్ పథకం (Unit Plan)
3) పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం (Lesson Plan or Period Plan)

 

1. వార్షిక పథకం:
* ఈ పథకంలో ఒక తరగతికి సంబంధించి ఆ ఏడాదిలో బోధించాల్సిన పాఠ్యప్రణాళికను కొన్ని పాఠ్యవిభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగాన్ని బోధించడానికి పట్టే కాలం, సాధించాల్సిన లక్ష్యాలను సూచించే పట్టికనే వార్షిక పట్టిక లేదా వార్షిక పథకం అంటారు.
* జూన్ నుంచి ఏప్రిల్ చివర వరకు జరిగే విద్యాకార్యక్రమాల పథకాన్ని 'వార్షిక పథకం' అంటారు.

* ఒక విద్యాసంవత్సరంలో ఒక తరగతికి బోధించాల్సిన విషయాలను యూనిట్లుగా విభజించుకుని, ఒక్కో యూనిట్‌ను ఏ నెలలో బోధించాలో తెలియజేసే ప్రణాళికను వార్షిక పథకం లేదా వార్షిక ప్రణాళిక అంటారు.
* వార్షిక పథకం ఒక దీర్ఘకాలిక ప్రణాళిక.
* విద్యాసంవత్సరం ప్రారంభంలో జరిగే పథకం.

 

వార్షిక పథకాన్ని రచించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు:
* ఆ విద్యాసంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాలు
* పాఠశాల పనిదినాల సంఖ్య
* గణితాన్ని బోధించడానికి ఆ సంవత్సరంలో కేటాయించిన పీరియడ్ల సంఖ్య
* ఒక్కో యూనిట్‌ను సాధించడానికి పట్టే కాలం
* ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాల సంఖ్య
* పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య
* ప్రత్యేక సెలవు దినాలు
* ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణ పొందే దినాల సంఖ్య
* ఉపాధ్యాయ సమావేశాల సంఖ్య

వార్షిక పథకం నమూనా

వార్షిక పథకం ఉపయోగాలు:
* ఏ యూనిట్‌ను ఏ నెలలో ఎంతవరకు బోధించాలో ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు.
* ఆ యూనిట్ ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను తెలుసుకుంటాడు.
* ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటాడు.

యూనిట్ పథకం (Unit Plan)

       వార్షిక పథక రచన అంతా 'యూనిట్‌'పై ఆధారపడి ఉంటుంది. యూనిట్ అంటే విషయంలోని ఒక పెద్ద భాగం.
 

నిర్వచనాలు:
హెర్బార్ట్:
యూనిట్ అంటే ఒక సమగ్ర, సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర.
ప్రెస్టన్: అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్.

సాంపోర్ట్: యూనిట్ అంటే విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు సంబంధించి విడదీసిన, శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్యరూపం.
యూనిట్‌లోని భాగాలు:
1. ప్రేరణ:
ఈ భాగంలో విద్యార్థులు ప్రేరణ పొంది, యూనిట్ ఉద్దేశాన్ని గ్రహిస్తారు.
2. సంకీర్ణ దృష్టి: విద్యార్థులు యూనిట్ పరిధిని అర్థం చేసుకుంటారు.
3. నేపథ్యాన్ని కనుక్కోవడం: దీని వల్ల విద్యార్థి యూనిట్‌లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకుని ఆ దశ నుంచి ప్రారంభించే వీలవుతుంది.

 

మంచి యూనిట్ లక్షణాలు:
* విద్యార్థులకు ప్రత్యక్షమైన, వ్యక్తిగత అనుభవాత్మక కృత్యాల ప్రాతిపదికగా ఉంటుంది.
* యూనిట్‌లోని కృత్యాల శ్రేణి ఎక్కువగా ఉంటే విద్యార్థులందరికీ ఆసక్తి కలుగుతుంది.
* యూనిట్‌లో విద్యార్థి జీవిత సంబంధ అన్వయాలు ఉండాలి.
* అధిక సామర్థ్యం ఉండే విద్యార్థులు యూనిట్ పరిధిని దాటి వెళ్లడానికి అవకాశం ఉండాలి.
* ప్రతి యూనిట్‌ను అర్థవంతమైన ఉపయూనిట్లుగా విభజించుకున్న తర్వాత, ఒక్కో ఉపయూనిట్‌ను పూర్తిచేయడానికి పట్టే పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను కాలనిర్ణయ పట్టిక (Time Schedule chart) అంటారు.

యూనిట్ పథకం తయారుచేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ముఖ్యాంశాలు:
* విద్యార్థుల పూర్వజ్ఞానం
* సబ్‌యూనిట్లు
* విషయ విశ్లేషణ
 * లక్ష్యాలు, స్పష్టీకరణలు
* బోధనాభ్యసన కృత్యాలు
* బోధనాభ్యసన సామగ్రి
* మూల్యాంకనం

 

యూనిట్ పథకం వల్ల ప్రయోజనాలు:
* యూనిట్‌లోని సమైక్య లక్షణాలను ఏర్పరచడానికి వీలవుతుంది.
* నిర్ణీత సమయంలో యూనిట్ పూర్తిచేయవచ్చు.
* యూనిట్ బోధించే సమయంలో కల్పించే కృత్యాలను ఏర్పరచడానికి ఉపాధ్యాయుడు ముందుగానే సంసిద్ధత పొందవచ్చు.
* బోధనాభ్యసన సామగ్రి (టీఎల్ఎం) సమకూర్చుకోవడానికి వీలవుతుంది.
* అన్ని పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి వీలవుతుంది.
* యూనిట్ పరీక్ష ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేయవచ్చు.

 

పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం:
నిర్వచనాలు:

* నిర్ణీత కాలంలో, నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చడానికి తయారుచేసే పథకం.
* యూనిట్‌లోని సబ్‌యూనిట్‌లో ఒక పీరియడ్‌లో బోధించడానికి తగిన విషయంపై తయారుచేసే పథకం.
* సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని.
* 'పాఠ్యపథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక' ------ Lester B. Sands
(A lesson plan is actually plan of action)
* ''రోజువారీ పాఠ్యపథకంలో లక్ష్యాలను నిర్ణయించడం, విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం, పద్ధతిని, విధానాన్ని నిశ్చయించడం ఇమిడి ఉంటాయి". ------ Bining and Bining

 

పాఠ్యపథకం - హెర్బార్ట్ సోపానాలు:
జె.ఎఫ్.హెర్బార్ట్ అనే విద్యావేత్త సూచనల వల్ల పాఠ్యపథక రచన గుర్తింపు పొందింది. ఆయన తెలియజేసిన ప్రకారం పాఠ్యపథక రచనలో 6 దశలు ఉన్నాయి. వాటినే హెర్బార్ట్ పాఠ్యపథక దశలు లేదా హెర్బార్ట్ పాఠ్యపథక సోపానాలు అంటారు. అవి
              1) సన్నాహం (Preparation)
              2) సమర్పణ లేదా విషయ విశదీకరణ (Presentation)
              3) సంసర్గం (Association)

              4) సాధారణీకరణం (Generalisation)
              5) అన్వయం (Application)
              6) పునర్విమర్శ (Recapitulation)
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న పాఠ్యపథకాలను కచ్చితంగా హెర్బార్ట్ సూచించిన దశల్లో రచించడం లేదు.

 

ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథకంలోని బోధనా దశలు లేదా సోపానాలు:
1. ప్రవేశ వ్యాసక్తులు లేదా ఉన్ముఖీకరణ వ్యాసక్తులు (Introductory activities)

              i) పూర్వజ్ఞాన మూల్యాంకనం
              ii) ప్రేరణ/ ఉన్ముఖీకరణం
              iii) శీర్షికా ప్రకటన

 

2. వికాస వ్యాసక్తులు (Developmental Activities)
              i) విషయ సమర్పణ/ ప్రదర్శన (Presentation)
              ii) విశదీకరణ (Explanation)
              iii) ప్రత్యక్ష నిరూపణ (Demonstration)

 

3. అంత్య (పర్యవసాన) వ్యాసక్తులు (Culminating activities)
              i) పర్యవేక్షణాధ్యయనం
              ii) సమీక్ష/ పునర్విమర్శ

              iii) మూల్యాంకనం
                a) పరీక్షించడం
                b) నిర్దేశాలు

 

పాఠ్యపథకం నమూనా

సూక్ష్మబోధన (Micro Teaching):
* సూక్ష్మబోధనా విధానాన్ని డ్వైట్ డబ్ల్యు.ఎలెన్ (Dwight W. Allen), రాబర్ట్ బుష్ (Robert Bush), కీత్ ఎక్సన్(Keith Ekson) రూపొందించారు.
* మనదేశంలో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (C.A.S.E.)లో సూక్ష్మబోధనపై పరిశోధనలు జరిగాయి.

* మనదేశంలో సూక్ష్మబోధనపై పరిశోధన చేసినవారిలో ప్రముఖులు: డాక్టర్ బి.కె. పాసి, జంగీరా.
* సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించడానికి కావాల్సిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది.
* ఉపాధ్యాయులకు లేదా ఉపాధ్యాయ విద్యార్థులకు బోధనా కళను నేర్చుకోవడానికి రూపొందించిన సాంకేతిక విధానమిది.

 

సూక్ష్మబోధనలో
              i) ఒక సందర్భంలో ఒకే ఒక నైపుణ్యాన్ని అభ్యసిస్తారు.
              ii) తరగతి పరిమాణాన్ని 5 - 10 విద్యార్థులకు కుదిస్తారు.
              iii) బోధనా కాలాన్ని 5 - 10 నిమిషాలకు కుదిస్తారు.
              iv) బోధనా విషయాన్ని ఒకే ఒక భావనకు పరిమితం చేస్తారు.
* సూక్ష్మబోధన ఎంతో వ్యక్తిగతమైన శిక్షణా విధానం.

 

సూక్ష్మబోధన వల్ల ప్రయోజనాలు:
* సాంప్రదాయక బోధనలో నాణ్యత పెరుగుతుంది.
* వివిధ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించడంపై అవగాహన ఏర్పడుతుంది.
* పాఠ్యాంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించడం వల్ల బోధన సులభమవుతుంది.

* సూక్ష్మబోధన పూర్తిచేసిన వెంటనే పునర్బలనాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది.
* సూక్ష్మబోధనా శిక్షణావలయం వల్ల పాఠ్యపథకాన్ని, బోధనా విధానాన్ని సవరించుకోవచ్చు.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌