• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన, మానవతా విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడమే విద్య ముఖ్య లక్ష్యం. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు అనేవి విద్యార్థులు అర్థం చేసుకోవడానికి తోడ్పడాలి. దాంతోపాటు పాఠశాలను ఒక సాంఘిక వికాస కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా విద్యాలక్ష్యాలు సాధించడానికి సహకరించేవిగా ఉండాలి.
    ఒక నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతే మూల్యాంకనం. అంటే విద్యార్థి సామర్థ్యాన్ని సాధించాడని గానీ, సాధించలేదని గానీ చెప్పడం. పాఠశాలలో జరిగే అభ్యసన ప్రక్రియలకు, లక్ష్యాలకు బోధనతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రక్రియను మూల్యాంకనం అంటారు.
* విద్యార్థుల అభ్యసన ప్రగతిని ఒక శాస్త్రీయమైన విధానంలో తెలియజేయడానికి, ఉపాధ్యాయుడి బోధన ఎంత మేరకు సఫలమైందో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే మూల్యాంకనం.
* మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు మూడింటికి సంబంధించింది. మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని సమగ్రంగా నిర్వహించాలని జాతీయ విద్యావిధానం (1986) పేర్కొంటోంది.
* విద్యార్థుల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యాహక్కు చట్టం - 2009 నిర్దేశించింది.

నిరంతర సమగ్ర మూల్యాంకనం (Continuous Comprehensive Evaluation - CCE)

          విద్యాప్రణాళిక బోధనాభ్యసన ప్రక్రియలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, పిల్లల ప్రగతిని కూడా అంతే ప్రాధాన్యతతో పరిశీలిస్తుంది. పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం విద్యార్థుల జ్ఞాననిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించేదిగా ఉండాలి.
* మూల్యాంకనం - 1) పాఠ్యాంశాలు 2) సహ పాఠ్యాంశాలు రెండింటి మధ్య ఎలాంటి విభేదాన్ని చూపకుండా, వాటిని సమష్టిగా పరిశీలించేదిగా ఉంటే దాన్ని నిరంతర, సమగ్ర మూల్యాంకనంగా చెప్పవచ్చు.
* 'నిరంతరం' అంటే బోధన అభ్యసన ప్రక్రియలో ఏదో ఒక సంఘటనకో, సందర్భానికో పరిమితం కాకుండా అభ్యసనాంశాలు అన్నింటినీ ఎల్లప్పుడు పరిశీలించడం.
* పాఠశాల లోపల, వెలుపల, పిల్లల శారీరక, మానసిక వికాసాలను తరచుగా క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని తెలియకుండానే ఉపాధ్యాయుడు గమనించడం.
* 'సమగ్రం' అంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించింది. దీని అర్థం - శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో విద్యార్థుల అభివృద్ధి.
* పాఠ్య, పాఠ్యేతర అంశాలను విడివిడిగా చూడకుండా రెండు విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాప్రణాళిక పేర్కొంది. అంటే భాష, గణితం, పరిసరాల విజ్ఞానం లాంటి విషయాలతోపాటు కళలు, పని, ఆరోగ్యం, జీవన నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం.
* విద్యార్థుల సమగ్ర అభివృద్ధి: కేవలం పాఠ్యపుస్తకాల్లోని సమాచారం నేర్చుకోవడం మాత్రమే కాదు. పిల్లల్లో శారీరక, మానసిక ఉద్వేగ, సాంఘిక, సాంస్కృతిక వికాసాలు కలిగించడాన్నే సమగ్ర వికాసం అంటారు. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలన్నీ పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడేవిగా ఉండాలి. కాబట్టి మూల్యాంకనం కూడా సమగ్రతను కలిగి ఉండాలి.

నిరంతర సమగ్ర మూల్యాంకనం - లక్ష్యాలు

        "విద్యార్థుల భావిజీవితానికి అవసరమైన విశ్లేషణాత్మక, సృజనాత్మక, తార్కిక ఆలోచనశక్తి, స్వీయ క్రమశిక్షణ, సామాజికంగా సర్దుబాటు చేసుకోవడం, సమస్యల పట్ల సున్నితంగా ప్రతిస్పందించడం, పరిష్కరించుకోవడం మొదలైన జీవన నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందించడం పాఠశాల బాధ్యత" అని జాతీయ ప్రణాళిక చట్రం - 2005 పేర్కొంటోంది.
* అందుకే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థుల శారీరక, మానసిక ఉద్వేగ, సాంఘిక వికాసాలన్నింటిని సమాన ప్రాధాన్యతతో మదింపు చేయాలని నిర్దేశించారు.
లక్ష్యాలు: 1. బోధన అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం ఒక అంతర్భాగం.
         2. విద్యార్థుల్లో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక నైపుణ్యాలు పెంపొందించడం.
         3. బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేటట్లు చూడటం.
         4. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడం.
         5. బట్టీ పద్ధతి కాకుండా, విశ్లేషణాత్మక ఆలోచనలతో సరైన భావాలను వ్యక్తపరచేలా చేయడం.
      6. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎక్కడ వెనుకబడుతున్నారో తెలుసుకుని సవరణాత్మకంగా బోధించడం.
* నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల ఉపాధ్యాయుడు మరింత సమర్థంగా బోధనా ప్రణాళికలను రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
* వ్యక్తిగతంగా విద్యార్థుల బలాలు, బలహీనతలు, వారి అవసరాలు, ఆసక్తులను ఉపాధ్యాయుడు తెలుసుకుని, వారిలో సరైన అభిరుచులు, వైఖరులను గుర్తించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం చాలా తోడ్పడుతుంది.
* విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో మదింపు చేయాల్సిన అంశాలు 12 ఉన్నాయి. అవి... 1. భాష 2. గణితం 3. పరిసరాల విజ్ఞానం 4. విజ్ఞానశాస్త్రం 5. సాంఘికశాస్త్రం 6. కళా విద్య 7. ఆరోగ్య విద్య 8. వ్యాయామ విద్య 9. సంగీతం - నృత్యం 10. పని విద్య 11. సాంకేతిక విద్య 12. నైతిక విద్య.

మదింపు విధానాలు

1. నిర్మాణాత్మక మదింపు (Formative)
2. సంగ్రహణాత్మక మదింపు (Summative)
* నిర్మాణాత్మక మదింపు: బోధన అభ్యసన జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే విద్యార్థులు తమను తాము సరిచేసుకునే వీలు కల్పిస్తూ, వారికి పరిపుష్టి కలిగించడానికి తోడ్పడుతుంది.
* సంగ్రహణాత్మక మదింపు: బోధన అభ్యసన కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనను, సామర్థ్యాలను పరీక్షించే పద్ధతి ఇది.

అభ్యసనాన్ని మదింపు చేసే పద్ధతులు
    నిర్మాణాత్మక మదింపు      సంగ్రహణాత్మక మదింపు
1. అభ్యసనాన్ని మానిటరింగ్ చేస్తుంది 1. అభ్యసనంపై తీర్పు ఇస్తుంది.
2. సూక్ష్మస్థాయి పరిశీలన జరుపుతుంది 2. మొత్తంగా పరిశీలన జరుగుతుంది.
3. బోధనాభ్యాసన జరుగుతున్నప్పుడే విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలించవచ్చు 3. బోధనాభ్యసనం జరిగిన తర్వాత విడిగా విద్యార్థులు నేర్చుకున్న దానిపై పరిశీలన ఉంటుంది.
4. అభ్యసనను మెరుగుపరచుకోవడానికి నిరంతరం జరిగే ప్రక్రియ 4. అభ్యసనంలో చిట్టచివరిగా జరిగే ప్రక్రియ.
5. అభివృద్ధిపరచాల్సిన అంశాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 5. ఫలితం ఆధారంగా విద్యార్థులను అభినందించడానికి లేదా శిక్షించడానికి దోహదపడుతుంది.
6. ఉన్నతమైన ఫలితాల కోసం ప్రయత్నిస్తుంది. 6. ఇతరులతో పోటీపడటానికి ప్రాధాన్యం ఇస్తుంది.
7. విద్యార్థుల డైరీలు (diary), నోటు పుస్తకాలు మొదలైన సాధనాల ద్వారా మదింపు జరుగుతుంది. 7. పరీక్షల రూపంలో అమలవుతుంది.


 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌