• facebook
  • whatsapp
  • telegram

బోధనా ప్రణాళిక రచన

ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని ఆధారంగా చేసుకుని లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం సాధించాలంటే తగిన ప్రణాళిక అవసరం. మన అవసరాలను, సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్యసాధనకు అనువైన ప్రణాళికను రూపొందించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ప్రణాళికల వల్ల ఉపయోగాలు, వాటి నిర్వచనాలు, సూత్రాల గురించి తెలుసుకుందాం.
                బోధన - అభ్యసన ప్రక్రియలకు బోధన ప్రణాళిక రచన చాలా దోహదపడుతుంది. బోధన ప్రణాళిక రచనను అమలుపరచడం ద్వారా అభ్యాసకుల ప్రవర్తనలో ఆశించిన మార్పులను సాధించవచ్చు. ఆశించిన ప్రవర్తనా మార్పును అంచనా వేయడానికి ప్రణాళిక దోహదపడుతుంది. బోధన ప్రణాళికకు లక్ష్యాలు - స్పష్టీకరణలు మార్గదర్శకత్వం వహిస్తాయి.

 

బోధన ప్రణాళిక - భావన - నిర్వచనం
లక్ష్యం ఆధారంగా, విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రాతిపదికగా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులకు దోహదపడే పథకాన్ని 'బోధనా ప్రణాళిక' అంటారు.
'ఒక పీరియడ్‌లో కొన్ని కార్యక్రమాల ద్వారా తరగతిలో మనం పొందే ఫలితాల వివరణ పట్టిక' - చోసింగ్

 

బోధన ప్రణాళిక - లక్షణాలు
* ప్రణాళికలో స్పష్టత, కార్యాచరణతత్వం ఉండాలి.
* విద్యార్థి వికాసానికి దోహదపడే విధంగా ఉండాలి.
* లక్ష్యాలు - స్పష్టీకరణలు ప్రణాళికకు మూల అంశాలుగా ప్రస్ఫుటంగా ఉండాలి.
* బోధన - అభ్యసనలో వినియోగించే వనరులు, కృత్యాలను స్పష్టంగా పొందుపరచాలి.
* విద్యార్థులతో నిర్వహించే కృత్యాలు స్వాభావికంగా (సహజంగా) ఉండి, వారు ఆ కృత్యాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా ప్రణాళికను రచించాలి.
* విషయం తరగతి స్థాయిలో, ఉపాధ్యాయుల స్థాయిలో నిర్వహించడానికి వీలుగా ఉండాలి.

 

బోధన ప్రణాళిక - రకాలు
* వార్షిక ప్రణాళిక                                 
* యూనిట్ ప్రణాళిక                           
* పాఠ్యపథకం (లెసన్ ప్లాన్)

 

వార్షిక ప్రణాళిక (Annual plan)
ఒక విద్యా సంవత్సరం కోసం సిద్ధం చేసుకునే పథకాన్ని వార్షిక ప్రణాళిక అంటారు. ఒక విద్యా సంవత్సరంలో నిర్వహించే పాఠ్య, పాఠ్యేతర విషయాలు అన్నీ వార్షిక ప్రణాళికలో పొందుపరచి ఉంటాయి. తరగతి, విషయాలవారీగా పాఠశాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల సమాచారం వార్షిక ప్రణాళికలో ఉంటుంది.

 

తయారుచేసే విధానం:
* సాధించాల్సిన లక్ష్యాలు (యూనిట్‌వారీగా).

* సాంఘికశాస్త్ర బోధనకు కేటాయించిన పీరియడ్‌లు.
* బోధనకు కావాల్సిన వనరులు/ సామగ్రి.
* పరీక్షల నిర్వహణ తేదీలు.
* సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణ, తేదీలు.
* వెనుకబడిన విద్యార్థుల కోసం సవరణాత్మక బోధన చేయడానికి సమయం కేటాయింపు.

 

యూనిట్ ప్రణాళిక (Unit plan)
ఒక విషయం అర్థం చెడకుండా మొదలు, చివర కలిగి, ఒక పద్ధతి ప్రకారం విభజించి ఉంటే దాన్ని యూనిట్
అంటారు. యూనిట్‌లో ఒక అంశానికి సంబంధించి అనేక ఉప అంశాలు ఉంటాయి.
యూనిట్-భావన: ఒక సబ్జెక్టుకు సంబంధించిన విషయాల్ని కొన్ని విస్తృతమైన భాగాలుగా విభజిస్తారు. ఇలా విభజించిన ఒక్కొక్క భాగాన్ని 'ఒక యూనిట్' అంటారు.
ఈ యూనిట్‌లు తార్కిక క్రమంలో ఉండి, యూనిట్‌కు యూనిట్‌కు మధ్య చక్కని అంతర సహసంబంధాన్ని కలిగి ఉంటాయి. బోధనను సులభతరం చేయడానికి పాఠ్యపుస్తకంలోని విషయాన్ని కొన్ని యూనిట్‌లుగా, యూనిట్‌ను కొన్ని సబ్ యూనిట్‌లుగా విభజిస్తారు.
ఉదా: 8వ తరగతి సాంఘికశాస్త్రంలో భూగోళశాస్త్ర విభాగంలో 3వ యూనిట్ 'ఆంధ్రప్రదేశ్ - భూగోళశాస్త్రం' అనే పాఠ్యాంశాన్ని (సబ్జెక్టు) అనేక విస్తృత విభాగాలుగా/ ఉప అంశాలుగా (సబ్ యూనిట్‌లు) విభజించారు. అవి 
1) నైసర్గిక మండలాలు - నదులు, 2) ఆంధ్రప్రదేశ్ - శీతోష్ణస్థితి, 3) వరదలు- కరవు కాటకాలు మొదలైనవి.

 

యూనిట్ ప్రణాళిక - నిర్వచనాలు
వార్షిక పథకం తయారుచేసిన తర్వాత అందులో ఉన్న ప్రతి యూనిట్‌ను బోధించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించుకోవాలి. దీన్నే యూనిట్ పథకం అంటారు.
సాంఘికశాస్త్రంలో ప్రతి అంశానికీ(Unit) ఒక పథకాన్ని రూపొందించాలి. దీన్నే అంశ పథకం/ యూనిట్ పథకం అంటారు.
'పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయమే యూనిట్'. - ప్రెస్టన్
'చాలా జాగ్రత్తగా ఎంపికచేసి, విద్యార్థుల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి
వేరుచేసిన విషయ భాగ బాహ్యరూపమే యూనిట్'. - సామ్‌ఫర్డ్                          

 

యూనిట్ ప్రణాళిక అమలులోని దశలు
* సన్నాహం/ ప్రేరణ
* పూర్వ జ్ఞానం తెలుసుకోవడం
* ప్రదర్శన
* అభ్యసన నిర్వహణ
* సంగ్రహ పర్చడం
* పునఃశ్చరణ       
* మూల్యాంకనం                                                       

 

పాఠ్యపథకం (పీరియడ్ ప్రణాళిక)
బోధనను సులభతరం, అర్థవంతం చేయడానికి ప్రతి యూనిట్‌ను కొన్ని ఉప యూనిట్‌లుగా విభజిస్తారు. ఉప యూనిట్‌లోని విషయ విశ్లేషణ అంశాలను, అందులోని సారాంశాన్ని గ్రహించగలిగే విధంగా ఒక్కొక్క చిన్న భాగాన్ని ఒక్కో పీరియడ్‌లో బోధించాలి. ఇలా ఒక పీరియడ్‌లో బోధించాలని నిశ్చయించిన లేదా రూపొందించిన పథకాన్ని పాఠ్యపథకం అంటారు.
    పాఠ్యపథకం అంటే 'ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించాల్సిన విధానాన్ని తెలిపే ప్రక్రియ'. తరగతిలో ఉపాధ్యాయుడు ఒక పీరియడ్‌లో విషయ విశ్లేషణకు సంబంధించిన సామర్థ్యాలు సాధించడానికి విద్యార్థులు నిర్వహించే కృత్యాలు, కావాల్సిన బోధనాభ్యసన సామగ్రి, విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలు ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఉన్న పథకాన్ని 'పీరియడ్/ పాఠ్యపథకం' అంటారు.

 

పాఠ్యపథకం - నిర్వచనాలు
* 'తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే' పాఠ్యపథకం. -ఎల్.బి. స్టాండ్
* 'లక్ష్యాల వివరణ, విషయసామగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానం, నిశ్చయాలు కలిగిందే పాఠ్యపథకం'. - బైనింగ్ & బైనింగ్
* 'ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్వహించే బోధన అభ్యసన కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలు, ఆ ఫలితాల సాధనకు ఎంచుకునే మార్గాలు, తదితరాలను విశదీకరించే పథకమే పాఠ్యపథకం'.  - చోసింగ్

* 'ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్యపథకాన్ని తయారు చేసుకుంటాడు కానీ పాఠ్యపథకానికి బానిస కాడు'. - ఆర్.ఎల్.ఎన్. స్టీవెన్‌సన్
 

పాఠ్యపథకం - రూపకల్పన
పాఠ్యపథకం తయారు చేయడానికి ప్రధానంగా 4 అంశాలు దోహదపడతాయి.
* బోధనాలక్ష్యాలు- స్పష్టీకరణలు
* బోధన- అభ్యసన కృత్యాలు
* బోధనోపకరణాలు
¤ మూల్యాంకన అంశాలు.
ఉపాధ్యాయుడి లక్ష్యం విద్యార్థిలో పరిపూర్ణ వికాసం సాధించడం. కాబట్టి పాఠ్యపథకం ద్వారా విద్యార్థిలో ఆశించిన ప్రవర్తనా మార్పులను సాధించవచ్చు.  విద్యార్థిలో నిబిడీకృతంగా ఉన్న శక్తులను వెలికితీయడానికి క్రమపద్ధతిలో పొందుపరచిన విషయ అనుభవాల
నిర్మాణ అంశాలను (పాఠ్యాంశం - దాని ఉప అంశాలు) తరగతిలో పాఠ్యపథకం ద్వారా అమలుచేస్తారు.

 

పాఠ్యపథకం - హెర్బర్ట్ సోపానాలు
పాఠ్యపథకం రూపొందించడంలో హెర్బర్ట్ అనే విద్యాతత్త్వవేత్త వివిధ దశలు/ సోపానాలను విశదీకరించాడు. అందుకే వీటిని హెర్బార్షియన్ సోపానాలు అంటారు.
* ప్రేరణ (Preparation)
* ప్రదర్శన (Presatation)
* సంసర్గం/ పోలిక (Comparison)
* వినియోగం (Application)
* పునర్విమర్శ (Recapitulation)

 

ప్రయోజనాలు:
* బోధనా లక్ష్యాలపై అవగాహన కలిగిస్తుంది. 
* పాఠ్యాంశాన్ని ఒక క్రమపద్ధతిలో ప్రదర్శించడానికి తోడ్పడుతుంది.
* విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించి నూతన విషయాన్ని వారికి అందిస్తుంది.
* సమయం వృథాకాకుండా చూస్తుంది.
* విద్యార్థుల వికాసాన్ని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతుంది.
* వైయక్తిక భేదాలకు తగినట్టుగా కృత్యాలు సిద్ధం చేసుకోవడానికి సహయపడుతుంది.

Posted Date : 26-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు