• facebook
  • whatsapp
  • telegram

మన నివాసం

          టెట్-1 'పరిసరాల విజ్ఞానం' సిలబస్‌లో సైన్స్ అంశాలైన 'గాలి, నీరు, ఆవాసం, మొక్కలు-జంతువులు' పాఠ్యాంశాల నుంచి 7వ తరగతి స్థాయిలో రెండు నుంచి అయిదు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విషయాన్ని గమనించి పరీక్షార్థులు 7వ తరగతి పాత సిలబస్‌ను చదవాలి. సిమెంట్ తయారీ, గాలిలోని వాయువుల పరిమాణం, నీటి సంఘటనం, పుష్పం భాగాలు లాంటి అంశాలు తెలుసుకుందాం.
          సిమెంట్ పాలిపోయిన ఆకుపచ్చ రంగులో ఉండే మెత్తటిపొడి. ఇది గట్టిపడినప్పుడు పోర్ట్‌లాండ్ రాయిని పోలి ఉంటుంది. అందుకే దీన్ని 'పోర్ట్‌లాండ్ సిమెంట్' అంటారు.
సిమెంట్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు: సున్నపురాయి, బంకమట్టి.
* అయిదువంతుల సున్నపుపొడిని, ఒకవంతు బంకమట్టితో కలిపి, ఈ మిశ్రమాన్ని మెత్తటి పొడిగా చేస్తారు. ఈ ప్రక్రియను 'పల్వరైజేషన్' అంటారు. పల్వరైజ్ అయిన మిశ్రమాన్ని 1800°C వరకు వేడి చేస్తారు.
* సున్నానికి, బంకమట్టికి మధ్య జరిగే రసాయన చర్యవల్ల బూడిదరంగులో ఉండే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ గట్టి ముద్దలుగా ఏర్పడతాయి. వీటిని 'క్లింకర్స్' అంటారు. ఈ క్లింకర్స్‌ను చల్లబరిచి దానికి 2 నుంచి 3 శాతం జిప్సం కలిపి మెత్తటి పొడిగా చేస్తారు. ఈ పొడినే 'సిమెంట్' అంటారు.
* కట్టుబడి సున్నం: ఈ సున్నం తయారీలో పొడిసున్నం, ఇసుక, నీరు ఉపయోగిస్తారు. దీన్నే 'మోర్టార్' అని కూడా అంటారు.
* ఇటుకల తయారీ: ఇటుకల తయారీలో నల్లమట్టిని, పెంకుల తయారీలో బంకమట్టిని ఉపయోగిస్తారు.
కాంక్రీట్: దీని తయారీలో సిమెంట్, ఇసుక, చిన్నచిన్న రాళ్లు, నీరు ఉపయోగిస్తారు. ఇది సిమెంట్, కట్టుబడి సున్నం కంటే గట్టిగా ఉంటుంది.
* రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్: కాంక్రీట్, ఇనుపచువ్వల కలయికతో తయారవుతుంది. ఇది కాంక్రీట్ కంటే గట్టిగా ఉంటుంది.

గాలి
 

* భూ ఉపరితలం నుంచి గాలి దాదాపు 1000 కి.మీ. ఎత్తువరకు వ్యాపించి ఉంది. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయుమండలాన్నే 'వాతావరణం' అంటారు.
* గాలిలో నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, హీలియం, నియాన్, ఆర్గాన్, నీటి ఆవిరి ఉంటాయి.
* నత్రజని 78%, ఆక్సిజన్ 21%, నీటి ఆవిరి 1.6%, CO2  0.03%, ఆర్గాన్ 0.9%, ఇతరాలు 0.07%.
* ఇంధనాలు మండించడం వల్ల, పారిశ్రామిక ప్రదేశాలు/ పరిసరాల్లోని గాలిలో CO2  ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. భూమిపై కొన్ని ప్రదేశాల్లో CO2  ఎక్కువగా వెలువడుతుంది.
ఉదా: జావాలోని మృత్యులోయ (Death valley), నేపూల్స్ - గ్రొటెడెల్ కేవ్.
* వృక్ష సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లోని గాలిలోని CO2 పరిమాణం సమతౌల్యంగా ఉంటుంది.
నత్రజని: లెగ్యుమినేసి మొక్కలు ఉన్న ప్రాంతాల్లో గాలిలోని నైట్రోజన్ పరిమాణం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ మొక్కల వేరు బుడిపెల్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను నైట్రేట్‌ల రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయి.
* మానవులు, జంతువుల విసర్జకాలు, కళేబరాలు ఉన్న ప్రదేశంలో గాలిలో నైట్రోజన్ అధికంగా ఉంటుంది.
నీటి ఆవిరి: సముద్రతీర ప్రాంతాల్లో ఎక్కువగా, పీఠభూమి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటి మంచు, పొగమంచు ఏర్పడతాయి.
* గాలిలోని అంశీభూతాల పరిమాణాలు ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంటాయి.
వాతావరణ పీడనం: గాలి భూ ఉపరితలంపై కలిగించే పీడనాన్ని 'వాతావరణ పీడనం' అంటారు. వాతావరణ పీడనాన్ని 'భారమితి/ బారోమీటర్‌'తో కొలుస్తారు. పాదరస భారమితి/ తొట్టి భారమితిని టారిసెల్లి అనే శాస్త్రవేత్త నిర్మించాడు. ఈ భారమితిలో 1 మీ. పొడవు, 1 సెం.మీ. వ్యాసం ఉన్న గాజుగొట్టం ఉంటాయి.
* తొట్టి భారమితిలో పాదరస స్తంభంపై ఉన్న శూన్యప్రదేశాన్ని టారిసెల్లి శూన్యప్రదేశం అంటారు.
పాదరస స్తంభం ఎత్తు: 76 cm/ 760 mm/ 7.6 m గా ఉంటుంది.
* సముద్రమట్టం వద్ద 'సాధారణ వాతావరణ పీడనం' 76 సెం.మీ. ఈ 76 సెం.మీ. ఎత్తున ఉన్న పాదరస స్తంభం బరువును ఆపగలిగిన పీడనాన్ని వాతావరణం ప్రదర్శిస్తుంది. అందుకే పాదరస స్తంభం పొడవును వాతావరణ పీడనం తెలియజేయడానికి ఉపయోగిస్తారు.
భారమితి ఉపయోగాలు: భారమితి సహాయంతో వాతావరణ పీడనాన్ని కనుక్కోవచ్చు. సముద్రమట్టం నుంచి ఏదైనా ప్రదేశం ఎంత ఎత్తులో లేదా ఎంత లోతులో ఉందో తెలుసుకోవచ్చు.
* సముద్రమట్టం నుంచి ప్రతి 272.7 మీ. ఎత్తుకు వెళ్లేకొద్ది 2.54 సెం.మీ. పీడనం తగ్గుతుంది. అలాగే ప్రతి 272.7 మీ. లోతుకు వెళ్లే కొద్ది 2.54 సెం.మీ. పీడనం పెరుగుతుంది.
* వాతావరణ పీడనాన్ని బట్టి వర్షం లేదా తుపాను రాక గురించి తెలుసుకోవచ్చు. పాదరస మట్టం నిదానంగా తగ్గడం రాబోయే వర్షాన్ని సూచిస్తుంది. పాదరస మట్టం హఠాత్తుగా తగ్గిపోయినా/ పడిపోయినా అది తుపాను రాకకు సంకేతం.

నీటి సంఘటనం
 

* నీరు మూలకం కాదు, ఇది ఒక సమ్మేళనం. నీటి సంయోగ స్థితిలో 'హైడ్రోజన్, ఆక్సిజన్' అనే రెండు మూలకాలు ఉంటాయి. నీటిని ఏర్పరచడానికి హైడ్రోజన్, ఆక్సిజన్‌లు సంయోగం చెందే నిష్పత్తిని 'నీటి సంఘటనం' అంటారు.
* మూలకాల ఘనపరిమాణంలో సంఘటనాన్ని తెలిపితే దాన్ని 'ఆయతన సంఘటనం' అంటారు.
* నీటి ఘనపరిమాణాత్మక సంఘటనంలో హైడ్రోజన్, ఆక్సిజన్‌ల నిష్పత్తి 2 : 1.
* రెండు ఘనపరిమాణాల హైడ్రోజన్, ఒక ఘనపరిమాణ ఆక్సిజన్‌తో సంయోగం చెంది, రెండు ఘనపరిమాణాల నీటిని ఏర్పరుస్తుంది. 2H2 + O 2H2O
* హైడ్రోజన్, ఆక్సిజన్ ఒక స్థిర నిష్పత్తిలో సంయోగం చెంది నీటిని ఏర్పరుస్తాయి.
* నీటికి విద్యుత్‌వాహకత చాలా తక్కువ, దీన్ని పెంచడానికి నీటికి సాధారణ ఉప్పు లేదా కొద్దిగా క్షారాన్ని కలుపుతారు.
* నీటి ద్వారా విద్యుత్‌ను పంపి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులుగా విడదీసే ప్రక్రియను 'విద్యుత్ విశ్లేషణ' అంటారు.
ఇందులో కాథోడ్ (+) వద్ద O2 వాయువు తక్కువ పరిమాణంలో ఏర్పడుతుంది.

పుష్పం - భాగాలు

        మొక్క భాగాల్లో మన దృష్టిని ఆకర్షించేది పుష్పం. పువ్వు/ పుష్పం ఆధార భాగంలో ఉండే కాడని 'పుష్ప వృంతం' అంటారు. వృంతం మీద ఉబ్బినట్లు ఉండే భాగమే పుష్పాసనం. పుష్పంలోని భాగాలు పుష్పాసనం మీద నాలుగు వలయాల్లో ఒకదానిలోపల ఒకటి అమరి ఉంటాయి. అవి:
        1. రక్షక పత్రావళి 
        2. ఆకర్షణ పత్రావళి
        3. కేసరావళి 
        4. అండకోశం.

1. రక్షక పత్రావళి (Calyx): ఇది బయటి వలయం. దీనిలో ఆకుపచ్చని ఆకులా ఉండే 5 రక్షక పత్రాలుంటాయి. వీటినే రక్షక పత్రావళి అంటారు. ఉమ్మెత్త పువ్వులోని రక్షక పత్రాలన్నీ కలిసి ఒక గొట్టంలా ఏర్పడతాయి. రక్షకపత్రాలు లోపలి భాగాలను రక్షిస్తాయి.
 

2. ఆకర్షణ పత్రావళి (Corolla): ఇవి అయిదు. తెలుపు రంగులో ఉంటాయి. ఇవన్నీ కలిసి గొట్టంలా ఏర్పడతాయి. భిన్న వర్ణాలతో, సువాసనతో ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి.
 

3. కేసరావళి (Androecium): ఇవి ఆకర్షణ పత్రావళి లోపలి సన్నంగా, పొడుగ్గా ఉండే నిర్మాణాలు. ఇవి 5 ఉంటాయి. ఇవి కొంతమేర ఆకర్షణ పత్రావళిని అంటుకుని ఉంటాయి. ఇవి పువ్వులోని పురుషబీజ అవయవాలు.
* ప్రతి కేసరంలో రెండు భాగాలుంటాయి. పొడవుగా కాడలా ఉండే భాగం - కేసరదండం. కేసరదండం చివర వెడల్పుగా ఉండేది - పరాగకోశం.
* పరాగకోశాలు పరిపక్వం చెందినప్పుడు వాటిలో పుప్పొడి లేదా పరాగరేణువులు తయారవుతాయి. పరాగరేణువులు పురుష బీజకణాలు. ఇవి ఫలదీకరణలో, విత్తనాలు ఏర్పరడంలో సహాయపడతాయి.

 

4. అండకోశం (Gynoecium): పుష్పంలోని నాలుగో వలయం. ఇది స్త్రీబీజ అవయవం. ఆధారభాగంలో ఉబ్బి ఉండే భాగాన్ని - అండాశయం అంటారు. అండాశయం నుంచి బయలుదేరే పొడవైన నాళాన్ని కీలం అంటారు. కీలం చివర విశాలంగా ఉండే భాగాన్ని 'కీలాగ్రం' అంటారు.
అండాశయం లోపల ఉన్న రేణువుల లాంటి నిర్మాణాలను అండాలు అంటారు. అండాలు స్త్రీబీజ కణాలు. ఫలదీకరణం చెందిన తర్వాత అవి విత్తనాలుగా మారతాయి.

 

ఆవశ్యక భాగాలు: కేసరావళి, అండకోశం. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే వీటిని 'ఆవశ్యక భాగాలు' అంటారు.
 

అనావశ్యక భాగాలు: రక్షకపత్రావళి, ఆకర్షణ పత్రావళి. ఇవి ఆవశ్యక భాగాలను రక్షిస్తూ, పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షిస్తాయి.
* పుష్పంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడానికి గాలి, నీరు, కీటకాలు, జంతువులు సహాయపడతాయి.

 

* గాలి ద్వారా పరాగ సంపర్కం: ఈ మొక్కలకు ఉదాహరణ మొక్కజొన్న, వరి, గోధుమ, గడ్డిమొక్కలు. వీటిలో కీటకాలను ఆకర్షించడానికి సువాసన కానీ, రంగు కానీ ఉండదు. పరాగరేణువులు తేలికగా, చిన్నవిగా ఉండి గాలికి కొట్టుకుపోతాయి. ఈ మొక్కల్లో చాలా ఎక్కువ సంఖ్యలో పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి.
 

* నీటి ద్వారా పరాగ సంపర్కం: నీటిలో మునిగి ఉండే వాలిస్‌నేరియా, హైడ్రిల్లా లాంటి మొక్కల్లో పరాగసంపర్కం నీటి ద్వారా జరుగుతుంది. స్త్రీ పుష్పాలకి ఉండే పొడవైన కాడ వల్ల అవి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. పురుష పుష్పాలు గుత్తులు, గుత్తులుగా ఉంటాయి. ఇవి పరిపక్వం చెందిన తర్వాత గుత్తుల నుంచి విడిపోయి నీటి మీద తేలుతూ స్త్రీ పుష్పాల కీలాగ్రాన్ని చేరతాయి.
* జంతువుల ద్వారా పరాగ సంపర్కం: పక్షులు, నత్తలు, ఉడతలు, గబ్బిలాలు పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. పక్షుల వల్ల పరాగ సంపర్కం జరిగే మొక్కల్లో పుష్పాలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి.

* కీటకాల వల్ల పరాగ సంపర్కం: పుష్పాలు కీటకాలను అనేకరకాలుగా ఆకర్షిస్తాయి. గులాబి పువ్వు - పుప్పొడిని, పిటూనియా - తేనెను కీటకాలకు ఆహారంగా ఇస్తాయి. రాత్రివేళ వికసించే - నైట్‌క్వీన్, మల్లి సువాసనని వెదజల్లి - తేనెటీగలు/ సీతాకోకచిలుకలు /మాత్‌లను ఆకర్షిస్తాయి.
* కీటకాలు ఆహారం, రంగు, సువాసనల వల్ల ఆకర్షణకు గురై పుష్పాలమీద వాలినప్పుడు పరాగరేణువులు కీటకాల శరీరానికి అంటుకుంటాయి. అవి ఇతర పుష్పాలపై వాలినప్పుడు ఆ పరాగ రేణువులు వేరే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరతాయి.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌