• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

తెలుగు వ్యాకరణంలో ఛందస్సుకున్న ప్రాముఖ్యం ఎనలేనిది. యతి స్థానం, ప్రాస నియమాలు, గణాల సూత్రాల గురించి నేర్చుకుంటే ఛందస్సు మీద పట్టు సాధించవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే వాక్యాల నిర్మాణంలో పలు భేదాలు ఉన్నాయి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త, సందేహాత్మక వాక్యాలను నిత్యం ప్రయోగిస్తుంటాం. ఛందస్సు, అలంకారాల్లో రకాలు, ప్రకృతి-వికృతులు, వాక్యనిర్మాణం గురించి తెలుసుకుందాం...
 

ఛందస్సు
           వేదాంగాల్లో ఛందస్సు ఒకటి. పద్య కవిత్వానికి ప్రాణం ఛందస్సు. పద్య లక్షణాలను ఇది తెలియజేస్తుంది. నాలుగు పాదాల పద్యం గణాల మీద ఆధారపడి ఉంటుంది. అక్షరాల లఘు, గురువులతో గణాలు ఏర్పడతాయి. గురువును ' U ' తోనూ, లఘువును ' l ' తోనూ సూచిస్తారు.

 

గురు, లఘువులు
* దీర్ఘం ఉన్నవి.
* సంయుక్త, ద్విత్వాక్షరాలకు ముందున్నవి.
* సున్నా, విసర్గ (ః)లతో కూడినవి.
* పొల్లు హల్లులతో ఉన్నవి (లన్) గురువులు.
* మిగిలిన వాటిని లఘువులు అంటారు.
               గురు, లఘువులతో గణాలు ఏర్పడతాయి.
* రామ - U l - 'గల'.
* రమా - l U - లగ (వ).
* రామా - U U - గగ - అనేవి రెండక్షరాల గణాలు. మూడక్షరాల గణాలే పద్యాలకు ముఖ్యం. అవి ...
* భగణం - U l l - రాముడు
* జగణం - l U l - విశాల
* సగణం - l l U - సుమతీ
* యగణం - l U U - రమేశా
* రగణం - U l U - వీక్షణా
* తగణం - U U l - శ్రీరామ
* మగణం - U U U  - శ్రీరామా
* నగణం - l l l - కమల
* నల ( l l l l ), నగ ( l l l U ) లాంటి నాలుగక్షరాల గణాలు కూడా ఉన్నాయి.

యతి, ప్రాస
పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని 'యతి' అంటారు.
* యతికి విరతి, వళి, విరామం, విశ్రామ అనే పేర్లున్నాయి.
* మొదటి అక్షరానికి సరిపడే - నియమిత స్థానంలో ఉన్న అక్షరాన్ని 'యతిస్థానం' అంటారు.
* పద్యపాదంలో రెండో అక్షరాన్ని 'ప్రాస' అని అంటారు.
* నాలుగు పాదాల్లోను రెండో అక్షరంలోని హల్లు సమానంగా ఉంటే ప్రాసనియమం ఉందని అంటారు.
* వృత్త పద్యాలకు ప్రాస నియమం ఉంటుంది.
* యతిస్థానంలో ఉన్న అక్షరం తర్వాతి అక్షరానికి ప్రాస అక్షరంతో కలిపి వేయడాన్ని 'ప్రాసయతి' అంటారు.

 
* సూర్య గణాలు - గల (U l) న (l l l)
* ఇంద్రగణాలు - నల ( l l l l ), నగ ( l l l U ), సల ( l l U l ), భ ( U l l ), ర (U l U), త (U U l).

 

వాక్యం
అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యం.
*  ప్రౌఢ వ్యాకరణం రాసిన బహుజనపల్లి సీతారామాచార్యులు 'యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఉన్న పద సముదాయం వాక్యం' అన్నారు.
* చిన్నయసూరి బాలవ్యాకరణంలో లేని 'వాక్యపరిచ్చేదం' ప్రౌఢవ్యాకరణంలో ఉంది.
* 'తెలుగు వాక్యం' అనే పుస్తకాన్ని రాసిన చేకూరి రామారావు తెలుగు వాక్య నిర్మాణ విశేషాలను బాగా వివరించారు.
* సామాన్యంగా సంపూర్ణ వాక్యం, అసంపూర్ణ వాక్యం అని వాక్యం రెండు రకాలు.
* సమాపక క్రియ (సంపూర్ణ భావం) ఉన్నది సంపూర్ణ వాక్యం.
ఉదా: రాముడు భోజనం చేశాడు.
* అసమాపకక్రియ ఉన్నది అసంపూర్ణ వాక్యం.
ఉదా: రాముడు భోజనం చేసి...
* వాక్యం సామాన్యంగా కర్త, కర్మ, క్రియ అనే వరుస క్రమంలో ఉంటుంది.
* ఒక్కొక్కసారి (ముఖ్యంగా కవిత్వంలో) ఈ వరుస పాటించరు.

 

వాక్యనిర్మాణం - భేదాలు
వాక్యంలో చాలా భేదాలున్నాయి. భావాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి ఈ భేదాలు ఏర్పడ్డాయి.
* నిశ్చయార్థక వాక్యం: శ్రీరాముడు కోసల దేశపు రాజు.
* ప్రశ్నార్థక వాక్యం: నువ్వు పుస్తకం కొన్నావా?
* ఆశ్చర్యార్థక వాక్యం: ఆ శిల్పం ఎంత బాగుందో!
* సందేహార్థక వాక్యం: ఆమె ఎందుకు నవ్వుతోందో!
* విధ్యర్థక వాక్యం: మీరు మా ఇంటికి రావాలి.
* ప్రత్యక్షానుకృతి వాక్యం: 'నేను రాను' అని అతడన్నాడు.
* పరోక్షానుకృతి వాక్యం: తను రానని అతడన్నాడు.
* క్రియారహిత వాక్యం: ఆమె వైద్యురాలు.
* సామాన్య వాక్యం: నాకు ఆకలిగా ఉంది.
* సంశ్లిష్ట వాక్యం: అతడు అన్నం తిని బడికి వెళ్లాడు.
* సంయుక్త వాక్యం: అతడు ధనవంతుడు, కానీ డబ్బు ఖర్చు చేయడు.
* హేత్వర్థక వాక్యం: అతడికి జ్వరం వచ్చి పరీక్షలు రాయలేదు.
* కర్తరి వాక్యం: రాముడు రాక్షసులను సంహరించాడు.
* కర్మణి వాక్యం: రాక్షసులు రామునిచే సంహరింపబడిరి.
* శత్రర్థక వాక్యం: అతడు కాఫీ తాగుతూ చదువుతున్నాడు.
* చేదర్థకవాక్యం: కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది.
* నామ్నీకరణ వాక్యం: 'స్వానుభవం వల్ల ఈ జీవితసత్యం నేర్చుకున్నాను' - దీనికి నామ్నీకరణ వాక్యం ఇలా ఉంటుంది...'ఇది స్వానుభవం వల్ల నేర్చుకున్న జీవిత సత్యం'.

 అలంకారాలు

అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని రెండు రకాలు.
* శబ్దానికి ప్రాధాన్యం ఉన్న శ్రవణానంద కారకాలు శబ్దాలంకారాలు.
* అర్థానికి (భావానికి) ప్రాధాన్యం ఉన్నవి అర్థాలంకారాలు.

 

శబ్దాలంకారాలు
కొన్ని ముఖ్యమైన శబ్దాలంకారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్త్యనుప్రాస: ఒకే హల్లు అనేక సార్లు రావడం, వచ్చిన హల్లు మళ్లీమళ్లీ రావడం.
ఉదా: అడుగులు తడబడ బుడుతడు నడిచెను.
అంత్యానుప్రాస: పాదాల చివరకానీ, పదాల చివరకానీ వచ్చిన అక్షరమే మళ్లీ మళ్లీ రావడం.
ఉదా: భాగవతమున భక్తి
        భారతమున యుక్తి
        రామకథయే రక్తి

 

లాటానుప్రాస: అర్థభేదం, శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంట వెంటనే రావడం.
ఉదా: కమలాక్షునర్చించు కరములు కరములు.

 

అర్థాలంకారాలు

ఉపమాలంకారం:
పోలిక ఉన్నది. ఉపమాన, ఉపమేయాలకు రమణీయమైన పోలికను వర్ణించడం.
ఉదా: ఆమె ముఖము చంద్రబింబమువలె మనోహరంగా ఉంది.

 

ఉత్ప్రేక్షాలంకారం: ఊహ ప్రధానమైంది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం.
ఉదా: ఈ చీకటి చక్రవాకములయొక్క విరహాగ్ని ధూమంగా తలచుచున్నాను.

 

రూపకాలంకారం: ఉపమేయ, ఉపమానాలకు తద్రూప్యవర్ణన ఉన్నది. భేదమున్నా లేనట్లు వర్ణించడం.
ఉదా: సంసారసాగరమును ఈదుట మిక్కిలి కష్టం.

 

అతిశయోక్తి అలంకారం: సహజస్థితిని మించి అతిగా గొప్పగా చెప్పడం.
ఉదా: ఆ పురమునందలి మేడలు ఆకాశమును తాకుచున్నవి.

 

శ్లేషాలంకారం: అనేకార్థములను ఇచ్చే పదాలను ప్రయోగించడం.
ఉదా: ఆ రాజు కువలయానందకరుడు.

 

అర్థాంతరన్యాస అలంకారం: సామాన్యమైన విషయాన్ని విశేషంతో లేదా విశేషమైన విషయాన్ని సామాన్యంతో సమర్థించడం.
ఉదా: హనుమంతుడు సముద్రమును దాటెను.
         మహాత్ములకు సాధ్యముకానిది లేదు కదా!

 

ప్రకృతి - వికృతులు
సంస్కృతం, ప్రాకృతాల నుంచి కొద్ది మార్పులతో తెలుగులోకి వచ్చిన వాటిని తత్సమాలు అంటారు. ఇవి ప్రకృతులు.
* సంస్కృత, ప్రాకృతాల నుంచి మార్పులు చెంది ఏర్పడిన వాటిని తద్భవాలు అంటారు. స్థూలంగా వీటిని వికృతులు అని చెప్పవచ్చు.

ప్ర‌కృతి వికృతి
అగ్ని అగ్గి
అట‌వి అడ‌వి
ఉపాధ్యాయుడు‌ ఒజ్జ
కార్య‌ము   క‌ర్జ‌ము
కుడ్య‌ము ‌ గోడ
గౌర‌వం   గార‌వం
దిశ దెస‌
దీపం   దివ్వె
వృథ్వి   పుడ‌మి
భోజ‌నం  బోనం
ముఖం   మొగం, మోము
విద్య విద్దె
య‌ముడు జముడు
మృగం మెకం
భ‌క్తి బ‌త్తి
చంద్రుడు చందురుడు
ప్ర‌యాణం ప‌య‌నం
యాత్ర  జాత‌ర
రాత్రి రాతిరి, రేయి
రూపం రూపు
శ్రీ సిరి
వంశం వంగ‌డం
స్నేహ‌ము నెయ్య‌ము
కుమారుడు కొమ‌రుడు

పార్ట్ - 2

         పద్య, గేయ లక్షణాలను గురించి చెప్పే శాస్త్రం ఛందశ్శాస్త్రం. గురు లఘువుల కలయికతో గణాలు, కొన్ని గణాల కలయికతో పద్యాలు ఏర్పడుతున్నాయి.
                                       గురువు గుర్తు - ∪
                                       లఘువు గుర్తు - I
                   ఒక మాత్ర కాలంలో పలికేది లఘువు - I
                   రెండు మాత్రల కాలంలో పలికేది గురువు - ∪
                   మాత్ర అంటే ఒక క్షణంలో - నాలుగో భాగం


గురువులను గుర్తించే విధానం
* దీర్ఘాచ్చులన్నీ గురువులు. ఉదా:  ఆ - ఈ - ఊ - ౠ -  - ఏ - ఓ
* దీర్ఘాక్షరాలన్నీ (హల్లులు) గురువులు. ఉదా:  కా - కీ - కూ - క్రూ - కే - కో
                                                                                            ∪    ∪        
* పూర్ణ బిందువు (సున్న)తో కూడి ఉన్న అక్షరాలు. ఉదా:  అం - కం
                                                         ∪    ∪
* విసర్గతో కూడిన అక్షరాలు. ఉదా: అః,  కః   
                                                                  ∪          ∪
*  పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు. ఉదా: వారిన్, మునుల్
                                                                    ∪    ∪
* సంయుక్తాక్షరాలకు వెనుక ఉన్నవి. ఉదా: కర్త,  కర్మ
                                                                              ∪        ∪
* ద్విత్వాక్షరాలకు వెనుక ఉన్న అక్షరాలు. ఉదా: అన్న, చిన్న
                                                                     ∪    ∪     ∪   ∪
* ఐ-ఔలు, వాటితో కూడిన అక్షరాలు. ఉదా: ఐ,   ఔ,   కై,   కౌ

 

లఘువులను గుర్తించే విధానం
* హ్రస్వాచ్చులన్నీ లఘువులు. ఉదా: అ - ఇ - ఉ - ఋ - ఎ - ఒ
* హ్రస్వాక్షరాలన్నీ లఘువులే. ఉదా: క - కి - కు - కొ
                                                             I      I 
* ఋకారంతో కూడిన అక్షరాలు. ఉదా: కృ,  దృ
* సంయుక్తాక్షరానికి ముందు అచ్చును ఊది పలికితేనే గురువు అవుతుంది.
                                                                      I    I 
     ఊది పలకపోతే అది లఘువు. ఉదా: వానికి  శ్వాస ఆడడం లేదు.
                                                                         I               I
* తేల్చిపడే రేఫ ముందున్న అక్షరాలు. ఉదా: అద్రుచు, విద్రుచు

గణాలు - భేదాలు
గణంలోని అక్షర సంఖ్యను బట్టి గణాలను 4 విధాలుగా చెప్పవచ్చు.
1. ఏకాక్షర గణాలు: ఒకే అక్షరం ఉన్న గణాలు ఏకాక్షర గణాలు. ఇందులో ఒక గురువు లేదా ఒక లఘువు ఉంటుంది. అదే గణం అవుతుంది.
             1. గ - U - శ్రీ 'గ' గణం
             2. ల - l - ల 'ల' గణం
2. ద్వ్యక్షర గణాలు: రేండేసి అక్షరాలున్న గణాలు ద్వ్యక్షరగణాలు అవి నాలుగు.
            ఒక గురువు, ఒక లఘువు లేదా ఒక లఘువు, ఒక గురువు; రెండు గురువులు లేదా రెండు లఘువులు ఉంటాయి. ఇలా నాలుగు గణాలు ద్వ్యక్షర గణాల్లో ఉంటాయి.
       3. త్య్రక్షరగణాలు: మూడేసి అక్షరాలున్న గణాలు త్య్రక్షర గణాలు. మూడక్షరాల్లోనూ ఒక అక్షరం లఘువని చెబుతుంటే మిగిలిన రెండక్షరాలు గురువులు కావచ్చు. అలాగే ఒక అక్షరం గురువని చెబుతుంటే మిగిలినవి లఘువులు కావచ్చు. ఇవి ఎనిమిది.
       

చతురక్షర గణాలు: నాలుగక్షరాలున్న గణాలను చతురక్షర గణాలు అంటారు. మూడక్షరాల గణాల మీద ఒక లఘువు లేదా గురువు ఏర్పడితే చతురక్షర గణాలు ఏర్పడతాయి. ఇవి మూడు
                 
                                                                ఉపగణాలు
        ఇంద్ర గణాలు ఆరింటిని, సూర్యగణాలు రెండింటిని- ఈ ఎనిమిదింటిని ఉపగణాలంటారు.
ఇంద్రగణాలు: ఇంద్రగణాలు ఆరు, అవి: నల-నగ-సల-భ-ర-త
            1. నలము            (నగణము + లఘువు)       -    l l l l 
            2. నగము             (నగణము + గురువు)        -    l l l U
            3. సలము           (సగణము + లఘువు)       -    l l U l
            4. భగణము                                                 -    U l l       
            5 రగణము                                                  -    U l U  
            6 తగణము                                                 -    U U l
సూర్యగణాలు: సూర్యగణాలు-(2)
            1. నగణము   -   l l l                 
            2. హగణము/ గలము   -    U l    
యతి-ప్రాసలు: ఛందో పురుషుడికి యతి ప్రాసలు ఉచ్ఛ్వాస - నిశ్వాసాలవంటివి.
            యతి: ¤ పద్యపాదంలోని మొదటి అక్షరం - యతి
                      ¤ యతికి విశ్రాంతి, విశ్రమం, విరతి అనేవి పర్యాయపదాలు.
                      ¤ యతికి అచ్చు, దాని నిర్ణీత వర్ణాలు ప్రధానం
                      ¤ పద్యంలోని ప్రతి పాదం మొదటి అక్షరంతో సమానమైన అక్షరం పద్య మిశ్రమ స్థానంలో రావడాన్ని 'యతి మైత్రి' అంటారు.
            ప్రాస: ¤ పద్య పాదంలోని రెండో అక్షరం - ప్రాస
                     ¤ ప్రాసకి హల్లు, హల్లుపైన హ్రస్వ, దీర్ఘాచ్చులు ప్రధానం

            ఉదా:  శ్రీరాముని దయచేతను
                      నారూఢిగ సకల జనులు నౌరా యనగా
                      ధారాళమైన నీతులు
                      నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ!
ప్రాసయతి: ప్రాసయతి అంటే ప్రాసాక్షర స్థానంలో యతి. పద్యపాదంలో రెండో అక్షరం ప్రాస. ఈ రెండో అక్షరానికి యతిస్థానంలోని అక్షరానికి పక్కన ఉన్న అక్షరంతో యతికూరిస్తే దాని 'ప్రాసయతి' అంటారు.
               న              భ                 ర          హ          హ
              l l l            U l l      U l U     U l        U l        
ఉదా:  అనుచు      గ్రమ్మఱు        వేళనీ         హార        వారి
               న               త                 త             న         హ
             l l l         U U l      U U l          l l l       U l
            బెరసి        తత్పాద         లేపంబు       గరగి     పోయె
              న                భ               నగ             న           న
            l l l         U l l            l l l U       l l l        l l l 
            గరగి        పోవుట      యెఱుగడ        ద్ధరణి     సురుడు
              హ             నల                నగ         హ         న
             U l         l l l l           l l l U      U l        l l l 
             దైవ       కృతమున        కిలన సా    ధ్యంబు    గలదె

నాలుగు పాదాల్లో యతి కింది విధంగా ఉంది.
           పాదం 1.     -    హా
                     2. బె  -   గ
                     3. గ   -   ద్ధ
                     4. దై    -   ధ్య
1, 4 పాదాల్లో యతిని, 2, 3 పాదాల్లో ప్రాసయతిని కూర్చాడు కవి.
 అంతః ప్రాస‌: పాదం మధ్యలో వచ్చే ప్రాస. అంతః ప్రాస‌.
                              
గజల్, రుబాయిల్లో అంత్య ప్రాసకు పూర్వమున్న శబ్దం కూడా ప్రాసబద్ధంగా కనిపిస్తుంది. ప్రపంచపదులో కవి సి.నారాయణరెడ్డి ''ను పాటించారు.
     

వృత్తాలు

             నిసర్గ గణాలతో ఏర్పడేవి వృత్త పద్యాలు. ఇవి 'మార్గ'రచనకు చెందినవి. వృత్తంలో అక్షర గణాలుంటాయి. అంటే ప్రతిపాదంలోనూ గురు లఘువుల వరుస ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. యతి ప్రాసలుంటాయి
1. ఉత్పలమాల: 1. ఇది వృత్త జాతి పద్యం
                        2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
                        3. ప్రతిపాదంలో భ - ర - న - భ - భ - ర - వ అనే గణాలుంటాయి.
                        4. యతిస్థానం - పదో అక్షరం
                        5. ప్రాస నియమం ఉంటుంది.
ఉదా:                నావిని సత్యభామ వదనంబున లేనగవంకురింపనే
                        మేవ చియింప బూను హృదయేశ్వరునింగర సంజ్ఞ మాన్చి చ
                        న్గ్రేవల జాఱు కొంగు సవరించుచు వీడిన కొప్పు బల్మఱుం
                        జేవెడ దోపుచుం బలికె జెందొవ చూపులు క్రేళ్లుదాటగన్
               భ         ర             న             భ             భ              ర       వ
          U l l        U l U          l l l         U l l             U l l           U l U     l U 
ఉదా:   నావిని      సత్యభా      మవద    నంబున      లేనగ        వంకురిం     పనే

యతి: 'నా-నం'- పదో అక్షరం
ప్రాసాక్షరాలు: వి,  వ,  వ,  వె (వరుసగా నాలుగు పాదాల్లోని రెండో అక్షరాలివి)
2. చంపకమాల: లక్షణాలు
                       1. ఈ పద్యం వృత్త జాతికి చెందింది.
                       2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
                       3. ప్రతిపాదంలో న-జ-భ-జ-జ-జ-ర గణాలుంటాయి.
                       4. యతిస్థానం- 11వ అక్షరం
                       5. ప్రాస నియమం ఉంటుంది
ఉదా:               జలరుహ నాభుడిట్లు రభసంబున నందన పారిజాతముం
                       బలిమి బెకల్చి యెత్త, విటపంబుల వ్రేలు దుకూల పల్లవం
                       బులవడి బట్టి యీడ్చుగొని పోవగ నీక పెనంగు లీల గ
                       ల్పల తిక లెల్ల; వల్లభలు ప్రాణ విభుం బెడబాయనేర్తురే?
ఈ పద్యంలోని కింది పాదాన్ని పరిశీలించండి.
                          న            జ               భ          జ         జ            జ           ర
                         l l l          l U l           U l l         l U l       l U l        l U l          U l U
                       లరు       హనాభు      డిట్లుర    భసంబు     ననంద      నపారి       జాతముం

యతి: జ - సం (11వ అక్షరం)
ప్రాసాక్షరాలు: ల-లి-ల-ల
3. మత్తేభము - లక్షణాలు
                    1. ఇది వృత్తజాతి పద్యం
                    2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
                    3. ప్రతిపాదంలో స-భ-ర-న-మ-య-వ గణాలుంటాయి.
                    4. యతిస్థానం - 14వ అక్షరం
                    5. ప్రాస నియమం ఉంటుంది.
ఉదా:          సులోకాభిమత ప్రధాన సమతా సూయన్బలెం కంసఘ
                    స్మరు డ త్యుద్ధతిఁబారిజాత ధరణీ జాతంబు గోవర్థనో
                    ద్ధణ ప్రస్తుతమైన హస్తమున నుత్పాటించి లీలాగతిన్
                    గరుడ స్కంధము మీద నిల్పి నిలిపెం గౌతూహలంబింతికిన్
                        స            భ              ర      న          మ          య           వ
                      l l U        U l l          U l U     l l l         U U U       l U U       l U
                    సురలో       కాబిమ       తప్రథా      నసమ    తాసూయ   న్పలెంగం   సఘ (స్మ)

       (స్మ అనేది రెండో పాదం మొదట ఉంది. నిజానికి 'ఘస్మరుడు' అనేది పదం. అందువల్ల 'ఘ' గురువయింది.)
యతి: సు-సూ (14వ అక్షరం)
ప్రాసాక్షరాలు: ర - రు - ర - రు
4. శార్దూలం - లక్షణాలు:
                    1. ఇది వృత్త జాతి పద్యం
                    2. ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి
                    3. ప్రతి పాదంలో మ - స - జ -స - త - త - గ గణాలుంటాయి.
                    4. యతి 13వ అక్షరం
                    5. ప్రాస నియమం ఉంటుంది.
ఉదా:            ఆ మందాకినియా త్రివేణి వ‌ల‌నం బాబాహ్య క‌క్ష్యా స్థ‌లం
                    బాధ్యాంతర కక్ష్యలా విమల దివ్యజ్యోతిరుజ్జృంభణ
                    శ్రీ ద్వీశ్వపతీ శ లింగము మదిం జింతింప కాశీ మహా
                    గ్రామంబిప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారముంగైకొనున్.
                      మ         స              జ         స             త             త         గ
                  U U U      l l U           l U          l l U        U U l         U U l      U
                     మందా    కినియా      త్రివేణి        వలనం     బాబాహ్య    కక్ష్యాస్థ      లం

యతి: ఆ - బా (13వ అక్షరం)
ప్రాసాక్షరాలు: మం -మ - మ - మం. (నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరాలు ఇవి)
జాతులు
              జాతులు, ఉపజాతుల్లో మాత్రాగణాలుంటాయి. అంటే మాత్రల సంఖ్యకే ప్రాధాన్యం. గురు లఘువులు ఒకే క్రమంలో ఉండవలసిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక పాదంలో నాలుగు ఇంద్రగణాలు ఉండవచ్చు అనుకుందాం. ఇంద్రగణాలయిన నల-నగ-సల-భ-ర-త లలో ఏవైనా, ఏ వరసలోనైనా రావచ్చు. ఒకేగణం నాలుగుసార్లు కూడా రావచ్చు.
              వృత్తాల్లాగానే జాతుల్లో యతి ప్రాసలుంటాయి.
కంద పద్య లక్షణం:
              1. నాలుగు పాదాలుంటాయి. మొదటి రెండు పాదాలు ఒక భాగంగా తరువాత రెండు పాదాలు ఒక భాగంగా ఉంటాయి.
              ఒక్కో భాగంలో మొదటి పాదంలో 3 గణాలు, రెండో పాదంలో 5 గణాలు మొత్తం 8 గణాలుంటాయి.
              2. నల-గగ-భ-జ-స అనే గణాలుంటాయి.
              3. చతుర్మాత్రా గణాలు గల పద్యం
              4. రెండు-నాలుగు పాదాల చివరి అక్షరం గురువై ఉంటుంది.
              5. ఆరో గణం 'నల' లేదా 'జ' గణం అయి ఉంటుంది.       
              6. బేసి గణం జగణంగా ఉండకూడదు (1 - 3 - 5 - 7 గణాలు)
              7. రెండు - నాలుగు పాదాల్లో 1 - 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది.
              8. ప్రాస నియమం ఉంటుంది.

                      

            పై పద్యంలోని రెండు భాగాల్లో ఎనిమిదేసి గణాలున్నాయి. అవి నల-గగ-భ-జ-స అనే గణాల్లోనివే. ఆరో గణం రెండు భాగాల్లోనూ జగణంగా ఉంది. రెండు భాగాల చివరా గురువే (యుం, యై) ఉంది. 1357 గణాల్లో ఎక్కడా జగణం లేదు. రెండు, నాలుగు పాదాల్లో యతి చెల్లింది. నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం 'న' కాబట్టి ప్రాస కూడా చెల్లింది.
 

ద్విపద - లక్షణాలు

1. ద్విపద రెండు పాదాలున్న పద్యం
2. ఇది జాతి పద్యం. గానయోగ్యమైంది.
3. ప్రతిపాదంలో వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి.
4. మూడో గణం మొదటి అక్షరం యతిస్థానంగా ఉంటుంది.
5. ప్రాస నియమం ఉంటుంది.
                            త             సల                నగ           హ
       ఉదా:        U U l         l l U l             l l l U    U l
                        గర్వించి      తనుదివ్వ     డగియే     తెంచు
                            త           నగ             నగ           హ
                        U U l         l l l U          l l l U          U l
                           నుర్వీశు    బలములా    హుతులుగా  మ్రింగి

1. పై ద్విపద పద్యం రెండు పాదాలు కలిగి ఉంది.
2. ప్రతి పాదంలో 3 ఇంద్ర గణాలు, 1 సూర్యగణం ఉన్నాయి.
3. మూడో గణం మొదటి అక్షరం యతి.  గ - గ
                                                         ఉ - హు
4. ప్రాసనియమం ఉంది. ప్రాసాక్షరాలు = ర్వి - ర్వీ)

 

ఉపజాతులు
¤ జాతుల ఆధారంగా ఏర్పడినవి ఉపజాతులు
¤ ఉపజాతి పద్యాల్లో కూడా మాత్రాగణాలుంటాయి. కానీ, ప్రాసనియమం ఉండదు.
¤ ఉపజాతుల్లో యతికి బదులు ప్రాసయతి చెల్లింపవచ్చు.
¤ యతిప్రాసల చెల్లింపులో వచ్చిన భేదం తప్ప జాతులకు, ఉపజాతులకు వేరే భేదమేమీ లేదు.

 

ఉపజాతి పద్యాలివే:
¤ ఆటవెలది
¤ తేటగీతి
¤ సీసము
¤ మంజరీద్విపద

ఆటవెలది - లక్షణాలు:
¤ ఇది ఉపజాతికి చెందింది.
¤ ఇందులో నాలుగు పాదాలుంటాయి.
¤ 1-3 పాదాలు ఒక విధంగా, 2-4 పాదాలు ఒక విధంగా ఉంటాయి.
¤ 1-3 పాదాల్లో 3 సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు; 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి.
¤ 1-4 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రిని పాటిస్తారు.
¤ ప్రాసయతి చెల్లుతుంది.
¤ ఇందులో ప్రాస నియమం లేదు.
                   న             న             హ          త           ర
ఉదా:          l l l           l l l            U l         U U l        U l U
                 గయ        కలిగె          నేని       పామున్న  యింటిలో
                  U l           U l              U l         U l           U l
                  హ        హ               హ         హ            హ
                   నున్న      యట్ల           కాక        యూఱ        డిల్లి

         పైపద్యంలో మొదటిపాదంలో మొదటి మూడు గణాలు సూర్యగణాలు. తర్వాతి రెండు గణాలు ఇంద్రగణాలు. రెండోపాదంలో అయిదేసి సూర్యగణాలున్నాయి.
          మొదటి పాదంలో మొదటి గణం మొదటి అక్షరం 'ప'కు, నాలుగో గణం మొదటి అక్షరం 'పా'కు యతి చెల్లింది.

 

తేటగీతి-లక్షణాలు
¤ తేటగీతి పద్యం ఉపజాతికి చెందింది.
¤ ఇందులో 4 పాదాలుంటాయి.
¤ ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు మొత్తం 5 గణాలుంటాయి.
¤ మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.
¤ ప్రాస నియమం లేదు.
¤ ప్రాసయతి కూడా చెల్లుతుంది.
ఉదా:   న                భ             ర          హ           హ
           l l l            U l l           U l U       U l          U l
           నుచు     గ్రమ్మఱు       వేళనీ        హార        వారి
               న               త               త        న          హ
             l l l            U U l           U U l       l l l        U l
             బెరసి        తత్పాద        లేపంబు       గరగి     పోయె

                న            భ            నగ               న       న
              l l l          U l l          l l l U              l l l       l l l
             గరగి        పోవుట       యెఱుగడ        ద్ధరణి    సురుడు
               

                హ               నల                   నగ          హ               న
 
            
            పై పద్యంలో 4 పాదాల్లోనూ ఒక్కో పాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉన్నాయి. నాలుగు పాదాల్లో యతి కిందివిధంగా ఉంది.
పాదం:   1: అ - హా
            2: బె - గ
            3: గ - ద్ధ
            4: దై - ధ్య
            1, 4 పాదాల్లో యతిని, 2, 3 పాదాల్లో ప్రాసయతిని కూర్చాడు కవి. ప్రాస యతి అంటే ప్రాసాక్షర స్థానంలో యతి, పద్యపాదంలో రెండో అక్షరం ప్రాస. ఈ రెండో అక్షరానికి యతిస్థానంలోని అక్షరానికి పక్కన ఉన్న అక్షరంతో యతికూరిస్తే దాన్ని ప్రాసయతి అంటారు.

సీస పద్యం - లక్షణాలు
      ఇది ఉపజాతికి చెందిన పద్యం
¤ ప్రతి పాదంలోనూ 6 ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి. అంటే పాదానికి మొత్తం 8 గణాలు.
¤ ఒక్కో పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి, రెండు భాగాలు చేయవచ్చు.
¤ మొదటి భాగంలో 1 - 3 గణాల తొలి అక్షరాలకు, రెండో భాగంలో 5 - 7 గణాల తొలి అక్షరాలకు యతి చెల్లుతుంది.
¤ ప్రాస యతి కూడా చెల్లుతుంది.
¤ ప్రాస నియమం లేదు
¤ సీస పద్యం తర్వాత దానికి తోడుగా, తేటగీతి పద్యం లేదా ఆటవెలది పద్యం చేర్చాలి. అప్పుడే పద్యం పూర్తవుతుంది.
                   నగ                నగ                      త                  ర
ఉదా:       l l l U             l l l U             U U l          U l U
             రులుకో        కిలములై       చ్చోట        కూయునో
                   త                సల           న             హ
              U U l              l l U l            l l l            U l
              చ్చోట           మధుమాస    వత        రించు
              పై పద్యపాదంలోనే 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలున్నాయి. 1-3, 5-7 గణాల తొలి అక్షరాలకు విడివిడిగా యతి చెల్లింది.
                                                                                               

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌