• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం-సంధులు

పూర్వ, పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడాన్ని 'సంధి' అంటారు. స్వరం అంటే అచ్చు. ఏకాదేశమంటే రెండింటి స్థానంలో ఒకటి రావడం. 
*  'అ - ఇ - ఋ' లకు సవర్ణాచ్చులు పరమైతే వరసగా వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దీన్నే 'సవర్ణదీర్ఘ సంధి' అంటారు.
ఉదా: రామ + ఆలయం = రామాలయం;        పరమ + అర్థం = పరమార్థం;  
          కవి + ఇంద్ర = కవీంద్ర;                        భాను + ఉదయం = భానూదయం
         మాతృ + ఋణం = మాతౄణం 

 

*  అకారానికి 'ఇ-ఉ-ఋ' లు పరమైతే వరసగా ఏ, ఓ, అర్‌లు ఏకాదేశమవుతాయి. ఏ, ఓ, అర్ లను 'గుణాలు' అంటారు. కాబట్టి ఇది 'గుణ సంధి'
ఉదా: ధర్మ + ఇంద్ర = ధర్మేంద్ర;                 పర + ఉపకారం = పరోపకారం
         మహా + ఋషి = మహర్షి;                 సప్త + ఋషులు = సప్తర్షులు 

 

* అకారానికి ఏ, ఐలు గానీ, ఓ, ఔలు గానీ పరమైతే వరసగా ఐకారం, ఔకారం ఏకాదేశమవుతాయి. ఐ, ఔలను 'వృద్ధులు' అంటారు. కాబట్టి ఇది 'వృద్ధిసంధి'.

ఉదా:  ప్రథమ + ఏక = ప్రథమైక;                 దివ్య + ఐశ్వర్యం = దివ్యైశ్వర్యం
         గృహ + ఓషధి = గృహౌషధి;              దివ్య + ఔషధం = దివ్యౌషధం 

 

* 'ఇ - ఉ - ఋ'లకు అసవర్ణాచ్చులు (సమానంకానివి) పరమైతే వరసగా 'య - వ - ర' లు ఆదేశంగా వస్తాయి. యవరలను 'యణ్ణులు' అంటారు. కాబట్టి ఇది 'యణాదేశసంధి'.
ఉదా:  అతి + ఉన్నతం = అత్యున్నతం;           అభి + ఉదయం = అభ్యుదయం
         గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ;                       పితృ + అంశం = పిత్రంశం 

 

* 'కచటతప' లకు న, మ, లు పరమైతే ఆయా వర్గాలకు చెందిన అనునాసికాలు ఆదేశంగా (ఒక్కోసారి వికల్పంగా) వస్తాయి. నాసిక సహాయంతో పలికేవి అనునాసికాలు. కాబట్టి దీన్ని 'అనునాసిక సంధి' అంటారు.
'ఞ, ఙ, ణ, న, మ' లు వర్గ పంచమాక్షరాలు. ఇవి అనునాసికాలు.
ఉదా: వాక్ + మయం = వాఙ్మయం;               జగత్ + నాటకం = జగన్నాటకం
         రాట్ + మణి = రాణ్మణి;                        చిత్ + మయం = చిన్మయం
         వాక్ + నియమం = వ్నాయమం;          అప్ + మయం = అమ్మయం
         వాక్ + మహిమ = వాఙ్మహిమ

 

మరికొన్ని సంధులు
దిక్ + అంతం = దిగంతం - జశ్త్వ సంధి;   జగత్ + హితం = జగద్ధితం - జశ్త్వ సంధి
సత్ + చిత్   = సచ్చిత్ - శ్చుత్వ సంధి;   తత్ + చక్రం = తచ్చక్రం - శ్చుత్వ సంధి
శిరః + రత్నం = శిరోరత్నం - విసర్గ సంధి;   అంతః + ఆత్మ = అంతరాత్మ - విసర్గ సంధి
చతుః + ఆన = చతురాన - విసర్గ సంధి;    తపః + శాంతి = తపశ్శాంతి - విసర్గ సంధి
మనః + తాపం = మనస్తాపం - విసర్గసంధి; 
* ఉత్తునకు అచ్చుపరమైతే సంధి వస్తుంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం.  దీన్ని 'ఉకార సంధి' లేదా 'ఉత్వ సంధి' అంటారు.
ఉదా: ఇట్లు + అనియె = ఇట్లనియె
          రాముడు + అతడు = రాముడతడు
          మనసు + ఐన = మనసైన

 

*  అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. అత్తు అంటే హ్రస్వమైన అకారం. బహుళం అంటే సంధి జరగడం, సంధి జరగకపోవడం, విభాషగా జరగడం, వేరొకవిధంగా జరగడం. దీన్నే 'అకార సంధి' లేదా 'అత్వ సంధి' అంటారు.
ఉదా: మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు 
         పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టిల్లు
   రెండో రూపం యడాగమసంధి. అకారసంధి రాకపోవడం వల్ల ఏర్పడింది.
  అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను. అకారసంధి జరగకపోవడం వల్ల యడాగమం వచ్చింది.
* ఇదేవిధంగా వెల + ఆలు = వెలాలు కావాలి. కానీ, వెలయాలు అవుతుంది.
* ప్రథమ మీది పరుషాలకు గసడదవలు వస్తాయి.
* ద్వంద్వసమాసంలో కూడా ఇది జరుగుతుంది. దీన్ని గసడదవా దేశసంధి అంటారు. పరుషాలు అంటే కచటతపలు.
ఉదా: సంగరము + చేయు = సంగరము సేయు;   వాడు + చెప్పె = వాడుసెప్పె
నదులు + త్రావవు = నదులు ద్రావవు;  ఆపదల్ + పోడము = ఆపదవ్వొడము 

 

* కర్మధారయాల్లో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. పేర్వాది శబ్దాలకు విభాషగా వస్తుంది. ఇది 'టుగాగమ సంధి'. కర్మధారయ అంటే విశేషణ విశేష్యాలు ఉండేది.
ఉదా:  నిగ్గు + అద్దం = నిగ్గుటద్దం 
          వేల్పు + ఆవు = వేల్పుటావు
          చిగురు + ఆకు = చిగురుటాకు = చిగురాకు (సంధిరాకపోతే) 

 

* పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే 'రు' ఆగమంగా వస్తుంది. కర్మధారయంలో తత్సమ శబ్దాలకు అకారం ఉకారంగా మారి 'రు' వస్తుంది. దీన్ని 'రుగాగమ సంధి' అంటారు. ఇక్కడ 'ఆలు' అంటే స్త్రీ అని అర్థం.
ఉదా: పేద + ఆలు = పేదరాలు;                          బీద + ఆలు = బీదరాలు 
         గుణవంత + ఆలు = గుణవంతురాలు;         ధీమంత + ఆలు = ధీమంతురాలు
       ఆగమం అంటే మిత్రుడిలా అదనంగా చేరడం. వర్ణాధిక్యం. 

 

* ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళాలు వస్తాయి. ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి. ద్రుతం అంటే నకారం. అక్కరలేనప్పుడు లోపించేది. ద్రుత ప్రకృతికం అంటే ద్రుతం చివర ఉండే పదాలు.
  సరళాలు అంటే గజడదబలు. సంశ్లేష అంటే కూడిక. విభాష అంటే సంధి జరగడం లేదా జరగకపోవడం. బిందు అంటే సున్న లేదా అరసున్న.
ఉదా:  పూచెను + కలువలు = పూచెను + గలువలు 
                                          = పూచెఁగలువలు 
                                          = పూచెంగలువలు 
                                          = పూచెన్గలువలు.
దయన్ + చూచి = దయఁజూచి;       సంతోషమునన్ + పోయి = సంతోషమునంబోయి. 

 

*   కర్మధారయంలో మువర్ణకానికి పు, oపులు ఆదేశంగా రావడాన్ని 'పుంప్వాదేశ సంధి' అంటారు. ఆదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం శత్రువులా వచ్చేది.
ఉదా:  సరసము + వచనం = సరసపువచనం లేదా సరసంపువచనం
          పూర్వము + జన్మ   = పూర్వపుజన్మ 
           నీచము + దాస్యం  = నీచంపుదాస్యం
తమలము + ఆకు = తమలపాకు

 

*  అచ్చునకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి వస్తుంది. ఆమ్రేడితం అంటే ద్విరుక్తం యొక్క పరరూపం. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతంబైన ద్విరుక్తటకారం వస్తుంది. అదంతం అంటే అకారం అంతంలో ఉండేది. ఇది 'ఆమ్రేడిత సంధి'.
ఉదా:   ఔర + ఔర   = ఔరౌర                   
          ఏమి + ఏమి = ఏమేమి
           కడ + కడ   = కట్టకడ                   
          ఎదురు + ఎదురు = ఎట్టఎదురు
         తుద + తుద    = తుట్టతుద          
          నాడు + నాడు     = నానాడు 
           చెర + చెర      = చెచ్చెర.

 

*  ప్రాతాదుల తొలి అచ్చు తర్వాత ఉన్న వర్ణాలకు లోపం వస్తుంది. ఆ తర్వాత నుగాగమం, ద్విత్వాలు వస్తాయి. ఇది 'ప్రాతాదిసంధి'.
ఉదా: ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు
         లేత + దూడ = లేదూడ 
         మీదు + కడ = మీఁగడ 
         కెంపు + తామర = కెందామర 
          నెఱ + చెలి = నెచ్చెలి
         క్రొత్త + తావి = క్రొత్తావి 
         క్రొత్త + చాయ = క్రొంజాయ
         నెఱ + మది = నెమ్మది 
         నిండు + వెఱ = నివ్వెఱ
         క్రొత్త + నన = క్రొన్నన

 

* కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దాల్లోని ఱ - డ లకు అచ్చుపరమైతే ద్విరుక్తటకారం వస్తుంది. దీన్ని ద్విరుక్తటకార సంధి అంటారు.
రెండుసార్లు వచ్చేది, హల్లు కింద అదే హల్లు వచ్చేది ద్విరుక్తం.
ఉదా: కుఱు + ఉసురు = కుట్టుసురు
          చిఱు + అడవి = చిట్టడవి 
          కడు + ఎదురు = కట్టెదురు 
          నడు + ఇల్లు = నట్టిల్లు 
          నిడు + ఊర్పు = నిట్టూర్పు 

 

* ఆ, ఈ, ఏ సర్వనామాలను త్రికాలు అంటారు. త్రికం తర్వాత అసంయుక్త హల్లు ఉంటే ద్విత్వం బహుళంగా వస్తుంది. ద్విరుక్తమైన హల్లు పరమైతే ఆచ్ఛికమైన దీర్ఘానికి హ్రస్వం వస్తుంది. దీన్ని 'త్రికసంధి' అంటారు. యడాగమం కూడా వస్తే యడాగమ త్రికసంధి అంటారు.
ఉదా: ఆ + బాలుడు = అబ్బాలుడు 
         ఈ + కన్య = ఇక్కన్య 
         ఏ + చోటు = ఎచ్చోటు 
         ఏ + విధం = ఎవ్విధం 
         ఆ + తన్వి = అత్తన్వి      
         ఆ + అశ్వం = అయ్యశ్వం 
        
* నీ, నా, తన శబ్దాలకు ఉత్తర పదం పరమైతే 'దు' ఆగమంగా వస్తుంది. ఇది దుగాగమ సంధి. 
         నీ + కరుణ = నీదు కరుణ 
         నా + తనయ = నాదు తనయ 
         తన + రూపు = తనదు రూపు.

పార్ట్ - 2

           వ్యాకరణం అంటే వ్యాకృతి ఉన్నది. ఒక భాష శబ్దస్వరూప స్వభావాలను  వివరించేది, ఒక భాషలోని నియమ నిబంధనలను, సాధురూపాలను విశ్లేషించేది వ్యాకరణం. గ్రాంథిక భాషకి లేదా కావ్యభాషకి సంబంధించింది వ్యాకరణం. కావ్యప్రయోగాల ఆధారంగా వ్యాకరణం వెలువడుతుంది కాబట్టి ''ప్రయోగ మూలం వ్యాకరణం" అంటారు. కొన్ని ముఖ్యమైన తెలుగు,  సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం.
         తెలుగు భాషకి సంస్కృతంలో (నన్నయ రాసినట్టు చెప్పే) రాసిన ''ఆంధ్ర శబ్ద చింతామణి" మొదటి వ్యాకరణం. తెలుగు భాషలో రాసిన మొదటి వ్యాకరణంగా కేతన రాసిన ''ఆంధ్ర భాషాభూషణం"ను పేర్కొంటారు. ప్రాచీన కావ్యభాషకి నేటికీ ప్రామాణికంగా నిలిచింది చిన్నయసూరి రాసిన ''బాల వ్యాకరణం". బాలురు అంటే ధారణాపటుత్వం ఉన్న వారని భావం. బాల వ్యాకరణంలో పది పరిచ్ఛేదాలు (అధ్యాయాలు) ఉన్నాయి. అంతకుముందు చెప్పనివి, వివరించని వాటిని 'ప్రకీర్ణ పరిచ్ఛేదం' లో వెల్లడించారు. బాల వ్యాకరణానికి పూరకంగా బహుజనపల్లి సీతారామాచార్యులు ''పౌఢ వ్యాకరణం" రాశారు. దీనికి ''త్రిలింగ లక్షణ శేషము" అనే పేరుంది. బాల వ్యాకరణంలో లేని ''వాక్య పరిచ్ఛేదం" ప్రౌఢ వ్యాకరణంలో ఉంది. బాల వ్యాకరణంలోని విశేషాలను, చమత్కారాలను వివరిస్తూ దువ్వూరి వెంకటరమణశాస్త్రి ''రమణీయము" అనే మంచి వివరణాత్మక గ్రంథం రాశారు. బాల, ప్రౌఢ వ్యాకరణాలకు వంతరాం రామకృష్ణరావు వ్యాఖ్యానాలు రాశారు.

     ''బాల, ప్రౌఢ వ్యాకరణ సర్వస్వం" అనే పేరుతో రెండిటినీ పోల్చి స్ఫూర్తిశ్రీ విశిష్ట వ్యాఖ్యానం చేశారు. వడ్లమూడి గోపాలకృష్ణయ్య ''వ్యవహారికాంధ్ర భాషావ్యాకరణం" రాశారు. తెలుగు వ్యాకరణాలకు - ముఖ్యంగా బాల వ్యాకరణానికి పాణిని సంస్కృతంలో రాసిన ''అష్టాధ్యాయి" వ్యాకరణమే మూలం. దీనికే ''పాణినీయం" అనిపేరు.

 సంధులు

సంధి అనే పదానికి 'కలయిక అని అర్థం. స్వరాలు, హల్లులు కలవడమేకాకుండా రెండు పదాల కలయిక ఉంటుంది కాబట్టి దీన్ని 'సంధి అంటారు.
* ''పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంగా పరంబగుట" సంధి అన్నారు బాలవ్యాకర్త చిన్నయసూరి. స్వరం అంటే అచ్చు. పరం అంటే తర్వాతిది.
రాముడు + అతడు = రాముడతఁడు
ఉ + అ (పూర్వస్వరం ఉ + పరస్వరం అ) = 'అ' అయింది. ఏకాదేశం అంటే రెండిటి స్థానంలో ఒకటి రావడం.
* సంధుల్లో సంస్కృత సంధులు, తెలుగు సంధులు ఉన్నాయి. కేవలం తెలుగు పదాలకే వచ్చేవి తెలుగు సంధులు. సంస్కృత సంధుల్లో ముఖ్యమైనవి - సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి, అనునాసిక, యణాదేశ సంధులు. విసర్గ సంధులు కూడా తెలుసుకోవాలి.

 తెలుగు సంధుల్లో ఉకార సంధి, పుంప్వాదేశ, సరళాదేశ సంధులు, టుగాగమ, రుగాగమ సంధులు, త్రికసంధి, ఆమ్రేడిత సంధి, గసడదవాదేశ సంధి ముఖ్యమైనవి. సంధులపై ప్రశ్నలు కింది విధంగా వస్తాయి...
     ఊరు + ఎల్ల - కలపండి? 
     జ: ఊరెల్ల
     ఊరెల్ల - విడదీయండి?
     ఊరెల్ల - ఏ సంధి?
     జ: ఉకార (ఉత్వ సంధి)
సూచన: (సూత్రాలు అడగరని గుర్తుంచుకోవాలి. కానీ సూత్రాలపై అవగాహన అవసరం).
సవర్ణదీర్ఘ సంధి: ''అ, ఇ, ఉ, ఋ"లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా రావడం సవర్ణదీర్ఘ సంధి అవుతుంది. సవర్ణం అంటే ఉచ్ఛారణలో ఇంచుమించుగా సమానమైంది.
అ - ఆ; ఇ - ఈ; ఉ - ఊ లు సవర్ణాలు.
  ఉదాహరణ: పరమ + అర్థము = పరమార్థము
                    రామ + ఆలయము = రామాలయము
                    కవి + ఈశ్వర = కవీశ్వర
                     సు + ఉక్తి = సూక్తి
                     మాతృ+ ఋణం = మాతౄణం

గుణ సంధి: గుణములు అంటే ''ఏ, ఓ, అర్‌"లు. ''ఇ, ఉ, ఋ"ల స్థానంలో ఇవి వస్తాయి కాబట్టి దీన్ని గుణసంధి అంటారు.
 ఉదాహరణ: దేవ + ఇంద్ర = దేవేంద్ర
                   పరమ + ఈశ్వర = పరమేశ్వర
                   లోక + ఉక్తి = లోకోక్తి
                   దేవ + ఋషి = దేవర్షి
వృద్ధి సంధి: ''ఐ, ఔ" లను వృద్ధులు అంటారు. అకారానికి ఏ, ఐలు లేదా ఓ, ఔలు పరమైతే వచ్చేది వృద్ధి సంధి.
 ఉదాహరణ: పరమ + ఏక = పరమైక
                   శివ + ఐక్యం = శివైక్యం
                   దివ్య + ఔషధం = దివ్యౌషధం
                   దివ్య + ఓషధి = దివ్యౌషధి
యణాదేశ సంధి: యణ్ణులు - య, వ, ర - ఆదేశంగా వస్తాయి కాబట్టి యణాదేశ సంధి అంటారు. ఇ - ఉ - ఋల స్థానంలో వస్తాయి. ఆదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం శత్రువులా వచ్చి చేరేది.
ఉదాహరణ: అతి + అంత = అత్యంత
                  సు + ఆగతం = స్వాగతం
                  గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ
                  మాతృ + అంశం = మాత్రంశం

* వర్గ పంచమాక్షరాలైన వాటిని అనునాసికాలు అంటారు. న, మలు పరమైనప్పుడు అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. నాసికను అనుసరించి పలికేవి అనునాసికాలు.
 ఉదాహరణ: వాక్ + మయం = వాఞ్మయం
                   జగత్ + నాటకం = జగన్నాటకం
                  తత్ + మిథ్య = తన్మిథ్య
                  రాట్ + మూర్తి = రాణ్మూర్తి
* విసర్గ సంధులకి ఉదాహరణలు:
మనః + శక్తి = మనశ్శక్తి
తపః + ధనం = తపోధనం
ధనుః + టంకారం = ధనుష్ఠంకారం
చతుః + ముఖ = చతుర్ముఖ
అయః + మయం = అయోమయం

తెలుగు సంధులు

ఉకార సంధి: తెలుగు సంధుల్లో తేలికైంది ఉకార సంధి. 'ఉత్తు' అంటే హ్రస్వమైన ఉకారం.
ఉదాహరణ: ఇట్లు + అనియె = ఇట్లనియె
                   జగము + ఎల్ల = జగమెల్ల
 అకార సంధి: అకార సంధి బహుళంగా వస్తుంది. అంటే వ్యాకరణ కార్యం నాలుగు విధాలుగా జరుగుతుంది. నిత్యం, వికల్పం, నిషేధం, అన్యవిధం!
ఉదాహరణ: సీత + అమ్మ = సీతమ్మ
                  మే + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు
                   ఒక + ఒక = ఒకానొక
ఆమ్రేడిత సంధి: ఆమ్రేడితం అంటే ఒకమాట రెండుసార్లు వచ్చినప్పుడు రెండోది. అచ్చుకి ఆమ్రేడితం పరమైతే ఆమ్రేడిత సంధి అవుతుంది.
ఉదాహరణ: ఔర + ఔర = ఔరౌర
                  ఎక్కడ + ఎక్కడ = ఎక్కడెక్కడ
                  చెర + చెర = చెచ్చెర
                  అదుకు + అదుకు = అందదుకు

* కర్మధారయ సమాసంలో ''ముకి" బదులుగా పు, ంపు" లు వస్తే పుంప్వాదేశం. విశేష్య విశేషణాలు ఉన్నది కర్మధారయ సమాసం అవుతుంది.

 ఉదాహరణ: సరసము + వచనం = సరసపువచనం,  సరసంపువచనం
                   చుట్టము + మేరువు = చుట్టపుమేరువు
                   రక్తము + పోటు = రక్తపుపోటు
గసడదవాదేశ సంధి: 'కచటతప'లు పరుషాలు. వీటి స్థానంలో ఆదేశంగా 'గసడదవ' వస్తాయి కాబట్టి గసడదవాదేశ సంధి అంటారు. ఇది బహుళంగా
వస్తుంది. ద్వంద్వ సమాసంలో నిత్యంగా వస్తుంది.
ఉదాహరణ: సంగరము + చేయు = సంగరముసేయు
                  నది + పోలె = నదివోలె
                  బుద్ధి + చెప్పు = బుద్ధిసెప్ప
                  కాలు + చేతులు = కాలుసేతులు
                  కూర + కాయలు = కూరగాయలు
                  రాక + పోకలు = రాకవోకలు
                  అన్న + తమ్ములు = అన్నదమ్ములు

* 'గజడదబ'లు సరళాలు. ఇవి పరుషాల స్థానంలో ఆదేశంగా వస్తాయి. ద్రుత ప్రకృతికం ఉన్నప్పుడు వస్తాయి. ద్రుతానికి బిందు సంశ్లేషలు కూడా వస్తాయి. ద్రుతం అంటే అక్కరలేనప్పుడు లోపించేది (జారిపోయేది). నకారాన్ని 'ద్రుతం' అంటారు. ద్రుతం చివర ఉన్న వాటిని ద్రుత ప్రకృతికాలు అంటారు. 'విభాష' అంటే సంధి ఒకసారి రావడం, వేరొకసారి రాకుండా ఉండటం. బిందువు అంటే సున్న, అరసున్న, సంశ్లేష అంటే కలయిక.

ఉదాహరణ: పూచెను + కలువలు = పూచెనుగలవలు
                                                           పూచెఁగలువలు
                                                           పూచెంగలువలు
                                                           పూచెన్గలువలు
* ఈ కింది ఉదాహరణల లాంటివే సామాన్యంగా వస్తాయి.
* తలన్ + తాల్చి = తలఁదాల్చి, తలందాల్చి
* దయన్ + చేసి = దయఁజేసి
* నడువన్ + తగు = నడువందగు
* సఖ్యమున్ + చూపు = సఖ్యముఁజూపు

* ఆగమం అంటే వర్ణాధిక్యం. ఒక వర్ణం అదనంగా మిత్రుడిలా చేరడాన్ని ఆగమం అంటారు. రుగాగమ సంధి పేద, బీద లాంటి శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే వస్తుంది. తత్సమ పదాలకైతే అత్వానికి ఉత్వంతోపాటు రుగాగమం వస్తుంది. తత్సమం అంటే సంస్కృత ప్రాకృత పదాలతో సమానమైన పదం. తెలుగులోకి పెద్ద మార్పులేమీ లేకుండా సంస్కృత, ప్రాకృత భాషల నుంచి ప్రవేశించిన వాటిని తత్సమ పదాలు అంటారు.

ఉదా: లక్ష్మీ (సం.) - లక్ష్మి (తె. తత్సమం) రుగాగమ సంధిలో ''ఆలు" అంటే స్త్రీ అని అర్థం తప్ప 'భార్య' కాదు.
ఉదాహరణ: పేద + ఆలు = పేదరాలు
                  బీద + ఆలు = బీదరాలు
                  జవ + ఆలు = జవరాలు
                  ధీర + ఆలు = ధీరురాలు (తత్సమం)
                  ఘటిక + ఆలు = ఘటికురాలు
                  గుణవంత + ఆలు = గుణవంతురాలు
 కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం నిత్యం. పేర్వాది శబ్దాలకు మాత్రం విభాష. పేర్వాదులు, పేదాదులు లాంటి వాటిని ఆకృతి గణాలు అంటారు.
ఉదాహరణ: కఱకు + అమ్ము = కఱకుటమ్ము
                  నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము
                  ఎండు + ఆకు = ఎండుటాకు
                  చిగురు + ఆకు = చిగురుటాకు (టుగాగమ సంధి)
                  చిగురాకు (ఉకార సంధి)
                  పేరు + ఉరము = పేరుటురము
                  పేరురము (ఉకార సంధి)

* ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు త్రికాలు. వీటికి అసంయుక్త హల్లు పరమైతే ద్విత్వం వస్తుంది. ఆ తర్వాత దీర్ఘం హ్రస్వం అవుతుంది. అసంయుక్త హల్లు కాకుండా అచ్చు పరమైతే యడాగమం వచ్చి త్రికసంధి అవుతుంది.
ఉదాహరణ: ఆ + కన్య = అక్కన్య
                  ఈ + చోటు = ఇచ్చోటు
                   ఏ + విధం = ఎవ్విధం
                   ఆ + తన్వి = అత్తన్వి
                   ఏ + అది = ఏ + యది = ఎయ్యది  (యడాగమ త్రిక సంధి)
                   ఆ + అనలం = అయ్యనలం
* ఇవికాకుండా కొన్ని సంధులు విడదీయడం, కలపడం తెలుసుకోవాలి.


సెలయేఱు = సెల + ఏఱు (యడాగమం)
మేనత్త = మేన + అత్త (అకార సంధి
మేనయత్త (యడాగమం)
లేదూడ = లేత + దూడ (ప్రాతాది సంధి)
కెందమ్మి = కెంపు + తమ్మి (ప్రాతాది సంధి)
నివ్వెఱ = నిండు + వెఱ (ప్రాతాది సంధి)
నెమ్మనము = నెఱ + మనము (ప్రాతాది సంధి)
నీదుఆజ్ఞ = నీ + ఆజ్ఞ (దుగాగమ సంధి)
ముత్యాలు = ముత్యము + లు (లులనల సంధి)

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌