• facebook
  • whatsapp
  • telegram

తెలుగుపై సంస్కృతాంగ్లాల ప్రభావం

ఒక భాషా సాహిత్యాల ప్రభావం మరొక భాషా సాహిత్యాలపై ఉండటం సహజమే. అయితే పరిపాలకుల భాషా సాహిత్యాల ప్రభావం; ప్రాచీనత, ప్రాచుర్యం ఉన్న భాషా సాహిత్యాల ప్రభావం ఇతర భాషలపై అధికంగా ఉంటుంది. సంస్కృతం అతి ప్రాచీనమైంది కావటం వల్ల, ఆంగ్లేయుల సుదీర్ఘ పరిపాలన వల్ల ఇతర భాషా సాహిత్యాలతోపాటు ఈ రెండు భాషా సాహిత్యాల ప్రభావం తెలుగుపై బాగా ఎక్కువ. తెలుగుపై ఇతర భాషల ప్రభావాన్ని రెండు విధాలుగా గమనించవచ్చు.
* సాహిత్య ప్రభావం
* భాషా ప్రభావం
వీటిని మళ్లీ రెండుగా వర్గీకరించవచ్చు
* భారతీయ భాషల ప్రభావం
* ఇతర దేశాల భాషల ప్రభావం
* తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్య ప్రభావంతోనే మొదలై విస్తరించింది. ప్రాచీన శాసన భాషలో కూడా ప్రాకృత, సంస్కృత భాషల ప్రభావం ఎక్కువ. ద్రావిడ భాషల ప్రభావం కూడా కనిపిస్తుంది. సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల ముందు తెలుగు వెలవెలబోయేది. సంస్కృతమే గొప్పగా భావించిన రోజులవి. అందుకే పాల్కురికి సోమన సంస్కృత పండితులను ఉద్దేశించి
                                                              'తెలుగు మాటలనంగవలదు
                                                              వేదముల కొలదియకాచూడ' మన్నాడు.

* కవిత్రయ భారతం సంస్కృతాంధ్రీకరణతోనే ప్రారంభమైంది. సంస్కృత పురాణాలు, ఇతిహాసాలు లేనిదే తెలుగు కవిత్వం దాదాపు లేనట్టే. సంస్కృత రామాయణ, భారతాల వల్ల తెలుగులో రామాయణ, భారతాలు విభిన్న కవిత్వ, వచన ప్రక్రియల్లో నేటికీ వెలువడుతూనే ఉన్నాయి.
* పోతన ఆంధ్ర మహాభాగవతానికి సంస్కృతంలో వ్యాసుని భాగవత పురాణమే మూలం. వ్యాసుని అష్టాదశ పురాణాల్లోని కథలు, సన్నివేశాలు కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలకి మూలమయ్యాయి.
* జానపద వాజ్ఞ్మయం, కళారూపాలపై కూడా సంస్కృత ఇతిహాస, పురాణాల ప్రభావం తక్కువేమీ కాదు. పెద్దన మనుచరిత్రకి మార్కండేయ పురాణం; శ్రీనాథుని కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మాహాత్మ్య కావ్యాలకు స్కంద పురాణం ఆధారం.

 

వ్యాకరణాలు.. కావ్యాల్లో..
* తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం చాలా ఉంది. చిన్నయసూరి బాలవ్యాకరణంపై పాణినీయం ప్రభావం ఎక్కువ. తెలుగులో ఆలంకారిక శాస్త్ర గ్రంథాలు వెలువడటానికి సంస్కృత ఆలంకారికులే కారణం.
* కావ్యాలు, నాటకాలకి వ్యాఖ్యాన సంప్రదాయం సంస్కృతం నుంచే వచ్చింది. ముఖ్యంగా మల్లినాథసూరి తెలుగు వ్యాఖ్యాతలకు స్ఫూర్తిగా నిలిచాడు. తెలుగులో నాటక వాజ్ఞ్మయంపై సంస్కృత నాటక వాజ్ఞ్మయ ప్రభావం అత్యధికం. భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పిన నాటక లక్షణాలే పద్యనాటకాలకి మూలం.
* ఆంగ్ల సాహిత్య పఠనం తెలుగు కవులు, రచయితలకు కొత్త ఆలోచనను, కొత్త చూపును ఇచ్చింది. భావ కవిత్వోద్యమానికి ఆంగ్లంలోని 'రొమాంటిసిజమ్' మూలం. షెల్లీ ప్రభావం దేవులపల్లి కృష్ణశాస్త్రిపై పుష్కలంగా ఉంది. ఆరుద్రపై టి.ఎస్. ఇలియట్ - సింబాలిజమ్ ప్రభావం కనిపిస్తుంది.
* అభ్యుదయ ఉద్యమంపై రష్యా సాహిత్య ప్రభావం, విప్లవ ఉద్యమంపై చైనా సాహిత్య ప్రభావం, స్త్రీవాదంపై అమెరికా 'ఫెమినిజం' ప్రభావం బాగా ఉన్నాయి.
* ఆధునిక వచన ప్రక్రియలైన కథ, నవల, వ్యాసం, విమర్శ లాంటి వాటిపై ఆంగ్లం, ఫ్రెంచ్ భాషల ప్రభావాన్ని గమనిస్తాం.
* ఆంగ్లంలోని 'నావెల్' నవలగా, 'స్టోరీ', 'షార్ట్ స్టోరీ'లు కథ, కథానికలుగా తెలుగులో స్థిరపడ్డాయి. తొలి నవలగా పేర్కొనే కందుకూరి వారి 'రాజశేఖర చరిత్ర'పై గోల్డ్ స్మిత్ రాసిన 'వికారాఫ్ వేక్‌ఫీల్డ్' నవల ప్రభావం ఉంది. జోనాథన్ స్విఫ్ట్ రాసిన గలివర్స్ ట్రావెల్స్ ఆధారంగానే కందుకూరి 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు' అనే వ్యంగ్య నవల రాశారు.
* అత్యాధునికుల్లో యండమూరి, మల్లాది, చందు సోంబాబు లాంటి వారి నవలలపై ఆంగ్ల సాహిత్య ప్రభావం ఉంది. ఆంగ్ల కథా రచయితలైన ఓ హెన్రీ, సోమర్‌సెట్ మామ్, అలాగే రష్యన్ రచయితలు టాల్‌స్టాయ్, గోర్కి, మొపాసా మొదలైనవారి ప్రభావంతో తెలుగులో కథలు, నవలలు వెలువడ్డాయి.
* ఆంగ్ల నాటక సాహిత్యం, ప్రదర్శనల్లోని కొత్త ప్రయోగాలు తెలుగులో ప్రవేశించాయి. 'మరో మొహంజొదారో' లాంటి టెక్నిక్ ఉన్న నాటకాలు దీనికి ఉదాహరణ.

 

విమర్శలపై ప్రభావం..
* ఇలియట్, హడ్సన్, ఐ.ఎ. రిచర్డ్స్ లాంటి విమర్శకుల ప్రభావం మన విమర్శపై కనిపిస్తుంది. మార్క్సిస్టు విమర్శకి రష్యా సాహిత్య విమర్శే మూలం. ఇమేజిజం, సర్రియలిజం, డాడాయిజం, సింబాలిజం, సోషలిజం మొదలైనవి ఆధునిక సాహిత్యాన్ని మలుపుతిప్పాయి.
* తెలుగులోని ప్రహసనాలపై ఆంగ్లంలోని 'ఫార్స్' రూపక ప్రభావం కనిపిస్తుంది. ఆంగ్లంలోని ట్రాజెడీ, కామెడీ నాటకాల అనుసరణ తెలుగు నాటకాలు, నాటికలపై ఉంది.
* ఆధునిక కవితా రూపం 'హైకూ' జపనీస్ భాషా సాహిత్య ప్రభావంతో వచ్చింది.
* పార్శీ, ఉర్దూ భాషా సాహిత్యాల ప్రభావం కూడా తెలుగు సాహిత్యంపై ఎక్కువే. ఉమర్ ఖయ్యూమ్ రచన ప్రభావంతో పానశాల, మధుశాల... లాంటి అనువాద కావ్యాలు వెలువడ్డాయి.
* ఉర్దూలోని గజల్, రుబాయీలను దాశరథి, సినారె లాంటివారు తెలుగులోకి ప్రవేశపెట్టారు. పారశీక కవికి జరిగిన అన్యాయానికి చలించి జాషువా 'ఫిరదౌసి' కావ్యం రాయడం తెలిసిందే!
* ఫ్రెంచ్‌లోని 'ఫ్రీవర్స్', 'సింబాలిజమ్‌'లు ఆంగ్లం ద్వారా తెలుగులోకి వచ్చాయి. బహుళ ప్రాచుర్యంలో ఉన్న వచన కవిత అంటే 'ఫ్రీవర్స్' మాత్రమే.

దేశీయ భాషల ప్రభావం..
* ఇక దేశీయ భాషలను పరిశీలిస్తే తెలుగు, తమిళ భాషల మధ్య ఎప్పటినుంచో భాషా సాహిత్య సంబంధాలున్నాయి. మన శతకాలపై తిరుక్కురళ్ ప్రభావం కొంత ఉంది. పాల్కురికి సోమన వృషాధిప శతకంలో తమిళ భాషలో పద్యాలు రాయడం, నన్నెచోడుడు తమిళ పదాలు వాడటం గమనించవచ్చు.
* రాయలవారి ఆముక్తమాల్యదలోని కథ తమిళ ప్రాంతానికి చెందింది. శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని నత్కీరుని కథ తమిళ సాహిత్యంలోని నక్కీరుని కథే!
* తెలుగుపై కన్నడ సాహిత్య ప్రభావం తక్కువేమీ కాదు. పాల్కురికి సోమనపై కన్నడ వీరశైవ సాహిత్య ప్రభావం, బసవేశ్వరుని వచనాల ప్రభావం ఎక్కువ. కన్నడంలోని జాణ్ణుడి - తెలుగులో జాను తెనుగు అయిందని చరిత్రకారుల అభిప్రాయం.
* కన్నడంలోని 'కవి రాజమార్గం' అనే లక్షణ గ్రంథ ప్రభావం విన్నకోట పెద్దన రాసిన 'కావ్యాలంకార చూడామణి'పై ఉందని పేర్కొంటారు.
* తెలుగు సాహిత్యంపై ముఖ్యంగా దళిత కవిత్వంపై మరాఠీ సాహిత్య ప్రభావం ఉంది. జ్యోతిబా పూలే, అంబేడ్కర్‌ల సిద్ధాంతాల ప్రభావంతోనే దళిత సాహిత్యం పదునెక్కింది. మహారాష్ట్రలోని 'దళిత్ పాంథర్స్' సంస్థ తెలుగు దళిత ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.
* గడియారం వేంకటశేషశాస్త్రి రాసిన 'శివభారతం' శివాజీ చరిత్రకి సంబంధించిందే. శివాజీ, సక్కుబాయి, రోషనార పాత్రలతో తెలుగులో అనేక ప్రక్రియల్లో రచనలు వెలువడ్డాయి. మహారాష్ట్రకు చెందిన గోవిందరావు స్థాపించిన 'సురభి నాటక సమాజం' తెలుగు నాటక రంగానికి ఊపిరినిచ్చింది.

సంస్కృతం.. ప్రాకృతం..
* తెలుగు భాషపై సంస్కృత, ప్రాకృత భాషల ప్రభావం చాలా ఎక్కువ. సంస్కృత పదం లేకుండా తెలుగు మాట్లాడలేని, రాయలేని పరిస్థితి నెలకొంది. తత్సమ, తద్భవ పదాలుగా సంస్కృత, ప్రాకృత పదాలు తెలుగులోకి ప్రవేశించాయి. తత్సమ పదాల వల్ల సంస్కృతం తెలుగులో కలిసిపోయింది.
* 'గాసట బీసట'గా ఉన్న తెలుగును తత్సమ పదాలతో మేళవించి నన్నయ కావ్య భాషగా మార్చాడని పెద్దల అభిప్రాయం.
* మనం రోజూ వాడే విద్య, ఆలయం, ప్రార్థన, నమస్కారం, పరీక్ష, అన్నం, నాటకం, ప్రభుత్వం, దేవుడు మొదలైనవన్నీ సంస్కృత పదాలే.
* మనం వికృత పదాలుగా చెప్పుకునే చందురుడు, రాతిరి, అగ్గి, సత్తెము, సింగారము లాంటివి తద్భవాలు.
* తెలుగులో పోర్చుగీస్ భాషా పదాల ప్రభావం కూడా కనిపిస్తుంది. అప్పటి కాల పరిస్థితుల వల్ల ఆ భాషా పదాలు తెలుగులోకి ప్రవేశించాయి. ఉదాహరణకి - అనాస, బొప్పాయి, టమాటో, అల్మార, బాల్చీ, మేస్త్రీ, పీపా, గిడ్డంగి, బొత్తాం, తువ్వాలు మొదలైనవి.
* మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల మరాఠీ పదాలు కూడా తెలుగులో చేరాయి. మచ్చుకి.. రావు, పంచె, చిల్లర, చెంబు, కావడి, దాదా, కక్క, ఎల్లమ్మ మొదలైనవి.
* తెలుగుపై తమిళ సాహిత్యం, భాషా ప్రభావం కనిపిస్తుంది.
ఉదా: తిరు, తిరుమంజనం, అరంగేట్రమ్, సాపాటు, సాంబారు, వడ మొదలైనవి.
కన్నడం నుంచి వచ్చిన పదాలు: మజ్జిగ, హంగు, హెచ్చు, హుటాహుటి, హేమాహేమీ లాంటివి.
ఒరియా నుంచి: పన్నె, బుగత, భోగట్టా మొదలైనవి.
* ఉర్దూ, పార్శీ భాషల నుంచి - బజారు, సవాలు, కితాబు, ఖరీదు, కాగితం, రోజు, హుషారు, దుకాణం, తుపాకి మొదలైన పదాలు చేరాయి.
* ఒకవిధంగా అన్య భాషా పదాలు చేరడం, అన్య సాహిత్యాల ప్రభావం ఉండటం భాషా విస్తృతికి దోహదం చేసేవే. అయితే మాతృభాష మరుగున పడేటంత ప్రభావం చూపడం సమంజసం కాదు.
* కొత్తపల్లి వీరభద్రరావు 'తెలుగు సాహిత్యంపై ఆంగ్ల సాహిత్య ప్రభావం' అనే పుస్తకాన్ని రాశారు. చల్లా రాధాకృష్ణ శర్మ తమిళ, తెలుగు సాహిత్యాల ప్రభావంపై పుస్తకాలు రాశారు.
* 'తెలుగులో బుడతకీచు నుడుల' (పోర్చుగీసు పదాలు)పై తూమాటి దొణప్ప పరిశోధన చేశారు. పి.ఎస్.ఆర్. అప్పారావు రాసిన 'తెలుగు నాటక వికాసం' అనే సిద్ధాంత గ్రంథంలో తెలుగు నాటకంపై ఇతర భాషా సాహిత్యాల ప్రభావానికి సంబంధించిన సమాచారం ఉంది.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌