• facebook
  • whatsapp
  • telegram

వ్యాకరణం - అలంకారాలు

కావ్యానికి లేదా కవిత్వానికి వన్నె తెచ్చేవి అలంకారాలు. శబ్దాలంకారాలు శైలికి జిగిబిగి కలిగిస్తే అర్థాలంకారాలు భావానికి సొబగును అద్దుతాయి. చెప్పదలచిన విషయాన్ని చమత్కారంగా, రమణీయంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు తోడ్పడతాయి. విన్నకోట పెద్దన్న రాసిన 'కావ్యాలంకార చూడామణి', రామరాజభూషణుడు రాసిన 'కావ్యాలంకార సంగ్రహం' ముఖ్యమైన అలంకారిక గ్రంథాలు.
 

శబ్దాలంకారాలు

అర్థం కంటే శబ్దానికి ప్రాధాన్యమున్నవి శబ్దాలంకారాలు. కవి అక్షరాలు, శబ్దాల కూర్పునకు ప్రాధాన్యమిస్తాడు.
వృత్త్యనుప్రాస: ఒకే హల్లు (వర్ణం) అనేక పర్యాయాలు ఆవృతం కావడం లేదా వచ్చిన హల్లు మళ్లీ మళ్లీ రావడం వృత్త్యనుప్రాస అలంకారం.
ఉదా: 1) అడుగులు తడబడ బుడతడు నడిచెను
2) అమందానందకందళిత హృదయారవిందం

 

ఛేకానుప్రాస: రెండు, అంతకంటే ఎక్కువ హల్లుల జంట అర్థభేదంతో వెంటనే రావడం ఛేకానుప్రాస అలంకారం.
ఉదా:  1) సుందర దరహసం 2) కందర్ప దర్ప

 

లాటానుప్రాస: అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం వెంటవెంటనే రావడం లాటానుప్రాస అలంకారం.
ఉదా:  కమలాక్షునర్చించు కరములు కరములు
        శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
        కరములు అంటే చేతులు. అర్థంలో భేదం లేదు. విష్ణుమూర్తిని అర్చించే చేతులే చేతులు. చేతులు అందుకే ఉన్నాయని భావం.

 

యమకం: రెండు లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలున్న పదం అర్థభేదంతో, వ్యవధానంతో మళ్లీమళ్లీ రావడం యమకాలంకారం.
ఉదా:  లేమా, దనుజుల గెలువగలేమా 
        మొదటి లేమా అంటే స్త్రీ. రెండోసారి - గెలువగలేమా అంటే - గెలవగలం అని అర్థం.
        ''మనసు భద్రమయ్యె మన సుభద్రకు"
        మనసు భద్రం - మన సుభద్ర అన్నప్పుడు అర్థభేదం ఉంది.

 

ముక్తపదగ్రస్తం: ఒక పాదం చివర వదిలిన పదాన్ని మళ్లీ రెండోపాదం మొదట ప్రయోగిస్తే ముక్తపదగ్రస్తం అనే అలంకారం అవుతుంది. ముక్త అంటే విడిచిన. గ్రస్త అంటే తీసుకోవడం లేదా పట్టుకోవడం.
ఉదా:  సుదతీనూతనమదనా
           మదనాగతురంగ...
         'ఎదురేగు, ఏగి అతిథ్యమిచ్చు, ఇచ్చి... 'అనే విధంగా ప్రయోగించినా ముక్తపదగ్రస్తమే.

 

అంత్యానుప్రాస:  పదాల చివర లేదా పాదాల చివర వచ్చిన అక్షరాలే మళ్లీమళ్లీ రావడం అంత్యానుప్రాసాలంకారం.
ఉదా:  'దీనులార...
         హీనులార'
        'ఆపటేరాచల పశ్చిమాచలహిమాచల... '
మొదటి ఉదాహరణ పాదం చివరికి, రెండోది పదాల చివరికి ఉదాహరణ.

 

అనుప్రాస: ప్రాసలోని అక్షరమే మళ్లీమళ్లీ రావడాన్ని కొందరు అనుప్రాసాలంకారంగా చెబుతారు.
ఉదా:  'ఇంతింతై వటుడింతయైమఱియుదానింతై... '
            'అడిగెదనని కడువడిజను... '
        రెండో అక్షరం మళ్లీమళ్లీ వచ్చింది.
 

అర్థాలంకారాలు

శబ్దం కంటే అర్థానికి ప్రాధాన్యం ఉండేవి అర్థాలంకారాలు. భావనాశక్తిని ప్రతిబింబిస్తాయి. జయదేవుని చంద్రాలోకంలో అర్థాలంకారాల వివరణ బాగా కనిపిస్తుంది.
 

ఉపమాలంకారం: ఉపమ అంటే పోలిక, సాదృశ్యం. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన పోలిక చెప్పడం ఉపమాలంకారం. ఉపమేయం, ఉపమానం, సమానధర్మం, ఉపమావాచకం అనే నాలుగూ ఉంటే పూర్ణోపమాలంకారం అంటారు. ఏదో ఒకటి లోపిస్తే లుప్తోపమాలంకారం అంటారు.

ఉపమేయం - చెప్పదలచుకున్నది
ఉపమానం - పోలికకు తీసుకున్నది
సమానధర్మం - సమానమైన గుణం లేదా స్వభావం
ఉపమావాచకం - అన్వయించేది - వలె, పోలె, అట్లు, భంగి మొదలైనవి
ఉదా:   ఆమె ముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది.
            ఇది పూర్ణోపమ. ముఖం ఉపమేయం, చంద్రబింబం ఉపమానం, మనోహరం సమానధర్మం, వలె - ఉపమావాచకం.
ఉదా:  ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. ఇది సమానధర్మం లోపించడం వల్ల లుప్తోపమ. ఉపమాలంకారానికి కాళిదాసు ప్రసిద్ధి.
చంద్రాలోకంలోని ఉదాహరణ - ఓ కృష్ణా! నీ కీర్తి హంసవలె ఆకాశగంగయందు మునుగుచున్నది.


రూపకాలంకారం: ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం (తాద్రూప్య వర్ణన).
ఉదా:  నరసరాజు కీర్తి పాలసముద్రం.
         ఇక్కడ కీర్తి ఉపమేయం. పాలసముద్రం ఉపమానం, అభేదం చెప్పారు. మరో ఉదాహరణ - అతడు మూడోకన్నులేని శంభుడే.

ఉత్ప్రేక్షాలంకారం: ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ. అసమంజసం, అసహజం అయిన అంశాన్ని సమంజసమైనట్టు, సహజమైనట్టు వర్ణిస్తారు.
ఉదా:  ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని ధూమంగా తలచుచున్నాను. చీకటి ఉపమేయం, ధూమం ఉపమానం. చీకటిని ధూమంగా ఊహించాడు.
        మరో ఉదాహరణ - ద్రౌపది చేతిలోని తలవెంట్రుకలు నల్లటి తాచుపాములుగా భావించెను.


అర్థాంతరన్యాసాలంకారం: సామాన్య వాక్యంతో విశేషవాక్యాన్ని లేదా విశేషవాక్యంతో సామాన్య వాక్యాన్ని సమర్థించడం అర్థాంతరన్యాసం అవుతుంది.
ఉదా: హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు సాధ్యంకానిది లేదు కదా!
హనుమంతుడు సముద్రాన్ని దాటడం విశేషం. దీంతో మహాత్ములకి సాధ్యంకానిది లేదనే సామాన్య వాక్యంతో సమర్థించారు. మరో ఉదాహరణ - దుర్మార్గుడు గుణవంతుని సాంగత్యం వల్ల కీర్తి పొందుతాడు. పువ్వులతో సాంగత్యం వల్ల దారం కూడా తలపై ధరించబడుతోంది కదా! మొదటి వాక్యం సామాన్యం. రెండోది విశేషం.


స్వభావోక్తి అలంకారం: జాతి, గుణ క్రియాదులతో స్వభావాన్ని సహజంగా, మనోహరంగా వర్ణించడం స్వభావోక్తి అలంకారం.
ఉదా:  ఆ లేడి పిల్లలు చంచలమైన నేత్రాలతో చెవులు రిక్కించుకుని చెంగుచెంగున దుముకుతున్నాయి. 
ఇక్కడ లేడి పిల్లల స్వభావాన్ని సహజ సుందరంగా వర్ణించారు.


శ్లేషాలంకారం: అనేక అర్థాల్ని ఆశ్రయించేది- అంటే అనేక అర్థాలిచ్చే పదాలను ప్రయోగించడం శ్లేషాలంకారం.
ఉదా: ఆ రాజు కువలయానందకరుడు.
రాజు అంటే ప్రభువు, చంద్రుడు అని అర్థాలు. కువలయం అంటే భూమి, కలువపూవు అని అర్థం. ఆ రాజు ప్రజలను ఆనందంగా పాలిస్తున్నాడని ఒక అర్థం. చంద్రుడు కలువపూలను వికసింపజేసి ఆనందం కలిగిస్తున్నాడని శ్లేషార్థం.
'నా కుమారుడవు' నా పుత్రుడవు అని ఒక అర్థం.
నాకు-మారుడవు అంటే నాకు మన్మథుడివి అని రెండో అర్థం.


దృష్టాంతాలంకారం: రెండు వాక్యాల ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంతాలంకారం. దృష్టాంతం అంటే ఉదాహరణ.
ఉదా: ఓ రాజా! నీవే కీర్తివంతుడవు చంద్రుడే కాంతివంతుడు.
రాజు గురించి చెబుతూ పోలికను బట్టి చంద్రుడితో బింబ ప్రతిబింబంగా చెప్పారు. కాంతి విషయంలో, వ్యాప్తి విషయంలో చంద్రుడు ఎంతటివాడో రాజు కూడా అంతటి కీర్తిగలవాడని భావం.


అతిశయోక్తి అలంకారం: ఒక వస్తువును లేదా సన్నివేశాన్ని ఉన్నదాని కంటే, చెప్పాల్సినదాని కంటే ఎక్కువ గొప్పగా చేసి వర్ణించడం. దీన్నే గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడం అంటారు.
ఉదా:  'ఆ నగరంలోని సౌధాలు ఆశాకాన్ని తాకుతున్నాయి'
          నిజానికి ఎంత ఎత్తు ఉన్నా ఆకాశాన్ని తాకడం అసహజం. అవి బాగా ఎత్తుగా ఉన్నాయనడానికి ఎక్కువ చేసి వర్ణించారు.
         'మా పొలంలో బంగారం పండింది' పొలంలో ధాన్యం లాంటివి పండుతాయి గానీ బంగారం పండదు. పంట బాగా పండింది అనడానికి ఎక్కువ చేసి చెప్పారు.


అనన్వయాలంకారం: ఒకే వస్తువును ఉపమేయంగా, ఉపమానంగా చెప్పడం. పోల్చదగిన వస్తువు మరొకటి లేదనడం అనన్వయాలంకారం.
ఉదా: రామ రావణుల యుద్ధం రామరావణుల యుద్ధంలా ఉంది. 
       రామ రావణుల యుద్ధం అనేది ఉపమేయం, ఉపమానం కూడా. రామరావణుల యుద్ధానికి సాటిలేదనడం. ఇదే విధంగా సముద్రం సముద్రంలా గంభీరమైంది. చంద్రుడు చంద్రుడిలా కాంతిమంతుడు.


భ్రాంతిమదలంకారం: భ్రాంతి అంటే మిథ్యాజ్ఞానం. ఒకదాన్ని చూసి మరొకటిగా భ్రమించడం భ్రాంతిమదలంకారం.
ఉదా: ఈ మదించిన తుమ్మెద ఆమె ముఖాన్ని పద్మం అనుకుంటోంది.
          ముఖాన్ని పద్మంగా భ్రమించడం ఉంది కాబట్టి భ్రాంతిమదలంకారం.


వ్యాజస్తుతి అలంకారం: పైకి నిందగా కనిపించి, లోతుగా పరిశీలిస్తే స్తుతి ఉంటుంది. పైకి నింద, లోపల స్తుతివుంటే వ్యాజస్తుతి అలంకారం.
ఉదా: ఓ గంగా, పాపాత్ములను గూడ స్వర్గానికి చేర్చు నీకు వివేకం ఎక్కడిది? 
         ఇందులో గంగను నిందిస్తున్నట్టు ఉంది. కానీ పాపాత్ముల్ని కూడా పుణ్యం కలిగించి స్వర్గానికి చేరుస్తున్నావన్న స్తుతి ఉంది.


ఉల్లేఖాలంకారం: ఒక వస్తువు పలువురికి పలు విధాలుగా భాసించడం లేదా ఒకే వస్తువును అనేక విధాలుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం.
ఉదా: ఆ రాజు స్త్రీలకి మన్మథునిగా, యాచకులకు కర్ణునిగా, శత్రువులకు యమునిగా కనిపిస్తున్నాడు.
 ఒక్కరాజు పలువురికి పలువిధాలుగా కనిపిస్తున్నాడు.
 ఆ రాజు దానంలో కర్ణుడు, అందంలో మన్మథుడు, బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో అర్జునుడు.
ఇక్కడ ఒక్క రాజును అనేక విధాలుగా భావించారు.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌