• facebook
  • whatsapp
  • telegram

పాఠ్యాంశాలు - పాత్రలు - ఇతివృత్తాలు

 ''సుభాషిత రత్నాలు" అనే పాఠ్యభాగంలో నీతి పద్యాలున్నాయి. శతకపద్యాలు లోకవృత్తిని, మానసిక ప్రవృత్తిని, జీవిత గమనాన్ని వెల్లడిస్తాయి. ఏనుగు లక్ష్మణ కవి విద్యకు ఎంత మహిమ ఉందో వివరించాడు. విద్య సుఖాన్నిస్తుంది. విదేశాల్లో బంధువు లాంటిది. విద్యకు సాటివచ్చే ధనం లేదని, విద్య లేనివాడు మనిషే కాదని అంటాడు లక్ష్మణ కవి. ఒక పని మొదలుపెడితే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుదిరగకూడదు అంటాడు. ఎదుటివారి శక్తిని తెలుసుకుని శత్రుత్వం గ్రహించాలి, లేకపోతే పొట్టేలు వెళ్లి కొండను ఢీకొన్నట్టే అంటాడు మారద వెంకయ్య. పుణ్యాత్ముడు ఒకవేళ సంపద పోగొట్టుకున్నా బాధపడడు - ఎలాగంటే అమావాస్య రోజుల్లో తన కాంతిని పోగొట్టుకున్న చంద్రుడు పున్నమినాటికి మళ్లీ కాంతివంతుడవుతాడని భాస్కర శతకకర్త ఉద్దేశం. కంచర్ల గోపన్న భగవంతుడ్ని తల్లిగా, తండ్రిగా, వైద్యుడిగా సంబోధిస్తూ అన్నిటికి ఆ రాముడే గతి అంటాడు. సరసుడి మనసును సరసుడే తెలుసుకోగలడు. పువ్వు సువాసనను తుమ్మెద తెలుసుకోగలదు గానీ కప్ప గ్రహించగలదా అంటాడు గోపన్న. ధూర్జటి శివుడికి తన వేదనను విన్నవించుకుంటూ మంచైనా చెడైనా నిన్ను సేవించడమే గొప్ప అంటాడు. ఈ మనుషులు పదవి కోసం చంపుకుంటారు గానీ వారు మాత్రం మరణించరా? అంటాడు. చాలామంది కొడుకులు పుట్టలేదని దిగులు చెందుతారు గానీ శుకమహర్షికి కొడుకులు లేకున్నా మోక్షం రాలేదా? ధృతరాష్ట్రుడికి వందమంది కుమారులు పుట్టినా ఫలితం శూన్యమే కదా - అని ప్రశ్నిస్తాడు ధూర్జటి.
గర్గుడి పాత్ర ఉన్న పాఠ్యభాగం 'మతిహీనుడు'! దుర్గను ఆరాధించి సంజీవని విద్యను సాధిస్తాడు. ఒకసారి ప్రయోగం చేసి చూద్దామనుకుని చచ్చిన పులి మీద ఔషధాన్ని ప్రయోగిస్తాడు. అది బతికి గర్గుడ్ని చంపేస్తుంది. కాబట్టి బుద్ధిలేనివాడు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడు - 'మతి' మానవుడికి జీవగర్ర అంటాడు మంచెన.
          పోతన 'చల్దులారగించుట పాఠంలో శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్ది అన్నం తినడాన్ని వర్ణించారు. ఇది శ్రీకృష్ణుడి లీలల్లో ఒకటి. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాఠాన్ని శ్రీకృష్ణుడి శైశవమే కాదు - అందరి శైశవాలను గుర్తుకు తెచ్చేలా రాశాడు పోతన. ''బాల్యోపచారాలు" పాఠంలో బెజ్జమహాదేవి పరమేశ్వరుడిని తన కుమారుడిగా భావించి పరిచర్యలు చెయ్యడం గమనిస్తాం. ఒకప్పుడు తల్లులు తమ పిల్లలకు ఎలా స్నానం చేయించేవారో, ఎలా చూసుకునేవారో పాల్కురికి సోమన కళ్లముందుంచాడు. బెజ్జమహాదేవి ముగ్ధభక్తి ద్యోతకమవుతుంది. 
          పాత్ర చిత్రణకి అందెవేసిన చెయ్యి తిక్కనది. 'ద్రౌపది నివేదన' పాఠ్యభాగంలో ఈ విషయ సుస్పష్టం. రాయబారానికి వెళ్తున్న శ్రీకృష్ణుడికి ద్రౌపది తన అభిప్రాయాలను చెప్పడం పాఠ్యభాగ విషయం. అయితే ద్రౌపది తన మనసులో గూడు కట్టుకున్న వేదనను చాకచక్యంగా వెల్లడిస్తుంది. 'ఏదో అంటున్నాను గానీ' అంటూనే సూటిపోటి మాటలంటుంది. తన పుట్టుక, పెళ్లి, భర్తలు, సంతానం అందరూ గొప్పవారే అయినా 'నా బతువు ఇలా అయ్యింది' అంటుంది. తన అభిజాత్యాన్ని ద్రౌపది విశదీకరిస్తుంది.
          జాతీయోద్యమకాలంలో దేశభక్తిని రగిలించడానికి వేదుల రాసిన పాఠ్యభాగమే 'కాంక్ష'. పువ్వును ప్రతీకగా తీసుకుని దేశభక్తిని చాటిచెప్పారు వేదుల. గురజాడ తన 'కన్యక' పాఠంలో ప్రభువులు, సంపన్నులు స్త్రీలపై అత్యాచారానికి పాల్పడటాన్ని నిరసిస్తాడు. 
రాజు 'కన్యక'ను పొందాలని చూస్తాడు. అది సహించలేక ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. అంతకు ముందు పురుషుల్ని సంబోధిస్తూ ఆత్మాభిమానాన్ని, మానవతనీ ప్రబోధిస్తుంది కన్యక. 'ప్రపంచపదులు' పాఠంలో మనిషి జీవితం సాఫీగా సాగడానికి సి. నారాయణరెడ్డి సూచనలిచ్చారు. వ్యక్తిత్వ వికాసాన్ని బోధించారు. ప్రయత్నం, రాపిడి, కష్టం లేకుండా జీవితం చక్కగా ఎలా సాగుతుందంటారు సినారె. బోయి జంగయ్య పేదరికంలో పుట్టిన అంబేద్కర్ బాధలు అనుభవించి, కులభేదాలను అధిగమించి మేధావి అయ్యాడని తెలిపారు. మానవత్వపు విలువలను పెంచి, మతహద్దులను చెరపడానికి కృషిచేసిన మహనీయుడిగా వర్ణించారు. దీనులకు, పేదలకు బతుకు నిచ్చిన మహాత్ముడిగా కీర్తించారు జంగయ్య.
     'కవల పిల్లలు' అనేది జానపద కథకి సంబంధించింది. పాపినేని మహాలక్ష్మమ్మ చెప్పగా నాయని కృష్ణకుమారి రాశారు. దీన్ని ఊకుడు కథ అంటారు. లేకలేక ఇద్దరు కవల పిల్లలు పుట్టడం, వారిద్దరూ దేశాటనకి వెళ్లడం, పెద్దవాడ్ని చెట్టుమీది ముసలి అవ్వ చంపడం, చిన్నవాడు తన తెలివితేటలతో ఆ అవ్వను తరిమెయ్యడం ఈ పాఠంలోని ముఖ్యాంశాలు. ధైర్యసాహసాలు, చతురత వల్ల మనిషి విజయం సాధిస్తాడని ఈ కథ తెలియజెప్తుంది. అంధుల పాలిట దేవుడనదగిన లూయీ బ్రెయిల్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలియజేసే పాఠం ఉంది. బ్రెయిల్ విద్యాభ్యాసం, అతడి పట్టుదల, లిపిని తయారు చేయడం లాంటివి వివరించారు. హాస్యానికి చిరునామా మునిమాణిక్యం నరసింహారావు. శబ్దగతమైన హాస్య చమత్కారాన్ని అందించే పాఠం 'హాస్యం'. పదప్రయోగం అస్తవ్యస్తంగా, అసంబద్ధంగా ఉన్నా, అన్యభాషా పదప్రయోగం వల్ల, ఛలోక్తులు, ద్వంద్వార్థోక్తులు, అజ్ఞానోక్తుల వల్ల హాస్యం ఎలా పుడుతుందో ఉదాహరణలతో వివరించారు మునిమాణిక్యం.
జి.వి.సుబ్రహ్మణ్యం 'మూడు తరాలు' పాఠంలో వెనుకటి తరంవారి జీవన విధానాన్ని, వారి అభిలాషలను వెల్లడించారు. ఇందులో సుశీల, మనవరాలు మాధురి, రచయిత తల్లి సరస్వతమ్మ, బామ్మ జాలమ్మ, అక్కయ్య అన్నపూర్ణమ్మ పాత్రలు ముఖ్యమైనవి. 'సురవరం ప్రతాపరెడ్డి' పాఠంలో కాశీనాథుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, బహద్దురు వెంకట్రామారెడ్డి, తాపీ ధర్మారావు, గడియారం రామకృష్ణశర్మ, పి.వి.రాజమన్నారు, దేవులపల్లి రామానుజరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి వారి పత్రికా సేవలు వివరించారు. రావూరి భరద్వాజ మానవతా దృక్పథాన్ని వివరిస్తూ జంతువులే పాత్రలుగా రాసిన కథ 'చీమతల్లి విశ్వాసం'. మనుషుల బుద్ధులు ఎలా పెడతోవ పడుతున్నాయో, జీవితం ఎలా ఉపయోగపడాలో ఈ పాఠం చెబుతుంది. 
            'జీవిత చరిత్ర'కి సంబంధించిన పాఠ్యభాగం 'నాట్యాచార్య వై.భద్రాచార్యులు'. ఆయన తన జీవితాన్ని నటనకి ఎలా అంకితం చేశారో మిక్కిలినేని వివరించారు. హరిశ్చంద్ర, బిల్వమంగళ, కుచేల, అర్జునుడు లాంటి పాత్రలను ఆయన రక్తి కట్టించారు. అక్కినేనితో స్త్రీ పాత్రలు ధరింపజేశారు భద్రాచార్యులు. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర క్షేత్ర వైభవాన్ని, చరిత్ర కథను లింగమూర్తి వివరించారు. 'అడవి జంతువుల ఆవేదన' అనే పాఠ్యభాగంలో పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధానాంశం. నాటక పద్ధతిలో సాగిన ఈ పాఠంలో ఏనుగు, నక్క, కోతి, పావురం, కోయిల, తుమ్మెదలు, రామచిలుక, పావురం, వరాహం ముఖ్యమైన పాత్రలు.
     తొమ్మిదో తరగతి వాచకంలో మొదటి పాఠం 'శివధనుర్భంగం'. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు రాముడు శివ ధనుస్సును విరిచివేయడం, జనకుడు సీతనిచ్చి పెళ్లి చేస్తాననడం సారాంశం. ఇందులో విశ్వామిత్రుడు, జనక మహారాజు, రాముడు ప్రధాన పాత్రలు. వ్యాసుడు కాశీపై కోపిస్తాడు.
పార్వతి శపిస్తుంది. అగస్త్యుడు వ్యాసుడ్ని 'కాశీని ఎలా విడిచావు?' అంటూ ప్రశ్నిస్తాడు. ఆ పట్టణం గొప్పదనాన్ని అగస్త్యుడి ద్వారా తెలియజేశాడు శ్రీనాథుడు. శ్రీకృష్ణుడు, సత్యభామ, నందనోద్యాన పాలకులు పాత్రలుగా ఉన్నది 'పారిజాతాపహరణం' పాఠం. శ్రీకృష్ణుడు సత్యభామతో ఇంద్రలోకానికి వెళ్లి పారిజాత వృక్షాన్ని పెకలించడం, ఉద్యాన పాలకులు అడ్డగించటం, సత్యభామ వారికి సమాధానం చెప్పడం ముఖ్యాంశాలు. నందనోద్యాన పాలకులు అడ్డగించినప్పుడు సత్యభామ పలుకులు హేయబద్ధంగా ఉన్నాయి. 'ఆంధ్రనాయక శతకం'లో విష్ణువు మహిమలను, లీలలను వివరించాడు పురుషోత్తమ కవి. నిందిస్తూ ప్రశంసించడం ఈ శతకం ప్రత్యేకత. జాషువా గిజిగాడు అనే పక్షి కట్టుకున్న గూడు ('గిజిగాడు') గురించి విశిష్టంగా తెలిపాడు. గిజిగాడి కళానైపుణ్యం అబ్బురపరుస్తుంది అంటాడు జాషువా. 
            సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, మానవత్వం కోసం చైతన్యంతో పోరాడాలని బాలగంగాధర్ తిలక్ 'పిలుపు'నిచ్చాడు. 'సరదా పాట' చమత్కారం, తమాషా కోసం జరుక్‌శాస్త్రి రాశాడు. ఇది పేరడీ. గజ్జెల మల్లారెడ్డి పాళీ భాషలోని దమ్మపదాన్ని తెలుగులోకి అనువదించారు. ఇది బౌద్ధానికి సంబంధించిందైనా మానవాళికంతటికీ వర్తిస్తుంది. మనసే అన్నిటికీ మూలం కాబట్టి కాస్త దీనిపై దృష్టి పెట్టాలి. 'సుభాషిత రత్నాలు'లో ఎన్నో జీవిత, సామాజిక అంశాలను వెల్లడించారు.
            విద్యావంతుల పట్ల పండితులు ఆధిక్యత ప్రదర్శించవద్దంటాడు లక్ష్మణకవి. దానం చెయ్యడానికి సొమ్ము లేకపోతే ఎక్కడైనా తీసుకుని మరీ చేయాలంటాడు మారద వెంకయ్య.               
గాలానికి చేప చిక్కినట్లు మనిషి 'ఆశ' వల్ల చెడిపోతున్నాడు అంటాడు వేమన
               'కోడిగుడ్డంత గోధుమగింజ' పాఠ్యభాగంలో ఒకనాటి జీవన విధానాన్ని టాల్‌స్టాయ్ తెలిపితే - మహీధర జగన్మోహనరావు తెలుగులోకి అనువదించారు. ఒకనాడు 'అన్న విక్రయం' పాపంగా భావించడం, శ్రమపడి జీవించడం, వస్తుమార్పిడి లాంటివి ఇందులో ప్రస్తావించారు. 'అష్టావధానం'లో నిషిద్ధాక్షరి గురించి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వివరించారు. ఇందులో పేరి పేరయ్యశాస్త్రి, పురాణపండ మల్లయ్యశాస్త్రి, కూచి నరసింహం, ఆదిపూడి సోమనాధరావు, రామకృష్ణశాస్త్రి (అవధాని) గురించి ప్రస్తావించారు. కొమర్రాజు లక్ష్మణరావు శాస్త్ర విజ్ఞానానికి, చరిత్రకి సంబంధించిన గ్రంథాలు, తెలుగు భాషాతత్త్వంపై రాయడం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో కొమర్రాజు పాత్ర గురించి కూడా పేర్కొన్నారు. రావిచెట్టు రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ తదితరులు కొమర్రాజు భాషాసాహిత్య కృషినే కాదు - ప్రతిభాపాటవాలను కూడా ప్రశంసించారని విద్వాన్‌విశ్వం తెలిపారు. నండూరి రామమోహనరావు 'ఆశ-నిరాశ' పాఠంలో ఎక్కువ ఆశలు పెంచుకోకుండా - నిరాశను సదాశయంగా భావించాలంటూ రాశారు. జీవితంలో ఏది కోరుకుంటామో అది జరగదనీ, అనుకోనిది జరుగుతుందని - అందుకే నిరాశావాదమే మంచిదంటారు రచయిత. 
               గోపీచంద్ రాసిన విశిష్ట పాఠ్యభాగం 'తుమ్మచెట్టు', ఇది 'స్వగతం'. ఇందులో పర్యావరణ చైతన్యమే ప్రధానాంశం. మనిషి స్వార్థాన్ని, దుష్టబుద్ధినీ ప్రస్తావించారు రచయిత. చేరా రాసిన పీఠిక 'ఆధునిక భాష' అనే పాఠ్యాంశం.
భాషా పరిణామాన్ని, గ్రాంథిక వ్యావహారిక అంశాలను, గిడుగువారి భాషాకృషిని ఈ పాఠం రేఖామాత్రంగా వివరిస్తుంది. నాయకత్వం ఎలా సిద్ధిస్తుందో, ఎలా సిద్ధించదో నార్లవారు వివరిస్తే, శ్రీశ్రీ స్టాక్‌హోం యాత్ర విశేషాలను రాశారు. కొంగ, కర్కటకం, మీనాలు అనే పాత్రలున్నది 'కొంగ-ఎండ్రి'. స్థానిక చరిత్రను, ఒకనాటి తెలుగుభాషా తీరుతెన్నులను 'కొప్పర్రు' పాఠం వివరిస్తుంది.
         'మాతృవేదన' పాఠంలో బిడ్డలకోసం తల్లిపడే ఆవేదనను వర్ణించారు రచయిత. మందపాలుడనే మునీశ్వరుడి భార్య జరిత. వీరికి జరితారి, సారిసృక్కు, అస్తంభమిత్రుడు, ద్రోణుడు అనే కుమారులు పుట్టారు. వీరు ఖాండవ వనంలో నివసిస్తుంటారు. ఒకరోజు అది దహించుకుపోతుంటే తల్లి దిగులు చెంది పిల్లల్ని ఎలుక కన్నంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోమంటుంది. పెద్దకొడుకు జరితారి - "అమ్మా బిలంలోకి వెళ్తే పసిగుడ్డులైన మమ్మల్ని ఎలుక చంపేస్తుంది. అదే ఇక్కడే ఉంటే ఒకవేళ అగ్ని ఇటురాకుంటే బతికే అవకాశం ఉంది" అంటూ బిలంలోకి వెళ్లడానికి నిరాకరిస్తాడు. మందపాలుడి ప్రార్థన వల్ల అగ్ని ఈ పక్షిపిల్లలున్న చెట్టును తాకడు. 
           ఎర్రన రాసిన 'జడివాన' కావ్యం వర్ణనాత్మకమైంది. ఇందులో గోపబాలకులు, ఇంద్రుడు, గోవర్ధనగిరి గురించి ప్రస్తావిస్తారు. తనను పూజించకుండా గోపాలకులు గోవర్ధనగిరిని పూజించడం చూసి ఇంద్రుడికి కోపం వస్తుంది. దాంతో భయంకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. ఆ జడివాన ఎలా ఉందో విపులంగా వర్ణించాడు ఎర్రన. 
           పెద్దన రాసిన 'ప్రవరుని స్వగతం'లో అనాలోచితంగా కార్యానికి పూనుకుంటే పరిణామం ఎలా ఉంటుందో ప్రవరుడి పాత్ర ద్వారా తెలుసుకుంటాం. సిద్ధుడు ఇచ్చిన పాదలేపనంతో ప్రవరుడు హిమాలయానికి వెళ్తాడు. హిమాలయ వర్ణనతో పాఠం మొదలవుతుంది.
హిమాలయ వర్ణనతో పాఠం మొదలవుతుంది. హిమాలయ వైభవాన్ని దర్శించి ఇంటికి వెళ్దామనుకుంటే పాదలేపనం కరిగిపోతుంది. దాని మహిమ పోయి ఎక్కడికీ వెళ్లలేక మనస్తాపం చెందుతాడు. తలరాతను నిందిస్తాడు. తనరాక కోసం అరుణాస్పదపురంలోని తన ఇంట్లో తల్లిదండ్రులు, భార్య, శిష్యులు, అతిథులు వేచి ఉంటారనీ, కానీ వెళ్లలేని దుస్థితిలో ఉన్నానని విచారిస్తాడు.
         మారద వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవులతోపాటు కొత్తగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శరభాంకుడు, అల్లంరాజు రంగశాయి కవుల నీతి పద్యాలున్న పాఠం 'సుభాషితాలు'. మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం కోల్పోయినవారు ఎలా పతనమవుతారో గంగ ఆకాశం నుంచి పాతాళానికి పతనం కావడంతో పోల్చి చెప్తాడు లక్ష్మణకవి. మరో పద్యంలో మంచి గుణాలను విడిచిపెట్టడం కంటే మరణం మేలంటాడు. సజ్జనుడు ఎల్లవేళలా ప్రియమైన మాటలే మాట్లాడతాడు. ఒకవేళ ఎప్పుడైనా పరుషంగా మాట్లాడినా కీడు చేయడు అంటాడు మారద వెంకయ్య. వీరబ్రహ్మేంద్ర స్వామి అన్ని ప్రాణులూ అన్నంతోనే జీవిస్తాయంటాడు. రంగశాయి - నదులు తన నీళ్లు తాగవని, చెట్లు తమ ఫలాలు తినవనీ, మేఘాలు కూడా పంటను తినవని, లోకోపకారమే జీవలక్షణమని పేర్కొంటాడు.
         మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమంలో ముఖ్యంగా సహాయ నిరాకరణోద్యమంలో దేశభక్తులకు ఇచ్చిన సందేశాన్ని తుమ్మల సీతారామమూర్తి తన పద్యాల ద్వారా తెలియజేశారు. భారతీయులంతా త్యాగం, శాంతి, సత్యం అనే అస్త్రాలతో యుద్ధంచేసి పరతంత్ర జీవనాన్ని పోగొట్టుకోవాలనీ, కృషితోనే అది సాధ్యమనీ, ఇలాంటి అహింసా సమరం ప్రపంచంలో కనివినీ ఎరగనిదని గాంధీ ఉద్బోధించారు. కాకతీయుల వైభవాన్ని, రుద్రమదేవి పరాక్రమాన్ని రచయిత పుట్టపర్తి కళ్లకి కట్టినట్లు వివరించిన పాఠ్యభాగం 'ఓరుగల్లు'.
ఒక యువకుడు జైలు నుంచి తన భార్యకి సందేశమివ్వడం ఈ కావ్య ఇతివృత్తం. ఈ పాఠంలో రుద్రమదేవి, మహదేవరాజు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ప్రతాపరుద్రుడు, విద్యానాథుడి గురించి ప్రస్తావించారు. రుద్రమదేవి దేవగిరి సంస్థానాధిపతి అయిన మహదేవరాజును ఓడిస్తుంది. విద్యానాథుడనే కవి తన కావ్యనాయకుడైన ప్రతాపరుద్రుడి మరణానికి దుఃఖిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిని చలం అనువదించారు. అందులోని ఒక భాగమే 'గీతాంజలి' పాఠం. ఇందులో పిల్లలు నిర్మలంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంటారని రచయిత పేర్కొన్నారు. వాళ్లకి వలలు వెయ్యడం, వ్యామోహపడటం తెలియదని, సముద్రం పిల్లలతో ఆడుకుంటోందని అంటాడు కవి. దాశరథి కృష్ణమాచార్య రచించిన 'తామసి'లో కథావస్తువు చీకటి. సామాన్యంగా చీకటి అంటే ఈసడిస్తాం. చీకటి భయపెడుతుంది. అందుకే దాన్ని స్వాగతించం. దీనికి భిన్నంగా ఈ పాఠ్యభాగంలో కవి చీకటిని బాగా కీర్తిస్తాడు. కవికి విలక్షణమైన ఆలోచనలు వచ్చాయి. చీకట్లు అందమైనవనీ, మరులు గొల్పుతాయనీ, చీకటిలేనిదే లోకమే లేదనీ తెలియజేస్తూ 'నన్ను కాంతిలోకంలోకి పిలవకండి' - అంటాడు కవి. మహెజబిన్ అనే కవయిత్రి వీధుల్లో చెత్త ఏరుకునే అనాథపిల్లల దురవస్థను 'స్ట్రీట్ చిల్డ్రన్' అనే కవితలో వర్ణించారు. వాళ్లు బతకడానికి యుద్ధం చేస్తున్నారనీ, వాళ్ల ఆత్మస్థైర్యం మనందరికీ ఆదర్శమంటారు కవయిత్రి. 
            చాగంటి సోమయాజులు రాసిన 'బొండుమల్లెలు' పాఠంలో కథకుడు, తాత ప్రధానపాత్రలు. 'వంకాయలమ్మే మనిషి' పాత్ర కూడా ఉంది. సమాజంలో మనం తెలియకుండానే దోపిడీ చేస్తామనీ, మనకి లాభం చేకూర్చిన వారిని పట్టించుకోమనీ తెలియజేసే ఈ కథానిక అభ్యుదయ భావజాలంతో కూడుకుని ఉంటుంది.
చిన్నపిల్లల మనస్తత్వం, వారి మానసిక వైరుధ్యం ఎలా ఉంటాయో కొడవటిగంటి కుటుంబరావు 'అంపకాలు' పాఠం చెబుతుంది. అనుభూతి ప్రధానమైన ఈ పాఠంలో బాబాయి, అమ్మ, చిట్టి లేదా చిట్టాం పాత్రలు. 'రిప్‌వాన్ వింకిల్' పాఠం వైజ్ఞానిక కల్పన. వింకిల్ గాఢ నిద్ర నుంచి ఇరవైఏళ్ల తర్వాత మేల్కొంటాడు. ఈలోగా జరిగిన శాస్త్రవిజ్ఞానాభివృద్ధిని వివరిస్తూనే శాస్త్రం మానవతాదృష్టిని మరవకూడదని హెచ్చరిస్తుందీ పాఠం. చివరికి ఉదరంలో పుట్టిన వ్రణంతో, మానసిక ఆందోళనతో వింకిల్ మరణిస్తాడు.
          ఒక పని చెయ్యడంలో వ్యక్తికైనా, వ్యవస్థకైనా నిబద్ధత, నిజాయతీ, సానుకూల దృక్పథం ఉండాలంటూ గోరాశాస్త్రి రాసిన 'చేనేత దృక్పథం' వివరిస్తుంది. ఈ పాఠ్యభాగంలో ముట్నూరి కృష్ణారావు, ప్రకాశం పంతులు గురించి ప్రస్తావన ఉంటుంది. 'వదరుబోతు' పాఠం రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ రాశారు. విమర్శ వ్యాసం సమాజాన్ని తీర్చిదిద్దుతుందని, ప్రబోధం, సంస్కరణలే ప్రధానంగా వ్యాసప్రక్రియ కొనసాగుతుందనీ ఆయన తెలిపారు. ఇందులో పప్పూరి రామాచార్యులు, అడిసన్‌దొర, పానుగంటి లక్ష్మీనరసింహారావు, వంగూరు సుబ్బారావు, పక్కా గురురామాచార్యులు, కాళిదాసు ప్రస్తావన ఉంది. స్థానం నరసింహారావు నటనానుభవాలను, సమస్యలను వివరించే పాఠం 'రంగస్థలంపై సమయస్ఫూర్తి'. స్థానం మొదట 'చంద్రమతి', ఆ తర్వాత సత్యభామ, శకుంతల, రోషనార లాంటి స్త్రీపాత్రలు ధరించారు. నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు అనుకోని సంఘటనలు, చిక్కులు ఎదురవుతాయి. వాటిని సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు పరిష్కరించుకుంటే తప్ప నాటకం రక్తి కట్టదని ఈ పాఠం తెలియజేస్తుంది. ఇందులో గంగవరపు కృష్ణయ్య, చోరగుడి హనుమంతరావు, కె. గోవిందరావు, కొప్పరపు సుబ్బారావు, మీర్‌జుమ్లా లాంటి వారి గురించి పేర్కొంటారు.
 సంగం లక్ష్మీబాయి జీవితానుభవాలను వివరించే పాఠ్యభాగం 'నా విషయం'. ఆమె సామాన్యస్థాయి నుంచి కష్టనష్టాలను సహించి ఉన్నత వ్యక్తిత్వాన్ని ఎలా సాధించిందో ఈ పాఠం వివరిస్తుంది. ఇందులో లక్ష్మీబాయి మేనమామ సంగం సీతారామయ్య ముఖ్యమైన పాత్ర. ఇంకా ఉన్నవ లక్ష్మీనారాయణ, పెద్దమేనమామ లింగయ్య, తల్లి సత్యవతి, శంకరంబాడి సుందరాచారి, ఉన్నవ లక్ష్మీబాయమ్మల గురించి పేర్కొన్నారు. 'ఊతపదాలు- వ్యర్థపదాలు' అనే పాఠంలో ప్రాచీన కవులు అనేక నియమాల వల్ల ఒక్కొక్కసారి వ్యర్థపదాలు ప్రయోగించారని, ప్రతి కవికీ ఇష్టమైన ఒక ఊతపదం ఉంటుందనీ సోదాహరణంగా వివరించారు తాపీ ధర్మారావు. ఇందులో ఎన్నో కావ్యాలను, చాలామంది కవి పండితులను ప్రస్తావించారు. ఛందస్సు కోసం దండగ మాటలు వాడటాన్ని రచయిత వివరించారు. తిక్కన, నన్నయ, పింగళి సూరన, ఎర్రన, శ్రీనాథుడు, రామరాజభూషణుడు లాంటి కవుల కావ్యాల్లో ఊతపదాలు, వ్యర్థపదాలు ప్రయోగించిన పద్ధతిపై ధర్మారావు వ్యాఖ్యానించారు. దళితుల అభ్యున్నతికి కృషిచేసి, కులపీడనపై పోరాటం సల్పిన అంబేద్కర్ గురించి బోయి విజయభారతి రాసిన పాఠమే 'అంబేద్కర్ వ్యక్తిత్వం'. కాలం విలువను గుర్తించి జ్ఞానార్జన చేసి తనవారి పురోవృద్ధికి అహర్నిశలూ కృషిచేసిన అంబేద్కర్ విశిష్ట జీవితాన్ని విజయభారతి చక్కగా తెలిపారు. భగవాన్‌బుద్ధ, జోతిబాపూలే, భక్త కబీరు అంబేద్కర్‌కి ఆరాధ్యులు. సిసిరో, గిబ్సన్, మెకాలే, చర్చిల్, నెపోలియన్, జె.ఆర్. అజగోంకర్ గురించి ఇందులో ప్రస్తావన వస్తుంది. స్వయంకృషి, ఆత్మవిశ్వాసం మనిషి మనుగడకి అత్యంతావశ్యకాలని అంబేద్కర్ వ్యక్తిత్వం ద్వారా తెలుసుకుంటాం.

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌