• facebook
  • whatsapp
  • telegram

జీవులు - లక్షణాలు 

జీవులు రెండు రకాలు. అవి: 1) సజీవులు, 2) నిర్జీవులు. జీవం/ప్రాణం ఉన్నవాటిని 'సజీవులు' అంటారు.

     ఉదా: మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు.
నిర్జీవులు: ప్రాణం/ జీవంలేని వాటిని నిర్జీవులు అంటారు.
     ఉదా: రాయి, కుర్చీ, చెక్క. 
సజీవుల లక్షణాలు
       1. పెరుగుదల                       2. చలనం 
       3. ఆహారాన్ని స్వీకరించడం           4. శ్వాసక్రియ 
       5. విసర్జన                          6. ప్రేరణ - ప్రతిస్పందన (క్షోభ్యత) 
       7. ప్రత్యుత్పత్తి

 

పెరుగుదల
జీవుల పరిమాణంలో ఏర్పడే శాశ్వత మార్పును 'పెరుగుదల' అంటారు. లేదా
జీవులు తిరిగి వాటి పరిమాణంలో యథాస్థితికి రాలేని లక్షణాన్నే 'పెరుగుదల' అంటారు.
జంతువుల్లో పెరుగుదల కొద్దికాలానికి ఆగిపోతుంది. కానీ మొక్కల్లో పెరుగుదల జీవితకాలమంతా కొనసాగుతుంది.

చలనం

* జీవులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలి వెళ్లడాన్ని 'చలనం' అంటారు.

* చలనం కోసం జంతువులకు ఉన్న అవయవాలను 'చలనాంగాలు' అంటారు.
* జంతువులు మాత్రమే చలనాన్ని ప్రదర్శిస్తాయి. మొక్కలకు చలనం ఉండదు. అవి జీవితకాలమంతా నేలలో స్థిరంగా పాతుకుని ఉంటాయి.
* జంతువులు 'ఆహారం, రక్షణ, నివాసం, సహచరులు, ప్రత్యుత్పత్తి' లాంటి చర్యల కోసం చలనాన్ని ప్రదర్శిస్తాయి.

ఆహారాన్ని స్వీకరించడం

జీవుల పెరుగుదల, చలనం, ప్రతిస్పందనలు, శరీర నిర్వహణా, రక్షణ లాంటి చర్యలకు శక్తి అవసరం. సజీవులు తమకు అవసరమైన శక్తిని పొందడానికి ఆహారాన్ని తీసుకుంటాయి. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. జంతువులు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఆహారం కోసం మొక్కలు, ఇతర జంతువులపై ఆధారపడతాయి.

శ్వాసక్రియ

* జీవి తీసుకున్న ఆహారంలో ఇమిడిన శక్తి శ్వాసక్రియ ద్వారా వినియోగపడేశక్తిగా మారుతుంది.
* జీవి తీసుకున్న ఆహారం జీర్ణమై జీవకణాల్లో ఆక్సిజన్‌తో చర్యనొంది క్రమేణ శక్తి విడుదలవుతుంది.
* జీవులు శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్‌ను శ్వాస అవయవాల ద్వారా గ్రహించి, కార్బన్‌డైయాక్సైడ్‌ను తిరిగి అవే అవయవాల ద్వారా బయటకు పంపుతాయి.

 

వివిధ జీవుల్లో శ్వాసావయవాలు
జీవి    -    అవయవం

చేప    -     మొప్పలు
కప్ప   -     ఊపిరితిత్తులు, చర్మం
తొండ   -     ఊపిరితిత్తులు
పక్షి    -      ఊపిరితిత్తులు
మానవుడు -   ఊపిరితిత్తులు

 

విసర్జన
* జీవక్రియల వల్ల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను దేహం నుంచి వెలుపలికి పంపించే ప్రక్రియను విసర్జన అంటారు.

*  జంతువుల్లో విసర్జన కోసం విసర్జక అవయవాలు (చర్మం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు) ఉంటాయి.

* మొక్కల్లో విసర్జనకు ప్రత్యేక అవయవాలు లేవు.
* మొక్కలు జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను తిరిగి తమ రక్షణ కోసం వినియోగించుకుంటాయి.

ప్రేరణ, ప్రతిస్పందన

జీవులు బాహ్య ప్రేరణలకు ప్రతీకార చర్య (లేదా) ప్రతిస్పందనలను చూపుతాయి.
* అధిక వెలుతురు కంటిపై పడితే కళ్లు చిట్లించడం.
* కాలిలో ముల్లు గుచ్చుకుంటే వెంటనే కాలిని వెనక్కి లాక్కోవడం.
* వేడి పాత్రను తాకితే వెంటనే చేతిని వెనక్కి తీసుకోవడం.
ఉదాహరణకు కాలికి ముల్లు గుచ్చుకోవడం చర్య అయితే కాలిని వెంటనే వెనక్కి లాక్కోవడం ప్రతిచర్య.
* కాండ భాగాలు భూమిపైన వెలుతురు వైపునకు పెరగడం.
* వేర్లు భూమిలోకి చొచ్చుకుని పెరగడం.
* అత్తిపత్తి మొక్కను ముట్టుకుంటే దాని పత్రాలు ముడుచుకోవడం.
* తామర పువ్వులు పగలు వికసించడం.
* కలువలు రాత్రిళ్లు వికసించడం.
* పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడివైపే తిరిగి ఉండటం.
ఈ చర్యలన్నీ బాహ్యప్రేరణలకు మొక్కలు చూపే ప్రతిస్పందనలు.

 

ప్రత్యుత్పత్తి
* జీవులు కొద్దికాలం జీవించి తర్వాత చనిపోతాయి, అయినప్పటికీ ప్రపంచంలో జీవరాశులు అంతరించవు.
* ఇలా జీవరాశులు అంతరించనందుకు కారణమయ్యే జీవక్రియ - ప్రత్యుత్పత్తి.
* జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి.
* ఈ క్రియ ద్వారా జీవరాశులు వాటి మనుగడను నిరంతరం కొనసాగిస్తాయి.
పైన తెలిపిన 'పెరుగుదల, చలనం, ఆహారం తీసుకోవడం, శ్వాసక్రియ, విసర్జన, ప్రేరణ - ప్రతిస్పందన; ప్రత్యుత్పత్తి' లాంటి క్రియలను సజీవులు మాత్రమే నిర్వహిస్తాయి. నిర్జీవులు ప్రదర్శించలేవు.

జీవులు - వర్గీకరణ

* భూమిపై ఉన్న అసంఖ్యాకమైన జీవుల గురించి సులభంగా అధ్యయనం చేయడానికి వాటిని ఒక క్రమపద్ధతిలో ఉంచాలి.
* జీవులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఆధారంగా సమూహాలుగా చేయడాన్నే 'వర్గీకరణ' అంటారు.
* వర్గీకరణను గురించి తెలిపే శాస్త్రాన్నే 'వర్గీకరణ శాస్త్రం' అంటారు.

 

వర్గీకరణ వల్ల ప్రయోజనాలు
* జీవులను సరళంగా, సులభంగా అధ్యయనం చేయవచ్చు.
* ఒక జీవిని సులభంగా గుర్తించవచ్చు.
* వివిధ జీవుల మధ్య సంబంధాలు, తేడాలను తెలుసుకోవచ్చు.
* జీవుల పుట్టుక, పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు.
* జీవరాశులను గుర్తించి, వర్గీకరించడానికి మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి అరిస్టాటిల్. అయితే ఈ వర్గీకరణకు అరిస్టాటిల్ ఉపయోగించిన విధానం సరైంది కాదు.
* చరకుడు (భారతీయ వైద్యుడు) రెండు వందల రకాల వృక్షాలు, జంతువులను వర్ణించాడు.
* వర్గీకరణలో ప్రాథమిక పరిణామానికి 'జాతి' అనే పదాన్ని మొదటిసారిగా జాన్‌రే ఉపయోగించాడు.
* 'కెరోలస్ లిన్నెయస్' (స్వీడన్) జాతిని రెండుపేర్లతో పిలిచే ప్రస్తుత విధానాన్ని ఏర్పరిచాడు. దీన్నే 'ద్వినామీకరణం' అంటారు

* వర్గీకరణం మీద లిన్నెయస్ రాసిన రెండు గ్రంథాలు

     1) వృక్షాల మీద - స్పీషీస్ ప్లాంటారమ్
     2) జంతువుల మీద - సిస్టమా నాచురె

ఈ ద్వినామీకరణ విధానానికి 'జాతి' అనేది ప్రాథమిక పరిమాణం.
*  జాతి అంటే ''దగ్గర పోలికలుండి ఒకదాంతో మరోటి స్వేచ్ఛగా సంపర్కం జరుపునుకునే జీవరాశుల సమూహం".
*  ద్వినామీకరణ విధానంలో ప్రతిజాతికీ రెండు పదాలుంటాయి. ఇవి లాటిన్ భాషలో ఉంటాయి. మొదటి పేరు ప్రజాతికి, రెండో పేరు జాతికి చెందింది.
*  ప్రజాతి పేరు నామవాచక రూపంలో ఉండి పెద్ద అక్షరంతో మొదలవుతుంది.
*  జాతినామం విశేషణ పదంగా ఉండి చిన్న అక్షరంతో మొదలవుతుంది.

శాస్త్రీయనామం: మొదట ప్రజాతి పేరు, తర్వాత జాతి పేరు రాసి, చివరగా దాన్ని కనుక్కున్న శాస్త్రజ్ఞుడి పేరు రాస్తారు. దీన్నే 'శాస్త్రీయనామం' అంటారు. 

ఉదా: హోమో సెపియన్స్  లిన్నెయస్ - మానవుడి శాస్త్రీయనామం. 
           
* శాస్త్రీయ నామాలను ఇటాలిక్స్‌లో గ్రీకు లేదా లాటిన్ భాషల్లో రాస్తారు.
* దీంట్లో ప్రజాతి పేరు మరోసారి వాడరు, కానీ జాతి పేరు తిరిగి వేరొక దానికి వాడొచ్చు
ఉదా: టామరిండస్ ఇండికా; మాంజిఫెరా ఇండికా, అజాడిరక్టా ఇండికా.
* ద్వినామీకరణ విధానాన్ని గాస్పార్డ్ బాహిన్ ప్రతిపాదించారు.
* అయితే ఈ విధానాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత 'కెరోలస్ లిన్నెయస్' కు దక్కుతుంది. అందుకే 'లిన్నెయస్' ను ద్వినామీకరణ సిద్ధాంత పితామహుడుగా పిలుస్తారు.

 

వర్గీకరణ విధానం:
* ఇది ఒక చెట్టులా ఉంటుంది. (కాండం - శాఖలు - చిన్నకొమ్మలు - ఆకులు)
* పత్రాలు/ ఆకులను వర్గీకరణంలోని 'జాతి'తో పోల్చవచ్చు.
* వర్గీకరణ విధానంలో 'జాతి' అనేది ప్రాథమిక పరిమాణం/ మూల ప్రమాణం.
* వర్గీకరణ జాతితో మొదలవుతుంది. ఇది ఆరోహణ పద్ధతిలో ఉంటుంది.

జాతి - (వృక్ష వర్గీకరణలో అతిచిన్న వర్గం)

- ప్రజాతి 
      - కుటుంబం  (దీని పేరు 'యేసి' తో అంతమవ్వాలి) 
         - క్రమం - (దీనిపేరు 'యేల్స్‌'తో అంతమవ్వాలి) 
             - తరగతి
               - వర్గం
                    - రాజ్యం(వృక్ష వర్గీకరణలో అతిపెద్ద వర్గం)
* వర్గీకరణలో పై నుంచి కిందకు వెళ్లే కొద్ది, జీవుల మధ్య పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనర్థం ఏమిటంటే రెండు క్రమాలు లేదా తరగతులు లేదా వర్గాలు లేదా రాజ్యాలకు చెందిన జీవుల కంటే ఒకే కుటుంబానికి చెందిన జీవుల మధ్య అధిక పోలికలుంటాయి.
ఉదా: కుక్క, తోడేలు ఒకే కుటుంబానికి చెందినవి కాబట్టి వాటి మధ్య పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి.
* వర్గీకరణలో కింద నుంచి పైకి వెళ్లే కొద్ది జీవుల మధ్య పోలికలు తక్కువగా కనిపిస్తాయి.
* కుక్క, కప్ప రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవి అందుకే వీటి మధ్య పోలికలు తక్కువగా ఉంటాయి. అలాగే రెండు విభిన్న వర్గాలకు చెందిన కుక్క, బొద్దింకల మధ్య కూడా పోలికలు తక్కువగా ఉంటాయి.
* టాక్సానమీ (వర్గీకరణ) అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది - ఎ.పి.డి. కండోల్
* భారతదేశంలో వృక్షశాస్త్ర పితామహుడు - పరాశరుడు (వృక్షాయుర్వేదం గ్రంథ రచయిత)

* చరకసంహిత గ్రంథ రచయిత - చరకుడు

* ద్వినామీకరణ పితామహుడు - కెరోలస్ లిన్నెయస్
* ప్రజాతి, జాతి పేర్లను సూచించే పదాలు ఒకటే అయితే దాన్ని - 'టాటొనిమి' అంటారు.
ఉదా: నాజా నాజా (నాగుపాము).
* డి హిస్టోరియా ప్లాంటారం గ్రంథకర్త - థియో ఫ్రాస్టస్
* జెనీరా ప్లాంటారమ్ - బెంథామ్, హుకర్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌