• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర శాసన సభ - చట్టాల తయారీ

* సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద చూపే దుష్ప్రభావాల వల్ల 2001, నవంబర్ 2న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ధూమపాన నిషేధం, ఆరోగ్య పరిరక్షణ చట్టం, 2002ను రూపొందించింది.
* దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, వాహనాల్లో పొగతాగడం నిషేధం.
* పొగతాగకూడదు అనే బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన సెక్షన్‌లు 5, 6, 10ని ఉల్లంఘిస్తే రూ.100 జరిమానా విధిస్తారు.
* రెండో సారి తప్పుచేస్తే రూ.200 - 500 వరకు జరిమానా విధిస్తారు.
* భారతదేశంలోని రాష్ట్రాలన్నీ చట్టసభలను ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం వీలు కల్పించింది.
* దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు.
* భారత్‌లోని రాష్ట్రాలు ఏకసభ లేదా ఉభయ సభలను కలిగి ఉన్నాయి.
* దిగువ సభను విధానసభ లేదా శాసనసభ అంటారు.
* ఎగువ సభను శాసనమండలి అంటారు.

 

శాసనసభ:

* రాష్ట్రానికి చట్టాలు చేయడంలో ఈ సభ కీలకమైంది.
* రాష్ట్ర సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో, విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది.
* సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ/ విధానసభలో 294 మంది సభ్యులు ఉండేవారు.
* విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర విధానసభలో సభ్యుల సంఖ్య 119 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 175 ఉన్నాయి.
* ప్రతి రాష్ట్ర శాసనసభ అయిదు సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటుంది.
* కొన్ని సందర్భాల్లో కాల పరిమితి కంటే ముందే గవర్నర్ విధానసభను రద్దుచేయవచ్చు.
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే సంవత్సరం చొప్పున రాష్ట్ర విధానసభ కాల పరిమితిని పార్లమెంటు పొడిగించవచ్చు.
* రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లు సమావేశమవ్వాలి.
* రెండు సమావేశాల మధ్య కాలం ఆరు నెలలకు మించకూడదు.
* ప్రతి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య అక్కడి జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గంలో సుమారు 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు.
* 18 సంవత్సరాలు దాటిన స్త్రీ, పురుషులందరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
* ఒక నియోజకవర్గంలోని ఓటరుకు ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది.
* ఉభయ సభలున్న తెలంగాణలో ఆ రాష్ట్ర శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది.

 

M.L.A. ఎన్నిక

* సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి.
* రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెడతాయి.
* ఏ రాజకీయ పక్షానికీ చెందనివారు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వీరిని ''స్వతంత్ర అభ్యర్థులు" అంటారు.
ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలు:
* భారతదేశ పౌరుడై ఉండాలి.
* 25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
* ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు.
* చట్టం నిర్దేశించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
* అన్ని రాజకీయ పక్షాలూ తమ ఎన్నికల ప్రణాళికా పత్రాన్ని (Election Manifesto) ప్రకటిస్తాయి.
* ఈ Manifestoలో భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో పొందుపరుస్తారు.
* ఎన్నికల రోజు ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఓటు వేస్తారు.
* పోలింగ్ అధికారి ఓటర్ల గుర్తింపు కార్డును పరిశీలిస్తారు.
* ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో చెప్పకూడదు.
* ఓటును రహస్యంగా వేయాలి.

 

ప్రభుత్వం - ఏర్పాటు

* రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సగం కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
* గెలిచిన పార్టీ సభ్యులు తమలో ఒకరిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారు.
* గవర్నర్ ఆ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తారు.
* ముఖ్యమంత్రి తమ పార్టీ శాసనసభ లేదా శాసన మండలి సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తారు.
* ఈ మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి మంత్రిమండలి (కేబినెట్)గా ఏర్పడతారు.
* ఈ మంత్రిమండలి లేదా కేబినెట్‌నే ''ప్రభుత్వం" అని పిలుస్తారు.
* కొత్త చట్టాలను రూపొందించడం, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది.

 

సంకీర్ణ ప్రభుత్వం
     ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాని పక్షంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. దీన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటారు.

 

మంత్రి మండలి

* మంత్రిమండలిలోని సభ్యులకు ముఖ్యమంత్రి వివిధ శాఖలను కేటాయిస్తారు.
* తమ శాఖలకు సంబంధించి మంత్రులు విధానపరమైన నిర్ణయాలను (Policies) నిర్దేశిస్తారు.
* ఈ విధి విధానాలకు ప్రణాళికలను రూపొందించి, చట్టసభలో ప్రవేశపెట్టి ఆమోదించే వరకు మంత్రివర్గం బాధ్యత వహిస్తుంది.
* సాధారణంగా శాఖల విధి విధానాలను ఆయా మంత్రులు స్వతంత్రంగా నిర్ణయించినా, కీలకమైన వాటిని మంత్రిమండలి సమావేశంలో సభ్యులందరూ కలిసి నిర్ణయిస్తారు.
* ఏదైనా తప్పు జరిగితే దానికి మంత్రివర్గమంతా ముఖ్యమంత్రితో కలిసి సమష్టిగా బాధ్యత వహిస్తుంది.

 

స్పీకర్:

* రాష్ట్ర శాసనసభ్యులందరూ కలిసి తమలో ఒకరిని విధానసభ అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ఆయనను 'స్పీకర్' అంటారు.
* ఈయన శాసనసభను సమావేశపరుస్తారు.
సమస్యలను సభలో ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టాలో నిర్ణయిస్తారు.
* నిర్ణయాలను అతిక్రమించే సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.
* విధానసభలోని ఏదైనా బిల్లును ఆర్థిక బిల్లా? కాదా? అని నిర్ణయిస్తారు.
* ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు, విధానాలు, విధించే పన్నులు అసెంబ్లీ ఆమోదం పొందాలి.
* శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకువస్తారు.
* సంబంధిత మంత్రులు ఆయా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.

 

చట్టాలు చేయడం (Making of Law)

* సాధారణంగా శాసనసభలో సంఖ్యాబలం ఉన్న అధికార పక్షం చట్టాలను తయారు చేస్తుంది.
* సభ ఆమోదం పొందకముందు చట్టాన్ని ''బిల్లు" అంటారు.
* ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారుతుంది.
* దీన్ని శాసనసభ చేసిన శాసనం (Act)అంటారు.
* ఏదైనా బిల్లు కేబినెట్ ఆమోదం పొంది, అసెంబ్లీ / విధానసభ ముందుకు ఓటింగ్ కోసం వస్తుంది.
* శాసనసభలో సగానికిపైగా సభ్యుల ఆమోదం పొందిన బిల్లును విధాన పరిషత్తులో ప్రవేశపెడతారు.
* విధాన పరిషత్తు ఆమోదం అనంతరం దాన్ని గవర్నర్ పరిశీలనకు పంపిస్తారు.
* గవర్నర్ ఆమోదం పొందిన బిల్లు చట్టంగా లేదా శాసనంగా మారి ''గెజిట్‌"లో అచ్చు అవుతుంది.

 

శాసనమండలి (MLC)

* సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 1958లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ''శాసనమండలి"ని ఏర్పాటు చేశారు.
* 1985లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ''శాసనమండలిని రద్దుచేశారు.
* 2007లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ''శాసనమండలి"ని తిరిగి ప్రవేశపెట్టారు.
* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలి 40 మంది సభ్యులతో కొనసాగుతోంది.
* శాసనమండలి అనేది శాశ్వత సభ.
* సభ్యుల కాలపరిమితి ఆరు సంవత్సరాలు.
* వీరిలో 1/3వ వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు పదవీ విరమణ చేయగా, వీరి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు.
* వీరినే శాసనమండలి సభ్యులు (MLC) అంటారు.

 

శాసనమండలికి పోటీ చేసేందుకు అర్హతలు:

* భారతీయుడై ఉండాలి.
* 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
* ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు.

 

శాసనమండలి - సభ్యుల నిర్మాణం

* 1/3వ వంతు సభ్యులను శాసనసభ్యులు (MLA) ఎన్నుకుంటారు.
* 1/3వ వంతు సభ్యులను స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి ఎన్నుకుంటారు.
* 1/12వ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు.
* 1/12వ వంతు సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
* 1/6వ వంతు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు.
* రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా రెండు సభల ఆమోదం తప్పనిసరి.
* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధానసభ స్పీకర్: ఎస్.మధుసూదనాచారి.
*ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్ / శాసన మండలి ఛైర్మన్: స్వామిగౌడ్.
* శాసనమండలి అధ్యక్షుడిని ''ఛైర్మన్" అంటారు.

 

గవర్నర్:

* గవర్నర్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా పనిచేసేలా చూడటం గవర్నర్ బాధ్యత.
* గవర్నర్ రాష్ట్రాధినేత, రాష్ట్ర ప్రథమ పౌరుడు.
» గవర్నర్ ముఖ్యమంత్రిని రాజ్యాంగబద్ధంగా నియమిస్తారు.
* గవర్నర్ మంత్రిమండలి సభ్యులను ముఖ్యమంత్రి సలహా మేరకు నియమిస్తారు.
* రాజ్యాంగం గవర్నర్‌కు కార్యనిర్వాహక అధికారాలను కల్పించింది.
* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్: నరసింహన్.

 

రిజర్వేషన్ల పద్ధతి:

* దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీచేసి గెలవడం అనేది చాలా కష్టంతోకూడుకున్న పని.
* షెడ్యూల్డు కులాల, తెగల వారికి చట్టసభల్లో భాగస్వామ్యం కల్పించేందుకు భారత రాజ్యాంగం నియోజకవర్గాలను కేటాయించింది.
* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధానసభలో మొత్తం సభ్యుల సంఖ్య: 119.
* తెలంగాణ విధానసభలో ఎస్సీలకు కేటాయించిన సీట్ల సంఖ్య: 19
* తెలంగాణ విధానసభలో ఎస్టీలకు కేటాయించిన సీట్ల సంఖ్య: 12

 

జిల్లాలో చట్టాల అమలు

* ప్రభుత్వశాఖల్లోని అధికారులు మంత్రుల ఆదేశాలను అమలుచేస్తారు.
* ఈ అధికారుల్లో కొంత మంది రాజధాని హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రమంతటా అమలుచేయడానికి చర్యలు తీసుకుంటారు.
* పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించారు.
* ప్రభుత్వం జిల్లాకేంద్రాల్లో ఆయా శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసి చట్టాలను, వివిధ పథకాలను అమలుచేస్తుంది.
* తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి.
* ప్రతి జిల్లాలో వివిధ శాఖల సమన్వయానికి ఒక జిల్లా కలెక్టర్ ఉంటారు.

* మన దేశంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను 1772లో వారన్ హేస్టింగ్స్ ఏర్పాటుచేశారు.
 

జిల్లా కలెక్టర్ అధికారాలు - విధులు

* న్యాయ, శాంతి భద్రతలకు సంబంధించిన అధికారాలు.
* అభివృద్ధికి సంబంధించిన అధికారాలు.
* రెవెన్యూ, అత్యవసర, పౌరసరఫరా అధికారాలు.
* జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అధికారాలు.
* కలెక్టర్ సమర్థతపైనే జిల్లా ప్రగతి ఆధారపడి ఉంటుంది.

 

తహసీల్దార్ (మండల రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి)

* జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం ''మండలాలు"గా విభజించారు.
* జిల్లా కేంద్రంలాగానే మండల కేంద్రంలో మండలానికి సంబంధించిన అభివృద్ధి, రెవెన్యూ, విద్య, వ్యవసాయ కార్యాలయాలు ఉంటాయి.
* భూ రికార్డుల నిర్వహణ ప్రభుత్వ కర్తవ్యం.
* వీటిలో వ్యవసాయ, అటవీ సంబంధిత, బీడు భూముల వివరాలు పటాలతో వర్ణించి ఉంటాయి.
* గ్రామంలో గ్రామ రెవెన్యూ అధికారి (VRO), మండలంలో మండల రెవెన్యూ అధికారి, భూ సంబంధిత రికార్డులకు బాధ్యత వహిస్తారు.
* వీరు తాజా సమాచారం నమోదుకు, రేషన్ కార్డుల జారీకి బాధ్యత వహిస్తారు.

 

ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టం, 2002

* భావితరాల జీవితావసరాల కోసం పరిరక్షణ, అభివృద్ధి వనరుల సంరక్షణ అవసరం.
* 2002లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల రక్షణ చట్టాన్ని చేశారు.
* ఈ చట్టం 2002, ఏప్రిల్ 19 నుంచి అమలులోకి వచ్చింది.

 

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:

* బోరుబావులను, బావులను తవ్వడానికి మండల రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి.
* వర్షపు నీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
సామాజిక అడవుల పెంపకాన్ని విస్తృతం చేయాలి.
* భూగర్భజలాలు తగ్గిన ప్రాంతాల్లో నదుల నుంచి ఇసుక తవ్వడం నిషేధం.
* మంచినీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం.
* అనుమతి లేకుండా చెట్లను నరకడం నిషేధం.
* పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకోవాలి.
* ఈ చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. దీని పేరు
* "Water, Land and Trees Protection Authority" (WALTA).
ఈ చట్టం ప్రకారం అటవీశాఖ అడవుల రక్షణ ద్వారా నీటి వనరులను పెంచుతుంది.
పరిశ్రమలశాఖ నీటిని కలుషితం చేయకుండా చర్యలు తీసుకుంటుంది.
* ప్రభుత్వ శాఖలోని వివిధ అధికారులు 'WALTA' చట్టం అమలుకు బాధ్యత వహిస్తుస్తారు.

* 1985లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రెవెన్యూ మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
* మండల పరిషత్ వ్యవస్థను తొలిసారిగా కర్ణాటకలో 1985లో ప్రవేశపెట్టారు.
* మండల పరిషత్ వ్యవస్థను 1986లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు ప్రవేశపెట్టారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌