• facebook
  • whatsapp
  • telegram

పెడగోజీ 1 నుంచి 14 పాఠాలు

1. అభ్యసనం - అభ్యాసకుడితో దాని సంబంధం

* బోధనా ప్రక్రియ ఉపాధ్యాయుడిపరంగానూ, అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగానూ జరగాలి.
* బోధనాభ్యసన ప్రక్రియ ఏకకాలంలో నిర్వహించగల ప్రక్రియ.
* విద్య ద్విధ్రువ ప్రక్రియ.
* ఉపాధ్యాయుడు  విద్యార్థి
* విద్యను ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొన్నవారు - జాన్ ఆడమ్స్.
* విద్య ద్విధ్రువ ప్రక్రియ అనే భావనలో విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న సంబంధాన్ని సంక్షిప్తంగా వ్యక్తీకరించగా ఇందులో ఇంకా చేర్చాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది బోధనాంశం.
* విద్యావేత్తల మార్గదర్శనాన్ని, సూచనలను ఆధారం చేసుకుని ఉపాధ్యాయుడు కొన్ని బోధనా లక్ష్యాలను రచించుకుంటాడు. వాటినే విద్యార్థి కల్పించుకుంటాడు. కాబట్టి బోధన అనేది యాదృచ్ఛికంగా జరిగే పనికాదు.
జాన్ డ్యూయీ ప్రకారం విద్య త్రిధ్రువ ప్రక్రియ. అంటే సాంఘికం, సమాజం కూడా అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉంటాయి.
* ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం కూడా కలసి ఉంటాయి. కాబట్టి ఇది సమగ్రమైన ప్రక్రియ.        
* పూర్వ కాలంలో బోధన కేవలం ఉపాధ్యాయ కేంద్రంగా జరిగేది. కాబట్టి దండన అమల్లో ఉండి, విద్యార్థి ఆలోచనలకు తావు ఉండేది కాదు.
* ప్రస్తుతం విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య పూర్తిగా విద్యార్థి కేంద్రంగా మారిపోయింది. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థిని అర్థం చేసుకోవడమే అత్యంత ప్రధానం.

2. వివిధ సందర్భాల్లో అభ్యాసకులు 

  అభ్యాసకులకు సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాల కల్పన
* జాన్ డ్యూయీ పాఠశాలను ఒక చిన్న మోతాదుల సమాజం (Miniature Society) గా 'Democracy and Education' అనే గ్రంథంలో పేర్కొన్నారు.
* పాఠశాలలో అనేక రకాలైన సామాజిక సంప్రదాయాలు జరుగుతాయి.
ఉదా: ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులు లేచి నిలబడటం.
          జాతీయ పండగలు జరపడం.
* పాఠశాల చర్యాత్మక సిద్ధాంతానికి అనుకూలంగా ఉండాలని ఈ సిద్ధాంత రూపశిల్పి అయిన 'వైగోటోస్కీ' (రష్యా) తెలిపారు.
* లియోస్టెల్, కాఫోర్డ్ ప్రకారం చర్యాత్మక సిద్ధాంతం ఒక చర్య వల్ల కలిగే వ్యక్తిగత అనుభవాల ఫలితంగా ఏ ప్రక్రియ ద్వారా జ్ఞానం ఆర్జించబడుతుందో తెలుపుతుంది.
* గణిత బోధనలో 'వైగోటోస్కీ' లాంటి నిర్మితివాదుల సాంఘిక, సాంస్కృతిక అంశాల ప్రభావాన్ని గురించి తొలిసారిగా తెలిపిన శాస్త్రవేత్త - 'కోబ్'.
* అభ్యసనంలో నాడీ సంబంధాలు, ప్రవర్తన గురించి తెలిపినవారు - ప్రవర్తనావాదులు.
* ఈ సంబంధాన్ని మరింత విస్తృతం చేసినవారు - జర్మన్ సమగ్రాకృతివాదులు.
* మానవ అభ్యసనాన్ని మానవీయ కోణం నుంచి పరిశీలించిన వ్యక్తి ఆల్బర్ట్ బండూరా (సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో)
* వైగోట్‌స్కీ సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర ప్రతిచర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, తద్వారా జ్ఞానం విస్తృతమవుతుందని పేర్కొన్నారు.

 

సామాజిక - రాజకీయ - సాంస్కృతిక పరిస్థితుల కల్పనకు సూచనలు:
     1) తరగతిని గ్రూపులుగా విడగొట్టడం
     2) పనులను గ్రూపులకు అప్పగించడం
     3) వృత్తి నిపుణతతో విద్యార్థులకు సంబంధాన్ని ఏర్పరచడం
     4) సాంస్కృతిక వనరులను పూర్తిగా వినియోగించుకోవడం
     5) మాక్ పార్లమెంటు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం.

3. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య (CWSN) 

ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలను అనుసరించి అందించే విద్యను ప్రత్యేక విద్య అంటారు. ఈ పిల్లలకు సాధారణ విద్యనందించడం ద్వారా వీరి అవసరాలను తీర్చలేం. కాబట్టి ఈ పిల్లల సామర్థ్యాలను గుర్తించి వాటిని తగిన శిక్షణ ద్వారా గరిష్ఠంగా అభివృద్ధిపరచడమే ప్రత్యేక విద్య లక్ష్యం.
ఉదా: దృష్టిలోపం గల వారికి బ్రెయిలీ లిపి ద్వారా విద్యనందించడం.
ప్రత్యేక విద్య పరిధి: ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించడం, వర్గీకరణం, వారి విద్యా అవసరాలను అంచనా వేయడం, మార్గదర్శకత్వం, పరిశోధన, ప్రత్యేక బోధనోపకరణాలు, ప్రత్యేక బోధనాపద్ధతులు ఉపయోగించడం లాంటివి చేపట్టడం.
కొఠారి కమిషన్: ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ:
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను డన్ (Dunn) అనే శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించారు.
      1) ప్రతిభావంతులైన పిల్లలు
      2) విద్య నేర్వగల/ బోధించగల బుద్ధిమాంద్యులు
      3) తర్ఫీదు పొందగల బుద్ధిమాంద్యులు
      4) మానసిక/ సాంఘిక సమయోజనం లోపించినవారు
      5) భావోద్రేకం లోపించినవారు
      6) భాషణ లోపం గలవారు
      7) బధిరులు
      8) కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు
      9) దృష్టి లోపం ఉన్నవారు
      10) కొద్దిపాటి దృష్టిలోపం ఉన్నవారు
      11) అంగవైకల్యం ఉన్నవారు
      12) దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు
      పై వర్గాల్లో ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన వారిని బహుళ వైకల్యం గల వారిగా పేర్కొనవచ్చు. సాధారణంగా బుద్ధిమాంద్యం గల పిల్లలు ఎక్కువగా బహుళ వైకల్యం గలవారిగా ఉంటారు.

 

I. మానసిక వైకల్యం/ బుద్ధిమాంద్యులు (Mentally Retarded)
ప్రతి ఒక్కరిలో వయసుతో పాటు మానసికంగా వికాసం అభివృద్ధి చెందుతుంది. ఇలా కాకుండా శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం అభివృద్ధి చెందక మందగించడమే మానసిక వైకల్యం అవుతుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియెన్సీ ప్రకారం 70 పాయింట్ల ఐక్యూ కంటే తక్కువ గలవారు మానసిక వైకల్యం గలవారు. వీరిని 4 రకాలుగా వర్గీకరించవచ్చు.

      1) స్వల్ప బుద్ధిమాంద్యులు (ప్రజ్ఞ 50 నుంచి 70 మధ్య గలవారు)
      2) మిత బుద్ధిమాంద్యులు (30 నుంచి 50)
      3) తీవ్ర బుద్ధిమాంద్యులు (20 - 39)
           వీరిని సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు అంటారు.
      4) సంపూర్ణ బుద్ధిమాంద్యులు (20 కంటే తక్కువ)

 

ఎ) మానసిక వైకల్యానికి కారణాలు:
      1) జన్యుపరమైన లోపాలు
      2) మేనరిక వివాహాలు
      3) తల్లి ఎక్కువ వయసులో పిల్లలకు జన్మనివ్వడం
      4) పౌష్టికాహార లోపం
      5) అపరిపక్వ జననం


బి) బుద్ధిమాంద్యులు - విద్యా ప్రణాళిక:
      వీరికి బోధించే విద్య వారి వ్యక్తిగత, సాంఘిక, వృత్తిపర అభివృద్ధి కోసం ఉద్దేశించింది. దీన్ని కిర్క్, జాన్సన్ ప్రతిపాదించారు.
1. సమైక్య విధానం: స్వల్ప బుద్ధిమాంద్యం ఉన్నవారిని, ఇతర విద్యార్థులతోపాటు కలిపి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసింపజేయడం.

2. ప్రత్యేక పాఠశాలలు: తీవ్ర, తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల శిక్షణను, ప్రత్యేకంగా వారికోసం ఉద్దేశించిన పాఠశాలల్లో అందజేయడం.
3. ఆశ్రమ పాఠశాలలు: పాఠశాలలు, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో తీవ్ర బుద్ధిమాంద్యుల కోసం నెలకొల్పినవి.
4. గృహ శిక్షణ: చిన్న పిల్లల శిక్షణకు పాఠశాల అందుబాటులో లేని పరిస్థితిలో లేదా పాఠశాలకు తీసుకురాలేని పరిస్థితిలో వారి ఇంటివద్దే గృహ శిక్షణ పద్ధతిని ఉపయోగించవచ్చు.

 

సి. బుద్ధిమాంద్యుల ప్రవర్తనను అభివృద్ధిపరిచే పద్ధతులు:
1) ఆకృతీకరణ: బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక నిర్దేశిత లక్ష్యాన్ని చేరే వరకు క్రమపద్ధతిలో పురోగమిస్తూ విజయవంతం అయిన వాటికి ప్రోత్సాహకాలను ఇస్తూ ముందుకు సాగే విధానం.
2) క్రమేణ అస్తిత్వం: నిర్దేశిత కార్యాన్ని విద్యార్థి చేసే వరకు సహాయాన్ని అందించి ఆ తర్వాత అతడి పురోగమనాన్ని బట్టి సహాయాన్ని తగ్గించడం.
3) సాధారణీకరణం: ఒక పరిస్థితిలో నేర్చుకున్న ప్రవర్తనను భవిష్యత్‌లో అవసరమైన నూతన పరిస్థితికి కూడా ఉపయోగించుకోవడం.
4) గొలుసు విధానం: ఆశించిన ప్రవర్తనను పొందడానికి చేపట్టాల్సిన కార్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఈ గొలుసు విధానాన్ని 2 రకాలుగా నిర్వహిస్తారు.

i) ఆరోహణ గొలుసు విధానం: ప్రతిస్పందనలను మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు కలుపుతూ బోధించడం.
* బుద్ధిమాంద్యులకు ఈ పద్ధతిని అధికంగా ఉపయోగిస్తారు.
ii) అవరోహణ గొలుసు విధానం: ప్రతిస్పందనలను చివరి మెట్టు నుంచి మొదటి మెట్టు వరకు వెనక్కి బోధించే విధానం.
5. ప్రమేయ కార్యక్రమాలు: బుద్ధిమాంద్యులకు మానసిక వికాసం కలిగించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమాలనే ప్రమేయ కార్యక్రమాలంటారు.

II. దృష్టి వైకల్యం గల పిల్లలు
చూడగలిగే సామర్థ్యం లేకపోడమే అంధత్వం. ప్రపంచంలోనే మొదటిసారిగా 1784లో ప్యారిస్ నగరంలో 'సర్ వాలెంటిన్ హ్యూ' అనే వ్యక్తి అంధుల పాఠశాలను స్థాపించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల చట్టం (Persons with Disabilities Act - 1995) కింది లక్షణాలున్న వారిని అంధులుగా పేర్కొంది.
1) పూర్తిగా దృష్టి లోపం ఉండటం
2) దృష్టి స్పష్టత గరిష్ఠ సవరణల తర్వాత 20/ 200 లేదా 6/ 60 కంటే తక్కువ ఉండటం
3) దృష్టి క్షేత్ర కోణం 20 లేదా అంతకంటే తక్కువ ఉండటం
4) క్షీణదృష్టి ఉండటం.
* దృష్టి స్పష్టత 6/60 అంటే సాధారణ దృష్టి గల వ్యక్తి 60 మీటర్ల నుంచి చూడగలిగేదాన్ని దృష్టి లోపం గల వ్యక్తి 6 మీటర్ల దూరం నుంచి మాత్రమే చూడగలగడం.
* సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్లతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180º పరిధిలో చూస్తాడు. ఇదే దృష్టి క్షేత్రం దృష్టి కేంద్రం 20º పరిధికి మాత్రమే పరిమితమైతే ఆ స్థితిని అంధత్వంగా చెప్పవచ్చు.

దృష్టి వైకల్యం గల వారికి విద్యా ప్రణాళిక:
1) వీరికి ప్రత్యేక తరగతులు, సహపాఠ్యప్రణాళిక కార్యక్రమాలను నిర్వహించాలి.
2) నల్లబల్లపై రాసిన విషయాన్ని ఉపాధ్యాయుడు గట్టిగా చదవాలి.
3) నల్లబల్లపై అక్షరాలు పెద్దగా, స్పష్టంగా రాయాలి.
4) దృష్టి సంబంధ కృత్యాలు తక్కువగా ఉండాలి. సాధారణ పిల్లలతో పాటు పాక్షిక దృష్టి ఉన్న పిల్లల సాయం తీసుకుని కార్యక్రమాలను, కృత్యాలను ఏర్పాటు చేయాలి.
5) తరగతిలో వీరిని ముందు వరుసలో కూర్చోబెట్టాలి.

 

అంధులకు ప్రత్యేక విద్యా సూత్రాలు:
1) మూర్తత్వం: మూర్త అనుభవాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
2) స్వీయ కృత్యాలు: విద్యాభ్యాసంలో స్వీయ కృత్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రోత్సహించాలి.
3) ఏకీకృత బోధన: బాహ్య ఘటనలు, వస్తువుల మధ్య ఉండే సంబంధాన్ని ఏకీకృతం చేస్తూ అర్థమయ్యేలా బోధించాలి.
ఉదా: బల్లపై ఉన్న పుస్తకాన్ని తాకించి అర్థమయ్యేలా చేయడం.
4) విహార యాత్రలు: విహార యాత్రలు, మ్యూజియంలను దర్శింపజేయాలి. రేడియోల ద్వారా నూతన అనుభవాన్ని పెంపొందించాలి.
5) బ్రెయిలీ లిపి ద్వారా అభ్యసన కృత్యాలు కల్పించాలి. ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయీ బ్రెయిల్ అంధుల కోసం ప్రత్యేకమైన ఆరు చుక్కల లిపిని రూపొందించారు.

 

III. శ్రవణ వైకల్యం గల పిల్లలు
వికలాంగ వ్యక్తుల చట్టం (PWD Act 1995) ప్రకారం బాగా వినబడుతున్న చెవిలో 60 d BHL లేదా అంతకంటే ఎక్కువ లోపం ఉంటే వారిని వినికిడి లోపం గల వారిగా గుర్తిస్తారు. మన చెవులు కేవలం 50 నుంచి 70 డెసిబుల్స్ శబ్దాలను ఎలాంటి హాని లేకుంటే వినగలుగుతాయి. 90 నుంచి 120 డెసిబుల్స్ ఉన్న శబ్దాలు చెవులకు హాని చేస్తాయి.

 

విద్యా ప్రణాళిక:
1) విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయుడు మౌఖిక, సంజ్ఞ, సమగ్ర సమాచార పద్ధతులను వాడాలి. అంటే తన పెదవుల కదలిక, ముఖ కవళికలు, శరీర భాషను పిల్లలు చూసి ఉపాధ్యాయుడి భావనలను అర్థం చేసుకునేలా ఉండాలి.
2) మెరుపులు, రంగులు ఉండే దృశ్యోపకరణాలు వాడాలి.

IV. చలన వైకల్యం గల పిల్లలు:
వ్యక్తిలో చలనశక్తి సంబంధిత సామర్థ్యం లేకపోవడాన్ని చలన వైకల్యం అంటారు.

 

చలన వైకల్య కారణాలు:
      1) జన్యుపరంగా సంక్రమించే 'వారసత్వ' సమస్యలు.
      2) పుట్టుకతోనే కొందరిలో వేళ్లు కలిసిపోవడం, ఎముకల లోపం, వంకర కాళ్లు మొదలైనవి.
      3) ఆహార లోపం వల్ల కూడా చలన సమస్యలు రావచ్చు.
మస్తిష్క పక్షవాతం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది:
1. ఎథెటోసిస్: వీరు చలనాంగాలైన కాళ్లు, చేతులు, భుజాలు, నోరు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికల వల్ల సరిగ్గా నడవలేరు. వస్తువులను పట్టుకోలేరు. స్పష్టంగా మాట్లాడలేరు.
2. అటాక్సియా: వీరు సమావస్థ శక్తిని కోల్పోవడం వల్ల వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి, ప్రాదేశిక సంబంధాలు తక్కువగా ఉంటాయి.
3. స్పాస్టిసిటీ: కండరాల్లో అసంకల్పిత ప్రతీకార చర్య ఉండటం వల్ల వీరి కండరాల కదలిక వారు నిర్ధేసించే విధంగా ఉండక, చేయిని ఒకవైపు చాపాలంటే అది మరోవైపు పోతుంది.
4. అనమ్యత: కండరాలు బిగుసుకోవడం వల్ల అవయవాలను సరిగ్గా కదల్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటాక్సియా, స్పాస్టిసిటీ, అనమ్యత వల్ల మానసిక క్షయీకరణ, దృష్టి, శ్రవణ, వాక్కు లోపాలు కలగవచ్చు.

V. ప్రతిభావంతులు:
ఉన్నత మేధాశక్తి, విశిష్ట సామర్థ్యాలు ఉండే పిల్లలను ప్రతిభావంతులు అంటారు. గిఫ్టెడ్ అనే విధాన్ని మొదట 1869లో ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించారు.
టెర్మన్: "ప్రజ్ఞా లబ్ధి 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లు ప్రతిభావంతులు".

 

లక్షణాలు:
* పరిసరానుగుణ్యత
* అధిక చురుకుదనం
* అపారమైన స్మృతి
* సమస్య పరిష్కారంలో సహజత్వం
* తార్కిక కల్పనం, సమస్యా పరిష్కార శక్తి
* భావాలను త్వరగా గుర్తించడం
* ఉద్వేగంలో స్థిరత్వం కలిగి ఉండటం
* మంచి సాంఘిక సంబంధాలు కలిగి ఉండటం
* విద్యాపరంగా మంచి మార్కులు, పఠనాంశ ఆసక్తి, ప్రావీణ్యం చూపడం
* భిన్న అభిరుచులు, మంచి సర్దుబాటు చూపడం.

1. విద్యా ప్రణాళిక:
ఎంపిక: (Selection) ప్రత్యేకించిన విద్యా కార్యక్రమాలను అమలు చేయడానికి ముందు ప్రతిభావంతులను వివిధ మార్గాల ద్వారా ఎన్నుకోవాలి.

* ఉపాధ్యాయుల అభిప్రాయాలు
* కింది తరగతుల్లో వచ్చిన మార్కులు
* వారిలోని ప్రజ్ఞాలబ్ధి/ప్రతిభా లబ్ధి

2. పృథఃకరణం (Seggregation):
ప్రతిభావంతుల్లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి కింది కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.
* ప్రత్యేక తరగతి గతి ఏర్పాటు
* వారి అభిరుచుల ఆధారంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం
* ప్రత్యేకమైన పాఠశాలల ఏర్పాటు.
ఉదా: జవహార్ నవోదయ విద్యాలయ
* ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్

3. త్వరణం (Acceleration):
త్వరణం: ప్రతిభావంతులు వారి సామర్థ్యానికి తగిన అభ్యాసనం కొనసాగించడానికి కింది పద్ధతులను కొనసాగించాలి.
* తక్కువ వయసులో బడిలో చేర్చడం
* డబుల్ ప్రమోషన్ ఇవ్వడం
* ప్రత్యేక కోర్సుల రూపకల్పన
* కొన్ని తరగతులను వదిలి వేయడం.

4. సంవృద్ధిమత్వం: పాఠశాలల్లో ప్రత్యేకమైన విద్యానుభువాల కల్పన.
* క్షేత్ర పర్యటనలు
* కంప్యూటర్ శిక్షణ
* హాబీ క్లబ్‌లు
* స్కూల్ మేగజైన్ పోటీలు
* రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు పంపడం.

5. బహుళరూప ప్రత్యేక విద్యాప్రణాళిక (Diversified Special Curriculum):
     పాఠ్యాంశాలతోపాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం.
ఉదా: ఇంటర్నెట్.

 

VI. అభ్యసనా వైకల్యం
      పిల్లల్లో వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల్లో వెనుకబాటుతనం చూపడమే అభ్యసనా వైకల్యం. ఈ వైకల్యాన్ని మన దేశంలో ప్రత్యేక వర్గాల కిందకు ఇంకా చేర్చలేదు. అభ్యాసన వైకల్యం అనే పదాన్ని 1963లో డాక్టర్ శామ్యూల్ కిర్క్ అనే మనో విజ్ఞానవేత్త ఉపయోగించారు.

అభ్యసన వైకల్యం - లక్షణాలు:
1) ఏకాగ్రత లోపం, అతి నిదానం
2) అక్షరాలను తిప్పిరాయడం, వాక్యాలను, పదాలను తిరగేసి చదవడం
3) ఆకారాలను, పరిమాణాలను, రంగుల భేదాలను గుర్తించలేకపోవడం
4) నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం
5) సమాచారం మెదడులో నిక్షిప్తమై ఉన్నప్పటికీ జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఇబ్బందిపడటం.

 

అభ్యసన వైకల్యం - రకాలు:
ఇది గ్రీకు భాషా పదం. దీనర్థం పదాలను సరిగా ఉపయోగించలేకపోవడం. పాఠశాల విద్యార్థుల్లో ఇది 10% ఉంటుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు చదవడంలోనూ, చదివింది అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఐన్‌స్టీన్, ఎడిసన్ లాంటి ప్రముఖులు ఈ సమస్యతో బాధపడినవారే.
ముద్రిత భాషను చదవడం, రాయడంలో ఉండే పూర్తి అశక్తత.
ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ, తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం.
ఇంగితాలను గ్రహించడంలోనూ, సక్రమంగా వాడటంలోనూ ఉండే పూర్తి అశక్తత.
ఇది రాత సమస్య. ఈ వైకల్యం ఉన్నవారు రాయడంలో ఇబ్బంది పడతారు.
బి) అగ్రాఫియా: రాయడంలో పూర్తి అశక్తత.

4. ఎ) డిస్‌కాల్కులియా: ఇది గణితపర వైకల్యం. ఈ వైకల్యం ఉన్నవారు సంఖ్యలను వ్యక్తపరచడంలో, రాయడంలో, చతుర్విధ ప్రక్రియలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఉదా: 21ని 12గా రాయడం
         308 అనే సంఖ్యను 38గా చదవడం.

 

అభ్యసన వైకల్యం - కారణాలు:
     అభ్యసన వైకల్యం అనేది మెదడు పనితీరులో లోపం వల్ల జరిగే ప్రక్రియ. ఇది ఒక స్థితే కాని వ్యాధి కాదు. ఈ పరిస్థితికి మూడు కారణాలు ఉన్నాయి.
మెదడు, వెన్నుపాము నిర్మాణం, వాటి పనితీరులో లోపం; శరీరంలో కొన్ని రకాల గ్రంథుల విషమ పరిస్థితి వల్ల సంక్రమించే హార్మోనుల ప్రభావం వల్ల కూడా అభ్యసన వైకల్యం ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు, పూర్వీకుల్లో ఎవరికైనా అభ్యసన వైకల్యం ఉన్నట్లయితే వారి పిల్లలో 20 శాతం మందికి ఈ సమస్యలు ఉండవచ్చని వైద్యుల అంచనా.
గర్భిణుల మానసిక స్థితి, వారు తీసుకునే ఆహారం, మందులు, మత్తుపదార్థాలు, ధూమపానం వల్ల ఈ పరిస్థితి రావచ్చు.

అభ్యసన వైకల్యం గల వారికి విద్యా ప్రణాళిక:
* విద్యార్థులు వైయక్తిక భేదాలకు అనుకూలమైన కార్యక్రమాలు అమలు చేయాలి.
* తోటి విద్యార్థులతో పోల్చకుండా, అభినందనలు పంచాలి.
* నిరంతరం మార్గదర్శకత్వం కల్పించాలి.
* సాంఘిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
* పాఠ్యబోధనా సమయంలో వీరిపట్ల అధిక సహనాన్ని కలిగి ఉండాలి.

బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి

      అభ్యసన వైకల్యం గలవారికి వీలైనన్ని ఎక్కువ ఇంద్రియాలు ఉపయోగించి బోధనాభ్యసన కృత్యాలు జరపాలి. ఇందులో భాగంగా ఉన్న అనేక అంశాల్లో VAKT పద్ధతి ముఖ్యమైంది. ఇందులో
V (Visual) దృష్టికి చెందింది
A (Auditory) వినికిడికి చెందింది
K (Kinaesthetic) ఇంద్రియనాడులకు చెందింది.
T (Tactile) స్పర్శకు చెందింది.
      ఈ నాలుగు అంశాలను తగిన విధంగా ఉపయోగించడం ద్వారా శిక్షణను కల్పించడమే బహుళ ఇంద్రియ పద్ధతి (VAKT) అంటారు.

సమ్మిళిత విద్య

      సమ్మిళిత విద్యకు సంబంధించి మన రాజ్యాంగంలో పలు అంశాలను పొందుపరిచారు. దీనికి తోడు 'యునైటెడ్ నేషన్స్ మిలీనియం డిక్లరేషన్- 2000' అభివృద్ధి గమ్యాలపై భారత్ కూడా సంతకం చేసింది. ఇందులో ప్రధాన అంశం 2015 నాటికి సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం.
      సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, భాష, కుల, మత, వర్గ, లింగ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనే భేద భావం లేకుండా అందరినీ ఏకీకృతం చేసి, సమాజం లోని భౌతిక, మానవ వనరులన్నింటినీ కలిపి అభ్యసనాన్ని మెరుగుపరచడంతోపాటు, సమాజ సుస్థిరాభివృద్ధికి తోడ్పడేదే సమ్మిళిత విద్య. ఇది కేవలం నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి అభ్యసనం, భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సమ్మిళిత పాఠశాలలో ఒకరి సహాయంతో ఒకరు ఒత్తిడి లేకుండా చురుగ్గా పాల్గొని విద్యను పొందుతారు.


4. బోధనా పద్ధతులు - అవగాహన 

1) అన్వేషణా పద్ధతి: అన్వేషణా పద్ధతిని ఆంగ్లంలో హ్యూరిస్టిక్ మెథడ్ అంటారు. దీన్ని 'హ్యూరిస్కో' అనే గ్రీకు భాషా పదం నుంచి స్వీకరించారు. ఈ పద్ధతిని బ్రిటన్‌కు చెందిన 'ఆర్మ్‌స్ట్రాంగ్' కనుక్కున్నారు. ఈ అభ్యసనంలో విద్యార్థులు తమ సొంత అనుభవాలు, ప్రయత్నాల ద్వారా సమస్యా పరిష్కారాలను స్వయంగా వారే కనుక్కుంటారు. ఇందులో ఉపాధ్యాయుడు మార్గదర్శి పాత్రను పోషిస్తాడు. కొన్ని ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ విద్యార్థులను అన్వేషకులుగా రూపొందిస్తాడు.

విద్యార్థి పాత్ర
* తార్కిక ఆలోచనలు పెంపొందించుకుంటాడు.
*​​​​​ విద్యార్థి కృత్యాన్ని స్వయంగా చేయడం ద్వారా నేర్చుకుంటాడు.
*  బోధనాభ్యసన ప్రక్రియలో చాలా చురుకుగా ఉంటాడు.
*  స్వీయ ఆలోచనలను అవకాశం గల పద్ధతి.
*  ఫలితాలను సరిచూసి సంతృప్తి చెందుతాడు.
ఉపాధ్యాయుడి పాత్ర
*  ఉపాధ్యాయుడు సక్రమమైన, ఉపయోగకరమైన సమస్యలను రూపొందిస్తాడు.
*  వ్యక్తిగత తేడాలను గుర్తించి అభ్యసనాన్ని కల్పిస్తాడు.
*  స్నేహితుడు, మార్గదర్శకుడిగా ఉంటాడు.
*  విద్యార్థికి అన్వేషణా ఆలోచనలు రేకెత్తిస్తాడు.
*  విద్యార్థిని క్రియాత్మకంగా తయారుచేస్తాడు.
సోపానాలు:
*  బోధనాంశాలను సమస్యలుగా మార్చడం
*  సూచనా పత్రాలను తయారుచేయడం

*  సూచనలతో ప్రయోగాలను చేయడం
*  ఫలితాలను నమోదు చేసి, ప్రయోగం అవసరమైతే మళ్లీ అవలంబించడం.


2. ప్రకల్పనా పద్ధతి: జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి ఈ పద్ధతి ఏర్పడింది. ఈ పద్ధతిని ఉద్యమ పద్ధతి, ఎత్తుగడల పద్ధతి అని కూడా అంటారు.
సోపానాలు:
*  పరిస్థితిని కల్పించడం
*  లక్ష్యాలను వివరించడం
*  ప్రణాళికా రచన
*  ప్రణాళికను అమలుపరచడం
*  మూల్యాంకనం
*  నివేదిక సమర్పించడం
పాఠశాలలో నిర్వహించదగ్గ ప్రాజెక్టులు:
*  బడిలో తోట పెంచడం
*  నేలలు - రకాలు
*  సౌర కుటుంబం
*  పక్షులు, వాటి ఆహారపు అలవాట్లు
*  కూరగాయల మార్కెట్ రేట్లు

ప్రాజెక్ట్ - లక్షణాలు:
1) నిజజీవితంలో ఉపయోగపడేవిగా ఉండాలి.
2) విద్యార్థి తనకు తానుగా చేయగలిగే విధంగా ఉండాలి.
3) విద్యార్థికి నిత్యజీవితంలో ఉపయోగపడే విధంగా ఉండాలి.


3. సర్వే పద్ధతి:
     ఏదైనా ఒక ప్రత్యేక అంశంపై వివిధ వ్యక్తుల నుంచి శాస్త్రీయ పద్ధతిలో అభిప్రాయాలను సేకరించడమే సర్వే పద్ధతి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కొంతమంది నిపుణుల ద్వారా సర్వే రూపంలో సేకరించవచ్చు. అందుకే ఈ పద్ధతిని ప్రతిచయన (sample) పద్ధతి అని కూడా అంటారు. సర్వే ద్వారా విషయ సేకరణకు ప్రశ్నావళులు, శోధికలను ఉపయోగిస్తారు.
సోపానాలు:
* అంశాన్ని ఎన్నుకోవడం.
* సరైన శాస్త్రీయ పద్ధతిని ఎన్నుకోవడం.
* అనువైన ప్రశ్నావళిని ఎన్నుకోవడం.
* సరైన ప్రవచనాలను ఎన్నుకోవడం.
* దత్తాంశ సేకరణ
* విశ్లేషణ చేయడం
* ఫలితాన్ని వ్యాఖ్యానించడం

4. కృత్యాధార పద్ధతి:
      ఆచరణ ద్వారా అభ్యసనం (Learning by Doing) అనే సూత్రం ఆధారంగా రూపొంది, విద్యార్థి కేంద్రీకృతంగా ఈ పద్ధతి కొనసాగుతుంది. ఈ పద్ధతిలో విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. విద్యార్థులు వివిధ కృత్యాల్లో చురుకుగా పాల్గొని సక్రమంగా జ్ఞానం, అవగాహనను పొందడమే కృత్యాధార బోధన అవుతుంది. ఈ విధానంలో విద్యార్థికి స్వయం అభ్యసనం అలవడుతుంది.


* కృత్యానుభవాలను విద్యార్థికి పాఠశాలలో, తరగతి గదిలో, గ్రంథాలయంలో, కుటుంబంలో ఎక్కడైనా కల్పించవచ్చు.
* జాతీయ ప్రణాళికా చట్రం - 2005 ప్రకారం విద్యార్థిలో జ్ఞాన నిర్మాణమనేది విద్యార్థులు కృత్యాల్లో స్వయంగా పాల్గొని తమ స్వీయ అనుభవాలతో జరగాలి. దీనికి కృత్యాధార పద్ధతి అనువైంది. ఈ పద్ధతి మన దేశంలో మొదట డేవిడ్ హార్స్‌బర్గ్ అనే ఉపాధ్యాయుడు రిషి వ్యాలీ పాఠశాలలో ప్రారంభించాడు.
* కృత్యాలను తరగతి గదిలో అభ్యసనాన్ని, విద్యార్థులను బట్టి పూర్తి తరగతి కృత్యం, జట్టు కృత్యం, వ్యక్తిగత కృత్యంగా జరపవచ్చు.

5. వైయక్తిక - సామూహిక అభ్యసనం 

      సాధారణంగా బోధనను తరగతి మొత్తానికి కల్పించవచ్చు. కానీ అభ్యసనం మాత్రం ఎవరికి వారే వ్యక్తిగతంగా కల్పించుకోవాలి. ఎందుకంటే అభ్యసన ప్రక్రియ వైయక్తికం. ఇందులో అభ్యాసకుడు తనకు తానుగా ఒంటరిగా అభ్యసించడమే వైయక్తిక అభ్యసనం. అయితే అభ్యసనంలో వైయక్తిక, సామూహిక అభ్యసనాలు రెండూ ప్రభావితంగా ఉంటాయి.
కొన్ని ముఖ్యమైన విద్యార్థి కేంద్ర/ వైయక్తిక అభ్యసనాలు:
1) డాల్టన్ ప్రణాళిక: ఈ ప్రణాళికను అమెరికా దేశానికి చెందిన హెలెన్‌పార్క్ హోస్ట్ రూపొందించారు. దీనిలో ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒక తరగతి గది ఉంటుంది. అభ్యసనం కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా విద్యార్థి తన అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణమైన విషయాలను ఎన్నుకుని నియోజనాలను పూర్తిచేసుకుంటాడు. తద్వారా విద్యార్థికి స్వేచ్ఛ, సహసంబంధం, కృత్య నిర్వహణ కలుగుతుంది.

 

2) గారీ ప్రణాళిక: ఈ ప్రణాళికను అమెరికా దేశానికి చెందిన విలియం బర్ట్ రూపొందించారు. విద్యార్థుల అభిరుచులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పాఠ్యాంశాలు లేదా సహ పాఠ్యాంశాలను అభ్యసించే వీలు కల్పించారు.
 

3) మోరిసన్ ప్రణాళిక: ఈ ప్రణాళికను అమెరికాకు చెందిన ప్రొఫెసర్ మోరిసన్ ప్రారంభించారు. బోధన 5 దశల్లో జరుగుతుంది.
    1) విద్యార్థి జ్ఞానాన్ని తెలుసుకోవడం

2) అభ్యసన అంశాన్ని బోధించడం
    3) అభ్యసనం పట్ల విద్యార్థులను ప్రోత్సహించడం
    4) అభ్యసన అంశాలను వ్యవస్థీకరించడం
    5) అభ్యసనాంశాలను చర్చించడం

 

4) నాన్ గ్రేడెడ్ స్కూల్ ప్రణాళిక : ఈ ప్రణాళికను అండర్సన్, గుడ్ లాడ్ రూపొందించారు. ఇందులో 6 సంవత్సరాల పాఠశాల విద్యను రెండు భాగాలుగా చేశారు. ఇందులో మొదటి భాగంలో 1, 2, 3 తరగతులు; రెండో భాగంలో 4, 5, 6 తరగతులు ఉంటాయి. ప్రతిభావంతులు ఒక్కో భాగాన్ని 2 సంవత్సరాల్లోనూ, తక్కువ ప్రతిభ కలిగినవారు 4 సంవత్సరాలకూ బోధించవచ్చు.
 

5) ప్రాజెక్ట్ పద్ధతి: అమెరికా దేశానికి చెందిన కిల్‌పాట్రిక్ రూపొందించారు. వైయక్తిక శిక్షణకు అవకాశం కలిగి బృంద స్ఫూర్తిని పెంపొందించడానికి విద్యార్థికి తన అభిరుచికి అనుకూలంగా అభ్యసనం కలిగించడం.
 

6) విన్నెట్కా ప్రణాళిక: అమెరికా దేశానికి చెందిన సి.డబ్ల్యూ.వాష్‌బర్న్ రూపొందించారు. ఇందులో విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షల ద్వారా పరిశీలించి వారి సామర్థ్యాల ఆధారంగా అభ్యసించాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా రూపొందిస్తారు. విద్యార్థి వైయక్తిక భేదం ద్వారా అభ్యసనం జరుగుతుంది.


సామూహిక అభ్యసనం 

       కొంతమంది విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఒక నిర్దిష్ట అంశంపై ఒకరితో ఒకరు పరస్పర చర్యలు జరుపుతూ జ్ఞానాన్ని పొందగలిగే అభ్యసనమే సామూహిక అభ్యసనం అవుతుంది.

ఈ అభ్యసనంలో ఒకే రకమైన అభిరుచులు కలిగిన వారిని ఒక సమూహంగా ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా కృత్యాన్ని కల్పించి సభ్యుల సహకారంతో అభ్యసనం జరుగుతుంది.


6. అసమ సమూహాల తరగతి గది అభ్యసన నిర్వహణ

    (సాంఘిక, ఆర్థిక నేపథ్యంలో వివిధ సామర్థ్యాలు, అభిరుచులు గల అసమ సమూహాలుండే తరగతి గది నిర్వహణ)
* వ్యక్తికి, వ్యక్తికి భిన్నంగా కనిపించే వివిధ అంశాలనే వైయక్తిక బేధాలు అంటారు.
* వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధన చేసినవారు - గాల్టన్.
* 1885లో రూపొందించిన వైయక్తిక బేధాలపై శాస్త్రీయ రచన - 'An Enquiry into Human Faculties and its Development'
* వైయక్తిక బేధాలకు ప్రధాన కారణాలు - అనువంశికత, పరిసరాలు, కుల, మత, జాతి, లింగ, భాషా బేధాలు.
విద్యార్థులు వివిధ విషయాల్లో ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉంటారు. అలాంటి బేధాలు అధికంగా గల తరగతి గదులే అసమ సమూహాలు. ఒక పద్ధతి ద్వారా పాఠాన్ని విభిన్న స్థాయుల్లోని వారికి బోధిస్తే దాని వల్ల సత్ఫలితాలు రావు. అందువల్ల ఇటువంటి వారికి బోధించడం కూడా ఒక సవాలు లాంటిదే. దీనికి కొన్ని కొన్ని మార్గాలు:
1) విద్యార్థులందరికీ ఒకే పాఠ్యపుస్తకం, అందరికీ ఒకే పాఠ్యప్రణాళిక అనే భావనను తొలగించి వైవిధ్యభరితమైన పాఠ్యప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు ఉండాలి.
2) విద్యార్థుల స్థాయికి తగినట్లుగా వారు విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలి.

3) విద్యార్థులు సామూహిక కృత్యాల్లో కలసి మెలసి వివిధ కృత్యాలను నిర్వహించాలి.
4) విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను వాడాలి.
ఉదా: కృత్యాధార పద్ధతి, అన్వేషణా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి మొదలైనవి.

 

7. అభ్యసనా నిర్వహణ విధానాలు

      అభ్యసనం విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి దోహదపడాలి. ఈ విద్యను విద్యార్థిలో ప్రవర్తనా మార్పును తీసుకు రావడానికి అనేక పద్ధతులను ఉపయోగించవచ్చు. ఇందులో ప్రధానమైనవి.
     1) ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం
     2) అభ్యాస కేంద్రిత అభ్యసనం
     3) విషయ కేంద్రిత అభ్యసనం

 

1) ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం:
     ఈ విధానంలో ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉంటాడు. అందుకే ఇందులో ఉపాధ్యాయుడికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇది పురాతన సంప్రదాయ విధానం. ఇందులో విద్యార్థిలోని జ్ఞానాన్ని వెలికితీయడం కాకుండా విద్యార్థిలో జ్ఞానాన్ని నింపుతారు.
* వైయక్తిక భేదాలకు ప్రాధాన్యం ఉండదు. ఒకే బోధనా పద్ధతి, ఒకే అభ్యసన అనుభవాలను కల్పిస్తారు.
* విషయాల ఎంపిక, వివరణ ఉపాధ్యాయుడే నిర్వహిస్తాడు.
* ఈ పద్ధతికి ఉదాహరణంగా ఉపన్యాస, ఉపన్యాస ప్రదర్శనా పద్ధతులను చెప్పవచ్చు.

2) అభ్యాస/ విద్యార్థి కేంద్రిత అభ్యసనం:
      విద్యార్థి, ఉపాధ్యాయుడికి మధ్య పరస్పర సంబంధం ఉంటూ, కృత్యాల్లో ఇద్దరూ పాల్గొంటూ విద్యార్థికి అధిక ప్రాధాన్యం కల్పించడమే విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం. ఈ విధానం విద్యార్థిని ఉత్సాహంగా ఉంచుతూ విద్యార్థిలోని జ్ఞానాన్ని వెలికితీస్తూ అతడిని ఒక అన్వేషకుడిగా, సమస్యా పరిష్కారకర్తగా, ప్రయోగ నిర్వాహకుడిగా స్వయం అభ్యాసకుడిగా తీర్చిదిద్దుతుంది. ఈ పద్ధతికి ఉదాహరణగా కృత్యాధార పద్ధతి, సహకార అభ్యసనం, ప్రాజెక్ట్ అభ్యసన, అన్వేషణా అభ్యసనాన్ని చెప్పవచ్చు.

 

3) విషయ కేంద్రిత అభ్యసనం:
      విద్యార్థికి బోధించాల్సిన, అతడు అభ్యసించాల్సిన విషయానికి అధిక ప్రాధాన్యం ఉండటమే విషయ కేంద్రీకృత అభ్యసనం. దీన్ని పాఠ్య ప్రణాళికా కేంద్రీకృత బోధన అంటారు. ఇది జ్ఞానానికి సంబంధించిన పద్ధతి. జ్ఞాపకశక్తికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. విషయానికి అధిక ప్రాధాన్యం ఉండటం వల్ల విద్యార్థుల్లో వైఖరులను, నైపుణ్యాలను పెంపొందించలేం. అందరికీ ఒకే విషయాన్ని కల్పించడం జరుగుతుంది. కానీ విద్యార్థుల వైయక్తిక భేదాలకు తావు లేదు.


8. బోధనా ప్రణాళికా కృత్యంలో మౌలిక అంశాలు 

వివిధ ప్రణాళికలు: నిత్యజీవితంలో ప్రణాళిక ఒక భాగం. దీనికి బోధనలో కూడా అధిక ప్రాధాన్యం ఉంది.
1) విద్యా/పాఠ్య ప్రణాళిక (Curriculam):
      దీన్ని విద్యావేత్తలు రూపొందిస్తారు. ఇందులో పాఠ్యాంశాలు, సహ పాఠ్యాంశాలు అన్నీ కలసి ఉంటాయి. కాబట్టి ఇది విస్తృతమైంది.

2) విషయ ప్రణాళిక (Syllabus):
      దీనిలో ముఖ్యంగా పాఠ్యాంశాలే ఉంటాయి. దీనివల్ల పాఠ్య పుస్తకం రూపొందుతుంది. దీన్ని అనుసరించి ఉపాధ్యాయుడు వివిధ రకాల బోధన పద్ధతుల  ద్వారా బోధనా పద్ధతులను రూపొందిస్తాడు.
యూనిట్ ప్రణాళిక:
* పాఠ్య పుస్తకం ఆధారంగా ఉపాధ్యాయుడు దీన్ని రూపొందిస్తాడు.
* బోధించే విషయాలకు వీలుగా రూపొందించిన ఒక ప్రత్యేక అంశమే యూనిట్.

 

3) పాఠ్య పథకం:

* ఉపాధ్యాయుడు దీన్ని తయారుచేస్తాడు.
* పాఠ్యాంశం ఆధారంగా సాధించదలచుకున్న లక్ష్యాలను, ఆశించే స్పష్టీకరణలను దృష్టిలో ఉంచుకుని బోధన కొనసాగుతుంది.
* ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి కలసి పాల్గొంటారు. కాబట్టి ఇది బోధనా సన్నివేశాల్లో క్రియాత్మకమైంది.
* బోధనా సోపానాలను జర్మనీకి చెందిన హెర్బర్ట్ స్పెన్సర్ రూపొందించారు.
* పాఠ్యప్రణాళికా రూపకల్పనకు స్పెన్సర్ శాస్త్రీయతను కల్పించారు. కాబట్టి ఈయనను విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని అంటారు.

సోపానాలు
     1) సన్నాహం
     2) ప్రదర్శనం
     3) సంసర్గం
     4) సాధారణీకరణం
     5) అన్వయం
     6) పునర్విమర్శ/ సాధారణీకరణం


9. బోధనా దశలు (చర్యా పూర్వ - చర్యాంతర్గత - చర్యానంతర దశలు)

* బోధన ఒక ప్రణాళికాబద్ధమైన కార్యకలాపం.
* బోధనలో ముఖ్యంగా ఏ విషయం బోధించాలి? ఎవరు బోధించాలి? ఎందుకు, ఎలా బోధించాలి ఇవన్నీ ప్రణాళికా సంబంధమైన అంశాలే.
బోధనాభ్యసన ప్రక్రియను మూడు ముఖ్య దశలుగా చెప్పవచ్చు.
    1) చర్యా పూర్వ దశ
    2) చర్యాంతర్గత దశ
    3) చర్యానంతర దశ

1) చర్యాపూర్వ దశ: పాఠ్యాంశ బోధనకు ముందు అంటే పథక రచనకు సంబంధించింది.
సోపానాలు:
    1) బోధనా లక్ష్యాలను, ఉద్దేశాలను రూపొందించడం.
    2) వీటి సాధనకు మార్గాలను, పద్ధతులను అన్వేషించడం.
ఈ ప్రక్రియలో కింది అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
    1) ఏ పాఠ్యాంశాన్ని బోధించాలి
    2) బోధనా పద్ధతులను ఎంపిక చేసుకోవడం
    3) తరగతి గది నిర్వహణ, సమయ నిర్వహణ

 

2) చర్యాంతర్గత దశ:
ఏర్పాటు చేసుకున్న పథకాన్ని అమలుపరచడం. ఇందులో కార్యక్రమాలు
1) గ్రహించడం: ఉపాధ్యాయుడు, విద్యార్థులు తమను తాము అంచనా వేసుకునే దశ.
2) నిర్ధారణ: ఉపాధ్యాయుడు తప్పనిసరిగా విద్యార్థుల విద్యాస్థాయులను దృష్టిలో ఉంచుకోవాలి.
3) ప్రతిచర్యా ప్రక్రియ: విద్యార్థుల స్థాయిని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడు చేపట్టే కార్యకలాపాలు ఇందులో అంతర్భాగాలు.

4) చర్యానంతర దశ: పథక రచన, పాఠ్యాంశాన్ని విద్యార్థుల్లో కల్పించిన తర్వాత చివరగా చేపట్టే 'మూల్యాంకన' అంశాలు ఇందులో ఉంటాయి.

* విద్యార్థుల్లో ప్రశ్నలు, పరీక్షలు, ప్రహేళిక (Quiz), పరిశీలన ద్వారా దీన్ని రాబట్టవచ్చు.
* మూల్యాంకన ప్రతిచర్య ద్వారా తిరిగి నూతన లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు.


10. ఉపాధ్యాయుడి సాధారణ, విషయ సంబంధ నైపుణ్యాలు 

   అనేక నైపుణ్యాల కలయికయే ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇతడిలోని లక్షణాలను పరిశీలిస్తే...
I. వ్యక్తిగత నైపుణ్యాలు
వ్యక్తిలోని ఆలోచన, వివేచన, వైఖరి, అభిరుచి, అమూర్తత్వం, బోధనాభిరుచి, సృజనాత్మకత, సాంఘిక తత్వం అనేవి వ్యక్తిగత నైపుణ్యాలుగా చెప్పవచ్చు.
ఎ) ప్రణాళికా నైపుణ్యాలు:
* కాలక్రమణ పట్టికను అనుసరించి పాఠ్య పథకం, యూనిట్ పథకం, వార్షిక పథకాలను తయారు చేసుకోవాలి. తరగతి గదిని సక్రమంగా నిర్వహించడం.
బి) బోధనా నైపుణ్యాలు:
* భావ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండటం
* బోధనా లక్ష్యాలు, సరైన బోధనా పద్ధతిని ఎంపిక చేసుకోవడం.
* విద్యార్థులకు విషయం పట్ల ధనాత్మక వైఖరి, ప్రేరణ ఉండాలి.
* తగిన విధంగా వివిధ మూల్యాంకనా సాధనాల ఉపయోగం.
* వైయక్తిక, సామూహిక అభ్యసనానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం.

సి) భాగస్వామ్య/ నాయకత్వ నైపుణ్యాలు
* సామూహిక, భాగస్వామ్య కృత్యాల ద్వారా విద్యార్థుల్లో సామూహిక భావనను, సాంఘిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.
* క్విజ్‌లు, సెమినార్లు, డిబేట్ లాంటి వాటిని నిర్వహించడం.
* విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో చర్చించి లోటుపాట్లను సరిదిద్దడం.
* ఓర్పు, సహకారం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం.

 

II. విషయ సంబంధ నైపుణ్యాలు:
* విషయ సమాచార ప్రసారం విద్యార్థుల్లో ఆసక్తి కలిగేదిగా, అన్వేషణను పెంచేదిగా ఉండాలి. 
* తన జ్ఞాన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ నిరంతర అభ్యాసకుడిలా ఉండటం.
* మంచి విషయ పరిజ్ఞానం కలిగి, పరిసరాలతో అన్వయించగలిగిన సామర్థ్యం ఉండటం.
* అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి, విద్యార్థులకు కల్పించడం.

11. అభ్యసన వనరులు 

     విద్యార్థి తన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ అనేక అనుభవాలను పొందుతాడు. దీనికి తోడు ఉపాధ్యాయుడు కల్పించే అభ్యసనం ఎంతో ఉపయుక్తం. ఇలా అభ్యాసకుడు జ్ఞానాన్ని దేని నుంచి పొందగలుగుతున్నాడో వాటన్నింటినీ అభ్యసనా వనరులుగా చెప్పవచ్చు. వాటిలో ముఖ్యమైనవి...
1) స్వీయ వనరులు (Self Resources): ప్రతి వ్యక్తీ పుట్టుకతో కొన్ని ప్రత్యేక శక్తులను కలిగి ఉంటాడు. ఈ స్వీయ శక్తులతోపాటు తన మెదడు, జ్ఞానేంద్రియాల నుంచి విషయాలను ఆర్జించుకోవడమే స్వీయ వనరులు. వ్యక్తి నూతన విషయాలను నేర్చుకునేముందు పాత విషయాలకు సంబంధించిన సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఉపయోగించుకుని అవగాహన చేసుకుంటాడు.
2) గృహ వనరులు (Home Resources): శిశు అభ్యసనం కుటుంబం నుంచే ప్రారంభమవుతుంది. అందుకే 'కుటుంబం' శిశువుకు మొదటి పాఠశాల. శిశువు కుటుంబంలో యాదృచ్ఛికంగా అన్ని రకాల అంశాలను, నియమ నిబంధనలను, సహకార గుణాన్ని, మంచి అలవాట్లను నేర్చుకుంటాడు.
3) పాఠశాల వనరులు (School Resources): విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ అధ్యయనంలో పాఠశాల ప్రధాన పాత్ర పోషిస్తుంది. శిశువులోని బౌద్ధిక సామర్థ్యాలను పెంపొందించడం ప్రధాన అంశం. పాఠశాలలో విద్యార్థి సమవయస్కులు, స్నేహితులు, గ్రంథాలయం, పాఠ్య పుస్తకాలు, క్రీడల ద్వారా వికాసాన్ని పెంపొందించుకుంటాడు.
4) సాంకేతిక వనరులు (Technology Resources): అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో ప్రసార మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో ముఖ్యంగా ఇంటర్నెట్, టెలివిజన్, టీవీ, రేడియో, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు ముఖ్యమైనవి.
5) సామాజిక వనరులు (Community Resources): ఇందులో వ్యక్తి సంఘంలో కలిసి మెలిసి జీవిస్తూ సాంఘిక కట్టుబాట్లు, పరిసరాలతో సర్దుబాటు, నాయకత్వ పరిస్థితి, ప్రాకృతిక అంశాలను పరిశీలిస్తాడు. సామాజిక వనరులను 3 రకాలుగా విభజించవచ్చు.
(1) భౌతిక పరిసరాలు (2) సజీవ పరిసరాలు (3) బౌద్ధిక వనరులు

12. తరగతి గది నిర్వహణ 

ఉపాధ్యాయుడి పాత్ర:
* తరగతి గది నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సింది ఉపాధ్యాయుడే. కాబట్టి కింది నిర్వహణ పద్ధతులను పాటించాలి.
* ఉపాధ్యాయుడు హుందాతనంగా సరైన వస్త్రధారణ కలిగి ఉండాలి.
* విద్యార్థులకు అవసరాన్ని బట్టి శిక్షలు, బహుమతులను ప్రవేశపెట్టాలి.
* ఒత్తిడి లేని అభ్యసనా కృత్యాలను ఏర్పాటు చేయాలి.
* విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి కృత్యాలను ఏర్పాటు చేయాలి.
* బోధించే విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
* స్వీయ క్రమశిక్షణ, ప్రవర్తన ఉండాలి.
* తరగతి గది నిర్వహణలో మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, సహాయకారిగా వ్యవహరించాలి.
విద్యార్థి పాత్ర:
* తరగతి గదికి విద్యార్థి కేంద్ర బిందువు. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియ సక్రమంగా పూర్తిచేయడానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి.
* స్వీయ ప్రేరణ కలిగి ఉండాలి.

* బోధనాభ్యసన ప్రక్రియలో ధనాత్మక వైఖరిని ప్రదర్శించాలి.
* పాఠశాల నియమ నిబంధనలు పాటించాలి.
* తోటి విద్యార్థులతో సామరస్యంగా మెలిగి, అందరికీ సహాయ సహకారాలను అందించాలి.


12(ఎ). నాయకత్వం రకాలు

నాయకత్వం - నిర్వచనాలు
కౌలి: ఇతరులు తనను అనుసరించేలా చేసే కార్యసిద్ధి గలవాడే నాయకుడు.
బెక్: సమూహ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించే చొరవ తీసుకునేవాడే నాయకుడు.
      టెర్మన్, బర్డ్‌ల ప్రకారం నాయకుల్లో నీతి, నిజాయతీ, స్నేహశీలత, ఆత్మవిశ్వాసం లాంటి మొత్తం 79 లక్షణాలుంటాయని, అందరి నాయకుల్లో అన్ని లక్షణాలు ఉండనవసరం లేదని పేర్కొన్నారు. బెరల్‌సన్, స్టెయినర్‌లు శారీరక రూపం, ఆత్మవిశ్వాసం, సామాజికత, స్నేహం, మనో సంకల్పం, ప్రజ్ఞ ముఖ్యమైన లక్షణాలుగా పేర్కొన్నారు.
      క్రెచ్ ఫీల్డ్ ఆత్మగౌరవం, ఓర్పు, సహనం, అనుచరుల స్వీకృతి, ఆధిపత్యం, విషయ గోప్యత, ఉత్సుకత, ధైర్య సాహసాలు లాంటి లక్షణాలను ముఖ్యమైనవిగా పేర్కొన్నారు.
నాయకత్వం - రకాలు: నాయకత్వాలను అనేక రకాలుగా వర్గీకరించారు. వీటిని కింది విధంగా పేర్కొన్నారు.
I. A) ఆపాదిత నాయకత్వం (Ascribed Leadership): నాయకత్వం వంశపారపర్యంగా లేదా ఏదైనా ఒక సంస్థకు నాయకుడిగా నియమించడం వల్లనో ప్రాప్తించడమే ఆపాదిత (Ascribed) నాయకత్వం.

ఉదా: పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర గవర్నర్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు; తరగతి గదిలో ఉపాధ్యాయుడు నియమించిన తరగతి లీడర్ మొదలైనవారు.
B) సముపార్జిత నాయకత్వం (Achieved Leadership): తన లక్షణాల ప్రాబల్యంతో ఇతరులను ప్రభావితం చేసి నాయకత్వాన్ని పొందడమే సముపార్జిత నాయకత్వం అవుతుంది.
II. 'మార్టిన్ కార్వే' నాయకులను 3 రకాలుగా వర్గీకరించారు.
A) జనసమూహ ప్రతినిధులు (Crowd Representatives):
జన సమూహాలను సమాయత్తపరిచి తాత్కాలికంగా నాయకులుగా చెలామణీ అయ్యేవారే జన సమూహ ప్రతినిధులు.
B) సమూహాలను బలవంతంగా వశపరచుకునేవారు (Crowd Compellers): జన సమూహాలను సమ్మోహనపరిచి తన పట్లనమ్మకం కలిగించి ఆధిపత్యంతో బలవంతంగా వశపరచుకునేవారు.
C) భాష్యకారుడు (Crowd Exponent): సమూహాలకు గల ఆశయాలను ముందుగానే పసిగట్టి వాటిని ప్రోత్సహించి కార్యోన్ముఖులను చేసేవాడు.
III. బార్ట్‌లెట్ ప్రకారం వర్గీకరణ:
A) సంస్థాగత నాయకులు (Institutional Leaders):
ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా సంస్థలోని సభ్యులపై అదుపు ఉండి పైనుంచి వచ్చే ఆదేశాలను అమలుపరిచేవారు. నాయకత్వ స్వేచ్ఛ పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉంటుంది.

B) ప్రభావం చూపే నాయకులు (Dominant Leaders): సమస్యను పరిష్కరించడం కోసం దౌర్జన్యంతో లేదా పక్క మార్గాల ద్వారా లేదా ఇతరుల బలహీనతలను పసిగట్టి వారితో సంబంధం లేకుండా వ్యవహరించే నాయకత్వం.
C) సమ్మతింపజేసే నాయకులు (Persuasive Leaders): సమూహ సభ్యుల సమస్యలకు అనుకూలంగా ఉండి, వారి భావాలను గౌరవిస్తూ, వారిని అర్థం చేసుకుంటూ వ్యవహార దక్షతతో కార్యసాధన చేస్తారు.
D) నిపుణులు (Experts): కళలు, సాంకేతిక విజ్ఞానశాస్త్రంలోనూ లేదా ఏదో ఒక రంగంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సభ్యులతో ప్రభావితంగా ఉంటూ వారిని ప్రభావితం చేసే కవులు, విజ్ఞానవేత్తలు, తాత్వికులు దీనికి చెందినవారు.
IV. మరికొన్ని నాయకత్వాలు:
A) అధికారిక నాయకత్వం (Authoritarian Leadership):
అధికారయుతంగా, నియంతలా సమూహాన్ని ఒక తాటిపై నడపడానికి, భద్రతా భావాన్ని పెంచేలా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.
B) ప్రజాస్వామిక నాయకత్వం (Democratic Leadership): సంఘంలోని అందరినీ గౌరవిస్తూ, అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ కార్యనిర్వాహక సభ్యులందరూ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్న భావనతో కలిగే నాయకత్వం.
C) సమ్మోహన నాయకులు (Charishmatic Leaders): ఈ నాయకత్వాన్ని 'బర్న్స్' పేర్కొన్నారు. ప్రజల్లో ప్రేరణను పెంచి, వారిని సమ్మోహనపరిచి అతడిని అనుసరించేలా చేసే నాయకత్వం.

ప్రత్యేకించి నాయకత్వం 3 రకాలు:
A) సహభాగి నాయకత్వం (Participatory Leadership):
అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, అందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రేరేపించే నాయకత్వం.


       
B) నిర్దేశిత నాయకత్వం (Authoritarian Leadership): నాయకుడే స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని సభ్యులందరూ పాటించేలా చేసే నాయకత్వం.

C) అనుమతిపూర్వక నాయకత్వం లేదా జోక్యరహిత (Permissive and Laissezfaire Leadership): సభ్యులను ప్రోత్సహిస్తూ వారినే నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ నాయకుడు నామమాత్రంగా ఉంటూ అడిగితేనే సలహాలిస్తూ సభ్యులను తమ ఇష్టనుసార నిర్ణయాలు తీసుకునేలా చేసే నాయకత్వం.

12(బి). మార్గదర్శకత్వం - మంత్రణం 

మార్గదర్శకత్వం (Guidance):
      వ్యక్తి తనలోని సామర్థ్యాలను గుర్తించి, తనకు తానే సహాయపడటానికి అందించే ఒక సహాయ ప్రక్రియనే మార్గదర్శకత్వం అంటారు.
స్కిన్నర్: ''మార్గదర్శకత్వం అంటే యువతీయువకులు తమలో తాము ఇతరులతో, పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ".

సెకండరీ విద్యా కమిషన్: మార్గదర్శకత్వమనేది బాలబాలికలకు వారు సాధించగలిగే సామర్థ్యాల దృష్ట్యా, అలాగే వారు పనిచేసుకోవాల్సిన ప్రపంచానికి సంబంధించిన కారకాల దృష్ట్యా, వారి భవిష్యత్‌ను తెలివిగా ప్రణాళికాబద్ధం చేసుకోవడానికి సహాయపడే క్లిష్టమైన పనితో కూడుకున్నది.
మార్గదర్శకత్వం - రకాలు: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ (CBEVG), న్యూదిల్లీ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది.
1) విద్యా సంబంధ మార్గదర్శకత్వం: ఇది విద్యార్థులకు విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
      విద్యార్థులు నూతనంగా ఒక పాఠశాలలో చేరినప్పుడు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో సర్దుబాటు, పాఠశాల పట్ల అయిష్టత ఉన్నా, పరీక్షలు సరిగా రాయక మార్కులు తగ్గినా ఈ రకమైన మార్గదర్శకత్వాన్ని కలిగించాలి.
2) ఔద్యోగిక మార్గదర్శకత్వం: పూర్వం అందరూ వంశపారంపర్య వృత్తులే చేసేవారు. కానీ ప్రస్తుతం అలా లేదు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తగిన ఉద్యోగాన్ని ఎన్నుకుని దానిలో చేరి సఫలీకృతం కావడంలో ఈ మార్గదర్శకత్వం సహాయపడుతుంది. ఇది కేవలం వృత్తిని ఎన్నుకోవడానికి మాత్రమే కాకుండా వృత్తి నిర్వహణకు, ఆయా పరిసరాలతో సర్దుబాటు కావడానికి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడి వృత్తిలో సఫలతను, సంతృప్తిని సాధించడానికి తోడ్పడుతుంది.
3) వ్యక్తిగత మార్గదర్శకత్వం:
      ఇది వ్యక్తుల సొంత విషయాలకు సంబంధించింది. దీని పరిధి విద్య, ఔద్యోగిక మార్గదర్శకత్వాల కంటే పెద్దది. ఇందులో విద్య, ఔద్యోగిక మార్గదర్శకత్వాలు భాగంగా ఉంటాయి. వ్యక్తి ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఇది ఉపయుక్తమైంది. అందరిలో కెల్లా కౌమార దశలోని వ్యక్తులకు ఇది అత్యంత ఉపయోగకరం.

మంత్రణం (Counselling)

       మార్గదర్శకత్వం సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అవసరం. కానీ మంత్రణం కేవలం మూర్తి మత్వ సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రమే అవసరమైంది. అందుకే మార్గదర్శకత్వం మంత్రణం కంటే విస్తృతమైన భావన.
       సహాయం అవసరమైన వ్యక్తిని, ఆ సహాయం అందించడానికి తగిన పరిజ్ఞానం, శిక్షణ పొందిన సలహాదారుడిని కలిపే ఒక పరస్పర చర్యా ప్రక్రియే మంత్రణం.
పెపిన్స్‌కీ: మంత్రణం అనేది ఒక క్లయింటు తన అవసరాలకు సంబంధించి సంతృప్తికరమైన తీర్మానాలు చేసుకోవడానికి అవసరమైన ప్రవర్తనా మార్పును చేసుకునేలా కౌన్సిలర్/ సలహాదారుడికి, క్లయింట్/ సహాయార్థికి మధ్య ఒక ప్రైవేట్ సిట్టింగ్‌లో జరిగే ప్రతిచర్య.
       ఈ ప్రక్రియలో మంత్రణం చేసేవారిని కౌన్సిలర్/ మంత్రణకుడు అనీ, మంత్రణం పొందేవారిని కౌన్సిలీ/ క్లయింట్‌గా పేర్కొంటారు.
మంత్రణం - రకాలు: మంత్రణంలో కౌన్సిలర్ అనుసరించే విధానాన్ని బట్టి 3 రకాలను గుర్తించారు.

 

1. నిర్దేశిత మంత్రణం: ఈ మంత్రణాన్ని విలియంసన్ ప్రారంభించారు. కౌన్సిలర్, క్లయింట్ సమస్యను పూర్తిగా విని సరైన పరిష్కార మార్గాన్ని కనుక్కుని క్లయింట్ పాటించే విధంగా చేయడమే నిర్దేశిత మంత్రణం.
* ఈ ప్రక్రియలో క్లయింట్/ సహాయార్థి నిష్రియాత్మకంగా ఉండి, కౌన్సిలర్ క్రియాత్మకంగా ఉంటాడు.

* ఇందులో క్లయింట్ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉండదు.
ఉదా: 1) 10వ తరగతి విద్యార్థికి చదువు పట్ల సూచనలివ్వడం.
         2) డిగ్రీ చేయాలనుకునేవారికి డీఎడ్‌లో చేరమని సలహా ఇవ్వడం.


2. అనిర్దేశిక మంత్రణం: ఈ మంత్రణాన్ని ప్రతిపాదించినవారు కార్ల్ రోజర్స్. దీన్ని సహాయార్థి మంత్రణం అని కూడా అంటారు. ఇది నిపుణులు మాత్రమే చేయగలిగే పద్ధతి. ఈ మంత్రణంలో కౌన్సిలీ చెప్పే విషయాన్ని కౌన్సిలర్ నైపుణ్యంతో విని, అవగాహన చేసుకుని, తగిన చర్యలను నిర్ణయించుకునేలా చేస్తారు. ఈ ప్రక్రియలో సహాయార్థి పాత్రే అధికంగా ఉంటుంది.
* ఇందులో కౌన్సిలర్ నిష్క్రియాత్మకంగా, కౌన్సిలీ క్రియాత్మకంగా ఉంటారు.
* కౌన్సిలీ సౌకర్యకర్తగా లేదా సహాయకారిగా మాత్రమే ఉంటారు.
* ఈ కౌన్సిలింగ్... తక్షణ సమస్య కంటే వ్యక్తిని మార్చడానికి సహాయపడుతుంది.


3. శ్రేష్ఠగ్రహణ/ మిశ్రమ/ దార్శినిక మంత్రణం:
      ఎఫ్.సి. థార్న్ దీన్ని ప్రతిపాదించారు. నిర్దేశిక, అనిర్దేశిక మంత్రణాల్లో ఏదో ఒకదానికి పరిమితం కాకుండా సమస్య స్వభావం, తీవ్రత, పరిస్థితి, సహాయార్థి తక్షణ అవసరం, మూర్తిమత్వం ఆధారంగా అవసరాన్ని బట్టి రెండు మంత్రణ పద్ధతులను ఉపయోగించడాన్ని శ్రేష్ఠగ్రహణ మంత్రణం అంటారు.
* కౌన్సిలీ, కౌన్సిలర్ ఇద్దరూ క్రియాత్మకంగా ఉంటారు.
* ఈ మంత్రణాన్ని ముఖ్యంగా కౌమారుల సమస్యా పరిష్కారానికి అధికంగా ఉపయోగిస్తారు.

* ఈ మంత్రణంలో వాడే విధానాలు ముఖ్యంగా
   1) సూచన   2) సలహా   3) సమ్మతింపజేయడం   4) వ్యాఖ్యానించడం
మంత్రణంలో ఉపయోగించే పద్ధతులు:
   1) ఇంటర్వ్యూ    2) చెక్‌లిస్టులు    3) మనోవైజ్ఞానిక పరీక్షలు


12(సి). బాలల హక్కులు

 వివిధ రకాల చట్టాలు బాలలను కింది విధంగా నిర్వచించాయి.
1) బాలకార్మిక చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాలు పూర్తికానివారు బాలలు.
2) బాలల న్యాయ చట్టం 1986 ప్రకారం బాలలు అంటే 16 సంవత్సరాలు దాటని బాలికలు, 18 సంవత్సరాలు దాటని బాలురు.
3) ఐక్యరాజ్యసమితి ప్రకారం 18 సంవత్సరాల లోపువారు.
బాలల హక్కులు - రకాలు: బాలలకు అవసరమైన హక్కులను నిపుణులు కింది విధంగా పేర్కొన్నారు.
1) మనుగడ పొందే హక్కు (Right to Survival):
బాలలకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్యం, భద్రత లాంటి అంశాలు ఇందులో ఉంటాయి.
2) రక్షణ పొందే హక్కు (Right to Protection):
పిల్లలు బానిసత్వం, దోపిడీ నుంచి తమను తాము రక్షణ పొందడం.

3) భాగస్వామ్య హక్కు (Right to Participation):
సమాజంలో క్రియాశీలంగా ఉండటానికి అవసరమైన స్వేచ్ఛ, సమాచారం, భావ వ్యక్తీకరణ హక్కు.
4) అభివృద్ధి చెందే హక్కు (Right to Development):
సమాజంలో సంపూర్ణంగా చొచ్చుకొనిపోవడానికి అవసరమైన విద్యా హక్కు, సమాజంలో ఉన్నతి పొందే హక్కు దీనికి చెందినవి.


బాలల హక్కుల ఒడంబడిక CRC: (Convention on the Rights of the Child)
     బాలల హక్కుల ఒప్పంద పత్రాన్ని (CRC) ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1989 నవంబరు 20న ఆమోదించింది. అందువల్ల ఏటా నవంబరు 20వ తేదీని 'బాలల హక్కుల దినం'గా జరుపుకుంటున్నారు. CRC 1989లో ఆమోదం పొందినప్పటికీ 1990 సెప్టెంబరు, 2వ తేదీన అమల్లోకి వచ్చింది.
* CRCపై 2003వ సంవత్సరం నాటికి 192 దేశాలు సంతకం చేశాయి. మన దేశం 1992, డిసెంబరు 11న సంతకం చేసింది.
* CRCలో మొత్తం 3 భాగాలు, 54 నిబంధనలు ఉన్నాయి.


బాలల హక్కులు - భారత రాజ్యాంగం:
1) ఆర్టికల్ 14:
సమానత్వపు హక్కు.
2) ఆర్టికల్ 15: మత, జాతి, కుల, లింగ వివక్షకు గురికాని హక్కు.

3) ఆర్టికల్ 15(3): మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.
4) ఆర్టికల్ 21(ఎ): 6 - 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే ప్రాథమిక హక్కు.
5) ఆర్టికల్ 23: అక్రమ రవాణా, కట్టు బానిసత్వం నుంచి రక్షణ పొందడం.
6) ఆర్టికల్ 24: 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఎలాంటి ప్రమాదకర పనులు చేయించకూడదు.
7) ఆర్టికల్ 39(ఇ): ఎలాంటి దుర్వినియోగం నుంచైనా రక్షణ పొందే హక్కు.
8) ఆర్టికల్ 39 (ఎఫ్): ఆరోగ్యకరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రంతో అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు.
9) ఆర్టికల్ 46: సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీల నుంచి రక్షణ పొందే హక్కు.

 

13. నిరంతర సమగ్ర మూల్యాంకనం
Continuous Comprehensive Evaulation (C.C.E.)

      విద్యాహక్కు చట్టం (RTE) 2009, అధ్యాయం - 5, సెక్షన్ 29(2)ను అనుసరించి ప్రతి పాఠశాలలో C.C.E.ని అమలు చేయాలి.
నిర్వచనం: విద్యార్థిని ఎల్లప్పుడూ (తరగతి గదిలో, ఆటస్థలంలో, ప్రయోగశాలలో, గ్రంథాలయంలో) మూల్యంకనం చేస్తూనే పాఠ్య, సహపాఠ్య విషయాలకు మూల్యాంకనాన్ని విస్తరించడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం.
సమగ్ర అంటే
    పాఠ్య + సహపాఠ్యాంశాలు
    పాఠ్య + అదనపు పాఠ్యాంశాలు

విద్య + విద్యేతర అంశాలు
    పాండిత్య + పాండిత్యేతర అంశాలు
    కరికులర్ + కోకరికులర్ అంశాలు
* ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం పాఠ్యవిషయాలతో నిర్వహిస్తున్న సహపాఠ్య కార్యక్రమాలు 4.
    ఎ) ఆరోగ్య, వ్యాయామ విద్య
    బి) కళలు - సాంస్కృతిక విద్య
    సి) పని, కంప్యూటర్ విద్య
    డి) విలువల విద్య, జీవన నైపుణ్యాలు

 

మదింపు అంటే ఏమిటి?
* విద్యార్థి 'నేను పరీక్షించబడుతున్నానని తెలియకుండానే పరీక్షించబడటం'.
* బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగమై విద్యార్థుల సాధనను గుర్తిస్తుంది. అభ్యసన లోపాలను గుర్తించి నివారించడానికి తోడ్పడుతుంది.
* అభ్యసన ప్రక్రియలో అనుసరణీయమైన మార్పుచేర్పులకు అవకాశం కల్పిస్తుంది.
ప్రస్తుతం పాఠశాలలో C.C.E. విధానం
     ప్రస్తుతం పాఠశాలలో C.C.E. ను 2 రకాలుగా నిర్వహిస్తున్నారు.
     1) నిర్మాణాత్మక మదింపు (Formative Assessment)
     2) సంగ్రహణాత్మక మదింపు (Summative Assessment)

1) నిర్మాణాత్మక మదింపు (Formative Assessment) (F.A.)
  నిర్మాణాత్మక మదింపును సంవత్సరానికి 4 సార్లు నమోదు చేస్తారు.
    (i) FA1 - జులై
    (ii) FA2 - ఆగస్టు
    (iii) FA3 - నవంబరు
    (iv) FA4 - ఫిబ్రవరి
నిర్మాణాత్మక మదింపు మూల్యాంకన సాధనాలు 4

2) సంగ్రహణాత్మక మదింపు (Summative Assessment) (S.A.)
సంగ్రహణాత్మక మదింపును విద్యా సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించి నమోదు చేస్తారు.

​​​​​​

విద్యాప్రమాణం: తరగతిలో విద్యార్థి సాధించాల్సిన సామర్థ్యాలను లేదా అంశాలను సూచించేవి విద్యా ప్రమాణాలు.
గణితం - విద్యా ప్రమాణాలు
     1) సమస్యా సాధన
     2) కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం
     3) వ్యక్తీకరణ
     4) అనుసంధానం
     5) ప్రాతినిథ్యపరచడం, దృశ్యీకరణ

పరిసరాల విజ్ఞానం - విద్యా ప్రమాణాలు
     1) విషయావగాహన
     2) ప్రశ్నించడం, పరికల్పన చేయడం
     3) ప్రయోగాలు చేయడం, క్షేత్ర పరిశీలనలు
     4) సమాచార సేకరణ, నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు
     5) బొమ్మలు గీయడం, నమూనాల తయారీ
     6) అభినందించడం, సౌందర్య స్పృహ
     7) నిత్యజీవితంలో ఉపయోగించడం, జీవవైవిధ్యం పట్ల సానుభూతి

 

* గణితంలో సమస్యా సాధన అనే విద్యా ప్రమాణానికి 50% భారత్వం, 25 మార్కులకు కేటాయించాలి.
* సాంఘిక శాస్త్రంలో విషయావగాహన అనే విద్యా ప్రమాణానికి 50% భారత్వం, 25 మార్కులకు కేటాయించాలి.

14(ఎ). జాతీయ ప్రణాళికా చట్రం - 2005

(NCF - 2005)


     జాతీయస్థాయిలో విద్యా విధానం ప్రస్తుతం మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఉండాలనే ఆకాంక్షతో, విద్యార్థిలోని సృజనాత్మకతను వెలికితీసే విధంగా విద్యావిధానం ఉండాలనే లక్ష్యంతో ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ యశ్‌పాల్ సారథ్యంలో జాతీయ సారథ్య సంఘం ఏర్పడింది. ఈ కార్యవర్గం 2004 జులై 14 నుంచి 19 వరకు అనేక పర్యాయాలు చర్చలు జరిపి అప్పటివరకు అమల్లో ఉన్న NCF - 2000ను సమీక్షించి NCF - 2005ను రూపొందించింది. ఈ సంఘంలోని సభ్యుల మొత్తం ఛైర్మన్‌తో కలిపి 35 మంది. వీరిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా ఎంపికయ్యారు. కమిటీ నివేదికను 2005 మే 2న మానవ వనరుల శాఖకు సమర్పించగా CABE 2005 సెప్టెంబరులో ఆమోదించగా చివరకు NCF-2005 తయారైంది. దీన్ని అనుసరించి రాష్ట్రాలు ఆయా SCERT ల ఆధ్వర్యంలో నూతన పాఠ్యప్రణాళికలను రూపొందించుకున్నాయి.
* NCF - 2005 ప్రారంభం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'సివిలైజేషన్ అండ్ ప్రోగ్రస్' అనే గ్రంథంలోని 'సృజనాత్మకత బాల్యానికి కీలకం' అనే మాటలతో ప్రారంభమవుతుంది. ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని పరిశీలిద్దాం.......

 

I. దృక్పథం:
* వివిధ విలక్షణ లక్షణాలతో ఉన్న మన సమాజానికి సరిపోయే విధంగా జాతీయ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి.
* ప్రణాళికాపరంగా గుణాత్మక విద్యను, భారరహిత అభ్యసనాన్ని కల్పించాలి.

* ప్రజాస్వామిక విలువలు, ఆచరణలు, లింగ సమానత్వం; ఎస్సీ, ఎస్టీ సమస్యలు, అంగ వైకల్యం గలవారి అవసరాలు మొదలైన అంశాలపై సామర్థ్యం పొందే విద్య కల్పించాలి.
* అభ్యసనంలో కంఠతా పెట్టే ధోరణిని వదిలి, జ్ఞాన రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* పాఠ్య పుస్తక కేంద్రంగా కాకుండా శిశు కేంద్రంగా జ్ఞానాన్ని నిర్మించాలి.

 

II. అభ్యసనం - జ్ఞానం:
* ప్రయోగ పద్ధతిని అనుసరించి క్రియాత్మకమైన అభ్యసనం కల్పించాలి.
* అభ్యసనం సృజనాత్మకతను పెంపొందించేలా ఉండాలి.
* అభ్యసన పద్ధతులు పరిసరాలకు అనువైనవిగా ఉండాలి.
* ప్రాజెక్టుల నిర్వహణ జ్ఞానసముపార్జనగా ఉండేలా ఏర్పాటు చేయాలి.
* పాఠ్యప్రణాళిక ఆచరణలో సామాజిక, సాంస్కృతిక వాస్తవాలకు స్థానం కల్పించాలి.

 

III. విద్యా ప్రణాళికా క్షేత్రాలు:
ఎ) భాష:

* విద్యార్థులకు జ్ఞాన నిర్మాణంలో అతి ప్రధానమైన శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం (LSRW) నైపుణ్యాలను పాఠశాల పరిధి దాటి బోధించాలి.
* బహుభాషా లక్షణాన్ని (త్రిభాషా సూత్రాన్ని) అమలు చేయాలి. ఇందులో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భాషలను పొందుపరచాలి.
* భాషను ఉపలబ్ధికి, మూల్యాంకనానికి ముడిపెట్టకూడదు.

బి) గణితం:
¤ విద్యార్థుల్లో గణితాత్మక ఆలోచన కల్పించాలి.
* పిల్లల్లో తాత్విక ఆలోచనాశక్తి, అమూర్తాలను నిర్వహించాలి.
* గణిత వ్యక్తీకరణాల్లో భాషా స్పష్టత, సంక్లిష్టత, సందిగ్ధరాహిత్యం ఉండాలి.
* పిల్లలు గణితం గురించి మాట్లాడటం, గణితంలో భావవ్యక్తీకరణ చేయడం, చర్చించడం ప్రోత్సహించాలి.
* గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఆనంద అభ్యసనాన్ని కల్పించాలి.

 

సి) విజ్ఞాన శాస్త్రం
* అభ్యాసకుల వయసు, జ్ఞానరాశికి తగినట్లుగా శాస్త్ర విషయం, ప్రక్రియ, భాష, బోధన ఉండాలి.
* పిల్లల్లో ఉత్సుకతను, సృజనాత్మకతను పెంపొందించాలి.
* విద్యా ప్రణాళికలో పరిసరాల స్పృహను అంతర్భాగం చేయాలి.
* విజ్ఞాన శాస్త్రానికి పరిసరాల్లో దగ్గర సంబంధాన్ని ఏర్పరచాలి.
* విజ్ఞానశాస్త్రం మానవుడిని పేదరికం, అజ్ఞానం, మూఢాచారాల నుంచి దూరం చేసే విధంగా ఉండాలి.

డి) సామాజిక/ సాంఘిక శాస్త్రం:
* వాస్తవ విషయాలను కంఠస్థం ద్వారా కాకుండా, సాంఘిక శాస్త్ర భావనలను అవగాహన, ఆలోచనతో కల్పించాలి.
* పౌరశాస్త్రాన్ని రాజనీతిశాస్త్రంగా చారిత్రక ప్రాధాన్యాన్ని కల్పించాలి.
* సమాజంలోని విభిన్న కోణాలను, అంశాలను స్పృశించే విధంగా ఉండాలి.
* మానవ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం లాంటి అంశాల పట్ల ధనాత్మక వైఖరి ఉండాలి.
* మానవ విలువలను పెంపొందించే విధంగా ఉండాలి.

 

ఇ) పని - కళలు - ఆరోగ్యం - వ్యాయామం - కంప్యూటర్ విద్య:
* ఈ అంశాల్లో పూర్వ ప్రాథమిక దశ నుంచి హయ్యర్ సెకండరీ దశ వరకు పాఠ్యాంశాల విద్యా ప్రణాళికను పునర్నిర్మించాలి.
* కళలు, చేతి వృత్తులను గుర్తించి విద్యా ప్రణాళికలో చేర్చాలి.
* అభ్యాసకుడి మూర్తిమత్వ అభివృద్ధికి ఆరోగ్య, వ్యాయామ విద్య అవసరం.
* ప్రపంచ భవిష్యత్ దృష్ట్యా కంప్యూటర్ సైన్స్ పాఠ్యప్రణాళికలో భాగం కావాలి.
* వ్యాయామ విద్యలో యోగా విద్యను భాగం చేయాలి.

ఎఫ్) మూల్యాంకనం:

* 2వ తరగతి వరకు ఎలాంటి ఇంటి పని (Home Work) ఇవ్వకూడదు.
* 3వ తరగతి నుంచి 2 గంటల ఇంటిపని వారానికికోసారి ఇవ్వవచ్చు.
* ప్రాథమికోన్నత దశలో ప్రతి రోజూ ఒక గంట ఇంటి పని ఇవ్వవచ్చు.

 

IV. పాఠశాల - తరగతి గది వాతావరణం:
* పాఠశాలకు సమాజ భాగస్వామ్యం కల్పించాలి.
* పాఠశాలకు కనీస అవసరాలను గుర్తించాలి.
* పాఠశాల సంస్కృతి విద్యార్థి యొక్క ఆసక్తి, శక్తి సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి.
* పాఠ్యపుస్తక రచన కొత్త ధోరణిని సంతరించుకోవాలి.

 

V. సంస్థాగత సంస్కరణలు:
* కామన్ పాఠశాల విధానం అంటే దేశంలోని అన్ని ప్రాంతాలవారికి ఏకరూపత ఉండే విద్యను అందించాలి.
* ఉపాధ్యాయుడు మంచి సంధానకర్తగా ఉంటూ గ్రామస్థాయిలో విద్యా వ్యవస్థ బలోపేతానికి పంచాయతీరాజ్‌ను బలోపేతం చేయాలి.
* ఉపాధ్యాయుడు విద్యా కార్యక్రమాల పునఃరూపకల్పన చేయాలి.

* పరీక్షల్లో ఒత్తిడి తగ్గించాలి.
* గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకుని, +2 స్థాయి వరకు పని ఆధారిత విద్య కల్పించాలి.
* వృత్తి విద్య శిక్షణకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* విద్యార్థుల అవసరాలు, ఆసక్తుల ఆధారంగా బహుళ సాధ్య పుస్తకాలను అందుబాటులోకి తేవాలి.

14(బి). విద్యాహక్కు చట్టం - 2009

      విద్యా హక్కుకు సంబంధించి స్వాతంత్య్రానికి పూర్వమే 1882లో హంటర్ కమిషన్‌కు జ్యోతిరావు ఫూలే ఒక వినతిపత్రం సమర్పించారు. 1911లో నాటి బ్రిటిష్ పార్లమెంటులో గోపాలకృష్ణ గోఖలే సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యా చట్టాన్ని తీసుకురావాలని వాదించారు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్వాతంత్య్రానంతరం 2009 వరకు మనం విద్యాహక్కు చట్టాన్ని తీసుకురావడంలో వెనకబడ్డాం. ఈ చట్టం పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే... మన రాజ్యాంగంలో ఆర్టికల్ 45 ఉచిత ప్రాథమిక విద్యను సూచిస్తుంది. దీనికి అనుగుణంగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21 (A) ని చేర్చి విద్యను ప్రాథమిక హక్కుగా మార్చే ప్రయత్నం చేశారు. చివరగా ఈ బిల్లు 2009 జులై 20న రాజ్యసభలోనూ, ఆగస్టు 4న లోక్‌సభలోనూ తర్వాత ఆగస్టు 26న భారత రాష్ట్రపతితో ఆమోదం పొందింది. 2009 ఆగస్టు 27న ఇండియన్ గెజిట్‌లో ప్రచురించారు.

* మనదేశంలో జమ్మూకశ్మీర్ మినహా ఈ చట్టం 28 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అధికారికంగా ఇది 2010, ఏప్రిల్ 1 నుంచి అమలవుతోంది.
* ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు, 38 సెక్షనులు, ఒక షెడ్యూలు ఉన్నాయి.
* ఈ చట్టాన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65 : 35 నిష్పత్తిలో పంచుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి 90 : 10గా ఉంది.
* భారతదేశంతో కలిపి ప్రపంచంలో విద్యా హక్కు చట్టాన్ని 136 దేశాలు అమలు చేస్తున్నాయి. చట్టం అమలులో చిలీ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఈ చట్టం ద్వారా 6-21 సంవత్సరాల వారికి విద్య అందిస్తుంది.
* ఈ చట్టంపై మొదటి కేసు దిల్లీ హైకోర్టులో నమోదైంది. దిల్లీకి చెందిన 'సుమన్‌ భాటియా' అనే 6వ తరగతి బాలిక ఈ కేసు వేసింది.

 

చట్టంలో అధ్యాయాలు, సెక్షన్‌లు:
I. చట్టం - అర్థం (సెక్షన్ 1, 2)
సెక్షన్ 1:
చట్టం పేరుతో పాటు చట్టం ఏయే అంశాలను పరిశీలిస్తుందో తెలుపుతుంది.
సెక్షన్ 2: చట్టంలో రూపొందించిన సాంకేతిక పదాలు, వాటి అర్థాలు.
బాలలు: 6 - 14 సంవత్సరాలలోపు వారు బాలబాలికలు.
ఎలిమెంటరీ విద్య: 1 నుంచి 8వ తరగతి వరకు (ప్రాథమిక + ప్రాథమికోన్నత)

నిర్బంధ విద్య: కచ్చితంగా అమలు చేయాల్సిన విద్య
క్యాపిటేషన్ రుసుం: బడి నిర్దేశించిన ఫీజులు కాకుండా ఇతర రూపాల్లో వసూలు చేసే విరాళాలు, చందాలు.

 

బడి - రకాలు:
1) ప్రభుత్వ పాఠశాలలు
2) ఎయిడెడ్ పాఠశాలలు (ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలలు)
3) అన్ ఎయిడెడ్ పాఠశాలలు (ప్రభుత్వ సహాయం లేని ప్రైవేటు పాఠశాలలు)
4) ప్రత్యేకంగా వర్గీకరించిన పాఠశాలలు
ఉదా: నవోదయ, సైనిక్, కేంద్రీయ విద్యాలయాలు, కేజీబీవీ, ఐటీడీఏ పాఠశాలలు.

 

II. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలలకు గల హక్కులు: (3 - 5)
సెక్షన్ 3: 6 - 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత విద్య పొందే హక్కు ఉంటుంది.
సెక్షన్ 4: 6 సంవత్సరాలు నిండినవారు తమ వయసుకు తగిన తరగతిలో చేరవచ్చు. తగిన శిక్షణ పొందవచ్చు. 14 ఏళ్లు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పొందవచ్చు.
సెక్షన్ 5: ఏదైనా ఒక కారణంతో ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకు మారే హక్కుతో బదిలీ సర్టిఫికెట్ పొందవచ్చు. టీసీ లేని కారణంగా ప్రవేశం నిరాకరించకూడదు.

III. ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యత: (6 - 11)
సెక్షన్ 6:
చట్టం అమలైన 3 సంవత్సరాల్లో ఆవాస ప్రాంతానికి ఒక కి.మీ. పరిధిలో ప్రాథమిక, 3 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి.
సెక్షన్ 7: చట్టం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను సమంగా పంచుకోవాలి.
సెక్షన్ 8: 6-14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందించే బాధ్యత సంబంధిత ప్రభుత్వానిదే. (సంబంధిత ప్రభుత్వ విధులు)
సెక్షన్ 9: పాఠశాల పరిధిలో 14 సంవత్సరాల లోపు పిల్లల వివరాల నమోదు, రిజిస్టర్ ఏర్పాటు.
సెక్షన్ 10: 6 - 14 సంవత్సరాల పిల్లలను పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత.
సెక్షన్ 11: 3 సంవత్సరాలు నిండిన బాలలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయాలి. దీనికోసం 6 సంవత్సరాలు నిండే వరకు బాలలందరికీ పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాలి.

 

IV. బడులు - ఉపాధ్యాయుల బాధ్యతలు: (12 - 28)
సెక్షన్ 12:
బలహీన వర్గాల వారికి, ప్రతికూల వర్గాల వారికి 1వ తరగతి ప్రవేశాల్లో 25% సీట్లు రిజర్వ్ చేయాలి.
సెక్షన్ 13: పాఠశాలలో క్యాపిటేషన్ రుసుం వసూలు చేయకూడదు. ఒక వేళ వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు. ఎంపిక పరీక్ష నిర్వహించకూడదు. మొదటి తప్పునకు రూ.25,000 ఆ తర్వాత ప్రతిపాదిత తప్పునకు రూ.10,000 జరిమానా విధించవచ్చు.

సెక్షన్ 14: జనన ధ్రువీకరణ పత్రం లేదని ప్రవేశం ఇచ్చేందుకు నిరాకరించకూడదు.
సెక్షన్ 15: విద్యాసంవత్సరం సిఫార్సు చేసిన గడువులోగా పిల్లలను పాఠశాలలో చేర్చుకోవాలి. అలా కాకుండా విద్యాసంవత్సరం మధ్యలో వచ్చినా పాఠశాలలో చేర్చుకోవాలి.
సెక్షన్ 16: ప్రాథమిక విద్య పూర్తయ్యేవరకు ఏ తరగతి గదిలోనూ నిలిపి ఉంచకూడదు (ఫెయిల్ చేయకూడదు). బడి నుంచి రిజిస్టర్‌లో పేరు తీసేయకూడదు.
సెక్షన్ 17: బాలలను శారీరకంగా, మానసికంగా శిక్షించకూడదు. అలా శిక్షిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
(Child Help Line Number 1098, 18004253525)
సెక్షన్ 18:
గుర్తింపు లేకుండా ఏ పాఠశాల నడపకూడదు, అలా నడిపితే మొదటి జరిమానా రూ.లక్ష. అయినప్పటికీ అలాగే కొనసాగితే రోజుకు 10 వేలు జరిమానా విధిస్తారు.
సెక్షన్ 19: ఒకవేళ చట్టం అమల్లోకి రావడానికి ముందు నుంచే ఒక పాఠశాల ఉందనుకుందాం. దీనికి గుర్తింపు లేకపోతే చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు గుర్తింపు పొందాలి.
సెక్షన్ 20: కేంద్రప్రభుత్వం చట్టంలో ఏ సవరణ అయినా చేయవచ్చు.
సెక్షన్ 21: స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో, ఆ బడిలోచదువుతున్న బాలల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, ఉపాధ్యాయులతో పాఠశాల యాజమాన్య కమిటీని ఎస్ఎమ్‌సీ ఏర్పాటుచేయాలి.

ఎస్ఎమ్‌సీ సభ్యుల్లో ఆ బడిలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరిని చైర్‌పర్సన్‌గా మరొకరిని వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎమ్‌సీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక ప్రాథమిక పాఠశాలలో 23 మంది ఎస్ఎమ్‌సీ సభ్యులు ఉంటారు. యూపీ స్థాయిలో 29 మంది ఉంటారు. ఎస్ఎమ్‌సీలో 50% మంది మహిళలు ఉంటారు. ఈ సమావేశాలకు గ్రామ సర్పంచి, ఎంపీపీ హాజరుకావచ్చు.
ఎస్ఎమ్‌సీ విధులు:
* బడి పనితీరు పర్యవేక్షణ
* మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణ
* బడి అభివృద్ధి ప్రణాళికను సిఫార్సు చేయడం
* నిధుల వినియోగ పరిశీలన

 

సెక్షన్ 22: బడి అభివృద్ధి ప్రణాళికను ఎస్ఎమ్‌సీ రూపొందించడం.
సెక్షన్ 23: ఉపాధ్యాయ అర్హత ఉన్న వ్యక్తిని టీచరుగా నియమించాలి. అర్హత లేకపోతే 5 ఏళ్ల లోపు అర్హత సాధించాలి.
సెక్షన్ 24: ఉపాధ్యాయుడి విధులు
సెక్షన్ 25: చట్టం అమలైన 6 నెలల్లోగా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండేలా చూడాలి.
సెక్షన్ 26: ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10% మించకుండా చూడాలి.

సెక్షన్ 27: జన గణన, ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాల పనులకు తప్ప ఇతర కార్యకలాపాలకు ఉపాధ్యాయులను పంపకూడదు.
సెక్షన్ 28: ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్లు చెప్పకూడదు.

 

V. పాఠ్యప్రణాళిక - ప్రాథమిక విద్యను పూర్తిచేయడం: (29 - 30)
సెక్షన్ 29:
ప్రభుత్వ అనుమతి ప్రకారం రాష్ట్రంలో అధీకృత విద్యా సంస్థ పాఠ్యప్రణాళిక మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది.
సెక్షన్ 30: ప్రాథమిక స్థాయిలో ఎలాంటి బోర్డు పరీక్షలు లేవు. ప్రాథమిక విద్య అనంతరం వారికి ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

 

VI. బాలల హక్కుల పరిరక్షణ: (31 - 34)
సెక్షన్ 31:
విద్యాహక్కు చట్టం అమలు, ఉల్లంఘన, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బాలల హక్కుల పరిరక్షణా సంఘాలను ఏర్పాటు చేయాలి. (NCPCR, SCPCR)
(National/State Commission for Protection of Child Rights)

* ఈ ఏర్పాట్లు లేకపోతే విద్యాహక్కు పరిరక్షణ అథారిటీ (REPA - Right to Education Protection Authority)ని ఏర్పాటు చేయాలి. ఇందులో 1 + 4 మంది సభ్యులుండాలి.
సెక్షన్ 32: బాలలకు ఉన్న హక్కుకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయవచ్చు. ఉదా: దిల్లీలోని సుమన్ భాటియా.

సెక్షన్ 33: విద్యారంగంలో కేంద్రానికి సలహాలివ్వడానికి జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో 1 + 1 + 13 మంది ఉంటారు.
* ఛైర్మన్ - మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి
* కో-ఛైర్మన్ - మానవ వనరుల అభివృద్ధి శాఖా సహాయ మంత్రి
* 13 మంది వివిధ రంగాల్లో పేరొందినవారు.
సెక్షన్ 34: రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
1 + 1 + 13 మంది ఉండాలి.
* ప్రాథమిక విద్యాశాఖ మంత్రి
* మాథ్యమిక విద్యాశాఖ మంత్రి
* వివిధ రంగాల్లోని నిష్ణాతులు 13 మంది.

 

VII. అధ్యాయం 7: ఇతర అంశాలు
సెక్షన్ 35:
సందర్భాన్ని బట్టి చట్టంపై ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకు ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేయవచ్చు. స్థానిక ప్రభుత్వాలు ఎస్ఎమ్‌సీకి మార్గదర్శకాలు జారీ చేయవచ్చు.
సెక్షన్ 36: ఈ చట్టంలోని శిక్షార్హ నేరాలకు సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అధికారి ఆమోదం పొందిన తర్వాత ప్రాసిక్యూషన్ చేయాలి.

సెక్షన్ 37: చట్టం అమలులో సదుద్దేశంతో చేసిన చర్యలకు కేంద్రం/ రాష్ట్రం/ సంస్థ/ వ్యక్తులపై ఇతరులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.
సెక్షన్ 38: చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వం ప్రకటన ద్వారా నియమాలు రూపొందించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ప్రతి ప్రకటనను పార్లమెంటు/ రాష్ట్ర శాసనసభల ముందు ఉంచాలి.
ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల నిబంధన - 2010 ఏర్పాటు.

​​

ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు నిబంధనలు - ఆంధ్రప్రదేశ్, 2010
* విద్యాహక్కు చట్టం రాష్ట్రాలకు స్థానిక అవసరాల దృష్ట్యా కొన్నింటిలో మార్పులు చేసుకోవచ్చని సూచించింది. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టంలోని కొన్ని మార్పులు

ప్రతికూల వర్గాలకు చెందిన బాలలు: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అనాథ బాలలు, వలస వచ్చిన వీధి బాలలు, ప్రత్యేక అవసరాలు గల బాలలు, హెచ్ఐవీ బాధిత బాలలు.
బలహీన వర్గాలకు చెందిన బాలలు: బీసీలు, మైనారిటీలు, ఇతర కులాలకు చెందిన వార్షిక ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్షకు మించని తల్లిదండ్రుల పిల్లలు.
ప్రాథమిక బడిలో ప్రవేశ వయసు: సెప్టెంబరు 1 నాటికి బాలబాలికలకు విధిగా 5 సంవత్సరాలు నిండి ఉండాలి.
ప్రత్యేక పాఠశాలలు: నవోదయ, కేంద్రీయ, సైనిక పాఠశాలలే కాకుండా సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు.
ఎలిమెంటరీ పాఠశాలలు: 1 - 8 తరగతులను నిర్వహించే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు
నోట్: ప్రాథమిక పాఠశాల అంటే 1 - 5 తరగతులు, ప్రాథమికోన్నత పాఠశాల అంటే 6 లేదా 7/8 తరగతులు.
స్థానిక ప్రభుత్వం: జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్.
అకడమిక్ అథారిటీ: SCERT (State Council of Educational Research and Training)
చట్టాన్ని అమలు చేసే అథారిటీ: కమిషనర్ అండ్ డైరెక్టర్, పాఠశాల విద్య, తెలంగాణ + రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, సర్వశిక్షా అభియాన్.
రాష్ట్రీయ సలహా మండలి: ఛైర్‌పర్సన్ (ప్రాథమిక విద్యాశాఖ మంత్రి) + కో ఛైర్‌పర్సన్ (ప్రాథమిక విద్యాశాఖ ఇన్‌ఛార్జి మంత్రి) + 13 మంది ఇతర సభ్యులు

బడి బయట పిల్లలను గుర్తించి వయసుకు తగిన తరగతిలో చేర్పించే ముందు: ఉపాధ్యాయులు/ సీఆర్‌పీలతో SCERT రూపొందించిన సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. శిక్షణా వ్యవధి 3 నెలలు. పీరియాడిక్ అసెస్‌మెంట్ ఆధారంగా ఈ వ్యవధిని గరిష్ఠంగా 2 సంవత్సరాలు దాటకుండా పొడిగించవచ్చు.
 

బడి ఏర్పాటు: 1 - 5 తరగతుల వారు నడవగలిగే 1 కి.మీ. పరిధిలో; 6 - 8 తరగతుల పిల్లలు ప్రయాణించగలిగే 3 కి.మీ. పరిధిలో స్థానిక ప్రభుత్వం బడి ఏర్పాట్లు చేయాలి. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
* తీవ్ర వైకల్యం గలవారికి ఇంటి వద్దనే (Home Based Education) శిక్షణ అందించాలి.
* సమ్మిళిత విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల బాలలకు అందరితో విద్య ఉద్దేశం నెరవేరడానికి రెగ్యులర్ టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ అందించాలి.
* మానవ హక్కుల ఆర్టికల్ 24 ప్రకారం వైకల్యంతో బాధపడే వారికి చదువుకునే హక్కును కల్పించడానికి తగిన చర్యలు తీసుకుని అవసరమైతే వారి కోసం ప్రత్యేక టీచర్లను నియమించాలి.
* స్కూల్ మ్యాపింగ్ ద్వారా అవసరమైన ప్రాంతాల్లో చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది లోపు పాఠశాలలు స్థాపించాలి. 
* ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీల పిల్లల కోసం వారు పనిచేసే స్థలంలోనే అవసరమైతే స్థానిక ప్రభుత్వం పాఠశాల స్థాపించాలి.
* ఇంటింటి సర్వే ద్వారా ప్రతి పిల్లవాడి రికార్డును నిర్వహించడం స్థానిక ప్రభుత్వ బాధ్యత.

* పిల్లల ప్రవేశం విషయంలో నివాస ధ్రువీకరణకు రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఇంటిపన్ను రశీదు, పట్టాదారు పాసు పుస్తకం, టెలిఫోన్ బిల్లు... ఏదైనా ఇవ్వవచ్చు.
* పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు 25% రిజర్వేషన్ పాటించాలి. ఆ రిజర్వేషన్ ఈ విధంగా ఉండాలి.
      1. అనాథలు/ వైకల్యం గల పిల్లలు/ హెచ్.ఐ.వి. సోకిన పిల్లలు - 5%
      2. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 10%
      3. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 4%
      4. బలహీన వర్గాలు (బీసీ), మైనారిటీలు - 6%
* 25% పిల్లలకు అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం తమ నిధుల నుంచి పై పాఠశాలలకు చెల్లిస్తుంది. 50% నిధులను సెప్టెంబరులోనూ, మిగతా 50% నిధులను జనవరిలో చెల్లిస్తారు. జులై చివరిలో రీయింబర్స్‌మెంట్ అవసరమైన విద్యార్థుల జాబితాలను ఆయా పాఠశాలలు జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పించాలి. దీని కోసం ప్రతి పిల్లవాడి హాజరు 80% ఉండాలి.
* పాఠశాల ప్రవేశం కోసం జనన ధ్రువీకరణ పత్రం
      1. వైద్యశాల/ ఏఎన్ఎం రిజిస్టర్ రికార్డు
      2. తల్లి/ తండ్రి/ సంరక్షకుడు ఇచ్చిన స్వీయ ప్రకటన
      3. సంబంధిత అధికారి నుంచి జనన ధ్రువీకరణ పత్రం

పాఠశాల ప్రవేశం - సాధారణ కాల వ్యవధి: జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు ప్రవేశాలు ఉంటాయి. అదనంగా ప్రభుత్వం 3 నెలల వరకు ఈ గడువును పొడిగించవచ్చు.
పాఠశాల గుర్తింపు: ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల స్థాపనకు ఎంఈవో ద్వారా డీఈవోకు; ఉన్నత పాఠశాల స్థాపనకు డీఈవో ద్వారా ఆర్‌జేడీకి దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఎంఈవో పరిశీలించి అన్నీ కచ్చితంగా ఉన్నట్లయితే 7 రోజుల్లోపు ఆ దరఖాస్తును డీఈవోకి సమర్పించాలి. డీఈవో అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే 30 రోజుల్లోపు బడికి అనుమతి ఇవ్వాలి. ఈ గుర్తింపు ధ్రువీకరణ 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది.
* స్థాపించిన ప్రతి పాఠశాల చట్ట నిబంధనలు అన్నింటిని అమలుపరచాలి. 25% అననుకూల, బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించాలి.

 

పాఠశాల రద్దు: షరతులు పాటించని పాఠశాలకు షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానానికి కనీసం ఒక నెల (30 రోజులు) వ్యవధి ఇవ్వాలి. సరైన వివరణ లేకపోతే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. అది వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు అవుతుంది. అక్కడి పిల్లలను పరిసర ప్రాంత పాఠశాలల్లో చేర్చాలి.
 

రద్దయిన పాఠశాల విన్నపం: గుర్తింపు రద్దయిన పాఠశాల రద్దు ఉత్తర్వులు అందిన తర్వాత 15 రోజుల్లోపు జిల్లా కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలు తర్వాత ఇరు వాదనలు విన్న కలెక్టరు 2 నెలలు లోపు తుది ఉత్తర్వులు ఇవ్వాలి. కలెక్టర్‌దే అంతిమ నిర్ణయం. జిల్లా కలెక్టరు ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ మాత్రమే పునఃశ్చరణ చేయవచ్చు. కలెక్టరు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత 30 రోజుల్లోపు పాఠశాల యాజమాన్యం అప్పీలు చేసుకోవాలి.

పాఠశాలకు వచ్చే నిధుల ఖర్చు: ఎస్ఎంసీ ఛైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఉమ్మడి బ్యాంకు ఖాతాలో నమోదు చేసి అవసరమైన నిధులను ఎస్ఎంసీకి చెప్పి ఉపయోగించుకోవాలి. ప్రతి ఏడాది లోకల్ ఫండ్ ఆడిటర్/ సహకార శాఖ ఆడిటర్ ద్వారా పాఠశాల ఖాతాను ఆడిట్ చేయించుకోవాలి.
ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురైతే: ఎస్ఎంసీ స్థాయిలో ఆ ఇబ్బందులను తొలగించాలి. దానివల్ల కాకపోతే మండల కమిటీ స్థాయిలో, దానివల్ల కూడా కాకపోతే జిల్లా స్థాయి కమిటీ (ఛైర్మన్ జిల్లా కలెక్టరు, కన్వీనర్ డీఈవో) ద్వారా తొలగిస్తారు.

 

విద్యాహక్కు పరిరక్షణ అథారిటీ: బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ (SCPCR - State Commission for Protection of Child Rights) - RTE పరిరక్షణ అథారిటీగా పనిచేస్తుంది.
 

రాష్ట్ర సలహా మండలి: ఛైర్మన్ + కో ఛైర్మన్ + 13 మంది సభ్యులు
ఎక్స్ అఫీషియో ఛైర్మన్ - ప్రాథమిక విద్యాశాఖ మంత్రి
ఎక్స్ అఫీషియో కో ఛైర్మన్ - ప్రాథమిక విద్యాశాఖ ఇన్‌చార్జ్ మంత్రి
మండలి కన్వీనర్ - ప్రాథమిక విద్య, సర్వశిక్ష అభియాన్ ముఖ్య కార్యదర్శి
కో కన్వీనర్ - పాఠశాల విద్యా కార్యదర్శి

 

నోట్: 3 నెలలకు ఒకసారి మండలి సమావేశం కావాలి. ప్రతి సభ్యుడి పదవీ కాలం 2 సంవత్సరాలు. ఏ సభ్యుడు 2 సంవత్సరాలకు మించి కొనసాగకూడదు.

రచయిత: కోటపాటి హరిబాబు

Posted Date : 16-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌