• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం - ఒక భావన

జీవితంలో మార్పు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి: పెరుగుదల (Growth), అనుభవం (Experience).

* పెరుగుదల జీవసంబంధమైన ప్రక్రియ. దీనివల్ల కలిగే మార్పు ‘శరీర సౌష్టవం’. దీన్ని అభ్యసనంగా చెప్పలేం. 

* అనుభవం, శిక్షణ ద్వారా సంభవించే ప్రవర్తనా మార్పును అభ్యసనం అంటారు. 

ఉదా: * పిల్లలు భాష నేర్చుకోవడం.

         * ఈత, నృత్యం, సైకిల్‌ నేర్చుకోవడం లాంటివి.

అభ్యసనం = అంత్య ప్రవర్తన  - ఆది ప్రవర్తన

అభ్యసనం - లక్షణాలు


* జీవితాంతం జరిగే అవిచ్ఛిన్న (Continues) ప్రక్రియ.

* అన్ని జీవుల్లోనూ జరిగే సార్వత్రిక ప్రక్రియ.

* సంచిత (Cumulative) స్వభావాన్ని చూపుతుంది.

* అందరిలోనూ ఒకేవిధంగా ఉండక, వైయక్తిక భేదాలను చూపే చర్య.

* వ్యక్తుల శారీరక పెరుగుదల, వారి మానసిక పరిపక్వతలపై ఆధారపడుతుంది.

* ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా బదలాయింపు జరిగే ప్రక్రియ.

* సాధారణంగా చర్యాత్మక మానసిక ప్రక్రియ.

* ఒక నిరంతర ప్రక్రియ కానీ ఫలితం కాదు.

* వ్యక్తి అనుభవం, సాధన వల్ల సిద్ధించే ప్రక్రియ. 

* ఎవరిలోనైనా అన్ని వేళల్లో ఒక క్రమ పద్ధతిలో జరగదు.

ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ఫలితమే అభ్యసనం.

* అభ్యసనం వల్ల కలిగే మార్పును గమనించవచ్చు.

అభ్యసనం - రకాలు

చలన అభ్యసనం (Motor learning): చలన అవయవాలైన కాళ్లు, చేతులను ఉపయోగిస్తూ నేర్చుకునే కౌశలాలే చలన అభ్యసనం.

ఉదా: డ్రైవింగ్, టైపింగ్‌ చేయడం.

శాబ్దిక అభ్యసనం (Verbal learning): కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకుని సంబంధించిన వస్తువులను పేరుపెట్టి పిలవడం; క్రమంగా పలకడం; పదాలను, వాక్యాలను ఉపయోగించడం.

విచక్షణా అభ్యసనం (Discrimination learning): రెండు అంశాల మధ్య, వస్తువుల మధ్య భేదాన్ని గుర్తించడం; వస్తువులను గుర్తించడం, సక్రమంగా చెప్పడం/ వేరుచేయడం.

ఉదా: 1. ఆవుకు, గుర్రానికి మధ్య తేడాను గ్రహించడం.

        2. కొన్ని ఆటవస్తువుల్లో అడిగిన దాన్ని పిల్లలు గుర్తించడం.

ప్రత్యక్ష అభ్యసనం (Perceptual learning): వస్తువులు, అంశాల మధ్య తేడాను గుర్తించడంతోపాటు అది ఎందుకు, ఏమిటి, ఎలా అని విశ్లేషించడం, వస్తువుల ఉపయోగాన్ని చెప్పడం.

ఉదా: పెన్‌ రాయడానికి అని, బిస్కెట్‌ తినడానికి అని, దువ్వెన తల దువ్వుకోవడానికి అని చెప్పడం.

భావనాత్మక అభ్యసనం (Conceptual learning): ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలున్న వస్తువులు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరుచుకుని, భావనల ద్వారా అభ్యసనం చేయడం.

ఉదా: వస్తువులు, పక్షులు, సరి-బేసి సంఖ్యల మధ్య భావన.

సమస్య పరిష్కార అభ్యసనం (Problem solving learning): ఆలోచన, వివేచన, సృజనాత్మకత, స్వబుద్ధిని ఉపయోగించి ఒక సమస్యకు వివిధ రకాలైన పరిష్కార మార్గాలను చూపడం. ఇది అన్ని అభ్యసనాల్లోకెల్లా క్లిష్టమైంది, ఉన్నతస్థాయి అభ్యసనం.

ఉదా: గణిత సమస్యలకు అనేక రకాల పరిష్కార మార్గాలు చూపడం.

క్రమయుత అభ్యసనం (Procedural learning): నిరంతరం చేసే సాధన ద్వారా కొన్ని కృత్యాలు (పనులు), నైపుణ్యాలు, అలవాట్ల సముపార్జన జరుగుతుంది. ఇదే క్రమయుత అభ్యసనం.

ఉదా: అలవాట్లు, వంటలు, ప్రయోగాలు చేయడం.

సాధారణీకరణ అభ్యసనం (Generalisation learning): కొన్ని సంఘటనలు, అంశాలను గమనించి వాటి సారూప్యతను గుర్తించి ఒక తుది నిర్ణయానికి రావడమే సాధారణీకరణం.

ఉదా: కొన్ని ఉదాహరణలను గమనించి మొక్కలు స్వయం పోషకాలని, జంతువులు పరపోషకాలని గుర్తించడం.

వాస్తవిక అభ్యసనం (Factual learning): కొన్ని విషయాలను ఉన్నది ఉన్నట్లుగా మార్పులేకుండా నేర్పించడం. పిల్లలకు వాస్తవిక సమాచారాన్ని అందించడం దీని లక్ష్యం.

ఉదా: నిర్వచనాలు, దేశాలు-రాజధానులు, గణిత పట్టికలు నేర్పడం.

సంసర్గ అభ్యసనం (Association learning): ఆలోచనలు, అనుభవాలు పరస్పరం పునర్బలనం చెంది, మానసికంగా ఒకదానికొకటి సంబంధం ఏర్పరచుకోవడమే సంసర్గ అభ్యసనం.

ఉదా: * సిగ్నల్‌ వద్ద ఎరుపు రంగు చూడగానే వాహనాన్ని ఆపడం. 

        * హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ గుర్తుకురావడం.

వైఖరుల అభ్యసనం (Attitudinal learning): వ్యక్తులకు ఇతరుల పట్ల, వస్తువుల పట్ల, సంఘటనల పట్ల ఉండే ప్రత్యేక అభిప్రాయమే వైఖరి.

ఉదా: పిల్లలు కొన్ని సంఘటనల పట్ల అనుకూలతను, కొన్ని విషయాలు తెలుసుకోగానే ప్రతికూలతను చూపడం.

నైపుణ్యాల అభ్యసనం (Skills learning): క్లిష్టమైన పనిని సమర్థవంతంగా, అడ్డంకులు అధిగమిస్తూ, సులభంగా నేర్చుకుని చేయగలిగే సామర్థ్యమే నైపుణ్యాల అభ్యసనం.

ఉదా: డ్రైవింగ్‌ బాగా చేయడం, ఆటలు బాగా ఆడటం.

నియమాల అభ్యసనం (Rules learning): వ్యక్తి కొన్ని పద్ధతులను, నిబంధనలను క్రమం తప్పకుండా అభ్యసించడాన్ని నియమాల అభ్యసనం అంటారు. ఇది ఉన్నతస్థాయి పరిజ్ఞానాత్మక ప్రక్రియ. ఇందులో నేర్చుకునే అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ‘రాబర్ట్‌ గాగ్నే’ అనే శాస్త్రవేత్త నియమాల అభ్యసనానికి 5 సోపానాలను రూపొందించాడు. ఈయన రాసిన గ్రంథం. ‘The Conditions of Learning’

ఉదా: వ్యక్తి మాట్లాడే భాష, రచన, రోజువారీ కార్యక్రమాలను నియమాల ద్వారా అభ్యసించడం.

విలువల అభ్యసనం (Valued learning): వ్యక్తి చేసే పనుల్లో తప్పొప్పులను, భావనలను పెంపొందించే అభ్యసనం. ఇది వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది.

ఉదా: వ్యక్తి సమాజంలోని విలువలకు కట్టుబడి ఉండటం.

సంఘటనాత్మక అభ్యసనం (Incidental learning): పరిసరాల్లో జరిగే సంఘటనలను, ఉద్దీపనల ద్వారా ప్రయత్నం, ఉద్దేశం లేకుండా పొందే జ్ఞానం. వ్యక్తి తెలిసీ తెలియక చేసే పనులన్నీ ఇందులో భాగం.

ఉదా: చిన్నతనంలో పిల్లలు తన స్నేహితుల నుంచి విషయాలను తెలుసుకోవడం.

అభ్యసన కాని అంశాలు

1. పరిపక్వత (Maturity): పుట్టుక నుంచి వయసు పెరిగే కొద్దీ శరీరంలో జరిగే భౌతిక, అంతర్గత మార్పులను ‘పరిపక్వత’ అంటారు.

ఉదా: పిల్లలకు దంతాలు రావడం, గౌణలైంగిక లక్షణాలు అభివృద్ధి చెందడం.

2. సహజాతాలు (Instincts): ప్రతిఒక్కరిలోనూ ప్రకృతిపరంగా స్వతఃసిద్ధంగా ఏర్పడే మార్పులు.

ఉదా: ఏడవడం, ఆకలి - దప్పిక వేయడం.

3. అసంకల్పిత చర్యలు (Involuntary Actions): వ్యక్తి ప్రమేయం లేకుండా శరీరంలో జరిగే యాదృచ్ఛిక చర్యలు.

ఉదా: రక్తప్రసరణ జరగడం, కనురెప్పలు ఆర్పడం.

4. గుడ్డిఅనుకరణ (Imprinting): ఏ మాత్రం ఆలోచన, అనుభవం లేకుండా ఇతరులు చేసే పనిని అదేవిధంగా చేయడం.

ఉదా: పిల్లలు తమకు తెలియని భాషను చూసి రాయడం, బొమ్మను చూసి అలాగే గీయడం (చిత్రపటం).

5. నిష్పాదన (Performance): అంతర్గతంగా ఉన్న ప్రక్రియలను ప్రతిబింబించే చర్యను నిష్పాదన అంటారు. ఇది అభ్యసనం కాదు.

ఉదా: వేగంగా పరిగెత్తడం, బాగా ఆడటం.

* పై అంశాలే కాకుండా అనారోగ్యం, మత్తు పదార్థాల వాడకం, జబ్బు వల్ల కలిగే మార్పులు అభ్యసనం కాదు.

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌