• facebook
  • whatsapp
  • telegram

పెరుగుదల - వికాసం - పరిపక్వత

   పెరుగుదల - వికాసం

పెరుగుదల: తల్లి గర్భంలో ఏకకణ జీవిగా ప్రారంభమైన మనిషి శరీరంలో జరిగే పరిమాణాత్మకమైన మార్పులను 'పెరుగుదల' అంటారు. ఈ పెరుగుదల బాహ్య పెరుగుదలగా (ఎత్తు, బరువు, లావు), అంతర పెరుగుదలగా (మెదడు, నాడీమండల అభివృద్ధి) జరుగుతుంది.
లక్షణాలు:
* పెరుగుదల అనేది జీవిలో కనిపించే భౌతికమైన మార్పు.
* ఇది దాదాపు కౌమారదశ వరకు జరుగుతుంది.
* పెరుగుదల వల్ల కలిగే మార్పులను కచ్చితంగా కొలవొచ్చు.
* పెరుగుదల వికాసంలో ఒక భాగం. అందుకే దీన్ని సంకుచితమైన భావనగా పేర్కొనవచ్చు.
* పెరుగుదల ఉన్నంతమాత్రాన అన్ని రకాల వికాసాలు జరగకపోవచ్చు.
ఉదా: పెరుగుదల ఉన్న వ్యక్తిలో ప్రజ్ఞా వికాసం స్వల్పంగా ఉంటే 'బుద్ధిమాంద్యం' ఏర్పడుతుంది.

 

వికాసం: మనిషిలో కలిగే గుణాత్మక మార్పులనే 'వికాసం' అంటారు. ఇందులో భౌతిక వికాసం, మానసిక వికాసం, భాషా వికాసం, చలనాత్మక వికాసం, సంజ్ఞానాత్మక వికాసం; ఉద్వేగ, నైతిక వికాసాలు కలిసి ఉంటాయి.
లక్షణాలు:
* వికాసం జీవిలో కలిగే గుణాత్మకమైన మార్పు.
* వికాసం జీవి ప్రారంభం నుంచి మరణం వరకు నిరంతరం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది.
* వికాసం వల్ల కలిగే మార్పులను కచ్చితంగా కొలవలేం.
* వికాసంలో పెరుగుదల ఒక భాగం. అందుకే దీన్ని విస్తృతమైన భావనగా పేర్కొనవచ్చు.
* పెరుగుదల సరిగా లేకపోయినా, వికాసం సక్రమంగా జరగొచ్చు.
ఉదా: మరుగుజ్జులు శారీరకంగా పెరగకపోయినా వారి సంజ్ఞానాత్మక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసాలు సక్రమంగా జరగొచ్చు.

 

పరిపక్వత / పరిణతి (Maturity):
జీవి పుట్టుకతో సహజసిద్ధంగా వచ్చిన సామర్థ్యాలు, లక్షణాలు వయసుతోపాటు పెరుగుతూ సక్రమంగా వికసించడమే పరిపక్వత. ఇది జన్యు ప్రభావంతో కూడిన జైవిక ప్రక్రియ.
ఉదా: 5 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేం. కానీ వయసు పెరిగేకొద్దీ తనకు తానుగా ఎవరి సహాయం లేకుండా నడవడం అనేది పరిపక్వతను సూచిస్తుంది.
    *  శిశు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం అనేవి పరస్పర ఆధారితాలు.   కాబట్టి వికాసం = పరిపక్వత × అభ్యసనం

 

వికాస సూత్రాలు

శాస్త్రవేత్తలు వికాసం ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి జంతువులు, మానవులపై వివిధ ప్రయోగాలు నిర్వహించి, వాటి ఆధారంగా కింది వికాస సూత్రాలను రూపొందించారు. వికాసం క్రమానుగతంగా, కచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది: ఏ జీవిలోనైనా వికాసం ఒక కచ్చితమైన క్రమాన్ని అనుసరిస్తుంది.
ఉదా: శిశువు చలనాత్మక వికాసంలో మొదట పాకటం, కూర్చోవడం, ఆధారంతో నిల్చోవడం, తర్వాత నడవడం, పరుగులు తీయడం అనేది క్రమానుగతం.
       వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది: వ్యక్తిలో వికాసం అనేది ఫలదీకరణ దశ నుంచి మరణించేంతవరకు నిరంతరం విరామం లేకుండా కొనసాగుతుంది.

 

వికాసం సంచితమైన భావన: శిశువు ఎదుగుదలలోని మార్పులు కొన్ని బయటకు హటాత్తుగా కనిపించినప్పటికీ అంతర్గతంగా అనేక అంశాలు మార్పు చెందిన తర్వాతే ఈ మార్పు బహిర్గతం అవుతుంది.
ఉదా: శిశువు లేచి నిలబడటం, మొదటి పదం పలకడం, దంతాలు రావడం మొదలైనవి.

 

వికాసం ఒక పరస్పర చర్య: వ్యక్తికి జన్మతహా సంక్రమించిన లక్షణాలు, పరిసరాలతో జరిగే పరస్పర చర్య వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరుగుతుంది.
ఉదా: శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి తబలా వాయించే నైపుణ్యకారకం లభించినట్లయితే ఈ గుణానికి మంచి పరిసర శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మంచి వాయిద్యకారుడుగా తయారుకావచ్చు.
పెరుగుదల - వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు: ప్రతి జీవిలోనూ వికాస ప్రక్రియ అన్ని అంశాల్లో, దశల్లో ఒకే విధంగా జరగదు. ఉదాహరణకు..
* శైశవదశలో శారీరక వికాసం ఎక్కువగా ఉండి, బాల్యదశలో సాధారణంగా ఉండటం.
* శైశవదశలో మానసిక వికాసం స్వల్పంగా, బాల్యదశలో వేగంగా జరగడం.

 

వికాసం వైయక్తిక భేదాలను చూపిస్తుంది: ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ వికాసం ఒకే విధంగా జరగదు. అంటే వ్యక్తులందరిలో వికాసం ఒకే వేగంతో, గుణాత్మకంగా సాగదు.
ఉదా: మగపిల్లల సగటు వికాస వేగం ఆడపిల్లల సగటు వికాస వేగం కంటే కొంచెం తక్కువగా ఉండటం.
వికాసం ఒక కచ్చితమైన దిశగా సాగుతుంది. దీన్ని రెండు ఉపసూత్రాలుగా విభజించవచ్చు...
ఎ) వికాసం 'శిరోపాదాభిముఖంగా' సాగుతుంది. వికాసం అనుదైర్ఘ్యంగా శిశువు శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది.
ఉదా: తల్లి గర్భంలో మొదట శిశువు తల భాగం అభివృద్ధి చెంది, తర్వాత నడుము, చివరకు పాదాలు వికాసం చెందడం.
బి) సమీప దూరస్థ వికాస సూత్రం: వికాసం శరీర కేంద్రం నుంచి భాగాలకు విస్తరిస్తుంది.
ఉదా: శిశువుకు మొదట భుజం, కండరాలు, తర్వాత చేతి కండరాలు, ఆ తర్వాత వేళ్లపై అదుపు ఏర్పడటం.
వివిధ వికాసాలు పరస్పర సంబంధంతో కొనసాగుతాయి: వ్యక్తిలోని వివిధ వికాసాలైన శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి వికాసం చెందుతాయి. ఇందులో ఏ ఒక్క వికాసం మందగించినా దాని ప్రభావం మరో వికాసంపై ఉంటుంది.
ఉదా: ఒక విద్యార్థిలో భౌతిక వికాసం (శారీరక వికాసం) కుంటుపడితే దాని ప్రభావం మిగిలిన అన్ని వికాసాలపై ఉండటం (సరిగా చదవకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, సాయం చేయకపోవడం లాంటి గుణాలు).

 

వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది: ప్రారంభంలో శిశువు అన్ని ఉద్దీపనలకు సాధారణ ప్రతిస్పందన చూపించినా, క్రమంగా ఒక ఉద్దీపనకు మాత్రమే ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రతిస్పందించడం.
ఉదా: ఒక వస్తువును పట్టుకోవడానికి ప్రారంభంలో శిశువు రెండు చేతులను ఉపయోగించడం, తర్వాత ఒక చేతిని, చివరగా ఆ వస్తువును పట్టుకోవడానికి అవసరమైన వేళ్లను మాత్రమే ఉపయోగించడం.

 

వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు: శిశువు ప్రస్తుత వికాసం ఆధారంగా అతని భవిష్యత్తు వికాసాన్ని ఊహించవచ్చు.
ఉదా: ఒక బాలుని బాల్యదశలోని బౌద్ధిక వికాసాన్ని బట్టి కౌమార దశలో బౌద్ధిక వికాసాన్ని ఊహించవచ్చు.

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌