• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషా బోధ‌న‌ - ల‌క్ష్యాలు - స్ప‌ష్టీక‌ర‌ణ‌లు

మనుషులు కారణం లేకుండా ఏ పనీ చేయరు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫలితాన్నో.. కొన్ని ఫలితాలనో ఆశిస్తారు. ఇలా ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలనే విద్యాపరిభాషలో 'లక్ష్యాలు' అంటారు. ఈ లక్ష్యాలను బోధనకు అన్వయిస్తే అవి బోధనా లక్ష్యాలు, మాతృభాషకు అన్వయిస్తే మాతృభాషా బోధన లక్ష్యాలు అవుతాయి.

 

బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించిన విద్యావేత్త బెంజిమిన్ బ్లూమ్. Taxonamy of Educational Objectives లో ఈయన వీటిని విశ్లేషించాడు. ఆయనతోబాటు మరికొందరు విద్యావేత్తల కృషి ఫలితంగా బోధనా లక్ష్యాలు రూపొందాయి.  లక్ష్యాధార బోధనలు నిర్వహించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి 1973-74లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (SCERT) Manual for School Level Seminar ను ప్రచురించింది. ఇందులో తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను గుర్తించారు. వీటి ఆధారంగా ఈ లక్ష్యాల ఆవిష్కరణలో గమ్యం - లక్ష్యం - స్పష్టీకరణ అనే పదాలను నిర్వచించుకోవాలి.

 

ఉద్దేశాలు (Aims): పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తనా మార్పులను తెలిపేవే ఉద్దేశాలు.

 

 గమ్యాలు, ధ్యేయాలు (Goals): ఆశయాల ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలే గమ్యాలు. ఇవి సుదీర్ఘకాలంలో విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు.

 

 లక్ష్యాలు: ఉద్దేశాలు, గమ్యాల నుంచి ఆవిర్భవించి, తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులను సూచించేవి లక్ష్యాలు.

 

 స్పష్టీకరణలు: బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు స్పష్టీకరణలు. ఇవి బోధనాకృత్యానికి ప్రాతిపదికలు. అభ్యసనానికి సాక్ష్యాలు. వివిధ లక్ష్యాల్లోని భేదాలను చెప్పడానికి ఇవి తోడ్పడతాయి.

 

ఒకటి నుంచి పదో తరగతి వరకు మన రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మాతృభాష బోధించే ఉపాధ్యాయులు దృష్టిలో ఉంచుకోవాల్సిన లక్ష్యాల్లో- జ్ఞానం, అవగాహన, వినియోగం, రసానుభూతి, సముచిత మనోవైఖరులు, భాషాభిరుచి, సంస్కృతీ సంప్రదాయాలు, సృజనాత్మకత, భాషాంతరీకరణ, నైపుణ్యాలు- అనే పది అంశాలున్నాయి.

 

జ్ఞానం - స్పష్టీకరణలు

1) జ్ఞప్తికి తెచ్చుకోవడం

2) ఆయా సందర్భాల్లో గుర్తించడం

అవగాహన: విద్యార్థి పై జ్ఞానాంశాలను అర్థం చేసుకుంటాడు.

స్పష్టీకరణలు: విద్యార్థి

ఉదాహరణలను సొంతంగా ఇస్తాడు.

దోషాలుంటే గుర్తించి, సరిచేస్తాడు.

సన్నిహిత సంబంధం ఉన్న అంశాల సామ్యభేదాలను కనిపెడతాడు.

నిగూఢార్థాన్ని గుర్తిస్తాడు.

అపరిచిత పద్యభాగాల ప్రధాన భావాలను కనుక్కుంటాడు.

అపరిచిత పద్యభాగాలకు సరైన శీర్షికలు సూచిస్తాడు.

పదాల అర్థాలను సందర్భానుసారంగా సూచిస్తాడు.

సందర్భోచితంగా పదాలను ఎన్నుకుంటాడు.

ఇచ్చిన సూచనలను అనుసరిస్తాడు.

ఇచ్చిన వాక్యాల్లో విరామ చిహ్నాలను సూచిస్తాడు.

పద్య, గద్యాల్లో అన్వయక్రమాన్ని తెలుపుతాడు.

సారాంశాన్ని గ్రహిస్తాడు.

వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు.

తగిన వేగంతో చదువుతాడు.

సరైన ఉచ్ఛారణతో చదువుతాడు.

సరైన స్వరంతో చదువుతాడు.

 

3. వినియోగం: విద్యార్థి తాను నేర్చుకున్న భాషను నిత్యవ్యవహారంలో ఉపయోగిస్తాడు.

స్పష్టీకరణలు:

సెలవు పత్రాన్ని స్వయంగా రాయగలగడం.

తల్లిదండ్రులు, స్నేహితులకు లేఖలు రాయగలగడం.

నిఘంటువును, పూర్వగాథాలహరిని, విద్యార్థి కల్పతరువు మొదలైన గ్రంథాలను పఠన సందర్భంలో ఉపయోగించగలిగి ఉండటం.

నిర్దుష్టంగా వాక్యనిర్మాణం చేయగలిగి ఉండటం.

సంభాషణలో చమత్కృతిని, మితభాషిత్వాన్ని పాటించడం.

లేఖనంలో సూచనలను అనుసరించడం.

సుపరిచిత పదజాలాన్ని, సామెతలను, జాతీయాలను, లోకోక్తులను, రసాలు, అలంకారాలు మొదలైన వాటిని సమయానుసారంగా ఉపయోగించగలగడం.

 

4. రసానుభూతి: పాఠాల్లో ఉండే రసవద్ఘట్టాలను గ్రహించడమే గాకుండా, విద్యార్థి తాను చదివే పత్రికలు, పుస్తకాల్లో ఉండే రసాన్ని ఆస్వాదిస్తాడు.

స్పష్టీకరణలు: విద్యార్థి

రచనల్లోని రసభేదాలను తెలుసుకుంటాడు.

గ్రంథాల్లోని రసవద్ఘట్టాలను తెలుసుకుంటాడు.

అలంకారాల విశిష్టతను గ్రహిస్తాడు.

ధ్వన్యర్థాలను గ్రహిస్తాడు.

శైలి భేదాలను పరికిస్తాడు.

పాత్రౌచిత్యాన్ని తెలుసుకుంటాడు.

రచయితల ఆత్మీయతను సూచించే సన్నివేశాలను గుర్తిస్తాడు.

 

5. భాషాభిరుచి:

మనసును ఒకదానివైపు ఆకర్షింపజేసేది అభిరుచి - రాస్

అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి - బి.ఎన్.ఝా

స్పష్టీకరణలు: విద్యార్థి

విస్తార గ్రంథ పఠనం చేస్తాడు.

సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటాడు.

‣ వక్తృత్వ, రచనల పోటీల్లో పాల్గొంటాడు.

ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తాడు.

కవి సమ్మేళనాల్లో పాల్గొంటాడు.

సాహిత్య రచనలు చేస్తాడు.

సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరిస్తాడు.

సాహిత్య రచనల్లో పోలికలను గమనిస్తాడు.

 

6. సముచిత మనోవైఖరులు: ఒక వస్తువును గురించి లేదా ప్రదేశాన్ని గురించి లేదా వ్యక్తిని గురించి ఏర్పడే ప్రత్యేక భావమే వైఖరి.

స్పష్టీకరణలు: విద్యార్థి

సాహితీవేత్తల పట్ల గౌరవభావం కలిగి ఉంటాడు.

ఇతర భాషలపట్ల సమానాదరం చూపుతాడు.

సాహిత్య కృషిని ప్రోత్సహిస్తాడు.

విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉంటాడు.

విమర్శలను సహృదయంతో స్వీకరిస్తాడు.

 

7. సంస్కృతి, సంప్రదాయాలు: సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను ఇష్టంతో చదువుతాడు.

స్పష్టీకరణలు: విద్యార్థి

వివిధ రచనల్లోని ఆచార వ్యవహారాలను తెలుసుకుంటాడు.

రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెలుపుతాడు.

పురాణేతిహాసాల్లోని విశేషాలను వివరిస్తాడు.

భారతీయ సంస్కృతిని విశదీకరిస్తాడు.

రచనల్లోని నీతిని గ్రహిస్తాడు.

 

8. సృజనాత్మకత: విద్యార్థి తన రచనలు, మాటలు, రాతల్లో సృజనాత్మకతను ప్రదర్శిస్తాడు.

స్పష్టీకరణలు: విద్యార్థి

స్వతంత్ర రచనలు చేస్తాడు.

శైలిలో ప్రత్యేకతను చూపుతాడు.

సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తాడు

నుడికారపు సొంపును ప్రదర్శిస్తాడు.

తన రచనల్లో దేశీయాలు, లోకోక్తులు, జాతీయాలు ఉపయోగిస్తాడు.

 

9. భాషాంతరీకరణం: విద్యార్థికి ఆంగ్లం లేదా హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సామర్థ్యం కలుగుతుంది.

స్పష్టీకరణలు: విద్యార్థి

ఉభయ భాషల్లోని వాక్యనిర్మాణ పద్ధతులను తెలుసుకుని ఉంటాడు.

ఉభయ భాషల్లోని సమానార్థక పదాలకు జాతీయాలను ఎన్నుకుంటాడు.

 

10. నైపుణ్యాలు:

i) వాగ్రూప వ్యక్తీకరణ: స్పష్టీకరణలు: విద్యార్థి

ఉచ్ఛారణ, దోషరహితంగా మాట్లాడతాడు.

స్పష్టంగా మాట్లాడతాడు.

ధారాళంగా మాట్లాడతాడు.

భావానుగుణమైన స్వరభేదాలతో మాట్లాడతాడు.

సముచితమైన స్వరభేదాలతో మాట్లాడతాడు.

సముచితమైన భాషను ఉపయోగిస్తాడు.

భావానుక్రమంగా మాట్లాడతాడు.

సందర్భోచితంగా మాట్లాడతాడు.

సభ్యతను పాటించి మాట్లాడతాడు.

విమర్శనాత్మకంగా మాట్లాడతాడు.

 

ii) లిఖితరూప వ్యక్తీకరణ: విద్యార్థి తన భావాలను లిఖితరూపంలో వ్యక్తీకరిస్తాడు.

స్పష్టీకరణలు: విద్యార్థి

వర్ణక్రమ దోషరహితంగా రాస్తాడు.

వ్యాకరణయుక్తంగా రాస్తాడు.

ఉచితమైన పదాలను ప్రయోగిస్తాడు.

స్థాయికి తగిన శైలిలో రాస్తాడు.

సరైన వాక్య నిర్మాణం చేస్తాడు.

రచనలో అప్రస్తుత విషయాలు లేకుండా చూస్తాడు.

భావానుక్రమాన్ని పాటిస్తాడు.

విషయాన్ని సంక్షిప్తంగా రాస్తాడు.

విషయాన్ని విపులీకరిస్తాడు.

విమర్శనాత్మకంగా రాస్తాడు.

రచనను పరిచ్ఛేదాలుగా విభజిస్తాడు.

సందర్భానుసారంగా వివిధ రచనా రీతులను అవలంబిస్తాడు.

విరామ చిహ్నాలను పాటిస్తాడు.

 

 

అభ్యసన ప్రధాన ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వ వికాసం. మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు మూర్తిమత్వ వికాసాన్ని 3 రంగాలుగా విభజించారు.

     1. జ్ఞాన రంగం (Cognitive domain)

     2. భావావేశ రంగం (Affective domain)

     3. మానసిక చలన రంగం (Psychomotor domain)

జ్ఞానాత్మక రంగంలో ఆరు విధాలైన లక్ష్యాలు ఉంటాయి.

అవి: జ్ఞానం - అవగాహన - అనుప్రయుక్తం - విశ్లేషణ - సంశ్లేషణ - మూల్యాంకనం.

భావావేశ రంగంలోని ముఖ్యమైన విద్యా లక్ష్యాలు: గ్రహణం - ప్రతిస్పందన - మూల్య నిర్ధారణ - వ్యవస్థీకరణ - లక్షణీకరణ

మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలు: అనుకరణ - అనువర్తన - నియంత్రణ - సమన్వయం - సహజీకరణ

విద్యా వ్యవస్థలోని వివిధ సందర్భాలు, వివిధ స్థాయుల్లో అనుసరించే లక్ష్యాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి:

     1) గమ్యాలు         2) ఉద్దేశాలు           3) లక్ష్యాలు        4) స్పష్టీకరణలు

గమ్యాలు (Goals): విద్యా వ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు. విద్యా ప్రణాళికల రూపకల్పనను నిర్ణయిస్తాయి.

సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పులు.

ఉదా: ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత.

 

ఉద్దేశాలు (Aims): పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి.

విషయ ప్రణాళికల (Syllabus) రూపకల్పనను నిర్దేశిస్తాయి.

తెలుగు భాష ప్రధాన ఉద్దేశాలు - అర్థ గ్రహణం, అభివ్యక్తి, గుణవివేచన.

 

లక్ష్యాలు (Objectives)

స్పష్టీకరణలు (Specifications)

లక్ష్యాలు ఉద్దేశాల నుంచి ఏర్పడతాయి.

ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పులను సూచిస్తాయి.

ఒక లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మరూపమే స్పష్టీకరణలు.

తెలుగు భాషా బోధనకు పది లక్ష్యాలను ప్రతిపాదించారు.

     1) జ్ఞానం                           2) అవగాహన                               3) భాషాభిరుచి

     4) రసానుభూతి                 5) సముచిత మనోవైఖరులు       6) సంస్కృతీ సంప్రదాయాలు

     7) సృజనాత్మకత              8) భాషాంతరీకరణ                      9) వాగ్రూప వ్యక్తీకరణ

   10) లిఖితరూప వ్యక్తీకరణ.

 

1. జ్ఞానం: భాష బోధనలో జ్ఞానం మూడు అంశాలకు సంబంధించిందై ఉంటుంది.

1) విషయ జ్ఞానం: ఇతివృత్తం, కవి పరిచయం

2) భాషా జ్ఞానం: వ్యాకరణాంశాలు

3) సాహిత్య జ్ఞానం: కావ్యాలు, నాటకాలు, ఆధునిక కవిత్వం, గేయాలు

స్పష్టీకరణలు: గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం.

 

2. అవగాహన: విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని గానీ, భాష మౌలికాంశాలను గానీ అర్థం చేసుకోవడం దీనిలోని ముఖ్య లక్ష్యం.

స్పష్టీకరణలు: ఒక విషయాన్ని తమ మాటల్లో వర్ణిస్తారు.

భాషణ, లేఖనాల్లో నిక్షిప్తమైన భావాలను వివరిస్తారు.

సారాంశాన్ని గ్రహిస్తారు.

శీర్షికను సూచిస్తారు.

సందర్భసహిత వ్యాఖ్యలు చెప్పగలుగుతారు.

ఉదాహరణలను సొంతంగా ఇస్తారు.

 

3. భాషాభిరుచి: భాషా సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి ఏర్పడుతుంది.

స్పష్టీకరణలు: విస్తార గ్రంథ పఠనం చేస్తారు.

సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటారు.

వక్తృత్వ రచనల పోటీల్లో పాల్గొంటారు.

కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు.

ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు.

 సాహిత్య రచనలు చేస్తారు.

 సాహిత్య రచనలను విమర్శనా దృష్టితో చదువుతారు.

 

4. రసానుభూతి: ఇది భావావేశ రంగానికి చెందింది.

స్పష్టీకరణలు: రచనల్లోని రస భేదాలను గ్రహిస్తారు.

అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు.

ధ్వన్యర్థాలను గ్రహిస్తారు.

శైలీ భేదాలను పరికిస్తారు.

పాత్రౌచితిని తెలుసుకుంటారు.

రసవద్ఘట్టాలను చదివి, ఆనందిస్తారు.

 

5. సముచిత మనోవైఖరులు: ఇది ఒక మానసిక ప్రక్రియ.

స్పష్టీకరణలు: సాహితీవేత్తల పట్ల గౌరవాభిమానంతో ఉంటారు.

ఇతర భాషల పట్ల సమానాదరం చూపిస్తారు.

సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు.

విమర్శనాత్మక దృష్టితో ఉంటారు.

విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారు.

 

6. సంస్కృతీ సంప్రదాయాలు: దీనికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారు.

స్పష్టీకరణలు:

ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు.

రచనల్లోని కాల భేద ప్రభావాన్ని తెలుపుతారు.

ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలుపుతారు.

రచనల్లోని నీతిని గ్రహిస్తారు.

భారతీయ సంస్కృతి పట్ల ఆదరాభిమానాలను పెంపొందించుకుంటారు.

 

7. సృజనాత్మకత: విద్యార్థులు వ్యక్తీకరణలో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.

స్పష్టీకరణలు:

స్వతంత్ర రచనలు చేస్తారు.

శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు.

తమ రచనల్లో లోకోక్తులు, జాతీయాలను ఉపయోగిస్తారు.

‣ సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తారు.

 

8. భాషాంతరీకరణ: ఒక భాష నుంచి ఇంకొక భాషకు అనువాదం చేసే నేర్పు కలుగుతుంది.

స్పష్టీకరణలు:

ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకుని ఉంటారు.

ఉభయ భాషల్లోని సమానార్థక పదాలు, జాతీయాలను ఎన్నుకుంటారు.

 

9. వాగ్రూప వ్యక్తీకరణ: విద్యార్థిలో వాగ్రూప వ్యక్తీకరణ శక్తిని అభివృద్ధి చేయడం మాతృభాష ముఖ్య లక్ష్యాల్లో ఒకటి.

స్పష్టీకరణలు:

దోషరహితంగా ఉచ్ఛారణ చేయగలుగుతారు.

భావానుగుణమైన స్వరభేదంతో మాట్లాడతారు.

సరైన వేగంతో మాట్లాడతారు.

సభాకంపం లేకుండా మాట్లాడతారు.

ఆకర్షణీయంగా మాట్లాడతారు.

విషయాలను సరైన ఉచ్ఛారణతో అర్థవంతంగా వివరిస్తారు.

 

10. లిఖితరూప వ్యక్తీకరణ: విద్యార్థులు తమ భావాలను, భాషా ప్రయోగాలను లిఖితరూపంలో వ్యక్తీకరించే నైపుణ్యం పెంపొందించడం మరొక ముఖ్య లక్ష్యం.

స్పష్టీకరణలు:

వర్ణక్రమ దోషాలు లేకుండా రాస్తారు.

వ్యాకరణ దోషాలు లేకుండా రాస్తారు.

అప్రస్తుత విషయలు లేకుండా రాస్తారు.

చదివిన విషయాన్ని క్లుప్తంగా, భావం చెడకుండా అర్థవంతంగా రాస్తారు.

లిఖిత రచనలు చేసేటప్పుడు భావానుగుణంగా పరిచ్ఛేదాలుగా విభజించి, రాస్తారు.

 

Posted Date : 30-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌