• facebook
  • whatsapp
  • telegram

సంధులు

సామాన్యంగా 'టెట్‌'లో సంధులు లేదా సమాసాల సూత్రాలు అడగరు కానీ తెలుసుకుంటే మంచిది. సంధులు సంస్కృత సంధులు, తెలుగు సంధులు అని రెండు రకాలు. సంస్కృత పదాలకు వచ్చేవి, తెలుగు పదాలకు వచ్చేవి అని భావం. సంస్కృత సంధుల్లో సవర్ణదీర్ఘసంధి, గుణసంధి, వృద్ధిసంధి, యణాదేశసంధి, అనునాసికసంధి ముఖ్యమైనవి.

సంధులు 
సంధి అంటే 'కలయిక'. రెండు పదాలు కలవడాన్ని సంధి అనొచ్చు. అచ్చుల మధ్య కలయిక, హల్లుల మధ్య కలయిక సంధి అవుతుంది. సంధికి సూత్రం- 'పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశమవడం'. స్వరం అంటే అచ్చు. ఏకాదేశం రెండింటి స్థానంలో మరొకటి రావడం. 
ఉదా: ఉదయ + అద్రి =  ఉదయాద్రి. కొన్ని సంధి సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సవర్ణదీర్ఘ సంధి
అ, ఇ, ఉ, ఋలకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాటిదీర్ఘం ఏకాదేశంగా వస్తుంది.
ఉదా:  పరమ + అర్థం = పరమార్థం
          విద్య + అర్థి = విద్యార్థి
          మహా + ఆనందం = మహానందం
కవి + ఈశ్వర = కవీశ్వర
          భాను + ఉదయం = భానూదయం
          పితృ + రుణం = పితౄణం
గుణ సంధి
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే ఏ, ఓ, అర్‌లు ఏకాదేశంగా వస్తాయి.
ఉదా:  దేవ + ఇంద్ర = దేవేంద్ర
          పర + ఉపకారం = పరోపకారం
          రాజ + రుషి = రాజర్షి
          వర్ష + రుతువు = వర్షర్తువు
యణాదేశ సంధి
ఏ, ఓ, అర్‌లకు గుణములు అని పేరు. యణ్ణులు అంటే 'య, వ, ర'. ఇ, ఉ, ఋలకు అసమానమైన వర్ణాలు పరమైతే య, వ, రలు ఆదేశంగా వస్తాయి. ఆదేశం అంటే శత్రువులా ఒక వర్ణంలో మరో వర్ణం రావడం.
ఉదా:  అతి + అంతం = అత్యంతం
          అభి + అర్థి = అభ్యర్థి
          సు + ఆగతం = స్వాగతం
          గురు + ఆజ్ఞ = గుర్వాజ్ఞ
          పితృ + ఆజ్ఞ = పిత్రాజ్ఞ

 

వృద్ధి సంధి
వృద్ధులు అంటే వ్యాకరణంలో 'ఐ, ఔ'లు. అకారానికి ఏ, ఐలు పరమైతే 'ఐ', ఓ, ఔ లు పరమైతే 'ఔ' ఏకాదేశంగా
వస్తే అది వృద్ధి సంధి.
ఉదా: లోక + ఏక = లోకైక
          పరమ + ఐశ్వర్యం = పరమైశ్వర్యం
          దివ్య + ఓషధి = దివ్యౌషధి
          దివ్య + ఔషధం = దివ్యౌషధం
          దేశ + ఔన్నత్యం = దేశౌన్నత్యం

 

అనునాసిక సంధి
అనునాసికాలు అంటే నాసికను అనుసరించి పలికేవి. నాసిక (ముక్కు) సహాయంతో పలికేవి. అనునాసికాలు అయిదు. అవి ఞ, ఙ, ణ, న, మ. 'క చ ట త ప' అనే వాటికి 'న' లేదా 'మ' పరమైతే అనునాసికం ఆదేశమవుతుంది. (పరమైతే అంటే తర్వాత వస్తే... అని అర్థం.)
ఉదా:  వాక్ + మయం = వాఞ్మయం
          రాట్ + మూర్తి = రాణ్మూర్తి
          జగత్ + నాయకుడు = జగన్నాయకుడు
          జగత్ + మిధ్య = జగన్మిధ్య
          అప్ + మయం = అమ్మయం (అప్ అంటే నీరు)

 

తెలుగు సంధులు
తెలుగు సంధులు అంటే తెలుగు పదాల మధ్య జరిగే కలయిక. వీటిలో ఉకారసంధి, ఆమ్రేడితసంధి, యడాగమసంధి, గసడదవాదేశసంధి, ద్రుతసంధి లేదా సరళాదేశసంధి, త్రికసంధి, పుంప్వాదేశ, రుగాగమ, టుగాగమ సంధులు ముఖ్యమైనవి. (ప్రాతాది సంధి, ద్విరుక్తటకార సంధి లాంటివి అదనంగా నేర్చుకొంటే ప్రయోజనకరం).
ఉకార సంధి
ఉత్తునకు సంధి నిత్యం అనడంవల్ల ఉకారసంధి తప్పనిసరి. ఉత్తు అంటే హ్రస్వమైన ఉకారం.
ఉదా: రాముడు + అతడు = రాముడతడు
         ఇట్లు + అనియె = ఇట్లనియె
         సేసలు + ఇడిరి = సేసలిడిరి
         వనం + ఎల్ల = వనమెల్ల

 

ఆమ్రేడిత సంధి
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది.
ఉదా: ఔర + ఔర = ఔరౌర
         ఏమి + ఏమి = ఏమేమి
         ఓహో + ఓహో = ఓహోహో

 

యడాగమ సంధి
ఆమ్రేడితం అంటే ద్విరుక్తానికి పరరూపం. రెండుసార్లు వచ్చినప్పుడు రెండోది. ఏ సంధి రాకపోతే అప్పుడు 'య'డాగమం వస్తుంది. ఆగమం అంటే మిత్రుడిలాగా దేన్నీ తీసివెయ్యకుండా అదనంగా వర్ణం రావడం. దీన్నే 'వర్ణాధిక్యత' అంటారు.
ఉదా: మా + అమ్మ = మాయమ్మ
         వెల + ఆలు = వెలయాలు

 

గసడదవాదేశ సంధి
కచటతపల స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తే అది గసడదవాదేశ సంధి అవుతుంది. ద్వంద్వ సమాసంలో కూడా ఈ సంధి వస్తుంది.
ఉదా: సంగరము + చేయు = సంగరముసేయు
         వాడు + పలికె = వాడువలికె
         బుద్ధి + చెప్పు = బుద్ధిసెప్పు
         నది + పోలె = నదివోలె
         కూర + కాయలు = కూరగాయలు
         కాలు + చేతులు = కాలుసేతులు
         రారు + కదా = రారుగదా
         అయితే, వాడు + కంసారి = వాడుగంసారి కాదు.
         వీడు + చక్రపాణి = వీడు సక్రపాణి కాదు.
         తల్లి + తండ్రులు = తల్లిదండ్రులు అన్నప్పుడు సంధి తప్పనిసరి.

 

ద్రుత సంధి
ద్రుతం అంటే నకారం. ద్రుతం చివర ఉన్న పదాలను ద్రుత ప్రకృతికాలు అంటే ఈ నకారం ఆధారంగా ఉన్నది ద్రుతసంధి. ఇందులో పరుషాలు (కచటతప) సరళాలుగా (గజడదబ) మారతాయి.
ఉదా: పూచెను + కలువలు = పూచెనుగలువలు
                                         = పూచెంగలువలు 
                                         = పూచెఁగలువలు
                                         = పూచెన్గలువలు
         దయన్ + చేసి = దయఁజేసి
         వచ్చెన్ + ధాత్రీపతి = వచ్చెంధాత్రీపతి

 

త్రిక సంధి
ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను 'త్రికాలు' అంటారు. వాటి ఆధారంగా వచ్చేది త్రికసంధి.
ఉదా: ఆ + బాలుడు = అబ్బాలుడు
         ఈ + కన్య = ఇక్కన్య
         ఏ + చోటు = ఎచ్చోటు
         ఆ + ముని = అమ్ముని
         ఈ + తన్వి = ఇత్తన్వి

 

యడాగమ త్రికసంధి
యడాగమం వచ్చి ఆ తర్వాత త్రికసంధి వస్తే, దాన్ని యడాగమ త్రికసంధి అంటారు.
ఉదా: ఆ + అది = అయ్యది
         ఏ + ఎడ = ఎయ్యెడ
         ఈ + ఎఱుకరాజు = ఇయ్యెఱుకరాజు
         ఏ + అది = ఎయ్యది
         ఈ + ఎడ = ఎయ్యెడ

 

పుంప్వాదేశ సంధి
'పుం, పు' అనేవి ఆదేశంగా వస్తాయి కాబట్టి పుంప్వాదేశ సంధి అంటారు. ఇవి కర్మధారయ సమాసంలో 'ము'కి బదులుగా వస్తాయి. కర్మధారయం అంటే విశేష్య విశేషణాలు ఉన్న సమాసం. ఇక్కడ 'ము' అనేది వర్ణకం. వర్ణకం అంటే ప్రత్యయం.

 

టుగాగమ సంధి
టుగాగమ సంధిలో 'టు' ఆగమంగా వస్తుంది. (నిజానికి టు కాదు ట్ వస్తుంది)
         టుక్ + ఆగమం టుగాగమం అవుతుంది.

ఉదా: పేరు + ఉరము = పేరురం/పేరుటురం
         చిగురు + ఆకు = చిగురుటాకు/ చిగురాకు
         పొదరు + ఇల్లు = పొదరుటిల్లు/ పొదరిల్లు
         నిగ్గు + అద్దం = నిగ్గుటద్దం

 

కర్మధారయ
కర్మధారయంలో పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది. తత్సమ శబ్దాలకైతే అకారం ఉకారంగా మారి తెలుగులోకి వస్తాయి.
ఉదా: ధీర + ఆలు = ధీరురాలు
         గుణవంత + ఆలు = గుణవంతురాలు
         ధీమంత + ఆలు = ధీమంతురాలు
         పేద + ఆలు = పేదరాలు
         బీద + ఆలు = బీదరాలు
         గొడ్లు + ఆలు = గొడ్రాలు
* ఇక్కడ ఆలు అంటే స్త్రీ అని మాత్రమే.

 

సమాసాలు
సమర్థవంతమైన పదాలు ఏకపదం అవడం సమాసం. అంటే వేర్వేరు అర్థాలు ఉన్న పదాలు ఒకేపదంగా మారడం.
ఉదా: సీత (జానకి), పతి (భర్త) అనే పదాలు కలిసి సీతాపతి అంటే శ్రీరాముడు అనే అర్థం ఏర్పడింది.
* సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమనీ, తర్వాతి పదాన్ని పరపదం లేదా ఉత్తర పదమనీ అంటారు.
* సమాస భావాన్ని సమాసం ఏర్పడటానికి ముందున్న పదాలతో వివరించడాన్ని విగ్రహ వాక్యం అంటారు.
* ఉత్తర పదం ప్రధానంగా ఉన్నవి లేదా విభక్తులకు ప్రాధాన్యం ఉన్నవి తత్పురుష సమాసాలు అవుతాయి.
మరికొన్ని ఉదాహరణలు ...

 
 

కర్మధారయ సమాసం
విశేషణం, నామవాచకం, ఉపమానం మొదలైన వాటిని బట్టి కర్మధారయ సమాసాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ...

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌