• facebook
  • whatsapp
  • telegram

జానపద సాహిత్యం

ఏ భాషలో అయినా మొట్టమొదట జానపద సాహిత్యమే పుడుతుంది. ఇది మౌఖిక సాహిత్యం. అంటే ముఖస్థంగానే ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత లిఖిత సాహిత్యం వెలువడుతుంది. దీన్ని శిష్ట సాహిత్యంగా పరిగణిస్తారు. 'జనపదం' అంటే గ్రామం. ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడింది. పల్లెల నుంచి, సామాన్యుల నుంచి పుట్టిందే జానపద సాహిత్యం.
జానపద సాహిత్యాన్ని సేకరించిన వారిలో, దానిపై పరిశోధన చేసిన వారిలో ముఖ్యులు:
* మొట్టమొదట జానపద గేయ సాహిత్యంపై పరిశోధన చేసినవారు ఆచార్య బిరుదురాజు రామరాజు.
* హరి ఆదిశేషువు 'జానపద గేయ వాఞ్మయ పరిచయం' ప్రచురించారు.
* 'కృష్ణశ్రీ' శ్రీపాద గోపాలకృష్ణమూర్తి స్త్రీల రామాయణపు పాటలను సేకరించి, ప్రచురించారు.
* జానపద వాఞ్మయోద్ధారకుడిగా పేరుపొందిన నేదునూరి గంగాధరం 'మిన్నేరు' లాంటి గేయ సంకలనాలు వెలువరించారు.
* నాయని కృష్ణకుమారి జానపద కథాగేయాలపై పరిశోధన చేశారు.
* రావి ప్రేమలత 'తెలుగు జానపద సాహిత్యం - పురాగాథలు' వెలువరించారు.
* బి. రామరాజు, దొణప్పల ఆధ్వర్యంలో 'త్రివేణి' అనే జానపద గేయ సంకలనం వచ్చింది.
* కసిరెడ్డి వెంకటరెడ్డి పొడుపు కథలపై పరిశోధన చేశారు.
* జి.ఎస్. మోహన్ 'జానపద విజ్ఞానాధ్యయనం' అనే పుస్తకం ప్రచురించారు.

 

జానపద వాఞ్మయంలో ఉన్న ముఖ్యమైన భాగాలు:
        * జానపద గేయాలు
        * జానపద కళారూపాలు
        * జానపద కథలు
        * సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు
* బిరుదురాజు రామరాజు జానపద గేయాలను పిల్లల పాటలు, స్త్రీల పాటలు, వేడుక పాటలు, శ్రామికుల పాటలుగా విభజించారు.
* జానపద గేయాలు లేదా సాహిత్యానికి  - కర్తృత్వం తెలియదు. అజ్ఞాత కర్తృత్వం లేదా సామూహిక కర్తృత్వం ఉంటుంది.
        * భాష నిసర్గంగా, సరళంగా ఉంటుంది.
        * జీవితాలు, సంస్కృతితో ముడిపడి ఉంటుంది.
        * మౌఖిక సంప్రదాయం ఉండేది (ఒకరి నుంచి మరొకరికి నోటి ద్వారా వ్యాపిస్తుంది - రాత ద్వారా కాదు).
        * లోకజ్ఞానానికి, సమష్టితత్వానికి, మనోవికాసానికి తోడ్పడుతుంది.
* 'జానపద విజ్ఞానం' అనే గ్రంథంలో ఆర్.వి.ఎస్. సుందరం ఎన్నో జానపద వాఞ్మయ విశేషాలను వివరించారు. ముఖ్యమైన జానపద గేయాలను తెలుసుకుందాం:
 పిల్లల పాటలు: కుటుంబంలో సంతోషాలు, ముద్దుముచ్చట్లు పిల్లలపైనే ఆధారపడి ఉంటాయి. పిల్లల పాటల్లో ప్రధానమైంది 'లయ'. పిల్లల పాటల్లో వాచిక, ఆంగికాభినయాల పాటలుంటాయి. వినోదంతోపాటు తెలియకుండానే భాషాజ్ఞానం అందించేవి పిల్లల పాటలు.
* ఉదాహరణకు
         'చందమామ రావె, జాబిల్లి రావె
         కొండెక్కి రావె, కోటిపూలు తేవె...'
             'పిట్టమ్మ పిట్ట - ఏమి పిట్ట?
               చిలుక పిట్ట - ఏమి చిలుక?
                  పచ్చ చిలుక - ఏమి పచ్చ
                           ఆకుపచ్చ....'
         'నారాయణ నారాయణ నక్కతోక
     నారాయణ పెళ్లాం కుక్కతోక' (హాస్యపు పాట)

 

 స్త్రీల పాటలు: జీవితంలోని పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు స్త్రీ కేంద్ర బిందువు. స్త్రీలకి పాటలపై మక్కువ ఎక్కువ కూడా. స్త్రీల ప్రాధాన్యత లేని జానపద గేయాలను ఊహించలేం.

ఉదాహరణలు... లాలి పాటలు, జోల పాటలు, మంగళహారతి పాటలు, నోము పాటలు, పెళ్లి పాటలు, అట్లతద్దె పాటలు (చెమ్మచెక్క చారడేసి మొగ్గ) లాంటి పాటలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
 

శ్రామికుల పాటలు: 'పని - పాట' అనేది తెలిసిందే. ఎప్పుడైతే మానవుడు పని నేర్చుకున్నాడో అప్పుడే పాట పుట్టిందని నిర్ణయించారు. శ్రమను మరచిపోవడానికి, చకచకా పని చేయడానికి పాట పుట్టింది. రైతు పాటలు, రోకలి పాటలు, వాన పాటలు, ఏరువాక పాటలు, విసురురాతి పాటలు ఈ కోవకే చెందుతాయి. పడవను నడిపేవాళ్లు 'హైలెస్సా, హైలెస్సా, ఓలెస్సా' అని పాడుకునేది శ్రామికుల పాట.
* గోపు లింగారెడ్డి తెలంగాణ శ్రామిక గేయాలపై మంచి పరిశోధన చేశారు.

 

 వలపు పాటలు: అనురాగం, ప్రేమ, సరసాలకు సంబంధించినవి వలపు పాటలు. జానపదులు వలపు వికాసం ఉన్నవారే. 'చల్ మోహన్ రంగా' లాంటివి వలపు పాటలే!
పారమార్థిక పాటలు: వీటిని తాత్త్విక పాటలు అంటారు. జీవితం, ఆత్మ, పాపపుణ్యాలు, కోరికలు... లాంటి వాటిని వివరిస్తాయి. ఉదాహరణకి-
          'గూటిలో చిలకేదిరన్నా, నా అన్నలార!
                    గూడు చినబోయినదన్నా'
* జానపద కథలను గద్య కథనాలు అని కూడా అంటారు. వీటిల్లో కల్పనాశక్తి ఎక్కువ. శ్రోతలను ఉత్తేజపరుస్తాయి. చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ కథల్లో పురాణ కథలు, ఐతిహ్యాలు, జానపద తత్వకథలను గమనిస్తాం. పురాణ కథలైనా జానపద తత్వకథలైనా మూఢనమ్మకాలున్నవే. మాయలూ, మంత్రాలూ ఉంటాయి. గబ్బిలం ఎందుకు గుడ్డిది అయిందో, ఇంద్రధనస్సు ఎందుకు ఏర్పడుతుందో వివరించేవి, గ్రామదేవతల కథలు... పురాణ కథల్లో భాగమే!
* ఐతిహ్యాలు అంటే స్థల పురాణాలు, రహస్య నిధులు, దెయ్యాలకి సంబంధించినవి. మొల్లబండ, లేపాక్షి, పూతలపట్టు లాంటివి ఉదాహరణలు. ఏడు నూతుల గురించి, ఏడుగురు అక్కల గురించి చెప్పేవి, పేదరాశి పెద్దమ్మ కథలు, కాకమ్మ కథలు మొదలైనవి జానపద కథలు. ఇవి సామాన్యంగా 'అనగనగా...' అంటూ మొదలై 'కథ కంచికి మనం ఇంటికి' అని ముగుస్తాయి.
* జానపద కళారూపాలు ప్రాచీన కాలం నుంచి ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 'తెలుగువారి జానపద కళారూపాలు' అనే పుస్తకంలో దాదాపు 80 జానపద కళారూపాల వివరాలను పొందుపరిచారు. వాటిలో ముఖ్యమైనవి:

 

తోలుబొమ్మలాట: సూత్రధారుని పాత్రలో బొమ్మలతో తెర వెనుక ఆడించి వ్యాఖ్యానం చేస్తూ ఉండే కళారూపమిది. 12వ శతాబ్దం నుంచే ఈ కళారూపం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో జుట్టు పోలిగాడు, బంగారక్క, కేతిగాడు లాంటి హాస్య పాత్రలుంటాయి. కర్నూలు, విశాఖ, గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఈ కళాకారులు ఎక్కువ.
 

కోలాటం: కోల అంటే కర్ర పుల్ల. కర్ర పుల్లలతో చేసే కళారూపం కోలాటం. ప్రతి కళాకారుడు పంచె ధరించి, గజ్జెలు కట్టుకుంటాడు. జట్టుకి ఒక నాయకుడు ఉంటాడు. జడల కోలాటం, తాళ్ల కోలాటాలూ ఉన్నాయి. కోలాటాలు ఎక్కువగా దసరా, సంక్రాంతి పండుగల్లో కనిపిస్తాయి.
 

పగటి వేషాలు: జానపద కళారూపాలు ఎక్కువగా రాత్రి వేళల్లో ప్రదర్శితమవుతాయి. ఈ పగటి వేషాలను మాత్రం పగటిపూటే ప్రదర్శిస్తారు. పెద్దమనుషులు, ఉద్యోగస్తులు, అధికారులు, పోలీసులు మొదలైన వారి దొంగ బుద్ధులపై వ్యంగ్యంగా ఇచ్చే ప్రదర్శనలివి. ఇంటింటికీ తిరిగి వాక్చాతుర్యంతో అలరిస్తారు.
 

ఒగ్గు కథ: ఇది తెలంగాణకు చెందిన కళారూపం. శివుని ఢమరుకాన్ని పోలిన వాద్యాన్ని వాయిస్తూ చెప్పే కథ ఇది. వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒగ్గు కళాకారులు ఎక్కువ. చుక్కా సత్తయ్య, మిద్దె రాములు ఒగ్గు కళాకారుల్లో ముఖ్యులు.
కూచిపూడి భాగవతం: కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దీనికి ప్రసిద్ధి. కూచిపూడి నాట్యానికి మూలం 'సిద్ధేంద్ర యోగి'.
* భామాకలాపం, గిరిజా కల్యాణం, దశావతారాలు లాంటి వాటిని కూచిపూడి భాగవతులు యక్షగాన రూపంలో ప్రదర్శిస్తారు.

 

 బతుకమ్మ పండగ: తెలంగాణలోని అతి ప్రాచీనమైన కళారూపం. మహాలయ అమావాస్య నుంచి ఎనిమిది రోజులు చేస్తారు. దీనికి 'బోనాల పండగ' అనే పేరు కూడా ఉంది.
 

హరికథ: నాటికీ నేటికీ సర్వ జనాదరణ పొందిన గొప్ప కళారూపమిది. ఆదిభట్ల నారాయణదాసు దీనికి ప్రాచుర్యం కల్పించడం వల్ల ఆయన్ను 'హరికథా పితామహ' అంటారు.
 

బుర్రకథ: హరికథలా జనసామాన్యానికి వెళ్లిన కళారూపమిది. 14వ శతాబ్దం నాటికే ఈ 'బుర్రకథ' ఉండేదని తెలుస్తోంది.
* షేక్ నాజర్‌ను 'బుర్రకథా పితామహ' అంటారు. ప్రధాన కథకుడికి ఇరువైపులా 'వంతలు' ఉండి 'తందాన తాన' అంటారు. ప్రసిద్ధులైన సుంకర, వానమామలై వరదాచార్యులు, మిక్కిలినేని, కోగంటి బుర్రకథలు రాశారు.

సామెతలు

* జానపద వాఞ్మయం పుట్టినప్పుడే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు పుట్టి ఉంటాయని చెబుతారు. 'సామెత' అనే పదం 'సామ్యత' నుంచి వచ్చింది. సామ్యత అంటే పోలిక. మానవుని అనుభవాల సారమే 'సామెత'. ఈ సామెతల్లో ఇతిహాస పురాణాలు, కుటుంబ జీవితం, వ్యవసాయం, హాస్యం, నమ్మకాలు, తాత్త్వికులకి సంబంధించినవి ఉన్నాయి.
* సామెతలు ఎక్కువగా వాక్యాలుగా ఉంటాయి. వీటికి ఉదాహరణలు...
         రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాట్ట
         ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
         ఎంత చెట్టుకు అంత గాలి
         మావాఁ పెళ్లాడతావా అంటే నాకెవరిస్తార్రా అబ్బీ- అన్నాట్ట (హాస్యం)
         చింత చచ్చినా పులుపు చావదు

 

జాతీయాలు

* జాతీయాలు ఒక జాతికి సంబంధించిన ప్రత్యేకమైన పదబంధాలు. ఇవి వాక్యరూపంగా ఉండవు. రెండు మూడు పదాల కలయికగా ఉంటాయి.
 ఉదా: చిలుక పలుకులు, కత్తి మీద సాము, పక్కలో బల్లెం, మేడిపండు, గుడ్డిలో మెల్ల, భస్మాసుర హస్తం, ఎండమావి మొదలైనవి.

* జానపద సాహిత్యంలో 'పొడుపు కథల'ను ప్రత్యేక శాఖగా పేర్కొనవచ్చు. పొడవటం (ప్రశ్నించడం) - విప్పడం (సమాధానం చెప్పడం) అనేవి పొడుపు కథలు. ఇవి మెదడుకు మేతనందిస్తాయి.
 ఉదాహరణలు-
        ఆకాశంలో ఉంటుంది కానీ - మేఘం కాదు
        తోకతో ఉంటుంది కానీ - ఎద్దు కాదు
        అటు ఇటు ఎగురుతుంది కానీ - పక్షి కాదు
        పట్టు తప్పితే చాలు - పరుగులెడుతుంది (గాలిపటం)
* చెక్కని స్తంభం - చెయ్యని కుండ - పొయ్యని నీళ్లు - వెయ్యని సున్నం (కొబ్బరికాయ)
* ఎర్రటి పండు.. ఈగైనా వాలదు (నిప్పు)

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌