• facebook
  • whatsapp
  • telegram

ప్రబంధ యుగం

శ్రీనాథ యుగాన్ని కావ్యయుగంగా, రాయల యుగాన్ని ప్రబంధ యుగంగా పరిగణిస్తారు. రాయల యుగం అంటే 16వ శతాబ్దం. శ్రీకృష్ణదేవరాయలు కేవలం రాజు మాత్రమే కాదు - కవిరాజు, కవి (కళా) పోషకుడు కూడా. ఆయనకు 'ఆంధ్రభోజ', 'సాహితీ సమరాంగణ సార్వభౌమ' అనే బిరుదులు ఉన్నాయి. అంతేకాదు రాయలు తన జైత్రయాత్రలు, పరాక్రమ వైభవంతో 'మూరురాయరగండ అనిపించుకున్నాడు.

     రాయలవారి కళాభవనానికి 'భువన విజయం' అనే పేరుంది. శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఎనిమిది మంది గొప్ప కవులను నియమించాడనీ, వారికి 'అష్టదిగ్గజాలు' అనే పేరుందని తిప్పలూరు శాసనాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఎనిమిదిమంది ఎవరనే అంశంపై వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి.
* శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో 'సత్యావధూ ప్రీణనం, తెలుగులో 'ఆముక్తమాల్యద' రాశాడు. సకల కథాసార సంగ్రహం, రసమంజరి అనే కృతులు రచించాడంటారు కానీ అవి అలభ్యాలు.
* కావ్యం, ప్రబంధం వేర్వేరని పండితుల అభిప్రాయం. అయితే ఇప్పటికీ ఈ రెండిటినీ పర్యాయ పదాలుగానే ఉపయోగిస్తున్నారు. ప్రబంధాలను కావ్యాలు అనీ పంచకావ్యాలు అనీ అనడం పరిపాటి.

 

సాహిత్యపరంగా చూస్తే...
* కావ్యాలు అనువాదాలు - ప్రబంధాలు అనువాదాలు కావు.
* కావ్యాల్లో వర్ణన తక్కువ - వర్ణన ప్రధానంగా ఉండేవి ప్రబంధాలు.
* కావ్యాల్లో భక్తిపరమైనవి ఎక్కువ - ప్రబంధాల్లో శృంగారపరమైనవి ఎక్కువ.
* 'ప్రబంధం' అనే పదాన్ని మొదట నన్నెచోడుడు ఉపయోగించాడని చెబుతారు. తిక్కన తన భారతాన్ని 'ప్రబంధ మండలి'గా పేర్కొన్నాడు. ఎఱ్ఱనకి 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉంది.
* ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం. గాఢమైన కూర్పు. రచనా పద్ధతిలో, వస్తు నిర్వహణలో, రసపోషణలో, వర్ణనలో, పటిష్టంగా, నవీనంగా రాసేది - ప్రబంధం.
* వేటూరి ప్రభాకరశాస్త్రి 'పురాణాలు అరణ్యాల లాంటివి, ప్రబంధాలు ఉద్యానవనాల లాంటివి' అన్నారు.

 

ప్రబంధ లక్షణాలు 
వర్ణనా బాహుళ్యం: 'నగరార్ణవశైలర్తు...' అనే విధంగా పద్దెనిమిది వర్ణనలతో కూడుకుని ఉండాలి. కథ కంటే వర్ణనలే ముఖ్యం. ఈ వర్ణనల్లో 'కవి సమయాలు' ఉంటాయి. కవి స్వయంగా భావించి చేసిన వర్ణనలే కవి సమయాలు.
ఉదాహరణ: చకోర పక్షులు వెన్నెల తాగడం
                  స్త్రీలది హంసనడక అనడం మొదలైనవి.
వస్తువు: దీన్నే ఇతివృత్తం అంటారు. పురాణాల నుంచి లేదా ఇతిహాసాల నుంచి చిన్న సంఘటన లేదా చిన్న కథను ఆధారంగా చేసుకుని కల్పనలతో పెద్ద కావ్యంగా రాస్తారు. సామాన్యంగా ప్రబంధాల్లో వస్తువు మిశ్రమంగా ఉంటుంది. అంటే కొంత ఆధారం - ఎక్కువగా కల్పన! ఎన్ని కథలు చెప్పినా ప్రధాన కథతో అన్వయం ఉండాలి. దీన్నే 'వ‌స్త్వైక్యత'‌ అంటారు.

 రసానందం: ప్రబంధాల్లో కవి ఏం చెప్పాడనేదాని కంటే ఎంత బాగా చెప్పాడనేదే ముఖ్యం. శృంగార రసంలో ఓలలాడించడం ప్రబంధాల్లో కనిపిస్తుంది.
 ప్రబంధాలు అనువాదాలు కావు: పైన చెప్పినట్టు ప్రబంధాలు కావ్యాల్లాగా అనువాదాలు కావు. మిశ్రమ కథలతో ఉంటాయి. స్వకపోల కల్పనలు, కథల్లో చేర్పులు, మార్పులు, మలుపులు ఉంటాయి.
జాతి వార్తా చమత్కారాలు: ఆ కాలం నాటి వింతలు, విశేషాలు, ఆచారాలను సందర్భం వచ్చినప్పుడు వెల్లడించటం జరుగుతుంది. పారిజాతాపహరణంలో రాజమందిరాల్లో కోప గృహాలుండేవని చెప్పడం, పెద్దన హిమాలయాల్లోని ద్రాక్ష తోటలను వర్ణించడం జాతి వార్తా చమత్కారాలకి సంబంధించినవే. అర్థ చమత్కారాలనూ గమనిస్తాం.

 

 ఏకనాయకుడు: ఒకే నాయకుడు ఉండాలి.
 పాత్రలు: ఆదర్శపాత్రలు, దివ్యపాత్రలకే పెద్దపీట.
 రచనా పద్ధతి: కృతిపతి వర్ణన, పూర్వ కవి స్తుతి, కుకవి నింద, షష్ఠ్యంతాలు, చిత్ర - గర్భ - బంధ పద్యాలూ ప్రబంధాల్లో కనిపిస్తాయి. అంటే పాండిత్య ప్రదర్శన ఉంటుంది.
 ప్రబంధ వాజ్ఞ్మయంలో నన్నెచోడుడు రాసిన 'కుమార సంభవం' మొదటిదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఎక్కువ మంది ప్రబంధం అంటే మనుచరిత్రే అంటారు. నన్నెచోడుడు, ఎఱ్ఱన, నాచన సోమన, శ్రీనాథుడు... వీళ్లు ప్రబంధ మార్గాన్ని వేశారు. 'మనుచరిత్ర'తో అది సంపూర్ణమైంది.
    రాయలు రాసిన ఆముక్తమాల్యద వైష్ణవ భక్తికి సంబంధించిన ప్రబంధం. దీనికి 'విష్ణుచిత్తీయం' అనే పేరు కూడా ఉంది. పన్నిద్దరాళ్వారుల్లో విష్ణుచిత్తుడు ఒక్కడు. అతడి కూతురు గోదాదేవి. గోదాదేవి, శ్రీరంగేశుల కల్యాణమే ఇందులోని ప్రధాన వస్తువు. ఆముక్తమాల్యద అంటే తాను ధరించి విడిచిన పూలమాలను సమర్పించేది అని అర్థం. గోదాదేవి శ్రీరంగేశుడికి గొప్ప పూలదండను కట్టి ముందుగా తాను ధరించి, అద్దంలో చూసుకుని సరిగా ఉందో లేదో పరిశీలించిన తర్వాత దేవుడికి సమర్పించేది. ఆముక్తమాల్యదను వేంకటేశ్వర స్వామికి అంకితమిచ్చారు.

* రాయలు జైత్రయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం వెళ్లినప్పుడు అక్కడి ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి 'దేశభాషలందు తెలుగులెస్స' కాబట్టి తెలుగులో ప్రబంధం రాయమంటే రాయలు రాశాడు.
* ఆముక్తమాల్యదలో మాల దాసరి కథ, యమునాచార్య చరిత్ర, ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం లాంటి కథలున్నాయి. ఆముక్తమాల్యదలో అనేక వర్ణనలున్నాయి. రుతువర్ణనలకి దర్పణం ఆముక్తమాల్యద.

 

 రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులుగా పూర్వకాలం నుంచీ ప్రసిద్ధిగాంచిన కవులు... వారి ప్రబంధాలు:
1. అల్లసాని పెద్దన:
 మనుచరిత్ర రాశాడు. దీని అసలు పేరు 'స్వారోచిష మనుసంభవం'. దీన్ని రాయలవారికి అంకితం ఇచ్చాడు. పెద్దన మార్కండేయ పురాణంలోని అతి చిన్న కథా ప్రస్తావన ఆధారంగా మనుచరిత్రను రచించాడు. రాయలతో గండపెండేరం తొడిగించుకున్న పెద్దనను 'ఆంధ్రకవితా పితామహుడు' గా గౌరవిస్తారు. 'అల్లసాని వాని అల్లిక జిగిబిగి' అనే ప్రశస్తి పొందాడు పెద్దన. మనోరమా వృత్తాంతం, ఇందీవరాక్షుని వృత్తాంతం లాంటివి ఉన్నా మనుచరిత్ర అనగానే వరూధినీ ప్రవరుల వృత్తాంతమే గుర్తుకు వస్తుంది.
2. నంది తిమ్మన: ఈయన్ను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ముక్కుపై 'నానాసూనవితాన వాసనల...' అనే పద్యం రాయడం వల్ల ఆ పేరు వచ్చిందంటారు. తిమ్మన 'పారిజాతాపహరణం' ప్రబంధం రాసి రాయల వారికి అంకితమిచ్చాడు. 'మక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు' అని ప్రశస్తికెక్కాడు. సత్యభామ, రుక్మిణి, శ్రీకృష్ణుడు, నారదుడు, ఇంద్రుడు, శచీదేవి ముఖ్యపాత్రలు.
3. ధూర్జటి: ఇతడు శివభక్తుడు. శ్రీకాళహస్తి మాహాత్మ్యం అనే శైవ ప్రబంధాన్ని రాశాడు. రాయలకి అంకితం ఇవ్వలేదు. దేవుడికే ఇచ్చాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం రాశాడు. అష్టదిగ్గజ కవుల్లో శతక కవిగా ధూర్జటిని చెప్పుకోవాలి. ధూర్జటి కవిత్వంలో 'అతులిత మాధురీ మహిమ' ఉంటుంది.
* శ్రీకాళహస్తి మాహాత్మ్యం క్షేత్ర మాహాత్మ్య కావ్యం. శ్రీ అంటే సాలె పురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడూ నిర్మల భక్తితో శివుడ్ని ఆరాధించి మోక్షం పొందాయి. ఈ ప్రబంధంలో కన్నప్ప కథ, వేశ్యా పుత్రికల చరిత్ర లాంటివి ఉన్నా నత్కీరుని కథ ప్రసిద్ధమైంది. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి రాజనింద చేశాడు.
4. తెనాలి రామకృష్ణుడు: మొదట శైవుడిగా, తెనాలి రామలింగడుగా ఉండి, ఉద్భటారాధ్య చరిత్ర రాశాడు. ఆ తర్వాత వైష్ణవుడై 'పాండురంగ మహాత్మ్యం' రాశాడు. దీన్ని 'పౌండరీక మహాత్మ్యం' అని కూడా అంటారు. ఇందులో 'నిగమశర్మోపాఖ్యానం' ప్రధానమైంది, ప్రసిద్ధమైంది. విఠల్ సంప్రదాయం మహారాష్ట్రకు చెందింది. 'పాండురంగ విభుని పదగుంఫనం' అన్నారు. తెనాలి రామకృష్ణుని శైలి పదగుంఫనం (పదాల కూర్పులో నైపుణ్యం) గలది అన్నారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రామకృష్ణుడు రాయల ఆస్థానంలో లేడు. పాండురంగ మహాత్మ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చాడు.
5. రామరాజ భూషణుడు: ఇతనికి భట్టుమూర్తి అనే పేరుంది. 'ప్రబంధాంకంమూర్తికవి' అనేది అసలు పేరని చెబుతారు. 'వసుచరిత్ర' అనే శ్లేష ప్రబంధాన్ని రాశాడు. దీన్ని తిరుమల రాయలకు అంకితమిచ్చాడు. భారతంలో ఆదిపర్వంలో 12 గద్య, పద్యాల్లో ఉన్న ఇతివృత్తాన్ని తీసుకుని వందల పద్యాల్లో వసుచరిత్ర రాశాడు. దీనిలో ప్రధాన కథ గిరిక, వసురాజుల వివాహం. మరో విధంగా పరిశీలించినప్పుడు శుక్తిమతి, కోలాహలుల వృత్తాంతం కూడా ఉంది. రామరాజ భూషణుడికి 'శ్లేషకవితా చక్రవర్తి', 'సంగీత కళారహస్యనిధి అనే బిరుదులున్నాయి. 'నరసభూపాలీయం, అనే 'కావ్యాలంకార సంగ్రహం', 'హరిశ్చంద్ర నలోపాఖ్యానం' అనే రెండర్థాల కావ్యం (ద్వ్యర్థి) కావ్యం కూడా రాశాడు.
6. పింగళి సూరన: 'కళాపూర్ణోదయం' అనే గొప్ప ప్రబంధం రాసి నంద్యాల కృష్ణభూపతికి అంకితమిచ్చాడు. ఇది కేవలం కల్పిత కథ ఉన్నది. కథలో కథలతో, మలుపులతో 'పద్య నవలగా' పేరొందింది. సరస్వతీ బ్రహ్మల ప్రణయ కలహం, కేళీల విలాసాలు దీనికి మూలం. ఇందులో కులభాషిణి వృత్తాంతం, నారద గాన మాత్సర్యం, సుగాత్రీ శాలీనుల కథ, మణికంధరుని వృత్తాంతం లాంటివి ఉన్నాయి. సూరన రాసిన 'రాఘవ పాండవీయం' తొలి ద్వ్యర్థి కావ్యం. ఈ కావ్యం రామాయణ భారత కథల కలయిక. 'ప్రభావతీ ప్రద్యుమ్నం' అనే ప్రబంధం రాసి తన తండ్రి అమరామాత్యునికి అంకితమిచ్చాడు. గరుడ పురాణం రాశాడంటారు గానీ లభించడం లేదు. ప్రభావతీ ప్రద్యుమ్నంలో హంస 'శుచిముఖి' పాత్ర విశిష్టమైంది.
7. అయ్యలరాజు రామభద్ర కవి: రామాయణ కథను సంక్షిప్తంగా ప్రబంధంగా మలిచి 'రామాభ్యుదయం' రాశాడు. ఇది అళియ రామరాయలు అల్లుడైన గొబ్బూరి నరసరాజుకి అంకితమిచ్చాడు. ఇందులో అహల్య చరిత్ర, శబరి వృత్తాంతాలు లేవు.
8. మాదయగారి మల్లన: 'రాజశేఖర చరిత్ర' శృంగార ప్రబంధం రాసి నాదెండ్ల అప్పయామాత్యునికి అంకితమిచ్చాడు. రాజశేఖరుడు, కాంతిమతిల వివాహ లేదా ప్రణయ వృత్తాంతం ఉంది.
అయితే రామరాజ భూషణుడు, సూరన, తెనాలి రామలింగడు రాయల అష్టదిగ్గజ కవుల్లో లేడని కొందరి అభిప్రాయం. వీరి స్థానంలో సంస్కృత, తమిళ, కన్నడ కవులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. రాయల యుగంలో 'నిరంకుశోపాఖ్యానం' రాసిన కందుకూరి రుద్రకవి,'కవికర్ణ రసాయనం', రాసిన సంకుసాల నృసింహకవి లాంటి దిగ్గజాలూ ఉన్నారు.
 రాయల యుగంలో శృంగారం ప్రాధాన్యం వహించిందన్న విమర్శపై రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 'రాయల నాటి రసికత వ్యాసంలో స్పష్టంగా వెల్లడించారు. ప్రబంధ వాఞ్మయ పరిణామ వికాసాలపై ఆచార్య కె.వి.ఆర్. నరసింహం, ఆచార్య పల్లా దుర్గయ్య సిద్ధాంత గ్రంథాలు రచించారు. తెలుగు సాహిత్యంలో పద్య కవిత్వానికి నవ్యత్వం, ప్రాచుర్యం కల్పించినవారిగా శ్రీకృష్ణదేవరాయలను స్మరించుకోవాల్సిందే.
మనుచరిత్రం ప్రబంధం లోనివి -
* 'కృష్ణరాయలతో దివికేగలేక/ బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు'
* 'వనిత తనంతతావలచి వచ్చిన చుల్కనకాదెయేరికిన్'      -  పెద్దన

Posted Date : 21-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌