• facebook
  • whatsapp
  • telegram

ప్రక్రియలు - లక్షణాలు - వివరణలు

ఇతిహాసం0

'ఇట్లు జరిగింది' అనే అర్థం ఉన్న ఇతిహాసం సంస్కృత వాజ్ఞ్మయంలో ప్రాచీన ప్రక్రియ. ఇతిహాసంలో రాజుల చరిత్రతోపాటు పుణ్య, దివ్య పురుషుల గాథలు కూడా ఉంటాయి. సంస్కృతంలో తొలి ఇతిహాసం వాల్మీకి రామాయణం. వ్యాసుడి భారతం కూడా ఇతిహాసమే. గ్రీకు సాహిత్యంలోని 'ఎపిక్' ప్రక్రియ ఇతిహాసం లాంటిదే. తెలుగులో మొదట మహాభారతం వెలువడింది. ఆ తర్వాత రామాయణం వచ్చింది. కాబట్టి తెలుగులో తొలి ఇతిహాసంగా నన్నయ భారతాన్ని చెప్పాలి. నన్నయ తన అనువాద పద్ధతి ద్వారా మహాభారతాన్ని కావ్యంగా మలిచాడు అంటారు కొందరు. అందుకే విమర్శకులు ఆంధ్ర మహాభారతాన్ని 'కావ్యేతిహాసం' అనడం సమంజసమని పేర్కొంటారు.
 

పురాణం
'పురాపినవమ్ పురాణమ్' - పాతదైనా కొత్తగా ఉండేది పురాణం అన్నారు. తెలుగులోకి పురాణ ప్రక్రియ సంస్కృతం వల్ల వచ్చిందే. 'సర్గశ్చ ప్రతి సర్గశ్చ... 'అనే పంచ లక్షణాలున్నది పురాణం. సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి ఆ అయిదు లక్షణాలు. బ్రహ్మాండం యొక్క సృష్టి, దేవతలు, రాక్షసులు బ్రహ్మర్షి వంశకర్తలు, మనువు, సూర్య, చంద్ర వంశపు రాజుల వివరాలూ, విశేషాలూ; స్వర్గ, నరకాల సంగతులు పురాణాల్లో ఉంటాయి. అవి ఒకనాటి వ్యవస్థను, వేద ధర్మాలను వివరిస్తాయి. పురాణాలు మిత్రుడిలా ఉపదేశిస్తాయి. కాబట్టి వాటిని మిత్రసమ్మితాలుగా పిలుస్తున్నారు. ముఖ్యమైన పురాణాలు పద్దెనిమిది - మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భవిష్య పురాణం,  భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన-అగ్ని పురాణాలు; నారదీయ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈ అష్టాదశ పురాణాలను వ్యాసుడు రచించాడు. పాల్కురికి సోమన రాసిన బసవ పురాణాన్ని దేశి పురాణంగా వ్యవహరిస్తున్నారు. ఎర్రన రాసిన 'నృసింహ పురాణం' పూర్తిగా పురాణం అనిపించుకోదు. అందుకే మారన రాసిన 'మార్కండేయ పురాణం' ప్రథమాంధ్ర మహాపురాణంగా ప్రసిద్ధికెక్కింది. సంస్కృతంలోని వ్యాసుడి భాగవత పురాణాన్ని ఆంధ్రీకరించాడు పోతన. నందిమల్లయ, ఘంటసింగయ 'వరాహ పురాణం' కావ్యం రాశారు. మారన మార్కండేయ పురాణంలోని చిన్నకథ పెద్దన మనుచరిత్రకి ఆధారమైంది. స్కాంద పురాణం ఆధారంగానే శ్రీనాథుడు కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహత్మ్యం కావ్యాలు రచించాడు. వెన్నెలకంటి సూరన 'విష్ణు పురాణం' రాశాడు. ఏలూరిపాటి అనంతరామయ్య చాలా పురాణాలను వచనంలోకి అనువదించారు. కాబట్టి ఆయనను 'ఆంధ్రవ్యాస' అంటారు. దేవీ భాగవతాన్ని కూడా పురాణంగా పేర్కొంటారు. ఈ పురాణాలను అపహాస్యం చేస్తూ కొత్త వ్యాఖ్యానంతో త్రిపురనేని రామస్వామి 'సూత పురాణం' రాశారు. భారతీయ సంస్కృతికి, కావ్యాలకు పురాణాలు ఆలవాలాలు.

 

ప్రబంధం
ప్రకృష్టమైన బంధం ఉన్నది ప్రబంధం. అంటే గాఢమైన కూర్పున్నది. 'కావ్యావయవములన్నిటిని చక్కగా బంధించి కూర్చెడిది. చమత్కృతి గలది' ప్రబంధంగా పింగళి లక్ష్మీకాంతం నిర్వచించారు.00

ప్రబంధ లక్షణాలు:
  
  1. వర్ణనాధిక్యత, అష్టాదశ వర్ణనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    2. వస్వైక్యం ఉండాలి.
    3. ఏక నాయకుడుండాలి.
    4. శృంగార రసానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
    5. ప్రబంధాలు అనువాదాలు కాకూడదు.
    6. వక్రోక్తి, వ్యంగ్యోక్తులు ఉండాలి.
    7. జాతివార్తా చమత్కారాలుండాలి.
    8. రసానందమే ముఖ్య ప్రయోజనం.
ఇలాంటి లక్షణాలున్న తొలి ప్రబంధంగా అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్రను పేర్కొంటారు. కొందరు నన్నెచోడుని కుమారసంభవమే తొలి ప్రబంధంగా అభిప్రాయపడ్డారు. అయితే చాలాకాలం వరకు కావ్యం, ప్రబంధం అనేవాటిని సమానార్థకాలుగానే పరిగణించారు. రాయల కాలాన్ని 'ప్రబంధ యుగం' అంటారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా 'ఆముక్త మాల్యద' ప్రబంధం రాశారు. అతడి ఆస్థాన కవులుగా ప్రసిద్ధి చెందిన అష్టదిగ్గజ కవులందరూ ప్రబంధాలు రాశారు.
    నంది తిమ్మన - పారిజాతాపహరణం
    ధూర్జటి - శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం
    తెనాలి రామకృష్ణుడు - పాండురంగ మహాత్మ్యం
    పింగళి సూరన - కళాపూర్ణోదయం
    రామరాజభూషణుడు - వసుచరిత్ర
    అయ్యలరాజు రామభద్రకవి - రామాభ్యుదయం
    మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్ర
అల్లసాని వాని అల్లిక జిగిబిగి అనీ, ముక్కు తిమ్మనార్య ముద్దు పలుకు అనీ, పాండురంగ విభుని పదగుంఫనము అనీ అంటారు. శృంగారం ఎక్కువ, పాత్రలూ కథలో ఒకే మూసలో ఉంటాయి, సామాజిక స్పృహలేదు, అసమంజసమైన వర్ణనలు... అని ప్రబంధాలను విమర్శించారు.

 

శతకం
సంస్కృత సాహిత్య ప్రభావంతో తెలుగులో వెలువడిన ప్రక్రియ శతకం. శతకం అంటే శతం (నూరు) ఉన్నది. సామాన్యంగా శతకాల్లో 108 పద్యాలుంటాయి. సంఖ్యానియమం మాత్రం వంద.

శతక లక్షణాలు:
1. శతకమంతా ఒకటే మకుటం ఉండాలి. మకుటం అంటే ఇక్కడ సంబోధన. సుమతీ, భాస్కరా అనేవి మకుటాలు.
2. శతకంలో ఒకే ఛందస్సు ఉండాలి. వేమన శతకమంతా ఆటవెలదిలోనే ఉంది.
3. శతక పద్యాలు ముక్తకాలు. అంటే ఒక పద్యానికి మరో పద్యానికి సంబంధం ఉండదు
4. శతకం ఆత్మాశ్రయ లక్షణం ఉన్నది. కవి తన స్వీయ అభిప్రాయాలను, కోరికలను వెల్లడించుకుంటాడు. తెలుగులో తొలి శతకంగా పాల్కురికి సోమన రాసిన 'వృషాధిప శతకం' ప్రసిద్ధికెక్కింది.
శతకాల్లో భక్తి శతకాలు ఎక్కువ. ఆ తర్వాతే నీతిశతకాలు. తెలుగులో అధిక్షేప శతకాలు, హాస్య శతకాలు, అన్యాపదేశ శతకాలు, అనువాద శతకాలు, వ్యక్తిగత శతకాలు, నిఘంటు శతకాల్లాంటివి వైవిధ్యంతో వెలువడ్డాయి. భక్తి శతకాల్లో ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న (రామదాసు) దాశరథీ శతకం ప్రాచుర్యం పొందాయి. నీతి శతకాల్లో వేమన శతకం, బద్దెన రాసిన సుమతీ శతకం ప్రసిద్ధమైనవి.

కొన్ని ముఖ్యమైన శతకాలు:
    పోతన - నారాయణ శతకం
    మారద వెంకయ్య - భాస్కర శతకం
    కాసుల పురుషోత్తమ కవి - ఆంధ్రనాయక శతకం
    బోయి భీమన్న - పిల్లీ శతకం
    శ్రీశ్రీ - సిరిసిరిమువ్వ శతకం
    ఏనుగు లక్ష్మణ కవి - సుభాషిత రత్నావళి
    కుసుమ ధర్మన్నకవి - హరిజన శతకం

 

కథ
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వెలువడిన ప్రక్రియ కథ. మన ప్రాచీన కథ వేరు. ఆధునిక కథ వేరు. అగ్ని పురాణంలో 'కథా, ఆభ్యాయికా, పరికథా' అని ఉంది కాబట్టి సంస్కృతం నుంచే కథ పుట్టిందని కొంతమంది చెప్పారు కానీ అది నిలవలేదు. ఆంగ్లంలోని story 'కథ'గా short story 'కథానిక'గా అవతరించాయి. ప్రస్తుతం కథ, కథానికలను సమానంగానే వాడుతున్నారు. కథానిక అనే పదాన్ని మొదట వాడింది ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి అని చెబుతారు. తెలుగులో తొలి కథానికగా 1910లో గురజాడ రాసిన 'దిద్దుబాటు'ను పేర్కొంటారు. గురజాడ కంటే ముందుగానే స్త్రీ విద్య, ధన త్రయోదశి లాంటి కథలు రాసిన కథా రచయిత్రి బండారు అచ్చమాంబ ఇటీవల వెలుగులోకి వచ్చింది. 'కథానిక - స్వరూప స్వభావాలు' అనే సిద్ధాంత గ్రంథంలో పోరంకి దక్షిణామూర్తి - సంక్షిప్తత, ఏకాంశవ్యగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత లాంటి లక్షణాలను పేర్కొన్నారు. 1952లో పాలగుమ్మి పద్మరాజు రాసిన 'గాలివాన' కథ అంతర్జాతీయ బహుమతి పొందింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చలం, బుచ్చిబాబు, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, ఓల్గా, చాగంటి సోమయాజులు, మునిమాణిక్యం లాంటి వారెందరో కథాసాహిత్యాన్ని పరిపుష్టం చేశారు.

 

గల్పిక
ఇది వచన ప్రక్రియల్లో భిన్నమైంది. గల్పికను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది కొడవగంటి కుటుంబరావు. గల్పిక పరిమాణంలో కథానిక కంటే చిన్నది. అనుభూతి ప్రధానమైంది. గల్పికలో విమర్శ ఉంటుంది. సంఘటనకే ప్రాముఖ్యం. హేలన ద్వారా లేదా వ్యంగ్యంగా వ్యక్తినో, వ్యవస్థనో విమర్శించడం గల్పిక ప్రక్రియలో చూస్తాం. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'అంపకాలు' పాఠ్యభాగం గల్పిక ప్రక్రియకి చెందిందే.

 

వ్యాసం
వ్యాసం అంటే వివరించడం, విస్తరించడం. ఏదైనా ఒక విషయాన్ని విస్తరించి రాయడం 'వ్యాసం' అవుతుంది. ఆంగ్లంలోని 'Eassy' కి సమానార్థక పదం వ్యాసం. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులో వ్యాస ప్రక్రియ బహుముఖాలుగా విస్తరించింది. వ్యాసం విషయ వివేచన, విజ్ఞాన గ్రహణం కోసం రాస్తారు. వ్యాసానికి మొదట సంగ్రహం, ఉపన్యాసం అనే పేర్లుండేవి. సామినేని ముద్దు నరసింహంనాయుడు రాసిన 'హితసూచని'ని వ్యాస ప్రక్రియలో మొదటి పుస్తకంగా చెబుతారు. ఆధునిక వ్యాస రచనను పరిపుష్టం చేసింది కందుకూరి వీరేశలింగం. ఆయన 'వివేకవర్ధని' లాంటి పత్రికల ద్వారా వ్యాస ప్రక్రియను సంఘ సంస్కరణకు ఉపయోగించుకున్నారు. వ్యాసాలు అనగానే ముందుగా పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన 'సాక్షి వ్యాసాలు' గుర్తుకు వస్తాయి. గురజాడ మొదట 'వ్యాస చంద్రిక' ప్రచురించి పుస్తకానికి వ్యాసం పేరును ప్రయోగించారు. కట్టమంచి రామలింగారెడ్డి 'వ్యాస మంజరి', వదరుబోతు వ్యాసాలు; సురవరం ప్రతాపరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావుల సంపాదకీయ వ్యాసాలు ముఖ్యమైనవి. కొలకలూరి ఇనాక్ వ్యాస ప్రక్రియపై సిద్ధాంత గ్రంథం రాశారు.

 

లేఖ 
లేఖా రచన వచన ప్రక్రియకు చెందింది. ఇతరులకు మన అభిప్రాయాలను తెలియజేయడానికి సమాచార సాధనంగా లేఖా రచన ఉండేది. ప్రజా ప్రయోజనాలకు లేఖలు ఎంతో ఉపయోగపడతాయి.
లేఖల్లో రకాలు: వ్యవహార లేఖలు, ప్రభుత్వ లేఖలు, రచయితలు - కవుల లేఖలు, బంధువుల లేఖలు, వాణిజ్య లేఖలు, పత్రికా లేఖలు, ఉద్యోగార్థం లేఖలు లాంటివి. పూర్వం 'లేఖా సాహిత్యం' వ్యాప్తిలో ఉండేది. గురజాడ లేఖలు, బ్రౌన్ లేఖలు, చలం లేఖలు లాంటివి సమకాలీన సాహిత్య, భాషా, సాంఘిక విశేషాలు వెల్లడిస్తాయి. ఇవాళ లేఖలకు ప్రాధాన్యం తగ్గింది.

 

సంపాదకీయం
పత్రికకు ఒక ముఖ్య సంపాదకుడు ఉంటాడు. ఆ సంపాదకుడు సమకాలీన అంశాలపై సూచనగా లేదా విమర్శగా లేదా విశ్లేషణతో మార్గదర్శనం చేస్తూ రాసే వ్యాసాన్ని తెలుగులో 'సంపాదకీయం', ఆంగ్లంలో 'Editorial' అంటారు.
సంపాదకీయం దిశానిర్దేశం చేస్తుంది. కొన్ని పత్రికలు సంపాదకీయాలపై ఆధారపడి వ్యాప్తి చెందుతాయి. స్వాతంత్య్రోద్యమంలో కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక సంపాదకీయాల ద్వారా, ముట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రిక సంపాదకీయాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికా సంపాదకీయాలు ప్రజలను జాగృత పరిచాయి. నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గోరాశాస్త్రి, ఏబీకే ప్రసాద్ లాంటి వారి సంపాదకీయాలు విలువైనవి.

 

వార్తావ్యాఖ్య
ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో నిత్యం అనేకానేక సంఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటి గురించి సంపాదకుడు లేదా సంపాదకవర్గం లేదా వ్యాసకర్తలు వ్యాఖ్యానిస్తూ ఒక 'శీర్షిక'తో రాస్తారు. ఇలాంటి వాటిని వార్తావ్యాఖ్యలు అంటారు. సంపాదకీయాల కంటే విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా, వివరణలతో ఉంటాయి కాబట్టి వార్తావ్యాఖ్యలు భిన్నమైనవి. గోరాశాస్త్రి 'వినాయకుడి వీణ' ద్వారా, విద్వాన్ విశ్వం 'మాణిక్యవీణ' ద్వారా వార్తావ్యాఖ్యలు చేశారు.

 

విమర్శ
తెలుగులో విమర్శ ప్రక్రియకు ఆంగ్ల సాహిత్యంలోని "Criticism" మూలం. విమర్శ అంటే బాగా పరిశీలించడం, ఆలోచించడం, వివరించడం అనే అర్థాలున్నాయి. ఒక రచనను బాగా చదివి అందులోని బాగోగులను వివరించేది 'విమర్శ' అవుతుంది. సాహిత్య విమర్శకు కందుకూరి వీరేశలింగం బీజం వేశారు. ఆయన రాసిన 'విగ్రహతంత్ర విమర్శనం' మొదటి సాహిత్య విమర్శ గ్రంథంగా పేర్కొంటారు. అందుకే కందుకూరిని 'ప్రథమాంధ్ర సాహిత్య విమర్శకుడు' అంటారు. ఆధునిక విమర్శను పరిపుష్టం చేసింది కట్టమంచి రామలింగారెడ్డి. వీరి రచన 'కవిత్వతత్త్వ విచారం' ఆధునిక విమర్శలో ఒక మైలురాయి. టి.ఎస్. ఇలియట్, ఇ.ఎ.రిచర్డ్స్, మాథ్యూ ఆర్నాల్డ్ లాంటి పాశ్చాత్య విమర్శకుల ప్రభావం తెలుగు విమర్శపై ఉంది. 'తెలుగులో సాహిత్య విమర్శ - అవతరణ వికాసాలు' అనే సిద్ధాంత గ్రంథం రచించి ఎస్.వి. రామారావు విమర్శకు మేలు చేశారు. కవి జీవిత విమర్శ, మనో విశ్లేషణాత్మక విమర్శ, భాషా విమర్శ, అభిరుచి విమర్శ, ప్రతీకవాద విమర్శ, మార్క్సిస్ట్ విమర్శ లాంటి భేదాలున్నాయి.


కొన్నిముఖ్యమైన విమర్శ గ్రంథాలు:
    విశ్వనాథ సత్యనారాయణ - నన్నయ్యగారి ప్రసన్న కథా కవితార్థయుక్తి
    రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ - వేమన
    ఉమాకాంత విద్యాశేఖరులు - నేటికాలపు కవిత్వం
    జి.వి.సుబ్రహ్మణ్యం - ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం
    చేకూరి రామారావు - స్మృతికిణాంకం
    శేషేంద్రశర్మ - కవిసేన మానిఫెస్టో
    వల్లంపాటి వెంకటసుబ్బయ్య - కథాశిల్పం

 

ఆత్మకథ
దీన్నే 'స్వీయచరిత్ర' అంటారు. ఒక వ్యక్తి తన జీవితానుభవాలను రాసుకుంటే అది 'ఆత్మకథ' అవుతుంది. స్వీయచరిత్ర కేవలం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు - మానవుల చరిత్ర, సమాజ చరిత్ర కూడా! సమకాలీన స్థితిగతులకు స్వీయచరిత్ర అద్దంపడుతుంది. స్వీయచరిత్ర రాయడం కత్తిమీద సాము లాంటిది. ప్రశంస కంటే ఆత్మావిష్కరణ ఉండాలి, నిజాయితీ ఉండాలి. సత్యసంధతతో, మార్గదర్శకంగా ఉండాలి. ఇలాంటి స్వీయచరిత్రకు ఆద్యులు కందుకూరి వీరేశలింగం. 'తెలుగులో స్వీయచరిత్ర రచన నేనే చేసితిని' అన్నారాయన. వీరిని అనుసరిస్తూ చిలకమర్తి 'స్వీయచరిత్ర' రాశారు. స్వీయచరిత్రలో సాహిత్య, రాజకీయ, సాంఘిక ప్రధానమైనవి; ఆధ్యాత్మిక, పద్యాత్మకమైనవి లాంటి భేదాలున్నాయి.
కొన్నిముఖ్యమైన ఆత్మకథలు:
    శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి - అనుభవాలు జ్ఞాపకాలూను
    టంగుటూరి ప్రకాశం - నా జీవితయాత్ర
    తాపీ ధర్మారావు - రాలూ రప్పలూ
    ఆదిభట్ల నారాయణదాసు - నా యెఱుక 
    స్థానం నరసింహారావు - నటస్థానం
    శ్రీశ్రీ - అనంతం
    జాషువా - నా కథ

 

జీవిత చరిత్ర

ఇది కూడా స్వీయచరిత్రలాగా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వెలువడిన వచన ప్రక్రియ. కొద్దిమంది పద్యాల్లో రాశారు. ఒక వ్యక్తి గురించి మరొకరు రాస్తే అది జీవితచరిత్ర అవుతుంది. జీవితచరిత్ర పరాశ్రయమైంది. ఒక మహాపురుషుడి జీవితాన్ని చరిత్రగా రాయడం వాంఛనీయం. అతడి జీవితం నుంచి నేర్చుకోదగినవి, భావితరాలకు ఉపకరించేవి ఉంటేనే జీవితచరిత్ర రాయాలి. మొహమాటం కోసమో, ప్రయోజనం ఆశించో జీవితచరిత్ర రాయకూడదు. తెలుగులో కందుకూరి వీరేశలింగమే తొలి జీవిత చరిత్ర రచయిత. జీవితచరిత్రలు ఎక్కువగా రాసినవారిలో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య  ప్రముఖులు. జీవితచరిత్రలో రచయిత ఇష్టాయిష్టాలకు అవకాశం ఉండదు.


కొన్నిముఖ్యమైన జీవిత చరిత్రలు:
    గొర్రెపాటి వెంకటసుబ్బయ్య - మన రైతుపెద్ద ఆచార్య రంగా
    కొత్తపల్లి వీరభద్రరావు - సి.పి.బ్రౌన్ జీవితచరిత్ర
    మిక్కిలినేని రాధాకృష్ణ - నటరత్నాలు
     తుమ్మల సీతారామమమూర్తి - మహాత్ముని కథ
    జాషువా - బాపూజీ
    గురజాడ శ్రీరామమూర్తి - కవి జీవితాలు 
                                               

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌